జరిగిన కథ
రాగమాల స్నేహితురాలు రమణికి మరియు మోహన్ స్నేహితుడు సురేందర్ కి వీళ్లిద్దరిపైన అనుమానం వచ్చి వారిని అడుగుతారు. ప్రేమ విషయం ఇద్దరూ స్నేహితులకు చెప్పుకుంటారు. రాగమాల బంధువుల ఇంట్లో ఉండటం వల్ల మోహన్ కి కలవడం కష్టంగా ఉంది. మళ్లీ సూర్య సహాయం కావాలనుకుంటాడు మోహన్
ఇక కథలోకి వెళ్దాం!
మోహన్ కాలేజ్ నుండి సరాసరి సూర్య దగ్గరకు వెళ్ళాడు.
సూర్య అదే కాలేజీలో చదివే బంధువుల పిల్లలతో కలిసి ఒక అద్దె గదిలో ఉంటాడు.
మోహన్ సూర్య వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు.ఇల్లు అనడం కన్నా ఒక భయంకరమైన గది అనవచ్చు. ముందే మగ పిల్లలు ఇల్లు శుభ్రంగా పెట్టుకోరు.అందులో సూర్య మరీ బద్దకస్తుడు.
“ఏంట్రా! ఇలా వచ్చావు. నేను గుర్తున్నానా నీకు?”అన్నాడు సూర్య
“అదేంటి సూర్యన్నా! నువ్వు గుర్తుండకపోవడమేంటి ?నువ్వు ఏమన్నా చీమవా? దోమవా? ఇంతెత్తు మనిషివి”అన్నాడు నవ్వుతూ మోహన్.
“అవున్రా! నీకు నన్ను చూస్తే జోక్ గా ఉంది”అన్నాడు సూర్య కోపం నటిస్తూ..
“ఏంటి సూర్యన్న! ఇల్లంతా ఇంత గందరగోళంగా ఉంది. అసలు వంట చేసు కున్నావా? లేదా?”అన్నాడు మోహన్.
“రూమ్ లో నా ఫ్రెండ్స్ ఉంటారు కదా! ఈ రోజు వాళ్ళిద్దరూ ఊరికి వెళ్లారు. నా సంగతి నీకు తెలుసు కదా!అన్నం ఒకటి స్టవ్ మీద పెట్టాను. ఒకవైపు పలుకు, ఒకవైపు మెత్తగా వచ్చింది. తినాలనిపించలేదు. అందుకే నీరసంగా ఉందిరా”అన్నాడు సూర్యం
“సరే, నేను వెళ్లి మన బాబా హోటల్లో బ్రెడ్, టీ తీసుకుని వస్తాను”అని చెప్పి మోహన్ బాబా హోటల్ కి వెళ్ళాడు.
బాబా అనే అతను రాగమాల అద్దెకున్న ఇంటి పక్కన ఉన్న హోటల్ ఓనర్. చాలా మంచివాడు. దక్షిణామూర్తి గారు ఎప్పుడైనా ఎక్కువ మంది అతిథులు వస్తే బాబాకు చెప్పి ‘టీ ‘లు తెప్పించేవాడు. అలా అతను మోహన్ కి కూడా పరిచయం అయ్యాడు. ఇప్పుడు సూర్య కూడా ఆ ఇంటికి దగ్గరలోనే ఉంటున్నాడు.
మొహన్ తెచ్చిన టీ తాగి బ్రెడ్ తిన్నాడు సూర్య.
“తిక్క మాటలు మాట్లాడినా సమయానికి సహాయం చేసే గుణం ఉందిరా నీకు”అన్నాడు సూర్య నవ్వుతూ.
“అవును సూర్యన్న! నీ ముఖాన బొట్టేది? నువ్వు బొట్టు లేకుంటే బాగుండవు”అంటూ వెతికి కుంకుమ బొట్టు సూర్య నుదుటన పెట్టాడు మోహన్.
వాళ్ళిద్దరికీ ఇలా ఒకరిని ఒకరు సరదాగా అనుకోవడం అలవాటు.వాళ్లిద్దరి మాటలు చాల హాస్యం పుట్టించే లాగ ఉండేవి.
“రాగమాల మాట ఎలా తేవాలా?” అని ఆలోచించసాగాడు మోహన్.
మోహన్ ఈ ఆలోచనలో ఉండ గానే, సూర్యు అడిగాడు.
“మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళావా? ఈ మధ్య నేను కలవలేదు. అందులో తను వేరే వాళ్ళ ఇంట్లో ఉంటుంది కదా”అన్నాడు సూర్య
అదే అవకాశంగా చూస్తున్న మోహన్..
“అవును వాళ్ళ బంధువుల ఇంట్లో ఉంటుందట కదా! అయితే నీకు కూడా వాళ్ళు చుట్టాలే కదా వెళ్లలేదా ఇంకా”? అన్నాడు ఏమీ తెలియనట్లుగా.
“లేదురా! వాళ్లు నాకు అంతగా పరిచయం లేదు?అందుకని నేను వెళ్లలేదు. ఒకసారి వెళ్లి రావాలి”అన్నాడు సూర్య.
“నువ్వు వెళితే,నీతో నేను వస్తాను.రికార్డు బుక్ అడగాలి”అన్నాడు మోహన్
“ఒరేయ్! పిల్లిని చంకలో పెట్టుకొని వెళ్లినట్లు నువ్వెందుకురా నాతోని”అన్నాడు సూర్య.
“అదేంటి సూర్యన్న! అట్లా అంటావ్? మీ చెల్లి నాకు ఫ్రెండే కదా! ఇద్దరం సేమ్ క్లాస్ కాబట్టి, ఏదైనా అవసరం పడొచ్చు. నాకు కూడా వాళ్ళు ఎవరో నాకు తెలియదు. అందుకని పరిచయం చేయ మంటున్నాను”అన్నాడు మోహన్.
“సరేలే, ఎల్లుండి ఆదివారం పోదాం”అన్నాడు సూర్య.
మనసులో మహా ఆనంద పడిపోయాడు మోహన్. మెల్లగా వాళ్ళింటికి దారి దొరికితే చాలు అనుకున్నాడు.
తెల్లవారి కాలేజీకి వెళ్లేటప్పుడు మోహన్ తో చెప్పింది రాగమాల.
“నేను ఊరికి వెళ్లాలనుకుంటున్నాను”అని చెప్పింది.
“అవునా! ఎందుకు?”అని అడిగాడు మోహన్.
“ఎందుకు ఏంటి? ఎల్లుండి రాఖీ పౌర్ణమి కదా! సెలవు ఉంది? అదీకాక, వచ్చినప్పటినుండి నేను వెళ్లలేదు. మా అక్క ,అన్నయ్య కూడా వస్తారు”అన్నది రాగమాల.
“రాఖీ పౌర్ణమి కోసం వెళ్తున్నావా? నేను కూడా వెళ్తున్న. అదే చెప్పాలనుకున్న. మా అక్క కోసం ఒక చీర కొన్నాను. అందులో ఈమధ్య అక్కకు పెళ్లి సంబంధాలు చూ స్తున్నారు . ఏవో మంచి సంబంధాలు వచ్చాయట. వివరాలు తెలుసుకోవడానికి వెళుతున్నాను. ఈ మధ్య అక్క చదువు అయిపోయినప్పటి నుండి, అమ్మ ఊర్లోనే ఉంటుంది .తమ్ముళ్లు నేనే ఇక్కడ ఉంటున్నాము. నాన్నకి కూడా మీ ఊరు ట్రాన్స్ఫర్ అయింది కదా! అందుకని ఇక్కడ ఎవరూ ఉండడం లేదు”అన్నాడు మోహన్.
“అవునా చీర కొన్నావా మీ అక్కకి? ఎక్కడ కొన్నావు ?నీకు బట్టలు కొనడం తెలుసా!”అని అడిగింది రాగమాల.
“ఎప్పుడు షాప్ కు వెళ్లి సెలెక్ట్ చేయలేదు. ఈసారి మాత్రం కొన్నాను.మరి అక్కకి నచ్చుతుందో? లేదో? తెలియదు. నేను మా అక్కకి దీపావళికి డబ్బులు ఇస్తాను. సంవత్సరం అంతా నా పాకెట్ మనీ కోసం ఇచ్చిన డబ్బులు దాచుకొని, అక్కకు ఇచ్చేస్తాను. అందులో ఇప్పుడు ట్యూషన్స్ కూడా చెప్తున్నాను కదా !అందుకే మంచి చీర కొన్నాను”అన్నాడు మోహన్.
“ఇతనికి కుటుంబం అంటే ఎంత ప్రేమ ఉంది. నిజంగా ఇలా ఉండే వాళ్ళు చాలా తక్కువ. మొహన్ అంటే కూడా వాళ్లకి అంతే ప్రేమ ఉండే ఉంటుంది ‘అని అనుకుంది రాగమాల.
అలా పండగ కోసం ఇద్దరూ ఒకే బస్సు ఎక్కి ఊరికి వెళ్లారు. మధ్యలో మోహన్ వాళ్ళ ఊళ్లో దిగిపోయాడు. రాగమాల వాళ్ల ఊరికి వెళ్ళిపోయింది.
పండగ అయిపోయాక, మళ్ళీ టౌన్ కు వచ్చారు రాగమాల,మోహన్. ఈసారి ఎవరికి వాళ్లే వచ్చారు.
కాలేజీకి వెళ్లేటప్పుడు కలుసుకొని, లెటర్స్ ఎక్స్చేంజ్ చేసుకొని ఎవరి దారిలో వాళ్లు కాలేజీకి వెళ్ళిపోయారు.
ఒకరోజు మోహన్ రాగమాల మీద అలిగాడు .అతనికి అలక ఎందుకు వస్తుందో? అసలు రాగ మాలకు అర్థమే కాదు .అయినా కూడా అతని పట్ల ఉన్న ఇష్టం వల్ల అన్ని సహిస్తుంది.
దారిలో ఉండే ఒక గన్నేరు చెట్టు నుండి రోజు ఒక పువ్వు కోసి రాగ మాలకు ఇవ్వడం మోహన్ కి అలవాటు. అలాగే ఆరోజు కూడా ఇవ్వడానికి దగ్గరికి వచ్చి, కోపంతో పువ్వులు తీసి చెత్తలో విసిరేసాడు.
“అయ్యో అదేంటి? పువ్వులు అలా విసిరేసావు?” అని ఆ చెత్తలో నుండి పువ్వులు తెచ్చుకుంది రాగమాల.
ఈసారి ఆశ్చర్య పోవడం మోహన్ వంతు అయింది.
“ఆ చెత్తలో నుండి పువ్వు తెచ్చు కున్నావా! నిజంగా బాధనిపిస్తుంది. నీకు నేనంటే ఎంతో ఇష్టం అని నాకు ఇప్పుడు అర్థం అయింది”అంటూ కొంచెం బాధగా వెళ్లిపోయాడు మోహన్.
రాగమాల ఇంటికి వచ్చేవరకు, హాల్లో ఒక పెద్ద మనిషి కూర్చొని ఉన్నాడు. అతను ఎవరో తెలియక సంకోచిస్తూ లోపలికి వెళ్ళింది.
అలా సంకోచిస్తు లోపలికి వెళ్ళిన రాగ మాలను సుమిత్ర పిలిచింది.
“రాగ మాలా! వీరు మనకి కావాల్సిన వారు.ఆధ్యాత్మిక వేత్త.మన ఇంటిని పావనం చేయడానికి అప్పుడప్పుడు వస్తారు”అన్నది సుమిత్ర.
“అవునా అత్తయ్యా! అని నమస్తే” అని అతనికి నమస్కరించింది.
“నమస్కారం తాత గారు అని అనాలి” అని ఓ లుక్కు ఇచ్చింది సుమిత్ర.
“నమస్కారం తాత గారు”అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది రాగమాల.
వాళ్ళింట్లో సాయంత్రం టీ తాగే అలవాటు లేదు. రాగ మాలకు ముందు నుండి సాయంత్రం టీ తాగడం అలవాటు . “మనం చదువుకోవాలి అంటే కొన్ని అడ్జస్ట్ కాక తప్పదు” అనుకుంది. రాగమాల ముందు నుండి చదువుకోసం అడ్జస్ట్ అవుతూనే ఉంది.
రాగమాల తండ్రి ఏడవ తరగతిలో ఉన్నప్పుడే చెప్పాడు. “నువ్వు ఎప్పుడు ఫెయిల్ అవుతే, అప్పుడు నీకు పెళ్లి చేసేస్తాను. నువ్వు ఫెయిల్ అయ్యావంటే నీకు చదువు మీద శ్రద్ధ లేదని అర్థం” అన్నాడు. అందుకే ఎక్కడ చదువు ఆగి పోతుందో అని స్కూల్లో ఉన్నప్పుడు మగ పిల్లల నుండి ఉత్తరాలు వచ్చినా, ఇంకా ఎలాంటి సంఘటన జరిగినా, తనే ఎదుర్కొని ధైర్యంగా నిల బడ్డది రాగమాల. ఆ రోజుల్లో అవి చాల పెద్ద విషయాలు.ఇంట్లో తెలిస్తే చదువు వద్దంటారు అనే భయం.
అనుకున్నట్లుగానే ఆదివారం రోజు సూర్య, మోహన్ తో కలిసి వచ్చాడు రాగ మాల ఉండే ఇంటికి.
ముందు గదిలో కూర్చుని రికార్డ్స్ వేసుకుంటుంది రాగమాల. దాదాపు మొత్తం పూర్తి కావచ్చింది.
సూర్య, మోహన్ కలిసి రావడం చూసి, సంతోషంగా లేచి నిలబడింది. అదే గదిలో కుర్చీలలో కూర్చున్న కిషన్ రావు గారు, సుమిత్రలకు వాళ్లని పరిచయం చేసింది.
“ఇతను నా కజిన్ సూర్య. అతను మా నాన్న స్నేహితుని కొడుకు. ఇద్దరం ఒకటే క్లాసులో ఉన్నాము”అని పరిచయం చేసింది రాగ మాల.
సుమిత్ర బాగానే రిసీవ్ చేసుకుంది. కానీ కిషన్ రావు గారు మాత్రం బుంగమూతి పెట్టుకున్నారు.” ఈ కొత్త పరిచయాలు అవసరమా!’ అన్నట్లుగా చూశారు. “నీవు ఉండడమే మా ఇంట్లో ఎక్కువ” అనే అర్థం కనిపించింది అతని చూపులో.
వాళ్ళిద్దరూ కాసేపు కూర్చొని వెళ్ళిపోయా రు. “కనీసం టీ అయినా ఇవ్వ లేకపోయాను” అని బాధపడింది రాగమాల.
వారం రోజులు అనుకోకుండా కాలేజీకి సెలవులు వస్తే, మోహన్ ,రాగమాల వాళ్ళ ఊళ్లకు వెళ్ళిపోయారు.
రాగ మాలకు ఊరికే తలనొప్పి, కళ్ళు లాగడం ఉంటుందని తెలుసుకునీ దక్షిణామూర్తి అనురాగ్ తో రాగ మాలను కళ్ళ పరీక్ష కోసం హైదరాబాద్ కి పంపించాడు.
“అనురాగ్! చెల్లిని నీతో పాటు హైదరాబాద్ తీసుకెళ్లి, కళ్ళు చెకప్ చేయించి, బస్సు ఎక్కించు .మళ్లీ నీకు కూడా సెలవులు ఉండాలి కదా! నువ్వు అటు నుండి అటే నీ జాబ్ కి వెళ్ళు”అని చెప్పారు దక్షిణామూర్తి.
అన్నతో కలిసి హైదరాబాదుకు వెళ్ళింది రాగమాల. అన్న రూమ్లో వేరే మగపిల్లలు ఉంటారు. కాబట్టి బంధువుల ఇంటికి తీసుకెళ్లాడు అనురాగ్…
బంధువుల ఇంట్లో లగేజ్ పెట్టుకొని, సరాసరి హాస్పిటల్కు తీసుకొని వెళ్ళాడు. ఆ ఐ స్పెషలిస్ట్ వయసులో చాలా పెద్దవాడు. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి .అందుకే అనురాగ్ చెల్లిని అక్కడికి తీసుకొని వెళ్ళాడు.
అతని గురించి ముందే చెల్లికి చెప్పాడు.
“అతను కళ్ళు పరీక్ష చేసేటప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. అవి మనకు నవ్వొస్తాయి .ఆయన అడిగే తీరు చాలా గమ్మత్తుగా ఉంటుంది. అక్కడ నవ్వకు రాగా”అని చెప్పాడు అనురాగ్.
కళ్ళలో మందు వేసిన కాసేపటికి, కళ్ళ పరీక్ష చేశారు డాక్టర్ గారు.
లెన్స్ మారుస్తూ..
“ఇది బాగుందా? ముందు బాగుందా? ముందు బాగుందా? ఇది బాగుందా?”అంటూ ఒక పాట లాగా అడగటం మొదలుపెట్టాడు.
అనురాగ్ ముందే చెప్పకుంటే నవ్వక పోయేదేమో? కానీ అది గుర్తొచ్చి భలే నవ్వొచ్చింది రాగ మాలకి.
కళ్ళు పరీక్ష చేయించుకుని, అప్పుడప్పుడే కొత్తగా వచ్చిన మెటల్ ఫ్రేమ్ కొనుక్కుంది. తన లుక్కు మొత్తం మారిపోయినట్లు అనిపించింది రాగమాలకి. తర్వాత ఫ్లాట్ గా ఉన్న చెప్పులు కోనుక్కుంది.
“చిన్నప్పటినుండి ఎత్తు చెప్పులు అలవాటు కదా! సడన్గా ఫ్లాట్ కొనుక్కున్నావ్ ఏంటి?”అని కండ్లు ఎగరేస్తూ అడిగాడు అనురాగ్.
“అవి వేసుకునీ వేసుకుని బోర్ కొట్టి ంది నాకు. అందుకే ఇవి కొనుక్కున్నాను”అనది రాగమాల.
“అర్థమైందిలే విషయం”అన్నాడు రాగమాలని చూస్తూ అనురాగ్.
ఏమీ తెలియనట్లుగా చెప్పులు కొనుక్కొని, బయటకు వచ్చింది రాగమాల.
రాగమాల అనురాగ్ ఇద్దరూ హోటల్లోకి వెళ్లి టిఫిన్ తిన్నారు. అంతకుముందు బయట తినడం అలవాటు లేని రాగమాలకి, హోటల్లో తినడం ఇబ్బందిగా అనిపించింది.
తెల్లవారి కొత్త కళ్లద్దాలు తీసుకుని, కళ్ళకు పెట్టుకుంది.
తర్వాత అనురాగ్ సినిమాకు తీసుకెళ్లాడు. అనురాగ్, రాగమాల మరియు బంధువుల ఇంట్లో మరొక అమ్మాయి కలిసి సినిమాకు వెళ్లారు. ఎంతో అద్భుతమైన విశ్వనాథ్ గారి సినిమా శుభలేఖ
సినిమాలో హీరోయిన్ ను చూడగానే అనురాగ్ అన్నాడు.
“అరే! రాగా! కళ్లద్దాలు నువ్వు తీసుకున్న లాంటివే”అని అన్నాడు.
“అవును అన్నా! బాగున్నాయి కదా” అన్నది రాగమాల..
సినిమా రాగ మాల కి బాగా నచ్చింది. అందులో మహిళల వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే చిత్రం. కట్నం తీసుకునే వారికి గుణ పాఠం ఆ సినిమా.
సినిమా చూసి బయటకు వచ్చి
ముగ్గురు చిక్కడ పల్లిలో బస్సు ఎక్కారు. బస్సులో వెనుక సీటు అనురాగ్ కి ముందర సీటు రాగమాల, వాళ్లతో వచ్చిన బంధువుల అమ్మాయికి దొరికింది.
హైదరాబాద్ అప్పుడప్పుడు వచ్చినా ఎక్కువ ప్లేసెస్ గుర్తు పట్టడం రాగ మాలకి తెలియదు.
ఇక్కడ మోహన్ కూడా అనుకోకుండా హైదరాబాదుకు వచ్చాడు. అతను కూడా ఐ చకప్ చేయించుకుని కళ్లద్దాలు కొనుక్కున్నాడు. అవి కూడా మెటల్ ప్రేమే. హీల్స్ ఉన్న షూస్ కొనుక్కున్నాడు.
YMCA దగ్గర బస్ ఆగింది. యథాలాపంగా బస్ స్టాప్ లోకి చూసిన రాగ మాలకి మోహన్ బస్ స్టాప్ లో కనిపించాడు.
మోహన్ కూడా చూసే లోపు బస్ కదిలింది.
” మోహన్ చూసాడో లేదో? ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు”అనుకుంది రాగమాల.
బస్సు కదిలిన కొద్దిసేపటికి..
“రాగా! ఎక్కడికి వెళ్తున్నావ్”? అని మోహన్ మాట వినిపించింది.
ఒక్కసారిగా తల పక్కకు తిప్పి చూసిన రాగమాలకి, పక్కనే మోహన్ నిలబడి ఉన్నాడు..
“అదంతా చెప్తాను కానీ, నువ్వేంటి ఇక్కడ? నాతో మా అన్నయ్య కూడా వచ్చాడు. చూస్తే బాగుండదు. నేను ఎల్లుండి కాలేజీకి వస్తాను కదా! అప్పుడు చెప్తాను”అన్నది రాగమాల…
మోహన్ రాగ మాలను చూసి” స్పెక్ట్స్ బాగున్నా యి”అన్నాడు.
“నీకు కూడా కళ్ళద్దాలు వచ్చాయా? నీ స్పెక్స్ కూడా చాలా బాగున్నా యి” అన్నది మెల్లగా రాగమాల.
వచ్చే స్టాప్ లో మోహన్ దిగిపోయాడు. ఎప్పటిలాగానే కాలేజీ మొదలయ్యే ముందు రోజు మోహన్, రాగమాల టౌన్ కి చేరుకున్నారు.
తెల్లవారి కాలేజీకి పోయేటప్పుడు ఇద్దరూ కలుసుకున్నారు.
“మోహన్ మనం రోజు ఇలా కలిసి వెళ్లడం బాగుండటం లేదు. చాలామంది ఇప్పటికే మనలను గమనించారు”అన్నది రాగ మాల.
“నాకు అదే అనిపిస్తుంది. కానీ మనం ఎక్కడ కలుసుకొని మాట్లాడుకుంటాం. మీ బంధువుల ఇంటికి రాలేను. ఒకవేళ వచ్చినా, అందరి ముందు ఏం మాట్లాడతాము ” అన్నాడు మోహన్.
“నిజమే, కానీ తప్పదు. ఈ రోజు మనం చాలా మాట్లాడు కోవాలి.నువ్వు వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చెయ్యి” అన్నది రాగ మాల.
అలా ఇద్దరూ ఎవరి దారిలో వాళ్లు వెళ్లిపోయారు.
సాయంత్రం గుడికి బయలు దేరుతుంటే..
“అక్కా! ఎక్కడికి వెళుతున్నావ్”? అని త్రిష అడిగింది.
“గుడికి వెళుతున్నా”అన్నది రాగమాల.
“అవునా! నేను వస్తాను.నా వర్క్ కూడా అయిపోయింది”అన్నది త్రిష.
“ఎలా త్రిష వస్తె?” అనుకున్నది రాగ మాల.
“అక్కా! ఏమాలోచిస్తున్నావ్?” అన్నది త్రిష.
“సరే,పోదాం పద”అన్నది రాగ మాల.
త్రిషతో కలిసి గుడికి వెళ్ళింది రాగమాల. ఆ గుడి అంటే రాగమాల కి చాలా ఇష్టం. ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.
కాసేపటికి మోహన్ వచ్చాడు.
పక్కనే ఉన్న అమ్మాయిని చూసి, ‘ఎవరు’ అన్నట్లుగా కళ్ళతో అడిగాడు.
” తన పేరు త్రిష.వీళ్ళ ఇంట్లోనే నేను ఉండేది”అన్నది రాగ మాల.
“అవునా! నేను మొన్న వచ్చినప్పుడు లేదు. త్రిశా!నేను మీ అక్క ఫ్రెండ్ ని”అని చెప్పాడు మోహన్.
“హా! బాయ్ ఫ్రెండా”? అంటూ కళ్ళు పెద్దవి చేసింది త్రిష.
“ఏయ్! బాయ్ ఫ్రెండ్ ఏమిటి త్రిష?. వాళ్ల నాన్న, మానాన్న ఫ్రెండ్స్ .అందుకని తను కూడా ఇంటికి వస్తే అలా పరిచయం. నువ్వు ఇంట్లో వెళ్లి ఇలా చెప్పావంటే ఇంకేం లేదు”అన్నది రాగమాల కంగారుగా.
“అక్క! ఇలా రా. చెవి దగ్గర చెప్తాను”అని రాగ మాలని చెవి దగ్గరికి వం గమని అడిగింది.
“ఏంటి చెప్పు” అన్నది రాగమాల.
“నేను ఏం చెప్పనులే. అయినా నాకు నువ్వు బాగా నచ్చావు. నీకు ఏ హెల్ప్ అయినా నేను చేస్తాను. మోహన్ కూడా నాకు బాగా నచ్చాడు. సరే నేను ప్రదక్షిణాలు చేసుకొని వస్తాను మీరు మాట్లాడుకోండి”అంటూ వెళ్ళింది త్రిష.
“నీకన్నా త్రిషనే మేలు. అసలు ఎన్ని తెలివితేటలు ఉన్నాయి”? అన్నాడు మోహన్ త్రిష వైపు చూస్తూ..
“సరేగాని, మనకున్న టైంలో విషయం మాట్లాడుకుందాం, మన ఆర్గానిక్ కెమిస్ట్రీ పేపర్ మిగిలిపోయింది కదా! ఎగ్జామ్ పది రోజుల్లో ఉంది. నేను ఈ పది రోజులు కాలేజీకి రాకుండా ఇంట్లోనే చదువుకోవాలని అనుకుంటున్నాను. మరి నీ సంగతి ఏంటి”? అన్నది రాగమాల.
“నేను కూడా చదువుకోవాలి. కానీ పది రోజులు కాదు ఒక నాలుగు రోజులు వెళ్లకుండా చదువు కుంటాను. ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే, అక్క పెళ్లి చూపులు ఇక్కడే ఉన్నాయి. అమ్మ వాళ్ళు అందరూ వస్తారు”అన్నాడు మోహన్.
“ఓ పెళ్లి చూపులా? ఎప్పుడు?” అన్నది రాగ మాల.
“ఎల్లుండి అవుతాయి అనుకుంటున్నాను. అమ్మ వాళ్లు రేపు వస్తారు”అన్నాడు మోహన్.
“సరే, అయితే నేను రేపటి నుండి కాలేజీకి వెళ్ళను. నువ్వు రాసిన లెటర్ ఎలాగైనా నాకు ఇచ్చి వెళ్ళు”అన్నది రాగమాల.
“సరే,ఎగ్జామ్ ఉంది కదా అని, నాలుగైదు లైన్లు రాసి ఇవ్వకు. నాకోసం కొంచెం టైం తీసుకుని లెటర్ రాయి. నీ ఉత్తరం చదివితే కానీ నేను ఏ పని చేసుకోలేను”అన్నాడు మోహన్.
“ఎక్కువగా రాయడానికి కుదరడం లేదు. పిల్లలందరూ పక్కనే కూర్చుంటున్నారు. ఇలా లెటర్స్ రాస్తుంటే బాగుండదు కదా! అందులో అత్తయ్య వాళ్ళ కొడుకు రాజు మహా ముదురు. వాడు నా వంకే డిటెక్టివ్ లా గా చూస్తున్నాడు”అన్నది రాగమాల.
“అదంతా నాకు తెలియదు. ఎలాగైనా వ్రాయి. అదిగో ఆరింద తల్లి త్రిష వస్తుంది”అన్నాడు మోహన్.
అలా కాసేపు మాట్లాడాక ఇద్దరు ఇంటికి వెళ్లి పోయారు.అన్నట్టుగానే త్రిష ఇంట్లో ఏమీ చెప్పలేదు.
తెల్లవారి నుండి ఇంట్లోనే చదువుకోవడం మొదలుపెట్టింది రాగమాల.
అందరూ ఉదయం వెళ్ళి పోయేవాళ్ళు. కాబట్టి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉండేది. చదువుకోవడం చక్కగా సాగింది .రాగ మాలకి.
ఆ ప్రశాంతత ఎక్కువ కాలం నిలవలేదు. మూడో రోజు కరెక్టుగా కిషన్ రావు మామయ్య వాళ్ళ పెద్ద కూతురు ఇద్దరు పిల్లలతో పుట్టింటికి వచ్చింది. ఇంక చదువు అసలే సాగలేదు రాగమాలకి. పిల్లల ఏడుపు ,అల్లరి ఇంట్లో మాటలు ఇవే సరిపోయాయి. పైన వెళ్లి చదువుకుందాం అనుకుంది. కానీ పైకప్పు లేనందున ఎండలో కూర్చో లేకపోయింది. చివరికి ఇరుకుగా ఉన్న మెట్ల సందులో కూర్చొని చదువుకోవడం మొదలు పెట్టింది.
ఒకపక్క చెమటలు పోస్తున్నాయి .కానీ ఎగ్జామ్ గుర్తు వచ్చేసరికి, ఇంకా టెన్షన్ మొదలైంది రాగమాలకి .అలాగే చదువుకో సాగింది.
“ఈ ఎండలో కూర్చొని చదువు కుంటున్నావా?” అనే మాట వినిపించే పక్కకు తిరిగింది.
మెట్ల దగ్గర మోహన్ నిలబడి ఉన్నాడు.
“అదేంటి ఎలా వచ్చావు నువ్వు లోపలికి”? అన్నది రాగమాల భయంతో.
“ఈ పక్క ఇంట్లో అక్క ఫ్రెండ్ ఉంటుంది. కాకపోతే అక్కకి జూనియర్ మన బ్యాచ్ అనుకుంటా! అక్క తనను రమ్మంటే పిలవడానికి వచ్చాను. ఇటు వస్తుంటే మెట్ల మీద నువ్వు కనిపించావు. అందుకే నాకో దారి దొరికింది”అన్నాడు మోహన్.
“నీ దారేమో కానీ నాకు చాలా టెన్షన్ గా ఉంది. వెళ్ళిపో” అన్నది రాగ మాల.
“ఎప్పుడు వెళ్ళిపో! వెళ్ళిపో అంటావు, ఇదిగో ఉత్తరం తీసుకో. నువ్వు రాసావా? లేదా?’అన్నాడు మోహన్
“రాసాను ఇదిగో బుక్ లోనే ఉంది.తీసుకుని వెళ్ళు” అన్నది రాగ మాల అటు ఇటు చూస్తూ.
“సరే, వెళుతున్నా” అని వెళ్ళాడు మోహన్.
వీళ్ళింట్లో పద్ధతులకు పిచ్చెక్కి పోతుంది రాగ మాలకు. చదువుకుని రాగమాల రాత్రి ఏ రెండింటికో పడుకుంటుంది.పొద్దున చదవడం కుదరడం లేదు.అయిన ఉదయం తొందరగా లేవాలి. నిద్ర సరి పోక కళ్ళు మండుతున్నాయి.
తెల్లవారి సాయంత్రం మోహన్ ఇంటిముందు నుండి సైకిల్ మీద అటు ఇటూ తిరుగుతున్నాడు. రాగమాల బయట అరుగు మీదకి వచ్చి ..
“ఏంటి? ఇలా వచ్చావు?” అన్నది.
“అక్కకి పెళ్ళి చూపులు.ఎవరు తనతో లేరు.నువ్వు వస్తావా? కొంచెం తనకి తోడుంటావు” అన్నాడు మోహన్.
“ఎప్పుడు రావాలి?” అన్నది రాగ మాల.
“ఇప్పుడే” అన్నాడు మోహన్…
సరే అని చెప్పి వాళ్ళింటికి వెళ్ళింది..
వాళ్ళింట్లో..
సశేషం