నా చిట్టి తల్లీ! ఇంకో వారంలో నువ్వు వచ్చేస్తున్నావంటే నాకెంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను. మరి నాతో నేరుగానే మాట్లాడొచ్చుగా ఈ ఉత్తరం ఎందుకంటావా?నిజమే తల్లీ! కానీ నీతో నేరుగా మాట్లాడే మాటలు వేరుగా ఉంటాయి. నీకు తెలుసా బంగారూ.. కొన్ని విషయాలు ముఖాముఖి మాట్లాడలేమని? అవున్నిజం! ఆ సంగతులు మనసులో ఘనీభవించిన దుఃఖపు పొరలో, విషాదాలో, విస్మయాలో, విచారాలో, అనుభూతులో, అనుభవాలో,ఆనందాలో, అద్భుతాలో.. ఏవైనా కావచ్చు. గుండె తడి గొంతులో కొట్టుకులాడి పెదవి అంచుల్లో పొడిబారి పోవచ్చు లేదా కళ్ళల్లోకి ఎగిసిపడే కన్నీటి కెరటాలూ కావచ్చు. వేదనా.. వేడుకా .. చెమ్మగిల్లేవి మాటలే కదా! అందుకే మాట్లాడలేని మాటలు మర్చిపోకుండా తడబడకుండా అక్షరాలై.. పదాలై.. వాక్యాలు సాగే వెల్లువే ఉత్తరం! రాసిన మనిషి మన ఎదురుగా కూర్చుని మనతో మాట్లాడిన అనుభూతినిచ్చేది.. మళ్లీ మళ్లీ అనుభవానికి వచ్చేది ఉత్తరమే కదా!?!
నా చిన్నారీ! నువ్వు చదవగలిగే సమయం వచ్చేవరకు… ఉహు..చదివి అర్థం చేసుకునే విజ్ఞత నీకు కలిగే వరకూ ఈ లేఖను పదిలంగా దాచుకుంటాను. భవిష్యత్తులో నేను నిన్ను ప్రశ్నించాల్సిన సమయమో.. నువ్వు నన్ను నిలదీసే సందర్భమో వచ్చినప్పుడు ఈ ఉత్తరమే మాట్లాడుతుంది. మరి మాట్లాడే ఉత్తరానికి నా గురించి నివేదిస్తేనే కదా నీకు చెప్పగలదు!?!
నా జాబిల్లీ! మా అమ్మానాన్నలకు నేను ఒక్కతినే సంతానం. పాపం మా అమ్మ నలుగురు పిల్లల్నయితే కన్నది కానీ నాకన్నా ముందు పుట్టిన ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ బిడ్డ ..పుట్టిన కొద్ది గంటలకే చనిపోయారట. నవ మాసాలు మోసి పురిటి నొప్పులు భరించి ప్రసవించిన బిడ్డలు అలా చనిపోతుంటే తల్లిదండ్రుల వేదన హృదయ విదారకం కదా! బిడ్డల్ని బతికించుకోవాలని వారు పడ్డ తపన చెప్పనలివి కానిది. ఆ అలివి కాని బాధే నాకు “కుప్పమ్మ” అని పేరు పెట్టడానికీ వెనుకాడ లేదు. అవును. నేను పుట్టింది పల్లెటూరు కాదు. ఓ మోస్తారు పట్టణమే అయినా బిడ్డ బతకాలన్న ఆశ ..మూఢనమ్మకాలను జయించింది. పక్కింటి అవ్వ చెప్పిందని పుట్టగానే నన్ను తీసుకెళ్లి చెత్త దిబ్బ మీద పెట్టి పూజ చేసి “ఈ బిడ్డను నాకు ప్రసాదించమ్మా. నీ పేరే పెట్టుకుంటాను” అని ప్రార్థించి ఇంటికి తెచ్చారట. వారి నమ్మకమో, ప్రార్థన ఫలించిందో, నా ఆయువు గట్టిదో.. కానీ నేను బతికి బట్ట కట్టాను. అందుకే నాకు కుప్పమ్మ అని పేరు పెట్టారు. ముగ్గురు దక్కని బిడ్డల తర్వాత బతికిన నేను అమ్మానాన్నల గారాల బిడ్డను కాక మరేం అవుతాను? కింద పెడితే చీమ కొరుకుతుందేమో పైన పెడితే గద్ద తంతుందేమో అన్నట్లు కళ్ళల్లో పెట్టుకొని అపురూపంగా పెంచారు నన్ను. అయితే ఎంత ప్రేమ ఉన్నా అమ్మ క్రమశిక్షణ, కట్టుబాట్ల మధ్య నేను సగటు ఆడపిల్లగా అంటే ఆచార వ్యవహారాలు, భయభక్తులు, వినయ విధేయతలు కలిగిన ఆడపిల్లగా ఎదిగాను. ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ చదవాలని ఉన్నా బయట ఊర్లకు పంపడానికి అమ్మానాన్నలు ఇష్టపడలేదు. పెళ్లి చేద్దామని అమ్మ.. అప్పుడే ఎందుకని నాన్న వాదులాటలో మూడేళ్లు గడిచాయి. దానికి ముగింపుగా నా పెళ్లి ఘడియలు దూసుకు వచ్చాయి. బంధువుల పెళ్ళిలో నన్ను చూసిన నా అత్తమామలు అక్కడే పెళ్లి మాటలు మొదలు పెట్టేశారు. నా అమాయకత్వం వారికి, నా అందం వాళ్ళ అబ్బాయికి నచ్చేశాయి. ఇక నేను నచ్చాల్సింది వాళ్ళ అయిదు మంది కూతుళ్లకు.
” ఐదు మంది ఆడబిడ్డలా? మన బిడ్డ నోట్లో నాలుక లేనిది. వాళ్లతో ఎలా వేగుతుంది? ఈ సంబంధం వద్దు” అనేసింది అమ్మ భయంగా.
“అందరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. ఎవరి సంసారాలు, కుటుంబాలు వాళ్ళవి. ఎప్పుడో.. ఏదో పండగ పబ్బాలకు వస్తారు అంతే కదా!అయినా వాళ్ళని చూసుకోవడానికి వాళ్ళ అమ్మానాన్నలు దిట్టంగా ఉన్నారు. అబ్బాయికి, మన పాపకు అంత బరువు బాధ్యతలు ఉండవు. ఒక్కడే కొడుకు కదా కోడల్ని బాగా చూసుకుంటారు. ఊర్లో పొలాలు కూడా ఉన్నాయట” అని పెళ్లి పెద్దగా ఉన్న శివయ్య గారు హామీ ఇచ్చినా అమ్మఅంతగా ఇష్టపడలేదు.
“ఒంటికాయ సొంటి కొమ్ములా మన పాప అన్నదమ్ములు ..అక్క చెల్లెళ్ళు లేకుండా ఒంటరిగా పెరిగింది. పెద్ద కుటుంబంలోకి పాప పోతే రేపు మనం లేకపోయినా వాళ్లే బాగా చూసుకుంటారు” అని నాన్న ఇంకా కొందరు బంధువులు నచ్చ చెప్పడంతో అమ్మకు ఒప్పుకోక తప్పలేదు.
అత్తమామలు, అయిదు మంది ఆడపడుచులు, వాళ్ల భర్తలు.. పిల్లలు ..వామ్మో.. అంత పెద్ద కుటుంబంలో నేను ఇమడగలనా అన్న భయం నాకూ మొదలైంది. అయితే అత్తగారింట్లో అందరూ నన్ను బాగానే చూసుకున్నారు. ఎవరితోనూ పొరపచ్చాలు లేకపోవడానికి కారణం వారందరి మంచితనం, ప్రేమ కారణమని నేను భావించేదాన్ని. అమ్మకూ చెప్పేదాన్ని.
“వాళ్ళు చెప్పినట్లు నడుచుకోవడమే తప్ప వాళ్ల కోసం తాను ఎంత శ్రమ పడుతుందో పాపకు తెలియడం లేదు. ఇద్దరు ఆడబిడ్డల బిడ్డలు నలుగురు.. వీళ్ళ ఇంట్లోనే ఉంటారట. పొద్దున్నే లేచి వాళ్ళను రెడీ చేయటం, అత్తగారికి వంట పనిలో సాయం చేయటం, ఆ పిల్లలకి టిఫిన్లు తినిపించి.. క్యారేజీలు సర్ది స్కూల్ బస్సు వచ్చే వేళకు పంపాలంటే ఎంత హైరానా? ఎంత అలసిపోతుందో నా బిడ్డ. అయినా ఇంకా ఇంటి పనులు ఎన్నుంటాయి?” అమ్మ కన్నీళ్లు పెట్టుకుంటే నాన్న ఓదార్చటం నేను విని విననట్లు ఉండిపోవటం జరిగేది. ఏ పండుగకో తప్ప నేను అమ్మగారి ఇంటికి వెళ్ళింది లేదు.
” పండగలకు ఆడబిడ్డలు వస్తారు. అందరితో సందడిగా, సరదాగా ఉంటుంది. మీ అమ్మగారింట్లో లింగు.. లిటుకూమంటూ మీ అమ్మానాన్న ..నువ్వు.. ఏం బాగుంటుంది? తర్వాత ఎప్పుడన్నా వెళ్లొచ్చులే. చిన్నోడికి కూడా అక్కలతో గడపడమే ఇష్టం” అనేసేది అత్త. నిజమే కదా అనుకునే నా మట్టిబుర్రలో కొంచెం మట్టి తవ్వి తీసేది అమ్మ.
” అదేంటి ఆవిడకు ఉన్నట్లు మాకు ఉండదా పండుగకు కూతురు అల్లుడు ఇంటికి రావాలని? సరదాగా గడపాలని? అయినా ఆ మందకు గొడ్డు చాకిరి చేయటమే నీకు అక్కడ దొరికే సరదా కదా?” అక్కసుగా అనేది అమ్మ.
“లేదమ్మా !వంటలన్నీ ఆవిడే చేస్తుంది. నేనేదో సాయం చేయటం. వడ్డించటము.. పిల్లలకు తినిపించడం అంతే. అయినా కూతుర్లతో సమానంగా నాకూ పట్టుచీర కొంటుంది, అందరూ మొదట నన్నే సెలెక్ట్ చేసుకోమంటారు తెలుసా?” నా మాటలు విని అమ్మ కన్నీళ్లు పెట్టుకుంటూ నా తలను గుండెకు హత్తుకొని
“నిన్ను లోకజ్ఞానం లేకుండా పెంచిన నాదే తప్పు.” అని గొణుక్కొనేది.
అంతకన్నా పెద్ద తప్పు నాకు కుప్పమ్మ అని పేరు పెట్టడం అని అమ్మకు చెప్పలేకపోయే దాన్ని. ఇంట్లో అందరూ చేరి కబుర్లు చెప్పుకుంటూ, జోకులు వేసుకుంటూ నవ్వుకుంటున్న వేళ హఠాత్తుగా ఎవరికో ఒకరికి నా పేరు గుర్తొస్తుంది. కావాలని “కుప్పమ్మా” అని పిలుస్తారు.
“అయినా అదేం పేరు ? చెత్తకుప్ప పేరు పెడతారా ఎవరైనా? తనూ అలాగే ఉందిలే జిడ్డు మొహం వేసుకుని ఎప్పుడూ” మొహాలు చిట్లిస్తారు. హేళనగా నవ్వుతారు.
” ఆ పేరు ఎందుకు గుర్తు చేసుకుంటారు ఇప్పుడు? పెళ్లిలోనే పేరు మార్చుకున్నాం కదా “కుముద” అని లక్షణంగా” ఓసారి పెద్దాడబిడ్డ కోప్పడింది. ” కుముద అంటే తామర పువ్వు”
“ఆ! అది కూడా బురదలో నుంచే కదా పుట్టింది” ఒక ఆడబిడ్డ అంటుంది వెటకారంగా.
“బురదను ఎందుకు చూస్తావు పువ్వును చూడకుండా? అయినా సమస్త జీవకోటి ఆహారం ఆ మట్టిలో నుండే కదా వచ్చేది, అలా గేలి చేయకూడదు. మనమంటే స్నానాలు చేసి తయారై కూర్చున్నాము ఒక్క పని చేయకుండా. కుముద పాపం ..పొద్దున్నుండి వంటగదిలోనే ఉంది. జిడ్డు కారకుండా ఇంతెత్తు పౌడర్లు రాలుతాయా మొహం నుండి?”
పెద్దాడబిడ్డ కొంచెం కోపంగా అంటుందా ..ఇహ మిగతా నలుగురూ తమ మొహాలు తడుముకుంటూ.. ముడుచుకుంటారు.
” పండగ పూట బిడ్డలను ఎందుకు బాధపెడతావు? నువ్వు ఊరుకో పెద్ద పాపా” అని అత్త పెద్ద కూతురుని మందలిస్తుంది.
“అవునవును. అందరూ కలిసి ఆ బిడ్డను బాధపెట్టేది నీకు కనపడదామా?” అంటూ పెద్దాడబిడ్డ నా వైపు జాలిగా చూస్తుంది. ఆమె ఒకరే కొంచెమన్నా నాకోసం మాట్లాడేది ఆ ఇంట్లో
“ఆ బిడ్డకు ఏం బాధ? ఆయమ్మ పేరు అదే కదా?” అనే తల్లిని ఇంకేం
అనలేక తన నుదుటిపై సన్నగా కొట్టుకుంటుంది పెద్దాడబిడ్డ అసహనంగా.
ఇంత ప్రహసనం జరుగుతున్నా ఏ ఒక్కరి భర్త కూడా.. నా భర్తతో సహా ఒక్క మాట మాట్లాడరు, ఖండించరు తప్పని.
తప్పు కాయమని.. బాధపడవద్దని నా భర్త ఏనాడూ వాళ్ళ ముందు.. వెనకా కూడా నన్ను ఓదార్చనే లేదు. లేని దానికోసం బాధపడడం ఎందుకని నేను పట్టించుకోవడమే మానేశాను. నేను వదిలేసిన బాధ అమ్మకు చెప్పి బాధ పెట్టడం ఎందుకు? అందులోనూ తన పెంపకం వల్లనే నాకు ధైర్యం లేదని అమ్మ పడుతున్న నొప్పిని మరింత నొక్కడం సమంజసం కాదు కదా?
అమ్మలంతా బిడ్డలు బాగుండాలనుకున్నట్లే పిల్లలు కూడా అమ్మల్ని బాధ పెట్టకూడదు కదా?
పెళ్లయిన ఆరు నెలల నుండి మొదలైన ఆరాలు, ఆరాటాలు, మూతి విరుపులు, సలహాలు.. ” విశేషమేమీ లేదా ఇంకా?” అన్న ప్రశ్నకు మూలం. ఆ విశేషానికి అర్థం ఆరు నెలల తర్వాత ఆనందాన్ని మోసుకొచ్చింది. అత్త ఇంట్లో కన్నా అమ్మానాన్నలు చాలా ఆనందపడ్డారు తాము అవ్వా తాతలు అవుతున్నామని. సంబరంతో కాసిన్ని కన్నీళ్లు, బోలెడు నవ్వులు కురిపించారు. మిఠాయిలు పంచారట ఇంటి చుట్టుపక్కలా.
బోలెడు ఫలహారాలు, స్వీట్లు, పండ్లు, పచ్చళ్ళు, ఊరగాయలు మోసుకొచ్చారు అత్తింటికి.
” భలేవారే! మూడో నెలకే సీమంతం చేసేటట్లున్నారే?” అని హాస్యమాడారు అత్త ఆడపడుచులు.
అమ్మ చిన్నబోయిన మొహానికి నవ్వు అతికించుకుంది “మాకు ఉన్నది ఒకే బిడ్డ. తన కడుపులో నాలుగు కాయలు కాస్తే మాకు అంతకన్నా కావాల్సిందేముంది?”
” ఆ,..మా కాలంలో ఏదో కనేసాం..సాకేసాం కానీ ఈ కాలంలో నలుగురిని కనీ..సాకి సంతరించడం అంటే మాటలా? ఇంటిపేరు నిలబెట్టే ఒక మగబిడ్డ చాల్లే” అనేసింది అత్త
“అదేమిటావిడ అలా అనేసింది? కూతుర్లకేమో ఇద్దరు ముగ్గురు కావాలి. కొడుక్కేమో ఒకే బిడ్డా?” అమ్మ బోలెడు ఆశ్చర్యపోయింది నాన్నతో. “అలా కాదు పాపా? నువ్వు కనీసం ఇద్దరినన్నా కనాల్సిందే. ఒకరికొకరు
తోడుంటారు. నువ్వు చూడు ఒంటరివైపోలా?” అమ్మ మాటలకు “ఇకమీద నా బిడ్డే నాకు తోడు. ఒంటరితనమేమీ ఉండదులే” అనుకున్నా ఆనందంగా మనసులోనే.
నా భర్త నాతో ఏకాంతంగా గడిపేది ఏ అర్ధరాత్రో, అపరాత్రో ..పది నిమిషాలు మాత్రమే! పొద్దున ఆఫీసుకు పోతే పొద్దు పోయాకే ఇంటికి వచ్చేది. వచ్చాక అమ్మానాన్నలతో మాటలు, అక్కల పిల్లల హోంవర్కులు, భోజనాలు. పనంతా అయ్యాక నేను గదిలోకి వెళ్ళేసరికే తను నిద్రపోతుంటాడు. మేమిద్దరమే కలిసి ఏ ఊరికో, ఏ గుడికో, ఏ ఫంక్షనుకో వెళ్లిందే లేదు. ఎక్కడికి వెళ్ళినా అందరూ కలిసి వెళ్లడమే. ఇక తను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిందీ తక్కువే.
నాలుగో నెల అయ్యాక ఫ్యామిలీ డాక్టర్ వద్దకు చెకప్ కు తీసుకెళ్లారు మా అత్త, భర్త. స్కానింగ్ లో బిడ్డ గుండె కొట్టుకోవడం చూపించింది డాక్టర్. నా లోపల మరో గుండె నా రక్తంతో కొట్టుకోవడం చూసి ఏడ్చేశాను.
“అయ్యో! ఎందుకు ఏడుస్తున్నావు? బిడ్డ బాగుంది.” అంది డాక్టరు కంగారుగా.
అది ఏడుపు కాదు ఒక బిడ్డకు తల్లి నవుతున్నానన్న ఆనందం ! చిరునవ్వు నవ్వాను. ఆ చిరునవ్వు నిజంగా ఏడుపుగా మారుతుందని నాకు అప్పుడు తెలియదు.
వారం తర్వాత నాకు అబార్షన్ అయిపోయింది. బాగా ఏడ్చాను. విషయం తెలిసి అమ్మానాన్న ఉరుకులు పరుగులతో వచ్చారు. నాన్నే నన్ను అమ్మను ఓదార్చారు తన కన్నీళ్లు ఉగ్గబెట్టుకొని.
” పాప నీరసంగా ఉంది. నాల్రోజులు మా ఇంటికి తీసుకెళ్తాం” అమ్మ అభ్యర్థనగా అడిగింది అత్తను. విపరీతమైన రక్తస్రావంతో తోటకూర కాడలా వేలాడిపోతున్నాను. ఏదో అనబోయి మామగారి కనుసైగతో ఆగి తలూపింది అత్త,
నెల రోజులు ఉన్నాను అమ్మ వాళ్ళ ఇంట్లో. అమ్మ నాకిష్టమైనవి వండి బలవంతంగా తినిపిస్తూ.. పాలు పండ్ల రసాలు తాగిస్తూ.. నన్ను బలంగా తయారు చేసింది, అత్త, ఆడపడుచులు ఫోన్ చేసి పరామర్శించారు గాని ఒక్కరూ ఇంటికి రాలేదు నన్ను చూడడానికి నా భర్తతో సహా. నాకు బాధ అనిపించింది. అమ్మానాన్నలు మనసులోనే బాధపడ్డారని నాకు తెలుసు కానీ ఇరుగు పొరుగు వారి బాధ మా కన్నా ఎక్కువ.
” అదేంటి ఎవరూ రారు చూడ్డానికి? వాళ్లేం మనుషులూ?”
వెనకా…ముందు గుసగుసలు, ఆరాలు! కందకు లేని దురద కత్తికే ఎక్కువ.
” అల్లుడికి తీరికలేని ఉద్యోగం. అత్తగారు, మామగారు, ఆడుపడుచులు .. అందరూ రోజూ ఫోన్లు చేస్తూనే ఉన్నారు. ఎప్పుడు పంపిస్తారని అడుగుతూనే ఉన్నారు. నేనే.. పాప ఒళ్ళు కుదుటపడనీ.. పచ్చి ఒళ్ళు కదా అని దాటేస్తున్నా” అమ్మ సంజాయిషీలో నిజాయితీ మాకే కాదు అందరికీ తెలుసని అడిగే వాళ్ళ చూపులు, నవ్వులు చెబుతూనే ఉన్నాయి. నాకు కోపం, బాధ, ఉక్రోషం! మింగనూలేను కక్కనూ లేను. నాకు నేనే సర్ది చెప్పుకొని బయలుదేరాను.
” మరో నాలుగు రోజులుండరాదా?” అమ్మ దీనంగా చూసింది.
“తర్వాతయినా వెళ్లాలి కదా!” అన్నాను బలవంతంగా నవ్వుతూ.
“నేను ఇక వెళ్ళను. ఇక్కడే ఉంటాను” అని చెప్పే రోజు ఒకటి వస్తుందని నాకు అప్పుడు తెలియదు.
మరో ఏడాది రోజులు కాలం కరి మింగిన వెలగయింది. ఈ ఏడాదిలో రెండు అబార్షన్లు. నేను అమ్మా ఏడ్చే వాళ్ళం. మా అత్తగారే మమ్మల్ని ఓదార్చేది.
“ఏం వయసయిపోయిందని ? పుడతారులే!” అని.
” నాకు పుట్టాక పోతే.. నీకు పుట్టక ముందే పోతున్నారేమిటి?” అంటూ అమ్మ కుమిలిపోయేది. గుళ్ళు గోపురాలు, చెట్లు, పుట్టలు తిరగటాలు, ముడుపులు నోములు వ్రతాలు.. ఆమెకు తెలిసిందంతా చేసేది. నా చేత చేయించేది.
” మీకేమన్నా పిచ్చా? తన ఆరోగ్యం గురించి ఆలోచించరా?” డాక్టరమ్మ గొంతు తీవ్రంగా వినిపించింది అత్త, మామ, భర్తలతో. ఆస్పత్రిలో నేను గది బయట కూర్చుని ఉన్నాను. కొద్దిసేపు తర్జనభర్జనల తర్వాత వాళ్ళు బయటకు వచ్చి నన్ను లోపలికి వెళ్ళమన్నారు.
బెడ్ పై నన్ను పడుకోమని డాక్టరు ఇంజక్షన్ వేయబోయింది. నేను ఆమె చేతిని రెండు చేతులతో గట్టిగా పట్టుకొని కన్నీళ్ళతో అన్నాను
“ప్లీజ్ మా! మంచి మందులు ఇవ్వండి. ఈసారన్నా నాకు బిడ్డ పుట్టాలి. నేను అమ్మను అవ్వాలి”
డాక్టర్ కళ్ళల్లో సన్నటి నీటి పొర. నా వేపు జాలిగా చూసింది. కాసేపు నన్నుఇంజక్షన్ ను మార్చి మార్చి చూసింది. మరి కాసేపు కుర్చీలో కూర్చుని సాలోచనగా నా వేపు చూస్తూండిపోయింది. నేను ఆమె వేపే చూస్తూ ఏడుస్తూనే ఉన్నాను నా పొట్టను రెండు చేతులతో నిమురుకుంటూ.
” అయితే నేను చెప్పినట్లు చేస్తావా?” అడిగింది డాక్టరు లేచి తలుపు గడియ వేసేసి.
” బిడ్డ కోసం…”
” బిడ్డ కోసం ..నీ కోసం కూడా!” డాక్టర్ చెప్పిందంతా విన్నాను కానీ అర్థమవడానికి చాలా సేపే పట్టింది. భయంతో వణికిపోయాను. తడారి పోయిన నా నోట్లో తన నీళ్ల బాటిల్ తెరిచి నీళ్లు పోసింది.
“ధైర్యం తెచ్చుకో. నీ ధైర్యమే నీ బిడ్డకు నీకు బతుకునిస్తుంది. నేను ఒకటే డాక్టర్ కాదు ఈ ఊర్లో.. కానీ నీకు నువ్వే. నువ్వే నీ బిడ్డకు!”
దగా పడ్డ మనసు విలవిల్లాడుతోంది. వంచన సెగతో రక్తం కుతకుతలాడుతోంది. పరిస్థితిని చేతుల్లోకి తీసుకొని చక్కదిద్దుకోమని బుద్ధి హెచ్చరిస్తోంది.
“అమ్మా! మీరు చెప్పినట్లే చేస్తాను” దృఢ నిశ్చయంతో ఆమె ఫోన్ తీసుకొని అమ్మకు ఫోన్ చేశాను వెంటనే రమ్మని.
మేము ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే అమ్మానాన్న వచ్చేశారు. ఈలోపు నేను మా గది తలుపులు వేసుకొని నా బట్టలు, నగలు, పెద్ద సూట్ కేసులో సర్దేసుకున్నాను.
“మళ్ళీ ఇలా జరిగిందేమిటి?” అమ్మ రాగానే మొదలెట్టిన ఏడుపుకు ఈసారి అత్త వంత పాడింది.. “ఇదంతా మా ఖర్మ” అంటూ.
నాకు నవ్వు వచ్చింది. ఖర్మకు… కర్మకూ తేడా నాకిప్పుడు తెలుసు కదా ? వచ్చేస్తుంటే అందరి చూపులూ సూట్ కేసు వేపే. నేను ఎవరి వైపూ చూడలేదు. కనీసం వెళ్ళొస్తానని కూడా చెప్పలేదు. అమ్మానాన్నలతో వచ్చేసాను.
నేను వచ్చి ఐదు నెలలు అవుతుంది. ఫోను పని చేయడం లేదని రెండు మూడుసార్లు అత్త, భర్తా వచ్చారు చూడాలని. నేను నా గది తలుపు తీయనే లేదు.
“పాప ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. మానసికంగా చాలా దెబ్బతిందని డాక్టర్ అన్నారు. బాగయ్యాక మాట్లాడుకుందాం లేండి. మేము కూడా మంచి డాక్టర్లకే చూపిస్తున్నాం”
నాన్న కరుకుగా అనడంతో వాళ్లేమీ మాట్లాడలేక వెళ్లిపోయారు. నా చిన్నారి యోధా! ఎవరైనా గట్టిగా మాట్లాడితేనే భయంతో కుందేలు పిల్లలా వణికి పోయే నేను ఇంత ధైర్యంగా ఇంతటి నిర్ణయం తీసుకోవడమే కాదు మా అమ్మా నాన్నల్ని కూడా ఒప్పించానంటే కారణం నాలోని నువ్వే!కడుపులో నుండే నాకింత ధైర్యం ఇచ్చిన నా బంగారు తల్లీ! నువ్వు పుట్టాక నేను ఇంకా ఎంత నిర్భయంగా ఉంటానో కదా? అందుకే నీకు అనుకోకుండానే “యోధ” అని పేరు పెట్టేశాను.
కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలియగానే నాకు ఒక్క మాటా చెప్పకుండానే అబార్షన్లు చేయించిన ఆ నరరూప రాక్షసులను.. నిజం చెప్పాలంటే హంతకులను.. నీకు నాన్న అని, అవ్వాతాతలని, మేనత్తలని పరిచయం చేయలేను. నీకసలు వాళ్ళను చూపించను కూడా.
ఆ కుటుంబంతో తెగదెంపులు చేసుకుందాం. మనకు మన ధైర్యమే తోడు నీడ గా బతుకుదాం. చెప్పాను కదా ఏ బలహీన క్షణమో మన ధైర్యాన్ని ప్రశ్నించే సమయం వచ్చినప్పుడు ఈ ఉత్తరమే మనకు భగవద్గీత!
యోధ రాక కోసం ఎదురు చూస్తూ
“ఆనందాల కుప్పమ్మ”
******* ****** ***** *******