అందరికీ శనార్తులు.
ఎట్లున్నరు.
అందరికీ ఆడోళ్ళ దినం శుభాకాంక్షలు. మార్చి ఎనిమిదో తారీకు ఆడోళ్ళ దినమంట. దునియాల అందరూ.. ఈ పండుగ ఆ పూట చేసుకుంటరు, అంటే.. ఈ ఒక్క దినం తప్ప మిక్కితం రోజులు ఆడోళ్ళకు లేనట్టే అన్నమాట. ఊర్లల అందరూ ఈ మాట అంటరు
“నీ కాళ్లమీద నువ్వు నిలబడాలక్కా…అని
ఈ మాట మన పల్లెటూర్లె చాలా సార్లు వినిపిస్తది. కానీ ఆ మాట చెప్పే టోల్లే కొన్నిసార్లు ఆడపిల్ల నిలబడ్త అంటే ఒక్క అడుగు సుత ఇయ్యరు అనేది సుత నిజం.
ఒకసారి మా ఊర్లె మహిళా దినోత్సవం సందర్భంగ ఒక కార్యక్రమం పెట్టిన్రు పెద్ద బ్యానర్లు కట్టిన్రు. రంగురంగుల అక్షరాలతోని ఇట్ల రాసి ఉంది.
“మహిళా సాధికారత -మహిళలే దేశ భవిష్యత్తు.”
బ్యానర్ చాన అందంగ ఉంది. పూలు కట్టిన్రు, మైక్ పెట్టిన్రు. ఫొటోలు తీశింరు.
అంత మంచిగ అయ్యింది. అందరూ ఇంటికి పోయిన్రు.
కానీ ఆ కార్యక్రమానికి వచ్చిన ఒక మహిళ ఇంటికి పొంగానే మొగుడు ఇట్ల అన్నడు,
“ఇంతసేపు ఎక్కడ తిరిగినవ్? ఇంట్ల పని ఉండదా?”
ఆమె నవ్వింది,పొద్దుగాల ఇన్న ‘మహిళా సాధికారత’ అన్న గొప్ప మాటలు ఆడనే బొంద పెట్టిన్రు అని.
ఇట్లుంటది మన సమాజం.
వేదిక మీద మాటలు ఒకతీరు,
ఇంట్ల వాస్తవం ఇంకొక తీరు!
ప్రతి ఏడాది మార్చి 8 వస్తది. మహిళా దినోత్సవం జరుపుకుంటం,ప్రతీ యాడాది కొత్త థీమ్ వస్తది. పెద్ద పెద్ద మాటలు వస్తయి. “మహిళలకు హక్కులు కావాలి… మహిళలకు గౌరవం కావాలి…” అని.
ఈ 2026కి సుత ప్రపంచం మొత్తం ఒక గొప్ప థీమ్ ఉన్నది…“Give To Gain”. ఈ చిన్న వాక్యంల ఒక గొప్ప సామాజిక తత్వం దాక్కొని ఉంది. “ఇస్తేనే పొందుతం ” అనే జీవన సూత్రాన్ని ఇది మనకు యాద్ చేస్తది. మహిళలకు విద్య, అవకాశాలు, భద్రత, గౌరవం ఇస్తే అది కేవలం వాళ్ళకే కాకుంట, సమాజం మొత్తం అభివృద్ధి చెందుతది అనే సందేశాన్ని ఈ థీమ్ తెలియజేస్తున్నది.
మహిళను అణగదొక్కే సమాజం తన సగం శక్తిని తానే కోల్పోతది. అదే…మహిళను ప్రోత్సహించే సమాజం తన భవిష్యత్తును బలపరుస్తది. అందుకే “Give To Gain” అనే భావం ఒక వ్యక్తిగత నైతిక సూత్రం మాత్రమే కాకుంట అది ఒక సామాజిక అభివృద్ధి సిద్ధాంతం సుత! ఒక అమ్మాయి చదువుకుంటే ఆమె ఒక్కతే ఎదగదు, తన కుటుంబం, తన పిల్లలు, తన పరిసర సమాజం సుత ఎదుగుతది.“ఒక పురుషుడిని చదివిస్తే ఒక వ్యక్తి చదువుతడు; ఒక మహిళను చదివిస్తే ఒక తరం చదువుతది.” ఇది ఏపీజే అబ్దుల్ కలామ్ గారి మాట!
మహిళలకు హక్కులు, న్యాయం, అవకాశాలు ఉండాలి. ఇది
విననీకి శాన బాగుంది. కానీ ఒక చిన్న సంఘటన చూస్తే ఆ మాటల అసలు అర్థం తెలుస్తది.
మా ఊర్లె పోశాలు అని ఒకామె ఉంది. శాన కష్టపడి పని చేసే మనిషి. పొద్దుగాల నాలుగు గంటలకు లేస్తది.
బాయి కాడికి పోయి నీళ్లు తెస్తది, ఇంటి పని, వంట పని, పొలం కాడికి పోయి కూలి పనులు.. మొగుడు తాగచ్చిన సుత బరాయిస్తది.గింత సుత యాష్ట పడదు,తన పిల్లలను తన రెక్కల కష్టంతోనే పెంచుతున్నది ముసలి అత్తమామలకు సుత దిక్కయింది.
“పోశాలు… నువ్వు ఒక దినమన్న నీ కోసం ఆలోచిస్తవానే?” అని అడిగిన ఒకపారి.
ఆమె నవ్వి అన్నది.
“అది ఏ పంటల పండుతది అక్కా?” నాకు ఒక్కసారి బేజా కరాబైనట్టయ్యింది,ఎవల్లో గుండెల చెయ్యి పెట్టి తిప్పినట్టు అయింది. పోశాలు సదువు సంజె లేని మనిషి లెక్క గొట్టలె. తత్వజ్ఞాని లెక్క గొట్టింది నా కండ్లకు. “కాదే పోశా…! ఆడోల్లు అందరికీ అన్నీ ఇయ్యాలి, వాళ్లకి ఇస్తే దేశం బాగుపడుతది అని ప్రపంచ దేశాలు ఈ సంవత్సరం చెప్పిన్రే, దానినే ‘గివ్ టు గెయిన్’ అంటరు. ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం” పోశాలుకు అర్థమయ్యేటట్లు చెప్పనీకి ప్రయత్నం చేసిన నేను. “Give to Gain”. తెలుగులో చెప్పాలంటే, “ఇస్తేనే పొందుతం ”. అంటే మహిళలకు అవకాశాలు ఇయ్యాలి, గౌరవం ఇయ్యాలి,సమాన హక్కులు ఇయ్యాలి. అప్పుడు సమాజం సుత ఎదుగుతది. విననీకి చాన బాగుంది. పోస్టర్ మీద సుత బాగా కనిపిస్తున్నది.
పోశాలు అడిగింది నన్ను,
“ అవ్ అక్కా…! మాకు ఇస్తరా… లేక మేమే ఇంకా ఇయ్యాల్న ?” ఒక సదువురాని వ్యవసాయ కూలి,మా పోశ, ఒక బాణం లాంటి మాట అడిగింది నన్ను.
ఎందుకంటే మన దేశంల ఎక్కువ మంది ఆడోళ్లకు ఇచ్చుడే తెలుసు, పొందడం మాత్రం కొంచెం తక్కువనే అని జెప్పాలే.
వ్యవసాయ కూలి పోశాలు మాటనే కాదు, ఎవ్వలకైనా.. పరిస్థితి దగ్గర… దగ్గర గింతనే ఉంటది.
“ఇది నీ బాధ్యత” అనే ఒక మాట వాళ్లకు హత్కడి లెక్క!
అదే గౌరవం అయి ఉంటదేమో!
ఆ నవ్వులో ఒక చిన్న వ్యంగ్యం ఉంది.
మన సమాజంలో మాటలకి కొదవలేదు. కానీ ఆ మాటలు నిజ జీవితంలోకి రావడానికి ఇంకా దూరం ఉంది.
ఒకప్పుడు ఆడవాళ్లు ఇంటి బయటకు సుత రానీకి భయపడే పరిస్థితి ఉండే. ఇప్పుడు చానా మార్పు వచ్చింది. అమ్మాయిలు చదువుకుంటున్నరు. ఉద్యోగాలు చేస్తున్నరు. ప్రభుత్వాలు సుత ఎన్నో చట్టాలు తీసుకొచ్చినయి. మహిళలపై హింసను ఆపనీకి చట్టాలు ఉన్నయి. ఇంటి హింసకు వ్యతిరేకంగ చట్టాలు ఉన్నయి. పనిచేసే జాగల మహిళల భద్రత కోసం నిబంధనలు ఉన్నయి.
కానీ చట్టాలు పుస్తకాలల్ల ఉంటయి. జీవితం మాత్రం మనసుల్ల ఉంటది.
మా పెద్దమ్మ ఒకసారి చెప్పిన మాట ఇప్పటికీ నాకు గుర్తుంది.
“చట్టాలు నగరాల్లో ఉంటయి బిడ్యా … మన బతుకుల్ల మాత్రం పెద్దల మాటే చట్టం.”
అది కొంచెం పెద్ద మాటనే కావచ్చు. కానీ అండ్ల నిజం ఉంది.
ఒక అమ్మాయి చదువుకోవాలని అనుకుంటే మొదటి అడ్డం పడేది చానాసార్లు సమాజం కాదు… ఇంట్ల వాళ్లే!
“ఇంత చదివితే సరిపోతది.”
“అమ్మాయికి ఎక్కువ చదువు అవుసరం లేదు.”
“పెళ్లి జేయ్యాలి కదా.”
ఇట్ల చెప్పేటోళ్లల్ల శానా మంది ఆడవాళ్లే.
అదే మన సమాజపు ఇచ్చెంత్రం.
మహిళల సాధికారత గురించి మాట్లాడేటప్పుడు మనం చాలా సార్లు పురుషులను మాత్రమే తప్పుపడ్తం . కానీ నిజంగ మార్పు రావాలంటే మహిళల మనస్తత్వం సుత మారాలి. ఒక చిన్న కథ చెబుతాను.
సావిత్రి అనే అమ్మాయి ఉంది. చానా తెలివైనది. స్కూల్ల ఎప్పుడూ మొదటి ర్యాంక్. టీచర్ అవ్వాలని కల. పదో తరగతి తర్వాత ఇంట్లో వాళ్లు చదువు ఆపేశిన్రు. “ఇంతే సరిపోతది” అన్నరు.పిల్ల చానా బాధపడ్డది, ఏడ్షింది కానీ చేశేదేమి లేదు.
కొన్ని ఏండ్ల తర్వాత ఆమెకు ఒక బిడ్డె పుట్టింది. ఇప్పుడు ఆ బిడ్డె స్కూల్‌కి పోతుంది. సావిత్రి లెక్క ఆలోచించాలే తల్లులు. సావిత్రి తన కలను నెరవేర్చుకోలేకపోయింది. కానీ తన కూతురి కలను ఆపలేదు.
అదే నిజమైన “Give to Gain”.
మనకు రాని అవకాశాన్ని ఇంకొకరికి ఇవ్వడం.
అదే మహిళల బలం సుత.
ఇప్పుడు సోషల్ మీడియాల మహిళా దినోత్సవం చాలా పెద్దగ జరుపుకుంటరు. ఫేస్‌బుక్‌ల పోస్టులు, ఇన్‌స్టాగ్రామ్‌ల ఫోటోలు, వాట్సాప్ స్టేటస్లు.
“Happy Women’s Day” అని రాస్తరు.
అది మంచిదే. కానీ అదే రోజు ఒక అమ్మాయి చదువుకోవాలని అడిగితే “లేదు” అని చెప్పితే ఆ స్టేటస్‌లకు అర్థం ఏముంటది చెప్పుండి.
“Give to Gain” అనే థీమ్ నిజంగా అర్థం కావాలంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మహిళలకు అవకాశాలు ఇవ్వాలి. నిర్ణయాల్లో భాగం చేయాలి. చదువుకునే హక్కు ఇవ్వాలి. పని చేసే స్వేచ్ఛ ఇవ్వాలి.
అప్పుడు కుటుంబం కూడా ఎదుగుతది. సమాజం కూడా ఎదుగుతది.
కానీ ఇంకో విషయం సుత ఉంది.
మహిళలు కూడా తమను తాము తక్కువ అనుకోకూడదు…
“నేను చేయలేను” అనే మాట చాలా ప్రమాదకరం.
పోశాలు పెండ పిస్కి, గోడకు పిడక కొట్టుకుంట ఒకసారి వెనకాల తిరిగి నా దిక్కు చూసి ఇట్లన్నది, ” అక్కా…!మన కాళ్ళ మీద మనం నిలబడాలి. గదే నాకు తెల్సింది. నువ్వు జెప్పే పెద్ద పెద్ద మాటలు నాకు సమజ్ గావు కనీ, నిన్ను నువ్వు నమ్ముకుంటే..నీ దమ్మును నువ్వు నమ్ముకుంటే, ..నీ బిడ్డలకు, నీకు సుత గింత బువ్వ దొరుకుతది. ఇదే నాకర్ధమైంది. ఇదే నా దృష్టిల మహిళా సాధికారత అన్నది.
“నీ కాళ్లమీద నువ్వు నిలబడాలక్కా.” అన్నది.
ఆ మాటల పెద్ద తత్వం ఉంది.
అది కేవలం డబ్బు సంపాదించమనే అర్థం కాదు. అది ఒక ఆత్మవిశ్వాసం. ఒక స్వతంత్రత.
నీ జీవితంపై నిర్ణయం తీసుకునే ధైర్యం.
ఎన్ని మహిళా దినోత్సవాలు వచ్చినా… ఎన్ని థీమ్స్ వచ్చినా… అసలు మార్పు మనసులోనే మొదలవుతది.
మనసు మారితే సమాజం మారుతది.
మన మట్టిల ఒక మంచి లక్షణం ఉంది. ఇక్కడి మహిళలు బలంగ ఉంటరు. కష్టానికి భయపడరు. కుటుంబాన్ని నిలబెడుతరు. పిల్లలను చదివిస్తరు.
అదే బలం ఇప్పుడు ఒక కొత్త దిశలోకి నడువాలి.
మహిళలు తమను తాము గౌరవించుకోవాలి. తమ కలలను సుత గౌరవించాలి.
అప్పుడు మాత్రమే “Give to Gain” అనే మాట నిజం అవుతది.
ఎందుకంటే మహిళలకు ఇచ్చే గౌరవం, స్వేచ్ఛ, అవకాశాలు చివరికి సమాజానికే లాభం అయితయి.
మహిళా సాధికారత గురించి మనం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతం, కానీ మహిళలకు తమ గురించి ఆలోచించనీకి సుత సమయం ఉండదు.
మన సమాజంల ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. ఒక దిక్కు “మహిళలు ముందుకు రావాలి” అంటం. ఇంకో దిక్కు వాళ్లు ముందుకు వస్తే ఓర్వము,
మా ఊరిల ఒక అమ్మాయి ఉంది. ఆమె చానా బాగా సదువుకుంది. ఉద్యోగం సుత వచ్చింది. మొదట అందరూ ఆమెను చూసి గర్వపడ్డరు.
కానీ కొన్ని రోజులైనంక ఇట్ల మాట్లాడడం మొదలుపెట్టిన్రు…
“ఇంత చదివి ఏం లాభం ? ఎవల్లనో ఒకళ్ళను లగ్గం జెస్కొని పోవాలే కదా” అని ఆమె దిమాఖ్ తినుడు మొదలు పెట్టిన్రు.
మన సమాజం కొన్నిసార్లు చాలా విచిత్రంగ ఉంటది. ఒక అమ్మాయి చదివితే గర్వపడుతుంది. అదే అమ్మాయి తన నిర్ణయాలు తీసుకుంటే భయపడుతది.
ఇది ఒక పెద్ద విరుద్ధం.
చానా కుటుంబాల్ల అమ్మాయిలకు చిన్నప్పటి నుంచే కొన్ని అప్రకటిత నియమాలు ఉంటయి.
“ గట్టిగ నవ్వకు.”
“ఎదురు పడి మాట్లాడకు .”
“అబ్బాయిలతో పోటీ పడకు.”
ఇట్ల చెప్పడం వల్ల మనం ఒక అమ్మాయి మనసుల గోడలు కడుతం.
ఆ గోడలు బయట కనిపించవు. కానీ అవి ఆమె ఆత్మవిశ్వాసాన్ని మెల్లగ నాశనం జేస్తయి.
అసలు సమస్య ఏందంటే..సమాజం మాత్రమే కాదు… మహిళలు సుత తమలో మార్పు అవసరము అని గుర్తించరు. ఇద్దరు మహిళలు ఇట్ల మాట్లాడుకుంటున్నరు.
ఒకామె అన్నది,
“మా కోడలు ఉద్యోగం చేస్తది. రోజంత బయటేనే తిరుగుతది ”
“ఏందోనే ఒదినే… ఈ కాలం ఆడపిల్లలకు ఇగురం లేదు”
అది ఇని నాకు ఒక విషయం అర్థమైంది.
కొన్నిసార్లు మహిళల ఎదుగుదలకు అడ్డంకి సమాజం మాత్రమే కాదు. మహిళల మధ్య ఉన్న అసూయ, పోలికలు సుత ఒక కారణం.
సాధికారత అంటే ఒకరినొకరు పడగొట్టడం కాదు.
ఒకరిని ఒకరు నిలబెట్టడం.
మహిళా సాధికారత అంటే పురుషులతోని యుద్ధం చేయడం కాదు.
అది ఒక సమతుల్యత.
ఒక తండ్రి తన కుమార్తెకు అవకాశాలు ఇస్తే అది సాధికారత.
ఒక భర్త తన భార్య అభిప్రాయాన్ని గౌరవిస్తే అది సాధికారత.
ఒక అన్న తన చెల్లెలు కలలను ప్రోత్సహిస్తే అది సాధికారత.
కానీ ఈ ప్రయాణంల మహిళలు సుత ఒక విషయం గుర్తించాలి.
సాధికారత అంటే ఒట్టిగ బయటకు చెప్పుడు కాదు.
సాధికారత అంటే తనపై, తాను నమ్మకం పెంచుకోవడం.
మా పెద్దమ్మ ఎప్పుడూ ఒక మాట చెబుతది
“పిల్లా… నీ కాళ్లమీద నువ్వు నిలబడాలి.”
ఆమెకు ఇంగ్లీష్ పదాలు తెలియవు. “ఎంపవర్మెంట్” అనే పదం సుత తెలియదు.
కానీ ఆమె చెప్పిన మాటలోనే మహిళా సాధికారత మొత్తం ఉంది.
నీ కాళ్లమీద నువ్వు నిలబడటం అంటే
నీ ఆలోచనలపై నువ్వు నమ్మకం పెట్టుకోవడం.
నీ జీవితాన్ని నువ్వే నిర్ణయించుకోవడం.
నీ విలువను నువ్వే గుర్తించుకోవడం.
ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవం వస్తుంది. కొత్త థీమ్ వస్తుంది. కొత్త ప్రసంగాలు జరుగుతాయి.
కానీ నిజమైన మార్పు ఎక్కడ జరుగాలి?
మన ఇళ్లల్ల,
మన ఆలోచనల్ల,
మన మనసులల్ల,
ఒక అమ్మాయి ధైర్యంగా మాట్లాడితే
ఆమెను అహంకారి అనకూడదు.
ఒక మహిళ తన కలలను సాధించాలనుకుంటే
ఆమెను అడ్డుపడొద్దు,
ఎందుకంటే చివరికి ఒక నిజం ఉంది.
ఒక మహిళ నిలబడితే ఒక కుటుంబం నిలబడుతది.
ఒక మహిళ ఎదిగితే ఒక సమాజం ఎదుగుతది.
అందుకే ప్రతి అమ్మాయికి చెప్పాల్సిన ఒక మాట,సదువురాని మా పోశాలు సుత ఈరోజు అన్నమాట
“నీ కాళ్లమీద నువ్వు నిలబడాలక్కా…
ఎందుకంటే నీ నిలబడటం నీకే కాదు…
నీ తరువాత వచ్చే తరాలకు దారి చూపుతది.నీ కాళ్ళమీద నువ్వు నిలబడుడు, నీకు ఎర్కయితే… దునియాల నీకు అడ్డులేదు, నీవు ఇయ్యు.. ఇయ్యు అని అడుక్కునే పరిస్థితి నుండి, నలుగురికి ఇచ్చేటట్టు ఎదుగుతవు.
ఏమంటరు తమ్మీ, చెల్లె!!
ఉంట మరి, పైలం
ప్రేమతో
మీ
రమక్క