ఆట  – ఆడు

ఆట అనగానే  ఆనందం.ప్రతివారి మొహంలోనూ సంతోషం . మనకు తెలిసిన ఆటలు కొన్నే . తెలీని ఆటలు బోలెడున్నాయి . అన్ని ఆటలూ ఒకటి కాదు .అలాగే అన్నిటి అర్థం , పరమార్థం ఒకటేకాదు . ఈ వ్యాసంలో  ఆటలకు సంబంధించిన వివరాలుంటాయని మీరు భావిస్తే పప్పులో కాలేసినట్లే . ఆడే ఆట కాదిది . ఆలోచించే ఆట . మొదలెడదామా.

శంకరనారాయణ నిఘంటువులో ఆట అనే పదానికి play , sport , game , dance , joke , gambling  ఇలా ఎన్నో అర్థాలున్నాయి .ఇవన్నీ మనకు పరిచయమైనవే. అయితే కొన్నిసార్లు పరిచయమైన పదాలైనా కాస్త లోతుగా ఆలోచిస్తే ,కొత్త గా కనిపిస్తాయి . కొత్త అందాలు కనిపిస్తాయి .

ఒక్కసారి గతంలోకి వెళ్తే ధర్మరాజు జూదమాడాడు . సారంగధరుడు పావురాల తో ఆడాడు . బాలచంద్రుడు పల్నాటి చరిత్రలో బొంగరాలతో ఆడాడు .ఇవి మనకు తెలిసిన ఆటలే . మరి క్రింది సందర్భాలను ఓ సారి గమనించండి .మొదటి ఆట సినిమాకు టికెట్లు దొరకలేదు అంటే show అని అర్థం .ఆ అమ్మాయి గజ్జె కట్టి ఆడిందంటే అబ్బో ! , అంటే నాట్యం అన్నమాట .వెనకటికి ఆటపాటలు అని పిల్లలకోసం ఒక మాసపత్రిక వచ్చేది .ఆటతోటలు అంటే Guest house అని అర్థం నీ ఆట కట్టిస్తాను అంటే  నీ పనైపోయిందని భావం . ఆటవిడుపు రోజులు అంటే అనధ్యయనపురోజులు .అంటే ఆ రోజుల్లో పిల్లలు చదవక్కరలేదు.

చదరంగంలో నీ ఆటకట్టిందంటే  నువ్వోడావనిఅర్థం . ఆట పట్టించడం అంటే హేళన చేయడం . అంటే నేటి ర్యాగింగ్ లాంటిది .ఆటల్లో అరటి పండు అనేది తెలుగులో బాగా ప్రసిధ్ధి లో వున్న జాతీయం .ఆడేటప్పుడు దెబ్బలు తగిలితే తేలికగా తీసుకొని మరిచి పోవాలని అర్ధం .

నీ ఆటలు సాగనివ్వనని అంటే హెచ్చరిక .ఆటరాక మద్దెల ఓడని అంటే నైపుణ్యం లేని వాడని అర్ధం .

నేనంటే ఆటగా వుందంటే  నన్ను చిన్నచూపు చూస్తున్నావని .

ఇలాఆటలు బోలెడన్ని రకాలు .ఆటతో ఎన్ని ఆటలాడినా ఫరవాలేదు కానీ మాటలు జారకండి . మనుషులు దూరమౌతారు .

ఇదండీ ఆటల కథ . చూశారా  ఒక్క మాటకు ఎన్ని అర్ధాలో . మరెన్ని మెలికలో .

Written by Vijaya Kandala

రచయిత్రి పరిచయం
పేరు విజయ కందాళ . 35 సంవత్సరాల బోధననుభవం ఉంది. కొత్త ప్రదేశాలు చూడడం , ఫోటోలు తీయడం నా హాబీలు. ఫోటోలు తెస్తాను గాని ,దిగడం ఇష్టం ఉండదు. నేను చేసే పనుల ద్వారా నేనేమిటో తెలియాలంటాను.తరుణీ ద్వారా మీ అందరిని కలుసుకోవడం సంతోషంగా ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రోత్సాహం

అనిశెట్టి రజిత కు అక్షర నీరాజనాలు