(ఇప్పటివరకు: కాంతమ్మ గారు ప్రభాకర్ గారు కొంతకాలం ఢిల్లీ లో ఉంటారన్న వార్త రమణి ద్వారా తెలుస్తుంది. ఫైనల్ తీర్పు లో జస్టిస్ జయమ్మ సుబ్బారావు కి 7 లక్షల దాకా పెనాల్టీ విధిస్తుంది. పరంధామయ్యగారికి తమ బాధ్యత ఏమిటో అర్ధమయింది జయమ్మగారి తీర్పు విన్న తరువాత )
ఆదివారం నాడు వసుంధరకి ఫోన్ చేసి తాను వాళ్ళింటికి వస్తున్నానని చెప్పింది మైత్రేయి. అక్కమ్మ పనులన్నీ చేసి వెళ్ళగానే ఆమె వసుంధర ఇంటికెళ్లింది.
“ అబ్బా, మనసెంతో హాయిగా ఉంది కదు? ఒక పెద్ద గండం నుండి తప్పించుకున్నావు,” అన్నది వసుంధర మైత్రేయి ని దగరికి తీసుకుంటూ.
“ అంత సులభం గా సమస్య లు తీరిపోతే మనకంటే సంతోషం తో ఉండే వాళ్ళు ఈ ప్రపంచంలోనే ఉండరు,” అన్నది. “ ఏమయింది?” అడిగింది.
“ మేము కోర్ట్ నుండి ఇంటికెళ్లన కొద్దిసేపటికల్లా సుబ్బా రావు వచ్చాడు మా నాన్నగారిని కలవటానికి.”
“ఏమన్నాడేమిటి?”
“ ఏముంది. ఎప్పటి పాటే. కోర్ట్ పెనాల్టీ వేసింది కదా, అది నేను కట్టే స్తాను, ఎప్పటిలాగా మా సంసారం జరిగేలా మీరే మైత్రేయికి నచ్చ చెప్పాలని, అడగటానికి వచ్చాడు.”
“ అవునా? మీ నాన్న ఏమ్మన్నారేంటి? ఇదంతా నీ ముందేజరిగిందా?”
“ లేదు. నేను బాత్రూమ్ లో ఉన్నప్పుడు జరిగింది. నేనింకా బయటికి రాలేదేమో అనుకున్నారు మా నాన్న. నాకేమి చెప్పలేదు. అతను వచ్చేటప్పటికి నేను స్నానం ముగించుకొని నా రూమ్ లో చీరకట్టుకుంటున్నాను. ఎవరొచ్చారా అని చుస్తే అతను. ఎం మాట్లాడతాడో విందామని, నేను రూమ్ లోంచి బయటికి రాలేదు.”
“నాన్నగారేమన్నారు?”
“ బాగా చీవాట్లేసారు. ఏనిర్ణయమయిన మా అమ్మయిదే. ఇందులో మేము కల్పించుకోము. అలాగని వ్యతిరేకించను కూడా. నీ వలన నేను మా అమ్మాయిని అర్ధం చేసుకోలేకపోయాను. ఇప్పుడు నాకన్ని అర్ధమయ్యాయి. నీ నక్క వినయాలు నా దగ్గర కాదు అన్నారు.”
“అవునా ! గ్రేట్!” అన్నది వసుంధర.
“ఇప్పుడు నాకు నీ హెల్ప్ కావాలి మళ్ళి ,” అంది.
“చెప్పు ఎం చేయాలి,” అంది.
“ నాకు సుబ్బారావు నుండి విడిపోవాలి ఉన్నది. విడాకులకు అప్లై చేద్దామనుకుంటున్నాను,” అంది. “ ఓస్ , దానికేనా అంత ఇబ్బందిపడుతున్నావు.”
“అలాని కాదు. ఎంత త్వరగా తెచ్చుకోవచ్చు,” అడిగింది.
“ నేను వచ్చే ఆదివారం నా ఫ్రెండ్ , కొలీగ్ లాయర్ రాఘవరాణి ని పిలుస్తాను. తన తోటి మాట్లాడు. నీ డౌట్స్ ముందు తీరుతాయి. అప్పుడు నువ్వన్నట్లు చేయి. పద ఇప్పుడు భోజనం చేద్దాము,” అంటూ లేవదీసింది. మైత్రేయి మనసు తేలిక చేయడానికి వసుంధర తమ కాలేజ్ కబుర్ల చెబుతూ భోజనం కానించింది.
మాటల మధ్యలో “ఏమయింది ? ప్రసాద్ లేడా?” అడిగింది వసుంధర.
“ ఏమయిందో తెలియదు వసుంధర. ఈ మధ్య ప్రసాద్ దిగులుగా ఉంటున్నాడు. నాకనిపించింది అయన భార్య అపూర్వ వెళ్ళిపోవటం తో ఒంటరిగా ఫీల్ అవుతున్నాడేమో,” అన్నది .
ప్రసాద్ గురించి అపూర్వ ఎందుకొచ్చిందో మైత్రేయి కేమి తెలియదని అర్ధమయ్యి వసుంధర, “అయుండొచ్చు. బాగా ప్రేమించిన వ్యక్తి కి దూరమవడమంటే బాధాకరమే,” అంది నర్మగర్భంగా.
*******************
ఆదివారం త్వరగా తయారయి వసుంధర దగ్గరికి వెళ్ళింది మైత్రేయి. వసుంధర , మైత్రేయి కలిసి ఆమె కారులో లాయర్ రాఘవరాణి ఆఫీస్ కి వెళ్లారు. ముందుగానే చెప్పడంతో లాయర్ రాఘవ రాణి కూడా వీళ్ళ కోసం ఎదురుచూస్తూ ఆఫీస్ లోనే ఉన్నది.
“ రాఘవ రాణి , తాను నా ఫ్రెండ్ మైత్రేయి, నిన్ను కలవాలంటే తీసుకొచ్చాను,” అని పరిచయం చేసింది.
మైత్రేయి మర్యాద పూర్వకంగా నమస్కారం చేసింది. “ అంత ఫార్మాలిటీస్ వద్దు మైత్రేయి. నువ్వు వసుంధరకి ఫ్రెండ్ వయితే నాక్కూడా ఫ్రెండ్ వే !” అంది చాల చనువుగా. కొద్దిసేపు పిచ్చాపాటి కబుర్లు అయినా తరువాత వసుంధర మైత్రేయి విషయం ఎత్తింది.
“రాఘవరాణి! మైత్రేయి కేసు నేను టేకప్ చేసానని నీకు తెలుసు కదా ,” అంది వసుంధర.
“ అవును. మన ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో అతి వేగంగా ,అతి కొద్దీ కాలం లో తీరు పు చెప్పబడిన కేసని కూడా చాలా మంది చెప్పుకుంటున్నారు. అదంతా మన జస్టిస్ జయమ్మ గారి గొప్పతనమే. నాకని పిస్తుంది, మైత్రేయి లాంటి కేసులు కోర్ట్ లో ఎక్కువ సాగకూడదు. ఎందుకంటే కేసు పెట్టటంవలన చాల ఇబ్బందులకు గురికావడమే కాకుండా, మానసికం గా కూడా అమ్మాయిలే బాధితులవుతున్నారు. అలా ఆడవారిని అలాటి బాధల నుండి తప్పించాలంటే , ఇలాటి కేసులు త్వరగా పరిష్కరించాలి. అందుకు ప్రతినెలా లోక అదాలత్ ప్రతి కోర్ట్ లోను నడిపితే ఇలాటి సమస్యలు త్వరగా పరిష్కరించబడతాయి. అంతేకాకుండా బాధితులకి న్యాయం కూడా త్వరగా దొరుకుతుంది,” మాట్లాడింది రాఘవరాణి.
“ఇప్పుడు నువ్వెంత త్వరగా మన మైత్రేయి కి ఆమె భర్తనుండి విడాకులు ఇప్పించగలవు,” అడిగింది వసుంధర.
నాకు ఆమె కేసు కు సంబంధించిన వివరాలన్నీ ఇస్తే, వాటి ఆధారంతో ముందు గా ఈమె చేతే విడాకులకు ఫామిలీ కోర్ట్ లో కేసు పెట్టిస్తాను. ఈమె విషయము కోర్ట్ ముందు కి వచ్చింది కాబట్టి , ఫైనల్ తీర్పు కూడా ఇవ్వబడింది కాబట్టి ఈమెకు విడాకులకు ఎక్కువ సమయం పట్టదు. అంతేకాకుండా కౌన్సెలింగ్ లాంటి ప్రక్రియలుకూడా ఉండకపోవచ్చు. కానీ కోర్ట్ ముందు మాత్రం ఈమె . ఈమె భర్త రెండు మూడు సార్లు హాజరుకావాల్సి ఉంటుంది. కోర్ట్ లో కేసు ఫైల్ అయ్యాక , ఈమె భర్తకి కోర్ట్ నోటిస్ పంపుదాము ,” అని వివరించింది.
“అలాగే. రాజ్యలక్ష్మి , మైత్రేయి ఇద్దరు నిన్ను కొద్దీ రోజుల్లోనే కలుస్తారు అన్ని వివరాలతో ,” చెప్పింది వసుంధర.
“ప్రసాద్ గారి భార్య ఫోన్ చేసింది, కేస్ ఎంతవరకు వచ్చింది అని. అప్పుడేనా అపూర్వ ఇంక టైమ్ పడుతుందని చెప్పాను,” అంది రాఘవరాణి.
“ ఆ అమ్మాయికేమి తెలియదు. అంత ఆ భవ్య చెప్పి చేయిస్తుంది,” అన్నది వసుంధర. అలా ప్రసాద్ గురించిన విషయం రావటం తో మైత్రేయికి కాస్త అయోమయంగా అనిపించింది. అంత అందమయిన భార్య, ఈడు జోడు కుదిరిన జంట వీళ్ళకి రాఘవరాణి ని కలవాల్సిన అవసరమేముంది. ప్రసాద్ నాదగ్గరేమయిన దాచాడా అని ఆలోచించడం మొదలెట్టింది మైత్రేయి.
ఇంటికెళ్ళగానే ప్రసాద్ ని అసలు విషయం అడిగి తెలుసుకోవాలనుకుంది.
************************
అన్యమనస్కంగానే ఇల్లుచేరుకుంది మైత్రేయి. సాయంత్రం దాకా ప్రసాద్ కూడా రాలేదు. ఆమె ప్రసాద్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నది. ఆ రోజు ప్రసాద్ చాలా ఆలస్యంగా రూమ్ కి వచ్చాడు. అది మైత్రేయి గమనించలేదు. అతను స్నానం చేసి బట్టలు మార్చుకొని ఫ్రెష్ గా మైత్రేయి తలుపు కొట్టాడు.
“హలో! మైత్రేయి గారు! తలుపుతీస్తారా?”
“ ఆ పిలుపుకోసమే ఎదురుచూస్తున్నట్లు ఒక్క గెంతులో వచ్చి తలుపుతీసింది మైత్రేయి. నవ్వుతు “మీకు బాగా తెలుసన్న మాట ఎదుటివాళ్ళు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసేలా చేయడం,” అంది కాస్త నిష్టురంగా.
“ అయ్యో ! ఏది మీ కళ్ళు చూపించండి ఎన్ని కాయలు కాశాయో చూస్తాను,” అన్నాడు చమత్కారంగా.
“ఎప్పుడు తమాషేనా ప్రసాద్! ఎంత బాధ ఉన్న ఎదుటివాళ్ళకు తెలియకుండా నవ్వుతూ, నవ్విస్తూ ఉండగలగడం మీ దగ్గరే నేర్చుకోవాలి ప్రసాద్ గారు. ఫ్రెండ్ అంటారు కానీ మీ బాధని చెప్పుకోవటానికి మాత్రం నేను పనికి రాను. మీ మగవాళ్ళంతా ఇంతేనేమో. ఆడవాళ్ళ మీ సొంత విషయాలలో ఏ మాత్రం పట్టించుకోరాదు. పులుసులో కరివేపాకులాగా తీసిపారేస్తారు ,” అంటూ గలగలా మాట్లాడేయ సాగింది.
“ ఆగండి మైత్రేయి గారు. నేనంతలా ఏమి చెప్పలేదు మీకు? ముందా విషయం వదిలిపెట్టి నాకు ఆకలేస్తున్నది ఏమయినా పెడతారా తింటానికి ,” అన్నాడు.
“ అయ్యో మాటల్లో పదడి మర్చిపోయాను, రాత్రికే గదా అని ఉప్మా చేశాను పెడతాను, దాంతో పటు మజ్జిగ కూడా ఇస్తాను,” అంటూ ప్లేట్ నిండా ఉప్మా పెట్టి పక్కనే తియ్యటి మజ్జిగ గ్లాస్ కూడా తెచ్చి పెట్టింది. ప్రసాద్ ఆకలి మీదున్నాడేమో గబా గబా తినేసాడు.
“ఇప్పుడు చెప్పండి. నా ఆత్మ రాముడు శాంతించాడు,” అన్నాడు నాటకీయంగా. మాములుగా అడిగితే ప్రసాద్ చెప్పడు , అందుకే “ ప్రసాద్! మీరు అపూర్వ విడాకుల కోసం లాయర్ రాఘవరాణి ని కలిసారా?” సూటిగా చూసింది.
ప్రసాద్ కి అర్ధమయింది మైత్రేయి కి తన విషయం తెలిసిపోయిందని. అందుకే ఆమెకి అపూర్వ కున్న బలహీనతని చెప్పదలుచుకోలేదు. అలా చెప్పడం వలన మైత్రేయి దృష్టి లో అపూర్వ దిగజారి పోయే అవకాశం ఉంది. ఇప్పుడు ఎం చెప్పనబ్బా అని తలా గోక్కుంటూ, “ అపూర్వ కి మా మ్యారేజ్ ఇష్టం లేదు. వాళ్ళ అమ్మా వాళ్ళ బలవంతం మీద జరిగింది. అందుకే నేను ఆమెని వదిలేసి ఇక్కడకొచ్చాను. ఆమె నన్ను వదిలేసి అమెరికా వెళ్ళిపోతుంది. అందుకే ఇద్దరం మ్యూచువల్ గా విడాకులకోసం అప్లై చేసాము,” అన్నాడు చాలా మాములుగా. అతను నిజం చెప్పటం లేదని మాత్రం అనిపించింది మైత్రేయికి . “మీకు అపూర్వ అంటే ఎంత అభిమానమో, ఇష్టమో నాకు ఆమెని మీరు చూస్తున్న చూపులోనే అర్ధమయింది. ఆమె కి ఏ ఇబ్బంది కలగా కుండా మీరు చూసుకున్న విధానం లో మీ కామే పట్ల ఎంత ప్రేమ ఉందొ అర్ధమయింది. అంతే కాదు నాతో మీరు చనువుగా ఉండడం చుసిన అపూర్వ కూడా జెలసీ ఫీల్ అవడం చూసాను. అలాటి మీ మధ్యన ఈ విభేదం ఎందుకు?” అడిగింది.
“ అంటే మీరు నాకు కౌన్సెలింగ్ చేయాలనుకుంటున్నారా?” అన్నాడు బలహీనం గా నవ్వుతూ. “ చూడు మైత్రేయి ! కొన్ని సార్లు మన ఇష్టం తోటి , మన భావనలతో సంబంధం లేకుండానే మన జీవితాలలో విచిత్రమయిన మార్పులు, సమస్యలు వస్తుంటాయి. అవి అందరికి చెప్పుకోలేము. అలాచెప్పడం ద్వారా ఒకరి గౌరవాన్ని ఒకరు తగ్గించుకున్నట్లవుతుంది. అందుకే మీకు ఏది వివరంగా చెప్పలేను. మీరు ఇంతకంటే నన్నేమి అడగకండి,” అని అక్కడి నుండి వెళ్లి పోయాడు.
ప్రసాద్ ని జాలిగా చూట్టం తప్ప తనేమి చేయలేనని అనుకుంది. ఒక మంచి స్నేహితురాలిగా ప్రసాద్ లోని బాధని మాత్రం దూరం చేయాలనీ అనుకుంది. దానికి వసుంధరని అడిగి అసలు విషయం తెలుసుకోవాలని అనుకుంది.
******************************
ఎవరితోటి సంబంధం లేని కాలం మాత్రం తన దారిన తాను నడిచిపోతూనే ఉంటుంది. మనము నడవక తప్పదు. సమస్యలు రావడం మయితే మనకి తెలియకుండా వచ్చేస్తాయి. కానీ వాటి కి పరిష్కారం మాత్రం మన చేతుల్లో ఉండదు. అది కాలమే నిర్ణయించాలి. ఆ కాలమే మన గతి ని కూడా నిర్ణయిస్తుంది. అలా ఆ కాల ప్రవాహం లో కొట్టుకు పోతున్న మైత్రేయి ‘చేయూత’ ఒడ్డుకి విసిరివేయబడింది.
ఆరోజు సాయంత్రమే కాంతమ్మ గారినుండి ఫోన్ వచ్చింది. “ హలో మైత్రేయి! ఎలా ఉన్నావు? అన్ని సర్దుకున్నాయి కదా? నీతోటి కొన్ని ముఖ్యమయిన విషయాలు మాట్లాడాలి ఈ ఆదివారం వస్తావు కదూ?” అడిగింది.
“ తప్పకుండ అమ్మ! వస్తాను,” అంది. ఆదివారం నాడు ఉదయాన్నే తయారయి కాంతమ్మ గారింటికి వెళ్ళింది. ఆమె కోసమే ఎదురు చూస్తున్నట్లు కూర్చొని ఉన్నది కాంతమ్మ. మైత్రేయి ఇంట్లోకి వెళ్ళగానే,” రాంబాయమ్మ గారు, రండి! మీ మైత్రేయి వచ్చింది,” పిలిచింది.
రాంబాయమ్మ సంతోషం గా వంటగదిలోంచి వాళ్ళు కూర్చున్న హల్లో కి వచ్చింది. వస్తూనే “ మైత్రేయి బాగున్నావా. నన్ను మరిచిపోయావా ఏంటి? ఎన్ని రోజులయింది నువ్వొచ్చి. అమ్మ గారి కోసమే వస్తావా? నన్ను తలుచుకొవా ?” అంటూ నిష్ఠురమాడింది.
“అయ్యో అదేం లేదు పెద్దమ్మ! కొంచం కాలేజీ పనులతో బిజి అయ్యాను,” అంటూ లేచి ఆమెని అక్కున చేర్చుకుంది. రాంబాయమ్మ గారు కూడా నవ్వుతు మైత్రేయి ని దగ్గరికి తీసుకొని ఈ రోజంతా నువ్వు నాతోనే ఉండాలి, ఇక్కడే భోజనం అంటూ, “ అమ్మ! నేను వెళుతున్న వంట చేయడానికి. ఏదయినా స్పెషల్ కావాలంటే చెప్పండి,” అని వెళ్ళిపోయింది.
అంతలోకే రమణి కాఫీ తీసుకొచ్చింది. అప్పుడే వసంత, రమణమ్మ , కమలమ్మ లని బస్ స్టాండ్ నుండి రిసీవ్ చేసుకొని తీసుకొచ్చాడు జానీ. అందరిని సాదరం గా ఆహ్వానించింది కాంతమ్మ. రాంబాయమ్మ సంతోషం తో వాళ్ళందరిని కలుసుకొని, తత్తరపాటుగా,” నేను మనందరి కోసం వంట చేస్తాను,” అంటూ లోపాలకి వెళ్లి పోయింది.
కొన్ని కబుర్లు అయిన తరువాత, “ కాంతమ్మ గారు, మీరెన్ని రోజులదాకా ఇక్కడ ఉండరు,” అడిగింది కమలమ్మ. “రోజులా కమల! కనీసం మూడేళ్ళ దాకా మేము ఇక్కడ ఉండము. ప్రభాకర వాళ్ళు జలంధర్ లో కొత్త బ్రాంచ్ పెట్టారు. అది పూర్తిగా సెట్ అయ్యేదాకా అక్కడే ఉండి , ఆ తరువాత ఇక్కడి కొస్తాము మళ్ళి,” అంది . “అమ్మో అన్ని రోజులే , మరి మా గతెం కాను,” అంది గబరాట్టుగా రమణమ్మ. “అందుకే కదా మిమ్మల్నందరిని ఇక్కడకి పిలిచాను. మిమ్మల్ని అలా ఎలా వొదిలేసి పోతాను చెప్పండి,”అంది ఆ ప్యాయంగా.
“మైత్రేయి, నీకు చేయూత బాధ్యతలు అప్పగించాలనుకుంటున్నాను,” అంది గంభిరం గా.
“ నేనా!” ఒకింత ఆశ్చర్యం భయం తో అడిగింది. “అంత భయపడాల్సిందేమీ లేదు మైత్రేయి. నేనెప్పుడూ మెయిల్స్ లోను ఫోన్ లోను టచ్ లోనే ఉంటాను. నేను లేనప్పుడు ఇక్కడ చేయూత వ్యవహారాలు ఎప్పటికప్పుడు చూసుకోవడానికి ఒక ఎడ్యుకేటెడ్ అమ్మాయి ఉంటె బాగుంటుందనిపించింది. పైగా నీకు కొంత పరిచయం కూడా ఏర్పడింది. అందుకే అడిగాను. ఇది స్వచ్ఛంద సంస్థ. నీకు ఇష్టమయితేనే, లేకపోతే ఇంకెవరినయినా అడుగుతాను.” అంది. అప్పుడే లోపలకి వస్తున్న వసుంధర ,” మైత్రేయి ! కాంతమ్మ గారు నిన్ను అడిగారంటే , నిన్ను ఎంతో అర్ధం చేసుకొని , నువ్వే సరయిన వ్యక్తి అని నిర్ధారణకు రాక పోతే ఆమె నిన్నసలు అడగనే అడగరు,” అంది.
“అదికాదు వసు!అంతపెద్ద బాధ్యతని నేను నిర్వహింగలనా,” అంది మైత్రేయి.
“చేయూత ఇప్పుడు ఒక సాధారణ సంస్థ కాదు మైత్రేయి ! దానిని నడపటానికి ఒక కమిటీ కూడా ఉన్నది. అందులో డాక్టర్ కాత్యాయని , లాయర్ వసుంధర, గౌరవ సభ్యులు గుంటూరు జిల్లా కలెక్టర్ , లాంటి కొందరు ముఖ్యమయిన వ్యక్తులు కూడా ఉన్నారు. కానీ ఆ సంస్థని కనిపెట్టుకొని నడిపించటానికి నీలాటి వ్యక్తులే అవసరమని నా అభిప్రాయం, ఏమంటావు” సాలోచనగా చూసింది కాంతమ్మ. మైత్రేయి ఏమి మాట్లాడక పోవడం తో, “నువ్వు బాగా ఆలోచించుకొని చెప్పు.” అంటూ ““అందరు లేవండి భోజనం చేద్దాం ,” అంటూ అందరిని లేవదీసింది.” కమలమ్మ రాంబాయమ్మ కు వడ్డనలో సహాయం చేసింది. భోజనాలయిన తరువాత రమణమ్మ వాళ్ళు వెళ్లిపోయారు. వసుంధర కూడా పనున్నదని వెళ్ళిపోయింది. మైత్రేయి కొద్దిసేపు రాంబాయమ్మ గారి తోటి కబుర్లు చెప్పి ఇల్లు చేరుకుంది.
ఆ రోజంతా ఆమె మనసు లో ఆలోచనలు తిరుగుతూనే ఉన్నాయి. కొంతకాలం కాంతమ్మ గారితోటి తిరుగుతూ ఆ సంస్థని ఎలా సంభాలించాలో చూడాలనుకొన్నది, అదే విషయం కాంతమ్మ గారికి మరునాడే చెప్పింది. దానికి కాంతమ్మ కూడా చాల సంతోషంగా,” మంచి నిర్ణయం మైత్రేయి , ఏదయినా బాధ్యతని తీసుకునే ముందు సమ గ్రమయిన అవగాహన ఉండడం మంచిది,” అంటూ ప్రతి వారం చివర్లో రెండురోజులు మనం చేయూత లో గడుపుదాము ,” అని ఒక షెడ్యూలు తయారుచేసింది. అలా ప్రతివారం నెలరోజులపాటు కాంతమ్మ గారితో తిరిగిన మైత్రేయి కి అక్కడున్న ఇన్ మేట్స్ తోటి ఒక స్నేహ సంబంధం ఏర్పడింది. జ్యోతి కి నెలలు దగ్గరపడుతున్నాయి. డాక్టర్ కాత్యాయని గారి సలహాతో ఆమెకి సదుపాయాలు చేస్తున్నారు.
*************
మూడు నెలల తరువాత కాంతమ్మ గారి ప్రయాణం. ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. ప్రసాద్ ప్రభాకర్ గారి కి ఆ ఏర్పాట్లలో చేదోడుగా ఉండి, అన్ని ఏర్పాట్లు చేసాడు.
వాళ్ళ ప్రయాణానికి కొద్దీ రోజుల ముందు, “మైత్రేయి, మా ఇంట్లో రాంబాయమ్మ గారు, రమణి , జానీ ని ఉండమన్నాము. కానీ వాళ్ళు ఇంకెవరు లేకుండా ఉండడానికి ఇష్టపడటం లేదు. రాంబాయమ్మ గారేమో ఆశ్రమానికి వెళ్లిపోతానని అంటున్నది. అందుకని నాకు ఒక ఆలోచన వచ్చింది, నువ్వెలాగూ చేయూత భాద్యతలు తీసుకున్నావు, అలాగే మా ఇంట్లో ఉండి మా ఇంటి బాధ్యతని కూడా తీసుకో. మాకు కూతురులాంటి దానివి,” అన్నాడు ప్రభాకర్. “అంతేకాదు, కాంత ఆశయాలకు నిన్ను సరైన వారసురాలిగానే ఎంచుకుంది, మరి నీవె మంటావు,” అన్నాడాయన.
“అలాగే ఆలోచిస్తానండి,” అన్నది మైత్రేయి. తనని ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదని రాంబాయమ్మగారిని కొద్దిరోజులు చూడమని, తోడుగా రమణి జానీ లను కూడా ఆమె తోటి ఉండే ఏర్పాటు చేసి, నెలనెలా ఆమెకి కొంత డబ్బు అందేలా ఏర్పాటు చేసాడు ప్రభాకర్. అన్ని ఏర్పాట్లు అయినా తరువాతే కాంతమ్మ, ప్రభాకర్ గారు వాళ్ళు పంజాబ్ కి పయన మయి పోయారు. వాళ్ళని కన్నీళ్లతో సాగనంప కూడదని గంభీరంగా ఉన్న , రాంబాయమ్మ లోలోపలే కుమిలి పోయింది. ప్రసాద్ వాళ్ళకి గార్డియన్ గా ఉంటానని చెప్పాడు.
వారం రోజులకే రాంబాయమ్మ మంచం ఎక్కింది దిగులుతో. “అక్క! రాంబాయమ్మ గారికి బాగా జ్వరం వస్తున్నదని,” అని ఒక రోజు జానీ వచ్చాడు కారు తీసుకొని. వెంటనే మైత్రేయి వెళ్ళింది చూడ్డానికి, “ఆమె మైత్రేయి ని పట్టుకొని ఒకటే ఏడుపు, నన్నువదిలి పోవద్దని,” అప్పుడే అర్ధమయింది మైత్రేయి కి తోడు ఎంత అవసరమొనని.
అదే విషయం ప్రసాద్ తోటి అంది,”అవును మైత్రేయి మనకు మనసుకి దగ్గరయిన వాళ్ళు మన తోటి ఉంటే ఎంతకష్టమయిన భరించవచ్చు. ఆమెకి కాంతమ్మ గారే బలం, ఆమెకే కాదు అలాటి చాలా మందికి మన కాంతమ్మ గారి లాగానో, మరేవిధంగానో చేయూత నివ్వాలి, అప్పుడే వాళ్ళు ఈ సమాజం లోబతక గలుగుతారు ,” అన్నాడు. “మరి నేను వాళ్ళింటికి వెళ్ళనా , ఇక్కడ ఖాళీ చేసి?” అన్నది. “అలాగే వేళ్ళు!ఒక నిర్భాగ్యుడు నీ స్నేహం వల్లనే బతుకుతున్నాడని గుర్తుపెట్టుకోండి చాలు,” అన్నాడు కాస్త బాధగా. మైత్రేయి కి తెలుసు తనకి కూడా ప్రసాద్ స్నేహం ఒక ఆసరా అని. కొద్దీ రోజుల కల్లా మైత్రేయి కాంతమ్మ గారింటికి మారిపోయింది.
ప్రసాద్ సాయంతో చేయూత అకౌంట్స్ చెక్ చేస్తున్నది. ప్రతి పది రోజులకి ఆశ్రమానికి వెళ్లివస్తున్నది. అర్ధం కానీ విషయాలను వసుంధర నడిగి తెలుసుకుంటున్నది. మధ్యమధ్యలో కాంతమ్మ గారు కూడా ఫోన్ లో మాట్లాడుతూ సలహాలిస్తున్నారు. మైత్రేయి నిదానం గా సుబ్బారావు ఆలోచనలనుండి, ఆ భయం నుండి బయటపడసాగింది. రెండు సార్లు రాఘవరాణి హాజరవమని పిలిచింది కోర్టుకి,” ఇది వరకు లాగ బెరుకు గా ని, భీతి గాని లేవు. పరిపూర్ణమయిన వ్యక్తిత్వం. ఎవ్వరికి భయపడని, తలవంచని వ్యక్తిత్వం ఆమెలో మెండుగా కనిపిస్తున్నాయి. ఆమె కోర్టుకి వెళ్లిన రోజే ప్రసాద్ కేస్ కి కూడా వాయిదా వచ్చింది. ప్రసాద్ కి తెలియదు ఆ రోజే మైత్రేయి కూడా వచ్చిందని. అనుకోకుండా కోర్ట్ లో కలుసుకున్నారు.
**************
ఇంతకాలంగా దాచుకున్న రహస్యం బయటపడినట్లయింది. ప్రసాద్ కాస్త బెరుకుగానే మైత్రేయి తోటి మాట్లాడాడు. ఇద్దరి కేసులు ఒక గంట వ్యవధిలో కోర్ట్ లో ప్రవేశపెట్టబడ్డాయి. ఈ రెండు కేసులకు లాయర్ రాఘవరాణే . మైత్రేయి కేసు వివరాన్ని మరొక సారి పరిశీలించిన తరువాతే వాయిదా ఇవ్వబడుతుంది అని జడ్జి గారు చెప్పారు. అలాగే ప్రసాద్ కేసు విషయం లో మరొక వాయిదా అడగాల్సి వచ్చింది . ఎందుకంటే అపూర్వ స్వయం గా మరొక వాయిదా కోరుతూ కోర్ట్ ని అర్ధించడం జరిగింది. అందుకని ఇద్దరి కేసులు ఐదునెలల తరువాత విచారించబడతాయని చెప్పడం జరిగింది. ఆ వ్యవహారమంతా ముగించుకొని కోర్ట్ కాంటీన్ కొచ్చి కూర్చున్నారు ప్రసాద్ , మైత్రేయి. అప్పుడు అడిగింది,” ప్రసాద్ !నన్ను మీరు ఒక మంచి స్నేహితురాకిగానే భావిస్తున్నారు కదా?”
“ఆ అనుమానం ఇప్పుడెందుకొచ్చింది మైత్రేయి?”
“ఎం లేదు? నాకనిపిస్తుంది మీరేదో పెద్ద విషయం నా దగ్గిర దాచారని పిస్తున్నది. ఇప్పటికూడా నాకు అర్ధం కానిదేమిటటంటే, మీకు అపూర్వ అంటే పిచ్చి ప్రేమ ఉన్నది. కానీ విడాకులు ఎందుకు కోరుకుంటున్నారు. మీరు కూడా అమెరికా వెళ్ళవచ్చు కదా? అలా జరగలేదు. ప్రతి సారి త్వరగా విడాకులు ఇప్పించమని లాయర్ ని అడుగుతున్నారు.అసలేం జరిగింది?” అడిగింది అనునయం గా. ఇక అసలు విషయం చెప్పక తప్పదు అనుకొంటూ,”అపూర్వాను నేను ప్రేమించాను గని, ఆమెకి నాపట్ల గౌరవం తప్ప భర్త గా నామీద ఆమెకు ప్రేమ లేదు. ఆమె భవ్యతోటి ఉండాలని కోరుకుంటున్నది. వాళ్ళింద్దరి మధ్యన లావెండర్ మ్యారేజ్ సంబంధం ఉన్నది. నేను మీకు ఇంతకంటే వివరించలేను. మీకు అసలు విషయం అర్ధమయిందనుకుంటాను. మాకు విడాకులిస్తే అపూర్వ మాత్రమే కాదు నేను కూడా ఆ బంధం నుండి విముక్తుడనవుతాను. అందుకే ఈ ప్రయాస,” అన్నాడు తలవంచుకొని.
“ మీరంతగా బాధపడాల్సిందేమి లేదు ప్రసాద్. నేనీ విషయం ఇదివరకే అర్ధం చేసుకున్నాను. మనం ఏమి చేయలేని సామజిక స్థితి లో నిస్సహాయం గా నిలబడి ఉన్నాము. మన సమస్యలకి కాలమే సమాధానం చెప్పాలి. మీరు ప్రేమతో ఆమె కి స్వేచ్చని ఇస్తున్నారు. నేను నా స్వేచ్ఛ కోసం పోరాడుతున్నాను. మన మార్గాలు వేరు. సమస్య కూడా వేరే. కానీ పరిష్కారం మాత్రం ఒకే రకమైంది. ఈ జీవన స్రవంతిలో నేను మాత్రమే బాధితురాలినని అనుకొంటే సరిపోదు. మనం మన బాధ్యత గా ఇలాటి సమస్యలకి పరిష్కారం కోసం కూడా మనమే అన్వేషించాల్సి ఉంటుంది. ఈ అన్వేషణలో నేనెప్పుడూ మీకు తోడుగా ఉంటాను. ఇది నేను ఒకస్నేహితురాలిగా మీకుఇస్తున్న మాట,” అంది మైత్రేయి.
ప్రసాద్ మైత్రేయి లోని ప్రౌఢత్వాన్ని గమనిస్తూ, ఎంత ఎదిగిపోయింది మైత్రేయి. ఎవరికయినా కాలమే నేర్పిస్తుంది. అపూర్వ , భవ్య, మైత్రేయి ఈ ముగ్గురు మూడు విభిన్నవ్యక్తిత్వాలు, స్వభావాలు ఉన్న స్త్రీ మూర్తులు. కానీ మైత్రేయి ఇంకా భిన్నం. మార్పుని ఆహ్వానిస్తూ, ఆ మార్పు తెచ్చే పోకడలను అంగీకరిస్తూ, తాను మారుతూ, తన చుట్టూ ఉన్నవారిని కూడా మారుస్తూ ముందుకు సాగి పోతున్న ఒక అతీతమయిన శక్తి ఆమె. ఈ రోజు ఆమె ఎడారి లోప్రయాణం చేస్తున్నాకూడా, దాహార్తి తీర్చే ఎడారి కొలను కోసం ఆమె చేస్తున్నఅన్వేషణ ప్రశంసనీయం. ఆ ప్రయాణం ఆమె ఒక్కదానికోసమే కాదు, ఒక రోజు ఆమె సేదతీర్చేఎడారికొలను గా మారిపోవచ్చు. ఆమెని తదేకంగా ఆరాధనా భావనతో చూస్తున్న ప్రసాద్ ని ,”ప్రసాద్ గారు, మీరు కాఫీ తాగేశారు. ఎదో ఆలోచనలో ఉన్నారే! లేవండి వెళదాము,” అంటూ గలగలా నవ్వేసింది.
******************************
కొన్ని నెలల తరువాత, చేయూత సంస్థ నుండి ఫోన్ వచ్చింది. ఆ రోజు వర్షం గా కూడా ఉన్నది. వసంత ఫోన్ లో చెప్పింది ,” అక్క! జ్యోతి కి నెప్పులు వస్తున్నాయి. ఎం చేయమంటావు?”
“అవునా! చాలా ఎక్కువగా ఉన్నాయా? సరయిన టైం కె ఆమెకి ప్రసవం నొప్పులు వస్తున్నాయి కదా?”
“అవునక్క. క్రితం సారి కమలమ్మ గారు జ్యోతి ని చెకప్ కి తీసుకెళ్లారు ఇక్కడే ఉన్న ఆరోగ్య కేంద్రానికి. మొదటి నుండి అక్కడే చూపె డు తున్నాము. అక్కడి లేడి డాక్టర్ మాధవి గారు మంచి గైనే అన్న పేరుంది కూడా. ఆమె కొద్దీ రోజులకి ఆమెకి ప్రసవం కావచ్చని చెప్పారట.”
“అలాగా అయితే వెంటనే తనని ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లండి. తోడుగా రమణమ్మ గారి ని , కమలమ్మ గారిని పంపించు. నేను బయలుదేరి వస్తాను. జ్యోతి కి ధైర్యం చెప్పండి.” అని ఫోన్ పెట్టేసి, జానీ త్వరగా కారు తీయి అని చెప్పి రాంబాయమ్మ గారి గది లోకి వెళ్ళింది. “ పెద్దమ్మ! జ్యోతి కి నెప్పులు మొదలయ్యాయని ఫోన్ వచ్చింది నేను వెళుతున్నాను,” అంది.
” నేను కూడా వస్తాను. కాస్త తోడుగా ఉండొచ్చు,” అంటూ బయలు దెరపోయింది.
“అయ్యో, మీరు అక్కరలేదు నేను వెళ్లి చూస్తాను. మీకు అసలే బీ పీ కాస్త ఎక్కువగా ఉన్నది. రెస్ట్ తీసుకోండి,” అని చెప్పి, “రమణి! నేను జానీ సత్తెన పల్లి వెళుతున్నాము. ఏదయినా అవసరముంటే ప్రసాద్ గారికి ఫోన్ చేయి. నేను రేపు ఉదయానికల్లా తిరిగివచ్చేస్తాను ,” అని చెప్పి తన బాగ్ లో కొంత డబ్బులు పెట్టుకొని వెళ్లి పోయింది.
వాళ్ళు సత్తెన పల్లి చేరేసరికి రాత్రి ఎనిమిది గంటలయింది. నేరుగా ఆరోగ్య కేంద్రానికే చేరుకుంది. ఆమెని చూస్తూనే జ్యోతి అక్క వచ్చావా ,”చాలా నెప్పులు వస్తున్నాయి,”అంది బేలగా. రమణమ్మ గారు పక్కనే ఉంది,” పరవాలేదు జ్యోతి మైత్రేయి అక్క కూడా వచ్చేసింది కదా. డాక్టర్ మేడం కూడా ఇప్పుడే వస్తానని వెళ్లారు. నువ్వేమి కంగారు పడకు. అంత సవ్యం గా నే ఉంటుంది,” అంటూ ధైర్యం చెప్పింది.
డాక్టర్ మాధవి రాగానే , జ్యోతి ని లేబర్ రూమ్ లోకి తీసు కెళ్లారు. ఒక గంట కల్ల సుఖ ప్రసవం అయింది జ్యోతి కి. ముద్దు గా ఉన్న పాపాయి పుట్టింది. అందరి కళ్ళలో వెలుగు, ఒక సంతృప్తి. పాపకి స్నానం చేయించి మైత్రేయి ఇచ్చిన మెత్తటి తెల్లటి నేత చీరలో చుట్టి తెచ్చి గదిలో పడుకో బెట్టారు.
జ్యోతి అలసి సొమ్మసిల్లి నట్లుగా కాస్త మగతలో ఉన్నది.ఏమి తెలియని ఒక అమాయకురాలయిన జ్యోతి కి జరిగిన అన్యాయానికి న్యాయం జరగలేదు కానీ, మరొక అందమయిన పాప ఈ ప్రపంచంలోకి అడుగు పెటింది. ఈ పాపకి తానుండబోయే ప్రపంచం గురించి ఏమి తెలియదు అమాయకం గా , దైవత్వం నిండిన ముఖం తో పడుకోనున్న ఆ పాప ఒక అద్భుతం. అందరికి ఒక ఆశ జ్యోతి.
అలా పాపనే చూస్తూ కూర్చున్న మైత్రేయి తలను నిమురుతూ ,”ఇదే ఆ భగవంతుడి లీల. ఎవరు ఎక్కడ ఎందుకు జన్మిస్తారో, వారి జన్మకి కారణం ఏమిటో అంత ఆభగవంతుడే నిర్ణయిస్తాడు. ఈ పాప మనందరికీ జ్యోతి ద్వారా ఆ భగవంతుడిచ్చిన ప్రసాదం. జాగర్తగా కాపాడుకుందాము,” అన్నది రమణమ్మ. మైత్రేయి ఇంటికి ఫోన్ చేసి రమణి కి చెప్పింది పాప పుట్టిందని. ప్రసవం మామూలుగానే కావడం తో రెండో రోజుకే ఇంటికి తీసుకెళ్లమని చెప్పింది డాక్టర్ మాధవి.
రమణమ్మ , కమలమ్మ వాళ్లకు జాగర్తలు చెప్పి ఉదయాన్నే తెనాలి చేరుకుంది మైత్రేయి.
(ఇంకా ఉంది)