ఒడిపిళ్ళు -25 వ భాగం

ధారావాహిక నవల

కొండలు లోయలు ఈ ప్రకృతి అంతా మనుషుల అవసరానికి అనుగుణంగా భగవంతునిచే సృష్టించ పడ్డది. కొండజాతి, పరజ జాతి అనేవి రెండు గిరిజన తెగలు. వారికి వేరు వేరు ప్రత్యేకమైన ఆచారాలు ఉన్నాయి. కొండ జాతి వారికి ప్రత్యేకంగా జ్యోతిష్యులు ఉన్నారు. వారు నక్షత్రాలను వాటి చలనాలను అనుసరించి పనులు చేయమంటారు. పెళ్లిళ్లు, వ్యవసాయ పనులు ప్రారంభం చేయటానికి ముహూర్తాలు సూచిస్తూ ఉంటారు. అంతేకాక వారు కరువులు వచ్చేది, వర్షం వచ్చేది ముందుగానే ఈ గిరిజన జాతికి తెలియజేస్తూంటారు. జరగబోయే చెడు నుండి విపత్తు నుండి తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్తుంటారు.

కానీ పరజ జాతికి ‘దిసారీ’ అనే జ్యోతిష్యుడు ఉంటాడు. తరాల ముందు అప్పగించబడిన అనుభవాలను కారణంగా చూపిస్తూ ఆ జ్యోతిష్యుడు జోస్యం చెప్తాడు. ఆధారాలతో సహా భవిష్యత్ గురించి పంచాంగం ద్వారా చెప్తాడు. అవన్నీ తాళపత్రాలపై వ్రాసి వుంటాయి. పరజ జాతి గిరిజనుల కొరకు ‘దిసారీ’ చెప్పిందే వేదం. అతడు వారికి నమ్మకాన్ని కలిగిస్తూ, నియమ నిబంధనలను ఆచారలను , వ్యవసాయ పద్ధతులను, ఆ సంవత్సరంలో జరగవలసిన శుభకార్యాలను నిర్ణయిస్తూ ఉంటాడు. ఆ విధంగానే వారంతా నడుచుకుంటారు. అతను అన్ని విషయాలను పూర్వీకుల గురించి దైవశక్తి గురించి చెప్తూ తమ కోరికలు నెరవేరాలంటే ఏం చేయాలో వివరిస్తాడు. ఒక శిశువు జన్మించినపుడు గతించిన ఎవరి ఆత్మ పునర్జన్మ ఎత్తిందో ‘దిసారీ’ చెప్తాడు. అతను చెప్పే భవిష్యవాణికి సాయంగా ఒక రకమైన భాషను ఉపయోగిస్తాడు. దానిని ‘బెజూ’ అంటాడు. మగ పిల్లవాడు అయితే ‘బెజు’ అనీ , ఆడ శిశువు అయితే ‘బెజూరీ’ అని అంటాడు. వారిలో మరణించిన వారి ఆత్మ కలిగి ఉందో, లేదా గిరిజనుల దేవతల అంశ ఉందో చెప్తాడు. ఆత్మల లేదా దేవతల పేర్లను ఉటంకిస్తాడు. తాత్కాలికంగా మానవాతీతమైన శక్తులు ఉన్నట్టు జోస్యము చెప్తాడు. ప్రతి గ్రామంలో ఒక బెజూ ఉంటారు. బెజూలను మానవాతీత శక్తులైన ఆత్మలు, దేవుళ్ళు పూనుతారు.. అట్లా వారి ద్వారా ఆత్మలు కానీ దేవతలు గాని మాట్లాడతాయి. దిసారీ, బెజూలు చెప్పే మాటలను పరజ గిరిజనులకు వివరిస్తూ ఉంటాడు.

వసంతోత్సవం ప్రారంభం గురించి చాలా జాగ్రత్తగా లెక్కలు వేసి భవిష్యత్తుచెప్పి, వారు గిరిజనులకు వివరిస్తారు. కొండ జాతి జ్యోతిష్యుడు తన సొంత గణనలను నక్షత్రాల ద్వారా చేస్తాడు. పరజజాతి దిసారీ పంచాంగం ప్రకారం నిర్ణయిస్తాడు. ఎవరి పధ్ధతి వారు అనుసరించినా చెప్పే ఫలితాలు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. కానీ ఈ రెంటి మధ్య చిన్న తేడా ఉంటుంది. వారి వారి అనుకూలాలను అనుసరించి పండుగ ఆరంభం జరుగుతుంది. వసంతదేవుడు ఆవాహన చేసుకునేందుకు కొండ జాతి పూజకు సంబంధించిన కర్మలను ఖచ్చిత సమయాన్ని పాటిస్తారు. అది ఏనుగుల కొండపై రెండు నక్షత్రాలు కనపడినప్పుడు ప్రారంభిస్తారు.

అడవిలో మూడు జింకలు అరవడాన్ని, పరజజాతికి సరైన సమయం, దాన్ని దేవుని పిలుపుగా భావిస్తారు. చివరికి గ్రామ పూజారి ఒక పరిష్కారం చెపుతాడు. జింకలు అరిచినప్పుడు పరజజాతి ఒక కోడిని బలిఇవ్వాలి. కొండజాతి రెండు నక్షత్రాలు కనపడ్డపుడు పావురాన్ని బలి ఇవ్వాలి. ఇవి రెండు బలులు జరిగే మధ్యకాలంలో గ్రామ పెద్ద మెడలో ఒక తాడు వేసుకొని నోటిలో గడ్డిపరక ఒక దాన్ని పళ్ళతో పట్టుకొని బలిపీఠం ముందు నేల మీద సాష్టాంగ పడి తన ముఖం నేలకు ఆన్చి వినయంగా ప్రార్థిస్తాడు. భగవంతుడు దర్శనం ఇవ్వడానికి ఎటువంటి ఆటంకం లేదని మనిషి కంటికి కనిపించకుండా ప్రత్యక్షమవుతాడు .

ఈ ప్రార్థన తర్వాత వసంతోత్సవం మొదలవుతుంది. గ్రామస్తులంతా ఊరేగింపుగా పూజాస్థలం వద్దకు వచ్చి దేవుణ్ణి ప్రార్థిస్తారు, వేడుకుంటారు. తర్వాత పండుగ పాటలు పాడుతారు. ఆ పాట ఇలా సాగుతుంది:

ఆనందాన్నిచ్చే ఓ దైవమా

ఓ పాటల దైవమా

ఓ నాట్యాల దేవుడా

రా వచ్చి మాకు ఆనందాన్ని ఇవ్వు

మాకు అతిథిగా రావయ్యా

మేము నీకోసం కాచిన ఈ మద్యాన్ని గ్రహించు మేము అర్పించిన కోడిని ఆరగించు, అంగీకరించు ఈ విందు కొనసాగుతూండగా మాతో ఉండు

ఆ తర్వాత నీ ఇంటికి తిరిగి వెళ్ళు

ఇప్పుడు మాత్రం దయచేసి రా

రా దేవుడా రా రావయ్య రా

….

దేవుడు దట్టమైన అడవిలో జీవిస్తాడు. కేవలం గాలిని మాత్రమే సేవిస్తాడు. కనీసం మనిషిని తాకిన గాలి కూడా అతనికి అంటరానిదే. మనిషి నడిచిన నేల పై నడవడు, దేవుడు జీవించే స్వర్గం పక్కనే ఉంటారు ‘వసుమతి’ అనే భూమి దేవత, ‘జాకర్’ అనే రుతువుల దేవత, ‘బాగ్ డెప్టా’ అనే అడవి జంతువులను పులులను పరిపాలించే పులుల దేవత , మనుషులను, పశువులను తినే కౄర జంతువుల దేవత.

ఈ దేవుళ్ళందరూ ఆ దేవాలయం లేదా అక్కడి పూజా స్థలం వద్ద ఉంటారు.

అది మడతలు మడతలుగా ఉన్న కొండ ప్రాంతాల్లో లోతైన లోయలతో కూడిన దట్టమైన అడవిలో ఉంటుంది. మహా వృక్షాలు చిక్కటి తీగలు ఒకదానితో ఒకటి అల్లుకుంటూ ఆ చెట్టు కొమ్మలకు పాకి ఉంటాయి. అన్నీ కలిసి ఆకులతో అల్లిన వల వలె ఉన్నది. ఆ వల నుండి వెన్నెల నేలపైకి జల్లెడ పట్టి నట్టు పడుతుంది. చెట్ల నుండి నేలకు వేలాడుతూ అడవి తీగలు దేవతల కొరకు ఉయ్యాల కట్టినట్టుగా ఉంటాయి. పొడవైన భయంకరమైన సాల్ వృక్షాల నీడలు ఏటవాలుగా కిందకు లోయల్లో గుహల్లో దేవతల కోసం వ్యాపించి పొద్దున్న సాయంత్రం నాట్యం చేస్తూంటాయి. ఎక్కడ పుట్టినయో తెలియని చిన్న చిన్న సెలయేళ్ళు పరిగెత్తుతూ వచ్చి తమ చేతులను కలిపి నాట్యం చేస్తుంటాయి. చల్లని గాలికి రకరకాల అడవి పువ్వులు ఊగుతూ ఆ నాట్యంలో పాల్గొంటాయి. అందమైన నెమళ్ళ బృందాల నాట్యాలు ఆ సృష్టి సంపదను మరింత అలంకరిస్తాయి.

సూర్యాస్తమయ సమయానికి ఉత్సవం మొదటి కార్యక్రమాలు అయిపోతాయి. గ్రామస్తులంతా ఒక చోట కూడి ఊరేగింపుగా అడవిలో నడుస్తూ వసంతోత్సవ దేవుణ్ణి ఆహ్వానిస్తారు. వారంతా నిటారుగా ఉన్న కొండలను ఎక్కుతూ, గంధపు చెట్లు, సాల్, బిజా వృక్షాలున్న దట్టమైన అడవిలో ప్రయాణీస్తూంటారు. ఆ చెట్ల కింద నుండి సెలయేళ్ల ప్రవాహం పెరిగి లోయల్లోకి సాగుతూ ఒడ్డున ఉన్న మొక్కల అన్నింటిని కలుపుకొని ప్రవహిస్తుంటాయి. ఆ ప్రవాహాలు ఒక ఆటవిక జంతువు లాగా కనిపిస్తుంది. ఎత్తయిన పర్వతాలు నిరాటంకంగా నిలబడితే ఒకవైపు లోతైన లోయలు.

గ్రామస్తులంతా రెండు వరుసలుగా నడుస్తూ ఉంటారు పురుషులంతా ఒక గుంపుగా స్త్రీలంతా ఇంకొక గుంపుగా వారు నడుస్తున్నంత సేపు డ్రమ్ములు మోగిస్తూ నాట్యం చేస్తూ ఉంటారు. వారంతా శిఖరాన్ని చేరిన సమయానికి ఆకాశం అంతా ఇత్తడి పసుపురంగులో మారింది, నెమ్మదిగా అది చీకటిగా మారింది. అక్కడి నుంచి చూస్తే ఆ దృశ్యం కనుచూపుమేర మచ్చలు మచ్చలుగా కనిపిస్తోంది . అడివంతా ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంది .

కొండ దిగి లోయల వైపు వారి మార్గం కొనసాగుతూ ఉంది. అడవి జంతువుల పరుగుల శబ్దం విని, వారు డ్రమ్ముల మోతను ఇంకా పెంచారు. చివరికి పూజా స్థలానికి చేరారు. ఆ మందిరము అనబడే పూజా స్థలము చాలా పురాతనమైనది , అతి పెద్దదయిన ఒక మామిడి వృక్షం. ఒక సరస్సు ఒడ్డున ఉన్న ఈ చెట్టు బాన పొట్టతో చేతులు చాచి ఉన్న ఒక మనిషి లాగా కనిపిస్తుంది. చెట్టు బోదె అంతా ముడులు కలిగి ఉన్నది. చెట్టంత పూలు మొగ్గలతో కనిపిస్తుంది. ఎక్కడ కొమ్మలే కనిపించడం లేదు. కిరీటం లాగా ఎర్ర ఎర్రని లేత చిగుళ్ళు, తోరణాలు కట్టినట్టుగా పళ్ళతో నిండి ఉన్నది. అందంగా కనిపిస్తూ ఆశా భావాన్ని కలిగిస్తూ ఉన్నది. రెండు బలమైన కొమ్మలు ఇరువైపులకు పెరిగి చేతులు చాచినట్టు కనిపిస్తూ ఉంటే గులిజీ తీగలు భుజాల పైనుండి నడుము చుట్టూ పాకి బ్రాహ్మణుల యజ్ఞోపవీతం వలె కనిపిస్తున్నది. పైభాగంలోని కొమ్మలన్నీ అటవీ తీగల పువ్వులతో పూలదండలు అలంకరించి నట్లున్నాయి. తెల్లని మల్లెల వాసనలతో నిండి ఉన్నది. ఎరుపు పసుపు రంగుల పులి పంజాల వంటి పూలు చెట్టుపై ఉన్నవి. పెద్ద పగడపు రంగు ఫలాలు మహాకాల తీగ నుండి చెట్టు చుట్టూ వేలాడుతూ ఉన్నవి. అవి మెడ చుట్టూ పూలహారాల వలె, పూసలదండల వలె కనిపిస్తున్నాయి. ఆ మహా మామిడి వృక్షం మొత్తానికి దివ్యంగా అందంగా శక్తివంతంగా ఆటవికంగా స్వేచ్ఛగా స్పూర్తి దాయకంగా ఆశ్చర్యకరంగా భక్తి పూర్వకంగా కనిపిస్తున్నది.

గిరిజనులంతా వారితో తెచ్చిన పవిత్రమైన కుంకుమను నీటితో తడిపి ఆ చెట్టు మొదలుకు కొంత పులిమేరు. పావురము, కోడిపెట్ట బలి ఇచ్చేందుకు సారాయిని శాఖగా నేల మీద పోసారు. రకరకాల రంగు పొడులతో ముగ్గులు వేశారు. డ్రమ్ములు డప్పులు ఉగ్రంగా మోగిస్తూ, అందరూ కలిసి గట్టిగా అరుస్తూ, నాట్యం చేస్తూ నిద్రలో ఉన్న దేవుడిని మేల్కొనమని ప్రార్థించారు. ఒక్కసారిగా హోరంతా సద్దుమణిగి ఆగిపోయింది. పూజారి పైకి అందరికీ కనిపించే విధంగా ఆకాశం వైపు కాగడాను పైకి లేపి పట్టుకొని, దేవుడిని ఆహ్వానిస్తూ మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు.

“ఓ శక్తివంతమైన వసంత దేవుడా మేలుకో.. నిద్రను వదిలించుకో..

చూడు, అన్ని వృక్షాలు పువ్వులతో నిండిపోయాయి. చైత్రమాస చంద్రుడు ఆకాశంలో ఉదయించాడు. మేమంతా నీ గౌరవార్ధం నాట్యం చేసేందుకు సిద్ధంగా ఉన్నాము.

యువతీ యువకులు నీకోసం వేచి ఉన్నారు.

నిద్ర మేలుకో, నిద్ర నుండి బయటికి రా..

యువకులు నిన్ను స్మరిస్తూ, తమ ప్రియురాళ్లతో కలిసి నిలబడ్డారు.

భూ దైవమా చూడు..

ఒకరి చేతులు మరొకరు పట్టుకొని తాడి చెట్టు కింద వేచి వున్నారు.

వారి పాటలకు నీవే ప్రేరణ.

ప్రేమికుల కళ్ళు వెలిగే కాంతి నీవే.

నీవు మాత్రమే ఈ నేల పైకి, కొత్త శిశువులకు జన్మనివ్వగలవు.

మీకు స్వాగతం పలుకుతూ.. ఈ మామిడి చెట్టు పళ్ళు రాలుస్తోంది.

బంజరు భూములు, రాతినేలలు దున్నేందుకు నీ దయవల్ల బలమైన చేతులకు కొరత లేదు.

మేలుకో దేవుడా…

చెట్లన్నీ ఆకులను రాల్చడం మొదలు పెట్టాయి. అడవిలో నిప్పు అంటుకోడం కనపడుతుంది. పొదలలో దాగిన క్రూర జంతువులు బయటికి వస్తున్నాయి.

అడవి పందుల మందలు ఇసుక తిన్నెలపై తిరుగుతున్నాయి.

చుక్కల జింకలతో, పంగలు చీలిన చెట్లకొమ్మల వంటి కొమ్ములతో పెద్ధ రాజుజింక కొండలోయల్లో అంతటా తిరుగుతూన్నది. అడవి కుందేళ్ళు లెక్కలేనన్ని తిరుగుతున్నాయి.

రా దేవుడా.. వేటలో మాకు దారి చూపు దేవుడా.. మనమంతా కలిసి విందు చేసుకుందాం..

వృద్ధుల ఎవరైతే గతించి పోయారో వారి కోసం విచారించ లేము. జీవితమంటేనే అది.

ప్రతి ఒక్కరం వెళ్ళవలసిన వారమే..

కానీ, ప్రతి సంవత్సరం వసంతం వస్తుంది.

ప్రతి సంవత్సరం చైత్రమాసంలో

నీకోసం ఈ కర్మలను వేడుకగా చేస్తాము.

ఈ పవిత్రమైన లోయల్లో

నీవు ఎక్కడ ఉన్నావు దైవమా..

మీ దయవల్ల మామిడి వృక్షాలు తిరిగి ఫలించాలి. మా పొలాలలో పంటలన్నీ బాగా పండాలి.

మా పశువులన్నీ అభివృద్ధి చెందాలి. మనుషులందరూ వర్ధిల్లాలి.

ఈ నేలమీద అడవులు, కొండలు, లోయలన్నీ విలసిల్లాలని మా ప్రార్ధన.

వసంత దేవుడా మేలుకో..” అంటూ ఆహ్వానం పలికాడు.

వసంత గాలి చిన్నగా మొదలై పెనుగాలిలా మారింది. మామిడి చెట్టు ఊగుతూ.. ఎన్నో మామిడి పండ్లను నేలపై రాల్చింది. ఇది భగవంతుడు తమ ప్రార్థనను అంగీకరించినట్టు సంకేతము. దేవుడు ఆవిధంగా తనకు తాను ప్రత్యక్షమయ్యాడు. కాగడాలన్నీ చీకట్లో వెలిగాయి. వాయిద్యాలన్నీ గట్టి గట్టిగా మోగుతున్నాయి. స్త్రీ పురుషులందరూ భక్తి ఉన్మత్తతతో నృత్యం చేస్తున్నారు. బలి ఇచ్చిన వాటి రక్తం అగ్నిలో సమర్పించారు. వెండి వెన్నెలతో సన్నటితీగ వలె చంద్రుడు కొండపై ఒకవైపు కనిపించాడు. నెలపొడుపు అంటాము కదా..

వికృతమైన నీడలు ఆ కొండలపై కదులుతున్నాయి. వంకరటింకర గీతల చీకట్లు కనిపిస్తున్నాయి. ఒక గిన్నెలో నల్లటి గీతల వలె ఆ కొండ కోనల్లో నీడలు, మచ్చలు మచ్చలుగా కాగడాలతో కలిసిపోయాయి. సున్నితమైన అల్లికతో నేర్పుగా వల అల్లినట్టుగా కనిపిస్తున్నాయి. ప్రతి రాయిలో ప్రతి పొదలో జీవం వచ్చింది. అంతటితో ఆ పూజ అయిపోయింది.

పంక్తులుగా ఏర్పడిన గిరిజనులు నెమ్మదిగా కొండ పక్కనుండి కాగడాలు పైకి ఎత్తి పట్టుకొని నడుస్తున్నారు. చూడడానికి అది మండుతున్న పెద్ద కాళ్ళ జెర్రీ కొండల పక్కన పాకుతున్నట్టు ఉన్నది. .

*** *** *** *** ***

 

Written by Jwalitha

కవి, రచయిత, అనువాదకురాలు, ఫ్యామిలీ కౌన్సిలర్, సామాజిక కార్యకర్త, ప్రచురణకర్త, ప్రకృతి ప్రేమికురాలు, తెలంగాణ ఉద్యమ కారిణి అయిన జ్వలిత అసలు పేరు విజయకుమారి దెంచనాల.
‘బహళ’ అంతర్జాతీయ అంతర్జాల త్రైమాసిక మహిళా పత్రికను 2021నుండి నడుపుతున్నారు.
వీరి రచనలు-
కాలాన్ని జయిస్తూ నేను, సుదీర్ఘ హత్య, అగ్ని లిపి, సంగడి ముంత అనే నాలుగు కవితా సంపుటులు; ఆత్మాన్వేషణ, రూపాంతరం అనే రెండు కథల సంపుటులు; జ్వలితార్ణవాలు అనే సాహిత్య సామాజిక వ్యాసాల పుస్తకం; ఎర్రరంగు బురద, ఆత్మార్ణవం, జగన్నాటకం, ఒడిపిళ్ళు అనే నాలుగు నవలలు మొత్తం 11 పుస్తకాలు రచించారు. ముజహర్ నగర్ లో దీపావళి, ‘పరజ’ వంటి అనువాదాలతోపాటు, బహుజన కథయిత్రుల పరిచయం, మెరిసే అనువాదాలు, అనువాద నవలలు పేరుతో శీర్షికలను నిర్వహించారు.
స్వీయ సంపాదకత్వంలో ఖమ్మం కథలు, మల్లెసాల చేతివృత్తికథలు, కొత్తచూపు స్త్రీల కథలు, పరివ్యాప్త, సంఘటిత, రుంజ, కరోనా డైరీ, లేఖావలోకనం, గల్పికా తరువు, ఓరు వంటి పదో సంకలనాలను ప్రచురించారు. గాయాలే గేయాలై, పూలసింగిడి వంటి అనేక పుస్తకాలకు సహసంపాదకత్వం వహించారు.
మర్డర్ ప్రొలాంగేర్, వుండెడ్ లైవ్స్ పేరుతో వీరి కవిత్వం ఆంగ్లానువాద పుస్తకాలు వెలువడ్డాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

“శుభ ముహూర్తం”- 7వ భాగం

కాటుక కంటి నీరు