ఓ ప్రేమ కథ- 3వ భాగం

ధారావాహిక నవల

జరిగిన కథ
రాగమాల మోహన్ మధ్యలో స్నేహం చిగురించింది. అంతకుముందు అసలే మాట్లాడని మోహన్ ఇప్పుడు పలకరిస్తూ ఉన్నాడు అప్పుడప్పుడు ఇంటికి వచ్చి ఏదైనా అవసరమున్న సహాయం కూడా చేస్తున్నాడు. ఒకరోజు శివరాత్రి జాగరణ చేయడానికి వాళ్ళ అక్క ఒక్కతే ఉందని ఇంటికి రమ్మని పిలిచాడు..
______

రాగమాల తన స్నేహితురాలు రమణి ఇంటికి వెళ్ళింది. వాళ్ళ నాన్నగారు బాటనీ లెక్చరర్. రమణి, రాగమాల చాలా క్లోజ్ గా ఉండేవారు.

వాళ్ళింటికి వెళ్లిన తర్వాత, ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ వచ్చారు. ఆ తర్వాత కెమిస్ట్రీ లెక్చరర్ కొడుకు, మరో ఇద్దరు అబ్బాయిలు వచ్చారు. ఎందుకో రాగమాలకి అలా అబ్బాయిలు రావడం అంతగా ఇష్టం అనిపించలేదు. “అనవసరంగా వచ్చాను. మోహన్ వాళ్ళ ఇంటికి వెళ్లిన బాగుండేది” అని అనుకున్నది. మగ పిల్లలు బయట రూం లో కూర్చున్నారు.వెళ్ళిపోదామని అనుకుంటే అంత రాత్రి సమయంలో వెళ్లడం సేఫ్ కాదని తెల్లవారుజామున ఐదు గంటలకు ఇంటికి వెళ్ళిపోయింది.

ఇంటికి వచ్చి నిద్ర తేలిపోవడానికి స్నానం చేసింది. తండ్రి అప్పటికే స్నానం చేసి దేవుడు పూజ చేసుకొని వంట ప్రయత్నంలో ఉన్నారు.

“నాన్న అప్పుడే వంట చేస్తున్నావా?”అని అడిగింది రాగమాల.

“అవునమ్మా నిన్నంతా ఉపవాసం కదా తొందరగా భోజనం చేద్దాం”అని అన్నాడు.

భోజనం చేసి రాగమాల కాలేజీకి దక్షిణామూర్తి గారు ఆఫీసుకు వెళ్లిపోయారు.

ఒకరోజు ఇంటికి వచ్చిన మోహన్ చాలా కోపం తో…

“ఎందుకు మా ఇంటికి రాలేదు”అని అడిగాడు.

“సారీ! మోహన్ !రమణి వాళ్ళ ఇంటికి వెళ్ళాను .కానీ అక్కడ నాకు నచ్చలేదు”అని చెప్పింది రాగమాల.

ఒకసారి దక్షిణామూర్తి గారు మోహన్ ని పిలిచి “శని, ఆదివారాలు నేను ఉండను కదా! రాగమాలకి ఏదైనా అవసరం పడితే తెచ్చి పెడతావా” అని అడిగాడు.

“అలాగే తెచ్చి పెడతానండి” అని చెప్పాడు సిన్సియర్గా మోహన్.

ఈ విషయంలో దక్షిణామూర్తి గారు దొంగకు తాళం చేయి అప్ప చెప్పినట్లు అయింది.

మోహన్ మార్కెట్ కు వెళ్లేటప్పుడు వీళ్ళ ఇంటి ముందు నుండి వెళ్లే వాడు. కూరగాయలకు వెళ్ళేటప్పుడు వచ్చి “ఏమైనా కూరగాయలు కావాలా రాగమాలా?”అని అడిగేవాడు.

ఒక్కొక్కసారి తాను తెచ్చుకున్న కూరగాయలు ఒకటో, రెండో ఇచ్చి వెళ్లేవాడు. ఒకరోజు ఉదయం రాగ మాల రికార్డ్స్ రాస్తూ, ఒక పక్కన టీ గ్లాసు పెట్టుకొని కూర్చుంది .

మోహన్ వచ్చాడు.
” టీ తాగుతావా?” అని అడిగింది రాగమాల

“తాగుతాను, నీ పక్కన గ్లాసులో ఉంది కదా! నువ్వు తర్వాత టీ పెట్టుకుని తాగు”అని గ్లాస్ అందుకుని తాగేశాడు.

“అయ్యో! నా టీ తాగేసావ్ ఏంటి? నేను ఎంగిలి చేశాను”అన్నది రాగమాల కంగారుగా.

“ఓ అవునా? ఏం కాదులే ఎంగిలి అయితే ఏముంది”అంటూ వెళ్లిపోయాడు మోహన్.

కొన్ని నెలల తర్వాత అదే వీధిలో రాగమాల, మోహన్ చదివే కాలేజీలో మరొక అబ్బాయి వచ్చాడు. అప్పుడు రాగమాల ఊరికి వెళ్ళింది. వాళ్ళ ఊరికి వచ్చిన నాన్నగారు రాగమాలతో చెప్పాడు.

“మన పక్క క్వాటర్స్ లో నీ క్లాస్ అబ్బాయి చేరాడు. వాళ్ళ నాన్న నాకు ఫ్రెండ్.ఆ అబ్బాయి నీ గురించి చాలా అడిగాడు”అని చెప్పాడు.

“అవునా!అడిగాడా? అతని పేరేంటి?”అన్నది రాగమాల.

“అతని పేరు ఉదయ్”అని చెప్పాడు దక్షిణామూర్తి.

“ఏమో నాన్న! నాకు ఎక్కువగా ఎవరూ తెలియదు. అందులో క్లాసు అయిపోగానే మేము లేడీస్ రూమ్ లో కూర్చుంటాము”అని చెప్పింది రాగమాల.

కొన్ని రోజులకి టౌన్ కి వచ్చింది రాగమాల.

అప్పుడే పక్కనే ఉండే ఉదయ్ నీ పిలిచాడు దక్షిణామూర్తి.

“ఇదిగో మా అమ్మాయి రాగమాల. అతని పేరు ఉదయ్”అని పరిస్ప రం పరిచయం చేశాడు దక్షిణామూర్తి.

ఎందుకో రాగమాలకి ఆ అబ్బాయి నచ్చలేదు. మొహం కొంచెం చిట్లించి లోపలికి వెళ్ళిపోయింది.

రోజు కాలేజీకి వెళ్లడం రావడం మామూలుగానే జరుగుతుంది.

దక్షిణామూర్తి గారు ఎనిమిదిన్నరకు ఆఫీస్ కి వెళ్లి పోయేవారు. వీళ్ళ కేమో పదకొండు గంటలకే కాలేజీ.

ఒక అరగంటకు ముందు రాగమాల తయారయ్యి ,బుక్స్ సర్దుకొని ముందు రూమ్లో కూర్చునేది. అప్పుడే ఉదయ్ వచ్చేవాడు. ఏదో వంకన మాట్లాడిస్తుండేవాడు. తప్పదని మాట్లాడేది రాగమాల.

ఈ విషయం మోహన్ కి చెప్పింది రాగమాల.

“అవును నాకు తెలిసింది. ఈ రూట్ లో నుండి వెళ్లే వాళ్ళు కొంతమంది, అతను మీ ఇంట్లో నిలబడి మాట్లాడడం చూశారట .మీ ఇద్దరి మధ్య ఏదో ఉంది అని మాట్లాడుకుంటున్నారు .నాకు చాలా కోపం వచ్చింది. అతనితో మాట్లాడటం మానేసెయ్యి”అన్నాడు మోహన్.

“నిజమా? మరి చెప్పొచ్చు కదా! దాదాపు నెల రోజుల నుండి ఇలా ఇబ్బంది పెడుతున్నాడు. ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. వాళ్ళ నాన్న గారేమో మా నాన్నకు స్నేహితుడు. నువ్వు చెప్పొచ్చు కదా మోహన్”అన్నది రాగమాల.

“సందర్భం రాలేదని చెప్పలేదు. ఇప్పుడు చెప్పాను కదా! ఇప్పటికైనా కట్ చెయ్”అన్నాడు అథారిటీగా రాగమాల ను చూస్తూ.

మరుసటి రోజు నుండి ఉదయ్ వచ్చి నిలబడ్డా కూడా రాగమాల రెస్పాన్స్ ఇచ్చేది కాదు. అయినా కూడా వచ్చి నిలబడే వాడు. అలా కొన్ని రోజులు చేశాక అతను రావడం మానేశాడు.

చాలామంది అబ్బాయిలు అమ్మాయిలని ప్రేమలో దించడానికి ఏదో విధంగా ప్రయత్నం చేస్తుంటారు కానీ ఏ అమ్మాయి కూడా అలా మాటలకు పొంగిపోయి వారితో స్నేహానికి కానీ ప్రేమకు కానీ ఒప్పుకోదు. వాళ్ల ప్రవర్తన నచ్చితే కొంచెం మనసులో మంచి భావం ఏర్పడుతుంది.

“హమ్మయ్య” అని ఊపిరి పీల్చుకుంది రాగమాల.

మోహన్ ఒకసారి వాళ్ళ ఊరికి వెళ్ళాడు
ఇంట్లో ఏదో ఫంక్షన్ అని చెప్పాడు. వచ్చేటప్పుడు డైరెక్ట్ గా రాగమాల దగ్గరికి వచ్చాడు. వాళ్ల అమ్మ కట్టించిన జంతికలు, రవ్వ కేసరి రాగ మాలకు ఇచ్చాడు.

“ఇవన్నీ నాకెందుకు? నువ్వే తీసుకెళ్ళు”అని చెప్పింది రాగమాల.

“ఇద్దరం తిందాం లే! అమ్మ నా కోసం పెట్టిచ్చింది. వాళ్ళందరూ ఊర్లోనే ఉన్నారు. ఇంటికి వెళ్తే ఒక్కడినే. ఎలాగూ నువ్వు కూడా ఒక్క దానివే ఉంటావు కదా! రాత్రికి డిన్నర్ చేసుకోకున్నా పరవాలేదు”అన్నాడు మోహన్

ఇద్దరూ తినేశారు. ఇంతలో పక్క ఇంట్లో ఉన్న అమ్మాయి చదువుకోవడానికి వచ్చింది.

ఆమె వచ్చాక కాసేపు మాట్లాడి మోహన్ వెళ్ళిపోయాడు.

ఇంతలో అనుకోని సంఘటన ఎదురయ్యింది

అంతా బాగుంది అనుకున్న సమయంలో దక్షిణామూర్తి గారికి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయింది.

దక్షిణామూర్తి గారికి ఆందోళన మొదలయ్యింది. సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ కాలేదు.రాగ మాలను ఒక్కదాన్ని ఎలా ఉంచాలో అర్థం కాలేదు. ఒక స్నేహితుడి ఇంట్లో చిన్న గది ఉంటే, అది అద్దెకి తీసుకొని అందులో ఉంచుదాము అని అనుకున్నాడు. వాళ్ళ ఇల్లు చూసి వచ్చింది రాగ మాల. ఎందుకో అక్కడ ఉండాలని అనిపించలేదు. తండ్రితో అదే విషయం చెప్పింది.

“నెల రోజులు ప్రిప రేషన్ హాలిడేస్ ఉన్నాయి కదా! ఆ తర్వాత ఎగ్జామ్స్ టైం లో అమ్మను పంపిస్తాను. నువ్వేమీ టెన్షన్ పడకు. ఫైనల్ ఇయర్ కి ఏర్పాట్లు నేను చేస్తాను”. అన్నాడు దక్షిణామూర్తి.

మోహన్ వాళ్ళ అక్క, మేనత్త (మోహన్ వయసే ఉంటుంది) ఇద్దరు రాగమాల ఇంటి ముందు నుండి గుడికి వెళ్లే వాళ్ళు. వెళ్లి వచ్చేటప్పుడు రాగమాల దగ్గరికి వచ్చే వారు.

ఇద్దరు ఎక్కువగా నవ్వుతూ ఉండే వాళ్ళు.

“ఎందుకు వీళ్ళు ఇంత నవ్వుతారు అనుకునేది” రాగమాల.

ఒకసారి గుడికి వెళుతూ, మోహన్ అక్క శుభశ్రీ , మేనత్త రాజశ్రీ ఇద్దరూ వచ్చి రాగమాలతో అన్నారు..

“రాగమాలా! మేము మీ ఇంటికి ఎన్నోసార్లు వచ్చాము.కానీ నువ్వు మాత్రం ఒక్కసారి కూడా రాలేదు. మా నాన్నగారు నిన్ను చూస్తా అన్నారు ఒకసారి వస్తావా?”అని అడిగారు.

“సరే వస్తాను” అని చెప్పింది రాగమాల.

“రేపు ఆదివారం కదా! నువ్వు మా ఇంటికి భోజనానికి వచ్చేయ్”అని చెప్పింది శుభశ్రీ.

“అలాగే అక్క వస్తాను”అని చెప్పింది రాగమాల.

తెల్లవారి పదకొండు గంటల సమయంలో మోహన్ వాళ్ళ ఇంటికి వెళ్లింది రాగమాల.

బయట వరండాలో వాళ్ళ నాన్నగారు పడక కుర్చీలో కూర్చుని పేపర్ చదువుతున్నారు.

అక్కడే ఉన్న శుభశ్రీ..

“రా! రాగ మాలా!”అని నవ్వుతూ పిలిచింది.

అక్కడే ఉన్న వాళ్ళ నాన్నతో..

“నాన్నా! ఈమెనే రాగమాల .నువ్వు చెప్పావు కదా! దక్షిణామూర్తి మామయ్య కూతుర్ని తీసుకుని రమ్మని తనే”అని పరిచయం చేసింది.

“అవునా! వీళ్ళ అన్నయ్యను ఇంతకుముందే చూసాను. అక్క ఉందట చూడలేదు. దక్షిణామూర్తి చాలా చిన్నగా, సన్నగా కనిపిస్తాడు. కానీ పిల్లలందరూ పెద్ద పర్సనాలిటీనే! బాగున్నారు”అన్నారు రామారావు .

కొంచెం బిడియంగా రాగమాల అతనికి నమస్కారం చేసింది.

మోహన్ వాళ్ళ అమ్మ చక్కగా తయారై, ఆమె కూడా ఒక కుర్చీలో కూర్చుని ఉంది.

వాళ్ళ అమ్మగారిని కూడా పరిచయం చేసింది శుభశ్రీ.

లోపల మోహన్ వాళ్ళ నాన్నమ్మ గారు వంట చేస్తున్నారు. కట్టెల పొయ్యి మీద వండు తున్నారేమో ఇల్లంతా పొగ వ్యాపించింది.

ఇంట్లో మోహన్ మరియు తమ్ముళ్లు ఎవరూ లేరు. ఏదో పని మీద బయటకు వెళ్లారని శుభశ్రీ చెప్పింది.

అప్పట్లో ఎవరికీ పొద్దున టిఫిన్ చేసే అలవాటు ఉండేది కాదు. దాదాపు ఒంటిగంట కావస్తుంది వంట ఇంకా కాలేదు.

“మా నాయనమ్మ వంట చాలా ఆలస్యంగా చేస్తారు. నీకు ఆకలి వేస్తుందా?” అని శుభశ్రీ అడిగింది.

“లేదు, లేదు, నాకు ఆకలి వేయడం లేదు. మా ఇంట్లో నాకు అలవాటే. మా నాయనమ్మ కూడా చాలా ఆలస్యంగా వంట చేసేది.వంట చాలా బాగా చేస్తారు ఉప్పుడు పిండి అయితే అద్భుతంగా చేస్తుంది”అని చెప్పింది రాగమాల.

వంట అయ్యాక అందరికీ కంచాలలో వడ్డించారు మోహన్ నానమ్మ గారు. ఇంతలో మోహన్ తమ్ముళ్ళు కూడా భోజనానికి కూర్చున్నారు. చూసి చూడనట్టుగా రాగమాలను చూశారు.

ఎందుకో వాళ్లను చూస్తే కొంచెం ఇబ్బందిగా అనిపించింది రాగమాలకి.

మోహన్ వాళ్ళ నానమ్మ చేసిన వంటలు రాగమాలకు చాలా నచ్చాయి. రాగమాలకి తన నానమ్మ గుర్తుకు వచ్చింది.

ఇంతలో మోహన్ వచ్చాడు. అందరూ భోజనం చేస్తుంటే చూశాడు. అసలు రాగమాలతో పరిచయం లేనట్లు గానే లోపలికి వెళ్ళాడు. ఆశ్చర్యంగా అనిపించింది రాగమాలకు. వెంట ఒక కార్పెంటర్ వచ్చాడు. వాళ్ళ ఇంట్లో ఉన్న అల్మారకు అన్ని అద్దాలు వేయించాడు. అదంతా గమనిస్తూ ఉంది రాగ మాల.

అందరూ లోపలికి వెళ్ళిన సమయంలో ఒక చిన్న నవ్వు నవ్వి, లోపలికి వెళ్ళిపోయాడు మోహన్.

“ఇంట్లో వాళ్ళంటే భయమేమో! కానీ మా ఇంట్లో అలా లేదే, నాన్న మోహన్ ని డైరెక్ట్ గా పరిచయం చేయించి, మాట్లాడించారు. ఆడపిల్లతో మాట్లాడితే ఇంకా తప్పుగా ఆలోచించే మనుషులు ఉన్నారా?” అని అనుకుంది రాగమాల.

ఎందుకో రాగమాలకి మోహన్ వాళ్ళ అమ్మని చూసినా కూడా కొంచెం భయమేసింది.

ఆ తర్వాత రాగమాల ఇంటికి తిరిగి వచ్చేసింది. ఇంకా తెల్లవారి అసైన్ మెంట్ టెస్ట్ ఉండటం వల్ల చదువుకుంటూ కూర్చుంది.

ఒక గంట తర్వాత మోహన్ వచ్చాడు.

“మా ఇంటికి వస్తావని నేను ఊహించలేదు”అన్నాడు మోహన్.

“నేను కూడా అనుకోలేదు. నిన్న మీ అక్క వచ్చి నన్ను రమ్మని బలవంతం చేశారు. అందుకని తప్పక వచ్చాను. కానీ నువ్వు ఎందుకలా సీరియస్ గా వెళ్ళిపోయావు? నేను పరిచయమే కదా నీకు? మాట్లాడితే తప్పేముంది? మీ ఇంట్లో ఇంకా ఇలాంటి రూల్స్ ఉన్నాయా ఏంటి”? అని అడిగింది.

“అవును ఇలా ఎవరితోనైనా మాట్లాడితే రకరకాల కామెంట్స్ చేస్తారు. అందుకే ఎవరో తెలియనట్లుగా ఉన్నాను” అన్నాడు మోహన్.

అప్పుడు అదంతా పెద్ద విషయంగా అనిపించలేదు రాగమాలకు. కానీ అదే చాలా పెద్ద విషయం అవుతుందనీ తర్వాత కానీ అర్థం కాలేదు రాగమాలకి.

ఆ తర్వాత దక్షిణామూర్తి గారు వేరే ఊళ్లో జాయిన్ కావడం, రాగమాలకి ప్రిపరేషన్ హాలిడేస్ రావడం వల్ల ఊరికి వెళ్ళిపోయింది.

బస్సు ఎక్కిన తర్వాత బస్టాండ్ లో మోహన్ కనిపించాడు.

“ఊరికి వెళ్తున్నావా”? అని అడిగాడు.

“అవును. చెప్పాను కదా! నాన్నకి ట్రాన్స్ఫర్ అయింది . ఎలాగూ సెలవులే కదా! ఊర్లో చదువు కుంటాను”అన్నది రాగమాల.

“నేను కూడా ఊరికే వెళ్తున్నాను. మా నానమ్మ నాతో వస్తున్నారు. అదిగో వెనకాల సీట్లో కూర్చున్నారు చూడు”
అన్నాడు మోహన్.

బస్సు లేటుగా రావటం వల్ల ,అప్పటికే సమయం ఏడు అయ్యింది.

“ఇంత రాత్రి బయలుదేరావేమిటి? ఒక్క దానివి ఎలా వెళ్తావు?”అన్నాడు మోహన్.

“భయమేముంది?ఎనిమిది వరకు చేరి పోతాను. తర్వాత మా ఊరికి వెళ్లడానికి డైరెక్ట్ బస్సు ఉండదు కాబట్టి, రిక్షాలో వెళ్తాను”అన్నది మామూలుగా రాగమా ల.

“సరేలే! కానీ ఇంత రాత్రి వెళ్ళకూడదు”అన్నాడు మోహన్.

మోహన్ వాళ్ల ఊరు మధ్యలోనే వస్తుంది. ఊరు రాగానే వాళ్ళ నాన్నమ్మని మాత్రం దించేశాడు.

“నానమ్మ నువ్వు ఇంటికి వెళ్ళిపో నాకు పక్క ఊరిలో కొంచెం పని ఉంది చూసుకొని వస్తాను”అని చెప్పాడు.

“సరే నాయన! తొందరగా ఇంటికి రా”అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది.

మళ్లీ మోహన్ బస్ ఎక్కాడు. అతన్ని చూసి రాగమాల..

“అదేంటి! ఇది మీ ఊరే కదా! మళ్లీ బస్సు ఎక్కావు”? అని అన్నది ఆశ్చర్యంగా.

“ఇదే మా ఊరు . నువ్వు ఒక్కదాని వెళ్తున్నావ్ కదా! చూస్తూ ఎలా పంపించాలి? మీ ఊరి దాక వచ్చి మళ్ళీ వస్తాను”‘అంటూ రాగమాల పక్క సీట్లో కూర్చున్నాడు .

అతను అంత కేర్ తీసుకోవడం రాగమాలకు కొంచెం సంతోషంగా అనిపించింది. ఇద్దరూ మాట్లాడకుండా మౌనంగానే కూర్చున్నారు.

ఇంతలో సడన్ గా బస్సు ఆగిపోయింది. ఏమైంది అని అడిగితే బస్సు రిపేరుకు వచ్చిందనీ చెప్పారు. రిపేరు పూర్తి కావడానికి గంట సమయం పట్టింది.

“చూసావా? ఒక్క దానివి వెళితే నువ్వు వెళ్లే వరకు ఎంత రాత్రి అయ్యేది? ఇలా రిస్క్ తీసుకోకూడదు”అన్నాడు మోహన్

బస్సు వీళ్ళ ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో ఆగుతుంది. బస్సు ఆగ గానే ఇద్దరు దిగారు. చీకటిగా ఉంది .మొత్తం చెరుకు తోటలు రిక్షాలు అర కొరా కనిపిస్తున్నాయి.

ఒక రిక్షా మాట్లాడుకున్నారు.

ఇద్దరు రిక్షా ఎక్కి కూర్చున్నారు . మెల్లగా రిక్షా కదల సాగింది. ఆ చీకట్లో ఎక్కడో కీచురాళ్ళు అరుపులు వినిపిస్తున్నాయి. రిక్షాకున్న మువ్వలు చిన్నగా సవ్వడి చేస్తున్నాయి. సన్నగా ఉన్న రోడ్డు ఇరుపక్కల చెరుకు తోటలు ఉన్నాయి. చల్లటి గాలి వీస్తుంది. అంత చలిలోనూ రాగమాలకు భయంతో చెమట పట్ట సాగింది. “ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? అందులో ఒక అబ్బాయి తో ప్రయాణించడం”.

ఆ భయంతోనే..

“నువ్వు వెళ్ళిపో మోహన్. నాకు చాలా భయంగా ఉంది. నేను ఒక్కదాన్ని వెళ్ళగలను”అన్నది రాగమాల.

“ఎందుకు భయం? ఏం కాదు. ఈ చీకట్లో ఎవరూ గుర్తు పట్టరు. అయినా ఈ రాత్రి తెలియని వాళ్లు నీ పక్కనే ఉంటే భయపడాలి కానీ నేనే కదా! అలాంటి భయం పెట్టుకోకు. ఇందులో తప్పేం లేదు”అన్నాడు మోహన్.

రిక్షా వెళ్ళసాగింది. ఇద్దరూ మౌనంగానే కూర్చున్నారు. మోహన్ కి కూడా ఒక్కతే వెళ్తుంది అనే భయంతో వచ్చాడు తప్ప వేరే కారణం ఏమీ లేదు.

రిక్షా ఊళ్లోకి వచ్చింది.

“మా ఇల్లు చాలా దూరం కదా! ఇప్పుడు ఊరు వచ్చేసింది. అన్ని లైట్లు ఉన్నాయి. ఇంక నేను వెళ్ళిపోతాను. నువ్వు వెళ్ళు మోహన్. అందరూ నన్ను గుర్తుపడతారు బాగుండదు”అని చెప్పింది.

“సరే! జాగ్రత్తగా వెళ్ళు. నేను వెళ్తాను మరి. ఎందుకంటే నాకు బస్సు దొరికి వెళ్లేసరికి చాలా రాత్రి అవుతుంది”అన్నాడు మోహన్ రిక్షా దిగుతూ.

రాగమాల ఇంటికి వెళ్ళిపోయింది.

రాగమాలను చూసిన తల్లిదండ్రులు “ఏంటి! ఇంత రాత్రి వచ్చావు? కొంచెం తొందరగా బయలుదేరలేకపోయావా? లేదంటే రేపు రావాల్సింది” అన్నారు కంగారుగా.

“బస్సు మధ్యలో రిపేర్ కు వచ్చింది. అందుకని లేట్ అయింది”అంటూ లోపలికి వెళ్ళిపోయింది.

“ఎప్పుడు తిన్నదో ఏంటో! దానికి అన్నం పెట్టు ముందు”అన్నారు దక్షిణామూర్తి గారు.

“కాళ్లు చేతులు కడుక్కొని రా! అన్నం పెడతాను”అన్నది తల్లి.

పెరట్లోకి వెళ్లి హౌస్ లో నుండి నీళ్ళు తీసుకొని, చక్కగా ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వచ్చింది. ఎంత లేదన్న మనసులో చాలా టెన్షన్ గా అనిపించింది రాగమాలకి. బస్సు లేట్ కావడం, అందులో బస్సు పాడైపోవడం,ఇదంతా తలుచుకొని “అమ్మో !మోహన్ రాకుంటే ఎంత భయం వేసేదని! ఈసారి ఎప్పుడూ సాయంత్రం రాకూడదు”అని అనుకున్నది.

కట్టెల పొయ్యి మీద వండిన వేడి అన్నం, ఇంట్లో కాసిన ఆకుకూరతో చేసిన పప్పు అమృతంగా అనిపించింది రాగమాలకి .రోజూ వచ్చి రాని వంట చేసుకుని తినడం, కడుపునిండా తినడమే లేదు. అని అనుకున్నది.

అన్నం తిన్న తర్వాత ఒకసారి నాయనమ్మ గదిలోకి వెళ్లి కాసేపు నాయనమ్మ దగ్గర కూర్చొని వచ్చింది.

మోహన్ మళ్లీ రిక్షా పట్టుకొని వెళ్లి, అక్కడ నుండి లారీలో వాళ్ళ ఊరికి వెళ్ళాడు. వెళ్లేసరికి చాలా రాత్రి అయింది.

ఇంట్లో వాళ్ళ అమ్మ అడిగింది..

“నానమ్మని పంపించి మళ్లీ ఎక్కడికి వెళ్లావు? అంత అర్జెంటు పనిలేమున్నాయి రా నీకు”? అన్నది మోహన్ తల్లి.

“ఏం లేదమ్మా ఇంపార్టెంట్ బుక్స్ అక్కడే మరచి వచ్చాను. తర్వాత ఎగ్జామ్స్ ఉన్నాయి కదా! అందుకని మళ్లీ వెళ్లి తెచ్చుకున్నాను. అందుకే ఆలస్యం అయ్యింది”అన్నాడు మోహన్.

ఎగ్జామ్స్ కోసం ఇక్కడ మోహన్ అక్కడ రాగమాల బాగా చదువుతున్నారు.

ఎందుకో ఈసారి రాగమాలకు చదువు మీద కాన్సన్ట్రేషన్ కుదరడం లేదు. మాటిమాటికి మోహన్ గుర్తుకు వస్తున్నాడు.

నోట్స్ రాస్తూ, రాస్తూ అప్పుడప్పుడు మొహన్ పేరు రాసి మళ్ళీ చింపేసేది. మనసుని చాలా కంట్రోల్ గా ఉంచడానికి ప్రయత్నం చేసుకుంది.

రాగమాల వాళ్లది, మోహన్ వాళ్ళది కూడా చతుషాల భవంతులే. రాగమాల పార్టిషన్ కి అటువైపు కూర్చుని బాటని డయాగ్రమ్స్ వేసుకుంటుంది.

ఇంతలో ఇల్లంతా సెంటు వాసన కమ్మేసింది. అది కూడా మోహన్ వాడే సెంటు వాసన. మోహన్ కి ఇలా పర్ఫ్యూమ్స్ వేసుకోవడం చాలా ఇష్టం.

“అయినా మోహన్ ఇక్కడికి ఎందుకు వస్తాడులే”అని అనుకొని తన పని తాను చేసుకో సాగింది.

అన్నయ్య అనురాగ్ కూడా సెలవులు ఉన్నాయని వచ్చాడు.

అనురాగ్ ఎవరితోనో మాట్లాడుతున్నట్టు వినిపించింది.

“ఎవరు కావాలి మీకు”? అని అడిగాడు అనురాగ్

“నేను రామారావు గారి కొడుకును. నాన్నకి కొంచెం ఆరోగ్యం బాగాలేదు. అందుకని లాంగ్ లివ్కు అప్లై చేసుకున్నాడు. ఈరోజు సెలవు కదా! మీ నాన్నగారు ఇక్కడే ఉంటారని తెలిసి లెటర్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాను. లాంగ్ లీవ్ కదా హెడ్ ఆఫీస్ లోఇవ్వాలి. ఎలాగూ ఇద్దరిదీ ఒకటే డిపార్ట్మెంట్ కదా”అని చెప్పాడు మోహన్.

“అవునా! రండి కూర్చోండి”అని చెప్పి లోపలికి వచ్చాడు అనురాగ్.

“రాగా! రామారావు గారి అబ్బాయి వచ్చాడు. అతను మీ క్లాస్ అని ఒకసారి చెప్పావు కదా! అతనే వచ్చాడు వెళ్లి మాట్లాడు. నేను నాన్నకు చెప్పి వస్తాను”అన్నాడు అనురాగ్.

“సరే అన్న”అని పార్టిషన్కు ఇవతలకి వచ్చింది రాగమాల.

“ఏంటి ఇలా వచ్చావు మోహన్?”అని అడిగింది రాగమాల.

“నాన్న లెటర్ ఇవ్వమని చెప్పాడు. లెటర్ రేపైనా టౌన్ లో వేరే వాళ్ళకి ఇవ్వవచ్చు. కానీ నువ్వు ఇక్కడ ఊర్లో ఉన్నావు కదా! అలాగే నిన్ను కలిసినట్టు ఉంటుందని ఇక్కడికే వచ్చాను. మా నాన్నకి రేపు వేరే పని ఉందని చెప్పాను”అన్నాడు అటు ఇటు ఎవరూ వినకుండా మోహన్.

“అవునా ఇంతకీ ఎలా చదువుతున్నావ్?”అన్నది రాగమాల.

“మా ఇంట్లో ఉంటే చదవడం అసలే కాదు. కరెంట్ సరిగా ఉండదు. ఎందుకో అక్కడ నాకు మూడ్ ఉండదు”అన్నాడు మోహన్.

“ఇక్కడ కూడా నాకు అలాగే ఉంది. ఇంటికి ఎవరో ఒకరు వస్తుంటారు. బంధువులు ఎక్కువగా వచ్చి ఉంటారు .చాలా డిస్టర్బెన్స్ ఉంది .అదే ఏం చేయాలో అర్థం కాలేదు. అందులో ఇప్పుడు నాన్న అక్కడ ఉండటం లేదు కదా! ఒక్కదాన్ని వెళ్ళాలి అంటే కష్టం”అన్నది రాగ మాల.

“పక్కన ఒక ఫ్రెండ్ ఉంది కదా! ఆమె మీ ఇంట్లోనే పడుకుంటుంది కదా! అక్కడికే వచ్చి చదువుకో. నేను కూడా టౌన్ కే వస్తాను. అప్పుడప్పుడు నీ బుక్స్ తీసుకొని వెళ్లొచ్చు”అన్నాడు నవ్వుతూ మోహన్.

ఇంతలో దక్షిణామూర్తి గారు వచ్చారు.

రాగ మాల లోపలికి వెళ్లి మంచినీళ్లు, టీ తీసుకొని వచ్చి మొహాన్ కి ఇచ్చి లోపలికి వెళ్ళిపోయింది.

మోహన్, దక్షిణామూర్తి గారికి లెటర్ ఇచ్చి, కాసేపు మాట్లాడి, టీ తాగి వెళ్లిపోయాడు.

రాగమాలకి ఊళ్లో చదువు సాగటం లేదని మళ్లీ టౌన్ కి వెళ్లాలని అనుకుంది.

అంతలో ఒక సంఘటన జరిగింది..

( మోహన రాగం)

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రెండో పెళ్ళి

గోరింటాకు