సతిగా పతిపై అమర్యాద సహించక అగ్నికి ఆహుతి అయ్యావు
వేదవతిగా శీలరక్షణకై ఆత్మాహుతి గావించావు
సీతగా పవిత్రతపై నింద ఓర్వకభూమాత ఒడిలో చేరావు
ద్రౌపదిగా సభలో అవమానాగ్నికి రగిలి శపథం పట్టావు
ముగ్ధ ముదితవై నీ ఆత్మ గౌరవం నిరూపించావు
అనసూయగా దేవతలను లాలించి లోకానికి ఆదర్శమయ్యావు
సావిత్రిగా పతి ప్రాణాలు దక్కించుకున్నావు
సుమతిగా మాంగల్యాన్ని కాపాడుకున్నావు
సుకన్యగా పతికి తోడై ధర్మాన్ని నిలిపావు
స్త్రీ శక్తివై నీ మహిమలు నిరూపించావు
ఝాన్సీవై రణభూమిలో శత్రువులను చెండాడావు
మొల్లవైరచనామృత ధార కురిపించావు
సరోజినివైకవితాంబుధిలో ఆనంద నౌక నడిపించావు
దుర్గాబాయివై స్త్రీ జనోద్ధరణకై పాటుపడ్డావు
వీర వనితవై, కళామతల్లివై నీ ప్రతిభను నిరూపించావు

రాకెట్టు పథంలో దూసుకెళ్ళావు, దేశ రక్షణలో భాగమయ్యావు
రాజకీయంలో కీలకమయ్యావు, క్రీడారంగంలో దేశ గౌరవం నిలిపావు
పలు రంగాలలో కాలిడావు, నీకు చేతకానిదేదీ లేదని తెలియచేసావు
నారీ ప్రభంజనమై సంఘంలో నీకూ ఉన్నత స్థానం ఉందని నిరూపించావు
మరి ఇంకా కామ పిశాచాల అకృత్యాలకు ఎందుకు బలి అవుతున్నావు?
వరకట్న దురాచారాలకు ఇప్పటికీ ఎందుకు సమిధ అవుతున్నావు?
ప్రేమాంధుల దాడులకు ఎందుకు యవ్వనకాంతి కోల్పోతున్నావు?
బేలవై, ఒంటరివై ఎక్కడో ఎప్పుడో కాలగర్భంలో ఎందుకు కలసిపోతున్నావు?
ఓ మహిళా!మేలుకో, దుష్కృత్యాలను నీ మానసిక బలంతో అడ్డుకో
అపర చండికవై దుష్టులను ఎదురుకునినీలోని ధైర్యాన్ని నీవే నిరూపించుకో