కార్తీక పౌర్ణమి రోజు దీపం వెలిగించే ముందు ప్రమిద మీద కాస్త పసుపు, కుంకుమ, ఒక పువ్వు వేసి దీపంలోనికి ఆ భగవంతున్ని ఆవాహన చేయాలి. ఆవాహన చేసేటప్పుడు చదవవలసిన మంత్రం
త్రయంబక మావాహయామి అని గాని
దామోదర మావాహయామి అని గాని చెప్పి ఆ దీపాన్ని పరమేశ్వరుడిగా గాని, దామోదరుడిగా గాని భావించి దీపం వెలిగించి నమస్కారం చేసుకోవాలి.

ఆ దీపస్వరూపమే దామోదరుడు లేదా పరమేశ్వరుడు.
ఆ *దీపమే పరబ్రహ్మము *అటువంటి దీపాన్ని వెలిగించుట వలన కలుగు ప్రయోజనములు
ఈ లోకంలో కొన్ని లక్షల, కోట్ల ప్రాణులు ఉన్నాయి కానీ …..అవి తమను తాము కానీ, ఇతరములను గాని ఉద్ధరించు శక్తి కానీ, భగవాన్నామస్మరణ చేయగల శక్తి గాని కలిగి లేవు. కానీ మానవుడు ఎంతో ఉత్కృష్టమైన మనిషి జన్మను పొంది ఉండటం వలన ఇతర ప్రాణులను ఉద్ధరించుటకు కావలసిన విభూతిని పొంది ఉన్నాడు. కనుక ఇతర ప్రాణులను ఉద్ధరించడానికి ,చెట్లు, జంతువులు, పశువులు, పక్షులు, కీటకాలు, మొదలగు ఎన్నో చరాచర జీవరాసులకు అనుగ్రహం చేయగలిగే అనువైన తిథి ఈ కార్తీక పౌర్ణమి. (మనం ఈ భూమి మీద ఎన్నో ప్రాణులను మన అవసరాలకు వాడుకుంటున్నాం అందులో మొట్టమొదట చెప్ప తగినవి చెట్లు) ఈ కార్తీక పౌర్ణమి రోజు మనం వెలిగించే దీపాన్ని మన చుట్టూ ఉన్న ప్రాణులు చూసిన కారణం చేత అవి మరల జన్మను పొందవు అని ఋషి వాక్యం. అందుకే కార్తీక పౌర్ణమి రోజు తప్పకుండా దీపాన్ని వెలిగించాలి. కార్తీక పౌర్ణమి రోజు దీపాన్ని వెలిగించకుండా ఉండటం వలన ఇతర ప్రాణుల వలన మనం ప్రయోజనం పొంది వాటికి విముక్తి కలిగించకపోవడం వలన కృతఘ్నతా దోషం కూడా పొందుతారు మానవులు. తద్వారా మనిషి జన్మకు అర్థం కాని సార్ధకత గాని కలగవు .కనుక ఎవరైతే కార్తీక పౌర్ణమి రోజు దీపాన్ని వెలిగించి మన చుట్టూ ఉన్న జీవకోటికి విముక్తిని కలిగిస్తారో… వారు కాలాన్ని సద్వినియోగం చేసుకోగలరు . కాలాతీతులు కాగలరు . ఫలితంగా పుణ్యాన్ని సంపాదించుకోగలరు. కనుక ఈ కార్తీక పౌర్ణమి రోజు దీపాలను వెలిగించి ఈ మానవ జన్మకు సార్ధకత పొందుదాం.
లోకా సమస్త సుఖినోభవంతు
ప్రవచనకర్తల సౌజన్యంతో