“చరమాంకపుస్నేహాలయం”

‘పద్మా! తలుపేసుకోమ్మా! నేను పార్కుకి వెళ్తున్నాను’ చెప్పులు వేసుకుంటూ కోడలిని పిలిచారు రావుగారు. ‘అలాగే మావయ్యగారూ’ అంటూవంటింటినుండి వచ్చింది పద్మ. హాల్లోనేమూలకి పెట్టిన చేతి కర్ర తీసుకుని బయలుదేరారుడెభ్భైనిండిన రావుగారు. వారం క్రితం ఒకరోజు కరెంటు లేక లిఫ్టు పనిచేయకపోతే, మొదటి అంతస్తే కదా అనిమెట్లు ఎక్కుతున్నప్పుడు మోకాలు కలుక్కుమన్నప్పటినుండీ బయటికి వెళ్ళినప్పుడు మాత్రం ఎందుకైనా మంచిదని కర్ర చేతిలో ఉంచుకుంటున్నారు. క్రింది అంతస్తులో కొడుకు డాక్టర్ రఘు క్లినిక్ ఉంది. రెండస్తులే అయినా తండ్రికోసమే లిఫ్ట్ పెట్టించాడు రఘు.

ఆ కాలనీ మహిళలు తమ పిల్లలు ఆడుకుందుకు స్థలం కావాలని అడగగా సంక్షేమ సంస్థ ప్రెసిడెంట్ గా రావుగారు ఈ మధ్యనే కాలనీ మధ్యలో కట్టించిన పార్కు వీళ్ళ ఇంటికి ఒక సందు దాటగానే ఉంది. కాలనీలో చిన్న పిల్లలు చాలామందే ఉండడంతో మొదటిరోజునుండే సందడి మొదలయ్యింది. రావుగారు కూడా మొదటిరోజునుండే సాయంత్రాలు వెళ్ళడం ప్రారంభించారు. ఆయనని చూసి మెల్లిగా మిగిలిన పెద్దలూ వ్యాహ్యాళికి రావడం మొదలుపెట్టారు. అరగంట నడక ఆరోగ్యానికి మంచిదయితే, పిల్లల ఆటపాటలు, మిత్రులతో కబుర్లు మనసుకి ప్రశాంతతని చేకూరుస్తున్నాయి.

ఆడుకునే పిల్లలతో పాటు వారికి తోడుగా వచ్చేవారితో, వ్యాహ్యాళికోసం వచ్చే పెద్దలతో పార్కు కళకళలాడుతోంది. పార్కు గేటు తీసుకుని, రోజూ తను కూర్చునే బెంచి వైపు అడుగేసిన రావుగారు, అక్కడే ఆగిపోయారు. బెంచి పైన ఈరోజు ఒక నడివయసు స్త్రీ కూర్చుని ఉంది. పక్కనే ఆవిడ మనవడు కాబోలు స్నేహితులతో ఆడుకుంటున్నాడు. ఆవిడ కళ్ళు మనవడినే గమనిస్తున్నట్టు ఉన్నా, మనసు ఏదో ఆలోచనలో మునిగినట్టు తెలుస్తోంది. మరో బెంచి ఏమైనా ఖాళీగా ఉందేమోనని చుట్టూ చూస్తే దొరకలేదు. ఈ బెంచి కాస్త గేటుకి ఎడంగా ఉండడంతో సాధారణంగా ఖాళీగా ఉంటుంది. సరే, ఐదు నిమిషాలు కూర్చుని ప్రారంభించే బదులు ఇప్పుడే నడవచ్చు అనుకుని నడక మొదలుపెట్టారు. అరగంటలో ఆ చిన్న పార్కులో ఆరు సార్లు పార్కు చుట్టూ తిరగడం అవుతుంది. ఆ క్రమంలో బెంచి దగ్గరికి వచ్చిన ప్రతిసారీ అసలు ఈ లోకంలో లేనట్టు పరధ్యానంలో ఉన్న ఆవిడని గమనించారు రావుగారు. చిన్నగళ్ళు ఉన్న సాదా నేత చీర కట్టి, మెడలో సన్న ఒంటి పేట గొలుసు, చేతికి ఒక్కొక్క బంగారు గాజు వేసుకుని, చిన్న నల్ల బొట్టు పెట్టుకుని, పల్చబడిన తెల్ల జుట్టు ముడి వేసుకున్న ఆవిడ ఏ క్షణాన్నైనా పొంగి పొర్లే వరదకి ముందు ఉండే శాంత గోదారిలా కనబడ్డారు. ఎందుకో ఆవిడ ఏదో నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తున్నట్టు అనిపించిది.

నడక పూర్తి అయ్యాక రావుగారు బెంచి దగ్గరికి వెళ్లి చిన్నగా దగ్గి ‘నేను ఇక్కడ కూర్చోవచ్చాండీ’ అని అడిగారు. సమాధానంగా ఆవిడ లేచి నిలుచుని ‘కూర్చోండి, మేము ఇంటికి వెళ్ళే సమయం అయింది’ అంటూ మనవడిని పిలిచింది. ‘నానమ్మా! నేను ఇంకాసేపు ఆడుకుంటా, ఇప్పుడే రాను’ అని మళ్ళీ ఆటలో మునిగిపోయాడు మనవడు. ఇక చేసేదిలేక ఆవిడ బెంచి చివరకి జరిగారు. కూర్చున్న రావుగారు ‘కాలనీకి కొత్తగా వచ్చినట్టున్నారు!’ అని మాట కలిపారు. ‘అవునండీ, ఒక మూడు రోజులక్రితం వచ్చాము, ఇన్నేళ్ళూ బెంగళూరులో ఉన్నాము, ఉద్యోగరీత్యా మా కొడుకు ఊళ్లు మారవలసి వస్తుంది, వాళ్ళతో పాటే నేనూను’ అని చెప్పారు ఆవిడ. ‘మీ వారు?’ విషయం అర్థం అయినా ఆవిడ విషాదానికి కారణం పూర్తిగా తెలుసుకోవాలని అడిగారు రావుగారు. ‘ఆయన బంధాలు అన్నీ తెంచుకుని పదేళ్ళ క్రితమే వెళ్ళిపోయారు, నేను మటుకు వీళ్ళకిభారంగామిగిలాను’ ఆవిడ గొంతులో ఏదో అడ్డు పడ్డట్టు ఆగి నిట్టూర్పు విడిచారు.

రావుగారికి విషయం అర్థం అయింది. కోడలు ఆవిడ తమపై భారం అనే భావన కల్పించి సూటీ పోటీ మాటలతో కించపరచి ఉండవచ్చు.  ‘మీకు ఒక్కడే సంతానమా?’ అడిగారు రావుగారు. ‘కూతురుకి పెళ్లి అయింది, దానిది ఉమ్మడి కుటుంబం. వాళ్ళ ఇంటికి వెళ్లి ఉండడం కుదరదు’ గబుక్కున నోరు జారానని గ్రహించిన ఆవిడ వెంటనే సద్దుకుని ‘అంటే, వెళ్ళాల్సిన అవసరం కూడా లేదనుకోండి’ అని నవ్వడానికి ప్రయత్నించింది. ఆ శుష్కమైన నవ్వుని పరిశీలనగా చూసి ‘మీ పేరు ఏంటండి?’ అడిగారు రావుగారు. ‘వర్ధని’ అని చెప్పిన ఆవిడ తన మనవడు పరిగెత్తుకుంటూ వచ్చి ‘నానమ్మా! ఇంటికి వెళ్దాము’ అనగానే ‘వస్తానండీ’ అని చెప్పి బయల్దేరారు. ‘నా పేరు గోపాలరావు, రేపు నాలుగింటికి ఇక్కడ వృద్ధులమంతాకలుస్తున్నాము, ఈ కాలనీలో ఒక ఆశ్రమం గురించి చర్చించుకోవడానికి. మీరు తప్పక రండి’ అన్నారు రావుగారు.

ఆ రాత్రి పడుకునేముందు వర్ధనిగారుగుర్తువచ్చి కాసేపు ఆవిడ గురించి ఆలోచించారు రావుగారు. పాపం కూతురి దగ్గర ఉండకూడదు, కొడుకు దగ్గర ఉండనీయరు, ఈ చరమదశ ఎక్కడ గడపాలోఅన్నదే ఆవిడ ఆలోచన. సాయంత్రం ఆశ్రమం అన్న మాట వినబడగానే ఆవిడ ఇంకా దిగులు చెందడం ఆయన దృష్టిని దాటి పోలేదు. ఆశ్రమం గురించిన మాట ఆవిడ విచారం పోగొట్టాలని అన్నా ఆలోచించకుండాఅన్నదిమాత్రం కాదు. రావుగారు చాలా కాలంనుండీ ఈ విషయంపైన ఆలోచిస్తున్నారు. భగవంతుడు దయ దలచి తనకి మంచి కోడలిని ఇచ్చాడు. వేళకి భోజనం, జాగ్రత్తగా చూసుకునే కొడుకు కోడలు, ముద్దు మురిపాలతో అలరించే మనవడు, మనవరాలు. ఈ వయసులో ఇంతకంటే ఇంకేం కావాలి? తన భార్య సీత కూడా చివరి దశలో ఏ కలతలూ లేక ప్రశాంతంగా కన్నుమూసింది. కానీ తన స్నేహితులు చాలామంది తమ సొంత ఇంట్లోనే తగిన గౌరవం లేక, సంతోషం  కోల్పోయారు. వారికోసమైనా మున్సిపాలిటీ అనుమతి తీసుకుని కాలనీ మధ్యలో ఒక ఆశ్రమం కట్టించాలని ఎప్పటినించో ఆలోచిస్తున్నారు, కానీ తాను ఆలోచించిన స్థలంలో పార్కు కట్టించవలసి వచ్చింది. ఇప్పుడు ఉన్న రెండస్తుల ఇల్లు తన ఒక్కగానొక్క కొడుకు కట్టుకున్నదైతే పక్కనే ఉన్న రెండస్తుల ఇల్లు తాను 20 సంవత్సరాల క్రితం కట్టించిన ఇల్లు. ఆ ఇంటిని రావుగారు ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా ఉపయోగించవచ్చని రఘు ఎప్పుడో చెప్పాడు. “నాకు చదువు చెప్పించారు, జీవితపు విలువలు నేర్పారు, ఇవాళ నేను స్థిరపడ్డాను అంటే దాని వెనుక మీఆశీర్వాదం ఉండబట్టే కదా నాన్నా. ఇక మీ సంపాదన, మీరు కట్టించిన ఇల్లు చక్కగా దేనికైనా వాడండి, మాకు ఏమీ అభ్యంతరం లేదు” అన్నప్పుడు కోడలు వెంటనే “అవును మావయ్యగారు, మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటూ మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉండండి చాలు” అంది. అప్పుడు కొడుకు కోడలితో తన నిర్ణయం తెలుపగా వారిద్దరూ ఒకేసారి “తప్పకుండా అలాగే చేయండి. మేము మీకు సహాయంగా ఉంటాము” అన్నారు. రేపు అందరినీ పిలిచి ఈ విషయంపై చర్చించాలి అనుకుంటూ రావుగారు నిద్రలోకి జారుకున్నారు.

మరునాడు రావుగారు కాలనీలోని వృద్ధులందరికీ కబురు చేసి పార్కుకి పిలిచారు. వర్ధనిగారు కూడా వచ్చారు. వృద్ధుల ఆశ్రమం గురించి తన ఆలోచనలను చెప్పారు రావుగారు. తన ఇంటి పక్కన రెండంతస్తుల భవనం తనదేనని, ఇన్నాళ్ళూ అద్దెకి ఉన్న గుజరాతీ కుటుంబం ఖాళీ చేస్తున్నారు కాబట్టి ఆ ఇంటికి కావలసిన మార్పులు చేసి ఒక వృద్ధాశ్రమం పెట్టబోతున్నానని, ఇష్టం ఉన్నవాళ్ళు అక్కడ ఉండచ్చనీ చెప్పారు.రోజంతా అక్కడే ఉండే ఒక పనిమనిషిని, వంట మనిషిని ఏర్పాటు చేస్తాననీ, పొద్దున్న ఉపాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం తేనీరుతో పాటు అల్పాహారం, రాత్రి చపాతి కూర ఉంటుంది అని చెప్పారు. నెలకొకసారితన కొడుకు డాక్టర్ రఘు అందరి ఆరోగ్య పరీక్ష చేస్తాడనిచెప్పగానే అందరూ చప్పట్లు కొట్టి హర్షం వ్యక్తం చేసారు. భవనం ఉచితంగానే ఉన్నా, వైద్యుడు ఉచితంగా పరీక్షలు చేస్తున్నా, మిగిలినవాటికి కాస్త డబ్బు పెట్టవలసి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తమ పెన్షన్ లోంచికొంత తమవంతుగాకట్టవచ్చని చెప్పగానే అందరూ ఒప్పుకున్నారు.ఇంకా ఏమి అవసరాలు ఉన్నాయో, ఏమి సందేహాలు, సలహాలు ఉన్నాయో ఆలోచించుకుని వచ్చేవారం ఇదే సమయానికి వచ్చి సామూహికంగా చర్చించుకోవాలని రావుగారు చెప్పగానే ఆయనకి ధన్యవాదాలు చెప్పి అందరూ ఆనందంగా ఇళ్ళకి వెళ్లిపోయారు. నిశ్శబ్దంగా వెళ్ళిపోయిన వర్ధనిగారికి మాత్రం వృద్ధాశ్రమం ఆలోచన నచ్చలేదు అని రావుగారికి అర్థం అయింది. అందరూ వెళ్లిపోయాక రావుగారు పార్కులో చాలాసేపు కూర్చుండిపోయారు.

మరునాడు సాయంత్రం పార్కుకి కాస్త ముందే వెళ్ళిన రావుగారు వర్ధనిగారుమనవడితో రాగానే ‘మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి, మీరు ప్రశాంతంగా విని మీ ఆలోచన చెప్పండి. మనిషికి వృద్ధాప్యం అన్నది ఒక శాపం అవ్వకూడదు. ఏ వయసులోనైనా భరించలేని ఒంటరితనం ఆఖరి దశలో మరీ పీడిస్తుంది. ఎన్నో ఏళ్ళు కలసిబ్రతికిన జీవితభాగస్వామిని కోల్పోయినప్పుడు,ఒంటరిగా ఉండగలిగితే ఫరవాలేదు. వేళకి వంట వండుకుని తింటూ, భగవంతుడి ధ్యానం చేసుకుంటూ, కుదిరినంతలోనలుగురికి సహాయపడుతూ జీవితం గడిపెయ్యచ్చు. కానీ దానికి గుండె నిబ్బరం, ఆత్మవిశ్వాసం కావాలి. అది లేనివాళ్ళు, చనిపోయే సమయంలో పక్కన ‘నావాళ్ళు’ లేకపోతే ఎలా అన్న భయం ఉన్నవాళ్ళు, తనవారితోనేకలసి ఉండాలనే తాపత్రయం ఉన్నవాళ్ళు, ఆరోగ్య రీత్యా సహాయం కావలసినవాళ్ళు, మిగిలిన జీవితం తమ సంతానం దగ్గర ప్రశాంతంగా గడపాలనుకుంటారు. కానీ అక్కడ కూడా ప్రశాంతత లేదు అనితెలిసాకమటుకూఒక వృద్ధాశ్రమం నీడ చూసుకోవడంలో తప్పు లేదు. కుటుంబానికి దూరంగా ఉన్నా, మన తోడివారితో కలిసి బ్రతకడం, కబుర్లు చెప్పుకోవడం, సామూహిక ధ్యానం చేసుకుంటూ ప్రశాంతంగా బ్రతకడం మంచిదేగా? ఈ వయసులో మనసు కోరుకునేది ఒక తోడు నీడ మాత్రమే కాదు మనశ్శాంతి కూడా. ఏమంటారు?’ అన్నారు.

వర్ధనిగారుమనవడివైపు దిగాలుగా చూస్తూ, ‘మనవళ్ళుమనవరాళ్ళ ఆటపాటలు ఉండవుగా? దగ్గర ఉన్నప్పుడే సమయం వెచ్చించని కొడుకు నన్ను చూడడానికి ఇక రాడేమో. పైగా నాకోసం వృద్ధాశ్రమానికి డబ్బు కడతాడా?’ అన్నారు. ‘మీవారు ఎందులో పనిచేసేవారండీ?’ ప్రశ్నించారు రావుగారు. ‘ప్రైవేటు కంపనీఅండీ, వాళ్లకి పెన్షన్ ఉండదు. నేను ఏమీ చదువుకోలేదు కాబట్టి ఉద్యోగం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఇంటిపని, వంటపని, పిల్లలు సంసారం వీటితోటే నా జీవితమంతా గడిచిపోయింది. దాచుకున్న డబ్బు పిల్లల చదువులకి, పెళ్ళిళ్ళకీ, ఆయన వైద్యానికి, రెండేళ్ళక్రితం నా గుండె ఆపరేషన్ కి ఖర్చుపెట్టవలసి వచ్చింది. కొడుకు చూసుకుంటున్నాడు కాబట్టి ఇప్పుడు బానే ఉన్నానండి’ పెదవులు నవ్వడానికి విఫల ప్రయత్నం చేసినా, కళ్ళకి నటించడం రాక గుండెలోని బాధను తెలిపాయి, గొంతు రుద్ధమైకళ్ళకితోడైంది.

‘భలేవారండీ! అందరు వృద్ధులు డబ్బు కట్టగలరు అనుకుంటున్నారా? కట్టలేనివారు కూడా ఉండచ్చు. అలా ఉండడానికి మొహమాటంగా ఉంటే అదే ఆశ్రమంలో సేవా కార్యక్రమంలో పాల్గొనవచ్చు. అంటే, వంటలో సహాయం, పూజగది, ధ్యానమందిరం శుభ్రం చేయడం, మొక్కల సంరక్షణఇలాంటివి’ అన్నారు రావుగారు. ఇక కొడుకు అంటారా, అతనికి అమ్మ గుర్తువస్తే తన కొడుకుని తీసుకు వస్తాడు, లేకపోతే వదిలెయ్యండి. మీరు మెల్లిగా ఇటువంటి బంధాలు తెంచుకోవాలి. మీకేమండీ, మీ కొడుకుకోడలు బానే చూసుకుంటున్నారు కాబట్టి మీరు ఎన్నైనా కబుర్లు చెప్తారుఅనిమీరనచ్చు. అసలు విషయం ఏమిటంటే నేను కూడా ఆ ఆశ్రమంలోనే చేరుతున్నాను. పిల్లలు బానే చూస్తున్నారు కదా అని వారి స్వేచ్ఛకి అడ్డు రాకూడదు, పైగా నాకూ ఈ చరమాంకంలో నా వయసువారి తోడు, స్నేహం కావాలి కదా! కృష్ణా రామా అనేదేదోనలుగురితో కలిసే అందామని’ అని నవ్వారు రావుగారు. వర్ధనిగారి ముఖంలో కాస్త నవ్వు కనబడ్డది. ‘ఆలోచించుకుని చెప్తానండీ’ అని మనవడితో కలిసి వెళ్ళిపోయారు.

ఒక మూడు నెలల తరువాత,తుది మెరుగులు దిద్దుకుని ‘చరమాంకపుస్నేహాలయం’ అన్న బోర్డుతో తళతళలాడుతున్న భవనంలోకి కొత్తగా ఏర్పడిన మహిళా స్నేహబృందంతో మనస్ఫూర్తిగా నవ్వుతూ ఆశ్రమంలోకి అడుగుపెడుతున్న వర్ధనిగారిని, ఇతర మిత్రులనీ చూసి ఒక మంచి పని చేసాను అనుకుని తృప్తిగా తలాడించారు రావుగారు.

Written by Maneesha Josyula

మనీష జోస్యుల గణితంలో పట్టభద్రులు, మరియు కంప్యూటర్ విజ్ఞానంలో పట్టభద్రులు. గణిత అధ్యాపకులుగా, సాఫ్ట్ వేర్ లో Sr. General Manager గా ఉద్యోగాలు చేశారు, HYDSPIN (Software Process Improvement Network) coregroup member గా సేవలు అందించారు. Lioness District 320A Vice President Region II గా స్త్రీ శిశు సంక్షేమానికి సేవలు అందించారు. సంస్కృతభారతీ బాలకేంద్ర సంస్కృత అధ్యాపకురాలు గా సేవ అందించారు. స్వచ్ఛంద Process Quality Consultant గా, Vedic Maths Trainer గా చేశారు. ప్రస్తుతం బాలలకి ఉచితంగా Softskills, సంస్కృత బోధన చేస్తున్నారు. సంస్కృతభారతి సంస్థ ద్వారా సంస్కృత కోవిద ఉత్తీర్ణత పొందారు. కవితా సంపుటాలు, కథా సంపుటాలు ప్రచురించారు.
హిందీ, తెలుగు, ఆంగ్లం, సంస్కృతంలో నృత్యనాటికలు రచించి దర్శకత్వం చేశారు. తెలుగు యూట్యూబ్ లఘుచిత్రాలు , సంస్కృత భాషలో బాలల యూట్యూబ్ లఘుచిత్రాలు రచించి, దర్శకత్వం, ఎడిటింగ్ చేశారు. ‘భర్తృహరి సుభాషితములకు కథలు’, ‘ద్వైతాద్వైతము’ పుస్తకాలు తెలుగులో, మరియు ‘Epic Stories for Vemana Sumati Poems’ పుస్తకం ఆంగ్లంలో రచించారు. వీరు రచించిన కవితలు వివిధ సంకలనాలలో, పత్రికలలో ప్రచురించబడ్డాయి, సభలలో, సమావేశాలలో, కవి సమ్మేళనంలో పాల్గొన్నారు.
 . అధ్యాపకులుగా ‘Best Teacher’ అవార్డు, సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో ‘Best Instructor’, ‘Bravo’ అవార్డులు, PMI Hyderabad ‘Gyan Lahari’  అవార్డు, Lioness మమతా క్లబ్ ‘Best President’ అవార్డు, HYDSPIN ‘Continuous Executive Director service’ అవార్డు, బాలికల ఉన్నత విద్యకి సహాయం అందించినందుకు ‘Indradhanush Award’, బాల్యంలో రవీంద్రబాలానందసంఘం ‘Best President’ అవార్డు,
 
* భగవద్గీత సర్టిఫికెట్ ISKON
* ‘గీర్వాణనిధి’ 7 levels ఉత్తీర్ణత సర్టిఫికెట్
* తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయ ‘సంస్కృత క్విజ్ సర్టిఫికెట్స్ అందుకున్నారు.
 
సాక్షి TV ‘స్వేచ్ఛ’ అనే కార్యక్రమంలో ‘మహిళా సాధికారత’ అనే అంశంపై ముఖాముఖి, ETV2లో ‘తెలుగు వెలుగు’ కార్యక్రమంలో ‘భర్తృహరి సుభాషితములకు కథలు’ పుస్తకం పై ముఖాముఖి, యాదగిరి దూరదర్శనం ‘సాహితీ సౌరభాలు’ కార్యక్రమంలో ద్వైతాద్వైతము పుస్తకం పై ముఖాముఖి, ETV అభిరుచి ‘అతిథి’ కార్యక్రమంలో బొమ్మల కొలువు నైవేద్యాలపై మహిళా కార్యక్రమంలో పాల్గొన్నారు. ద్వైతాద్వైతం పుస్తక వివరణతో 9 ఎపిసోడ్ లు “క్యాపిటల్ భక్తి ఛానెల్” వారికి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఒక 7 ఎపిసోడ్ లు సంక్రాంతి, భోగి, కనుము, రథసప్తమి గురించి ఇదే యూట్యూబ్ ఛానెల్ వారికి ఇంటర్వ్యూ ఇచ్చారు.
 . మనీషా జోస్యుల గారు బాల్యం లో Dr. ఉమారామారావు వద్ద భరతనాట్య శిక్షణ పొందారు.
శ్రీ గోపాల్ రాజ్ భట్ వద్ద జానపద నృత్యం శిక్షణ పొందారు. డాన్స్ ట్రూప్ తో కలిసి వివిధ రాష్ట్రాలలో జానపద నృత్య ప్రదర్శనలు ఇచ్చారు.
* పాఠశాల, కళాశాలలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో, పూర్వవిద్యార్థిని సమ్మేళనంలో నాట్యప్రదర్శనలు ఇచ్చారు.
* Telangana రాష్ట్ర సంస్కృతి నృత్యం గణతంత్ర దినోత్సవం పెరేడ్ లో డిల్లీ, హైదరాబాదు లో పాల్గొన్నారు.
* ప్రతి సంవత్సరం దసరాకి బొమ్మల కొలువు తీర్చడం, హస్తకళల పైన అభిరుచితో వివిధ ఆకృతులు బొమ్మలు తయారు చేస్తారు.
_**__

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

“దారిపట్టిన న్యాయం”

అరుణ కాంతులు