చైత్రమాసంలో వసంత ఋతువు వస్తుంది. మోడులను చిగురింప చేసి మనోహరంగా ప్రకృతిని మార్చి వేస్తుంది. ఈ చిత్రాలు చేసే చైత్రమాసం 60 సంవత్సరాల మన కాలచక్రంలో మొదటిది. అందుకే పెద్దలు 60 సంవత్సరాల కాలాన్ని ఒక మహా విపంచిగా భావన చేశారు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క తంత్రి పలుకుతుందట. మన సంప్రదాయంలో ప్రతి సంవత్సరానికి ఒక పేరు ఉంది.. సంవత్సరాన్ని ఆరుఋతువులుగాను 12 మాసాలుగాను ,రెండు అయినాలుగాను ,విభజించారు మన పూర్వులు.రెండేసి మాసాలకు ఒక ఋతువు చొప్పున ఆరు ఋతువుల్లో 12 మాసాలు అమరిపోతాయి.. చెట్లన్నీ పూలతో, సరస్సులన్నీ పద్మాలతో , స్త్రీ పురుషులు కాముక భావంతో అలరారుతున్నారని వర్ణిస్తాడు కాళిదాసు…
చైత్ర శుద్ధ పాడ్యమని ఉగాదిగా యుగాది నుండి ఆరాధిస్తూ వస్తున్నాం.. పూర్వం మన పెద్దలు చెప్పిన మాట ప్రకారం పుష్యమాసం మంచు కురిసే సమయంలో హేమంత ఋతువులో చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉండేటప్పుడు పోషణ శక్తి కలిగి ఉంటాడు కాబట్టి పుష్య పున్నమినాటి రాత్రి సిద్ధాంతులు తెల్లని నూతన వస్త్రాన్ని గాని దూదిని గాని మంచులో ఉంచి ఆ మరునాడు దానిని పిండి ఆ ప్రక్రియలో వచ్చే నీటి చుక్కల్ని బట్టి పంచాంగ రచన చేసే వారినీ, ఎన్ని చుక్కలు నీరు పడితే అన్ని కుంచాల వర్షం కురుస్తుందని అంచనా వేసే వారనీ,
తిథి వార నక్షత్ర కరణ యోగాలను గణించి, చైత్ర శుద్ధ పాడ్యమినాడు పంచాంగాన్ని చెప్పే వారని ప్రతీతి. ఇదే ఆచారంగా ఇప్పటికీ తెలుగు నూతన సంవత్సరం మొదటి రోజైన ఉగాదినాడు పంచాంగ శ్రవణం చేస్తారు..
తీపి, కారం , పులుపు , ఉప్పు , చేదు , వగరు కలిపిన ఆరు రుచుల పచ్చడిని తిని పగలు, రాత్రి , చీకటి , వెలుతురు , సుఖం , దుఃఖం అనే మానసిక వికారాలను అధిగమించడానికి నాందిగా ఉగాదిని జరుపుకుంటారు.
తిథి, వార , కరణ , నక్షత్ర , యోగ కారణాలు రోగాలను తొలగించి సమస్త శుభాలను కలుగచేయడం ఉగాది నుండే ప్రారంభం అవుతుందని గొప్ప విశ్వాసం. ఈ ఉగాది వసంత ఋతువులో చైత్రమాసంలో మొదటి రోజున వచ్చి భవిష్యత్తు ఆశలను చిగురింప చేస్తుంది….
కొన్ని ప్రాంతాలలో ఉగాదినాడు ఏరువాక ముహూర్తం కూడా పెట్టుకుని ఆరోజే నూతనమైన కార్యక్రమాలు అన్నిటికీ శ్రీకారం చుడతారు.
వసంతం ప్రకృతికాంతకు సీమంతం.. వసంతాన్ని మధుమాసం అని , మాధవ మాసమని కూడా అంటూ ఉంటారు. మాధవుడంటే విష్ణువు మాధవునికి చాలా ఇష్టమైన మాసం కాబట్టి దీన్ని మధుమాసం అంటారంటారు.
మనసును చలింప చేసే మాసం వసంత ఋతువుగల చైత్రమాసం కాబట్టి దీన్ని మన్మధ మాసం అని కూడా అంటారు. వసంతంలో చెట్లన్నీ చిగుర్లు వేస్తాయి. ఎర్రగా పూచే మోదుగు పూలు , మల్లెలు , మొల్లలు , జాజులు, విరజాజులు , నందివర్ధనాలు , గరుడ వర్ధనాలు కనులవిందు చేస్తాయి. ముఖ్యంగా పూలు పరిమళించి, మహిళల
మనసులను రంజింపజేస్తాయి.. రాజుల కాలంలో ఈ వసంత రుతువులో అద్భుతమైన కార్యక్రమాలు , సాంస్కృతిక కార్యక్రమాలు , వేడుకలు నిర్వహించేవారు.. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో తీర్థాలు, పరసలు, అమ్మవారి పండగలు ఉగాది నుండే ప్రారంభమవుతాయి.. తెలుగు ప్రాంతంలో కూడా వసంత ఉత్సవాలు జరుపుకొనే సంప్రదాయమున్నది. “ఋతువుల రాణి వసంతకాలం మంత్రకవాటం తెరుచుకుని వచ్చింది” అంటారు మన శ్రీశ్రీ గారు.
ఈ ఋతువులో ప్రకృతి సోయగాలు చూడడానికి రెండు కళ్ళుచాలవు… భగవంతుని మాయాజాలమే..
ప్రతి ఋతువు అందాలు చిందించినా, వసంత సోయగాలు వేరుగా ఉంటాయి కాబట్టి ఈ ఋతువును ఋతువుల రాణి అన్నారు. ఈ నక్షత్రం సమయం లో అత్యంత ఆహ్లాదకరమైన వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి రోజు,
దైవం మానస రూపేణా అన్న విధంగా,,మానవ ధర్మాలను విడమర్చి చెప్పడానికి ఆచరించి చూపిన శ్రీరామచంద్రుడు ఇనవంశంలో జన్మించాడు..తల్లిదండ్రులను దైవాలుగా భావించడానికి అన్నదమ్ములను ఆదరించడానికి, సేవకులను సంతోష పరచడానికి, ప్రజలను కన్న బిడ్డల వలె పాలించడానికి,, ముఖ్యంగా ఆలుమగల అనురాగానికి నిలువెత్తు నిదర్శనమైన సీతారాముల కళ్యాణం రామచంద్రుడు జన్మించిన నక్షత్రం నాడే .. అంటే, శ్రీరామనవమినాడే ఉత్సవంగా జరుగు తుంది ..రామ కళ్యాణం లోక కళ్యాణం అని భారతదేశం అంతటా బ్రహ్మాండంగా జరుపుకుంటారు.. ముఖ్యంగా మనతెలుగువారు సంప్రదాయబద్ధంగా తాటాకు పందిళ్లు వేసి, సీతారాములచే తలంబ్రాలు పోయించి, అయోధ్య రామయ్య అన్నయ్య మాకు … వాలు కనుల సీత వదినమ్మ మాకు … అంటూ మురిసిపోతూ ఆ కళ్యాణ ఘట్టాన్ని వీక్షిస్తారు.. రామ కళ్యాణపు అక్షితలను శిరస్సున ధరించి తమ జీవన మార్గానికి సోపానాలు వేసుకుంటారు……
ఉత్తరాది వారికి అత్యంత ప్రియమైన హోలీ పండుగ ఈ మాసంలోనే వస్తుంది . ఆటలతో పాటలతో సందడిగా, ఐకమత్యంగా రంగులు జల్లుకుంటూ ఆనందంగా ఉత్సవాలు చేసుకుంటారు..
చిత్రాల చైత్రం శోభిల్లుతూ మదమాసం కావున మన్మధ భావాలు రేకెత్తిస్తూ మనోహరంగా సాగిపోతుంది.
సంవత్సరాది తో పాటుకళ్యాణాలతో కమనీయంగాసాగిపోయే మాసమిది.
నాటి రాజులలో ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు వసంతోత్సవాలు నిర్వహించి కవి పండితులను సత్కరించే వారని ప్రసిద్ధి . అదేవిధంగా కొండవీటి రాజులు కూడా వసంతోత్సవాలను కడువైభవంగా జరిపే వారట కర్పూర వసంతరాయులని అందుకే అతనికి కర్పూర వసంతరాయలు అనే బిరుదు వచ్చింది .
రామాయణంలో, మహాభారతంలో, ఈ ఋతువర్ణనలు అద్భుతంగా జరిగాయి.. చైత్రమాసంలో జైత్రయాత్రలు చేసినట్లు ప్రబంధాల్లో వర్ణింపబడి ఉంది… వన విహారములు, ,జలవిహారాలు ఈ మాసంలో జోరుగా సాగుతాయి..
ఋతుసంహారమే ప్రధాన కావ్యం గా రచించిన, కవి కుల గురువు కాళిదాసు,వసంత ఋతువు గురించి అద్భుతంగా వర్ణించారు..కవిత్రయంలో ఎర్రన, భాగవతం లో పోతన, మనోహరంగా ఋతువులను వర్ణిస్తే …. ప్రబంధ కవులలో
అల్లసాని పెద్దన, చక్కగా వర్ణించారు.. వసంత ఋతువు రాగానే దేవకాంతలు హిందోళ రాగం లో గానం చేశారట . ఉగాది ని చైత్ర శుద్ధ పాడ్యమినాడుజరుపుకొని, గున్న మామిడి గుబురులలోంచి కూస్తూ హుకు హు రాగాల కోయిలమ్మను పిలుస్తూ, పంచాంగ శ్రవణంలో పరవశించిపోతూ,,
ఆరు రుచుల పచ్చడిని ఆస్వాదిస్తూ వసంత ఋతువు కు స్వాగతం పలుకుతాం..
భారతీయ సంస్కృతిలో కాలాన్ని అత్యంత పవిత్రమైన తత్వంగా భావించారు . కాలమే సృష్టికి ఆధారం . కాలమే జీవన చక్రాన్ని నడిపించేది . అందుకే కాలాన్ని మన పూర్వీకులు పండగగా జరుపుకునే సంప్రదాయాన్ని అర్పరిచారు . తెలుగు ప్రజలు ఆ సంవత్సర ఆరంభ దినాన్ని ఉగాది అనే పేరుతో మహోత్సవంగా జరుపుకుంటారు ఉగాది అనే శబ్దం సంస్కృత పదం యుగాది నుండి వచ్చింది. ఉగాది అనే పదం యుగానికి .. అంటే, సంవత్సరానికి మొదటి రోజు అనంటారు. ఉగాది అంటే యుగానికి ఆది అంటే కొత్త సంవత్సరానికి ఆరంభం అని అర్థం . భారతీయ కాల గణన ప్రకారం సంవత్సరాన్ని 12 మాసాలుగా విభజించారు . అవి చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, , శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణ మాసం అనే పేర్లతో పిలుస్తాం. ఈ 12 మాసాలను వాటికి గల ప్రకృతి లక్షణాల ప్రకారం మారుతున్న విధానానికి సరిపడా విభజించారు . వసంత ఋతువు చైత్ర వైశాఖ మాసాలు , గ్రీష్మఋతువు జ్యేష్ట ఆషాడ మాసాలు , వర్షఋతువు శ్రావణ భాద్ర పదమాసాలు, శరదృతువు ఆస్వాయుజ కార్తీక మాసాలు , హేమంత ఋతువు మార్గశిర పుష్య మాసాలు , శిశిర ఋతువు మాఘ ఫాల్గుణ మాసాలు. ఈ ఆరు ఋతువుల్లో వసంత ఋతువు ను అత్యంత సౌందర్యమయమైన ఋతువు గా వర్ణించారు . ప్రకృతి మళ్లీ పునర్జన్మ పొందినట్లుగా కనిపించే సమయంలో ముఖ్యమైన సమయం ఇదే . చెట్లన్నీ కొత్త చిగురులను అలంకరించుకొని, పూలు వికసించి, పక్షుల కిలకిల రావాలతో భూమి ఎంత అందంగా నిండిపోతుంది . అందుకే వసంతాన్ని ఋతురాజు అని కూడా పిలుస్తారు . ఈ వసంత ఋతువు ప్రారంభమయ్యే చైత్ర శుద్ధ పాడ్యమి రోజున తెలుగు ప్రజలు ఉగాది పండుగ జరుపుకుంటారు . ఈరోజు ప్రకృతి నవచైతన్యంతో నవ నవీనంగా ప్రకాశిస్తూ మన జీవితాలలో కూడా కొత్త ఆశలను చిగురించేలా కనిపించి పరవశింప చేస్తుంది . అందుకే కొత్త ఆశలు ప్రారంభం కావాలని సంకల్పిస్తారు మనవాళ్ళు.
ఉగాది పండుగ రోజు ఉదయాన్నే లేచి , స్నానం చేసి, ఇల్లంతా శుభ్రం చేసి , మామిడాకుల తోరణాలతో అలంకరించి , ముంగిళ్ళలో రత్నాల ముగ్గులు తీర్చిదిద్ది, నూతన వస్త్రాలు ధరించి , ఉగాది పచ్చడిని తయారు చేసి , అందరూ సేవిస్తా రు. అందులోని ఆరు రుచులు తీపి పులుపు చేదు కారం ఉప్పు వగరు మన జీవితాలలో కలిగే ఆనందం కోపం ఆశ్చర్యం భయం అంటే అనుభవాలను సూచిస్తాయని భావిస్తారు . చాలావరకు చాలా ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాలలో పట్టణ ప్రాంతాలలో కూడా అమ్మవార్లకు ఉత్సవాలు తీర్థాలు పండగలు పరసలు జరుగుతూనే ఉంటాయి.ఉగాదికి ముందు రోజు అమావాస్య కొత్తమవాస్య అని పిలుస్తారు అమావాస్యనాడు అమ్మవారిని ఆరాధిస్తూ ఉత్సవాలు చేస్తారు.
ఈ రోజున మరొక ముఖ్యమైన పండగ అంటే ఈ పండగలో ముఖ్యమైన ఆచారం పంచాంగ శ్రవణం.
ఈ పంచాంగం తయారు చేయడంలో కూడా ఆ కాల గణనను చేయడంలో ఒక ప్రత్యేకమైన పద్ధతిని అవలంబిస్తారని పెద్దల ఉవాచ . పుష్య మాసంలో సంక్రాంతికి పూజలు చేసి కాలపురుషునికి నమస్కరించి నిష్టాగరిష్ఠులైన పండితులు ఇంటిపై ఒక తెల్లని వస్త్రాన్ని సాయం సంధ్యా సమయంలో ఆరవేసి, ప్రాతఃకాలంలో అనుష్టానం అయిన తర్వాత ఆ వస్త్రాన్ని ఒక పాత్రలో పిండుతారని అలాగా ఆ నెల రోజులు పిండిన మంచు నుండి వచ్చిన బిందువులను లెక్కిస్తూ కాలగణన చేస్తారని చిన్నప్పుడు పెద్దలు చెప్పేవారు. ఆ విధంగా పంచాంగం లెక్కలు కడతారని నమ్మేవారు.
పంచాంగంలో ఆ సంవత్సరానికి సంబంధించిన గ్రహగతులు రుతువులు మార్పులు పండుగలు శుభకాలాలు మొదలైన విషయాలు వివరింప బడతాయి .

పంచాంగంలోని ఐదు ప్రధాన అంగాలు 1. తిథి 2. వారం 3. నక్షత్రం 4. యోగం 5 కరణం.ఇప్పుడు ఒక్కొక్క దాన్ని చూద్దాం. ఒకటి తిథి
చంద్రుడు సూర్యునితో సంబంధించి పొంది కోణాంతరాన్ని ఆధారంగా చేసుకుని ఏర్పడే కాలాన్ని తిథి అంటారు
ఒక నెలలో 30 తిథులు ఉంటాయి
15 రోజులు ఒక పక్షం. మాసంలో రెండు పక్షాలు ఉంటాయి. 15 తిథులు ఒక పక్షంలో వస్తాయి.
అవి వరుసగా పాడ్యమి ,విదియ, తృతీయ ( తదియ) , చతుర్థి( చవితి) , పంచమి , షష్టి, సప్తమి , అష్టమి , నవమి , దశమి , ఏకాదశి, ద్వాదశి , త్రయోదశి, చతుర్దశి , పౌర్ణమి ఇవి శుక్లపక్ష తిథులు.
కృష్ణపక్షంలో పాడ్యమి నుండి చతుర్దశి వరకు తిథులు యధాతథంగా వచ్చి 15వ రోజు అమావాస్య వస్తుంది.
వారం వారం అంటే వారంలోని రోజుల వ్యవస్థ. భారతీయ సంప్రదాయం ప్రకారం ఏడు వారాలు ఉంటాయి. అవి వరుసగా ఆది , సోమ , మంగళ , బుధ , గురు , శుక్ర , శనివారాలు. ప్రతి వారానికి ఒక గ్రహాధిపతి ఉంటాడు.
నక్షత్రం విషయాలు చెప్పుకుంటే, చంద్రుడు తన ప్రయాణంలోని 27 నక్షత్రాలను దాటి సాగుతాడు . చంద్రుడు ఏ నక్షత్రంలో సంచరిస్తున్నాడో ఆ రోజు నక్షత్రంగా చెప్పబడుతుంది . ఉదాహరణకు అశ్వనీ , భరణి , కృతిక , రోహిణి , మృగశిర , ఆరుద్ర, పునర్వసు , పుష్యమి , ఆశ్లేష , మఖ, పుబ్బ , ఉత్తర , హస్త , చిత్త, స్వాతి , విశాఖ , అనురాధ, జ్యేష్ట, మూల , పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం , ధనిష్ట, శతభిషం , పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర , రేవతి. చంద్రుడు అశ్వనీ నక్షత్రంతో కూడియున్నది ఆశ్వీజ మాసం అని భరణితో కూడియున్నది బాధపడమాసం అనీ, కృత్తికతో కూడియున్నది కార్తీక మాసం ఇలా చెప్పబడతాయి..
ఇక యోగము …. సూర్యుడు, చంద్రుడు కలిసి ఏర్పడే గణిత సంబంధం ఆధారంగా యోగాలు నిర్ణయింపబడతాయి . మొత్తం 27 యోగాలు ఉంటాయి .
ఉదాహరణకు నిష్టం బయోగం ప్రీతియోగం ఆయుష్మాన్యోగం సౌభాగ్య యోగం మొదలైనవి.
ఐదు కరణం- తిథి యొక్క అర్థ భాగాన్ని కరణం అంటారు . మొత్తం 11 కరణాలు ఉంటాయి . ఉదాహరణకు
బావ కరణం బాలవకరణం, కొలవకరణం, తైతిల కరణం, గరజ కరణం వణిజ కరణం మొదలైనవి..
పంచాంగంలో ఉండే ఇతర విషయాలు…
పంచాంగంలో ఈ ఐదు అందాలతో పాటు మరికొన్ని విషయాలు కూడా ఉంటాయి.
ఒకటి సంవత్సర నామం మాసాలు పండగల తేదీలు , గ్రహణాలు , శుభముహూర్తాలు , రాహుకాలం , యమగండం పాటించ వలసిన పద్ధతులు , ఉపాసనలు దీక్షలకు సంబంధించిన ముహూర్తాలు, వ్రతాలు ఉపవాసాలు మున్నగున వన్నీ ఉంటాయి .
ఉగాది రోజున పంచాంగ శ్రవణం ప్రాశస్త్యం.
ఉగాది రోజున పండితులు కొత్త సంవత్సరానికి సంబంధించిన పంచాంగాన్ని చదివి వినిపిస్తారు . దీనిని పంచాంగ శ్రవణం అంటారు.
పంచాంగం వినడం వలన, ఆ సంవత్సరంలో వర్షపాతం ఎలా ఉంటుంది, సహజ ఉత్పాతాలు, దొంగ భయాలు,
ఆర్థిక పరిస్థితులు, పశువులు పక్షులు, పశుపక్షాదులు, వారి పాలకులు . పాలితులు, యుద్ధాలు, యోచనలు
దేశ ప్రజల స్థితిగతులు గ్రహగతులు వంటి విషయాలను సాంప్రదాయం ప్రకారం సవివరంగా తెలియజేస్తారు . అందుకే ఉగాది రోజున పంచాంగ శ్రవణం వినడం శుభప్రదం . ఇది మన సంప్రదాయం.
పేరుపేరునా వారు పుట్టిన జన్మ నక్షత్రం నామ నక్షత్రం బట్టి ఆ సంవత్సర ఫలితాలు వారికి ఎలా ఉంటాయో పంచాంగ శ్రవణంలో తెలియచేస్తారు.
పంచాంగ శ్రవణ ఫల శృతి శ్లోకం..
“తిథేశ్చ శ్రీమాప్నోతి వారాదాయుష్య వర్ధనం ,
నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం
కరణాత్ కార్యసిద్ధిస్తు పంచాంగ శ్రవణం శుభం”
భావం – పంచాంగంలోని 5 అందాలను వినుటం వలన …. తిథి వలన ఐశ్వర్యం లభిస్తుంది . వారం వలన ఆయుర్దాయం పెరుగుతుంది . నక్షత్రం వలన పాపాలు తొలగిపోతాయి . యోగం వలన రోగాలు తగ్గుతాయి . కరణం వలన కార్యసిద్ధి కలుగుతుంది . అందువలన పంచాంగ శ్రవణం శుభప్రదమని ఈ శ్లోకం తెలియజేస్తోంది.
నూతన సంవత్సర మంగళ శ్లోకం….
సర్వేభవంతు సుఖినః సర్వే సంతు నిరామయా:
సర్వేభద్రాణి పశ్యంతు మా కశ్చిత్ ద్దు:ఖ భాగ్భవేత్
ఈ సంవత్సరం “పరాభవ” నామ సంవత్సరమని పరితపించే వారికి ఒక మాట . పరా అంటే పరాశక్తి త్రిపుర సుందరీ దేవి, భవ అంటే భవుడు శివుడు, “జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరః” అని ప్రార్థించే ఆ పరమేశ్వరీ పరమేశ్వరులపేర్లను తనలో దాచుకున్న ఈ “పరాభవ నామ ” సంవత్సరం,మనలను పరాభవించాలనుకున్న శత్రువులను పరాభవానికి గురిచేసి ఆ పరాశక్తి పరమేశ్వరుల కృపతో జగత్ కళ్యాణ కారణమై అలరిస్తుందని ఆశిద్దాం .
మానవ జీవితమే ఆరు ఋతువుల సమ్మేళన అయినప్పుడు మధురమైన వసంత ఋతువు మానసికోలాసాన్ని కలిగిస్తుంది… సృష్టికి ఆరంభమైన ఈ ఈరోజు ఉగాది అంటూ ఉత్సాహంగా 60 వసంతాల కాలగమనంలో
అందంగా వచ్చే సుందర సంవత్సరంలో ఆదిమాసమైన చైత్రం అందాల మాసం.సుందర దరహాసం…
ఈ పరాభవ సంవత్సరం సమస్త సుఖాలను, శుభాలను కలుగజేసి మానవతా భావంతో మనుషులందరూ వికసించేటట్లు చేయాలని ఆశిద్దాం..మన ఆశయం సిద్ధించాలని ఆశలు నెరవేరాలని ఆ భగవంతుని ప్రార్థిద్దాం..
……సమాప్తం…..