“తొలి కథ”

కథ

“ఈ కథలో పస యేమీ లేదు. కథల సంపుటిలో ఈ కథను వేస్తే, ఈవిడేనా ఈ కథ వ్రాసిందని పాఠకులనుకునే ప్రమాదముంది. అందుకని ఈ కథను పక్కకు పెడితే మంచిదని నా అభిప్రాయమని” ప్రముఖ రచయిత యిచ్చిన సూచనను కొట్టి వేసేంత సాహసం చెయ్యలేను. అలాగని ఈ కథను వెయ్యకుండా వుండాలంటే మనసొప్పడం లేదు. ఎందుకంటే ఇది తన తొలి రచన. ఎన్ని తెల్లకాగితాలను నలుపు చేస్తే, యెన్ని నిద్రలేని రాత్రులను మధిస్తే, ఈ చిన్న కథ నా చేతికి వచ్చిందో నాకే తెలుసు.
నేను రచయిత్రిగా గుర్తింపు పొందడానికి తొలి మెట్టైన ఈ కథ జ్ఞాపకాల దొంతర్లలో చేరిపోవాల్సిందేనా? తనకు తప్పించి, దాని ఉనికి వేరేవాళ్లకి తెలిసే అవకాశమే వుండదా? అనుకుంటే మనసు దిగులు పడిపోతుంది. ఎన్ని పత్రికలకు పంపించినా, నిన్ను వదలనని ఈ కథ తిరుగుటపాలో నన్ను చేరిపోయేది. అప్పుడే మనసుకు ధైర్యాన్ని నూరిపోసి, మొదటిసారి ఆయనను కలవడానికి వెళ్ళింది. అంతకుముందు ఎన్నోసార్లు చూసినా, ఆయన మీటింగులకు అటెండైనా, అతనితో మాట్లాడాలనే కోరిక వున్నా, సాహసమైతే చెయ్యలేకపోయింది. ఈ కథ కోసం… కథలో యేమి లోపముందో తెలుసుకోవడానికి, మొదటిసారి ఆయన ఇంటికి వెళ్ళింది.
ఆయనొక ప్రముఖ కథా రచయిత. ఆయనలాగే రచనలు చేసి మంచి పేరు తెచ్చుకోవాలని, ఆయన సభలు, సమావేశాలన్నిటికీ హాజరయ్యేది. ఆయన చెప్పిన ప్రతి వాక్యాన్ని గుర్తు పెట్టుకునేది. ఆయన వ్రాసిన కథలన్నీ చదివింది. ఒక రకంగా ఆయనకొక అజ్ఞాత అభిమాని తాను.
మొన్న ఒక సమావేశంలో, “కథ సమాజాన్ని ప్రతిబింబించాలి. సమాజంలోని సమస్యలే కథలు. కథకుడు సమాజంలోని ఒక సమస్యను తీసుకొని దానిని లోతుగా అధ్యయనం చేసి, కారణాలను యెత్తి చూపిస్తూ, పరిష్కారం పాఠకుడే వెతుక్కునేటట్టుగా కథ ముందుకు సాగాలి. చెప్పాలంటే పాఠకుని ఆలోచింప చేసేదిగా వుంటేనే అది మంచి కథ అవుతుంది. తరాలైనా ఆ కథ నిలిచిపోతుంది. మీ నుండి ఒక గురజాడను, రావిశాస్త్రిని, కారాను ఆశించను. మీరంత గొప్పవారైతే సంతోషించే వాళ్లలో మొదటి వ్యక్తిగా నేనుంటాను. కాని, ఈనాటి యువతలో పుస్తక పఠనమే కరువైపోయింది. రచనలు చేసేవారే కరువైపోయారు. ఇది ఇలాగే కొనసాగితే సమాజంలోని రుగ్మతలను ఎత్తి చూపించేవాళ్ళు ఎవరుంటారు? రేపటి తరానికి తెలుగుకథ అంటే యెలా తెలుస్తుంది? అందుకే, ముందు మీ నుండి కథ రాయాలన్న అభిలాషను కోరుకుంటాను. ప్రయత్నిస్తేనే కదా ఏదైనా ముందుకు సాగేదంటూ” ఆయన ఉపన్యాసం సాగింది.
కథలు వ్రాసి తీరాలనే ఆలోచనకు అంకురార్పణ చేసింది ఆయన ఉపన్యాసమే. ఆ స్ఫూర్తితోనే తానొక కథ వ్రాసింది. కాని, కథలు చదివేవాళ్ళు తన చుట్టుపక్కలెవ్వరూ లేరు. స్నేహితులకు చూపిద్దామనుకుంటే “ఏమిటీ! కథ రాశావా! నువ్వే! నమ్మమంటావా?” అన్నట్టు ఎగాదిగా చూస్తుంటే “అబ్బే! జోక్ చేశా! నేను కథ వ్రాయడమేమిటని” అంటే “సరేలే! ఇలా హార్ట్ ఎటాకులు తెచ్చే పనులెప్పుడూ చెయ్యకని” వార్నింగిచ్చినంత పని చేశారు.
ఇంకా ఏం చేయాలో అర్థం కాక ధైర్యం చేసుకొని, ఆయన ఇంటి తలుపు తట్టింది. తనెవరో తెలియకపోయినా లోపలకు రమ్మని, తనొచ్చిన పనేమిటో తెలుసుకొని, ఐదు నిమిషాల్లో చదివి, “నీ ఆలోచన అభినందనీయం. ఈ కాలంలో కథలు చదివేవాళ్ళు కాని, వ్రాయాలని తపించేవాళ్ళు కాని లేరు. నీలాంటి వాళ్లకోసమే మేమెదురు చూస్తున్నామని” అనగానే నా ముఖం మతాబులా వెలిగింది.
అంతలోనే, “ఇతివృత్తం బాగానే ఉంది. ఒక పని చెయ్యి. ఇదే కథను మూడునెలలు పోయాక చదివి, అప్పుడు నీకేమనిపిస్తుందో చెప్పు”, అని నా ఆశల మీద నీళ్లు చల్లేసారాయన. నా కథ మీద ఆయన అభిప్రాయం చెప్తారనుకుంటే, మూడు నెలల తర్వాత నువ్వే సమీక్షించుకో అనడం నిరుత్సాహాన్ని నింపింది నాలో. అప్పుడు గుర్తొచ్చింది, “కథ వ్రాసిన వెంటనే ఏ పత్రికకూ పంపించకండి. మూడు నెలలు పోయాక, ఎవరిదో అనుకుంటూ ఆ కథను చదవండి. అప్పుడా కథ చదివాక కూడా, బాగుందనిపిస్తేనే, పత్రికలకు పంపించండి. మీ కథకు మీరే మొదటి సమీక్షకులు. అప్పుడే మీ నుండి మంచి కథలు వస్తాయంటూ”, ఒక సమావేశంలో ఆయన కొత్త రచయితలకు చేసిన సూచన. ముఖం వేలాడేసుకుని ఆయనకు థాంక్స్ చెప్పి బయటపడ్డాను.
మూడు నెలల తర్వాత ఆ కథను చదివితే, “అసలిది కథేనా! ఏమి చెప్పాలనుకుంది తానీ కథలో” అనిపించి, చేర్పులు మార్పులూ చేసినా, సంతృప్తిగా అనిపించక ఆ కథనొక మూల పడేసింది. తర్వాత ఎన్నో కథలు వ్రాసింది. కొత్త రచయిత్రిగా గుర్తింపు తెచ్చుకుంది. పత్రికలలో పడిన కథలను సంపుటిగా వెయ్యమన్న స్నేహితుల ప్రోద్బలం మేరకు కథలనెంపిక చెయ్యాలని చూస్తే, ఇన్నాళ్లూ మూల దాక్కున్న తన తొలి కథ బయటికి వచ్చింది.
ఆ కథలసంపుటిలో వేస్తే, తనేనా ఆ కథ వ్రాసిందని పాఠకులనుకునే ప్రమాదముంది. వెయ్యకుండా ఉండడానికి మనసొప్పడం లేదు. కథను కొద్దిగా మారుద్దామనుకుంటే, అప్పుడది ఆ కథ అవ్వదు. వేరే కథ అవుతుంది. ఆ కథను అనాథగా వదిలెయ్యాల్సిందేనా? ఎవరేమనుకున్నా, తన పేరుప్రతిష్టలు మంట కలిసినా, మార్చకుండా దాన్నలాగే ప్రచురిస్తానని, అన్ని కథలతో పాటు ఈ మొదటి కథను కూడా ప్రచురణకర్తకు పంపించింది. దాన్ని చదివిన వెంటనే అటు నుండి ఫోన్, “ఈ కథను సంపుటిలో వెయ్యొద్దని, ఈ కథ చదివాక, పాఠకుల్లో నేనంటే ఉన్న మంచి అభిప్రాయం పోతుందని”.
నా అభిమాన రచయిత, అభిప్రాయాన్ని పక్కన పెడదామనుకుంది. గాని ప్రచురణకర్త కూడా అలాగే అంటే… అలాగని దాన్ని వదిలేయలేను. అనాకారిగా ఉన్నా, తల్లికి బిడ్డెంత అపురూపమో, తనకి ఈ కథ అంతే! అందుకే ఈ కథను ఆఖరి కథగా వేసి, ఆ కథ వ్రాయడానికి తాను పడ్డపాట్లు చెప్తే పాఠకులు, కాసేపు నవ్వుకోవచ్చు. ఐనా ఈ కథను చదివితేనే కదా, ఒక రచయిత్రిగా నేనెంత ఎదిగానో పాఠకులకు తెలిసేది. అందుకని ఈ కథను సంపుటిలో ప్రచురించకుండా, అనాథను కానివ్వను. ఎప్పటికీ కానివ్వను.
*
“అనాథను కానివ్వను అనాథను కానివ్వనంటూ, ఏమిటే ఆ కలవరింతలు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఎవరిని అనాథను కానివ్వవు? మరల ఏమన్నా కథ గురించి కలగన్నావా ఏమిటి? టెక్స్ట్ పుస్తకాలు చదువుకోకుండా, కథల పుస్తకాలు చదివితే ఇలాగే ఉంటుంది మరి” అని అమ్మ ఒక్క చరుపు చరిస్తే మెలకువ వచ్చింది. ఇదంతా కలా? నిజంగా జరగలేదా? తాను రచయిత్రిని కాలేదా? తన కథలు సంపుటిగా రావడమన్నది ఒట్టి కలేనా? ఆ ప్రముఖ రచయితను కలవడం కూడా కలేనా! నిజంగా జరిగినట్టే ఉంది. కలలో జరిగినది జ్ఞప్తికి తెచ్చుకోసాగింది మానస.
నా కథను అనాథను కానివ్వను. అనాథను కానివ్వనన్న కలలోని మాటలు, కలవరింతలుగా బయటికి వచ్చాయన్నమాట. తనలో తానే నవ్వుకుంది.
టెక్స్ట్ పుస్తకాలు పక్కన పడేసి, నవలలూ, కథలూ ఎక్కువ చదివే తాను, సాహితీ ప్రియురాలైన ఒక స్నేహితురాలు లాక్కెళ్తే, ఆ ప్రముఖ రచయిత ముఖ్య అతిథిగా హాజరైన సభకు వెళ్లి, కథ యెందుకు వ్రాయాలి, యెలా వ్రాయాలి, యువ రచయిత/ రచయిత్రులకు నా సలహా అంటూ… “కథలు ఎక్కడినుండో రావు. మన జీవితాలనుండే వస్తాయి. చుట్టూ జరుగుతున్న సంఘటనలను నిశితంగా గమనించి, వాటిని విశ్లేషించండి. ఒక్కొక్క సంఘటన ఒక్కొక్క కథను చెప్తుంది. మనం చూసే దృష్టికోణం నుండి, కథావస్తువు మారుతుంది. పరిష్కార మార్గాలు మారుతాయి. పరిష్కారాన్ని పాఠకుడే వెతుక్కునేటట్టుగా మీ కథాగమనం ఉండాలి. సమాజానికి మేలు చేసేదిగా ఉన్నప్పుడే అది మంచి కథ అవుతుంది” అంటూ ఎమోషనల్ గా ఆయన యిచ్చిన ఉపన్యాసం, కొత్త రచయితలు రావాలని పాతతరం రచయితలు ఎంతగా అభిలాషిస్తారో అర్థమైంది.
కథను బ్రతికించడానికి ఆయనెంత తపన పడుతున్నారో, దానికోసం ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నారో అర్థమైంది. ఆయన ఉపన్యాసంలోని ప్రతి పదం, తనలాంటి వాళ్ల మనసును ఉత్తేజింపజేసింది. ఆయన చెప్పిన ప్రతీ పదం తన మనసును అల్లుకుపోయింది. ఎలాగైనా ఒక మంచి కథ వ్రాయాలని అప్పుడే నిర్ణయించుకుంది. ఆ ఆలోచనలతో నిద్రపోయిందేమో! తన మనసులోని భావాలే కలగా వచ్చాయన్నమాట. కలే యింత అపురూపంగా వుంటే, ఈ కలనే కథగా వ్రాస్తే… కథ వ్రాయాలనే బీజం మొలకెత్తి మానై కూర్చుంది మదిలో. నా, ఆ తొలి కథ, యెప్పుడు నా కలం నుండి జాలు వారుతుందో, నాతో పాటు అందరినీ ఎప్పుడు అలరిస్తుందో! నేను కూడా భవిష్యత్తులోకి ఆశగా ఎదురు చూస్తున్నాను.
*
ప్రొఫెసర్ (డాక్టర్) మజ్జి భారతి కలం నుండి జాలువారిన కథ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The Cruise ఓ దృశ్యప్రయాణం

“వైష్ణోదేవి ఆలయం”