భూతల స్వర్గంలో
గాయాల కోతలు
మంచు కొండల్లో
గుండెలు కాలినవాసనలు
ఒక్కో రక్తపు ముద్ద
ఇల్లు చేరుతుంటే
దేశం కన్నీరు వర్షమై
రాలుతుంది..
తడి తడిగాఎర్రెర్రని
అక్షరాలు..
కొర్రాయిలై మండుతున్న హృదయాలు..
ఏదిరా మతం
ఏ ప్రవక్త రచించాడు
ఈ రక్తసిక్త విలయం
బైబిల్ ఖురాన్ గీత
ఏముంటది ఏమంటది
గాలిమతం నీటిమతం
ప్రేమమతం అంతా మానవత్వమేరా
మూర్ఖుడా…!
ఎవడివిరా నువ్వు
ఏ సహకారంతో
ఈ వినాశనం..
దొంగదెబ్బ కొట్టిదాక్కుంటావ్
మాటువేసే ఉన్మత్తవు
ఉనికి కోసం
ఉసురుపోసుకుంటవు
ఇంకా ఎన్నాళ్లుఎన్నేళ్లు
ఈ కిరాతక కరాళవిన్యాసం
పాపాన్ని కను
కంటూనే ఉండు
నీ అసురోత్పత్తికి మురుస్తూ,
మతం మత్తులో జోగుతూ,
ముద్దాయిలు ముద్దాడుతూ
బుసకొడుతూనే ఉండు
దయాభిక్షతో బతు కిడ్చే పొరుగు బతుకులు
నీవు కూడా బాసటమరిచి
కూస్తున్నావు కారుకూతలు ఇంటాబయటా శత్రువులా!
ఎంతో కాలం సాగవిక
అబద్ధపు కబుర్లు
శాంతి కపోతాల తొడుగులు..
మేకతోలు పులుల విహారాలు..
మరచిపోకు గుర్తుంచుకో
నా భారతీయ తత్వం
శాంతి మంత్రం
శాంతానికీ ఉగ్రనేత్రం ఉంటది..
అగ్రహోదగ్రమహోదగ్రమై
ఉప్పెనై ఎగిసిపడుతది ప్రమధగణమై విరుచుకుపడుతది
సుదర్శనం
తిరుగుతూనే ఉంటది
పరశువు వెతికి వెతికి వేటాడుతది..
అభిమన్యులు, బాలచంద్రులు, భగత్ సింగ్ లువీరజవాన్లు ఎటూ వుంటరు..
ఖబర్దార్ ఖబర్దార్
అంత దాకా రానీయకు
తిరోగమనమై పురోగమించు
నీవు బతకాలికదరా..!