మన మహిళామణులు – శ్రీమతి భవానీ కృష్ణమూర్తి

ఇప్పటికీ తాను నిరంతరం విద్యార్థిని అని చెప్పుకుంటున్న శ్రీమతి భవానీ కృష్ణమూర్తి గారి సాహితీ ప్రయాణం, అధ్యాపక జీవితం గురించి ఆవిడ మాటల్లోనే….

నా జన్మస్థలం అత్రి మహా ముని తపస్సు చేసిన ప్రదేశం,పూతరేకులకి, మామిడితాండ్రకి ప్రసిద్ధి చెందిన తూర్పుగోదావరి జిల్లాలోని అత్రేయపురంగ్రామం.

స్వర్గీయ శ్రీభమిడిపల్లి తమ్మయ్యశాస్త్రి,మహాలక్ష్మమ్మ దంపతులకి తొమ్మిదో సంతానంగా పుట్టాను. బాల్యమంతా ఏ ప్రత్యేకతలు లేకుండా ఆట పాటలతో గడిచింది
ప్రాధమిక విద్య, హైస్కూల్ విద్య అదే ఊళ్ళో. దాదాపుగా
ఏడెనిమిది గ్రామాలకు ఒకటే అయిన మహాత్మ హైస్కూల్ లోనే నా విద్యాభ్యాసం. వేదపండితులైన మా నాన్నగారు పదమూడో ఏట చదువు మాన్పించాలని చూశారు గానీ, అప్పటి హెడ్మాస్టర్ స్వర్గీయ తాడేపల్లి సుబ్బారావుగారు, ఆ హైస్కూల్ని కళాశాలగా పెంపు చెయ్యాలనుకుంటున్న సమయంలో బాగా చదివే పిల్లల్ని మాన్పించవద్దని కబురు పంపడంతో నా చదువు కొనసాగింది.
ఆ సమయంలో మా అన్నయ్య అదే స్కూల్ లో లైబ్రేరియన్ గా పనిచేస్తూ ఉండేవాడు. వచ్చిన కొత్త నవలలు, వార, మాస పత్రికలు ఇంటికి తెస్తూoడడం నాలో పుస్తక పఠనం పట్ల ఆసక్తికి దోహదం అయింది.

పదవ తరగతి చదువుతూ ఉండగానే వివాహం జరగడం, సికింద్రాబాద్ రావడం జరిగింది.

రైల్వే ఉద్యోగి అయిన మా వారు శ్రీ జి. వి. కృష్ణమూర్తి గారు తరచు కేoపులకి వెళ్లడంతో, ఆ ఒంటరితనం నాలోని సాహిత్యభిలాషని పెంచింది. దగ్గరలో ఉన్న ఒక సర్క్యులేటింగ్ లైబ్రరీ దానికి దోహదం చేసింది. ఒకరోజుకి నవలకి పావలా, వార, మాస పత్రికలకి పదిపైసలు అద్దె.
అలా చదువుతూ చదువుతూ చిన్న చిన్న కథలు,కవితలు రాయడం, వార, మాస పత్రికలకి, ఆలిండియా రేడియోకి పంపడo జరిగింది. మొదట్లో కొన్ని తిరిగి వచ్చినా, పత్రికల్లో ప్రచురింపబడడం, రేడియోలో ప్రసారం కావడం, అక్కడ తురగా జానకిరాణి వంటి వారితో పరిచయం కావడంతో నా సాహితీ ప్రస్థానం ప్రారంభదశ ఒక మధురమైన అనుభూతి.

క్రమక్రమంగా నవల రచన పట్ల ఆసక్తి పెరిగడం, నా భర్త సహకారం తో మొదటి నవల ప్రేమమయి 1982లో ముద్రణకి నోచుకుంది.

వివాహే విద్య నాశాయ అంటారు గానీ, వివాహం తరువాతే నా చదువు, సాహిత్య ప్రస్థానం మొదలైంది.
అదే సంవత్సరం ఓపెన్ యూనివర్సిటీ ప్రారంభంకావడంతో
ఉన్నత విద్య చదవాలని బీజ ప్రాయంగా ఉన్న నాలోని కోరికకి నీరు పోసినట్లు అయింది. డిగ్రీ, ఆ వెంటనే తెలుగు ఎం. ఏ పూర్తి అయ్యే నాటికీ దాదాపుగా 20 నవలలు కొన్నిప్రముఖ వార,పక్ష,మాస పత్రికలు ఆంధ్రపత్రిక, ఆంధ్ర భూమి, పల్లకి, ఆదివారం వంటి పత్రికలలో ధారావాహికలుగా ప్రచురింపబడడo జరిగింది.

ప్రముఖ రచయితలైన యద్దన పూడి సులోచనారాణి, మాదిరెడ్డి సులోచన, వాసిరెడ్డి సీతాదేవి, కే. రామలక్ష్మి, యండమూరి వీరేంద్రనాధవ్, మల్లాది వెంకటకృష్ణమూర్తి వంటివారి రచనలతో పాటు నా రచనలు కూడా ప్రచురింపబడడం ఎంతో ఆనందంగా ఉండేది.
కొన్ని సాహిత్య వ్యాసాలు దినపత్రికలలో ప్రచురింపబడడం జరిగింది. అదే సమయంలో ఫ్రీ ల్యాన్స్ జర్నలిస్ట్ గా వనితా జ్యోతి అనే మహిళల మాసపత్రిక కొరకు అప్పటి సాంఘిక సంక్షేమ మంత్రి అయిన శ్రీమతి ప్రతిభా భారతి, ప్రముఖ నాట్య కళాకారిణి శ్రీమతి శోభానాయుడు, అప్పటి ఆలిండియా రేడియో హైదరాబాద్ స్టేషన్ డైరెక్టర్ మిస్ లీలా బావ్డెకర్ , దక్షిణ మధ్య రైల్ ఆర్ధిక సలహాదారు శ్రీమతి పద్మా అయ్యంగార్ వంటి వివిధ రంగాలలోని ప్రముఖుల్ని ఇంటర్వ్యూ చేయడం మరిచిపోలేని అనుభూతి.

అదే సమయంలో ఉజ్జయని మహంకాళి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ గా,( zrucc.) జోనల్ రైల్వే యూజర్స్ కంజర్వేటివ్ కమిటీ సభ్యురాలిగా ఎన్నో అనుభవాలు, మరిచిపోలేని అనుభూతులు.

నేను రాసిన సాహిత్య వ్యాసాలు ఎం ఫిల్ గా పరిగణిoచి, డైరెక్ట్ గా పి హెచ్ డి కి అనుమతిoచారు ఉస్మానియా యూనివర్సిటీవారు.
అప్పటి తెలుగు శాఖ అధ్యక్షులు శ్రీ యస్వి రామారావుగారు
నవల రచన పట్ల నాకున్న ఆసక్తిని గమనించి
తెలుగు నవల =ఉద్యోగినుల సమస్యలు అనే అంశాన్ని నాకు కేటాయించడం చాలా ఆనందం కలిగింది.
ఆ పరిశోధ గ్రంథం సమర్పించిన, ph d డిగ్రీ తీసుకున్నప్పుడు అమితానoదo పొందాను.

1980,90 దశకాలు నాకు గొప్ప అనుభూతిని ఆనందాన్ని కలిగించిన కాలం అని చెప్పవచ్చు. ఈ లాప్టాప్, కంప్యూటర్స్ లేని కాలం కనుక నేను రాయడమే ఆలస్యoగా అనిపించేది.అందుకు మా శ్రీవారి సహకారం, ప్రోత్సాహం మరువలేనిది.

92 సంవత్సరం లో మా ఇంటికి సమీపంలోనే శ్రీ సాయి విజ్ఞాన భారతి మహిళా జూనియర్, డిగ్రీ కళాశాల ప్రారంభిస్తూ, యాజమాన్యం వారు స్వయంగా వచ్చి ఆహ్వానించి, లెక్చరర్ గా అవకాశం ఇవ్వడంతో అధ్యాపకురాలిగా నా జీవితం మరోమలుపు తిరిగింది.

మా పిల్లలతో పాటు చదువు ఆరంభించిన నేను, వారు ఉద్యోస్థులయ్యే సరికి నేనూ ఉద్యోగస్తురాలిని అయినాను.
ఆ జగన్మాత అనుగ్రహం వల్ల పెద్దగా ఆరోగ్యసమస్యలు లేకపోవడం వల్ల ఇప్పుటికీ (72ఏళ్ళ వయసులో ) డిగ్రీ కాలేజ్ అధ్యాపకురాలిగా
పనిచేస్తూ, విద్యార్థినులకి చదువుతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, గజానికో గాంధారీ పుత్రులున్న ఈ ఆధునిక జనారణ్యం లో ఎలా మసులుకోవాలో చెప్పడంలో ఎంతో ఆనందంగా ఉంటుంది.

కరోనాతో వివిధ అంతర్జాల సమూహాల్లో భాగస్వామిని కావడం.
ఓ పక్క నవలా రచన కొనసాగిస్తూనే
వేలాదిగా చిన్న పెద్ద కవితలు రాయడం, నా రచనా జీవితం లో గొప్ప మలుపు.
దాదాపుగా 50 నవలలు ముద్రణకి నోచుకోగా అందులో 20 కి పైగా ధారా వాహికలుగా ప్రచురింప బడినవి.

పంచపదులు, సప్తపదులు, అష్టాక్షరీ, సున్నితాలు,శ్రీ పదాలు సమ్మోహనాలు,పెన్ కౌంటర్స్ వంటి వాటిలో విరివిగా రచనలు పంచుకోవడంలో ఎంతో ఆనందంపండుతున్నాను.

ఈ సందర్భంలోనే శ్రీ లలితాసహస్ర నామాలకి పంచపది ప్రక్రియ లో
వెయ్యి నామాలకి వెయ్యి పంచపదులు రాసి, ముద్రణ చేయించి,
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డా.అనంతలక్ష్మి గారిచే ఆవిష్కరించ
గలగడం ఆ అమ్మవారి అనుగ్రహంగా భావిస్తున్నాను.

నవలా తరంగిణి, సాహిత్యరత్న, కవికిరీటి, విజ్ఞానజ్యోతి, కలం సామ్రాట్, పరిపూర్ణమహిళ వంటి అనేక బిరుదులు,, సుమారు 500 పైగా ప్రశంసా పత్రాలు ఒక ఎత్తు అయితే, గత సంవత్సరం
శ్రీ పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయం, అక్షరయాన్ సంయుక్త ఆధ్వర్యంలో షష్ఠిపూర్తి కలాలకు వందనం పేరుతో
అద్భుతమైన రీతిలో నిర్వహించిన మాతృవందనం
సత్కారం పొందడం మరో గొప్ప మధురస్మృతి.

యాభై ఐదు సంవత్సరాల వైవాహిక జీవితంలో భార్యగా, తల్లిగా, అమ్మమ్మ, నానమ్మగా, తాతమ్మగా పరిపూర్ణ జీవితాన్ని పొందాను.
రచయిత్రిగా, కవయిత్రిగా వివిధ సాహితీ సమావేశ వేదికలపై , కళాశాలలో, లయన్స్ క్లబ్ వారిచే ఉత్తమ అధ్యాపకురాలిగా అనేక సన్మానాలు పొంది,
నిత్య విద్యార్థిని సంతృప్తి కరమైన జీవితాన్ని గడుపుతున్నాను.

అమెరికా మూడు సార్లు వెళ్లి నయాగరా ఫాల్స్, new యార్క్, new జెర్సీ అక్షరధామ్ వంటి సుందర ప్రదేశలన్ని చూశాను.

మనదేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలు, జ్యోతిర్లింగాలు, శక్తి పీఠాలు
దాదాపుగా అన్ని దర్శించడం జరిగింది.

21 రోజుల్లో సంపూర్ణ కాశీ యాత్ర చేసి, ఆ విశేషాలతో దైవమ్ అనే మాస పత్రికలో
ఆ యాత్ర విశేషాలను ఐదు భాగాలుగా పాఠకులతో పంచుకోవడం జరిగింది.

ఓపిక ఉన్నంత కాలం, విద్యార్థినులకు బోధన చేస్తూ, తృప్తినిచ్చే చక్కని రచనలు చేస్తూ జీవితం గడిపేయ్యాలని కోరిక.

శ్రీమతి భవానీ కృష్ణమూర్తిగారు…ఇలాగే సాహిత్య సేవచేస్తూ ఆదర్శ అధ్యాపకురాలిగా అందరికీ స్ఫూర్తిప్రదాత కావటం ముదావహం.

ఈమె ఫోన్ 9959070510

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రియమైన శత్రువు

“నేటి భారతీయమ్” (కాలమ్)