సాహిత్య ప్రపంచానికి పరిచయమే అక్కర లేని మణి ముక్తేవి భారతి గారు. యువతీ మండలి వైస్ ప్రెసిడెంట్ గానూ, ఆంధ్ర మహిళా సభ ఫైన్ ఆర్ట్స్ కాలేజీ చైర్ పర్సన్ గానూ ముక్తేవి భారతి గారు పనిచేసారు.
రంగరాజుపద్మజ:- అమ్మా! నమస్కారం!
ముక్తేవి భారతి:- నమస్కారమండీ!
పద్మజ:- తరుణీ పత్రిక పాఠకులకు మీ నేపధ్యం వివరిస్తారా?
భారతి :– ముందుగా తరుణీ పత్రిక నిర్వహిస్తున్న సంపాదకురాలికి- సిబ్బందికి ధన్యవాదములు.
నేను 10-6-1941 లో కృష్ణా జిల్లా పెడన గ్రామంలో పుట్టాను. మా తల్లిదండ్రుల పేర్లు అరవింద-వెలువలి శంకరం గారు. మా వారి పేరు ముక్తేవి లక్ష్మణ్ రావుగారు.
పద్మజ:– మీ విద్య ఎక్కడ కొనసాగింది?
భారతి:- బందరులో ప్రాథమిక విద్య, డిగ్రీ వరకు, 1961 లో M A History బెనారస్ హిందూ యూనివర్శిటీలో,
1968 M A తెలుగు ఉస్మానియా యూనివర్శిటీలోనూ,
1974 సం౹ M.Litt- ఉస్మానియాలో,
1978 సం. PG diploma in industries- ఉస్మానియాలో,
1980 Ph.D – ఉస్మానియాలో చేసాను.
పద్మజ:– మీ వృత్తికి సంబంధించిన విశేషాలు తెలుపండి.
భారతి:– నేను నారాయణ గూడలోని రావు బహద్దూర్ వెంకట్రామిరెడ్డి కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్ ( Associate professor) తెలుగు విభాగంలో,
అలాగే చిక్కడపల్లిలోని సరోజనీనాయుడు మహిళా కళాశాల లో ప్రధాన అధ్యాపకురాలిగా ( Principle) ఈ హైదరాబాద్ లోనే పనిచేసాను.
రాజా బహద్దూర్ వెంకట్ రామరెడ్డి గారు తెలంగాణలో ఉన్న బాలికలకు చదువు సంధ్యలు నేర్చుకోవాలంటే తగిన విద్యాసంస్థలు లేవని, ఆర్థికంగా కూడా చదివే స్తోమత లేని వారి కోసం ఈ పాఠశాలను స్థాపించాలని నారాయణగూడ హైస్కూల్ మరియు రెడ్డి ఉమెన్స్ కాలేజీ ని స్థాపించారు. అందులో చదివిన పిల్లలు డిస్టింక్షన్ లో పాస్ అయి జీవితంలో నిలదొక్కుకున్నారు. కేవలం బాలికలను దృష్టిలో పెట్టుకొనే నడిపారు. దాంట్లోనే నేను చాలా సంవత్సరాలు పనిచేసాను. నేను ఉద్యోగ విరమణ చేసి 25 సంవత్సరాలు అయింది. మొన్న ఈ మధ్య ఉమెన్స్ డే రోజున ఆ కాలేజీలో అచ్యుత అని ప్రిన్సిపల్ గా వచ్చిన ఆమె నన్ను మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలను ఉద్దేశించి మాట్లాడాలి! రమ్మని ఆహ్వానిస్తే …”అమ్మా! ఇంకా నన్ను గుర్తు పెట్టుకున్నారా?” అని అంటే ఎలా, మరుస్తాము? అని అన్నారు. ఆ మాట నాకు చాలా సంతోషం కలిగించింది. అందుకే నేమో అబ్దుల్ కలాం గారు నన్ను దేశాధ్యక్షుడు అని పిలిచే కన్నా ఒక ఉపాధ్యాయుడు అని అంటేనే నాకు ఎంతో ఇష్టమని అన్నారంటే ఎంతో గౌరవప్రదమైనది.
ముఖ్యంగా చిలకమర్తి లక్ష్మీనరసింహ పంతులుగారు జీవిత చరిత్ర చదువుతుంటే మనకెంతో ఆశ్చర్యం వేస్తుంది. ఆయన చాలా కష్టపడ్డాడు కంటిచూపు సరిగా ఉండదు. అయినా ఎన్నో రచనలు గణపతి వంటి నవలలు, గయోపాఖ్యానం వంటి నాటకాలు, ఎన్నో ప్రహసనాలు, జీవిత చరిత్రలు రాశారు. సంతోషం అని అన్నారు.
పద్మజ:- మీరు డాక్టరేట్ పుచ్చుకున్నారు కదా! ఏ అంశం పైన పరిశోధన చేశారు? ఆ సబ్జెక్ట్ తీసుకున్న కారణాలు ఏమిటి?
భారతి:– నేను చిలకమర్తి సాహిత్య సేవ పరిశోధనాంశంగా 1988 లో డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నాను.
ఎందుకంటే సంఘసంస్కర్తలు అంటే నాకు చాలా గౌరవం. అందులో ముఖ్యంగా చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులుగారు చాలా ఇష్టం. ఆయన జీవిత చరిత్ర చదువుతూ ఉంటే మనకెంత ఆశ్చర్యమేస్తుందంటే… చెప్పలేము.
ఆయన సమాజం కోసం చాలా కష్టపడ్డాడు. వ్యక్తిగతంగానూ కష్టమైన జీవితమే! సమాజంలో ఉన్న అన్యాయాలనే ఎదుర్కోవడం కోసం సాహిత్యాన్ని ఆయుధంగా చేసుకున్న వ్యక్తి చిలకమర్తి లక్ష్మీనరసింహగారు.
ఆయన జీవితంలో మూడు కోణాలు గ్రహించాను. సంఘసేవ, దేశభక్తి, సాహిత్య సృష్టి. వారి ప్రతిభ గురించి ఒక మాట చెప్తాను.
బెంగాల్ విభజన అప్పట్లో పెద్ద ఉద్యమం. బిపిన్ చంద్ర పాల్ దేశమంతా పర్యటిస్తూ, రాజమహేంద్రవరం వచ్చారు. ఐదు రోజులు ఆంగ్ల భాషలో ఆయన ఉపన్యసించారు. సామాన్యులకు ఆంగ్ల భాష అర్ధంకాదు కదా! అందుకని ఆ ఐదు రోజులూ ఆయన వెంట ఉండి, వారి ఉపన్యాసాలు తెలుగులో అనువదించి, ప్రజలకు అర్థమయ్యేలా చెప్పారు. అంటే ఆంగ్ల భాష మీద అంత పట్టు ఉండేదని తెలుస్తుంది. ఆయన ఎక్కువగా చదువుకోలేదు! మెట్రిక్యులేషన్ కూడా పాస్ కాలేదు. ఎందుకు చదవలేకపోయారంటే కంటి చూపు సరిగా లేకపోవడంవల్ల బ్లాక్ బోర్డు మీద అక్షరాలు సరిగ్గా కనిపించకపోయేవి. అందుకే పరీక్ష పాస్ కాలేకపోయారు. అయినా ఆ భాష మీద అంత పాండిత్యం సంపాదించుకున్నారు. ఈ ఐదు రోజుల ఉపన్యాసాల అనువాద భాషణం అయిపోయాక ,ఆయన దేశభక్తి ఉప్పొంగి పోగా ఆశువుగా ఒక పద్యం ఇలా చెప్పారు.
పద్యం:-
భరతఖండంబు చక్కని పాడియావు
హిందువులు లేగ దూడలై ఏడ్చుచుండ
తెల్లవారను గడసరి గొల్ల వారు
పితుకుచున్నారు మూతులు బిగియగట్టి!
ఇది మొట్టమొదటి జాతీయ కవిత అని సి.నారాయణరెడ్డి గారి తన పిహెచ్డి (Phd) సిద్ధాంత గ్రంథంలో రాశారు. వీరి తర్వాతే రాయప్రోలు, గురజాడ గారు దేశభక్తి కవితలు రాసారు. వాటికి స్ఫూర్తి ఈ పద్యమే అని కూడా చెప్పారు. ఇది రాసిన తర్వాత ఒకచమత్కారం జరిగింది.
బ్రిటిష్ వారు తమను గడుసరి గొల్లవారు అన్నారని నేరం మోపారట. దానికి జవాబిస్తూ
“మీకు తెలుగు భాషలో ఉన్న సొగసు తెలవదని తెల్లవారెను గడసరి గొల్లవారని చెప్పారట కానీ నిజానికి గడుసరి తెల్లవారే ” అలాంటివి ఎన్నో రాసారు.
ఈరోజు దళితుల గురించి ఎందరో మాట్లాడుతున్నారు. కానీ సంఘసంస్కర్తగా ఆనాడే ఆయన దళితులకు న్యాయం జరగాలని అనుకుని ఊరికే అనుకుంటే లాభం లేదని,
దళిత పాఠశాల, రాత్రి పాఠశాలలు నిర్వహించారు. దళితులకు పుస్తకాలు, పెన్నులు కొనేందుకు వారికి డబ్బులు ఉండవని, తానే కొని వారికి ఇచ్చి చదువు చెప్పారు. మరి ఈయనేమన్నా ధనవంతుడా అంటే కానేకాదు!ఆయనకు ఏమీ లేదు… రెండు మూడు పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేసేవారు. అటువంటి త్యాగమూర్తులు వారు. ఆయన గురించి చెప్తే పాఠకులు మరి కొంతమంది ప్రేరణ పొంది సంఘ సేవకులవుతారని నా భావన.
గణపతి నవల కూడా హాస్య నవల కాదు! అధిక్షేపాత్మక నవల. సమాజంలో అలాంటి యువకులు ఉండకూడదని ఆ పాత్రల ద్వారా తెలిపారు. కన్యాశుల్కంలో రాసిన గిరీశం, బారిష్టర్ పార్వతీశంలో పార్వతీశం, ఈ ముగ్గురు యువకులు సమాజానికి ఏ విధంగాను ఉపయోగపడని వారని చెప్పడానికి ఆ పాత్రలను సృష్టించారు ఆయన రచనలు కానీ జీవితం కానీ చూస్తే గొప్ప ప్రేరణ కలిగి ఇలాంటి వ్యక్తి ప్రపంచంలో అందరికీ తెలియాలని ముఖ్యంగా యువకులకు తెలియాలని పరిశోధనకు ఎన్నుకున్నాను. గైడ్ గా జి.వి. సుబ్రహ్మణ్యం గారు మార్గదర్శకత్వం చేసారు.
పద్మజ:– మీరు ఎన్నో రచనలు చేసారు కదా! వాటి నేపథ్యం వివరిస్తారా?
భారతి:– 1960 లో చెల్లాయి పెళ్లి అనే కథ రాసాను. అది అప్పట్లో బందర్ లో ఉన్న తెలుగు విద్యార్థి పత్రికలో ప్రింట్ చేశారు.
65 ఏళ్లుగా సాహిత్య రంగంలో కృషి చేస్తూనే ఉన్నాను. 300 పైగా కథలను రాసాను.
చెల్లాయి పెళ్ళి రాసినప్పుడు వాసిరెడ్డి సీతాదేవి గారు నాకు మంచి స్నేహితురాలు. ఆవిడ ఏమన్నారంటే? నీ వయసు వారు ఎక్కువగా ప్రేమ కథలను రాస్తారు. నువ్వెందుకు ఈ కథరాసావు? అని అడిగారు. ఆ కథను సమాజాన్ని దృష్టిలో పెట్టుకునే రాసాను. ఒక అమ్మాయికి మామూలుగా పెళ్లయిన తర్వాత భర్త మరణించాడు. ఆమెకు చదవు చెప్పించక, బయటకు ఎక్కడికీ వెళ్ళనీయక ఇంట్లోనే ఉంచేశారు. ఆ అమ్మాయి అన్నగారు చెల్లెలికి పెళ్ళి చేద్దామని తండ్రితో ఎంత పోట్లాడినా తండ్రి ఒప్పుకోలేదు. సమాజం తనను వెలివేస్తుందని తండ్రి భయపడ్డాడు. వితంతు వివాహం మన ఇంటా వంటా లేదు! అని అన్నాడు. అన్న ఎన్నో సంబంధాలు చూస్తాడు. అయితే తండ్రి కొడుకు పెళ్లి చేయాలని పట్టుబడతాడు.
చెల్లెలు పెళ్లి చేసుకున్న తర్వాతనే తాను పెళ్ళి చేసుకుంటానని పట్టు పట్టి కూర్చున్నాడు. ఆ అమ్మాయి విసిగిపోయి “అన్నయ్యా! నువ్వు పెళ్లి చేసుకో! నా కోసం నువ్వుఆగ వద్దు! అని అంటుంది.
ఒక పెళ్లే కాదు సమాజంలో ఉపయోగపడే ఎన్నో విషయాలు ఉన్నాయని, ఇలా సమాజానికి ఉపయోగపడే కథలు రాసాను. ముఖ్యంగా భారతి కథలు అని రెండు సంపుటిలు 1993-94లో వచ్చాయి. ధర్మ గంట మోగదు అనే సాంఘిక కథలు అచ్చయ్యాయి. అద్దంలో అమ్మ మీద ఒక కథ మేడమ్ కథలసంపుటి వచ్చింది.
అంతకు ముందే చిలకమర్తి – యువ భారతి ప్రచురించారు.
భారతంలో ప్రేమ కథలు,1991లో తెలుగులోనూ- హిందీలోను ప్రింట్ అయ్యాయి.
1993 లో కంచె చేను మేస్తే ఆంధ్రప్రదేశ్ బాలల సాహిత్య అకాడమీ వారు ప్రచురించారు. ప్రబంధంలో భక్తికథలు మద్రాస్ పత్రిక భక్తి కుముదం (2001-2002) పత్రికలో వేసారు.
ఋషి పీఠం వారు భక్తితరంగాలు ( 2003-2012);
భారతీతీర్థ సమాఖ్య భారతంలో నీతికథలను ప్రచురించింది.
పద్మజ :- చాలా సంతోషం ! మరి నవలా ప్రక్రియలో కూడా మీదైన ప్రత్యేక శైలి ఉంది. నవలల గురించి చెప్పండి…
భారతి:— బతుకు నేర్పిన న్యాయం -1996 లో రాసాను.
మళ్ళీ వచ్చిన వసంతం అనే సాంఘిక నవల 2002 లో అచ్చైంది.
బతుకు నేర్పిన న్యాయం నవలలో మమత ( కథానాయిక) కుటుంబంలో ఒక అమ్మాయి పెళ్లి చేసుకొని ఆత్మహత్య చేసుకుంటుంది. దాంతో ఆమె మనసు వికలమై, ముందు పెళ్లి వద్దంటుంది. అందరికీ అలా ఔతుందా ? అని పెద్దవారు సర్దిచెప్పితే సరేనని పెళ్ళి చేసుకుంటుంది. తర్వాత ఆడపిల్ల తన గర్భంలో ఉందని తెలిసి అబార్షన్ చేయించుకుంటానని పట్టు పట్టింది. తర్వాత కొన్ని రోజులకు ఇలా ఎందుకు చేశానని పశ్చాత్తాపపడుతుంది. అంటే సంఘములో ఏదైనా చెడు జరిగితే దాని ప్రభావం ఎలా ఉంటుందో తెలిపే ఇతివృత్తం.
తర్వాత కొంతకాలానికి ఒక మగపిల్లాడిని పెంచుకోవాలని అనాధ శరణాలయం వెళ్ళి, అక్కడ మొదట పిల్లవాడిని తీసుకోవాలని అంతా సిద్ధపడ్డ తర్వాత మగ పిల్లవాడు ఎందుకు? ఆడపిల్లను పెంచుకుంటానని నిర్ణయించుకుంటుంది.
పాలగ్లాస్ అనే కథ సినిమాల్లో మొదటిరాత్రి కథానాయక పాలగ్లాస్ తీసుకొని పడకగదిలోనికి వెళ్లడం చూస్తాం. ఇక్కడ నేను రాసిన పాలగ్లాస్ కథ అది కాదు! మనం పనిమనిషికి సామాన్యంగా చాయ్ ఇస్తాం. ఆమె ఈ ఆ గ్లాసు కడిగి అక్కడ బోర్లించి పెడుతుంది. ఆ ఇంట్లో పని చేసే ఆమె పని మానేసింది. ఆమె స్థానంలో ఒక 14 సంవత్సరాల అమ్మాయి పని చేస్తానని వచ్చింది. ఆ అమ్మాయికి చాయ్ ఇవ్వబోతే నాకు చాయ్ పడదు! డాక్టర్ వద్దన్నాడు పాలు తాగమన్నాడు. పాలు తాగుతాను అని అంటుంది. యజమాను రాలు విస్తుపోతుంది పనివాళ్ళకు పాలు పోయడమేమిటని? పోయను అంటుంది.
భర్త, కొడుకు ఇద్దరు నీ ఇష్టం పాలు పోయకపోతే సరే! కానీ ఈ అమ్మాయి కూడా వెళ్ళిపోతే నీకు పనిలో సహాయపడే వాళ్ళు ఎవరూ ఉండరు. నీకు కష్టం అవుతుంది అని అంటారు.
అమ్మో/! ఆమె పని మానేస్తే తాను చేసుకోలేనని ఆ పిల్లకు రోజు పాలు పోస్తుంది.
ఒక మార్పు రావాలంటే యువతనుండే వస్తుంది. ఆ ఇంట్లో ఇంటర్ చదివే పిల్లవాడు ఒకడున్నాడు. అతనికి తల్లి రోజు బోర్నవీటా కలిపిన పాలను ఇస్తుంది. తల్లికి తెలియకుండా ఆ పాలు తెచ్చి ఈ పని అమ్మాయికి ఇస్తున్నాడు. నువ్వు తాగు మా అమ్మ నాకు మళ్ళీ పోస్తుంది. అదిగాక మేం ఐస్ క్రీములు అవీ తింటామని అంటాడు.
సరే అని అమ్మాయి రోజు రెండు గ్లాసుల పాలు తాగుతున్నది. కొద్ది రోజులకు ఆ పిల్ల నేను రేపటి నుండి పనిలోకి రాను! అంటుంది అదేమిటి? ఎందుకు రావు? అని అడిగితే నేను చదువుకుంటున్నాను. సెలవులు అయిపోయాయి. రేపటినుండి స్కూల్ మొదలవుతుంది. సెలవుల్లో ఊరికే ఉండడం ఎందుకు అని నాలుగు రూపాయలు సంపాదించుకోవచ్చని పనిలో చేరాను. అని రెండు గ్లాసులు కడిగి అక్కడ బోర్లించింది. రెండేమిటీ? అడిగిన యజమానురాలతో అమ్మా! నన్ను క్షమించండి! నేను ఒక అబద్ధం చెప్పాను అంటుంది.
ఏం అబద్ధం చెప్పావు? అంటే డాక్టర్ నాకేమీ చెప్పలేదు. మీరు కుక్కకు పళ్ళంనిండా పాలు పోస్తుంటే నాకు కూడా పాలు తాగాలనిపించింది. ఊరికే మీరు పాలు పోయమంటే పోయారు కదా! అందుకని అబద్ధం చెప్పాను అన్నది.
చిన్నపిల్లల్లో కూడా మార్పు వస్తుంది. ఆ ఇంటర్ చదివే పిల్లవాడికి ఏమనిపిస్తుంది అంటే ఆమెకు మనవలె పాలు తాగాలని ఉండదా? అని
ఆస్ట్రేలియా నుండి శ్రీనివాసు గారు కథా సంకలనంలో వాన కథను వేస్తాను… మీ అనుమతి కోరుతూ ఫోన్ కాల్ చేశాను అన్నాడు. తప్పక వేయండి అన్నాను.
ఈ కథేమిటీ అంటే ఒకరోజు విపరీతంగా వాన పడుతుంది. అందరూ సంతోషంగా ఉంటారు. పక్కన ఉన్న జమీందారు గారి భార్య నీరు ఇంట్లోకి వస్తుందని ఎవరిని లోపలికి రానివ్వదు. ఓ బిచ్చగాడు వచ్చి వాన వెలిసే దాకా ఈ వసారా లో కూర్చుంటాను అంటాడు. ససేమిరా వద్దు! నీ తడి బట్టలూ… నువ్వూ కంపు కొడుతున్నావు! రావద్దు అంటుంది. ఇంట్లో ఖరీదైన ఫర్నిచర్ ఉంటుంది. అవి పాడై పోతాయని ఆమెకు బెంగ. ఆమెకు ఆ సామాన్లు ఆనందాన్నిస్తాయి.
ఆ బిచ్చగాడు తడుస్తూనే పక్క ఇంటికి వెళతాడు. ఆ ఇంట్లో చిన్నపిల్లలు తాతా! రా! తాతా! రా ! అని ప్రేమగా పిలుస్తారు. చలి పెడుతున్నవేమో అని ఒక తువ్వాలు ఇచ్చి, తల తుడుచుకోమని చెప్పి, అన్నం పెట్టి తినమని ఆప్యాయంగా మాట్లాడతారు. అతనికి చాలా ఆశ్చర్యం అవుతుంది.
వెళ్ళిపోతూ విస్తరిని పారేసి, ఇలాంటి పిల్లలు ఉండబట్టే ఇంకా సమాజం ఇంత గౌరవంగా ఉంది. అందరూ ఈ పక్కింటి అమ్మలాంటి వారైతే ఎలా ఉంటుందో? అన్న ఆ మాట ఆమె విని, నిజంగానే ఆ బిచ్చగాడికి కాసింత అన్నం పెడితే తనకు ఏం తక్కువ అయ్యేది? నాకు పిల్లలు లేరు!
ఈ వాన నా మనసులో కొత్త ఆలోచన కలిగించింది. మానవత్వం తెలిసింది. ఈ వాన నాలో మెరుపు తీసుకొచ్చింది అనుకున్నది.
ఈ కథ రెండు పేజేలే ఐనా ఒక సందేశం ఉన్న కథ తనకు నచ్చిందని అన్నాడు.
పద్మజ:– మహాభారతం ఈనాటికీ మీరు అన్వయించిన విధానం, దానికి మీరు చేసిన కృషి తెలుపుతారా?
భారతి:— ఉలూచి కథ కానీ, చిత్రాంగద కథ కాని అర్జునుడు తీర్థయాత్రకు వెళతారని తెలిసి కూడా నీమీదనే మనసుంది అని చెప్పారు.
శకుంతల పాత్ర నాకు ఆదర్శవంతం అనిపిస్తుంది. అందుకే నేమో ఇంటర్, డిగ్రీ ,పిజి, వరకు తర్వాత ఐఏఎస్ లో కూడా పాఠ్యాంశంగా శకుంతల కథ ఉండడం ఎందుకు? అని ఆలోచిస్తే మన నేటి సమాజంలో కూడా శకుంతల వంటి బాలికలు ఉన్నారు. జీవితంతో ఎంతగా పోరాడిందంటే? ఎక్కడో కణ్వాశ్రమంలో ఉన్న శకుంతల రాజదర్బార్ కు వచ్చి మరీ దుష్యంతునితో మాట్లాడి- పోట్లాడి ఒప్పించి, మెప్పించి చివరకు విజయం పొందింది. ఇదే పరిస్థితిలో ఆధునిక చదువుకున్న అమ్మాయి ఉన్నదనుకోండి! అంత పోరాటం చేయకపోవునేమో? ఐతే విడాకులు తీసుకుంటుంది. లేకపోతే పుట్టింటికి వెళ్ళిపోతుంది కానీ తమ జీవితాన్ని నిలబెట్టుకోవాలన్న ధైర్యం ఉండక వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడి ఉండాలని చూసుకోవాలనే ఒక ఆలోచన శకుంతలను చూసి నేర్చుకోవచ్చు అనిపిస్తుంది.
శకుంతల కథ ఒక సందేశం ఇచ్చే కావ్యం. ఈ కథలు విన్న చదివినా జీవితానికి అన్వయించుకుంటేనే వాటి ఫలితం ఉంటుంది.
భారతంలో ప్రేమకథలు రావడానికి నేపథ్యం ఏమిటంటే? ఒకప్పుడు వారపత్రికలలో ప్రతివారం ఒక కథ వచ్చేది. అవన్నీ ఒక పుస్తకం వేశాను.
శాంతి సుందరి గారు కేంద్ర సాహిత్య అకాడమీ అనువాదకురాలు హిందీలోనికి అనువదించారు. నా కథలు కొన్ని స్వాతి శ్రీపాద ఆంగ్లంలో అనువదించారు. రఘునాథన్ గారు మేడమ్ కథలను తమిళభాష లోకి అనువదించారు.
భారతంలో నీతికథలు రాసాను. నన్నయ రాసిన ఎన్నో ఉపాఖ్యానాలు ఉన్నాయి. మొట్టమొదటి కథే సురమ ఒక కుక్క కథ! సారమేయుడు జనమేజయుడు యజ్ఞం చేస్తుంటే అక్కడికి వస్తే ఆయన తమ్ముడు నిష్కారణంగా కొడతాడు. తల్లితో ఈ విషయం చెప్తాడు సారమేయుడు. అనవసరంగా ఎవరినైనా బాధిస్తే అనిమిత్త ఆపదలు వస్తాయి, అంటే అనుకోని కష్టాలు వస్తాయని, యజ్ఞం ఆపేసి తిరిగి మొదలు పెడతాడు. చిన్న కుక్క పిల్ల చెప్పిన మాట ఏమిటంటే మనకేం హాని చెయ్యకపోయినా కుక్క కనపడితే చాలు కొడతాం! అలా కూడదని చెప్పిన నీతికథ.
ఇలాంటివే రాశాను మహాభారతంలో ప్రారంభంలో సరమ కుక్కతో మొదలై స్వర్గారోహణపర్వంలో ధర్మరాజు వెంట కుక్క ప్రయాణంతో భారతం ముగుస్తుంది. అంటే ఆ కుక్క పాత్ర ఎంత ప్రాధాన్యత ఉందో చెప్పాను.
పద్మజ:- ప్రబంధాలను నవల రూపంలో రచన చేశారని విన్నాము. నవలా రూపంగా ఐనా సరే! ఈ కాలంలో ప్రబంధాలు చదివే వారు ఉన్నారా? మా తరుణి ప్రేక్షకులకు వాటి ప్రాశస్త్యం చెప్పండి.
భారతి :– ప్రబంధ సాహిత్యం అంటే నాకు చాలా ఇష్టం. ఆధునిక సాహిత్యం – ప్రబంధ సాహిత్యం రెండూ రెండు కళ్ళు లాంటివి. ఆయా ప్రబంధాలను చదివే వారు తక్కువ అయ్యారని ఆవేదనగా కూడా ఉంటుంది. ఈ తరం వారికి సాహిత్యం చేరకుంటే ఎలా ?అని చాలా కాలంగా ఆలోచించి ఏమిటి మార్గం అంటే నేనేమైనా చేయాలంటే అధికారంలో లేను… ఏం చేయాలని అనునుకున్నప్పుడు ప్రబంధాలను నవలలుగా రాస్తే కొంతమంది నవలలు చదువుతారు కనుక ప్రబంధాలు నవలల వలె రాస్తే చదువుతారని మొదలు పెట్టాను.
అలా నేను రాసిన నవలలన్నీ అన్ని పత్రికల వారు సీరియల్స్ గా వేశారు.అల్లసాని నెద్దన రచించిన మను చరిత్రను గాంధర్వం పేరుతో నవలను రాశాను.
ఇందులోని పద్యాలను చూసి మను చరిత్ర శృంగార ప్రబంధము అని అంటారు. కానీ శృంగార ప్రబంధం కాదు! శృంగార రసాభాసం. దాని తర్వాత ఆశ్వాసాలను చెప్పాలి కదా! మనుచరిత్రలో ఈ అంశాన్ని చాలామంది చెప్పరు. మొదటి మూడు ఆశ్వాసాలు చదవడానికి ఉత్సాహంగా ఉండి శృంగారపరంగా ఉంటాయి కనుక చదువుతారేమో? తర్వాత కథను చదవరు కనుకనే నేను గాంధర్వం ( అల్లసాని మనుచరిత్ర) అనే పేరుతో నవల రాశాను. 2011అది పుస్తక రూపంలో వచ్చి ప్రచారంలోకి వచ్చింది.
పద్మజ :– గాంధర్వమని పేరు ఎందుకు పెట్టాలనిపించింది?
భారతి:– వరూధిని- ప్రవరాఖ్యుడు;
మాయాప్రవరుడు- స్వరూచి చేసుకున్న వివాహాలన్నీ గాంధర్వ వివాహాలే! కనుక నేను ఆ ప్రబంధాలకు గాంధర్వము అని పేరు పెట్టాను. మన సాహిత్యంలో ఒక అపప్రద ఉంది. మనుచరిత్ర శృంగార ప్రభంధం అని కానీ నిజానికి అది శృంగారం కాదు! శృంగార రసాభాసం…అని ఎందుకు అంటున్నానంటే? వరూధినికే ప్రేమ తప్ప ప్రవరాఖ్యుడికి ఆమె మీద ప్రేమ లేదు.
ఆయనకు ఎంతసేపూ తన భార్య, తన శిష్యులు, తన అనుష్ఠానం ఇవే తప్ప ఆమె మీద ఆకర్షణ లేదు. అందుకే ఆమె అంటుంది…
ఎక్కడి యూరు కాల్నిలువ కింటికిబోయెదనంచు పల్కెదీవక్కట మీ కుటీరనిలయంబులకున్ సరిరాకపోయెనేయిక్కడి రత్నకందరము లిక్కడి నందనచందనోత్కరంబిక్కడి గాంగసైకతము లిక్కడి యీ లవలీనికుంజముల్ !!
ఇన్ని అద్భుతాలు వదులుకొని పోతానంటున్నావు ఏమిటి మీ కుటుంబంలో ఉన్నది? అని అంటుంది.
అమ్మో! ఈమె నన్ను పంపించదేమో? అనుకుంటాడు ఆయన అగ్నిహోత్రుడిని ప్రతిరోజూ పూజిస్తాడు కాబట్టి ఆయనని ప్రార్థిస్తాడు.
నేనే గనుక భగవత్పదాంబుజ ధ్యాన రతుండడనేని
పరదార ధనాదుల కోరనేని, సన్మానము తోడ నన్ను సదనంబు చేర్చుము ఇనుండు పశ్చిమాంబుధిలోనికుంగకమున్ను
దీని భావమేమంటే??
నేనే గనుక నీ పాదాలను నమ్ముకుని పూజించిన వాడనైతే, నేనే గనుక ఇతర స్త్రీలపై వ్యామోహం లేని వాడినైతే, నేనే గనుక ధనం మీద వ్యామోహం లేని వాడనైతే, సూర్యుడు అస్తమించక ముందు నన్ను నా ఇంటికి చేర్చమని వేడుకుంటాడు.
మను చరిత్రను పాఠకులు మూడు ఆశ్వాసాలే చదువుతున్నారు. పాఠ్యాంశంగానూ అంతే చెప్తున్నారు.
మొదటి ఆశ్వాసంలో ప్రవరుడు అరుణాస్పదపురంలో ఉన్నట్టు చెబుతారు. సిద్ధుడు పసరు రాయడం, హిమాలయాలకు పోవడం, వరూధిని కనపడడం, రెండో ఆశ్వాసంలో ..
ఎవతె వీవు? భీత హరిణేక్షణ! ఒంటి చరించె…… దోవతప్పితిన్ !…పురంబుగాన … తెరువెద్ది?శుభం నీకు!
నాకు ఈ ఊరు తెలియదు. తోవ తప్పాను, నేను అహంకారంతో వచ్చాను, దయచేసి నాకు మార్గం చెప్పు అంటాడు.
ఆమె చెప్పొచ్చు కదా! చెప్పదు..
” ఇంతటి కన్నులున్న భూసురేంద్ర! ……
యెల్లిదమైతిమి మాటలేటికిన్
ఏదో నెపం పెట్టుకొని ఆడవాళ్ళతో మాట్లాడాలనీ కానీ, నీకు వచ్చిన తోవ తెలియదా? నేను చెప్పను పో! అంటుంది.
మూడో ఆశ్వాసంలో మాయాగంధర్వుడు ఎప్పటినుండో వేధిస్తున్నాడు. ప్రవరుడు వెళ్ళిపోయాడు కనుక నేనే ప్రవరుడి వేషంతో వెళ్తాను అనుకోని, అతనికి కామరూపం ఉంటుంది కనుక అక్కడ పూలు కోస్తూ కనిపించాడు. ఆమె చెలికత్తె చూసి వరూధినితో, నువ్వు పొరపాటు పడుతున్నావు ఆ ప్రవరుడు ఎంత బ్రాహ్మణోత్తముడైనా ఇంత గొప్ప అప్సరస సాంగత్యాన్ని వదులుకొని వెళ్ళడు. ఊరికే నిన్ను బెదిరించాడు.. ఇక్కడే ఎక్కడో ఉంటాడు… అదిగో అక్కడ ఉన్నాడని చెప్తుంది.
అటుచూస్తే మాయ ప్రవరుడు అచ్చంగా ప్రవరాఖ్యుడిలాగే ఉంటాడు. గంధర్వుడితో సంగమిస్తుంది. అతనితో స్వరోచి అనే పిల్లవాడు పుడతాడు. వీళ్ళు ఎలా విడిపోతారంటే మాయా ప్రవరాఖ్యుడు ఇలా చెప్తాడు.
“నాకు కాలికి పసరు పూసిన సిద్దుడు కనిపించాడు. నా తల్లిదండ్రులు నన్ను చూడకపోయేసరికి చాలా దుఃఖంలో ఉన్నారట! నేను వెళ్లి వాళ్లను చూసి నాలుగు రోజులుండి మళ్ళీ వస్తాను!” అంటాడు కానీ అతను రాలేదు.
ఈ కథను సెలబస్ లో ఎవరు చెప్పరు. పిల్లలు చదవరు.
స్వరోచి మహారాజు వేటకు వెడుతుంటే ఒక అమ్మాయి నన్ను రక్షించండి! నన్ను రక్షించండి! అని పరిగెడుతూ వస్తుంది. ఆ అమ్మాయి పేరు మనోరమ. ఆమె ఇందీవరాక్షుడు అనే గంధర్వుడి కూతురు. ఇందీవరాక్షుడు వరూధినికి సోదరుడు. అతను ఎందుకు రాక్షసుడు అయ్యాడు అంటే? ఒక గురువు దగ్గరకు వెళ్ళి ఆయుర్వేద విద్యను నేర్పమని అడిగితే “మీరు గంధర్వులు! విలాస పురుషులు! మీకు ఆయుర్వేదం నేను నేర్పను! అంటాడు.
నువ్వు చెప్పకుంటే నేను నేర్చుకోలేనా? అని అహంకారంతో మాయతో విద్యార్థుల మధ్య కూర్చొని ఆయుర్వేద విద్య నేర్చుకుంటాడు. అంతటితో ఆగక గురువుగారి దగ్గరికి వెళ్లి నేను ఆయుర్వేదం నేర్చుకున్నాను అంటాడు. నువ్వు ఇంత అహంకారవంతుడివి కనుక రాక్షసుడువై నీ కూతురు వెంట పడతావు! అని శాపం పెడతాడు. అలా పరిగెత్తుకుంటూ వచ్చి స్వరోచి రక్షణ కోరుతాడు. ఆ శాపం ఇవ్వగానే మరి ఈ శాపం ఎలా విముక్తి అవుతుంది? అని అడుగుతాడు. స్వరోచితో నువ్వు యుద్ధం చేసినప్పుడు, యుద్ధంలో ఓడినప్పుడు నీకు పూర్వరూపం వస్తుందని చెప్తాడు. అట్లాగే యుద్ధం చేస్తాడు. యుద్ధంలో మరణించే స్థితి వస్తే మళ్ళీ ఇందీవరాక్షుడి రూపం వచ్చి మనోరమను స్వరోచికిచ్చి పెళ్లి చేస్తాడు అది మొదటి కథ.
ఐతే ఈ మనోరమ ఒకసారి ఏడుస్తూ కూర్చుంది. ఎందుకు ఏడుస్తున్నావ్? అని అడుగుతాడు. నాతో పాటు నా ఇద్దరు స్నేహితురాండ్రు వచ్చారు. వాళ్ళు అడవిలో ఎక్కడో తప్పిపోయారని అంటుంది. ఎందుకు వచ్చారు అని అడిగితే,ఒక ఆమె కళావతి, ఇంకొక ఆమె విభావతి, ఇద్దరూ నాతో పాటే వచ్చారు మేము అందరం వన విహారం చేస్తూ వస్తుంటే బూచి వలె తెల్లటి గడ్డాలు మీసాలున్నాయని కనపడితే ఏమిటో చూద్దామని పిల్ల చేష్టతో ఆయన కళ్ళు , ముక్కువేళ్ళతో పొడిచాను. ఆయన తపస్సు భంగమై లేచి నీకింత అహంకారమా? అని నిన్నొక రాక్షసుడు వెంటపడతాడు అన్నాడు.
ఆ స్నేహితురాండ్రు ఇద్దరూ ఆయనతో పోట్లాడితే వాళ్ళని మీకు ఇంత అహంకారమా? దేనికని కుష్టి వ్యాధి వచ్చుగాక! కాని శపించాడు. పాపం వాళ్ళు ఆ వ్యాధితో ఎక్కడో ఏడుస్తూ ఉంటారు అని అన్నది.
స్వరోచి తనకొచ్చిన ఆయుర్వేద విద్యతో వాళ్లను బాగు చేస్తానంటాడు. వారికోసం వెతికితే ఒకచోట చెట్టు మొదట్లో కూర్చొని ఏడుస్తూ కనపడ్డారు. వారికి స్వరోచి ఆయుర్వేద చికిత్స చేసి వ్యాధి నయం చేస్తాడు. అందులో ఒక అమ్మాయికి ఇదివరలో అమ్మవారు ఒక విద్య నేర్పుతుంది. ఆ విద్య ఏమిటంటే ఎప్పుడు సమస్త సంపదలు కలిగే ఆ విద్యను రాజుగారికి దానం చేస్తుంది. ఇంకో అమ్మాయికి పక్షుల, జంతువుల భాష వస్తుంది. ఆ అమ్మాయి కూడా ఈ స్వరూచికి ఆ విద్యను ఇస్తుంది. అప్పుడు ఆ ఇద్దరినీ పెళ్లి చేసుకుంటాడు. అంటే స్వరూచికి మూడు పెళ్లిళ్లు అయ్యాయి. తరువాతి కథాంశం ఏమిటి అంటే స్వరోచి ఒకసారి ఈ భార్యలను వెంటబెట్టుకొని ఉద్యాన విహారానికి వెళతాడు వెళ్తుంటే అక్కడ ఒక సరస్సు తీరంలో చక్రవాక పక్షి ఒక హంస రెండు ఆడవే అక్కడ ఉంటాయి. చక్రవాక పక్షి అంటుంది కదా! ఆ రాజును చూడవే ఎంత అదృష్టవంతుడో ఆ స్త్రీలు ఎంత అదృష్టవంతులు ముగ్గురు భార్యలున్నా ముగ్గురునీ ప్రేమగా చూస్తున్నాడు. వాళ్లు కూడా అసూయాద్వేషాలు లేకుండా ఎంత బాగున్నారు అంటుంది.
అయితే ఆ రెండో పక్షి “నీ మొహంలే ఏ ఆడది కూడా తన భర్త వేరే ఆడదానితో ఉన్నాడంటే ఏమీ ఆనందించదు! పొరపాటు పడుతున్నావు నేను అదృష్టవంతురాలిని నా భర్తకు నేను ఒక్కదాన్నే భార్యను” అని అంటుంది.
అంటే బహు భార్యత్వాన్ని అన్యాపదేశంగా వ్యతిరేకిస్తున్నదీ రచన. సమాజానికి ఒక సందేశం వంటిది.
ఈ మాటలన్నీ విన్న స్వరోచి తనకు పక్షి భాష తెలుసు కనుక అర్థమై ఛీ…ఛీ .. నన్ను ఈ పక్షులు ఇంత అవమానిస్తున్నాయని ఇంటికి వెడతాడు. కానీ వేట ఉత్సాహంలో మళ్ళీ కొన్ని రోజులకు అడవికి వస్తాడు.
ఒక మగ జింక చుట్టూ ఆడ జింకలు తిరుగుతూ ఉంటాయి. స్వరోచి వినేటట్టుగా ఛీ.. ఛీ… నేనేమైనా స్వరోచిననుకున్నారా? ఆడవాళ్ళతో గడపడానికి పో! పో! పోండి అని అంటాడు.
ఆ మాట విన్న స్వరూచి నాకింత అప్రతిష్ట ఏమిటి? అని బాధపడతాడు మళ్ళీ కొన్ని రోజులకు అరణ్యంలో విహారానికి వస్తాడు. ఒక వరాహాన్ని బాణంతో కొట్టబోతుంటే అక్కడున్న అమ్మాయి ఆ వరాహాన్ని ఎందుకు కొడతావు? నన్ను బాణంతో కొట్టు అంటుంది. అదేమిటి? నిన్ను నేనెందుకు కొడతాను? అని అంటాడు.
అప్పుడు ఆమె నేను ప్రేమించిన వ్యక్తి నన్ను ప్రేమించలేదు కనుక చచ్చిపోతాను అంటుంది. అయితే నువ్వు ప్రేమించిన వ్యక్తి ఎవరు? చెప్పు! తీసుకొని వస్తాను అంటాడు.
నిన్నే ప్రేమించాను అంటుంది.
అదేమిటి? నువ్వేమో జంతువు- నేనేమో మనిషిని! నీకు నాకు ప్రేమ ఏమిటి? సాంగత్యం ఏమిటి? అని అంటాడు.
కాదు, కాదు ఒకసారి నన్ను కౌగలించుకో తర్వాత చెప్తాను అంటుంది.
అతను ఆమెను కౌగిలించుకోగానే వనదేవతగా, అందమైన యవ్వనవతిగా మారుతుంది. ఎందుకొచ్చావు? ఇక్కడికి అని అడిగితే దేవతలంతా నన్ను కోరారు స్వరూచితో కలిసి నీకు కొడుకు పుడితే వాడే మనుధర్మ శాస్త్రాన్ని రచించే మనువు ఔతాడని, అతనే పరిపాలిస్తాడని చెప్పింది. దీన్నే స్వారోచిషమనుసంభవం అని అంటారు.
కొద్ది రోజులకు కొడుకు పుట్టి నేను విష్ణువును ధ్యానించుకోవడానికి వెళ్తాను అంటాడు. విష్ణువు ఇప్పుడు కాదు చాలా ఏండ్లు భూమిని పరిపాలించి మనుధర్మ శాస్త్రాన్ని రచించాలి! అని నువ్వు భూమ్మీద ఉండాలని అంటాడు. ఐదు ఆరు ఆశ్వాసాలలో ఉన్న కథ స్వారోచిష మనుసంభవానికి మూలం.
యయాతి, కచ,దేవయాని, మరియు శర్మిష్ట భారతాధారంగా రాస్తే ఎమెస్కో వారు ప్రచురించారు, బసవేశ్వరుడు, దక్షిణకాశి, జైత్రయాత్ర, పాండురంగలీలలు, ఆనంద కాననం,గిరిక పరిణయం, కోనేటిరాయడు, భక్తి తరంగాలు మొదలైన ప్రబంధాధారిత రచనలు చేసాను.
పద్మజ :— వెంగమాంబ సినిమా లో మీ సేవలు ఎలా ఉపయోగపడ్డాయి?
భారతి :– తరిగొండ వెంగమాంబ అన్నప్పుడు కొండ అంటున్నాము. కొండ కాదు కుండ అనాలి. దానికో చరిత్ర ఉంది. ఆమె ఓ కుండలో పెరుగు పోసి కవ్వంతో చిలుకుతున్నప్పుడు ఆ కవ్వం కింద ఏదో తగిలిందట.. ఏమిటని చూస్తే అక్కడ ఏమి కనిపించలేదు. ఆమె భయపడి భర్తకు చెప్తే అతను కూడా జాగ్రత్తగా కవ్వం కింద చెయ్యి పెట్టి చూస్తే అక్కడ సాలగ్రామం ఉందట. ఆ సాలగ్రామంలో లక్ష్మీనరసింహస్వామి రూపం కనిపించిందట. అలా ఆ సంగతి ఆ ఊరంతా తెలిసింది. ఒకరోజున ఆకాశవాణి “ఈ ఊళ్లో ధనవంతుడి చేత నరసింహ స్వామి దేవాలయం కట్టించండి! ఈ ఊరికి క్షేమం కలుగుతుంది.” అని అంటే ఆ ఊళ్ళో లక్ష్మీనరసింహ స్వామి కోవెల కట్టారు. ప్రజల నోళ్ళల్లో తరికుండ కాస్తా పలుకుబడుల మార్పుతో తరికొండ… తరిగొండ అయింది. ఈమె మొట్టమొదట నరసింహ శతకం రాశారు.
వెంగమాంబ బాల్యంలో చదువుకోకుండా తిరుగుతూ ఉంటే అందరూ ఆమెను ఆక్షేపించారట.పిచ్చి పట్టిందని అన్నారట.
ఆమె తండ్రి బాధపడుతూ ఒక గురువు దగ్గర చదువుకోమని పంపించాడు. ఆ గురువు దగ్గర సమస్త శాస్త్రాలు నేర్చుకుంది. తర్వాత తరిగొండకు వచ్చింది. రచనా వ్యాసంగం కొనసాగించింది. తర్వాత ఆమె తిరుపతికి వెళ్లి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో గొప్ప రచనలు చేయడం జరిగింది.
ఊటుకూరు లక్ష్మీనరసమ్మ గారి ఆంధ్ర కవయిత్రుల పుస్తకం చదువుతుంటే తరిగొండ వెంగమాంబ ఇంత గొప్ప కవయిత్రా ?అనిపించింది. మొల్ల రామాయణం, తిమ్మక్క సుభద్ర కళ్యాణం, రంగాజమ్మ మన్నార దాస విలాసం ఇలా వారంతా ఒక్కటే కావ్యం రాసినా, ఏడు ఎనిమిది యక్షగానాలు, పద్య కావ్యాలు, కీర్తనలు, ఇన్ని రాసిన వెంగమాంబను మరిచిపోతే ఎలా? అని నా మెదడు మేత మేస్తూనే ఉన్నది. నేనొక నవల రాశాను. అప్పటికి ఆమె గురించి రాసిన పుస్తకాలు లేవు. సుందరయ్య విజ్ఞాన భవన్లో ఒకటి రెండు ఉన్నట్టున్నాయి. వాటిని తెచ్చుకొని రాశాను. తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆమె రచనలు అన్నింటిని ముద్రించారు. ఇప్పుడు తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రం కూడా భక్తులు వెళ్లి చూస్తారు. నేను కొంచెం సేకరించి నవలగా రాస్తే ఒక పత్రిక వారు ధారావాహికగా ప్రచురించారు. తర్వాత ఎమెస్కో ( EMSCO)
పబ్లికేషన్స్ అవన్నీ కలిపి ఒక పుస్తకం వలె నవలగా అచ్చు వేయించారు. దొరస్వామి రాజుగారు ప్రొడ్యూసర్ ఆయన నా తో ఫోన్ కాల్ చేసి అమ్మా! తరిగొండ వెంగమాంబ నవలలు మాకు ఇస్తారా? అన్నారు. నేను వెంటనే ఇచ్చాను. ఆయన దాన్ని సినిమాగా తీశారు. దాని ముందు 20 -30 ఎపిసోడ్ లు ఎస్వీబీసీ ( SVBC) ఛానల్ లో ప్రసారం చేశారు. తరిగొండ వెంగమాంబ నాకు ఎంత అభిమాన రచయిత్రయిందంటే? కేంద్ర సాహిత్య అకాడమీ వారు నాకు మోనోగ్రాఫ్ రాసే అవకాశం ఇచ్చారు. తర్వాత ఐనంపూడి శ్రీలక్ష్మి గారి అక్షరయాన్ సహస్ర కవయిత్రుల సంస్థ లోకూడా తరిగొండ వెంగమాంబ మీద నేను పెద్ద వ్యాసం రాసి ఇచ్చాను. వెంగమాంబ బాలవితంతువుగా చాలా కష్టాలు పడింది. వెంకటేశ్వర స్వామే నా భర్త! అని ఎవరిని పెళ్లి చేసుకోను అంటుంది. కానీ తల్లితండ్రులు బలవంతంగా ఒకరికి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఆమె అతనికి మొదటి రోజే చెప్తుంది “నువ్వు నా భర్త కాదు! వేంకటేశ్వర స్వామే నా భర్త” అని..
ఈ మాటతో ఆయన ఎంతో వేదన చెంది మరణించాడు. ఆ కాలంలో భర్త మరణిస్తే సుమంగళి చిహ్నాలన్నీ తీసేయాలి. కానీ ఆమె ఏమీ తీయలేదు. అలాగే తిరిగేది. ఆ ఊరు వారికి అది నచ్చలేదు. ఊరి వారందరూ ఆమె అలా ఉంటే ఊరికి అరిష్టమని శిరోముండనం చేయాలని పట్టుబడతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె చేయించుకోనంటుంది.
పుష్పగిరి పీఠాధిపతులను పిలిపించి ఆమెకు విధవగా మారమని చెప్పిస్తారు. అప్పుడు ఆమె అంటుంది ఒక పతివ్రత అయిన నన్ను ఒక మంగలి ముట్టుకోవడం ధర్మమేనా? అని ఇప్పుడు జుట్టు తీసేస్తాను అనుకోండి! మళ్ళీ పెరగదని మీరు హామీ ఇస్తారా? అని అడిగితే ఈమె సామాన్యురాలు కాదు! ఏదో మహత్తు ఉంది… అని వెళ్ళిపోతాడు. అక్కడున్న వారందరూ వెంగమాంబను స్వామికి దండం పెట్టమని ఒత్తిడి చేస్తారు. అప్పుడు ఆమె ఆ స్వామి సింహాసనం దిగితే దండం పెడతాను. అంటుంది సరే! ఎందుకంటున్నదో? అని వెంటనే ఆ సింహాసనం దిగుతాడు.ఆ సింహాసనం భగ్గున మండిపోయింది. అప్పుడు అనుకుంటాడు ఈమె భగవద అంశంలో పుట్టిన్నట్టున్నది కాబట్టి మనం ఎవరూ బాధించవద్దని చెప్పి ,అలా వదిలేయండి అని పీఠాధిపతి అన్నారు.
వెంగమాంబ హారతి ఇవ్వడానికి వెళితే దేవాలయంలో పూజారులు, పెద్దలు హారతి ఇవ్వవద్దని తలుపులు వేసి, తాళాలు వేసి,చేతికి సంకెళ్లు వేసేవారు.
ఒక వితంతువు దేవుడికి హారతి ఇవ్వడం ఏమిటి? అని వారి వాదన ! ఆ రోజుల్లోనే స్వామి వారి రథం ఇంటింటి ముందు హారతులందుకుని సాగుతుంది .
ఒక రోజు రథం ఆగిపోయింది. వెంగమాంబ తాను ఇంట్లోంచి హారతి ఇచ్చింది. ఆ రథం కదిలింది అప్పటి నుండి దాన్ని ముత్యాల హారతి అన్నారు. ఈ రోజుకు కూడా ముత్యాల హారతి ఇచ్చిన తర్వాతనే వెంకటేశ్వర స్వామి దేవాలయంలోనికి వెళ్లి పవళింపు సేవ జరిపిస్తారు. ఈ హారతి ఇచ్చిన తర్వాతనే తలుపులు వేస్తారు. ఇంకొక విషయం ఏమిటంటే మనం హారతి ఇచ్చేటప్పుడు అమ్మవారికి, అయ్యవారికి హారతి ఇచ్చి వారి ఆశీస్సులు కోరుకుంటాం! కానీ తరిగొండ వెంగమాంబ కేవలం స్వామికి , అలివేలు మంగమ్మకే కాకుండా ఆ ఊర్లో ఉన్న రథాలకి, అక్కడున్న ప్రాకారాలకు, అక్కడి సామాన్య ప్రజలకు, వంటశాలలకు, వంట వారికి, అన్నింటికీ మంగళహారతి ఇచ్చేదట. అది ముత్యాల హారతి యొక్క గొప్పతనం.
ఇంత గొప్ప మహిళ నేను ఇక్కడ ఉండలేను అంటే వెంకటేశ్వర స్వామి ఒక బిలంలోనుండి తీసుకుని వెళ్లి అభయారణ్యంలోని గుహలో ఉండమని చెప్తాడు. అక్కడ ఉంటుంది ఆమె.
వేంకటాచల మహాత్మ్యం రాసింది. ఆ పద్య కావ్యం చదువుతూ ఉంటే మనకు తిరుపతిలో ఉన్నామా? అనే భావన కలుగుతుంది. అంత విశేషంగా ఉంది. నేను చాలా ప్రబంధాలు నవలలుగా రాసాను. దీనిని కూడా ఒక నవలగా రాసి సామవేదం షణ్ముఖ శర్మ గారి ఋషిపీఠం పత్రికకు పంపాను. ఆ పత్రిక వారు మూడు సంవత్సరాలు సీరియల్ గా వేశారు. ఆ నవల పేరు కోనేటి రాయడు ఆ పేరుతోనే పుస్తకం ప్రచురించారు. ఆ నవల కూడా పాఠకులకు చేరింది.
ఎన్నోరచనలు చేసింది .ఆమె సాహిత్యం అంటే ఇప్పటికీ నాకెంతో ఇష్టం.
పద్మజ:- అన్నీ మంగళప్రదంగా ఉండాలనే శుభకామన ఎంత గొప్పదో కదా!
అలాగే ధూర్జటి కవి రచనల గురించి వివరిస్తారా?
భారతి:– ముందే చెప్పాను ప్రబంధాలు అంటే చాలా ఇష్టం అని ధూర్జటి నాకిష్టమైన కవి అంత స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న కవులు ఇద్దరే ఇద్దరు. ఒకరు ధూర్జటి మరొకరు పోతన ఆయన మాటలలోనే ఆయన వ్యక్తిత్వం తెలుస్తుంది.
పద్యం :–
రాజుల్మత్తులు వారిసేవ నరకప్రాయంబు,
వారిచ్చు నంభోజాక్షీ చతురంతయాన తురగభూషాదు
లాత్మ వ్యధా బీజంబుల్,తదాపేక్ష చాలు పరితృప్తిం
బొందితిన్, జ్ఞానలక్ష్మీ జాగ్రత్పరిణామ మిమ్ము దయతో శ్రీకాళహస్తీశ్వరా ॥
కాళహస్తీశ్వర శతకం, కాళహస్తి మహాత్మ్యం రెండు రాశాడు. ముందు శతకం తర్వాత పెద్ద వయసు వచ్చిన తర్వాత కాళహస్తి దేవాలయం వెళ్లి ప్రబంధం రాశాడు.
విశేషం ఏమిటీ అంటే కాళహస్తి మహాత్మ్యంలో ఒక శైవాచార్యుడు వస్తాడు ఒక దాసి అతన్ని చూసింది. అతనెంత అందంగా ఉన్నాడు అనుకుంటుంది. శివ భక్తుడు కదా! నన్ను నేను అర్పించుకుంటాను. అనుకొని మా ఇంటికి రండి అని పిలుస్తుంది. ఆ దాసితో ఆ శైవాచార్యుడు వెళ్తాడు, భోజనం పెడుతుంది,అతనితో సంతోషంగా ఉండిపోతుంది.
అసలు ఈమె ఎవరంటే? రాజుగారి పళ్ళెరుపు దాసి! అంటే రాజుగారికి సరిగ్గా సమయానికి భోజనం తీసుకొని వెళ్ళాలి. అది ఆ అమ్మాయి ఉద్యోగం. శైవాచార్యుడి ఆకర్షణలో పడి ఆలస్యమైంది. రాజుగారు కోప్పడతారేమోనని భయపడిపోయింది. త్వరగా చీరా, రవికా, జుట్టు సవరించుకొని వెళ్తుంది. రాజుకు భోజనం ఆలస్యమవడంతో కోపంతో ఆమె ఏమి చూసుకొని అంతలా మిడిసిపడుతున్నది..? అనుకొని నీ జుట్టు చాలా అందంగా పొడుగ్గా ఉంటుందికదా! అది చూసుకొని నీకు గర్వం. అందుకే నాకు భోజనం ఆలస్యంగా తెచ్చావని కోపంతో రాజుగారు మంగలిని పిలిపించి ఆమెకు బోడగుండు చేయిస్తాడు. పాపం దాసి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది . ఇంటికి వెళ్లి ఆ శైవ భక్తుడితో చెప్పి గోలు గోలున ఏడుస్తుంది.
ఏడవకు అంటూ ఆయన ఆమె తల మీద చేతితో నిమిరి ఓదార్చుతాడు. జుట్టు అంతా ఇదివరకటి వలె వచ్చేస్తుంది.
దాసి తెల్లవారి భోజనం పట్టుకుని రాజు గారి బంగ్లాకి వెళుతుంది. ఆమె జుట్టు చూసి ఒక్కరోజులో నీకు జుట్టు ఎలా వచ్చింది? అని మంగలికి నువ్వు లంచం ఇచ్చి జుట్టు తీయకుండా చేసి ఉంటావు! నన్ను మోసం చేశారు… అంటాడు. కాదు మంగలి నా జుట్టు నిజంగానే తీశాడు. కానీ మా ఇంట్లో శివభక్తుడున్నాడు అతని వల్లనే నా జుట్టు పెరిగింది. అంటే అతన్ని నేను చూడాలి అని దాసి ఇంటికి వస్తాడు రాజు. శైవభక్తుడి తేజస్సు చూసి రాజు విస్తుపోతాడు.
అయ్యా! రాజా మీ దర్శనం చేసుకుందామనే ఈ ఊరు వచ్చాను. ఎందుకంటే మీ ఊర్లో కాళహస్తి దేవాలయం లేదు. నువ్వు కట్టించు అని అంటాడు.
అప్పుడు ఆ రాజు కాళహస్తి దేవాలయాన్ని కట్టిస్తాడు. ధూర్జటి కాళహస్తి మహత్యంలో ఎన్నో కథలు ఉన్నాయి. చాలా చిన్న చిన్న కథలు ఉన్నాయి.
నేను మొట్టమొదట కథారచయిత్రిని కనుక నాకు కథలు ఆసక్తి కలిగిస్తాయి. అందుకే ప్రబంధంగా రాసినప్పుడు ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని రాసి దక్షిణ కాశీ అని పేరు పెట్టాను. అది కూడా ముద్రణ అయింది.
పద్మజ:– కవులకు తమ రచనల మీద సామర్థ్యం మీద అంతులేని ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం ఉండేదిట. ధనాపేక్ష లేకుండా సాహితీ సేవ చేసారు. ధూర్జటి గురించి మీ విశ్లేషణ చాలా బాగుంది!
అలాగే మీ కవితా రచన గురించి చెప్తూ…రేపటి తరం కవితలు ఎలా రాస్తే బాగుంటుందో చెప్పండి!!
భారతి:– పద్యాలు రాసే వాళ్ళ సంఖ్య తగ్గింది. వచన కవిత్వం పెరిగింది. అది నాలుగు ఐదు లైన్లు మాత్రమే అయితే అందులో కవిత్వం వెతుక్కోవాల్సి వస్తుంది. కవిత్వం రాయాలంటే పాండిత్యం, భావనా శక్తి ఉండాలి అందుకుగాను విపరీతంగా పుస్తకాలు చదవాలి. కవితలో కవిత్వం ఉంటేనే పది కాలాలపాటు నిలిచి ఉంటుంది. ప్రాచీన కావ్యాలు ఇవ్వాళ కూడా మనం చదువుతున్నామంటే క్యాచీగా ఉండి, జ్ఞాపకం ఉంటాయి. ప్రాథమిక పద్యాలు ఎక్కువ ధారణ ఉండదు ఎంత చదివితే అంత కొత్త ఆలోచనలు వస్తాయి. నేను ఒక కవితాసంకలనం వేసుకున్నాను.
ఆ సంకలనానికి భారతీయం అని పేరుపెట్టాను. అప్పట్లో ఉదయం పత్రిక ఉండేది అందులో ప్రతి వారం ఒక కవిత అచ్చు అయ్యేది. తర్వాత పసిపిల్లల గురించి ఫిమేల్ చైల్డ్ ఇయర్ శీర్షికన కవితలు ఒక సంవత్సరం పాటు వచ్చాయి. అప్పుడు ఊయలనే కవిత రాశాను. ఉయ్యాల దేనికి ప్రతినిధి అంటే ఒక ఆడపిల్లకి…
ఉయ్యాలలో ఉండే నెల రోజుల పసికందైనా సరే తల్లితో మాట్లాడుతుంది. అంటే అది కవి భావనే! తల్లి ఊయలలోకి తొంగి తొంగి చూస్తుంటే ఆ అమ్మాయి ఏమంటుందంటే…
అమ్మా నేను ఆడపిల్లను పుట్టాను అని బాధపడుతున్నావా?
రౌడీ మగ పిల్లవాడి కన్నా ఆడపిల్ల నీకు ఆనందం కాదా?
నువ్వు హాస్పిటల్ లో డాక్టరమ్మను ,
బడిలో టీచరమ్మను చూసినప్పుడు
నీ కూతురు అలా కావాలని అనుకోలేదా? అని అంటుంది తల్లి కూతురు వేసిన ఈ ప్రశ్నలకు జవాబు చెప్పడానికి ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. చివరగా ఊయలలో ఉన్న పిల్ల ఏమంటుందంటే ..?
“అమ్మా నాకు పట్టుపరికిణీలు కొనవద్దు!
పట్టా గొలుసులూ వద్దు!
ప్రాణంతో ఉండనీయండి నన్ను!
నా కళ్ళతో నన్ను లోకాన్ని చూడనివ్వండి!
నా మనసుతో ఆలోచించనివ్వండి !
నేను అమ్మను అవుతాను!
ముగ్గురమ్మల మూలపుటమ్మనవుతాను!
శక్తిని అవుతాను! యుక్తినౌతాను!
నన్ను నన్నుగా బతకనీయండి!
అని ఉయ్యాలలో పాప అన్నట్టుగా రాసి
ఊయల అని దానికి పేరు పెట్టాను.
పద్మజ:– మీరు జీవిత చరిత్రలు రాశారని విన్నాను వాటిని ఎందుకు రాయాలనిపించింది?
భారతి:– జీవిత చరిత్రలు ఎందుకు రాయాల్సి వచ్చిందంటే? నాకు వాటిని చదవడం చాలా ఇష్టం. వాటిని చదివితే మనకు అనుకోకుండా ఒక దేశభక్తో.. ఒక సమాజ సేవ చేయాలనో ఆకాంక్ష ఏర్పడుతుంది.
ఒక జీవితకాలంలో వారు అన్ని పనులు చేయగలిగితే మనం ప్రపంచానికి పనికొచ్చే ఒకటో రెండు పనులు చేయలేమా? అనే భావం కలుగుతుంది. అందుకే జీవిత చరిత్రలు చదవడం, రాయడం నాకు ఇష్టం. అందుకే ఇల్లిందల సరస్వతీ దేవి జీవిత చరిత్రను రాయించారు. అలాగే తరిగొండ వెంగమాంబ జీవిత చరిత్రను కేంద్ర సాహిత్య అకాడమీ వారు నాచే రాయించారు.
ఎల్లాప్రగడ సీతాకుమారి గారు ఎంతో కాలం కిందటే ఆడపిల్లలు బయట ప్రపంచంలోకి వచ్చి చదువుకోడానికి కష్టం… అనుకుని ఆ రోజుల్లో ఒక చిన్న యువతి మండలిని స్థాపించి, చిన్న చిన్నగా పెంచి ఆ యువతీ మండలిలో ఇప్పుడు పీజీలు కూడా చదువుతున్నారు.
ఆ సంస్థకు నేను వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసాను.
అలా ఎల్లాప్రగడ సీతాకుమారి జీవిత చరిత్రను రాశాను.
ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ గారి గురించి ఒక వ్యాసం రాశాను. అది చూసి వారి అబ్బాయి రాజరాజ నరేంద్ర అమెరికాలో నివసించే వారు ఆ వ్యాసం చదివి మా అమ్మగారి గురించి చక్కని వ్యాసం రాశారు. ఆమె చేతనే అమ్మ జీవిత చరిత్ర రాయించాలని వంశీ రామరాజు గారిని కోరారు. రామరాజు గారు వంశీ సంస్థ ద్వారా ఆ పుస్తకం అచ్చు వేయించారు. ఈ మహిళలంతా స్ఫూర్తినిచ్చే వారే. వారి జీవితమంతా త్యాగం చేసి దేశానికి, సమాజానికి ఎంతో ఉపయోగపడ్డారు. వారితో పోల్చుకుంటే మనం ఎంత స్వార్ధపరులమో కదా! మన గురించి మనం ఆలోచించుకోవడం తప్ప మరొక ఆలోచన రాదు.వాళ్ళు జీవితమంతా దేశానికి , సమాజాని కోసమే ఆలోచించారు.
అందుకే జీవిత చరిత్రలు రాయాలి! తప్పక ఈ తరం వారు వాటిని చదవాలి! చదివితే ప్రేరణ పొంది ఏవైనా మంచి పనులు చేయగలరు . అలా వారి జీవితాలు సార్ధకత పొందుతాయి.
పద్మజ:– ఇంతటి సాహిత్యాన్ని సృష్టించిన మీరు పొందిన పురస్కారాలు, అందుకున్న అవార్డులు సన్మానాలు తెలుపుతారా?
భారతి:– ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును 1991లో బహుకరించారు.
మద్రాసు కేసరి కుటీరం వారు గృహలక్ష్మి స్వర్ణ కంకణ పురస్కారాన్ని 1996లో ఇచ్చారు.
1998 లో మద్రాసు తెలుగు అకాడమీ వారు ఉగాది పురస్కారాన్ని అందజేశారు.
1998లో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వారు ధర్మనిధి పురస్కారాన్ని ఇచ్చారు.
1995లో అభినందన సంస్థ వారు
దుర్గాబాయి దేశ్ ముఖ్ అవార్డు ప్రధానం చేసారు.
1989 లో ఆంధ్ర మహిళా సభ హైదరాబాద్ వారు చల్లపల్లి వెంకట శాస్త్రి
అవార్డును బహుకరించారు.
2000 సం.పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వాళ్ళు బెస్ట్ ఉమెన్ రైటర్ అవార్డును అందజేశారు.
2002 లో వంశీ సాంస్కృతిక సంస్థ
ఇల్లిందల సరస్వతీదేవి *స్వర్ణ పథకం అందించారు.
2002 లో విశ్వసాహితీ సంస్థ వారు తెలుగు సాహిత్య విమర్శ , 2006 లో సుశీలా నారాయణ రెడ్డి సాహిత్య అవార్డ్, 2007 లో నాయని సుబ్బారావు సాహిత్య పురస్కారం, కొత్తూరు దేశికులు వెంకటలక్ష్మి పురస్కారం బహుకరించాయి. 2008 లో రావూరి కాంతమ్మ లిటరేచర్ అవార్డ్, 2011 లో విజయవాడ కళాపీఠం వారు ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ సాహిత్య పురస్కారం,
ఉపాసనా సంస్థ 2013లో మండపాక ఉమాదేవి సాహిత్య పురస్కారం,
సామవేదం షణ్ముఖ శర్మగారి తల్లి లలితాదేవి స్మారక పురస్కారం ఋషి పీఠంనుండి,
నవ్యసాహితీ సమితి నుండి వసంతోత్సవం – ఉగాది పురస్కారం, ఇలా పలు సంస్థల నుండే కాకుండా
2014 లో అమెరికాలోని హ్యూస్టన్ – వంగూరి ఫౌండేషన్ సంస్థ జీవన సాఫల్య పురస్కారం,
గిడుగు రామమూర్తి జీవనసాఫల్య పురస్కారం,
విశిష్ట మహిళా పురస్కారం తెలంగాణ ప్రభుత్వం 2024 మహిళాదినోత్సవ సందర్భంగా అందించారు.
అపురూప అమృత లత జీవన సాఫల్య పురస్కారం అందుకున్నాను.
పద్మజ:–ఇన్ని పురస్కారాలందుకున్నందుకు అనేక అభినందనలమ్మా!
అలాగే తరుణి పత్రిక పాఠకులకు మీరు ఏం సూచనలు ఇస్తారు?
భారతి :– సూచనలు కాదు కానీ ఇవాళ నన్ను మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఎవరైనా విన్నవారు కొన్ని విషయాలైనా మనసుకు పట్టుకుంటే, ఒక్క మన కుటుంబానికే కాదు సమాజానికి ఏమైనా చెయ్యాలని అనుకోవాలి. రాయాలంటే పుస్తకాలు బాగా చదవాలి. నా వయసు 80 పైన ఇప్పటికీ సాహిత్య కృషి చేస్తూనే ఉన్నాను. సాహిత్యం ఎలా పని చేస్తుంది అనే దానికి ఉదాహరణగా నేను ఒక కథ చెప్తాను.
ఆరుగురు అక్క చెల్లెళ్లు అన్న తమ్ముళ్లు ఒక ఫంక్షన్ లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇప్పటి జనరేషన్లో ఎవరైనా ఒక్కొక్క పిల్లనే కంటున్నారు. ఒక పిల్లవాడు ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే మీ అందరూ ఇలా సంతోషంగా కబుర్లు చెప్పుకుంటున్నారు మీరందరూ ఒరేయ్! అన్నాయి అని, ఒసేయ్! చెల్లి అని ఒక్కొక్కరు ప్రేమగా పిలుచుకుంటున్నారు నాకు ఎవరూ తోడు లేరు. తోడు ఎవరున్నారని ఏడుస్తున్నాడు.
వాళ్ళ అమ్మ నిజమే కదా! అనుకుంటుంది.
కాలేజీకి వెళుతుంటే ఒకరు ఎదురొచ్చి మీ కథ తోడు చదివాను. ఒక నిర్ణయం తీసుకున్నాము మా అమ్మాయికి ఇప్పుడు 9 సంవత్సరాలు ఒక పిల్ల చాలు అనుకున్నాము కానీ మా తర్వాత మా అమ్మాయి ఒంటరిగా అయిపోతుందని ఇంకొకరిని కనాలని అనుకుంటున్నామని అన్నాడు.
అంటే నా కథ ఒకరి మనసు మార్చిందంటే సాహిత్య లక్ష్యం నెరవేరినట్టే!
అలాంటి ఎన్నో కథలు ఉన్నాయి.ఈ తరం వారు చదువుతూ, రాస్తూ, ఉంటే మన విలువలు రక్షింపబడతాయి.
పద్మజ:– ప్రేక్షకులకు ఇంత గొప్ప సాహితీవేత్తను, మానవతా మూర్తిని పరిచయం చేయడం, నా భాగ్యంగా తలుస్తున్నాను. ఇంకా ఎన్నో విషయాలున్నాయి వారినుండి నేర్చుకోవడానికి ఇంత తక్కువ సమయం సరిపోదు! ఎంత చెప్పిన తక్కువే వారు వృత్తి రీత్యా విద్యార్థులకు చేసిన సేవలు అమోఘం. ఇవాళ ఒక స్ఫూర్తివంతమైన మహిళా రత్నం శ్రీమతి ముక్తేవి భారతి గారితో పరిచయం చేసుకున్నాము.
మరొక మహిళా రత్నంతో కలుస్తాను! అందాకా మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ..