లోకాభిరామాయణం 3

చప్పట్లు, కామెంట్లు

ఒక ఇంగ్లీషు రైటర్ గుడ్ మ్యానర్స్ గురించి చెపుతూ, ఒక సందర్భంలో ఒకమాట చెపుతాడు.
నలుగురిలో ఉన్నప్పుడు ఒక విషయం మీద మీరు ఏదైనా మాట్లాడాలి అనుకుంటే, మీ మాటలు వినేందుకు అందరూ ఆసక్తి చూపిస్తున్నారా లేదా అని గ్రహించుకుని మాట్లాడాలి. అలా కాకుండా ” నేను చెప్పేది వినండీ” అని వారిని అడిగి చెపటం అనేది సరైన పద్ధతి కాదు. అలా అడిగారు అంటే మీ మాటలు వినటానికి వారు సిద్ధంగా లేరు అని అర్థం. అలాంటి చోట మాట్లాడటం మంచిది కాదు అంటాడు.

ఎప్పుడో చదివిన ఈ విషయం ఈ మధ్య కాలంలో బాగా గుర్తుకొస్తున్నది. ఎందుకంటారా, ఎవరూ, ఎవరి మాటలు వినే పరిస్థితిలో లేరు. అందరికీ అన్నీ తెలుసు అనే‌ భావన, లేదా ఎవరి ప్రపంచం వారిదే అన్నట్లు ఉండటంతో ఈ పరిస్థితి వస్తున్నది.
మా కాలనీలో దసరా నవరాత్రులు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఒక మంచి బ్రహ్మ గారిచేత పూజలు నిర్వహించారు. దానిలో భాగంగా ఒక మంచి పండితునిచే నాలుగు మంచి మాటలు చెప్పించే వారు. కానీ పాపం ఆయన ధోరణి ఆయనదే, భక్తుల కబుర్లు భక్తులవే. ఆలయానికి వాళ్ళు వచ్చేది కేవలం స్నేహితులతో ముచ్చట్ల కోసమే. వారి చీరెలు, నగలు, పిల్లల అభివృద్ధి సదరు వక్త, దయచేసి మీరు అందరూ నిశ్శబ్దంగా ఉంటే నేను నాలుగు మాటలు చెపుతాను అని రిక్వెస్ట్ చేసుకునేవాడు. అఫ్ కోర్స్ రెండు రోజుల తర్వాత ఆయన విద్వత్తు అందరికీ తెలిసి, శ్రధ్ధగా విన్నారనుకోండీ. అది వేరే విషయం.
వినటం ఒక్కటే సరిపోదు, చప్పట్లు కొట్టాలి. రాజకీయ నాయకులు బిర్యానీ పొట్లాలు, ప్రయాణం ఖర్చులు ఇచ్చి , పిలిపించుకుని చప్పట్లు కొట్టించుకుంటున్నారు. మామూలు వాళ్ళ పరిస్థితి గమ్మత్తుగా ఉంటుంది. స్పీచ్ మధ్యలో సడెన్ గా ఆపి వేసి, ‘ ఏంటండీ, చప్పట్లు కొట్టరు’ అని ఏదో జోక్ గా అన్నట్లు అంటారు. దాంతో మొహమాటానికైనా చప్పట్లు కొట్టాలి.
అసలు ఈ చప్పట్ల గొడవ ఏమిటీ అనే సందేహం మీకు వచ్చే ఉంటుంది. నేను చెప్పవచ్చేది ఏంటంటే, ఏ మనిషైనా ఒక గుర్తింపు కోరుకుంటాడు. తను చెప్పే విషయం పది మంది వినాలి, వారి నుంచి ఒక ప్రశంస రావాలి అని కోరుకుంటారు. కానీ ఈ మధ్య కాలంలో ఎవరికీ కూడా అవతలి వ్యక్తులు చెప్పేది వినే ఓపిక,సమయం ఉండటం లేదు. అవి ఉపన్యాసాలు కానీ, ప్రవచనాలు కానీ, మరేవైనా కానీ. దాంతో అరువు శ్రోతల్ని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇక రెండో విషయం కామెంట్స్ కి వద్దాం. ఒకప్పుడు మనకి ప్రింట్ మీడియా ఉండేది. రకరకాల వార, మాస పత్రికలు ఉండేవి. మన కథో, నవలో వాటిలో వస్తే, పాఠకుల స్పందన రచయితలకి చేరటానికి అవకాశాలు తక్కువగా ఉండేవి. అడ్రస్ తెలిస్తే ఉత్తరాలు రాసేవారు. ఫోన్లు వచ్చాక ఫోన్ చేసి అభినందనలు తెలిపే వారు.
కానీ ఇప్పుడు ఎఫ్.బీ. , ఆన్ లైన్ మ్యాగజైన్ ల పుణ్యమా అని చదివిన వెంటనే అక్కడే పాఠకుల స్పందన తెలియజేసే అవకాశం కలిగింది.
వారి సద్విమర్శలు రచయితలకు మంచి ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని కలుగచేస్తున్నాయి. రచయితలు వారి రచనల్లో లోపాలు ఉంటే సరిదిద్దుకోగలిగే అవకాశం కూడా కలుగుతోంది.
ఇన్ని మంచి పాయింట్లు ఉన్నాయి కదా! ప్రత్యేకంగా కామెంట్లు అంటూ ఏదో రాయటం ఏమిటీ? అనుకుంటున్నారు కదూ! వస్తున్నా ఆ పాయింట్ కే.
ఒక పుస్తకం చదివిన పాఠకులు అందరూ రచయితలకు ఫోన్ చేయరు. వారు కూడా చదివిన అందరూ ఫోన్ చేసారా లేదా అని పట్టించుకోరు. కానీ ఇప్పుడు పరిస్థితి అలాకాదు.
ఒక కథ పోస్ట్ చేస్తాం. అంతే ఆ రెండో క్షణం నుంచే ధ్యాసంతా ఎన్ని కామెంట్స్ వచ్చాయా అనే దానిపైనే ఉంటుంది. నిమిషానికి ఒకసారి ఫోన్ చూసుకోవటం, కామెంట్స్ చదువుకోవటం, వాటికి తిరిగి స్పందించటం. సర్వకాల సర్వావస్థలందూ ఫోన్ హస్త భూషణంగా ఉండాల్సిందే.
అది కూడా సహజమేగా, అవకాశం ఉంది కాబట్టి ఆశ పడటంలో తప్పులేదు. సోది అంతా ఎందుకు అనుకుంటున్నారు కదూ!
అందరికీ అన్నీ కథలు, కాకరకాయలు ఒక్కరోజులోనే చదివే అవకాశం ఉండదుగా! చదివారే పో, కామెంట్ పెట్టే అలవాటు ఉండదు.
దాంతో నేను చెప్పేది కాస్త వినండీ అన్నట్టు, నా కథకి అందరూ స్పందించి, కామెంట్ పెట్టవలెను అనేది సర్వసాధారణం అయిపోయింది.
అడగందే అమ్మ అయినా పెట్టదు అనే సామెత లాగా కామెంట్స్ కూడా అడిగి పెట్టించుకోవాల్సిందే అని చాలా మంది అభిప్రాయం. అఫ్ కోర్స్ సిన్సియర్ గా వారి అభిప్రాయాల్ని వెలిబుచ్చే మంచి పాఠకులు కూడా ఉన్నారు.
ఈ మధ్య ఒక గ్రూప్ నిర్వహించే రచయిత్రి పెట్టిన ఒక కథకి చాలా తక్కువ కామెంట్స్ వచ్చాయని బాధపడుతూ ఒక్కమాట అన్నది,
” ఒకప్పుడు నేను కథ పెడితే గంటలోపు ఎంతో మంది స్పందించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎందుకో ఇరవై, ముఫై మంది కూడా చదవటం లేదు” అంది.
ఇది ఆమె ఒక్క దాని బాధ కాదు. అందరికీ, చాలామంది సీనియర్ రచయితలకి కూడా కాస్తోకూస్తో ఈ ఫీలింగ్ ఉంది.
వారి బాధలో అర్ధం ఉంది. అయితే లెక్కకు మిక్కిలి గ్రూపులు వస్తున్నాయి. అన్నీ చదివి అభిప్రాయం చెప్పాలంటే కష్టమే కదా!
కాబట్టి మనందరం ప్రాక్టికల్ గాఆలోచించాలి. మన పని మనం చేసుకుపోవాలి. రిజల్ట్స్ ఆశించకూడదు. చప్పట్లు, కామెంట్ కి ఆశించని స్థితప్రజ్ఞత అలవర్చుకోవాలి.

Written by PVS Krishnakumari

పేరు. : పీ. ( వల్లూరు) వి. యస్. కృష్ణ కుమారి
భర్త : పోతరాజు వేణుగోపాల కృష్ణ మూర్తి ( రిటైర్డ్ ఫైనాన్స్ ఆఫీసర్ హై కోర్టు)
పుట్టిన తేది. ఆగష్టు, 14
తండ్రి. : వల్లూరు కోటేశ్వరరావు
తల్లి : వల్లూరు రాజ్యలక్ష్మి
పిల్లలు : నీలా సుందరి ( కూతురు )
రవిశంకర్ ( అల్లుడు)
శ్రీవాత్సవ ( కుమారుడు)
‌. మృణాళిని ( కోడలు)

జన్మస్థలం : వల్లూరు , గుంటూరు జిల్లా
విద్యాభ్యాసం. : పొన్నూరు, విజయవాడ ,
క్వాలిఫికేషన్ : బి.ఏ. బీఈడీ
వృత్తి. : ప్రిన్సిపాల్ అండ్ కరస్పాండెంట్ శ్రీవాణి మోడల్ స్కూల్ ( సొంత స్కూల్)
ప్రవృత్తులు. : సంగీతం, సాహిత్యం
సాహితీ ప్రయాణం. : 2010 లో మొదటిసారిగా కవితలతో మొదలైంది. వార్త, మన తెలంగాణా, సత్యం ఆన్లైన్ మ్యాగజైన్ లలో వందకి పైగా కవితలు
2015 లో మొదటి కథ ' ఓ సీత కథ' నవ్య వారపత్రికలో ప్రచురితమైంది. ఆ తర్వాత నవ్య, పాలపిట్ట, నమస్తే తెలంగాణా, జాగృతి, ఉషోదయ వెలుగు, వార్త ఆదివారం అనుబంధం, ఉషా మ్యాగజైన్ లలొ దాదాపు ఇరవై ఐదు కథలు, బహుమతులు , సాధారణ ప్రచురణకు ప్రచురితమైనాయి.
కథా మంజరి, కథా వేదిక, తరుణి ఇంకా అనేక ఫేస్ బుక్ గ్రూప్ లలో యాభైకి పైగా కథలు రాగా, ఇరవై కథలకి బహుమతులు వచ్చాయి.
నవలలు : జీవన విపంచి
వేద సుధామయం.
నేల నుండి నింగికి ( అముద్రితం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

హరి చందన- 7వ భాగం

చిత్ర కళ