హరి చందన

సాంఘిక నవల

డా జి భవానీ కృష్ణ మూర్తి

“పెద్దమ్మా!”అంటూ వచ్చి తనని వాటేసుకున్న చందనని చూసి “చందూ !రెండు మూడు రోజులనుంచి ఇటురాలేదు.. ఒంట్లో బాగానే ఉందా?” భుజాలచుట్టూ చెయ్యి వేసి, దగ్గరకి అదుముకుంటూ అంది కౌసల్య.
“అబ్బా! పెద్దమ్మా.రెండు రోజులు రాకపోతే ఇంత టెన్షన్ పడతావేంటి? ఆఫీస్ లో కాస్త లేట్ అయితే ఇటు రాకుండా డైరెక్ట్ గా ఇంటికి వెళ్లి పోయాను…శైలు ఇంట్లో లేదా, ఎక్కడా అలికిడి లేదు?”
“లేకేం తల్లీ… ప్రొద్దుటినుంచి ఆ లాప్టాప్ వదిలిపెట్టి వస్తేనా? పిలవగా పిలవగా వచ్చి, భోజనం ప్లేట్ లో పెట్టుకుని తన గదిలోకి తీసికెళ్ళింది. సెలవు రోజు వస్తే ఇంతే…తిందో లేదో?… పద. చూద్దాం” అంటూ కూతురు శైలజ గదిలోకి దారితీసింది కౌసల్య..
శైలజ మంచం మీద బోర్లా పడుకుని లాప్టాప్ లో సినిమా చూస్తోంది.
భోజనం ప్లేట్ ఖాళీ గా బెడ్ పక్కనున్న బల్లమీద ఉంది. పక్కనే వాటర్ బాటిల్.
మాట్లాడ వద్దన్నట్లు కౌసల్యకి సైగ చేసి, మెల్లగా వెళ్లి కళ్ళు మూసింది.
ఆ చేతుల్ని తడిమి చూసి “చందూ !”లేచి సరిగ్గా కూర్చుంది శైలజ .
చందన భుజాల చుట్టూ చేతులు వేసి “ఏమిటే ఉరమని పిడుగులా చడీ చప్పుడు లేకుండా వచ్చావ్? “అంది, జుట్టు సరిచేసుకుంటూ.
“ఏంటీ?.. నీదగ్గరికి అపాయింట్మెంట్ తీసుకొని రావాలా?”నడుము మీద చేతులు పెట్టుకుని నిలబడింది.
“అదేం కాదులే.. మా ఇంట్లోకి స్వేచ్ఛగా మేడ మీదున్న నా గదిలోకి రాగలిగావంటే…. నువ్వూ మా కుటుంబ సభ్యురాలివే అని కదా అర్ధం “చెయ్యి పట్టి లాగి, తన పక్కన కూర్చోబెట్టుకుంది.
ఇంక తను అక్కడ ఉండడం అనవసరం అని, నవ్వుకుంటూ, ఖాళీ ఎంగిలి ప్లేట్ తీసుకుని వెళ్ళబోతూ “చందూ! భోజనం చేశావా?” అడిగింది.
“భోజనమా! నేను…… తెలిసిందేగా… ఏ పార్టీలోనో ఏదో ఐటమ్ చూసి, ఇంట్లో మామీద ప్రయోగం చేస్తుంటుంది మమ్మీ. అదేదో సినిమాలో బంగాళ దుంప భౌ భౌ, కాకర కాయ కౌ కౌ.”అన్నట్లుగా ఏవేవో పేర్లు… రంగు, వాసన చూస్తే ఆకలి చచ్చిపోయింది “అంది ముఖం అదోలా పెట్టి.
“అయ్యో!రెండయింది.. తిండి తినకుండా కూర్చున్నావా? శైలూ!దాన్ని తీసుకుని కిందకిరా. అది అన్నం తింటుంటే కబుర్లు చెప్పుకోవచ్చు “అంది కౌసల్య.
“పద “చందూ భుజాల చుట్టూ చెయ్యి వేసి,”వద్దు ఆకలి లేదు” అంటున్నా కిందకి లాక్కొచ్చింది.
గుత్తి వంకాయ కూర, కొబ్బరి పచ్చడి ప్లేట్ లో చూడగానే ఇంకేమీ మాట్లాడకుండా కుర్చీ లాక్కుని కూర్చుని తినడం మొదలు పెట్టింది.
“పిచ్చి మొద్దు.. ఇంత ఆకలి పెట్టుకుని.. ఆకలి లేదంటావా? మాదగ్గర కూడా మొహమాటమేనా?”వెనుక నుంచి చందూ తల నిమిరింది కౌసల్య.
ఆ చెయ్యి అందుకుని తన చెంపకి చేర్చుకుని గట్టిగా నొక్కుకుంది చందన, కృతజ్ఞతా పూర్వకంగా.
చందన రెండు భుజాలమీద చేతులు వేసి “చందూ! మీ ఇంట్లో నీకు నచ్చకపోతే…ఎప్పుడైనా సరే ఇక్కడికి వచ్చి తినెయ్.మా శైలూ ఎంతో నువ్వు అంతే. “చెప్పింది.
“అర్ధమైందా? “శైలజ. ఆమె భుజమ్మీద కొడుతూ.
ఉబికి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ సరేనన్నట్లు తలూపి
నీళ్లు తాగుతూ దుఃఖాన్ని దిగమింగింది.
“ఇప్పుడు వెళ్లి కబుర్లు చెప్పుకోండి ” వాళ్ళని పంపి టేబుల్ సర్దుకుంది కౌసల్య.

***************
కౌసల్య, కుటుంబరావులకి ఇద్దరు కొడుకులు ఒక కూతురు. కొడుకులిద్దరికీ పెళ్లిళ్లు అయి, ఇద్దరూ అమెరికాలో ఉన్నారు.
కూతురు శైలజ బిటెక్ పూర్తి చేసి, ఒక మల్టీ నేషనల్ కంపెనీ లో పనిచేస్తోంది.
చందన తల్లి సుమిత్ర కౌసల్యకి చెల్లెలు వరస అయ్యే దూరపు బంధువు. బంధుత్వం దూరం అయినా స్నేహo వారిని దగ్గర చేసింది.. పెళ్లిళ్లు అయ్యాక ఇద్దరూ ఒకే ఊళ్ళో ఉండడంతో ఆ స్నేహo మరింత బలపడింది.. వారి స్నేహం చూసి విధికి కన్ను కుట్టిందేమో…..
చందన పుట్టినప్పుడు కాన్పు కష్టమై చనిపోయిందిసుమిత్ర.
ఇంచుమించుగా తన కూతురు శైలజ ఈడుదే కావడంతో
ఆ పసిబిడ్డని కూడా కొన్నాళ్ళు తనే చూసుకునేది కౌసల్య.

కూతురు చందన పరాయి ఇంట ఉండడం, ఆమె తండ్రి
వాసుదేవరావుకి నచ్చక తీసికెళ్లి, తన తల్లిదండ్రుల దగ్గర ఉంచాడు. వయసు మళ్ళిన తమకు పసిబిడ్డను పెంచడం కష్టం అని చెప్పారు.
తల్లి తన అక్క మనవరాలు రేవతిని పెళ్లి చేసుకోమని చెప్పింది.
రేవతికి అంతకు ముందే పెళ్లి అయిoది.ఏడాది వయసున్న కొడుకు ఉన్నాడు. ఆమెకు భర్తతో విభేదాలు వచ్చి విడిపోయి విడాకులు తీసుకుంది . ఆమె బిడ్డకి తండ్రి లేని లోటు అతనివల్ల, చందనకి తల్లిలేని లోటు రేవతి వల్ల తీరుతుందని చెప్పారు.
రేవతిని పిలిపించి ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడి,ఇద్దరి అంగీకారం తీసుకుని పెళ్లి జరిపించేశారు.పిల్లలకి అసలు విషయం చెప్పే అవసరం లేదని, పిల్లలిద్దరి చేత ఇద్దర్ని అమ్మా, నాన్న అని పిలిపించుకోమని చెప్పారు.

రేవతిని అంతకుముందు రెండు మూడు సార్లు చూసి ఉండడం, ఆమె కూడా తన లాంటి పరిస్థితుల్లోనే ఉండడంవల్ల అభ్యంతరం చెప్పలేదు వాసుదేవరావు.
తనకు భార్య అవసరం కంటే చందన ఆడపిల్ల.. ఎదుగుతున్న కొద్దీ తల్లి అవసరం ఉంటుందని రేవతిని పెళ్లి చేసుకున్నాడు.
ఆమె కొడుకుని తను స్వంత కొడుకులాగే చూసుకుoటానని , చందనపట్ల సవతితల్లిలా కాక స్వంత బిడ్డలాగే చూసుకోవాలని
స్పష్టంగా మరోసారి హెచ్చరించ్చాడు.
సవతితల్లి అయినా రేవతి చందనని బాగానే చూసేది కాకపోతే
మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆమెకి, కాస్త కలిగిన కుటుంబంలోకి వచ్చేసరికి సరదాలు, షోకులు ఎక్కువయ్యాయి. స్నేహ బృందం పెరిగింది.
ఏది చేసినా, తెచ్చినా తన కొడుకుతో సమానoగానే ఇచ్చేది.
ప్రత్యేకంగా ఎవరు చెప్పకపోయినా బంధువులందరు కలిసినప్పుడు మాట్లాడుకునే మాటల వల్ల రేవతి తన కన్నతల్లి కాదని చందనకి తెలిసినా ఎదుటపడి అడగలేదు, సరికదా మునుపటిలాగే ఆమెతో, ఆమె కొడుకు శ్రీకాంత్ తో అభిమానంగానే ఉంటోంది.
శ్రీకాంత్ కి కూడా అతను స్వంత తండ్రి కాదు, చందన స్వంత చెల్లి కాదు అని తెలిసినా ఎవరు బయట పడలేదు.
చిన్నప్పటినుంచి ఒకే స్కూల్ లో చదువుతూ అన్నా చెల్లెళ్ళలాగే పెరిగారు కనుక, నిజం తెలిసినా ఆ అభిమానాలు అలాగే ఉన్నాయి.
శ్రీకాంత్ బిటేక్ అయ్యాక అమెరికా వెళ్లినా చందనకి క్రమo తప్పకుండా ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉంటాడు.

. చందన కూడా వెళ్లాలనుకుంది గానీ పెళ్లి చేసుకుని భర్త తోనే వెళ్లాలని, ఒంటరిగా పంపనని చెప్పేసాడు తoడ్రి.

సెల్ రింగ్ అవుతుంటే చూసి “మమ్మి కాల్ చేస్తోంది.”అంటూ అన్ చేసి “ఆ.. మమ్మీ!పెద్దమ్మ ఇంట్లో ఉన్నా….”చెప్పింది.
“తిన్నావా?.. ఇంట్లో పెట్టినవన్ని పెట్టినట్లే ఉన్నాయి?”
“ఇక్కడ తిన్నా మమ్మీ. శైలుతో పనుండి పెద్దమ్మ ఇంటికి వచ్చాను ”
చెప్పింది.
“సరే.. జాగ్రత్తగా ఇంటికి రా” చెప్పి కాల్ కట్ చేసింది రేవతి.
“వెళ్ళవే….ఆలస్యం చేస్తే మళ్ళీ సణుగుడు మొదలెడుతుంది”కౌసల్య చెప్పడంతో ఇంటికి బయల దేరుతూ “అలవాటు అయిపొయింది పెద్దమ్మా., గట్టిగా అరిచి గొడవ చెయ్యదు. అందుకే సమాధానం చెప్పకుండా ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తా “నవ్వింది చందన.

చందనని చూడగానే “అలా వెడతానని ముందుగా చెప్పవచ్చుగా. వండడం మానేసేదాన్ని. మీ నాన్న కూడా లేరు. నేనొక్క దాన్ని బయట ఏదో తినేసేదాన్ని ” అంది రేవతి, కాస్త నిష్టూరంగా.
“సారీ మమ్మీ!ముందుగా అనుకోలేదు.శైలు సినిమాకి వెడదాం రావే అని ఫోన్ చేస్తే వెళ్లాను. మధ్యలో స్కూటీ ట్రబుల్ ఇచ్చింది. బాగుచేయించుకుని వెళ్లేసరికి మేట్నీ మొదలైపోయి ఉంటుందని
అక్కడే కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాం.పెద్దమ్మ తినమని గొడవ చేసింది…. రాత్రికి వేరే ఏమి చెయ్యకు. ఇదే తినేస్తాను. నువ్వు భోజనం చేశావా మమ్మీ?.”అడిగింది.
“మహిళా మండలి మీటింగ్ లో స్నాక్స్ తిన్నాను.ఆకలిగా లేదు
“అవునా…. సరే డాడీ రాత్రికి వచ్చేస్తారేమో కదా.”
“వస్తానని అన్నారు కానీ లేట్ అవుతుందట నువ్వు పడుకో చందూ. నేను మెలకువగానే ఉంటానులే “చెప్పింది రేవతి.
“సరే మమ్మీ!”అని,తన గదిలోకి వెళ్ళిపోయింది చందన.
తండ్రికి ఆఫీస్ పని మీద అలా ఊళ్ళు వెళ్లి, రాత్రి లేట్ గా రావడం అలవాటే కనుక ఇంకేమి మాట్లాడ లేదు చందన.
*************

ఆ రోజు రాత్రి రోజులాగే తండ్రితో కాసేపు కబుర్లు చెప్పి పడుకోడానికి తన గదిలోకి వెడుతూ “డాడీ!రేపు సండేకదా మీరు లేటుగా లేస్తారేమో… మా ఆఫీస్ లో కొలీగ్స్ అందరం కలిసి రేపు పీక్నీక్ కి వెడుతున్నాం. మళ్ళి సాయంత్రానికి వచ్చేస్తాం మమ్మీకి ఆల్రెడీ చెప్పాను. మీ కారు తీసికెళ్ళనా? మీరు ఎటైనా వెళ్ళాలా? ”
అడిగింది.
“ఎక్కడికి? ”
“కంచన్ వేలీ రిసార్ట్స్ అట. చిల్కూర్ వెళ్లే దారిలోఎక్కడో ఉందట. ”
“ఒకే బేబీ!. టేక్ కేర్…. కారు తీసికెళ్ళు.ఏదైనా అవసరం అయితే కాల్ చెయ్యి ”
“ఒకే డాడీ.. గుడ్ నైట్!గుడ్ నైట్ మమ్మీ! “చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది.
“చందూ జాబ్ లో సెటిల్ అయింది కనుక సంబంధాలు చూస్తే మంచిది కదా “అంది రేవతి, భర్తతో.
“అవును. ఇద్దరూ ముగ్గురుతో చెప్పి ఉంచాను. అయినా పిల్లల్ని ఒకసారి అడగాలి, వాళ్ళ దృష్టిలో ఎవరైనా ఉన్నారో, మనల్నే చూడమంటారో.. నువ్వూ శ్రీ కాంత్ ని కనుక్కో. నేనూ చందూతో మాట్లాడతాను “అన్నాడు వాసుదేవరావు.
“నిజమేలెండి. నాకు తెలిసినంత వరకూ ఇద్దరికీ ఎలాంటి అఫైర్స్ ఉన్నట్లు లేదు.”
“అయినా కనుక్కోవడం మంచిది. తీరా మనం సంబంధం మాట్లాడాక, ముందు చెప్పలేదని మనమీద నింద వేస్తారు ”
“అదీ నిజమే. కనుక్కుంటాను.. చందూకి మా తమ్ముడికి………..”
భార్య మాటల్ని మధ్యలోనే ఖండిస్తూ “వద్దు రేవతీ!అటు నీవైపు, ఇటు నావైపు కూడా మూడు తరాలుగా వాళ్లలో వాళ్ళే బీరకాయ పీచుల్లా పెళ్లిళ్లు చేసేసుకున్నారు. ఆరోగ్యరీత్యా అది మంచిది కాదు.
బయటి సంబంధాలే చూద్దాం ఇద్దరికీ.”అన్నాడు వాసుదేవరావు.
“శ్రీకాంత్ కి మా అన్నయ్య కూతురు అయితే బాగుంటుందనుకుంటున్నాను “.
“రేవతీ!నా అభిప్రాయం చెప్పాను నువ్వు, వాడు ఆలోచించుకోండి నాకు అయితే ఇష్టం లేదు. మీరిద్దరూ సరే అనుకుంటే నేను కాదనను. చందుకి మాత్రం బయటి సంబంధమే చూస్తాను. ముందు పిల్లల అభిప్రాయం కనుక్కున్నాకే ఏ నిర్ణయమైనా “లేచి,”నేను పడుకుంటున్నా తలుపులు చూసి, లైట్స్ ఆర్పేసి., పడుకోడానికి వచ్చేటప్పుడు……..

( సశేషం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఇంటి పని – The Home Work

శుభ ముహూర్తం-1