కూర్చోలేక ఇబ్బంది పడుతున్న మిత్రబృందాన్ని చూసి “ఫ్రెండ్స్!వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోండి. సాయంకాలం అలా గోదావరి చూడడానికి వెడదాం ” చెప్పాడు హరి.
ఆఁ మాట కోసమే ఎదురు చూస్తున్నట్లు అందరూ మేడమీద గదిలోకి వెళ్ళి పడకల మీద వాలారు..
హరి, జగ్గూ అక్కడే ఉయ్యాల బల్ల మీద ఒకరు, సోఫాలో ఒకరు పడుకున్నారు.
******************
సాయoకాలం నాలుగు గంటలకు అందరూ తయారై కిందకు రాగానే
అరిసెలు జంతికలు ప్లేట్ లో పెట్టి అందరికీ ఇచ్చింది సుశీల.
“ఆమ్మో! భోజనమే ఇంకా అరగలేదు. ఇప్పుడేమి తినలేము” అంటూ సున్నితంగా తిరస్కరించి,కాఫీ మాత్రం తాగారు అందరూ.
హరి వారందరిని ఎదురుగా పెద్ద గేటు తెరిచి లోపలికి తీసుకుని వెళ్ళాడు. వారితోపాటు జగదీశ్ కూడా ఉన్నాడు.
విశాలమైన ప్రాంగణంలో బాటకి ఇరువైపులా పహారా కాస్తున్న సైనికుల్లా నిలబడి ఉన్నాయి, గులాబీ,మందార,మల్లె, చేమంతి వంటి పూల మొక్కలు.గేటుకి ఇంటికి మధ్యలో రావి ఆకు పైన పడుకుని ఆకాశం వైపు చూస్తూ చిరునవ్వులు చిందిస్తున్న బాల కృష్ణుని విగ్రహం,పైన ఆచ్చాదనగా ఐదు తలల నాగపడగ కృష్ణుని పై వెలుతురు పడేలా నాలుగు మూలలనుంచి ఫోకస్ లైట్స్.
విగ్రహo అడుగులోతు వరకూ నీళ్లు, అందులో తెల్లని ఎర్రని తామరలు, చుట్టూ గట్టు అర్ధ చంద్రకారం .,ఆ అర్ధచంద్రాలు కలిసేచోట పూల కుoడీలు… నీళ్లు స్వచ్ఛoగా ఉన్నాయి.
“వావ్! సూపర్ హరి గారూ! చాలా బాగుంది “అంటూ అందరూ ఫోటోలు తీసుకున్నారు.
ముందు అంతా మొక్కలు బాగానే ఉన్నా ఇంటికి రెండు పక్కలా ఉన్న మొక్కలు అక్కడక్కడా ఎండిపోతున్నాయి.
ఇంటి ముందుకు రాగానే జగదీష్ లాల్చి జేబులోనుంచి తాళాల గుత్తి తీసి తాళం తీశాడు. ఐదారు మెట్లు, వాటికీ రెండు వైపులా పెద్ద పెద్ద అరుగులు. ఆ అరుగుల మీద రెoడు వైపులా గదులు.
ఆ అరుగుల మీద రెండూవైపులా సమాన దూరంలో రెండు స్థoభాలు
“ఇంత స్పెస్ ఖాళీ గా వదిలేశారేంటి “? అడిగాడు కార్తీక్.
“సాయంకాలం పెద్దలు కూర్చుని కబుర్లు చెప్పుకోడానికి, పిల్లలు ఆడుకోడానికి, రాత్రి పూట బాటసారులు ఎవరైనా పడుకోడానికి ఇలా అరుగులు ఉంటాయి.ఉదయం ఊళ్లోకి వెళ్ళినప్పుడు చూశారుగా.”చెప్పాడు హరి.
“చిన్నప్పుడు మేము, అత్తయ్యల పిల్లలు ఇక్కడే కూర్చుని కేరమ్స్, దాగుడు మూతలు ఆడుకునే వాళ్ళం. ఎండా కాలం వచ్చిందంటే ఈ అరుగులుకి చివర గోనెబరకాలు కట్టించేవారు తాతయ్య, మాకు ఎండ తగలకుండా ఆడుకుంటామని. మధ్య మధ్యలో వాటిని పనివాడు నీళ్లతో తడిపేవాడు చల్లగా ఉంటుందని.”చెప్పాడు జగదీశ్.
గడప అడుగు వెడల్పు అడుగు ఎత్తులో ఉంది.
తలుపులు పెద్దగా మందంగా ఉన్నాయి. వాడకపోవడం వల్ల తెరుస్తుంటే కిర్రుమని చప్పుడు వచ్చింది.
లోపల బూజులు వేలాడుతున్నాయి. హరి తలుపు వారగా ఉన్న కర్ర అందుకుని ఆ బూజుల్ని చెదర గొట్టాడు.
సుమారు ఇరవై అడుగుల చతురస్రఆకారంలో ఉన్న హాలు, మధ్యలో మూడు అడుగుల చదరంగా రెండు అడుగుల గుంట. దానికి పైన మూడుడుగుల మేర ఆకాశం కనిపించేలా ఓపెన్ స్పెస్. అక్కడినించి చూస్తే పెంకులు కనిపిస్తున్నాయి.
“అప్పుడు ఈ కాంక్రీటు, స్లాబ్ వెయ్యడం అదీ లేదు. వెదురుబద్దలతో తడికలాగ మేకులు కొట్టి దానిమీద పెంకులు అమర్చేవారు.కోతులు వచ్చి అవీ పాడుచేస్తే,పెంకు నేతగాళ్ళు అని ఉంటారు. వారిని పిలిస్తే వచ్చి సరిగ్గానేసి వెళ్లేవారు. డబ్ల్యూ ని బోర్లిస్తే,
మధ్యలో మూడు అడుగుల హోల్ చేస్తే ఎలా ఉంటుందో అలా అన్న మాట. మా చిన్నప్పుడు ఇక్కడే ఉండేవాళ్ళం.”
అటు రెండు గదులు ఇటు రెండు గదులు, ఎదురుగా వంటకి భోజనాలకి గది. పక్కన స్టోర్ రూమ్.. వెనక కూడా ఖాళీ స్థలం ఉంది అరటి మామిడి, పనస చెట్లు కూరగాయలు మొక్కలు ఉండేవి.
గ్రామ పంచాయతీ వాళ్ళు అప్పుడప్పుడు కంకర రోడ్లు వేస్తుండడం తో బయట ఎత్తు, లోపల పల్లం అయిపోయి వర్షపునీరు,మురుగు లోపలికి వచ్చేస్తోంది. ఇది పడగొట్టి కడదామంటే తాతయ్య ఒప్పుకోవడం లేదు.అందుకే ఎదురుగా ఉన్న స్థలం కొని ఆధునిక వసతులతో కట్టించారు.”
మళ్ళీ తలుపులు తాళాలు వేసేసి వచ్చేశారు. గోదావరి చూడడానికి వెడుతున్నామని చెప్తే సీతమ్మ “మగవాళ్ళు వెళ్ళండి. బంటీకి భోగిపళ్ళు పోస్తున్నాం. బొమ్మల పేరoటo ఉంది. ఆడపిల్లలు చూస్తారు” అంది.
“ఓకే..మీరు ఉండండి “చెప్పి,మగవాళ్ళు వెళ్లిపోయారు.
కొత్తడ్రెస్ వేసుకుని వచ్చి బంటీ “ఎలాఉంది నాడ్రెస్?డాడీ తెచ్చారు” అడిగాడు సంబరంగా.
వాడిని ఎత్తుకుని “చాలా బాగుంది…చాలా క్యూట్ గా ఉన్నావు ” ముద్దు పెట్టుకుందిచందన.
“మీరలా ముద్దు చేస్తారనే’ ఆ పార్క్ ఆంటీ మంచిది,నువ్వు బాడ్’ అని నామీద కంప్లైంట్స్ చెప్తుంటాడు “అంది సుశీల నవ్వుతూ.
“ఔనా!తప్పుకదా.. అత్తని అలా అనచ్చా. ఇంకెప్పుడూ అలా అనకూడదు బంటీ గుడ్ బోయ్!కదా! ”
ఔను అన్నట్లు తలూపాడు.
పేరoటాళ్ళు ఒక్కొక్కరే రావడం మొదలు పెట్టారు.. అంత వరకూ
మూసి ఉన్న గది తలుపులు తెరిచింది సుశీల. అందులో బొమ్మల కొలువు.
ఆరు మెట్లుగా పేర్చి దానిపై తెల్లని గుడ్డ పరిచి, పైన రెండు వరుసల్లో దేవుని బొమ్మలు,
కింది వరుసలో కొండపల్లి బొమ్మలు, పక్షులు, కూరగాయలు పళ్ళు అమ్మేవాళ్ళు, అలా రకరకాలు రంగురంగులబొమ్మలు అందంగా పేర్చారు. చుట్టూ రంగురంగుల బల్బులతో దీపాలు.
కింద పార్క్ లో వివిధరకాల జంతువులు.
“వీడు ఇంక అక్కడే కూర్చుని అన్నీ కదిపేస్తాడని తలుపులు మూసి పెట్టాను.” బంటీ ముక్కు పట్టి ఊపింది సుశీల.
“చాలా బాగుంది సుశీలా “శైలజ, సోనీ వివిధకోణాల నుంచి ఫోటోలు తీశారు.
పేరoటాళ్లతో హాలు నిండగానే బంటిని కుర్చీలో కూర్చోబెట్టారు. పక్కనే బల్ల మీద ఒకబుట్ట నిండుగా చిన్న రేగుపళ్ళు, చెరుకు ముక్కలు పూల రెక్కలు చిల్లర నాణేలు కలిపినవి ఉన్నాయి. ఒక్కొక్కరే వచ్చి గుప్పడు రేగుపళ్ళు తీసుకుని, బంటీ తల చుట్టూ దిష్టి తీసినట్లు అటు నుంచి ఇటు నుంచి మూడేసి సార్లు తిప్పి,తల మీద పోసి,అక్షింతలు వేసి ఆశీర్వదిoచి,వచ్చి కూర్చుంటున్నారు.
సుశీల, రుక్మిణి వాళ్లకి బొట్టు పెట్టి గంధం, కాళ్ళకి పసుపు రాసే పనిలో ఉన్నారు.
“సుశీలా!నేను బొట్టు పెడతా. ఇటీవ్వు ” అoది చందన, కుంకుమ భరిణే తీసుకుంటూ..
“ఈ అమ్మాయి ఎవరే సుశీలా? ” అడిగిందో పెద్దావిడ.
“మా చిన్నన్నయ్య ఆఫీసు వాళ్ళందరూ పండుగ సరదా చూడడానికి వచ్చారు అత్తయ్యా.. అన్నయ్యా కూడా వచ్చాడు. మగవాళ్లందరు అలా గోదారి చూడ్డానికి వెళ్లారు “చెప్తూనే అందరికీ పసుపు రాసేసింది.
రుక్మిణి సెనగలు, తాంబూలం ఇస్తుంటే శైలజ ఆవిడకి అవన్నీ ఉన్న పాకెట్లు అందిస్తూ సాయం చేస్తోంది.
“సీతక్కయ్యా!. మీ అబ్బాయి స్నేహితుల్లో మా చిన్నదానికి ఈడైన పిల్లలవరైనా ఉంటే చెప్పమని చెప్పు ” అంది ఇంకోఆవిడ.
“అలాగేలే కాంతం… మీ పెద్దమ్మాయి పురిటికి వచ్చినట్లుందిగా?
“అవునూ, డాక్టర్ బెడ్ రెస్ట్ అన్నారని ఐదో నెలరాగానే పంపేశాడు మా అల్లుడు.”
“రావులపాలెంలో ఎవరో అమ్మాయితో కనిపించాడని మా మరిది అన్నాడు. కాస్త చూసుకోండి “ఆవిడ దగ్గరగా వెళ్లి, మెల్లగా చెప్పిందిసీతమ్మ.
“అదే అక్కా…. దాని కాపురo ఏమౌతుందోనని బెంగగా ఉంది”.
అందావిడ గద్గదస్వరంతో.
రుక్మిణి మరొకరితో, సుశీల ఇంకొకరితో…. అoతా సందడిగా హడావిడిగా ఉంది. అందరూ వెళ్లే సరికి తొమ్మిది అయిపోయింది.
సుశీల ఫోన్ చేశాక తిరిగి వచ్చారు గోదావరి ఒడ్డుకి వెళ్లిన వాళ్ళందరూ.
భోజనాలు చేసి పడుకునేoదుకు వెడుతుంటే………..
( సశేషం)