సడన్ బ్రేక్ వేసి “ఏమైందే… ఎందుకలా అరిచావు “? అడిగింది చందన అసహనం గా.
బండి దిగి “అదిగో!అక్కడ బండిమీద సీమ చింతకాయలు ఉన్నాయి.. మనంచినప్పుడు స్కూల్ గేటు ముందు ఒక ముసలమ్మ అమ్ముతుంటే కొనుక్కుని తినేవాళ్ళం. గుర్తుందా… ఉండు…”అంటూ రోడ్ క్రాస్ చేసి వెళ్ళి సీమ చింతకాయలు కొని తీసుకొచ్చి, ఒకపేకెట్ చందన బేగ్ లోనూ, మరో పేకెట్ తనబేగ్ లోనూ వేసింది.
******************
సెల్ రింగ్ అవుతుంటే గాఢనిద్రలో ఉన్న చందన ఉలిక్కిపడి లేచి, బెడ్ పక్కన టేబుల్ మీదున్న సెల్ అందుకుని,కళ్ళు తెరవకుండానే
“హలో!” అంది.
“విష్ యూ హ్యాపీ బర్త్ డే ” హరి గొంతు విని,గబుక్కున లేచి కూర్చుని “థాంక్ యూ! మీకెలా తెలుసు… నా పుట్టిన రోజని..”
“నిన్న మీ సిస్టర్ చెప్పిందిగా, అందుకే షాపింగ్ కి వెళ్ళాము అని ”
“అవును కదా!బాగానే గుర్తు పెట్టుకున్నారు. నిద్ర మానుకుని…”
“కావాలి అనుకున్న వ్యక్తుల కోసం కొన్ని త్యాగాలు చెయ్యక తప్పదు కదా ” ఆ గొంతులో అతని ప్రేమ వ్యక్తం అవుతోంది.
“కావాలి అని మనం అనుకుంటే కుదరదు కదా, మన పెద్దవాళ్ళు అనుకోవాలి. అసలే కులాంతర వివాహం.. మా వాళ్ళు అడ్డు చెప్పకపోవచ్చు. మీ వాళ్ల సంగతి ఆలోంచించండి. వాళ్ళు ఒప్పుకోక పోతే మన పరిచయం స్నేహం వరకే పరిమితం అవుతుంది.” మెల్లగా అయినా స్పష్టంగా చెప్పేసింది.
“వాళ్ళని ఒప్పిస్తాను చందూ.”
“మీ వాళ్ళ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చాకే మా డాడీ కి చెప్తాను.”
“సరే.. రేపు పార్క్ కి వస్తావుగా.”
“వస్తాను నాతో పాటు శైలు కూడా వస్తుందట ”

“తనకి చెప్పావా?”
“అవును.. మా ఇద్దరి మధ్య సీక్రెట్స్ ఉండవు.. తనకి బావ అయ్యే అర్హతలు మీకున్నాయో లేదో చెక్ చేస్తుందట “నవ్వింది.
“అయితే నేను ఇంటర్వ్యూ కి రెడీ అవ్వాలన్న మాట. ఓకే ”
“శైలు కాల్ చేస్తోంది. ఒన్స్ ఎగైన్ థాంక్ యూ.
గుడ్ నైట్ “కాల్ కట్ చేసి, శైలు కాల్ ఆన్సర్ చేసింది.
హ్యాపీ బర్త్ డే చెప్పి,” కాల్ చేస్తే ప్రతిసారిలా రింగ్ అవకుండా, అనదర్ కాల్ లో ఉన్నావ్ వెయిట్ చెయ్యమని వస్తోంది. బావగారు చేశారా? “అడిగింది.
” ఏయ్ అప్పుడే బావ ఏంటీ… ఇంకా నేనే డిసైడ్ చేసుకోలేదు “.
“కాల్ చేసింది అతనేనా?.. కదా?”
“అవును ”
“అబ్బో! చాలా దూరం వచ్చిందే వ్యవహారం “.
‘” నిన్న తమరు డప్పుకొట్టి మరీ చెప్పారుగా ” చిరుకోపం ప్రదర్శించింది.
” ఏమంటాడు?”
“అతను కాన్ఫిడెంట్ గానే ఉన్నాడు, నేనే సందేహిస్తున్నాను, కులాంతరానికి వాళ్ళ వాళ్ళు ఒప్పుకుంటారో లేదో అని. ఒప్పుకోక పోతే ఫ్రెండ్స్ లా మిగిలిపోదాం అని చెప్పేసా ”
“అదే మంచిది.. ఒప్పుకోకపోతే పెళ్లయిన నాటి నుంచి వాళ్ళు నిన్నోక విలన్ లా చూస్తారు, వాళ్ళ కొడుక్కి ఏదో మందు పెట్టావని, నీ కొంగుకి కట్టేసుకున్నావని, తిట్టుకుంటూ శాపనార్ధాలు పెడతారు.”
“అబ్బో!చాలా రీసెర్చ్ చేశావే!” నవ్వింది చందన.
“ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు ఒక ఫ్రెండు ప్రేమించి పెళ్లి చేసుకుంది. మొన్న ఒకరోజు కలిసింది. అతని పేరెంట్స్ తనని కోడలుగా ఇష్టపడలేదట. ఇంతకు ముందు నేనూ చెప్పినవన్నీ తను చెప్పినవే “.
“ఔనా!అయితే నేనూ సరిగ్గానే చెప్పానన్నమాట.”
“అవును…ఓకే రేపు ఈవెనింగ్ పార్క్ లో కలుద్దాం. నేనూ వస్తున్నానని చెప్పావా?”
“చెప్పాను. ” నవ్వింది.
“ఇంక మీ ఆఫీస్ కి రాను. డైరెక్ట్ గా పార్క్ కే వస్తా..”
“సరే,ఇంకనైనా పడుకొనిస్తావా?”
“నేను పడుకొనిచ్చినా ఆ హరిశ్చoద్ర ప్రసాద్ గారు పడుకోనివ్వరు” కొంటెగా నవ్వింది శైలజ.
” ఛత్! నోరు మూసుకుని పడుకో ” సెల్ ఆఫ్ చేసేసింది.
.
****************
సాయంకాలం పార్క్ దగ్గరకి వెళ్ళడానికి బయలుదేరుతుంటే శ్యామల నేనూ వస్తానని బయలుదేరింది.
“ఎక్కడికి.. మా యింటికా?”
“నువ్వెక్కడికి వెడితే అక్కడికే ”
“నేను ఇంటికి వెళ్లడం లేదు”
“నువ్వెక్కడికి వెడితే అక్కడికే అన్నానుగా “స్కూటీ స్టార్ట్ అవగానే వెనక ఎక్కి కూర్చుంది శ్యామల.
“సస్పెన్స్ లో పెట్టనులే. హరిగారు రమ్మని కాల్ చేశారు.,ఎందుకూఅని అడిగితే సస్పెన్స్ అన్నారు.”
“అవునా?”
ఇద్దరూ పది నిముషాల్లో పార్క్ కి వచ్చారు..
అప్పటికే హరి, శైలజ అక్కడ ఉన్నారు.
“బర్త్ డే బేబీకి సర్ప్రైస్ గిఫ్ట్… పదండి “లేచి నిలబడ్డాడు హరి.
“బర్త్ డే ఎవరిదీ…”మిగిలిన ముగ్గుర్ని చూసి “చందూ! పుట్టినరోజు శుభాకాంక్షలు… చెప్పలేదేంటి ” హగ్ చేసుకుని, బుగ్గమీద ముద్దు పెట్టింది.
“థాంక్ యూ!”
“నాకు కూడా ఈ సిసింద్రీ చెప్పింది. తను చెప్పలేదు”. అన్నాడుహరి.
“నేను సిసింద్రీ నా “? శైలజ బుంగ మూతి పెట్టింది.
“అలగకు అమ్మాయ్ ఐస్క్రీమ్ ఇప్పిస్తాలే.. పదండి పదండి ”
తొందరపెట్టి వారిని కార్లో ఒక రెస్టారెంట్ కి తీసికెళ్ళాడు. అక్కడ ముందే టేబుల్ బుక్ చెయ్యడంతో తిన్నగా అక్కడికి తీసికెళ్లాడు. కేక్ అక్కడ సిద్ధంగా ఉంది.
“చందన గారు!కమాన్ కేక్ కట్ చేయండి “అన్నాడు కేండిల్ వెలిగిస్తూ.
“అయ్యో! ఏమిటిదంతా? దీపాలార్పడం లాంటివన్నీ నాకు అలవాటు లేదు ”
“దీపం ఆర్పద్దు లెండి కేక్ కట్ చేయండి ” నైఫ్ అందించాడు.
చందన ఇబ్బంది పడుతూనే కేక్ కట్ చేసి స్ఫూన్ తో ముగ్గురికి ఇచ్చింది. శైలజ,శ్యామల చందనకి తినిపించి, శుభాకాంక్షలు చెప్పారు. హరి స్పూన్ తో తీసి తినిపించబోతుంటే గబుక్కున స్పూన్ అందుకుంది. నలుగురికి స్నాక్స్ స్వీట్స్ ఆర్డర్ చేశాడు.
కబుర్లుమధ్యలో సడన్ గా టేబుల్ మధ్యలో ఉన్న ఫ్లవర్ వాజ్ లోనుంచి ఒక రోజ్ తీసి “నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం అయితే ఈ గులాబీ తీసుకోండి చందన ” అన్నాడు. ఊహించని ఆ సంఘటనకి షాక్ అయింది చందన. మిగిలిన ఇద్దరూ చందన ఏమీ చెప్తుందో అని ఇద్దరినీ మార్చి మార్చి చూస్తున్నారు ..
రెండు నిముషాల తరువాత “చందూ! రోజ్ తీసుకో ” అంది శైలజ.
దీర్ఘoగా నిట్టూర్చి ” హరిగారూ! పెళ్లి అనెడి మనిద్దరి వ్యక్తిగతం కాదు. ఇద్దరి కుటుంబాలు ఒప్పుకోవాలి. అందులో మనిద్దరి కులాలు వేరే. మా వాళ్ల గురించి నాకు సందేహం లేదు. మీ వాళ్లసంగతి నాకు తెలియదు. ఇంతకు ముందు మీరు చెప్పారు ఉమ్మడి కుటుంబం గురించి . అది నాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే నేను ఒంటరిగా పెరిగాను. పదిమందితో ఉంటే బాగుంటుంది అని చాలా సార్లు అనుకున్నాను. వాళ్ళ అంగీకారం లేకపోతే, అక్కడ మనస్పర్థలతో, ఛీత్కారాలతో గడపడం నావల్లకాదు.క్షమించండి ” అంది.
“అవును హరిగారూ!మీ కుటుంబసభ్యులకి అంగీకారం కాకపోతే భవిష్యత్తులో మీ ఇద్దరి మధ్యలో గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది “అంది శ్యామల.
“నేను అవన్నీ ఆలోచించలేదని ఎందుకనుకుంటున్నారు శ్యామలా? “అన్నాడు.
” నాదొక సూచన… మీకు అభ్యంతరం లేకపోతే ముందు నేనొక సారి మీ ఊరు వచ్చి, మీ వాళ్లందరిని పరిచయం చేసుకుని చందు అక్కడ అడ్జస్ట్ అవగలదో లేదో తెలుసుకోవాలనుకుంటున్నాను” అంది శైలజ.
“ఛ నోర్ముయ్! అదెలా కుదురుతుంది?” విసుక్కుంది చందన..
“అవును ప్రాక్టీకల్ గా వర్కౌట్ కాదు శైలజా “అంది శ్యామల.
“నువ్వు ఒక్కదానివే కాదు, మీరు ముగ్గురూ రావచ్చు. పల్లెటూళ్ళు అంటే ఇష్టం.చూడడానికి వస్తున్నారు మా ఆఫీస్ లో పని చేస్తున్నారు అని మా ఇంట్లో చెప్తాను.ఆ విషయంలో కొంచెం అడ్జస్ట్ అవ్వాలి మీరు.”అన్నాడు హరి.
“గుడ్ ఐడియా! కానీ, కేవలం ముగ్గురూ ఆడపిల్లల్ని ఆఫీసు వాళ్ళు అని తీసికెడితే మీ వాళ్ళు మిమ్మల్ని అనుమానించే ప్రమాదం ఉందికదా సార్”అంది శ్యామల.
“అవును ” అంది చందన.
“అదీ నిజమే!” అంది శైలజ.
“అయినా నాకు రావడం కుదరదు సార్! ఇంట్లో అత్తయ్య ఒక్కరు ఉంటారు. అసలే ఈ మధ్య రెండు మూడు సార్లు మురళీ వచ్చి నాతో రాజీ కుదర్చమని గొడవ పడుతున్నాడు.ఆవిడని, బాబుని తీసికెళ్ళిపోతానని బెదిరిస్తున్నాడు. వాళ్ళని ఒంటరిగా వదిలి నేను రాలేను సార్ “.చెప్పింది శ్యామల.
అంతలోనే. సెల్ రింగ్ అయితే ఆన్ చెయ్యగానే “మమ్మీ!ఎక్కడున్నావ్ ” కొడుకు ఏడుపు విని “నేను వెడతాను సార్ చందూ! ఒన్స్ ఎగైన్ హ్యాపీ బర్త్ డే ” చెప్పి వెళ్ళిపోయింది..
” ఓకే మేము కూడా బయలుదేరుతాం. థాంక్ యూ,మీరిచ్చిన ఆతిధ్యానికి “.లేచింది చందన కూడా.
టేబుల్ మీద అతను పెట్టిన గులాబీ తీసుకుని “ఇది తీసుకుంటున్నా, మన స్నేహానికి గుర్తుగా.
పెళ్లి విషయం పెద్దలకి వదిలేస్తే మనం ఎప్పటికి మంచి ఫ్రెండ్స్ గా ఉండవచ్చు.”అంది.
” థాంక్స్ “అన్నాడు నిర్లిప్తంగా.
అతని డిస్సపాపయింట్మెంట్ అతని గొంతులో తెలుస్తూనే ఉంది.
“చందూ అన్నట్లు పెళ్లి విషయం పక్కన పెడితే,
నాకు మీ పల్లెటూరు చూడాలని ఉంది.ఎలా ప్లాన్ చేస్తారో మీ ఇష్టం “అంది శైలజ.
“ష్యూర్! నేను ప్రోగ్రాం ఫిక్స్ చేసి, మీకు చెప్తాను ”
అన్నాడు. వారిని కార్లో తీసుకొచ్చి పార్క్ దగ్గర స్కూటీ ఉన్న చోట ఆపాడు దారిలో ఎవరూ పెద్దగా మాట్లాడలేదు.
అతను వెళ్ళగానే స్కూటీ స్టార్ట్ చేసి, శైలజని వాళ్ళింటికి దగ్గర దింపి తమ ఇంటికి బయలుదేరింది.
లేట్ అయిందేమిటని అడిగిన తండ్రి కి “శైలూ, శ్యామల పార్టీ అన్నారు. శైలూ నెక్స్ట్ వీక్ లో హరిగారి ఆఫిస్ లో చేరుతోందని చెప్పానుగా.అందుకే అతన్ని కూడా పిలిచింది. అందుకే లేట్ అయింది. ” చెప్పి, మెట్లు ఎక్కుతుంటే….
“చూడు చందూ……..” తండ్రిమాట విని ఆగి, వెనక్కి తిరిగింది.
(సశేషం )