కాగితం పడవ – 3 వ భాగం

జరిగిన కథ

     ఆరోగ్య సమస్యల వల్ల పిల్లలు పుట్టని కారణంగా ఇబ్బంది పడుతున్న శ్రీకాంత్,వనజా “గీత “ హాస్పిటల్స్ కి వస్తారు. అక్కడ రేవతి డాక్టర్ ని కలిసాక వాళ్లలో ఆశ చిగురిస్తుంది. వాళ్లు పెట్టుకున్ననమ్మకమే“ఇందు” రూపంలోఎదురయింది.  అనేక కారణాలవల్ల సరోగసి(ivf) కి ఒప్పుకున్న “ఇందు” బిడ్డని కన్నాక    ఇచ్చేయడానికి ఒప్పందం జరిగింది. ఒప్పందం ప్రకారం ఆ పిల్లని వాళ్ళకి అప్పగిద్దామని అనుకుంటుంది. కానీ ఆ రోజు జరిగిన కారు ప్రమాదం వల్ల వాళ్ళిద్దరూ హాస్పిటల్లో గాయాలతో స్పృహ లేని పరిస్థితిలో ఉన్నారు వాళ్లు రాలేని పరిస్థితులలో “నయనిక “ఇందు దగ్గరే పెరుగుతుంది.. 20 ఏళ్ల తర్వాత వచ్చిన శ్రీకాంత్ ని చూసి ఆశ్చర్య పోతుంది…

ఇంక   కథలోకి వెళదాం….

సరిగ్గా అప్పుడే వీధి తలుపు తీసుకుని వచ్చిన  నైనిక హాల్లో సోఫాలో కూర్చున్న శ్రీకాంత్ ని చూసి హాయ్ అంకుల్ అంది. అమ్మ ఇప్పుడే వచ్చారా మీరు అని అడిగి నైనిక మేడ మీదకు వెళ్ళిపోగానే ఇంక నేను బయలుదేరుతాను అంటూ లేచాడు సోఫాలోంచి శ్రీకాంత్.  వచ్చి చాలాసేపు అయింది. అక్కడ వనజ ఏం చేస్తుందో ఎంత గొడవ చేస్తుందో? నేను ఉంటా మరి! అంటూ లేచాడు. అతనితో పాటు కారుదాక వెళ్ళి అతనికి బై చెప్పి  తలుపు వేస్తూ ఇందు కూడా మేడ మీదకి వెళ్ళింది.

పొద్దున్నుంచి జరిగిన సంఘటనలన్నీ కళ్ళ ముందు కదలాడుతూ ఉంటే మనసంతా ఉక్కిరిబిక్కిరి అయిపోయింది చాలా అలసిపోయినట్టు కూడా అనిపించింది. నైనిక గదిలోకి వస్తు అమ్మా! ఏంటి అలా పడుకున్నావు అలసిపోయావా? టీ తగుతావా తేనా అని అడిగింది. వద్దురా! చాలా అలసిపోయాను కాసేపు కళ్ళు మూసుకుని పడుకుంటాను అంది ఇందు .

సరే నేను కూడా బయటికి వెళుతున్నాను తలుపు వేసి వెళతాను’ సుధీర్’ దగ్గరి’ కీ ‘ఉంది కదా వాడే తీసుకుని వస్తాడు అంటూ బయటికి వెళ్ళిపోతూ అమ్మ నాన్న చాలా సార్లు ఫోన్ చేశాడు నువ్వు ఫోన్ తీయలేదుట

ఇవాళ రాత్రికి వస్తారు అంది. అవునా?

నేను చూసుకోలేదు ఏదో హడావిడిలో ఉన్నాను. సరేలే! నేనే నాన్నకు ఫోన్ చేస్తాను అంది ఇందు.

బ్యాగులో ఉన్న ఫోన్  తీసి చూసింది ఇందు. కృష్ణ దగ్గర నుంచి రెండు మూడు మిస్డ్ కాల్స్ ఉన్నాయి. శ్రీకాంత్ ఇంట్లో వనజని చూశాక వనజ చేసిన హడావిడి వాళ్ళ  నాన్నగారి, మాటలు ఆతరువాత శ్రీకాంత తో హఠాత్తుగా బయలుదేరడం వీటి మధ్య ఫోన్ రింగ్ అయినా వినపడలేదేమో? అప్పుడు మనసు బుర్ర కూడా పనిచేయలేదు. మనసు అంతా ఆందోళనతో నిండిపోయింది. ఆ కంగారులో ఫోన్ కూడా చూసుకోలేదు.

కృష్ణకి ఫోన్ చేసింది. నువ్వు త్వరగా వచ్చేసేయ్ చాలా చాలా చెప్పాల్సినవి ఉన్నాయి. అంటూ ఎంతో ఆందోళనగా మాట్లాడింది.  ఎందుకంత కంగారుగా ఉన్నావ్ ఏమైనా జరిగిందా? అడిగాడు కంగారు పడుతూ..కంగారు పడకు అందరం బాగానే ఉన్నాం..

శ్రీకాంత్ వనజని చూశాను వనజ  పరిస్థితి ఏమీ బాగోలేదు.13 ఏళ్ల చిన్న పిల్లలా మాట్లాడుతుంది నాకేమీ అర్థం కావడం లేదు  కృష్ణ.అసలు నేను వాళ్లతో

ఎలా మాట్లాడానో అర్ధం కాలేదు.. సరే నేను వచ్చాక మాట్లాడుకుందాం. నేను ఈ రాత్రికి వచ్చేస్తున్నాను. సరేనా!  నువ్వు టెన్షన్ పడకు. నేను ఈసాయంత్రం ఫ్లైట్కిబయలుదేరుతున్నాను రాత్రికి ఇంటికి వస్తాను.  అంటూ ఫోన్ పెట్టేసాడు.

అధ్యాయం 2.

ఫోను పక్కన పడేసి కాసేపు నిద్రపోదాం అనుకున్నా ఆలోచనలు పట్టు వదలని విక్రమార్కుడీలా నా చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి .. ఇంక లాభం లేదని మెట్లు దిగి కిందకు వచ్చి వంటింట్లో కాస్త వేడిగా టీ పెట్టుకుని వచ్చి సోఫాలో కూలబడింది. సరిగ్గా అప్పుడే అమ్మ గుర్తుకొచ్చింది. అమ్మలేని లోటు అనుభవిస్తే గాని ఎవరికీ అర్థం కాదు చాలా చిన్నతనంలోనే ఆరో ఏటా అమ్మ పోయింది నేను నిద్రలో ఉండగా అక్క,నాన్న, అమ్మని రాత్రి అర్జంటుగా ఒంట్లో బాగోలేదని హాస్పిటల్ కి తీసుకు వెళ్లారు . అమ్మ సజీవంగా తిరిగి రాలేదు . తరువాత తెలిసింది అమ్మ గుండె పోటుతో అకస్మాత్తుగా చనిపోయిందని .. అమ్మని హాల్లో మంచు డబ్బాలో ఉంచారు నిద్రపోతునట్లుగా ఉంది . తల దగ్గర దీపం కొనఊపిరితో కదులుతూ కదులుతోంది . అందరూ మాట్లాడుకుంటూ విచారంగా ఉన్నారు ..ఈరోజు కి కూడా ఆ దృశ్యం ఇంకా కళ్ల ముందే ఉంటుంది…

ఆరేళ్ల వయసులో అమ్మ మరణం  గుండెలో సజీవంగా ఉండిపోయింది . ఏడ్చి ఏడ్చి అలసిపోయిన గొంతు .. నాన్న కోసం ఇల్లంతా వెదికాను . నాన్న పెరటి గుమ్మంలో  అరుగు మీద తలవంచుకు కూర్చున్నారు .

అమ్మ ఇంకా రాదా? ఏడుస్తూ అడిగాను . రాదు కానీ నక్షత్రాల నుంచి నిన్ను చూస్తూనే ఉంటుంది అన్నారు . ఆ ఊహ తెలియని వయసులో నమ్మాను. రాత్రి నక్షత్రాల వంక చూస్తూ పడుకునే దాన్ని , ఆకాశం అప్పటినుంచే నాకు తోడుగా ఉంది .

చాలా రోజుల వరకు మాముగ్గురి మధ్య దుఖం వెళ్ళకుండా మా మధ్యే ఉండిపోయింది ..చాలా రోజుల దాకా తేరుకోలేదు నేను.

అమ్మ జ్ఞాపకాలు పదేపదే గుర్తుకొచ్చాయి. అంత చిన్న వయసులోనే అమ్మ ముఖం

నా కనుపాపల్లో భద్రంగా ఉండిపోయింది. ఇంకా ఇప్పటికీ గుర్తుంది ముక్కుకి పెట్టుకున్న తెల్లరాయి ముక్కుపుడక, నడుము దాటి వేళ్ళాడుతున్న జడ, కట్టుకున్న కాటన్ చీర అలా గుర్తుకు వస్తూనే ఉంటాయి.

హఠాత్తుగా గుండెపోటుతో చనిపోయిన అమ్మ నిష్క్రమణ మాఇంటిని, ఇంట్లో వాళ్ళని అనాథలుగా చేసింది. బాగా చిన్న వయసులోనే ‘నాన్న’ ఒంటరి అయిపోయాడు. ఇద్దరు ఆడపిల్లల్నపెంచడం నాన్నకి ఒక సవాలుగా మారింది .

అనుకోకుండా మేనత్త, మేనమామ కూడా మా ఊరికి వచ్చేయడం నాన్నకి ఎంతో సహాయంగా అనిపించింది. అయితే నాన్న ఎప్పుడూ మేనత్త మీద ఆధారపడలేదు. అన్ని తానే అయ్యి పెంచాడు మమ్మల్ని.  స్వయంగా వంట చేసేవాడు, స్కూల్ కి బాక్సులు కట్టేవాడు. మమ్మల్ని స్కూల్ కి దింపి  ఆఫీస్ కి వెళ్లేవాడు. మా గురించి ఎంతో కష్టపడేవాడు. మరీ అవసరమైతే తప్ప మేనత్త సహాయం తీసుకునేవాడు కాదు.

అధ్యాయం 3

నాకన్నా నాలుగేళ్లు పెద్దదైన అక్క నాకు అమ్మ అయిపోయింది..

నా అంతట నేను జడలు వేసుకోవడం వచ్చేదాకా, నన్ను పెంచింది. మొదటిసారి పీరియడ్స్ వచ్చినప్పుడు బాత్రూంలో  గట్టిగా అరుస్తూ భయంతో ఏడుస్తూ ఉంటే  కౌగిలించుకుని ఓదార్చింది. అందరికీ జరిగేదే అని ప్రకృతి సహజమని, ఆ టైంలో ఎలా ఉండాలో ఎన్నో జాగ్రత్తలు చెప్పింది. ఇప్పుడు అనిపిస్తుంది పాపం అక్క ఒక్కొక్కరితే ఎలా అనుభవించిందో ఆ సమయంలో తనకు అప్పుడు ఎవరూ తోడు లేరు కదా అనుకున్నాను..

నాన్న లేటుగా ఆఫీస్ నుంచి లేటుగా వచ్చినా అక్కకి ఎక్స్త్రా క్లాస్ ఉన్నా  అత్త వాళ్ల ఇంటికి వెళ్ళిపోయి అత్త కూతురుతో ఆడుకుంటూ ఉండేదాన్ని. అలా అది నేను బంధుత్వం కన్నా మించిన స్నేహితులం అయ్యాము. నాన్నని ఎప్పుడూ నాన్నలా చూడలేదు అమ్మలాగే చూసాం ఇద్దరం..

చిన్నదానిగా నాన్నతో  ఎక్కువ అనుబంధంగా ఉండేదాన్ని. నాన్న ఒక్క క్షణం కనబడకపోయినా విలవిల లాడిపోయేదాని. ఏమిటి ఇంత పిచ్చి ప్రేమ అని అందరూ నవ్వుతూ ఉండేవారు. ఇది నాన్న ‘కూచి’ అని కూడా అనేవారు. చిన్న జాగా  కొనుక్కొని దాని మీద ఇల్లు కట్టడానికి ఎంత కష్టపడ్డాడో  రూపాయి రూపాయి  కూడా  బెట్టి ఎలా ఇల్లు కట్టాడో అంతా దగ్గర ఉండి చూసాం  అక్క చెల్లెళ్ళం ఇద్దరం. తలుచుకుంటే అన్ని ఇప్పుడు జరిగినట్టే అనిపిస్తుంది.

నాన్న కోసం ఏదైనా చేయాలనిపించేది చిన్నప్పటి నుంచి కష్టపడింది చాలు. నాన్నని సుఖ పెట్టాలని పదేపదే అనిపించేది. ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలోనే నిర్ణయించుకున్నాను మాస్టర్స్ కి అమెరికా వెళ్లి అక్కడ ఉద్యోగం దొరికాక నాన్నని తీసుకుని వెళ్లి అమెరికా అంతా చూపించాలి.

నాన్న కళ్ళలో సంతోషం చూడాలి. నాన్న నన్ను మెచ్చుకుంటే వినాలి. అనేది నాకు ఒక పెద్ద కల.ఆ కల నిజమవడంకోసం రాత్రి పగలు కష్ట పడ్డాను.

నాన్నని నా దగ్గరే ఉంచుకొని చాలు నాన్న! మా గురించి నువ్వు కష్ట పడింది చాలు. నువ్వు ఇప్పుడు హాయిగా నీకు నువ్వు ఎలా బతకాలనుకున్నావో అలా సంతోషంగా ఉండు. నాన్నను  ఎంతో సుఖంగా చూసుకోవాలి అనుకున్నాను .

కానీ జీవితం మనం చెప్పినట్టు నడవదు దాని దారిలోకి మనం వెళ్లాలి. అలాగే నా జీవితం కూడా ! జీవితం నా చేయిపట్టుకుని తన దారిలోనే నడిపించింది.

టీ కప్పు పక్కన పడేసి బాత్రూంలోకి వెళ్లి ముఖం కడుక్కుని టవల్తో తుడుచుకుంటూ  హాల్లోకి వచ్చింది ఇందు.  గోడకి గోడ గడియారంలో పెండ్యులం ఊగుతూ కనిపించింది…

చిన్నప్పుడు అది గంటలు కొడితే ఎంత విసుక్కునేదాన్ని.నిద్ర చెడగొడుతుందని కొత్తది కొనమని పేచీ పెట్టేదాన్ని, నాన్న అస్సలు పట్టించుకోలేదు .. మనిషి మీద ప్రేమ ఉండడం వేరు. మనస్ఫూర్తిగా ప్రేమించడం వేరు. నాన్న అమ్మని ప్రేమించారు. కృష్ణ లేకపోతే నేను లేను. ఇప్పుడు బతుకుతున్న జీవితం కూడా తనదే. బాధ్యతగా నన్ను అంగీకరించాడు. నాతో  పాటే నడిచాడు.

కృష్ణని నేను ప్రేమించానా? లేదు. నేను ఎవరినీ ప్రేమించే లేదు . ప్రేమించడానికి కలలు కనడానికి నాకు జీవితం అవకాశం ఇవ్వలేదు. అప్పట్లో నా ముందు ఉన్నవి, చదువు. అమెరికా వెళ్ళడం నాన్నని అమెరికా తీసుకు వెళ్ళడం . వీటికోసం అన్నీ మరచి పోయాను .. నాన్న కూడా చనిపోయారు పోయిన సంవత్సరం .. ఇప్పటికీ నాకు చాలా గర్వంగా ఉంటుంది. నేను నాన్నకోసంచేసిన త్యాగం తలచుకుంటే..అది త్యాగం కాదు ఇష్టం,ప్రేమ .. ఈరోజుకి కూడా సంతోషం వేస్తుంది.

కృష్ణ కూడా నన్ను ప్రేమించాడు నా బాధని, బాధ్యతగా తీసుకున్నాడు నాన్నలా ప్రేమించాడా ? ఇప్పుడెందుకు ఈ ప్రశ్న ? ఏమో తెలియదు.. కొన్ని సార్లు కొన్ని ప్రశ్నలు వెంటాడుతాయి సమాధానం రానివి .. గడియారం సమయాన్ని వెనక్కి నెట్టేస్తూ గంటలు కొట్టింది .. అప్పుడు చూశాను గోడవైపు   బాగా పాతదైపోయింది గడియారం. అయినా శక్తి వంచన లేకుండా పనిచేస్తుంది బ్యాటరీ వేసి ఊపిరి అందిస్తే చాలు ‘టిక్ ’’ టిక్ ’’మంటూ కదులుతుంది ప్రాణం వచ్చినట్టు . స్టూలు వేసుకుని నిలబడి దాన్ని ఆప్యాయంగా డస్టింగ్  క్లాత్ తో  తుడిచాను అది తుడుస్తూ ఉంటే  అమ్మ ముఖం తుడిచినట్టే ఉంది.. .

ఇంతలో సుధీర్ నైనిక ఇద్దరూ ఒక్కసారే కలిసి వచ్చారు. అమ్మా ! ఆకలి దంచేస్తోంది ఏదైనాటిఫిన్ చేయవా ఆ ఇద్దరు బ్యాగ్ లు  సోఫా మీద పడేసి అక్కడే అలా వాలిపోయారు.

ఫ్రీడ్జ్ లోంచి ఇడ్లీ పిండి తీసి ఇడ్లీ స్టాండ్ లో పిండి వేస్తుంటే మళ్ళీ ‘అమ్మ’ గుర్తు కొచ్చింది

‘విష్ణునామ సహస్రం  ‘ పని చేసుకుంటూ చదివేది ఆమె వెనకాలే నేను వల్లే వేసేదాన్ని,అప్పుడు కొన్ని నోటికి వచ్చేవి ఇప్పుడు పూర్తిగా మరచిపోయాను …

కృష్ణ రాగానే సూట్ కేస్ అయినా లోపల పెట్టకుండానే చేతిలో కాఫీ కప్పు పెట్టి   సోఫాలో కూర్చున్న  “ శ్రీకాంత్ వనజల” విషయం చెప్పితే గాని మనసులో ఉన్న అలజడి తగ్గలేదు వింటూ ఉండిపోయాడు పాపం శ్రీకాంత్ ని తలుచుకుంటే జాలి వేస్తుంది కదా! కన్న కూతురు అంకుల్ అని, భార్య అంకుల్ అంటుంటే ఎలా తట్టుకుంటున్నాడో అన్నాడు ! అవును నిజంగా చాలా కష్టం అన్నాను. సరే నేను స్నానం చేసి వస్తాను శ్రీకాంత్  కి ఫోన్ చెయ్యి మన ఇద్దరం వస్తునట్లు అన్నాడు. ఊహూ! వాళ్ళ అమ్మగారు నన్ను రానివ్వదు అన్నాను ! నేను ఉంటానుగా నీకు తోడుగా భయపడకు .. ఒక్క సారి వనజని శ్రీకాంత్ ని చూసి వద్దాం అంటూ మేడ మెట్లు ఎక్కి వెళ్ళి పోయాడు ..

ఇంతలో …

 

 

Written by Renuka Ayola

రేణుక అయోల
పూర్తి పేరు :
రేణుక అయ్యల సోమయాజుల
కవయిత్రి, రచయిత్రి.
కలం పేరు: రేణుక అయోల
పుట్టిన ఊరు: కటక్
నివాసం: హైదరాబాద్

1. కవితా సంపుటాలు - 4 పడవలో చిన్ని దీపం(2006 ), లోపలి స్వరం (2012), ఎర్రమట్టి గాజులు ( 2019), రవిక (2025) కవితా సంపుటాలు
2. కథా సంపుటి : 1 .
రెండు చందమామలు( 2008 )
3. దీర్ఘ కావ్యాలు : - 2
మూడవమనిషి దీర్ఘ కావ్యం
(2015 - హిజ్రాల హృదయ వేదన )
పృధ ఒక అన్వేషణ ( 2021)
4. అంతః తీరాల అన్వేషణ
రేణుక అయోల:
రచన సౌభాగ్య : 2018
( రేణుక అయోల రచించిన పూర్తి కవిత్వ సంపుటాల పైన విశ్లేషణ )
5. They long poem :2022
(మూడవ మనిషి దీర్ఘ కావ్యనికి ఆంగ్ల అనువాదం)
అనువాదకులు:
T. S.chanadra mouli

ప్రస్తుతం " కాగితం పడవ " నవల - తరుణి పత్రిక లో ధారావాహిక గా ప్రచురిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

తెలంగాణా వైభవం- మహిళా చైతన్యం -సాహిత్య విమర్శ

అసలైన ఓదార్పు