జరిగిన కథ
ఆమని మనవడి పుట్టినరోజు వేడుకను పూర్తి చేసుకున్న మైథిలి, మాలిని అదే ఊళ్లో ఉంటున్న పద్మిని, చంద్రిక ,హాసినిలను కూడా కలుస్తారు .గతంలో తామంతా ప్రైవేటు జూనియర్ కళాశాలలో కలిసి పని చేసిన కాలపు ముచ్చట్లతో పాటుగా ఇప్పటివరకు తమ పిల్లలపెండ్లిండ్లు మనవళ్ళు, మనవరాండ్ర ముద్దు మురి పాలను కూడా ఒకరితోమరొకరు పంచుకుంటూ తమ సమయాన్ని ఆనందమయం చేసుకొని తృప్తిగా ఎవరిళ్లకు వాళ్లు తిరిగి వెళ్లిపోతారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించలేని మైధిలి, మాలినితమ పాత ఉద్యోగంతోనే కుస్తీలు పడతారు.ఇటు ఇంట్లోనూ అటు బయట సమాజంలోనూ కూడా ప్రభుత్వోద్యోగి కాలేనందున మైధిలి ఎంతో వివక్షకు గురవుతుంది. భర్త అకాల మరణంతో వారసత్వపు క్షేత్రంలో అస్వతంత్రతకు బందీ అవుతుంది.అనుభవసారం ఒంటబట్టించుకున్న రామారావు దంపతుల జీవితం నిత్యవసంత మవుతుంది. హాసిని, చంద్రిక ,శాలిని మేడం గార్లు తమ జీవితాలను ఆక్రమించుకో జూస్తున్న ఆత్మ న్యూ నతా భావాలను సానుకూల దృక్పథంతో తట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు .భర్త యొక్క అనుమానపు జబ్బుకు విసిగి వేసారిన సువర్ణ బొటీక్ పెట్టుకుని స్వావలంబనతో జీవించాలనే స్థిర నిశ్చయంతో బెంగళూరులో ఉంటున్న తన కొడుకులు దగ్గరకు వెళ్ళిపోతుంది.
నానా తిప్పలు పడుతూ చంద్రిక ఎట్లాగైతేనేం ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా ఉద్యోగం సంపాదించుకుని కుటుంబ భారాన్ని మోస్తూ పిల్లల్ని చదివించి ప్రయోజకులుగా తీర్చిదిద్దుతుంది.భర్త శుక్లపక్షపు చంద్రుడే ఎప్పుడూ.పరాధీనగా ఇబ్బందులు పడుతున్న మాలిని తన స్వంత ఇంటికి వచ్చేస్తుంది.మాయాద్వీపాన్ని తలపించే అత్తారింటి బంధువర్గంతో తులసి మొక్క లాంటి మైథిలి పలు వివక్షలకు,అవమానాలకు గురౌతుంది.ధైర్యంచేసి భర్త ప్రకాష్ ముందు అతని అక్కా,చెల్లెళ్ల నిజస్వరూపాలను బైట పెట్టటంతో కనువిప్పు కలిగి నిజానిజాలను చూడగలుగుతాడు.సువర్ణయొక్క టైలరింగ్ దుకాణం దినదినాభివృద్ధి చెందుతుంటుంది. మైథిలి వుంటున్న ఊరికే కమలకు ప్రమోషన్ వస్తుంది.భార్యలేనిలోటు ఏనాటికీ పూడ్చలేనిదని ఆలస్యంగానైనా తెలుసుకున్న నాగూ పశ్చాత్తప్తుడై భార్య సువర్ణ వద్దకే చేరుకుంటాడు.ఆమెపట్ల తాను ప్రవర్తించిన తీరుకు సిగ్గుపడి పశ్చాత్తాపంతో క్షమాపణ వేడుకుంటాడునాగూ.కొడుకుకు జ్ఞానోదయమైనందుకు తల్లి అంజనమ్మ సంతోషిస్తుంది.)
ఇక చదవండి..
ఇద్దరూ కలిసి వాటిని వెలిగించారు. అవి హార్ట్ షేప్‌లో ఉన్నాయి. నా హార్ట్ నీవే అన్నట్లుగా వాటిని చేత్తో చూపాడు సువర్ణకు నాగూ. అంగీకారంగా తల వాల్చింది సువర్ణ.
‘‘ఆ… రండి… రండి. ఇక్కడ కేక్ మీకోసం వెయిట్ చేస్తోంది నాన్నగారూ…’’ అన్నాడు. ‘‘అమ్మా నువ్వు కూడా’’ అన్నాడు భార్గవ్.
‘‘మీరొక్కరే కాదు, అమ్మ కూడా కేక్ కట్ చేయాలి. చెయ్యాల్సిందేనని చిన్న పిల్లల్లా పట్టుబట్టారు పిల్లలిద్దరూ.
‘‘హ్యాపీ బర్త్‌డే టూ యూ నాన్నగారూ… మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ దిస్ డే నాన్నగారూ అమ్మా’’ అంటూ బర్త్‌డే సాంగ్‌ని పిల్లలు రిథమిక్‌గా పాడుతుంటే, నాగూ, సువర్ణలు ఇద్దరూ ఒకరి చెయ్యి మరొకరు అపురూపంగా పట్టుకుని కేక్ కట్ చేశారు. ముందుగా సువర్ణ భర్త నోటికి కేకు ముక్కను అందించబోతే, నాగూనే ముందుగా భార్యకు ప్రేమగా కేకును తినిపించి, చేతికున్న క్రీమ్‌ను బుగ్గలకు పూశాడు చిలిపిగా.
తర్వాత వరుసగా అందరూ వచ్చి పుట్టినరోజు నాగూకు కేక్ తినిపించటం పూర్తి చేశారు. దంపతులిద్దరూ వచ్చి అంజనమ్మ కాళ్లకు నమస్కరించారు.
‘‘హాయిగా… అన్యోన్యంగా జీవించండర్రా. నా ఆయుష్షును కూడా పోసుకుని సంతోషంగా వర్థిల్లాలి’’ అంటూ అంజనమ్మగారు దీవించారు వాళ్లను.
నాగూ కోసం తెచ్చిన పెద్దపూల బొకేను అందించారు, విషెస్ చెబుతూ రఘురామ్ దంపతులు.
భార్గవ్, నవీన్‌లు సర్‌ప్రైజ్ గిఫ్ట్‌గా ఓ ఫోటోను అందించారు తండ్రికి. నాగూ దాన్ని తీసుకుని పక్కన పెట్టబోతుండగా ఓపెన్ చేసి చూడాల్సిందే అంటే, ఫోటో ఫ్రేమ్ చేతిలోకి తీసుకొని దానికున్న దారాన్ని విప్పబోతుండగా `
‘‘అమ్మా… నాన్నగారూ… మీరిద్దరూ కలిసి ఓపెన్ చెయ్యాలి… చెయ్యాలి…’’ అని పెద్దగా అరిచారు పిల్లలు.
అది నాగూ, సువర్ణ, భార్గవ్, నవీన్‌లు ఉన్న ఫోటో. దాన్ని చూసి భార్యాభర్తలిద్దరూ ఎంతో పులకించిపోయారు.
ఇంతవరకూ అందరూ చీకట్లో ఉన్నామనే విషయాన్ని మరిచిపోయారు. రఘురామ్ నవ్వుతూ వెళ్లి మెయిన్ ఆన్‌చేసి వచ్చాడు.
కొవ్వొత్తుల మరియు కరెంట్ వెలుగులతో హాలు కళకళలాడుతోంది. అందరి సమక్షంలో భార్యను మనఃస్ఫూర్తిగా క్షమార్పణ కోరాడు నాగూ, తలపంకించింది సువర్ణ చిరునవ్వుతో.

కేక్‌ను పీసెస్‌లాగా కట్‌చేసి పేపర్ ప్లేట్లల్లో పెట్టి పూజిత అందరికీ సర్వ్ చేస్తుండగా…
‘‘అమ్మా పూజితా కాజూ కట్లీ ఉంది, అక్కడ గ్యాస్ గట్టు మీద. అది కూడా తీసుకువచ్చి అందరికీ పెట్టమ్మా!’’ అంది అత్తగారు అంజనమ్మ.
‘‘సరే అత్తయ్యగారూ’’ అంటూ ఆ స్వీట్‌ను కూడా తెచ్చి, ప్లేట్లలో పెట్టిచ్చింది అందరికీ.
‘‘అసలు నా పుట్టినరోజు నాకేసరిగా గుర్తులేదు. మీరెలా గుర్తు పెట్టుకున్నారు ఈరోజును?’’ అన్నాడు నాగూ ఒకింత ఆశ్చర్యంతో.
‘‘తమ్ముడూ… నువ్వంటే మా అందరికీ చాలా ఇష్టంరా’’ అంటూ భుజం చుట్టూ చేతులు వేస్తూ దగ్గరకు తీసుకున్నాడు ఆప్యాయంగా రఘురామ్.
‘‘నేను ఈరోజు వస్తున్నట్లుగా మీ అందరికీ ఎలా తెలిసింది?’’ అన్నాడు సందేహంగా మళ్లీ నాగూ.
‘‘మాకు న్యూస్ లీకయిందిలే నాన్నగారూ’’ అన్నాడు నవీన్ నవ్వుతూ.
‘‘మాకు నానమ్మ చెప్పిందిలే పొద్దున్నే’’ అన్నాడు మళ్లీ.
‘‘నీకెలా తెలిసిందమ్మా?’’ అన్నాడు తల్లితో.
‘‘శివరావు రాత్రి వాళ్ల అమ్మాయిని హైదరాబాద్ బస్ ఎక్కించటానికి బస్టాండ్‌కి వెళ్లినపుడు నిన్ను బెంగుళూరు వెళ్లే బస్ పాయింటు దగ్గర చూశాడట. ఆ అబ్బాయి నాకు ఫోన్ చేశాడురా! నాగూ బెంగుళూరు బస్సెక్కుతుండగా చూశా పిన్నిగారూ’’ అని.
వెంటనే ఈ కబురు సువర్ణకు, పిల్లలకు, రఘురామ్ వాళ్లకు చెప్పాను. చెబుతూ సాయంత్రం ఇంటికే ఇక్కడికే నేరుగా రమ్మన్నాను’’ అంది అంజనమ్మగారు.
అప్పుడు… ‘‘అమ్మా… ఈరోజు తమ్ముడి పుట్టినరోజమ్మా! అని చెప్పాడురా అన్నయ్య’’ అంది అంజనమ్మ నాగూతో.
మరి పిల్లల సంగతో అన్నట్లు భార్గవ్, నవీన్‌ల వైపు చూశాడు నాగూ.

‘‘కన్నతండ్రిని ఏ పిల్లలూ వద్దనుకోరు రా నాగూ. ఉచితానుచితాలను మరిచి నీవు వాళ్లమ్మను నీ అనుమానపు మాటలతో హింసిస్తున్నావని తెలిసి, వాళ్ళకు నీమీద బాగా కోపమొచ్చింది. దాంట్లో తప్పేం లేదురా’’ అంది అంజనమ్మ నాగూతో.
ఎక్కడా హిపోక్రసీ అనేది లేదు. అందరూ మనసు విప్పి మాట్లాడుకుంటున్నారు చాలారోజుల తర్వాత.
‘‘మరి సువర్ణో’’ అన్నాడు తల్లివైపు చూస్తూ…
‘‘సువర్ణ బంగారంరా… నీలో వచ్చిన మార్పును, నువ్వు మనసులో పడుతున్న క్షోభను తనకు అర్థమయ్యేట్లు విడమరిచి చెప్పానురా. నా మాటకు విలువిచ్చి ఒప్పుకుందిరా నాగూ’’ అంది అంజనమ్మగారు సంతోషంతో.
కండ్లలో నీళ్లు తిరుగుతుండగా తమాయించుకోలేక సవర్ణ చీరకొంగుతో వత్తుకుంటూ, దబదబా తన రూమ్‌లోకి వెళ్లిపోయింది. ఆ వెనుకే నాగూ కూడా వెళ్లాడు గదిలోకి.
నవీన్ తల్లి ఉన్న గదిలోకి వెళ్లబోవటాన్ని గమనించిన రఘురామ్ `
‘‘ఆగు నవీన్ ఏం కాదు’’ అంటూ వెళ్లద్దని అన్నాడు.
పెద్దనాన్నగారు ఆపటంతో వెళ్లకుండా ఆగిపోయాడు నవీన్.
బాధపడుతున్న సువర్ణను ‘‘నన్ను క్షమించు సువర్ణా. నిజంగా నేను మారిపోయాను. నేను నీ ఎడల ప్రవర్తించిన తీరుకు రియల్లీ ఐయామ్ సారీరా డియర్…’’ అంటూ ఆమె కన్నీరు తుడిచి, ఆలింగనం చేసుకున్నాడు ఎంతో ఆత్మీయంగా.
‘‘అర్థం చేసుకోకుండా ప్రతిసారీ నన్ను అనుమానిస్తున్నందకు మీమీద విసుగొచ్చి, బాధతో వచ్చేశాను ఇక్కడికి. అంతేగానీ మీమీద నాకేనాడూ కోపం లేదండీ. ఉంటే అప్పుడే గొడవపడి మా అమ్మా వాళ్లతో చెప్పి, మా పుట్టింటికి పోయేదాన్ని. ఎంతోకాలంగా మీలో రావాల్సిన ఈ మార్పు కోసమే ఎదురుచూస్తున్నా మండీ నేనూ, పిల్లలూ, అత్తయ్యగారూ, బావగారూ… మేమందరమూనూ’’ అంది సువర్ణ భర్తతో.
‘‘ఇంతమందిని ఇన్నాళ్లూ బాధపెట్టాను. నాకు నిష్కృతి లేదు.’’ అనుకుంటూ లెంపలేసుకుంటుంటే వారించింది సువర్ణ.
‘‘ఇకముందు మనకన్నీ మంచిరోజులేనండీ. అత్తయ్యగారూ మాతో కొన్నాళ్లు ఉండండీ అని అడిగితే ఇక్కడకు వచ్చారు’’ అంది సువర్ణ.
‘‘మా అమ్మను అత్తగారిలాగా, స్వంత తల్లిలాగా చూసుకుంటున్నావ్ సువర్ణా’’ అంటూ ఆమె మంచితనానికి, సహృదయతకు ముగ్ధుడైపోతూ, ముద్దులతో ముంచెత్తాడు.
‘‘ఊ… ఊ… ఇక బైటకి వెళ్దాం పదండి. హాల్లో అందరూ ఉన్నారు. బాగోదు, ఇక్కడే ఎక్కువసేపు ఉంటే’’ అంది సువర్ణ.
అవునవునంటూ ఇద్దరూ గదిలోంచి హాల్లోకొచ్చారు.
చేతిలో చేయి వేసుకుని నడిచివస్తున్న సువర్ణ, నాగూలను చూస్తుంటే, అక్కడున్న వారందరి మదిలో ఆనందం చిందులేసింది.
‘నన్ను విడిచి నీవు పోలేవులే!… అది నిజములే!
పూవు విడిచి తావి నిలువలేదులే… లేదులే..’ అనేపాట శ్రావ్యంగా వీనుల విందుగా వినిపించసాగింది.
సూటబుల్ సాంగ్ అంటూ అల్లరిగా నవీన్, వాళ్లమ్మా నాన్నలను చూసి చప్పట్లు కొడుతుంటే, అందరూ చప్పట్లతో అనుభూతించసాగారు ఆ మధురమైన దృశ్యాన్ని చూసి.
***
కమల ఆఫీసులో జాయినయి వారం రోజులు సెలవు పెట్టుకున్నానని, ఇప్పుడే బస్టాండుకు వచ్చి, బస్సెక్కాను. ఇంకో పది నిముషాల్లో బస్సు బయల్దేరబోతోందని ఫోన్ చేసింది మైథిలికి.
కూరలు, చట్నీ అవి ఉదయాన్నే ప్రిపేర్ చేసేసింది. రైస్ కుక్కర్‌ని సిద్ధం చేసింది వండటానికి. రవ్వకేసరి తయారు చేసింది, రవ్వ పూర్ణాలు చేయటానికి. డ్రైఫ్రూట్స్ ఎక్కువగా పంటికింద తగులుతుంటే ఇష్టం కమలకి. అందుకని కొంచెం ఎక్కువగానే నేతిలో వేయించింది. డైనింగ్ టేబుల్ నీట్‌గా సర్దింది. ప్లేట్లు, గ్లాసులు, మంచినీళ్ల జార్ సిద్ధం చేసింది. తయారైన పదార్థాలను డిష్‌లలో అందంగా సర్దింది టేబుల్‌పై. ఫ్రెష్‌గా ఉతికిన నేప్‌కిన్‌లను అందుబాటులో ఉంచింది.
ఆ… ఎంతా… గుంటూర్‌లో ఫాస్ట్ ప్యాసింజర్ ఎక్కితే ఓ గంటే విజయవాడ ప్రయాణం. అక్కడ నుండి మా ఇంటికి రావటానికి ఆటోలో పదిహేను నిముషాలు పడుతుంది. ఎంతలేదన్నా కమల రావటాన్కి గంటన్నర పడుతుందని లెక్కేసుకుంది మైథిలి.
ఎవరైనా ఇంటికి వస్తున్నారంటే, అందునా ఆ వచ్చేది ప్రాణ స్నేహితులైతే ఆ తీపి జ్ఞాపకాల గుత్తుల నుండి రాలే పూల గుభాళింపే ఉంటుంది మన మనసు నిండా. కానీ నా మనసు ఒకింత తీపిని, ఒకింత చేదును నెమరు వేస్తోంది.
కాలక్రమంలో కమల పిల్లలు పెరిగి, బడి ఈడుకొచ్చారు. మనవళ్ల ఆటపాటలు, వాళ్ల ముద్దు మాటల్ని వింటూ వైద్యుడిచ్చిన మందులు వేసుకుని, కమల వాళ్ళమ్మగారు నెమ్మది నెమ్మదిగా కోలుకుంటున్నారు. నా వివాహం జరిగింది. ఐతే నా అదృష్టమేంటంటే పుట్టిల్లు, అత్తగారిల్లు ఒకే ఊరవటంతో నా మనసు ఎంతో ఆనందపడేది.
నేనే కమలకు అప్పుడప్పుడు ఉత్తరాలు రాసి, క్షేమ సమాచారాలు కనుక్కునేదాన్ని. నా పెండ్లికి పిలిస్తే, పిల్లలకు జ్వరంగా ఉందని, రాలేకపోతున్నందుకు ఏమీ అనుకోవద్దని జవాబు రాసింది.
‘‘కమలా వాళ్ల అత్తగారికి పక్షవాతం వచ్చిందని, లేవటం లేదని, ఇది ఎప్పటికైనా నీ ఇల్లేనంటూ, నువ్వు ఎంత వద్దనుకున్నా పిల్లలు మా వంశాంకురాలంటూ ఏవో కల్లబొల్లి కబుర్లు చెప్పి, కమలని ఒప్పించి, తీసుకురావాలని వాళ్ల దగ్గర బంధువులెవరితోనో రాయబారం పంపితే… సరేనని పెద్దరికంతో… మాకు ఆలోచించుకోవటానికి కొంత గడువు కావాలని, ఆ రాయబారం తెచ్చిన వాళ్లని మర్యాద పూర్వకంగానే పంపాడు మా మామయ్య అని తానే స్వయంగా జాబు రాసింది మైథిలికి కమల.
కాస్త ఇప్పుడిప్పుడే లోకంలో పడుతోంది కమల అనుకుంటూ సంతోషిస్తోంది మైథిలి.
ఒకసారి ఏదో అర్జెంట్ పురమాయింపు ఉంది. ఊరెళ్తున్నా అని భార్యతో చెప్పి గంగాధరం… కమలా వాళ్ల అత్తగారి వారి ఊరెళ్లి, తెలిసిన వారి ద్వారా వాకబు చేస్తే, తెలిసిన విషయమేంటంటే… కమలా వాళ్ల అత్త పక్షవాతం నుంచే కోలుకోలేదింకా. పడిపోయిన ఎడమకాలూ, చెయ్యి ఇక బాగుపడవని డాక్టర్లు చెప్పేశారట. సరైన సమయంలో ఎవరైనా అందుబాటులో ఉండి చికిత్స కోసం ఆసుపత్రికి తొందరగా తీసుకొస్తే ప్రమాదం తప్పేది. ఇక మేం చేసేదేమీ లేదని డాక్టర్లు చేతులెత్తేశారట. ఫిజియోథెరపీ చేయించండి. అని సలహా ఇచ్చారట డాక్టర్లు. ‘మొక్కై వంగనిది మ్రానై వంగునా?’ అన్నట్లు కొడుకు దగుల్బాజీగా తయారయ్యాడట. తిండి హోటల్లోనేననట కొడుకుది. కొన్నాళ్లు పనిమనిషిని పెట్టాడుట తల్లికి. మందులు టైం ప్రకారం ఇచ్చి, ఇంటి పనులు, వంట పని చేసిపెట్టటానికని. కానీ ఆ పనిమనిషికీ జీతం సరిగా ఇవ్వట్లేదని పని మానేసి వెళ్లిపోయిందట. తిని కూర్చుని జల్సారాయుడులాగా కాలం గడుపుతుంటే, కొండలైనా కరిగిపోతాయంటారు. ఇలా తయారైంది వాళ్ల పరిస్థితి అని ఇంటికొచ్చాక తల్లితో, మేనకోడలు కమలతో చెప్పాడట గంగాధరం.
భూమి గుండ్రంగా ఉందన్నట్లుగా మళ్లీ యథాప్రకారంగా మారిపోయింది కమల బ్రతుకు. ఇక ఎక్కడికీ పంపేది లేదని తేల్చి చెప్పేశాడట గంగాధరం ఇంట్లో. నాగమణి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది.
కమల అంటే ఇప్పుడు మరీ ఎడమొగం పెడమొగంగా ఉండట్లేదు మేనత్తైన నాగమణి. అత్తగారు కోలుకుని విస్తళ్లు కుడుతూ అంతో, ఇంతో వచ్చిన డబ్బు కొడుకు చేతిలోనే పెడుతోంది. కమల కూడా ప్రభుత్వ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూనే పదవ తరగతి పిల్లలకు ఇంట్లోనే ప్రైవేట్లు చెబుతోంది. ఫీజులు బాగానే వస్తున్నాయి. వచ్చిన ఫీజుల్ని వచ్చినట్లుగా అన్నీ వాళ్ల అత్తయ్య నాగమణికే ఇస్తుండటంతో వాళ్ల అత్తయ్య మొహం నిండుగా నవ్వు పులుముకుని ఉంటోంది. కాస్త ఆర్థిక పరిస్థితులు చక్కబడటంతో కొంచెం మనశ్శాంతి దక్కుతోంది ఇంట్లో
ఉన్న మిగతావారికి. ‘మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే’ అని కారల్ మార్క్స్ ఇచ్చిన నిర్వచనం నూటికి నూరు పాళ్లూ కరక్టేనన్పించక మానదు.
రోజులు వారాలై, వారాలు నెలలై, నెలలు సంవత్సరాలై ఇట్టే గడిచిపోతున్నాయి.
ఆ పైశాచిక క్రీడల నుండి, శాడిస్టు మెంటాలిటీ నుండి దూరంగా జరిగి స్వతంత్రంగా బ్రతకాలనే ఉద్దేశ్యంతో విడాకులు కోరుతూ లాయర్ నోటీస్ పంపింది కమల తన భర్తకు, వాదనలు నడుస్తున్నాయి, వాయిదాలు పడుతున్నాయి.
కమల అత్తగారు చనిపోయింది వ్యాధితో తీసుకుని తీసుకుని. ఆమె తాలూకు బంధువులెవరూ తమ పంచన చేరటానికి కమల భర్తకు అవకాశమివ్వలేదు. నీవల్లే ఆమె చనిపోయిందంటూ, వ్యసనాలు ముదిరిపోయాయి. అప్పులు ఇచ్చినవారు ఊరుకోరుగా. ఇల్లు వేలం వేయించారు. వచ్చిన ఆ డబ్బు కాస్తా చేసిన అప్పులు, వాటిమీద వడ్డీలకే సరిపోయింది.
‘‘నిన్ను ఏలుకుంటాను. డైవర్సు వద్దు. నువ్వు కావాలని నంగనాచి కబుర్లు ఒలకబోస్తూ వెంటపడ్డాడట…’’ ఓసారి కమల ఆఫీసు నుంచి వస్తుంటే దార్లో కాపుకాసి.
ఎందుకు వెంటబడుతున్నాడో అర్థం చేసుకోలేనంత వెర్రిదేంకాదు కమల. ఇప్పుడామె జీవితంలో అనేక ఢక్కామొక్కీలు తిని తట్టుకుని లేచినిలబడిన స్త్రీమూర్తి.
‘‘అసలు నీతో నాకు మాటలేంటి? నాతో మాట్లాడొద్దు! ఏదన్నా ఉంటే కోర్టులో తేల్చుకుందామని’’ గడ్డి పెట్టిందట అతగాడికి.
ఇక లాభం లేదు. ఇలా అయితే దారిలోకి వచ్చేట్లులేదని ఏకంగా ఆఫీసు పని గంటల్లో ఆఫీసుకే వచ్చాడట తాగేసి ఓసారి.
అక్కడ ఫ్యూను లోపలికి రానివ్వకపోతే ఫ్యూన్ మీద చెయ్యి చేసుకుని నానా రచ్చ చేస్తుంటే ఇతగాడి భాగోతం అంతా కమల ద్వారా ఆఫీసు వాళ్లకి తెలుసు కాబట్టి, వాళ్లంతా బైటికొచ్చి `
‘‘నువ్వు మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్లకపోతే పోలీసులకు ఫోను చేస్తామని బెదిరిస్తే… ఇక చేసేదేం లేక రుసరుసలాడుకుంటూ మీ అందరి అంతు చూస్తానని అక్కడున్న వాళ్లని బూతులు తిట్టుకుంటూ, నువ్వు నా దగ్గరకు ఎట్లారావో చూస్తానంటూ భార్యమీద ఆవేశపడుతూ వెళ్ళిపోయాడట.
కమల జీతం డబ్బులు కోసమే ఇలా జులుం చేసి బెదిరించి, భయపెట్టాలని చూస్తున్నాడని కమల కొలిగ్స్‌కు అర్థమైపోయింది.
‘‘భయపడకండి మేడం. మీకు మేమందరం అండగా ఉన్నాం’’ అని ధైర్యం చెబుతూ సపోర్టిచ్చారట ఆఫీసువాళ్లు.
ఇలా కమలను గూర్చిన గత జ్ఞాపకాల చేదు రుచిని నెమరు వేసుకున్న మైథిలి మనస్సు ఇహలోకంలోకి వచ్చి పడిరది.
ఇన్నాళ్లకు కమలకు పట్టిన శని వదిలింది. ఆమె జీవితానికి పట్టిన పీడ విరుగడైంది. పిల్లల్ని చక్కగా చదివించి వృద్ధిలోకి తెచ్చుకుంటోంది. ఆడపిల్లలకు చదువు విజ్ఞానం ఎంత అవసరమో స్వావలంబన కూడా అంతే అవసరం.
ఇలా తలుచుకుంటుంటే తాము చదువుకున్నప్పటి కమల క్రొత్త రూపు ధరించి దేదీప్యమానంగా సాక్షాత్కరించింది మైథిలి ఎదుట. అన్యాయాన్ని, అమానుషత్వాన్ని ఎదుర్కొన్న ధీశాలినిలా. పైశాచికతపై ధిక్కారపు విల్లును సారించిన కలియుగ నారినయి….
సమాప్తం