అక్షరం

కవిత

ఒక్కోసారి కలం
అక్షరాలకు బదులుగా
దుఃఖాన్ని లిఖిస్తుంది…

గుండెలోంచి పొగిలి వస్తున్న
ఆవేదన… ఆక్రందన..
మౌనమైన హృదయంలో దాగలేక
కాగితాలను తడుముతుంది..

పరాయవుతున్న తనవారిని తలుస్తూ
ఓదార్పు కరువై
ధైర్యం అడుగంటుతుంటే..
ఆత్మవిశ్వాసాన్ని తట్టి లేపడానికి
నాకున్న ఆసరా ఒక్కటే…

వాక్యాలుగా మనసును సర్దుకుంటూ
ఆత్మీయపదాలని
అంతరంగపు అరల్లో చేర్చుతూ..

అలసటగా అమ్మఒడిలో ఒదిగినట్టుగా
అక్షరాల్లో సేదతీరటం..
మరలా మరొక ఉదయానికి
నన్ను నేను సన్నద్ధం చేసుకోవడం..!

అనుశ్రీగౌరోజు

Written by Anusri Gauroju

పేరు.. అనూశ్రీ గౌరోజు
ఊరు గోదావరిఖని..
గృహిణి, కవయిత్రి, రచయిత్రి.

ఇప్పటివరకు మూడు వచన కవితా సంపుటాలు..( కెరటం, గగనం, దోసిట్లో చందమామ,)
రెండు నవలలు.. (వేద, జగతి) ఆవిష్కరణ జరిగాయి.
నా రెండు నవలలు స్త్రీవాద రచనలు అని చెప్పడం సంతోషం.

శ్రీపద సౌరభం పేరుతో నేను రూపొందించిన ‘శ్రీపదాలుప్రక్రియలో ‘ వెలువడిన శ్రీపద సౌరభం అనే సంకలనానికి,
"కవనపూదోట* అనే సంకలనానికి సంపాదకత్వం వహించడం జరిగింది.

సాహిత్యంతో సహవాసం నాకెంతో ఇష్టం.. అక్షరాలతో కలిసి నడవడం అంటే మనల్ని మనం విజ్ఞానం వైపుకు నడిపించుకోవడమే అని నమ్ముతాను. ఈ అవకాశం నాకు ఇచ్చిన నీహారిణి గారి కి హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్సులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మూత్రపిండం బాధ

మిశ్రగతి