అధునాతన -సనాతన- సింగాణం

భేరి సునీతా రాంమ్మోహన్ రెడ్డి గారితో ముఖాముఖి

సనాతనమే… సునీతీయం

సనాతనం అనేది ఇది ఎప్పుడూ మారక నిత్యనూతనంగా ఉండేది. న్యాయం, సత్యం, నడవడిక ఈ విలువలు మారనివి. సమాజానికి ఎంతో ఉపయోగపడేవి. మనిషి సమాజానికి ఎలా సేవలందించాలి? నైతిక విలువలు ఎలా? కాపాడాలనేది చెప్తుంది సనాతనం. మొత్తంగా సనాతనం జీవితాన్ని ఎలా జీవించాలని దిశానిర్దేశం చేస్తుంది. అలా ఒక క్రమ పద్ధతి మనుషులకు అలవాటైతే సమాజంలో ప్రజలకు శాంతి భద్రతలకు లోటుండదు! అప్పుడు చక్కని సమాజం తయారవుతుంది. అప్పుడు ప్రపంచం మొత్తం హింస అనేది లేకుండా, సాటివారి పట్ల దయతో, ఓపికతో ఉండి, పారదర్శక జీవనం సాగుతుంది. ఇదేదో మతానికి సంబంధించింది కాదు! కేవలం మనిషి మనిషి వలె జీవించడానికి దిశా నిర్దేశమే!
ఏ మతానికైనా ఈ విలులవలు తప్పనిసరి!
అటువంటి మంచి విలువలు అందించే తోవన తాను నడవడమే కాకుండా, తన పరిధి మేరకు తను స్థాపించిన దివ్యజ్ఞాన పాఠశాలలో విద్యార్థుల చేత పాటింపజేస్తూ ఎప్పటికప్పుడు ఒక నూతన తరాన్ని సమాజానికి అందిస్తున్న అధునాతన- సనాతన- సింగాణి శ్రీమతి భేరి సునీత గారితో తరుణీ తరుణలతో ముఖాముఖి!
ఇంకా ఎందుకు ఆలస్యం? చదువుల సరస్వతికి మన సందేహాల సింగాణీలులు ఎక్కు పెడదాం! వారు చక్కని విలువైన సమాధానాలు విసురుతారు! మరేమంటారు? రండి!!

తల్లిదండ్రులు ఆమెకు సునీత అని పేరు పెట్టారు. పేరుకు తగినట్టుగా విశ్వహిందూ సంస్థ ద్వారా సదాచారాన్ని ప్రచారం చేస్తున్న సునీతా రామ్మోహన్ రెడ్డి గారు తమ సంస్థ లక్ష్యాన్ని ఇలా గర్వంగా చెప్పారు.

హిందూ సమాజాన్ని నిర్వహించడం, సంఘటితం చేయడం, అంతేకాదు హిందూ ధర్మ సేవ చేయడం, దాని రక్షించడమే ధ్యేయంగా కొనసాగే విశ్వహిందూ పరిషత్తు రాష్ట్ర స్థాయి మహిళా అధ్యక్షురాలుగా శ్రీమతి సునీత రెడ్డి గారు దేవాలయాల నిర్మాణంలోనూ, వాటిని పరిరక్షించడంలోనూ, సక్రమంగా భగవంతునికి అన్ని సేవలు జరుగుతున్నాయా? లేదా? అని పర్యవేక్షించడంలోనూ వారి బాధ్యత ఉంటుంది. కోవెల సంప్రదాయాన్ని కాపాడుతూ…. తను శ్రద్ధగా పూజలు అర్చనలు చేయడమే కాదు! తన పాఠశాలలోనూ ఆచార- సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందిస్తున్న శ్రీమతి భేరి సునీతా రెడ్డి గారు హిందూ సమాజాన్ని ఏకీకృతం చేయడం, గోసంరక్షణ, మతమార్పిడుల వంటి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టిసారించి స్త్రీ శక్తి అంటే ఏమిటో తెలుగు ప్రజలకు చాటి చెప్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి కనుకనే సాహిత్య సభల్లోనూ, ధార్మిక సభల్లోను చక్కగా ప్రసంగిస్తారు. మంచి నిర్వాహకురాలిగా దివ్యజ్ఞాని నికేతన్ పాఠశాలను ఆదర్శవంతంగా నిర్వహిస్తున్నారు. ఇలా పలు రంగాలలో నిష్ణాతురాలైన శ్రీమతి భేరి సునీతా రామ్మోహన్ రెడ్డి గారు మన మయూఖ పత్రికకు నేటి అతిథి. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం!

రంగరాజు పద్మజ :– నమస్కారమండి సునీతా రెడ్డి గారూ!

సునీతారెడ్డి గారు:– పద్మజ గారూ! నమస్కారమండీ!

పద్మజ :—- మీ నేపథ్యం చెప్తారా?

సునీతా రెడ్డి :– నేను మట్టి బిడ్డను అంటే రైతు బిడ్డను. జనగామ దగ్గర గానుగు పహాడ్ అనే చిన్న గ్రామంలో తాతగారు సమాజ సేవకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, దేశం కోసం, ధర్మం కోసం, పాటుపడిన వ్యక్తి. అంతెందుకు ఊళ్లో బస్ చెడిపోతే అందులోని ప్రయాణికులకు అందరికీ ఆ పూట వంట వండించి బస్ దగ్గరకు పంపేవారు. చలికాలం వస్తే చాలు 10, 15 శాలువాలు కొని వృద్ధులకు కప్పేవారు. అలాంటి ఇంట్లో పుట్టాను.
తర్వాత కాలంలో కూడా సమరయోధుడుగా తనకు ఇచ్చిన పింఛన్తో నెలకు కావలసిన మందులు, ఊరి వారికి ఎవరికైనా పామో, తేలో కాటు వేస్తే ప్రథమ చికిత్స కోసం వేసే మందులు, ఆయన దగ్గర పనిచేసే వారికి ఎవరికైనా దెబ్బ తగిలితే కట్టు కట్టేందుకు గ్లాస్ క్లాత్ ( కట్టుకట్టే గాజుగుడ్డ) టించర్ , కాటన్, పొటాషియం పర్మాంగనేట్, మొదలైనవి కొనుక్కొని తెచ్చి ఇంట్లో పెట్టి ప్రధమ చికిత్స చేసేవారు.
నాకెందుకు గుర్తున్నదంటే ఆ వచ్చిన రోగికి మనుమరాండ్లు; మనుమలతోనే మందులు ఇప్పించేవాడు, మందు రాయించేవాడు. ఆ రోజుల్లో అలా ఉండడం వేరు, అప్పుడు అందరి ఇళ్లల్లో అసమానతలు (అస్పృశ్యత) ఎక్కువ! మా తాతగారు పట్టించుకునే వారు కాదు! ఎవరైనా ముళ్ళు విరిగి; చీము పట్టి మందు కోసం వస్తే మా చేత ముళ్ళు తీయించేవాడు. మా నాయనమ్మ కోపం చేసేది ముట్టుకోవద్దని.
ఇంట్లో పెద్ద కుండ నిండా మజ్జిగ చేసి పెట్టేవారు. నౌకర్లకు, ఇంటి చాకలి, మంగలి వారికి చెంబు నిండా మజ్జిగ ఉచితంగా పోసేవారు. సామాజికంగా సమస్థానమే ఉండేది. దేశం మీద ప్రగాఢమైన భక్తి, నాదేశం దీనికోసం ఏదైనా చేయాలనే తపన ఉండేది. అలా నాకు అనువంశికంగానో, వారసత్వంగానో , దైవభక్తి, సేవాభావం మా నాన్న గారి వల్లనే వచ్చాయి. నాన్న ప్రభుత్వ ఉద్యోగి, ఒకరికింద పనిచెయ్యడమేమిటని మన వ్యవసాయం చూసుకొమ్మని ఉద్యోగానికి రెండు సార్లు రాజీనామా ఇప్పించారు తాతయ్య.

పద్మజ:– మీ విద్య- ఉద్యోగం గురించి మయూఖ పాఠకులకు తెలియచేస్తారా?

సునీతారెడ్డి:– మా వాళ్ళు నన్ను స్కూల్లో జాయిన్ చేసినపుడు నా డేట్ ఆఫ్ బర్త్ కూడా సరిగా రాయించలేదు. మా వాళ్ళు దొరలు కనుక స్కూల్ కు నన్ను నౌకరుతో బడిలో చేర్చమని పంపారు. జాయిన్ చేసుకున్న టీచర్ మొదటి తరగతిలో జాయిన్ అయినాను కనుక ఆరు సంవత్సరాలుంటుందని అందాజాగా రాసారు. కానీ నాకు నాలుగు ఏండ్లే! అలా నావయసు రికార్డ్ లో ఎక్కువ పడింది
నాకు తెలుగులో చక్కని భాష రావడానికి కారణం మా చిన్నప్పుడు పాఠాలు చెప్పిన అనంతయ్య సార్ బోధనా పద్ధతే! రామాయణ, భారత, భాగవతాలలోని కథలు చెప్పుతూ వినే కుతూహలం కలిగించి తర్వాత ఒత్తులు దీర్ఘాల వంటి పాఠాలు చెప్పేవారు. అలా మాకు మా చిన్నప్పుడే పురాణ పురుషుల- స్త్రీల పేర్లు పరిచయమయ్యాయి.
పదవతరగతి మరియు ఇంటర్ వరకూ మా జనగామ తాలూఖాలోనే చదివాను.
M B B S చదవడం కోసం గుంటూరులోని రవీస్ కాలేజీలో బైపీసి తీసుకొని చదివాను. మెడికల్ ఎంట్రన్స్ రాసాను.సీటు రాలేదు.ఆ కాలంలో సిద్ధార్థ మెడికల్ కాలేజీలో 25000/ రూ.లు డొనేషన్ కడితే MBBS లో సీట్ ఇచ్చేవారు. కానీ దానికి మరికొంత డబ్బు కలిపితే పెళ్ళి ఔతుందని వారి ఆలోచన! నేను చదువుకుంటానన్నా కూడా సంబంధం కుదిరించారు. అలా పరీక్షలైన వెంటనే నాకు పెళ్ళి చేయాలని తలపెట్టారు. ఎందుకంటే మా తాతయ్యకు ఆరోగ్యం బాగాలేక ఆయన కళ్ళముందు పెళ్ళి చేయాలని దాదాపు బాల్య వివాహమనే చెప్పవచ్చు. ఆ కాలంలో చుట్టూ నక్సలైట్ విప్లవానికి సంబంధించిన గొడవలు జరుగుతుండేవి. అవి చూసి, చదువుకొని, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న పిల్లవాణికే అమ్మాయినివ్వాలని, పట్టు పట్టి, వెతికి శ్రీ సాయి రాంమ్మోహన్ రెడ్డి గారితో వివాహం జరిపించారు. వారు రైల్వే ఉద్యోగి.
మా వారికి చదువంటే ఇష్టం కాబట్టి చదవుకో అన్నారు. కానీ మాది ఉమ్మడి కుటుంబం. కాబట్టి కాలేజీకి వెళ్ళి చదవలేను ! అందుకే ఉస్మానియా దూరవిద్య లో
B. A చదవడానికి దరఖాస్తుతెచ్చారు. బాగానే ఉంది కానీ నేను సైన్స్ విద్యార్ధిని. నాకు సోషల్ స్టడీస్ కానీ,ఎకనామిక్స్ కానీ రావు! చదవలేనంటే పరవాలేదు కాస్త కృషి చేస్తే వస్తుందని, మొదటి గురువుగా మా వారే ఎకనామిక్స్ అర్ధం అయ్యేలా చెప్పారు. అలా డిగ్రీలో మంచి మార్కులతో పాసయ్యాను. మావారి క్రమ శిక్షణలో చదవాలన్న తపన ఉన్న నాకు చదువు బాగానే అబ్బింది. అలా నాకు తెలుగంటే ఇష్టమని, M A తెలుగుతో రాయమని పట్టు పట్టారు. అలా MA తెలుగు పూర్తి చేసాను.
తర్వాత ఉస్మానియాలో దూరవిద్య వారి ప్రకటన ఒకటి వచ్చింది. అదేమిటంటే B. A లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో 60% మార్కులు వస్తే వారు నేరుగా M. A చేయవచ్చని నోటిఫికేషన్ వచ్చింది. అలా M. A కుఫీజు చెల్లించాను. అలా M A ఇంగ్లీష్ లో చదివాను. ఎందుకంటే నేను స్కూల్ లో ఇంగ్లీష్ టీచర్ లేకపోవడంతో నేను చెప్పాల్సి వచ్చింది. అందుకే చదివాను. డిగ్రీకి వచ్చిన తర్వాత సబ్జెక్ట్ లో ఉన్న ఆ పాత్రల గురించి చదివినప్పుడు కొత్తగా అనిపించలేదు. తెలుగు భాష మీద ఇష్టం ఏర్పడింది. అంటే బాల్యంలో చదువుకున్న చదువు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అలా తెలుగు M A చదివిన తర్వాత ఆధ్యాత్మిక గ్రంథాలు చదవాలంటే సంస్కృతం రావాలి! అని సంస్కృతం నేర్చుకోవాలనే అభిలాష కలిగింది. అందుకే సంస్కృతం M. A కు ఫీజు కట్టి చదివి, పరీక్ష పాస్ అయ్యాను. ఒక సర్టిఫికెట్ రాగానే మరో పరీక్ష కు సిద్ధపడడం అలవాటైంది.

పద్మజ:– మీ రచనల వివరాలు, విశేషాలు చెప్పండమ్మా!

సునీతారెడ్డి:– నేను మొత్తం 14 పుస్తకాలు రాసాను. రెండు వచన కవిత్వం, రెండు వ్యాస సంకలనాలు, ఆధ్యాత్మిక రచనలు, కృష్ణా పుష్కరాల సందర్భంగా దీర్ఘ కవిత , మరికొన్ని వ్యాసాలు రాసాను. దేవానంద స్వామీజీ జీవిత చరిత్ర రాసాను. మా ఊళ్లో రాజేశ్వర దేవస్థానం
స్థల పురాణం మా ముత్తాతగారు సంస్కృతంలో రాయించారట ! ఆ చిన్న పుస్తకాన్ని మా నాన్న సంపాదించి, సంస్కృతంలో ఉన్నందున అది అందరికీ అర్ధం కాదని, ఎలాగైనా తెలుగులో అందరికీ అర్థం అయ్యేలా అనువదించమని అంటే సరేనని సంస్కృతం నుండి తెలుగులోకి అనువదించాను. రాజేశ్వర చరిత్రను స్థలపురాణం రాసాను , రెండు పద్య కావ్యాలు, మిగతావి వచనాలు రాసాను.
కసిరెడ్డిగారు నాలుగు పత్రికలకు సంపాదకత్వం వహించేవారు. నాతో వ్యాసాలు రాయించేవారు. వారు సవరించి పంపేవారు. అలా ఒకానొక సమయంలో వారు తిరుపతి వెళ్ళినప్పుడు శివానంద భారతిలో రెండు సంవత్సరాలు ఎడిటర్ గా ఎడిటోరియల్స్ రాసాను. తర్వాత గీతాజ్ఞాన్ సమాచార్ వారు నడిపే పత్రికలో నాలుగు సంవత్సరాలు వ్యాసాలు రాసాను. అలా దైవభక్తి, దేశభక్తికి సంబంధించిన వ్యాసాలను రాసాను. చిన్న చిన్న కవితలతో సంకలనం వేయిస్తే ఆ పుస్తకాలకు కసిరెడ్డిగారే పేర్లు పెట్టారు. ఆయనే ముందు మాటలు రాసారు. అలా 14 పుస్తకాలను వెలువరించాను.

పద్మజ :– మీరు అంతర్జాతీయ వేదికల మీద పత్ర సమర్పణలు చేసినట్టు విన్నాను. ఆ సందర్భం ఎలా వచ్చిందిది?

సునీతారెడ్డి:– చెప్పాలంటే అన్నింటికీ మూలం నా గురువుగారైన కసిరెడ్డి గారి పరిచయ భాగ్యమే! అప్పటికే వారు ఉస్మానియా యూనివర్సిటీలో ఉండడం, తర్వాత తెలిసీ- తెలియని తనం అయినా సాహిత్యంలో ఉండడం వల్ల వచ్చే లాభాలు అంటారు కదా!, అలా ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేసే వారు వారి స్నేహితులు కావడం, వేంకటేశ్వర యూనివర్సిటీ గానీ, పద్మావతి యూనివర్సిటీ గానీ, బనారస్ యూనివర్సిటీ గానీ (రామాయణాన్ని హిందీలో పత్ర సమర్పణ చేశాను.) అవన్నీ తెలిసిన వారి ద్వారా అవకాశాలొచ్చాయి. సురభారతిలో కూడా సెమినార్లో పాల్గొనే అవకాశం వచ్చింది. అలా జాతీయ- అంతర్జాతీయ సెమినార్లలో 16 చోట్ల నేను పత్ర సమర్పణ చేసి పాల్గొనడం జరిగింది. సాహిత్యకారులంతా యూనివర్సిటీ ప్రొఫెసర్లు కావడం, యూనివర్సిటీతో నాకు సంబంధం లేకపోయినా… గురువుగారి శిష్యురాలుగా అన్ని కార్యక్రమాల్లో నాకు అవకాశం ఇచ్చారు. ఇష్టాగోష్ఠిలలో పాల్గొనడం జరిగింది. ప్రింట్ మీడియాలోనే కాదు ఎలక్ట్రానిక్ మీడియాలలోను దాదాపుగా వందల ఆధ్యాత్మిక, దేశభక్తి, దైవభక్తికి సంబంధించిన చర్చ కార్యక్రమాలు కానివ్వండి, ప్రవచనాలు కానివ్వండి T V chanels పాల్గొన్నాను.
హిందూ ధర్మం- సనాతన ధర్మం ఛానల్ వారు, భక్తి టీవీ, ఈనాడులో పరకాల ప్రభాకర్ రావు గారి సభా సమన్వయంలో ఎన్నో కార్యక్రమాలు చేసాను. ఏదైనా పండగ వస్తే పెద్ద కార్యక్రమం చేసే వారు. నారీ – భేరీ కార్యక్రమంలో కూడా పాల్గొన్నాను. సఖీ కార్యక్రమంలో పాల్గొన్నాను. ఉదయం ఐదు గంటలకు తమసోమా జ్యోతిర్గమయ అనే ఒక కార్యక్రమం వచ్చేది. అందులోనూ ఎన్నోసార్లు పాల్గొన్నాను. దీనికంతటికి మూల కారణం… మా గురువుగారైన కసిరెడ్డి వెంకటరెడ్డి గారు. శివానంద ఆశ్రమంలో సత్యవ్రతానంద స్వామీజీ ఉపన్యసించమని ఆదేశించడంతో అక్కడ భాగవత సప్తాహం చేసాను. రామాయణ పారాయణం, ప్రవచనం చేసాను. అలా కాలానుగుణంగా ఉపన్యాసాలు ఇవ్వడం వల్ల ఆ కళ అలవడింది. ఈనాడులో పాల్గొనడం వల్ల ఈటీవీలో పనిచేసే ప్రొడ్యూసర్సు వేరే ఛానల్ లోకి వెళ్లడం వల్ల వారు అందులోనూ నన్ను పిలవడం వల్ల అలా నా సాహిత్యం వ్యాపించింది. అన్ని చానల్స్ లో మాట్లాడే భాగ్యం కలిగింది.
ఒకసారి జగిత్యాలలో ఒక రెడ్డి సంఘం వారు ఫంక్షన్ హాల్ ప్రారంభం చేస్తున్నారు. వారి లక్ష్యం ఏమిటంటే? ఎవరైనా బీద రెడ్డి పిల్లలు ఉంటే వారికి సహాయం చేయాలని అనుకున్నారు. అందుకోసం ఆ మ్యారేజీ హాలు నిర్మించారు. దానిపై వచ్చే ఆదాయంతో స్కాలర్షిప్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అప్పుడే కసిరెడ్డి గారికి ఫోన్ కాల్ చేసి, వారిని ప్రసంగించడానికి ఆహ్వానించారు. వారు అంతకుముందే ఒక కార్యక్రమానికి వస్తానని మాట ఇచ్చారట!
రెడ్డివారినే పిలవాలని నిర్వాహకులు అనుకున్నారట! నాకు వీలు కాదు కానీ సరే నేను ఎవరినైనా పంపిస్తాను! అని వారితో చెప్పి “నాతో అమ్మా! నువ్వు వెళ్ళు!” అని అన్నారు. నాకు మొదటిసారి సువర్ణావకాశం లభించిందనే చెప్పాలి ! నాకు ఏమీ తెలియదు! రెడ్డి సంఘం అన్నారు, రెడ్డి వక్త కావాలన్నారు, ఆ అంశం మీదనే గంట సేపు మాట్లాడాలి. అందుకే నేను మొత్తం రెడ్డి రాజుల పుస్తకాలు చదివాను. రెడ్డియుగం, రెడ్డి అని ఆ పేరు ఎందుకు వచ్చింది? రెడ్ల పుట్టుపూర్వోత్తరాలు, వేమన గురించి, నేటి కాలపు రెడ్ల వరకు సమాచారం సేకరించుకున్నాను.
రెడ్లకు క్షాత్ర గుణం ఎందుకు తగ్గింది? ఇప్పటి తరంలో కూడా చినిగిన చొక్కా వేసుకున్నా పైనుండి శాలువా కప్పుకొనే డాంభికం ఎందుకు ఉంది? క్షాత్రత్వం ఎక్కడ ఉంది? ఇవన్నీ చెబుతూ వచ్చాను.
ప్రేక్షకుల్లో 2500 మంది కూర్చొని ఉన్నారు. సగం ఉపన్యాసం అయ్యేసరికి కసిరెడ్డి గారికి ఫోన్ కాల్ చేసి సార్ “మంచి వక్తను పంపించారండీ! అని అన్నారట! ఉపన్యాసం చివరలో ఇలా అన్నాను. ఇంతమందిలో ఒక్క స్త్రీ మూర్తి కూడా లేకపోవడం అవమానం! మన సంప్రదాయం ఇందుకే క్షీణించి పోయింది. అమ్మ చదువుకొని ఉంటే ఇంత దౌర్భాగ్యం మనకు వచ్చేది కాదు! మన అమ్మల్ని చదువుకోవ్వలేదా? లేదా బయటకు రానివ్వ లేదా, అమ్మ చదువుకొని ఉంటే ఇంత దౌర్భాగ్యం కలగక పోయేది!అని చురక వేసాను.
రెడ్డి బిడ్డగా గర్వపడుతున్నాను! కానీ నాతోటి వాళ్ళందరూ ఇక్కడికి రావాలన్నాను. ఆ మాటతో సంతోష పడ్డారు. అది మొదలు వెయ్యి మందికి పైన శ్రోతలు వస్తారని అంచనా కనుక ఉంటే మా గురువుగారికి వీలు కాకుంటే నన్ను ఉపన్యసించమని పంపించడం అలవాటయింది. ముందు నుండి నేను జాతీయ సాహిత్య పరిషత్తులో అవకాశాలు రావడానికి కారణం గురువుగారే ! అధ్యక్షులుగా ఉండడంతో అలా అవకాశాలు వచ్చాయి. తర్వాత మల్కాజిగిరి శాఖకు కూడా కొన్ని రోజులు అధ్యక్షులుగా ఉండడం, రాష్ట్ర కోశాధికారిగా పది సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను. ఆ సమయంలోనే ఓ 16 సంవత్సరాల క్రితం నా ఉపన్యాసాలు విని, విశ్వ హిందూ పరిషత్ వాళ్లు సేవికా సమితి వాళ్ళు నన్ను గమనించడం, మా ఉపన్యాసాలకు రావడం, నచ్చడం విశ్వహిందూ పరిషత్తు వారు, సార్ ను వారు అడిగితే అమ్మాయి బిజీగా ఉంది! అటు స్కూలు, ఇటు ఇంటి నిర్వహణ కష్టం కదా! అంటే వారు నాలుగు సార్లు ఇంటికి వచ్చి మరీ అడిగితే కాదనలేక వెళ్లాను. అక్కడ రాష్ట్ర బాధ్యత గత 16 సంవత్సరాలుగా విశ్వహిందూ పరిషత్తు ప్రాంతం ఉపాధ్యక్షురాలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను.

పద్మజ:– ఇప్పుడు ఈ సమాజం ఇంత కలుషితమైంది కదా! అరాచకాలు జరుగుతున్నప్పుడు ఈ జాతీయ వాదం కానీ, మన దేశభక్తి ప్రచోదనలు ఎంతవరకు పని చేస్తున్నాయి? ఇంకా దాని అవసరం పెంచాలంటారా? ఈ జాతీయ భావం పెంపొందించేందుకు చేసే కృషి ఎలా ఉండాలి?

సునీతారెడ్డి:– నిజం చెప్పాలంటే మనకి ఇబ్బంది ఎక్కడ వచ్చిందంటే ఒక దేశభక్తి- జాతీయతా భావం పుష్కలంగా ఉన్న ఒక తరం అంతరించిపోయింది. ఇలా అనొచ్చో? అనకూడదో తెలియదు! ఎందుకంటే అందరికీ చిన్ని నా బొజ్జకు శ్రీరామరక్ష అనే భావం వచ్చేసింది. నా బిడ్డ బాగుండాలి! నా బిడ్డ బాగా సంపాదిస్తే బాగుండు! నా దేశంలో లేకున్నా పరవాలేదు! ఏ దేశంలోనైనా సరే! ఇలా తెలియకుండానే అందరి ఆలోచనలు ఆ దిశగా మళ్ళాయి.

స్వాతంత్ర్య సమాజంలో ఎంత మంది యోధాను యోధులు సమసి పోయినా కూడా ఆ ఇంటి నుండి దేశభక్తి గల పౌరులు త్యాగానికి సిద్ధపడిన వారున్నారు. నెమ్మదిగా వారి సంఖ్య తగ్గుతూ దాని వలన మిగిలేది లేదనుకునే స్థాయికి చేరుకుంటున్నారు. మనలో పాశ్చాత్య భావాలను బాగా నింపుకున్నాము. సంస్కృతి- సంప్రదాయాలను కాలరాసాము. అందరూ బాగా సంపాదించుకుంటూ సుఖంగా ఉన్నప్పుడు మనమెందుకు కష్టపడాలి, ఇలా ఎందుకు ఉండాలి ? నలుగురితో పాటు నారాయణా అని ఉండక అని ఇట్లాంటి మెట్ట వేదాంతం చెబుతూ దేశ భక్తిని మనం తెలియకుండానే అధోగతికి తీసుకొచ్చాము. మరిఇప్పుడు అందరూ ఎదురీత అవసరమా, అని అంటారు! కానీ ఎవరైనా ఏమైనా ప్రయత్నం చేయకపోతే ఏది సాధించలేం! కాబట్టి రెట్టవాదులు చాలా మంది ఉన్నారు. పిచ్చి వేదాంతం, ఫెమినిస్టులు, కమ్యూనిస్టులు ఎప్పటికప్పుడు మన జాతీయవాదాన్ని చంపాలని, ఎక్కడికక్కడ అడ్డు పుల్లలు వేస్తూనే ఉన్నారు. ఈ రెట్ట వేదాంతంలో తులసి చెట్టుకు నువ్వు నీరు పోస్తేనే బతుకుతుందా? లేకపోతే లేదా? అని అడ్డంగా వాగే వాళ్ళు ఉన్నారు. కానీ మనకు ఒక పవిత్రమైన నమ్మకం ఉంది. మనకున్న జాతీయ భావాల్లో మంచి గురువు లభిస్తే, ప్రాణాపాయ స్థితిలో ప్రాణం నిలవడానికి మంచి డాక్టర్ లభించినట్టే… మంచి శిష్యులు గానే కాదు! దేశం కోసం, సమాజం కోసం అవసరమైన వ్యక్తిగా కావాలంటే మంచి గురువు ఉంటేనే ఇవన్నీ సాధ్యమవుతాయి.

దేవుని దయవల్ల నాకు మంచి గురువులు- మార్గదర్శకులు కసిరెడ్డిగారు కాబట్టి ఆయనకు ఏ శిష్యులు దొరికినా దేశభక్తి , దైవభక్తి ఉపదేశించి, వారిలో ఆయా గుణాలు పెంపొందేలా చేస్తారు. ఆయన మార్గంలో నడుస్తారు!
వారి వలనే నేను కూడా ఒక శిష్యురాలిని అని చెప్పుకోవడం గర్వంగా భావిస్తాను! నాకు ఇష్టం కూడా కాబట్టి ఆదారిలోనే వెళుతున్నా… మనకి ఇవన్నీ ఎంతవరకు సాధిస్తాం ? అనే సందేహంతో అనుకునే బదులు నా వంతు నేను చేస్తాను. సమాజంలో పౌరురాలిగా నా కర్తవ్యం ఇది.
నేను చెప్పేది ఏమిటంటే నాకు ఆత్మగౌరవం కూడా ఎక్కువే! కాబట్టి నాకు ఎలా ఉంటుందంటే? తప్పనిసరిగా నాకు చేతనైనంత పని నేను చేస్తాను! ఎంతో కొంత సాధిస్తాను! అనుకొని ఎవరు విన్నా- వినకపోయినా నేను ఎక్కడికి వెళ్ళినా దేశభక్తి, దైవభక్తి సంబంధించి, నా ధర్మం, నా సంస్కృతి, నా సంస్కారం ఈ దేశంలో ఉన్నా, ఏ క్రతువైనా సరే దాంట్లో కొంత శాస్త్రీయత ఉందని నొక్కి వక్కాణించి చెప్తాను. శాస్త్రీయత లేని క్రతువే నాకు లేదు. ఎవరైనా వితండ వాదన చేసినప్పుడు దానికి సమాధానం చెప్పాలి! కాబట్టి పురాణాలు కానీ, ఇతిహాసాలు కానీ, శాస్త్రాలు కాని చదవాలి! నేను అందరికీ చెప్పేది అదే! రాబోయే గురుపౌర్ణమి వచ్చిందంటే గురు పౌర్ణమి రోజు చప్పట్లు కొట్టి బొమ్మ పెట్టడం కాదు! ఆ గురువు యొక్క ఆశయాలు ఫలింపజేయాలి! ఆశలు- ఆశయాలంటే నా సంస్కృతిని కాపాడాలి! అని ఆనాడు వ్యాసుల వారు చెప్పినా, ఈ రోజు గురువులు చెప్పినా అదే విషయం… కాబట్టి ఆ సంస్కృతి తరువాతి తరాలకు అందాలంటే మనమేం చేయాలి? మొట్టమొదట ప్రాచీన వాఙ్మయం చదవాలి! పనికిమాలినవాడు వచ్చి అడుగుతాడు. మతవ్యాప్తి కోసమో? ఇంకోదానికో లేనిపోని అడ్డంకులు పెడుతూ ఉంటాడు. మీ మతంలో చెట్టుకు, పుట్టకు, గుట్టకు, పాముకు, పక్షికి పూజ చేస్తే ఫలితం దక్కుతుందా? అని హేళనగా అంటాడు. ఔను! నేను చెట్టును- పుట్టను- గుట్టను పూజిస్తున్నానంటే ప్రకృతిని పరిరక్షిస్తున్నానన్నమాటే కదా? ప్రకృతిలో ఒక శక్తి ఉందని శాస్త్రీయంగా నిరూపణ చేస్తూ అది బలాత్మకమని చెప్తుంటే ఆ ఎనర్జీ ఈరోజు కాదు అందులో ఆ శక్తి ఉందని ఎప్పుడో ప్రాచీన కాలంలోనే మన ఋషులు గ్రహించారు. భారతీయ సనాతన ధర్మంలో ఉన్నదని గట్టిగా చెప్తాను. మరి ఇది చెప్పడానికి మన వాఙ్మయం చదవాలి అని ప్రేరణ కలిగిస్తాము.

నేను ఎక్కడ ఉన్నా చుట్టూ ఉన్న పిల్లలతో జాతీయ భావాలు చెప్తాను. బస్సు ఎక్కినా, రైలు ఎక్కినా ఎక్కడ వీలైతే అక్కడ చెప్తాను! చెప్పకుంటే చెడిపోయిన వారు చాలామందే ఉన్నారు. ఒకసారి నేను అనుకోకుండా కాలేజీ పిల్లలతో ఎక్కడికి వెళుతున్నారు? అనడిగాను.
వారంతా షిరిడికి వెళుతున్నామన్నారు. ఆడ మగ అంతా యువతి యువకులే! కలిసి వెళుతున్నారు. నేను వాళ్లతో మీరంతా ఇంత భక్తిగా వెళుతున్నారు! భలే బాగుంది అన్నాను.
వెంటనే వాళ్ళు జస్ట్ ఏ హాలిడే ట్రిప్ మేడం! అని అన్నారు. హాలీడే ట్రిప్ కు ఆధ్యాత్మిక మైన స్థలానికి వెళ్లడం ఏమిటి? మీకు అక్కడ సుందర దృశ్యాలు ఏవి కనపడకపోవచ్చు కదా! అన్నాను. ఎందుకంటే? పిల్లలకు చెప్పక చెడిపోయారన్నదే నా భావన! కాబట్టి చెప్పి చూద్దామని ట్రైన్లో గంటా రెండు గంటలు మాట్లాడాను. ఎలాగూ 10 గంటల ప్రయాణం కాబట్టి సమయం దొరికింది. అంతా విని ఆ పిల్లలు ఆంటీ అందరూ ఇలా చెప్తే బాగుంటుంది కదా! అని అన్నారు. అంటే పిల్లలు కూడా వినడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడెక్కడ జాతీయ లేదాసంస్కృతీ లేదా భక్తి భావాలు చెప్పడం లేదంటే? ఈనాడు
అమ్మ చెప్పడం లేదు బడిలో టీచర్ చెప్పడం లేదు ఇంట్లో అందరికీ మమ్మీ అని పిలిపించుకుంటేనే ఆనందం! అమ్మా! అని నోరార పిలిస్తే లాగే లెంపకాయ వేస్తున్నారు. నువ్వేమన్నా తెలుగు మీడియంలో చదువుతున్నావా? అని అడిగే అమ్మలు ఉన్నారు. తెలుగు మీడియం చదవడం కాదా!
అంబా అని పిలిచే ఆవుకు- అమ్మా! అని పిలిచే మనకు ఎంత అనుసంధానం ఉంది కదా ! అమ్మ అని పిలవడం నచ్చడం లేదు… మమ్మీ కావాలి కాబట్టి దుస్తులు కూడా అదే వేషం… ఇంకా దరిద్రం భావ దాస్యంతో పాటు మనకున్న దరిద్రాల్లో మనకు వచ్చిన దరిద్రం ఏమిటంటే స్వతంత్రం వచ్చిన తర్వాత జనాభాలో ప్రపంచంలో రెండవ స్థానంలో ఉన్నామని, ఇంకేదో అనుకొని ఒక పిల్లవాడే ముద్దు! ఇద్దరు హద్దు! మూడు వద్దు! అని ఇలా రకరకాల స్లోగన్స్ పుణ్యమా అని కేవలం హిందూ ధర్మంలో ఉన్న వారు మాత్రమే పోటీపడి ఒకడిని మాత్రమే కని మన సంఖ్య తగ్గిస్తున్నారు. రేపటి మన పరిస్థితి ఏమిటి మనకు తెలియదు! ధర్మం పట్ల ఎవరికీ అవగాహన లేదు. ఒకడైనా ఉన్నాడు కదా! అని తృప్తి పడదామంటే ఒక్క ఆడపిల్లతో సరిపెట్టుకుంటున్నారు. మరి ఆడపిల్లైనా చాలు అన్నప్పుడు ఆడపిల్ల నా ఇంటి లక్ష్మి అని లక్ష్మీ దేవత వలె అలంకరిస్తున్నారా? అంటే అదీ లేదు! ఆడ పిల్లలకు మగ డ్రెస్సులు వేసి, ఆడైనా- మగైనా ఇదే అంటారు. మరి మగ పిల్లవాడు పుడితే ఆడపిల్లల డ్రస్సులు వేస్తున్నారా? వేసి పంపరు కదా? ఎందుకలా చేయడం? ఆడపిల్ల ఇష్టం ఉంటే ఒక ఆడ పిల్లతో పాటు మరో మగ పిల్ల వాడిని కంటే ఏమవుతుంది?
అలాగే ఆడపిల్లను ఆడపిల్లగా పెంచాలి కదా! ఆడపిల్లల్లో అమ్మతనం ఉండాలి కదా? అది అమ్మైతేనే సమాజం నిలిచేది మాత సమాజ నిర్మాత అనేది మరిచిపోతే ఎలా? ఇవన్నీ తెలియనటువంటి ఒక రకమైన మాయ పొరలు కమ్మాయి. మనకు ఈ పొరల నుండి బయటకు రావాలంటే ఎంతో కొంత చైతన్యం కావాలి. ఈ చైతన్యం ఎలా వస్తుందంటే? మనకు తెలిసిన విషయాలు చెప్పాలి! మనం ఎంత చెప్పినా వింటారా? అనే నిరాశ- నిస్పృహ వద్దు! కొంతైనా ప్రయత్నం చేయాలి! నేను ఎక్కడ ఉంటే అక్కడ ఎంతో కొంత మన జాతీయ భావాల గురించి చెప్తాను. మనమెవరమైనా సరే ఈ సమాజం నాది! ఈ దేశం నాది! ఈ ధర్మం నాది! ఈ సంస్కృతి నాది! అనుకున్న ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళు ఎంతో కొంత తెలిసిన వాళ్ళు చెప్పగలిగిన వాళ్ళు తప్పకుండా చెప్పాలి! పెద్దవారంటారు కదా! చెడు చెప్పకపోయినా పర్వాలేదు కానీ, మంచి తెలిసి చెప్పకుంటే పాపం అవుతుంది. నాకెందుకు అనుకుంటే ఆ మంచి అనేది తెలియక వచ్చే నష్టాలు చాలా ఉంటాయి.
మీ దేవుడేమిటి? అన్ని ఆయుధాలు పట్టుకున్నాడు అంటాడొకడు. చెడు పనులు చేసే శత్రు సంహారానికి ఆయుధం అవసరం అని చెప్పగలగాలి! ఇంకొకడంటాడు నీ కృష్ణుడంత భోగలాలసుడు మరొకడు లేడు! అని అంత మంది భార్యలు అవసరమా?మమ్మల్నంటారు కానీ వాళ్ళ ఇంట్లో వారో? ఇతనో? పుస్తకాలు చదివి నేర్చుకుంటే ఔను కదా! సమాజంలో ఉన్న ఒక దుష్టచర్యను ఆపడం కోసం దేవుడు అలా చేశాడు కదా! అని అనుకునేవారు.
ఏ స్త్రీ మూర్తులైతే బయట పరాభవింపబడి, సమాజంలో ఒక రక్షణ లేకుండా, విలువ ఇవ్వకుండా ఒక సమాజం ఉంటుంది… అదే కృష్ణుడు భార్యకు విలువ ఇస్తాడు. వాళ్లు సమాజంలో విలువ లేని వాళ్లు గా ఉండ కుండా చేసే ఒక కట్టుబాటుగా చేసిన ఒక ప్రక్రియను ర*** అంటగట్టే రాక్షస గుణాలు ఉన్నటువంటి వారికి ఎవరు చెప్తారు?మీరనుకున్నట్టు ఇలా కాదు అని చెప్పడానికి మన ప్రాచీన సాహిత్యాన్ని చదవాలి! లేదా సాహిత్య చర్చలు, ప్రసంగాలు జరిగే చోటుకు వెళ్లాలి! సాహిత్య చరిత్రను వినాలి! పనికిరాని పబ్జీలు వాడేటువంటి పిల్లలను మనం పెంచుతున్నాం! వాడికి ఒక సంప్రదాయ పద్యమో? పాటనో? నేర్పించడం లేదు. ఇది మనం చేసే నష్టం కాబట్టి సాహిత్యానికి ఎదురీదుతున్నామా? అంటే ఎదురీదాలి! కొన్నిసార్లు తప్పదు. అయినా ఎప్పుడూ ఇలాగే ఉండదు. వేల మైళ్ళ దూరమైనా ఒక అడుగుతోనే మొదలవుతుంది కదా! ఒకళ్ళం మొదలుపెడదాము! మనవెంట పదిమంది ఔతారు. నిరాశ ఎందుకు? మనం ఆశాజీవులం. భారతీయులం సనాత ధర్మాన్ని పాటించే వాళ్ళం ఆశాజీవులు గానే ఉండాలి! ఎదురీదుతున్నామని అనుకోకూడదు!

పద్మజ:—- మీకు జ్యోతిష్యంలో ప్రవేశం ఉందని విన్నాను! అది ఎలా హస్తగతం చేసుకున్నారు?

సునీతా రెడ్డి :—- ఉస్మానియాలో M A జ్యోతిష్యం కోర్సు చదివాను. జ్యోతిష్యం చేయడానికి ముందు మా అబ్బాయికి పెళ్లి చేయాలని నేను ఎన్నో సంబంధాలు చూసాను. కానీ కుదరలేదు జాతకరీత్యా వీడికి ఏమైనా లోపం ఉందా? ఎందుకు పెళ్లి కావడం లేదు? మనకు తెలిసిన మహా పండితులు ఎవరున్నారు ? అని వెతికితే సాగి కమలాకర్ శర్మ గారితో మంచి పరిచయం ఉండడం వల్ల ఊరికే అడిగేదాన్ని! అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో జ్యోతిష్యంలో M A చేయవచ్చు అని చెప్పారు. నేను ఎమ్మె చేద్దామని చేరాను. అక్కడ చేరిన తర్వాత తెలిసింది జ్యోతిష్యం అంటే మనం అనుకున్నంత సులువు ఏమీ కాదని, రెండు సంవత్సరాలు MA జ్యోతిష్యం చదివిన తర్వాత నాకు ముందు టేబుల్ (చక్రం) మాత్రం వేయడం వచ్చిందో ఏమో? భావం అంటే ఏమిటి, రాశులు ఏమిటి? నక్షత్రాలు తెలిసాయేమో? అంతే తప్ప ఎంత చదివినా జ్యోతిష్యం పట్ల పట్టు వచ్చినట్టు నాకు అనిపించలేదు అప్పుడు మాకు జ్యోతిర్ విద్యార్ధి అనే పేరుతోనారాయణగూడలోమా గురువులు, పూర్వ విద్యార్థులు పాఠాలు చెప్పేవారు. అక్కడికి వెళ్లి ప్రవేశిక నుండి జ్యోతిష్యం వాస్తు కూడా నేర్చుకోవడం జరిగింది. అందుకే అక్కడ జరిగిన సెమినార్లు బాగా ఉపయోగపడ్డాయి. యూనివర్సిటీలో చదివిన రెండు సంవత్సరాల చదువుతో పాటు అదనంగా ఆరేడు సంవత్సరాలు అదనపు చదువు వల్ల జ్యోతిష్యం వచ్చింది. జాతకాలు పరిశీలిస్తాను! అవసరం ఉంటే చెప్తాను! ఇప్పుడు సంపూర్ణంగా వచ్చిందని చెప్పగలను. తర్వాత వాస్తు శాస్త్రం నేర్చుకోవాలనే జిజ్ఞాస కలిగింది. ప్రవేశిక అడ్వాన్స్ వాస్తు, రెండు కోర్సులు చేసిన తర్వాత అక్కడ పిహెచ్డి (phd ) చేయాలని ఆశ కలిగింది. వాస్తుగురువుగారైన వరప్రసాద్ రావు గారిని అడిగితే రాజా గారని వాస్తు శాస్త్ర నిపుణులున్నారు. వారి దగ్గర వారి గైడెన్స్ లో మీరు పిహెచ్డి చేయవచ్చు అని అంటే ఆగ్నేయ దోషాలు అనే టాపిక్ మీద సిద్ధాంత గ్రంథం రాసాను. అలా రెండవ (పీహెచ్డీ) phd పూర్తి చేసాను.

పద్మజ:— అమ్మా! సునీత గారూ! మీరు ఈ దివ్యజ్ఞాన హైస్కూలు స్థాపనకు కారణమేమిటి? దీని నిర్వహణలో మీ పాత్ర ఏమిటి?

సునీతా రెడ్డి :– దివ్యజ్ఞాన హైస్కూలు స్థాపనకే కాదు! ఈరోజు ఈ పాఠశాలలో ఇలా కూర్చున్నారంటే కారణం దేవుడి నిర్ణయమే! ఒక దైవీ సంభూతమైన యోగం వలె ఒక కూతురును నాకు ఇచ్చాడు భగవంతుడు. అప్పుడప్పుడు ఆయన పరీక్షలు పెడుతుంటాడు. పాప పుట్టింది. నా జీవితంలో విషాదమేమిటంటే మా వారు రైల్వే ఉద్యోగి కనుక రైల్వే ఆసుపత్రికి వెళ్ళాము .కాన్పు కావడం కష్టమై ఆసుపత్రిక వెడితే ఆపరేషన్ కొరకు అనెస్తీషియా ఇచ్చిన తర్వాత ఆక్సిజన్ లేదని ఆపరేషన్ ఆపారు. ఆ మందు ప్రభావం పాపకు మజిల్ సిస్టంపై పడింది.పాప చాలా బలహీనంగా ఉండేది. బిడ్డేమో చాలా తెలివైంది! కానీ శారీరకంగా బలహీనురాలు.
పద్నాలుగు సంవత్సరాలు నా ఒళ్లోనే పెట్టుకొని పెంచుకున్నాను. ఎన్నో రకాల సమస్యలు అక్కడ ప్రారంభమైనవి. పసిపిల్ల మంచి తెలివి కలది చదివించాలని ఆశ! పాపేమో అన్న వలె చదువుతానని చెప్తున్నది. పాపను స్కూల్లో జాయిన్ చేసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే? నడవరాదు కానీ చదివించాలనీ ఇంటికి దగ్గరగా ఉన్న ఒక కొత్త స్కూలుకు పోయి, పాప పరిస్థితి చెప్పి, పాపను జాయిన్ చేసుకుంటే నేనూ తనతో పాటు స్కూల్లో టీచర్ గా పనిచేస్తాను అని అడిగాను.
అప్పటికే నేను ఎమ్మే చేసాను. కాబట్టి స్కూల్ చిన్నది కాబట్టి నన్ను హెడ్మాస్టర్ గా నియమించారు. కేవలం నా బిడ్డ కోసమే! ఉద్యోగం. డబ్బుకు ప్రాధాన్యత లేదు! అందుకే జీతం అడగలేదు ! అలా పాప 5వ తరగతి వరకు వచ్చింది.
అనుకోని పరిస్థితుల వల్ల ఎందుకో నేను అక్కడ ఇమడలేకపోయాను. నా కూతురు కోసం ఒక పాఠశాల పెట్టాలనుకున్నాను నా ఇంట్లోనే పాఠశాల ప్రారంభించాను. మొదట్లో కొద్దిగా ఇబ్బంది అయింది. అయినా అలాగే ఆరవ తరగతి వరకు తరగతులు నడపాలని, నాకు ఐదారు సంవత్సరాల బోధనానుభవం ఉండడం వల్ల ఈ కాలనీలో తెలిసిన వారు ఉండడం వల్ల నా మీద నమ్మకంతో ఇంత చిన్న స్కూల్లో 180 మంది పిల్లలు చేరారు. అలా ఒక్కో సంవత్సరం తరగతులు పెంచుతూ నడిపాను. కేవలం పాప కోసమే కానీ పదవ తరగతికి వచ్చిన తర్వాత పాప చనిపోయింది. అప్పుడు మళ్ళీ స్కూల్ మూసేయాలి ఎందుకంటే? పాప కోసం పాఠశాల ఏర్పాటు చేసాను. ఇక పాపే లేనప్పుడు ఈ స్కూల్ ఎందుకు? అని అనిపించింది.
అప్పుడు మా గురువుగారు కసిరెడ్డి గారు ఏమన్నారంటే “అమ్మా స్కూల్ ప్రారంభించింది పాప కోసం కానీ, పాఠశాలకు పాప పేరు పెట్టావు కదా! దివ్యజ్ఞాన ఆ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది ఉండనీ! ” అని అన్నారు.
ఏమో సార్ నాకట్లా ఆ పేరు చూస్తే చాలా బాధ కలుగుతుంది! నేను నడపలేను అన్నాను. ఈ పాఠశాల వల్ల మనకు ఉపయోగం ఉంది అని అన్నారు.
ఏమి ఉపయోగం సార్? అనడిగాను ” మన దగ్గర చదువుకున్న పిల్లలు బయటకు వెళ్ళి సంఘవిద్రోహులు కాకుండా, జాతీయ భావాలు, ఈ సంస్కారాలు అందించాలంటే ఈ పాఠశాల ఉంటేనే సాధ్యం… ఎన్ని రోజులు నడిస్తే అన్ని రోజులు ఈ పాఠశాలను నడిపించాలి” అని అన్నారు.
సరే అని కొనసాగిస్తే ఈరోజు నా పాఠశాలలో సంస్కృతి- సంప్రదాయాలు పాటించేలా చేస్తాను. అందుకోసం పాఠశాల ముందు చదువుల తల్లి విగ్రహం పెట్టించాను. సరస్వతి ప్రార్థన చేస్తారు పిల్లలు, టీచర్లు. మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు భగవద్గీతలోని బ్రహ్మార్పణం అనే భోజన మంత్రం సాయంత్రం పఠిస్తారు. ఎవరిదైనా ఆ పిల్లల పుట్టిన రోజు వస్తే ఆ పిలల్లలకు వేద ఆశీర్వచనం చేయిస్తాము. సంస్కృతం, ఇంగ్లీష్, హిందీ, తెలుగు నాలుగు భాషల్లో ప్రతిజ్ఞ చేయిస్తాను. రెండు రోజులకు ఒకటి చొప్పున. చిన్న పిల్లలకు ఇంగ్లీష్ మీడియం అయినప్పటికీ కూడా సంస్కృతంలో ఉన్న కౌసల్యా సుప్రజా రామా అనే వెంకటేశ్వర సుప్రభాతం లోని శ్లోకాలు ఎల్కేజీ (Lkg) యూకేజీ ( Ukg )పిల్లలకు నేర్పిస్తాము. ఎందుకంటే భాష ఉచ్చారణ చక్కగా వస్తుంది. భగవద్గీత శ్లోకాలు ప్రతి సంవత్సరం మూడు చొప్పున క్లాసు పెరిగినా కొద్దీ సంఖ్య పెంచుతూ… పదవ తరగతి వరకు సంవత్సరానికి ఒక అధ్యాయం నేర్పిస్తాము.

గీతా జయంతి రోజు భగవద్గీత పఠన పోటీలు ఉంటాయి.
అలాగే విశ్వహిందూ పరిషత్తుతో సంబంధం ఉంది కాబట్టి పరిషత్ లో జరిపించే గీతా పఠనం ఈ జిల్లాలో ఈ ప్రాంతంలో ఉన్న అన్ని పాఠశాలలకు నేనే పోటీలు నిర్వహిస్తాను. రాష్ట్రస్థాయికి పంపించడం బాధ్యత కూడా నేనే తీసుకొని స్కూల్ పిల్లలకు ఫలానా రోజు ఉంటుంది మీరు నేర్పించండి పోటీలలో పాల్గొనేందుకు పంపించండి ! అని తల్లిదండ్రులకు చెప్తాను. జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్నాని చెప్పి, మా స్కూల్లోనే పోటీలకు సిద్ధం చేయించి పాల్గొనేలా ప్రోత్సహిస్తాను. అలాగే మాతృ- పితృ వందన కార్యక్రమం నడిపిస్తాను. ప్రతిరోజు ప్రార్ధన కాగానే పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ కొన్ని నైతిక విలువలు చెప్తాను. అలా సంస్కారాలు నేర్పిస్తూ, మాతృభాషను మరిచిపోకుండా వారికి ముందు ముందు పనికి వచ్చేందుకు చక్కని ఇంగ్లీష్ బోధనలో మిగతా అన్ని సబ్జెక్టులు చెప్పిస్తాను.(ట్రెడిషనల్ టు టెక్నికల్ విద్య) Tredishional to Technicallన Education ఉండాలని ప్రణాళిక రాసుకొని దాని ప్రకారం అలా 28 సంవత్సరాలుగా బోధిస్తూ స్కూలు నడుపుతున్నాము.

పద్మజ:– నేటి సమాజానికి పత్రికల ఆవశ్యకత, పత్రికలు నిర్వహించాల్సిన విషయం, పత్రికాధిపతుల పాత్ర ఎలా ఉండాలంటారు?

సునీతారెడ్డి:– పత్రిక నడవాలంటే ముందుగా చదివే వారు ఉండాలి. ప్రస్తుత కాలంలో బుక్ కల్చర్ లేదు! అంతా లుక్ కల్చర్ అంటే యూట్యూబ్ చూస్తున్న పరిస్థితే ఉంది. అయినా సరే! సంపాదకులు అనగానే మనకేం ఉంటుందంటే సంపాదకీయం విలువైనదిగా ఉండాలనిపిస్తుంది. సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా అంటే దార్షనికత ఉండాలి !
అది కూడా నిర్మొహమాటంగా వీళ్ళు ఏమనుకుంటారో? వాళ్ళు ఏమనుకుంటారోనని
వాళ్ళ- వీళ్ళ మెప్పుకోసం కాకుండా జాతికి, సమాజానికి, ఉపయోగపడేలా పత్రికలో రచనలుండాలి. అక్షరం విలువైనది. సమాజానికి ఆయుధం వంటిది. పత్రిక ఏదో నడుస్తున్నదిలే! నడవనీ అని అనుకోకుండా ప్రతి ఎడిషన్ కొత్తగా ఆ రోజే ప్రారంభమైంది పత్రిక అన్నట్టుగా రాయాలి! పెద్దలు అనే మాట ఒక సిరా చుక్క వెయ్యి మెదడులను కదిలించాలని అలాంటి అక్షరంతో స్వాతంత్రం సాధించడంలోనూ ఎదురొడ్డిపోరాడాయి. ఎన్నో ఉద్యమాలలో కవితలు, పాటలు, మాటలు, ప్రసంగాలు, వ్యాసాలు ఇలా ఏదైనా అక్షరాల కూర్పే కదా !కలాలను కదిపితే కావలసిన ఫలితం వస్తుంది. కాబట్టి సామాజిక, దేశం కోసం, ధర్మం కోసం ఉపయోగపడే విధంగా అందులోని రచనలు రావాలి! అలా పాఠకులు పత్రికను వినియోగించుకోవాలి. ఈ రోజు యువత రచనలు నచ్చితే తప్పక చదువుతారు! కానీ తెలుగు భాష చదివే వారు తక్కువైనారు. కాకపోతే కొంతవరకు మనకున్న భావదాస్యాలు ఉన్నాయి. కాబట్టి అంటే ఇంట్లో తెలుగు మాట్లాడవద్దు! ఇలాంటివి వాటి విలువలు తెలిపే విధంగా రచనలుంటే తల్లులు చదువుతారు .అది నిజమే అనిపించే విధంగా ఉంటే ఆచరణలో పెడతారు. అలా ఊరికే ఉదాసీనంగా మనం రాస్తే ఎవరు చదువుతున్నారు లే! అని మానేయకుండా మనం వంతు ప్రయత్నంగా పత్రికను నడుపుతూనే, సమాజానికి అందవలసినటువంటివి ఏవైతే విలువలున్నాయో వాటిని అందిస్తే… వాటిని ఒక్కరు చదివినా పత్రిక లక్ష్యం నెరవేరుతుంది. ఇక్కడ ఒక చిన్నమాట చెప్తాను!
శివానందుల వారు ఎప్పుడూ పుస్తకాలు రాస్తూ ఉండేవారట. అలా చాలా రాశారు. ఆయన రాస్తున్నప్పుడు పూర్వకాలం కదా! ప్రతిరోజు వచ్చే భక్తులకు పంచేవారట. ఆయన దగ్గర ఉన్న శిష్యులు అడిగేవారట! అయ్యా! స్వామీ! ఇన్ని పుస్తకాలు రాస్తున్నారు, పంచుతున్నారు. ఎవరైనా చదువుతున్నారా? ఏమన్నానా? అని అడిగారట. శివానందుల వారన్నారట చదవకపోతే ఏం చేస్తారు?
శిష్యుడన్నాడట కదా! చదవకపోతే పుస్తకాలన్నీ పాత పుస్తకాలు వాడికి అమ్ముతారట!
మరి వాడు ఏం చేస్తాడు? అని అడిగారు స్వామి! వాడు కిరాణా కొట్టుకు అమ్ముతాడు అన్నాడు. కొట్టువాడు ఏం చేస్తాడు? అని అడిగాడు స్వామి. అంటే అప్పుడు ప్లాస్టిక్ లేవు కనుక కిరాణా కొట్టు వాడు సామాను పొట్లాలు కడతారు అన్నాడట శిష్యుడు.
ఒరేయ్ ఆ పొట్లాలు కట్టిన తర్వాత ఈ పొట్లం ఎవరి ఇంటికి పోతుందో… ఆ ఇంట్లో ఉన్న ఒక్క అమ్మ ఒక్క వ్యాసం చదివితే ఆ వ్యాసానికి ఉపయోగం లేదారా? ఆ పుస్తకానికి విలువ రాదా? అన్నాడట. ఇంతకు మించి నేను ఎక్కువ చెప్పలేను!

నేను ముందే చెప్పినట్టు ఎంతో ఓపికతో మన సందేహాలన్నిటికి ఎంతో ఓపికగా సమాధానమిచ్చిన భేరి సునీత గారి సమాధానాల్లో మనకు కావలసినవి మనం తీసుకోవచ్చు! ఏదైనా సాధించాలనుకుంటే ఏదీ అడ్డంకి కాదని, చదువుకోవాలని ఉంటే వయసూ అడ్డు కాదని, ధైర్యం ఉంటే మనమనుకున్నది సాధించవచ్చని, తనకు వచ్చిన విద్యను సద్వినియోగం చేసుకుంటూ.. అటు చక్కని ఉపన్యాసాలతో సాటివారికి ఎరుక కలిగిస్తూ… ఇటు విద్యా బోధనతో తరువాతి తరాలను చక్కని పౌరులను చేయవచ్చని నిరూపిస్తూ… కేవలం అక్షరాలతో పుస్తకాలు నింపిన రచయిత్రే కాదు! ఆచరణలో పెట్టిన ధీశాలి! మనసు కుంగిపోయిన సమయంలోనూ కూడగట్టుకొని, ఒక కంట కన్నీరు, మరోకంట విద్యార్థులకు పన్నీరు పంచిన మానవతా మూర్తి! శ్రీమతి భేరి సునీత గారి ముఖాముఖితో మనమూ మారడానికి ప్రయత్నిద్దాం!

దారులను రహదారులుగా మలుచుకుందాం!!

Written by Rangaraju padmaja

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

చిత్ర కళ

“ఆమెలు” విశ్వ విజేతలు Cricket 2025 Winners