జరిగినకథ:
ఆమని మనవడి పుట్టినరోజు వేడుకను పూర్తి చేసుకున్న మైథిలి, మాలిని అదే ఊళ్లో ఉంటున్న పద్మిని, చంద్రిక ,హాసినిలను కూడా కలుస్తారు .గతంలో తామంతా ప్రైవేటు జూనియర్ కళాశాలలో కలిసి పని చేసిన కాలపు ముచ్చట్లతో పాటుగా ఇప్పటివరకు తమ పిల్లలపెండ్లిండ్లు మనవళ్ళు, మనవరాండ్ర ముద్దు మురి పాలను కూడా ఒకరితోమరొకరు పంచుకుంటూ తమ సమయాన్ని ఆనందమయం చేసుకొని తృప్తిగా ఎవరిళ్లకు వాళ్లు తిరిగి వెళ్లిపోతారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించలేని మైధిలి, మాలినితమ పాత ఉద్యోగంతోనే కుస్తీలు పడతారు.ఇటు ఇంట్లోనూ అటు బయట సమాజంలోనూ కూడా ప్రభుత్వోద్యోగి కాలేనందున మైధిలి ఎంతో వివక్షకు గురవుతుంది. భర్త అకాల మరణంతో వారసత్వపు క్షేత్రంలో అస్వతంత్రతకు బందీ అవుతుంది.అనుభవసారం ఒంటబట్టించుకున్న రామారావు దంపతుల జీవితం నిత్యవసంత మవుతుంది. హాసిని, చంద్రిక ,శాలిని మేడం గార్లు తమ జీవితాలను ఆక్రమించుకో జూస్తున్న ఆత్మ న్యూ నతా భావాలను సానుకూల దృక్పథంతో తట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు .భర్త యొక్క అనుమానపు జబ్బుకు విసిగి వేసారిన సువర్ణ బొటీక్ పెట్టుకుని స్వావలంబనతో జీవించాలనే స్థిర నిశ్చయంతో బెంగళూరులో ఉంటున్న తన కొడుకులు దగ్గరకు వెళ్ళిపోతుంది.
నానా తిప్పలు పడుతూ చంద్రిక ఎట్లాగైతేనేం ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా ఉద్యోగం సంపాదించుకుని కుటుంబ భారాన్ని మోస్తూ పిల్లల్ని చదివించి ప్రయోజకులుగా తీర్చిదిద్దుతుంది.భర్త శుక్లపక్షపు చంద్రుడే ఎప్పుడూ.పరాధీనగా ఇబ్బందులు పడుతున్న మాలిని తన స్వంత ఇంటికి వచ్చేస్తుంది.మాయాద్వీపాన్ని తలపించే అత్తారింటి బంధువర్గంతో తులసి మొక్క లాంటి మైథిలి పలు వివక్షలకు,అవమానాలకు గురౌతుంది.ధైర్యంచేసి భర్త ప్రకాష్ ముందు అతని అక్కా,చెల్లెళ్ల నిజస్వరూపాలను బైట పెట్టటంతో కనువిప్పు కలిగి నిజానిజాలను చూడగలుగుతాడు.సువర్ణయొక్క టైలరింగ్ దుకాణం దినదినాభివృద్ధి చెందుతుంటుంది. మైథిలి వుంటున్న ఊరికే కమలకు ప్రమోషన్ వస్తుంది.భార్యలేనిలోటు ఏనాటికీ పూడ్చలేనిదని ఆలస్యంగానైనా తెలుసుకున్న నాగూ పశ్చాత్తప్తుడై భార్య సువర్ణ వద్దకే చేరుకుంటాడు.)
ఇక చదవండి..
‘‘నాగూ… ఒరేయ్ నాగూ’’ అని తలుపు తట్టినా, తీయకపోయేసరికి, గట్టిగా కాలింగ్ బెల్ నొక్కారు.
నెమ్మదిగా వచ్చి, తలుపు తీశాడు నాగూ ఉరఫ్ నాగేశ్వర్రావు, లోపలికి రమ్మని సైగ చేశాడు దోస్తులకు.
వీళ్లు తరచుగా బైటో లేదా ఏ సెంటర్లోనో, కాఫీ కేఫ్‌లోనో కలుస్తుంటారు. ఏ రెండు మూణ్ణెల్లకో ఒకసారి ఇండ్లకెళ్లి కలిసి మాట్లాడుకోవటం, వాళ్ల వాళ్ల కుటుంబ సభ్యుల్ని పరామర్శించటం మామూలే. అందులో భాగంగానే ఇప్పుడు నాగేశ్వర్రావు ఇంటికొచ్చారు ఆ ముగ్గురు ఫ్రెండ్స్.
మా ఆవిడ లేదు, పిల్లల దగ్గరకు వెళ్లిందని చెప్పటంతో వీళ్లింటికి రాక చాలా రోజులైంది. ఇదిగో ఇప్పుడొచ్చారు.
‘‘ఏరా! ఏంటి అంత డల్‌గా ఉన్నావ్?’’ అని ఆ దోస్తుల్లో ఒకరైన ఫణిభూషణం అడిగాడు నాగూని.
‘‘అవును. బాగా నీరసంగా ఉంటోంది. ఎలాగూ మూడు నెలలకు ఓసారి, రెగ్యులర్‌గా అన్ని చెకప్స్ చేయించుకుంటాగదా! అలాగే నాల్గు రోజుల క్రితం ఆసుపత్రికి వెళ్లొచ్చా’’ అని చెప్పాడు నాగూ, ఫణిభూషణంతో.
‘‘అన్నీ నార్మల్‌గానే వచ్చాయా రిపోర్ట్స్’’ అని అడిగాడు ఇంకో దోస్త్ శివరావు.
‘‘ఆ… బి.పి. నార్మల్‌గానే ఉందిగాని, షుగర్ రొండొందలు ఉంది. చెడు కొలెస్ట్రాల్ కూడా ఉండాల్సిందానికంటే నలభై పాయింట్లు ఎక్కువ ఉంది’’ అని చెప్పాడు నాగూ, శివరావుతో.
‘‘అసలు నీకు షుగర్ లేదు కదరా?’’ అని అడిగాడు మరో దోస్తు విజయారావు.
‘‘అవున్రా… ఈమధ్య హోటల్ ఫుడ్డు తింటున్నా. పడటం లేదు. ఈ షుగర్ కంట్రోలవటం కోసం మందలు వాడుతున్నా, డాక్టరుగారు రాసిచ్చినవి’’ అని జవాబు చెప్పాడు నాగూ.
‘‘ఏరా? చెల్లెమ్మ ఇంకా రాలేదా ఊరినుంచి?’’ అన్నాడు ఫణిభూషణం.

‘‘లేదురా’’ అన్నాడు మొహమంతా గంటు పెట్టుకుని. అసలు ఈ ప్రసక్తి రావటమే, వినటమే ఇష్టంలేని వాడిలాగా.
‘‘అదేంటిరా? మరి చాలా రోజులైందిగా’’ ఫోన్ చెయ్యలేదా రమ్మనమని?’’ అని నిలదీశాడు శివరావు.
జవాబేం ఉందని చెప్పటానికి నాగేశ్వర్రావు దగ్గర. మొహం వేలాడేసుకుని కూర్చున్నాడు, తప్పుచేసినవాడిలాగా.
ఇల్లంతా పరికించటం మొదలుపెట్టాడు విజయారావు. ఇల్లాలు లేని ఇల్లు ఎంత కళా విహీనంగా ఉంటుందో అలాగే ఉంది అచ్చు ఆ ఇల్లు.
‘‘చెల్లెమ్మ ఉంటే, ఈపాటికి టీ వచ్చేదిరా మనందరికీ’’ అని అన్నాడు శివరావు నవ్వుతూ.
‘‘ఇంటి గేటుదాటి లోపలికి వస్తుంటే, చెత్తాచెదారం కనపడిరది. అదే చెల్లెమ్మ ఉంటే ముగ్గులు వేసి కళకళలాడుతుండేది’’ అన్నాడు మళ్లీ శివరావు కావాలనే.
పిల్లికి చెలగాటం, ఎలుకకి ప్రాణ సంకటంలాగా ఉంది నాగూ పరిస్థితి. ఏ జవాబూ చెప్పలేకపోతున్నాడు నాగూ.
‘‘ఏంట్రా మళ్లీ మీ భార్యాభర్తల మధ్య ఏమైనా గొడవలైనాయా? అని అడిగాడు విజయారావు.
ఏం లేదురా… అన్నట్లు చూశాడు నాగేశ్వర్రావు.
ఒకసారిలాగే బాగా పెద్ద గొడవలైపోయి పుట్టింటికి వెళ్లిపోతానని సువర్ణ పట్టుబట్టటంతో పెద్ద మనుష్యులని పిలువబడే ఈ ముగ్గురు మహామహులే సర్దిచెప్పి, ఈసారి ఇలాంటి గొడవ రాదని నాగూ తరపున హామీ ఇస్తే ఆగిపోయింది సువర్ణ వాళ్లమీద నమ్మకంతో.
కానీ దాలిగుంటలో కుక్కబుద్ధి లాంటిది నాగూది. కుక్కది ఎక్కే గుమ్మం, దిగే గుమ్మం. అందరూ ఛీ… ఛీ… అని తిడుతున్నారు.
ఇక నేను ఏ ఇంట్లోనూ జొరబడనని అనుకుంటుందట ఆ గుంటలో పడుకుని తోకవూపుకుంటూ. ఆ గుంటలోంచి పైకి రాగానే తోకకున్న మట్టిని దుపులుకుంటూ చేసుకున్న నిర్ణయాన్ని కూడా దులిపేసుకుని మర్చిపోయి మళ్లీ మొదటికే వస్తుందట. అలా ఉంటుంది ఎప్పుడూ నాగేశ్వర్రావు ప్రవర్తన.
‘‘ఈ నాగేశ్వర్రావుగాడికి అనుమానమెక్కువ. మనిషి బంగారమే కాదు, అందకంటే మంచి మనసున్న చెల్లెమ్మ సువర్ణ దొరకటం వీడి అదృష్టమని ఆ దోస్తులు ముగ్గురూ విడిగా ఉన్నప్పుడు అనుకుంటారు. తిట్టుకుంటూనే ఉంటారు సదరు నాగు గురించి. కానీ మొదటిసారంటే సర్ది చెప్పారు ఆ అమ్మాయి సువర్ణకు. ఎన్నిసార్లని సర్దిచెబుతారు. చెప్పినా నమ్ముతుందా తమని.
‘‘సరేరా! జాగ్రత్తగా మందులు వాడుకో. టైం ప్రకారంగా అన్నం, పండ్లు అవీ తింటుండు’’ అని జాగ్రత్తలు చెప్పి బైల్దేరారు అక్కడి నుంచి ఫణిభూషణం, శివరావు, విజయారావులు.
‘‘వీడి ధోరణే వీడిది. ఏదన్నా చెబితే ఊ… కొడతాడు, వినడు చావడు వెధవ’’ అని పైకే తిట్టాడు శివరావు, నాగూని.
‘‘వీడి అనుమాన రోగం వదిలితేనే వీడి జీవితం బాగుపడుతుంది. అందాకా వీడిగతి ఇంతే’’ అన్నాడు ఫణిభూషణం.
‘‘ఇప్పటికైనా బుద్ధొస్తుందో రాదో వెధవకి’’ అని కసురుకున్నట్లుగా అన్నాడు విజయారావు.
ఏదిఏమైనా వీడిగా వీడికి బుద్ధొచ్చేవరకు వీణ్ణి కలవటానికి వెళ్లినా దండగే. ఆ అమ్మాయిని బ్రతిమాలి తెచ్చి, కూర్చోపెట్టి మాట్లాడినా అనవసరమే. అనవసరంగా చెప్పితే మన పరువే పోతుంది’’ అన్నాడు శివరావు గతంలో పంచాయితీ పెట్టి మాట్లాడినప్పుడు లేడీస్ గదా! మనతో మనసు విప్పి అన్నీ ఫ్రీగా మాట్లాడలేరు అనుకుని అప్పుడు తన భార్యను కూడా తీసుకెళ్లాడు నాగూ వాళ్లింటికి.
పంచాయితీకి ముందు శివరావు భార్య వర్ధని సువర్ణను ఒక గదిలోకి తీసుకెళ్లి అన్ని వివరాలు అడిగి తెలుసుకుని, సువర్ణతో మాట్లాడటం అయిపోగానే శివరావును పక్కకు పిలిచి విన్న విషయాలన్నీ చెప్పింది వర్ధని.
ఆ విషయాలన్నీ శివరావు, ఫణిభూషణం, విజయారావులతో చెప్పగా నాగూ మీద ఏహ్యభావం కలిగినా స్నేహితుడు కదా, వదులుకోలేరు! ఆ ఒక్కటి తప్ప… అని అంటారే అలాగ… అనుమానం తప్ప, అన్నీ మంచి గుణాలే నాగూగాడిలో అనుకుంటారు అప్పుడప్పుడూ.
ఎందుకో ఇదివరకు లాగా నాతో మంచిగా మాట్లాడలేదు మావాళ్లు అనుకున్నాడు మనసులో. వాళ్లు తనతో మాట్లాడిన సంభాషణంతా కండ్ల ముందు సినిమా రీళ్లలాగా మెదలసాగింది. అవును… నేనేమన్నా సువర్ణ కిమ్మనకుండా నాకేది కావాలో అది టైముకి సమకూర్చేది. నేను కసురుకున్నా, తిట్టినా తిరిగి పల్లెత్తు మాట కూడా రువ్వేది కాదు. పైపెచ్చు నేనెక్కడ అన్నం తినకుండా పస్తుతో పడుకుంటానేమోనని అన్నీ నా గదిలో టీపాయ్ మీద సర్దేసి వెళ్లేది. కనీసం మంచినీళ్లు తాగుతావా? అని అడిగే నాధుడే లేడు ఇప్పుడు. ఇంతకుముందు క్లోజ్‌గా, ఆప్యాయంగా మాట్లాడే ఫణి, శివరావు, విజయారావులుకి ఫోన్ చేస్తే మొక్కుబడిగా మాట్లాడుతున్నారు. పనమ్మాయిల్ని పెట్టుకున్నా ఒక్కళ్లు తిన్నగా పదిరోజులైనా చెయ్యకుండా మానేస్తున్నారు. హోటల్ తిండి పడట్లేదు. తలగడ కిందనే ఉన్నాయి మాత్రలన్నీ. తీసి వేసుకోవాలనే ఇచ్చ కూడా ఉండటం లేదు. భోజనం ఆర్డర్ పెట్టుకుంటున్నాడుగాని, రోజూ ఒకేరకం కూరలు నోటికి పోవట్లేదు. పచ్చిపులుసు బాగా ఇష్టం. కానీ ఏ హోటలు వాడు పోస్తాడు పచ్చిపులుసు. ఇంత రసం పార్శిల్ కట్టిపడేస్తాడు మొహాన. రోజూ బైట తిండి మూలంగా ఉన్న జబ్బులకు తోడుగా గ్యాస్ చేరి చాలా అవస్థ పడాల్సొస్తోంది అని వాపోతున్నాడు మనసులో నాగేశ్వర్రావు.

ఇంతలో కరెంటు పోయింది. జెనరేటరుందిగదా… ఫ్యాన్లు ఎందుకు తిరగట్లేదోననుకుని పైన ఫ్యాన్‌ని చూశాడు. డిస్ట్రిల్ వాటర్ అయిపోయినట్లుంది జెనరేటర్లో. సువర్ణ ఉండి ఉంటే తనే చూసుకునేది అన్నీ… నా మట్టిబుర్రకు ఇంత చిన్న విషయం కూడా తట్టనందుకు తనమీద తనకే కోపం వస్తోంది. ఇదేకాదు ఏ విషయం ఆలోచించినా కోపం, చిరాకు, విసుగు ఎక్కువై నిస్సహాయంగా మారిపోతున్నాడు. అంతా శూన్యంలా అనిపిస్తోంది మనసుకు. వరండాలోకి వచ్చి కూర్చున్నాడు నాగూ.
సువర్ణ వెళ్లిపోయి దాదాపు పదినెలలు దాటిపోయింది. ఫోన్ చేసినా పిల్లలు కడా ఏదో బొటాబొటిగా మాట్లాడి పెట్టేస్తున్నారు. ఇంతకుముందు ఎంతో ప్రేమగా మాట్లాడే పిల్లలు… చీదరింపు స్వరంతో మాట్లాడుతున్నారు తప్పదన్నట్లుగా. చిన్నోడు నవీవనయితే ఒక్కోసారి కాల్ కూడా లిఫ్ట్ చెయ్యట్లేదు. ఇవన్నీ తలుచుకుని తనను తాను ఆత్మవిమర్శ చేసుకోవటంలోకి జారిపోయాడు నాగు.
అవును నేను క్షమించరాని తప్పులు ఎన్నో చేశాను సువర్ణ విషయంలో. ఎన్నో విధాలుగా నావైపే మనును గాయపరిచాను. అనుమానం అనే దయ్యం పట్టి పీడిరచిందిన్నాళ్లూ నన్ను. ఇటు స్నేహితులు, అటు కుటుంబ సభ్యులు అందరూ తన వేపే వేలు చూపించి హేళన చేస్తున్నారు. ఇంటి చుట్టుపక్కలవాళ్లు, వీధిలో వాళ్లు కొంతమంది చూసీ చూడనట్లు తప్పుకు తిరుగుతుంటే, ఇంకొందరు ఛీత్కార భావంతో చూస్తున్నట్లు తనకు తెలిసిపోతోంది.
ఫ్యాన్ తిరుగుతున్న శబ్ధం వినిబడుతోంది. కరెంటు వచ్చిందనుకుంటా అనుకుంటూ లేచిన నాగు కాళ్లకింది వడిలిపోయి, ఎండిపోయి రాలిన ఆకులు తగులుతుంటే నా బ్రతుకు కూడా ఇలాగే రాలిపోతుంది కొద్దిరోజులు ఇలాగే
ఉంటే. నో… నో… అలా కాకూడదు. నేను రేపే సువర్ణ దగ్గరకెళ్లి క్షమించమని ప్రాధేయపడతాను. క్షమించేవరకు అస్సలు ఆ గుమ్మం వదిలి రాను అని గట్టిగా తీర్మానించుకున్నాడు మనసులో. పశ్చాత్తాపం మొదలైంది నాగేశ్వర్రావులో. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం మరేదీ లేదంటారు, అది నాగూ విషయంలో మరోసారి ఋజువయింది.
ఎప్పుడైతే నాగేశ్వర్రావు తన తప్పులు తెలుసుకుని పశ్చాతప్తగా మారాడో అప్పుడు అతనికి వెయ్యి ఏనుగుల బలం వచ్చి చేరినట్లయింది. దబదబా నాల్గు జతల బట్టలు ఇస్త్రీ చేసుకుని, ఓ చిన్న బ్యాగ్‌లో సర్దుకుని, ఆ నైట్‌కే బెంగుళూరు బస్సెక్కేశాడు. రైలుకు రిజర్వేషన్ చేయించుకుందామనిగానీ, లేదా వేరే ఆలోచన ఏమీ చెయ్యలేకపోతున్నాడు. ఒక్కటే ఆలోచన. సువర్ణ… సువర్ణ. ఎంత త్వరగా వెళ్లి ఆమె సమక్షంలో వాలి క్షమార్పణ కోరదామా అనే తపన ఉంది నాగేశ్వర్రావులో.
* * *
పేదరికంలో పుట్టినా కమల చిన్నప్పటినుండి చదువులోనూ, కో కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నిట్లోనూ చురుకే. పాటలు కూడా వినసొంపుగా పాడుతుంది, సంగీతం నేర్చుకోకపోయినా. ఇన్ని విషయాల్లో నైపుణ్యం సాధించినా, కించిత్తు గర్వమనేది పొడసూపని వ్యక్తిత్వం. నాకు ఇంటర్‌లో పరిచయమైంది. నాలుగైదు మార్కుల తేడాతోటే ఉండేవాళ్ల అన్ని సబ్జెక్టులలో. అందులోనూ మా ఇద్దరిదీ ద్వితీయ భాష హిందీ అవ్వటంతో మా గ్రూపు బై.పి.సి నుండి ముఖ్యంగా అమ్మాయిల నుండి, మేమిద్దరమే హిందీ తరగతికి కలిసివెళ్లి, కలిసి రావటంతో కొద్ది రోజుల్లోనే జిగరీ దోస్తులమైపోయాము ఇద్దరం.
కమల తండ్రిది చాలా చిన్న ఉద్యోగం. వాళ్లమ్మగారు పచ్చళ్లు తయారుచేసి, అమ్మటం, విస్తళ్లు కుట్టి అమ్మటం లాంటివి చేసేవారు. ఏదో వేన్నీళ్లకు, చన్నీళ్ల మాదిరిగా కమల వాళ్ల నాన్నగారి సంపాదనకు, వాళ్ల అమ్మగారి చిరు సంపాదన ఆదరువుగా మారేది. మేం చదువుకునేటప్పుడు వాళ్ళింటికి వెళ్తుండేదాన్ని. గడిపేది బీదరికమైనా ఇంటికొచ్చిన వారిని ఆదరించటంలో అభిమానంగా చూడటంలో ఈ కుటుంబానిదే పైచెయ్యి అన్పిస్తుంది నాకు. కమల వాళ్ల నాన్నగారు కూడా అంతే! ఏరా మైథిలీ బాగున్నావారా? ఎలా చదువుకుంటున్నారని పలకరించి మాట్లాడేవారు వాత్సల్యంగా. కమలా, నేను కాలేజీ కబుర్లు చెప్పుకుంటుండగానే వాళ్ళమ్మగారు చిరుతిండి ఏదో ఒకటి తెచ్చిచ్చి మేం తినేవరకు వదిలేవారు కాదు. ఇక పది నిముషాలు అవుతుంతో లేదో అంతలోనే వాళ్ళ నాన్నగారు బైటికెళ్లి ఆలూ బజ్జీలో, పకోడీలో ఏదో ఒకటి తెచ్చిచ్చేవారు మాకు. ఆయన బయటకు ఎప్పుడు వెళ్ళేవారో ఏమో తెలిసేది కాదు మాకు. మేము అంతగా కబుర్లలో పడి మునిగిపోయే వాళ్లము.
తెచ్చిన పొట్లాలు విప్పి, మాకు ప్లేట్లలో పెట్టి తినమనేవారు మళ్లీ ఆంటీ. ‘మా నాన్నగారంతే… చిటికలో వెళ్లి తీసుకొచ్చేస్తారు తినటానికి. తినాల్సిందే. తప్పదన్నట్లుగా నా ముందు పెట్టిన ప్లేటు వైపు, నా ముఖం వైపు పదే పదే మార్చి చూస్తూ నవ్వేది కమల.
తియ్య తియ్యని కబుర్ల పాకంలో వేడి వేడి స్నాక్స్‌ను అద్దుకుని తింటుంటే ఆ మజానే వేరప్పా!…
డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉండగా హార్ట్ ఎటాక్ వచ్చి, కమల వాళ్ల నాన్నగారు చనిపోవటంతో, గత్యంతరం లేని స్థితిలో వాళ్ళ మేనమామ పంచన చేరారు కమల, వాళ్లమ్మగారు.
మేనత్త గయ్యాళీ రకమైనా, మేనమామ గంగాధరం మంచి మనస్తత్వం వల్ల కమల డిగ్రీ పూర్తి చేసుకోగలిగినట్లుగా అర్థమైంది తర్వాత.
అప్పుడప్పుడు లెటర్సు రాసుకునేవాళ్లం కమలా, నేనూ. తనకు చదువుకోవాలనే ఆసక్తి ఉన్నా, మేనమామ నచ్చచెప్పటంతో పెద్దలు తెచ్చిన సంబంధం చేసుకుంది కమల. పెండ్లయ్యే నాటికి కమల వయస్సు ఇరవయ్యో, ఇరవై ఒకటో ఉంటాయి అంతే. ఇప్పటి పిల్లలతో పోల్చి చూస్తే కనీసం పై చదువులు కూడా పూర్తికావు. కానీ మా అప్పుడు అట్లా కాదుగా!
కమల నుండి క్రమం తప్పకుండా వచ్చే ఉత్తరాలు, కమలకి వివాహం అయిన తర్వాత క్రమేపీ తగ్గుతూ వచ్చాయి.
ఉన్నవాళ్ళ సంబంధం. కోరికోరి వచ్చారు. పిల్ల సుఖపడుతుందని ఇచ్చిచేశాం గానీ, అల్లుడిరత శాడిస్టు అని తెలిసి, మా అమ్మ బాధపడుతోందని, ఇంటికి తీసుకు వచ్చేద్దామంటే అప్పటికే కమల గర్భిణీ అని తెలిసిందని ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నట్లుగా తన మేనమామ బాధపడుతున్నట్లుగా తెలిసి మౌనంగానే బాధల్ని దిగమింగుకుని రోజులు గడుపుకుంటానని ఒక ఉత్తరంలో రాసింది కమల మైథిలికి.
మరోసారి కమల నుండి వచ్చిన ఉత్తరం నన్ను బాగా గాబరాకు గురిచేసింది. వెంటనే నేను ‘చేబ్రోలు’కు ప్రయాణమయ్యాను. కమలావాళ్ల అమ్మమ్మగారి ఊరదే. వాళ్ళ మామయ్య గంగాధరం గారు ఉండేది కూడా అక్కడే. ఉమ్మడి కుటుంబం. బాగా కలిగిన కుటుంబం కాదుగానీ, కమలా వాళ్ళంత పేదరికమూ కాదు. మధ్యస్థంగా ఉంటుంది.
వెళ్లగానే నన్ను చూసి అమాంతం వాటేసుకుని ఎక్కెక్కి ఏడ్చింది కమల. భుజం తడుతూ ఊరడిరచాను. కమలా వాళ్లమ్మగారు మంచంలో పడ్డారు, మనోవ్యాధితో. మన స్వంతిల్లు గాకుండా ఎక్కువ రోజులు ఎక్కడవున్నా, ఆదరణ స్థానంలో అనాదరణే దక్కుతుందనటానికి చిహ్నాలుగా మిగిలిపోయారు కమల వాళ్లమ్మగారు. మంచివాళ్లకే ఆ దేవుడు పరీక్షలు పెడతారంటారు. ఇది కమల విషయంలో ఋజువైంది.
‘‘ఒంట్లో బాగున్నప్పుడు అమ్మ కూడా కష్టపడి పదో, పరకో ఎంత వచ్చినా మావయ్యకి ఇచ్చేసేది. అవి మా అత్తకు చేరేవి నేరుగా. అంతవరకూ రోజులు ఫరవాలేదు, కుంటినడకగానైనా నడిచేవి. ఇప్పుడు అది కూడా లేదు’’ అని బాధ పడిరది కమల నాతో చెప్పుకుంటూ.
ఇంటికి వెళ్లిన నాకు మర్యాదకైనా కనీసం ‘టీ’ తెచ్చివ్వలేదు కమల వాళ్ల మేనత్త అయిన నాగమణమ్మ. వాళ్ల మామయ్య మాత్రం పలకరించి కుశల ప్రశ్నలు వేసి, భోజనం చేసి వెళ్లమ్మా… అని చెప్పి తాను ఎప్పుడూ చేసే కార్పెంటరీ పనికి వెళ్లిపోయాడు.
కమల పిల్లలిద్దరూ బైటవున్న వేపచెట్టు క్రింద ఆడుకుంటున్నారు. ఎంతో అపురూపంగా పెరగాల్సిన పిల్లలు దుమ్ములో, ధూళిలో మాసిపోయిన గుడ్డలతో చిన్న చిన్న రాళ్ల ముక్కల్ని పేర్చుకుంటూ ఆడుకుంటున్నారు. బట్టలకే మాలిన్యం అంటింది గానీ, ఆ పిల్లల మొహాల్లో మచ్చుకైనా మలినం లేదు. చీకూ, చింతాలేని బాల్యం అంటారు అదేనేమో. వాళ్లను చూడగానే ఉసూరు మనిపించింది. నేను కొనుక్కెళ్లిన బొమ్మలు, బిస్కెట్ ప్యాకెట్లను వాళ్ల చేతికిచ్చా.
‘అయ్… బొమ్మ… బొమ్మ. ఆలుకుంతాం’ అని చెరోబొమ్మ తీసుకుని తుర్రుమంటున్న వాళ్లని పిలిచి ఒక ప్యాకెట్ ఓపెన్ చేసి, చెరో నాలుగు బిస్కెట్లిచ్చింది కమల పిల్లలిద్దరికీ.
‘‘ఒక్కసారి వాష్‌రూమ్ కెళ్లాలి కమలా’’ అని అనటంతో కమల గాబులోంచి ఒక లోటా నీళ్ళు ముంచి మైథిలి చేతికిచ్చి, వాష్‌రూమ్‌వైపు వేలుపెట్టి చూపుతూ, ఏమన్నా విడిచిన బట్టలున్నాయేమో… బాగోదు… తీసేద్దామనే ఉద్దేశ్యంతో కమల వాష్‌రూమ్‌లోకి వెళ్లింది. ఏదో చెప్పాలనుకుని చెప్పలేక, వెక్కిపడుతున్న కమలని చూసి మైథిలి కూడా లోనికెళ్లి సముదాయించింది కమలని.
కమల తన వీపు వెనుక వైపున ఉన్న జాకెట్టును నెమ్మదిగా పైకి జరిపి మైథిలికి చూపించింది. వీపునిండా కాల్చిన సిగరెట్ గుర్తులు. వాటిని చూడగానే మైథిలి కళ్లలో నీళ్లు చిప్పిల్లాయి. మోకాళ్ల క్రింది భాగంలో పిక్కల మీద, పైభాగాల్లో తొడల మీద ఉన్న కాలిన గుర్తులను కూడా చూపటంతో కమల భర్త ఎంత శాడిస్టో అర్థమైంది నాకు. వక్షోజాల మీద కూడా ఖాళీజాగా అనేది లేకుండా ఎలా సిగరెట్‌తో కాల్చాడో చెప్పి ఏడ్చింది కమల.
ఇవేకాదు మైథిలీ, ఒక్కడే కొడుకు. తల్లి మాట కూడా లెక్కచేయనంత గారబం, మా ఆయనలో మఠం వేసుకుని కూర్చుది. పెళ్లైన పదహార్రోజుల పండుగ వరకు నాతో బాగున్నాడేమో అంతే. తర్వాత వాడి నిజస్వరూపం బైట పడిరది. తప్పతాగి రావటం, బూతు సినిమాలు చూసి రావటం, అందులో చూసినవి చూసినట్లుగా నాతో ప్రవర్తించటం, ఒప్పుకోకపోతే చెయ్యి చేసుకోవటం, సిగరెట్లతో కాల్చటం, ప్రైవేటు పార్ట్సు మీద మందుబోసి పుండ్లు పడేట్లు కొరకటం… నానా చిత్రహింసలూ పెట్టటం చేసేవాడు. మా అత్తగారితో చెబుతుంటే ‘ఆ… ఏం కాదులే’ అన్నట్లు తీసిపారేసి మాట్లాడుతుండేది. అన్నీ పంటి బిగువున భరించా మైథిలీ…’’ అని చెబుతూ,
‘‘నెలతప్పిన విషయాన్ని చెప్తే, ఆనందిస్తాడనుకున్నా, ఒక్కరోజే ఆ మురిపెం. మళ్లీ మామూలే. ఆ తల్లి ఏం తల్లోగానీ… కొడుకుని ఏమాత్రం గద్దించేది లేకపోగా పైగా నాకే సర్దిచెప్పేది. రాను రాను నాకు అర్థమైపోయింది, ఆ ఇంట్లో మా అత్తకు నేనొక పనిమనిషినని. నా మొగడికొక అవసరాలు తీర్చే భోగవస్తువునని. చివరకు ఏమాత్రం తమ ప్రవర్తనను మార్చుకోవటానికి ఇష్టపడని ఆ మనుష్యుల మధ్య
ఉండటం కన్నా, బిచ్చమెత్తుకుని బ్రతకటం నయమని వచ్చేశా ఇక్కడికి’’ అని చెప్పింది కమల, కండ్ల నీళ్లు తుడుచుకుంటూ.
‘‘తీరా ఇక్కడికొచ్చాక చూస్తే అమ్మ మంచంలో. అత్తయ్యేమో మామయ్య నెత్తికెక్కి కూర్చుంది. తిరిగి ఆ నరకంలోకి వెళ్లలేను. ఇదీ పరిస్థితి అని విడమరచి చెప్పినా మా అత్తయ్య మనసు కరగలేదు సరికదా! మరీ పెడసరంగా ప్రవర్తిస్తోంది ఇంట్లో. మామయ్యది అగమ్యగోచరం. మీ అత్తయ్యతో గట్టిగా మాట్లాడితే నీకు ఈ ఆసరా కూడా ఉండదన్నట్లు చూస్తాడు నావైపు జాలిగా. మామయ్య మాత్రం ఏం చేస్తాడు చెప్పు’’ అంది నాతో వేదనగా.
‘‘నేను డిగ్రీ సర్టిఫికెట్‌తో చిన్న ఉద్యోగాలైనా సరే అని ప్రయత్నం చేస్తున్నా. స్పోర్ట్ కోటాలో మెరిట్ పాయింట్స్ మీదుగా వస్తాయి గదా జాబ్స్’’ అంది కమల నాతో.
అవును. ‘ఆర్చరీ’లో వేరే స్టేట్స్‌కు కూడా వెళ్ళి గెలిచి మెడల్సు సాధించిన కమల, ఈరోజు ఖాళీ చేతులతో నిలబడటం చూస్తే గుండె తరుక్కుపోయింది నాకు.
నాగమణమ్మ వంటగదిలోంచి గిన్నెలు డబడబా కావాలనే పడేస్తూ చేస్తున్న శబ్దం నా చెవులకు సోకింది. అయిష్టాన్ని గ్రుమ్మరించే సిగ్నల్ అది. అర్థమైంది మాకు, నెమ్మదిగా ఇంట్లో కొచ్చాము ఇద్దరం.
మంచంలో పడుకున్న వాళ్లమ్మగారికి పండ్లు కొనుక్కోమని రెండువేలు చేతిలో పెడుతుంటే, ససేమిరా వద్దంటే వద్దంది. నేనే బలవంతంగా ఆమె తలగడ కింద ఆ డబ్బు పెట్టేసి, బాగోదని కమల వాళ్ల మేనత్తకి ‘వెళ్లొస్తా ఆంటీ’ అని చెప్పి బైల్దేరాను.
చెట్టు క్రింద ఆడుకుంటున్న పిల్లలిద్దర్నీ లోపలికి వాళ్ళ అమ్మగారు పడుకున్న మంచం దగ్గరకు తీసుకొచ్చి, ఇక్కడే కూర్చోండి, బైటకు రావద్దని చెప్పి నన్ను సాగనంపటానికి నాతోపాటు వాకిట్లోకి వచ్చింది కమల.
‘‘మరి మీ అత్తగారూ వాళ్లు, మీ ఆయన గానీ ఎవరూ రాలేదా మిమ్మల్ని తీసుకువెళ్లటానికి’’ అనడిగాను కమలని.
‘‘రెండుసార్లొచ్చారు, పంచాయితీ పెట్టారు. నువ్వు పిల్లల్ని తీసుకుని రాకపోతే మావాడికి ఇంకో పెళ్లి చేస్తానని బెదిరిస్తూ వాళ్ల బంధువులతో ఉత్తరం కూడా రాయించింది’’ అంది కమల.
‘‘మరి మీ మామయ్య ఏమన్నాడు’’ అని అడిగా కమలని.
‘‘ఏం అవసరం లేదు అక్కడకి! శుభ్రంగా చదువుకున్న పిల్ల, కాస్త పిల్లలు పెద్దవాళ్లయితే అదే ఏదో చిన్నో చితకో ఉద్యోగం సంపాదించుకోలేకపోలేదు. పంపమని తేల్చి చెప్పేశాడు వాళ్ళకి.’’ అంది కమల.
‘‘దీనికి మీ మేనత్త రెస్పాండ్ ఏవిధంగా ఉంది కమలా?’’ అంది మైథిలి అనుమానంగా.
‘‘ఇప్పుడు మా అమ్మతోపాటుగా మా ముగ్గుర్నీ కూడా అదనంగా పోషించాలంటే ఎవరు మాత్రం ఒప్పుకుంటారు. మా అత్తయ్య కూడా అదే అభిప్రాయాన్ని వెళ్లగక్కింది అక్కసుతో. నేను ఇక్కడుండటం ఆవిడకి ఏమాత్రం ఇష్టం లేదు’’ అంది కమల.
‘‘అమ్మకి కొంచెం ఒంట్లో నయం కాగానే నా ఉద్యోగం కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తా. అప్పుడు పిల్లల్ని చూసుకోవటానికి అమ్మ ఉంటుంది. ఏ ఇబ్బందీ ఉండదు మైథిలీ’’ అన్నది కమల.
‘‘ఏమిటీ పిచ్చి వాలకం. తైల సంస్కారాన్ని మానేసిన జుట్టు ఎర్రగా ఒకలాంటి జేగురు రంగులోకి మారిపోయింది. నీమీద నువ్వు శ్రద్ధపెట్టు. చిన్న పిల్లలిద్దరున్నారు. వీరి బాధ్యత నీమీదే ఉంది. గుర్తు పెట్టుకో. బలవంతంగానైనా నాలుగు ముద్దలు తినాలి. ఇలా చిక్కి శల్యమైపోతే ఎట్లా? చెప్పు’’ అన్నా కొంత అనునయిస్తూ మందలింపుగా.
‘‘ఊ…’’ అని ఒక జీవం లేని నవ్వు నవ్వింది.
‘‘అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తుండు’’ అని చెబితే
‘‘చిన్నపిల్లలిద్దరితోటి, అమ్మతోటి నాకు కుదరదేమో. నువ్వే రాస్తుండు మైథిలీ’’ అని స్నేహ పూర్వకంగా నా అరచేతిని నొక్కి వదిలింది.
సరేనని నేను బస్టాండుకు దారి తీశాను. కమల తమ ఇంటివైపు నీరసంగా అడుగులు వేయసాగింది.
ఒండ్లు ఓడలు, ఓడలు బండ్లు కావటం అంటే ఇదేనేమో.
* * *
నాగూ బెంగుళూరులో దిగేసరికి ఉదయం పదిగంటలైంది. ఆర్.టి.సి. బస్సు ప్రయాణం గదా! సుమారుగా పదకొండు గంటలు పట్టింది ప్రయాణం. తర్వాత క్యాబ్ బుక్ చేసుకుని పిల్లలుండే ‘మారత హళ్లి’కి చేరుకోవటానికి గంటపైగానే పట్టింది. సాఫ్ట్‌వేర్ కంపెనీలుండే ఏరియా అది, అందరూ ఆఫీసులకు వెళ్ళే సమయం, భార్గవ్, నవీన్‌లు ఉన్నారో, ఆఫీసుకు వెళ్లిపోయారోనని అనుకుంటూ కాలింగ్ బెల్ కొట్టాడు.
(సశేషం)