“ఆమెలు” విశ్వ విజేతలు Cricket 2025 Winners

2025 నవంబర్ తరుణి పత్రిక సంపాదకీయం

ఆటలు ఆరోగ్యానికి మంచివి. ఎవరి ఆరోగ్యానికి?  క్రీడాకారుల వ్యక్తిగత ఆరోగ్యానికి మాత్రమే కాదు …దేశ ఆరోగ్యానికి కూడా మంచిది. దేశానికి ఆరోగ్యమేంటి?  అవును, దేశానికి కూడా మంచి ఆరోగ్యం ఉండాలి. అంటే దేశం సుభిక్షంగా ఉండాలి. సుభిక్షం అంటే ఎలా ఉంటుందీ,ఎలా వస్తుంది? గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి, జిల్లా స్థాయి నుండి ముఖ్య పట్టణ స్థాయి, ముఖ్య పట్టణ స్థాయి నుండి దేశానికి రిప్రెజెంట్ చేస్తూ క్రీడలను ఆడడం. కేంద్ర స్థాయిలో ఆడిన ఆటలను జాతీయ స్థాయి ఆటలు అంటాం. వివిధ దేశాలకు వెళ్లి ఆడడం అంటే అంతర్జాతీయ స్థాయి అంటాం.  జాతీయస్థాయిలో  అంతర్జాతీయ స్థాయిలో,  క్రీడల పోటీలను నిర్వహిస్తే, ఆర్థిక పరమైన లావాదేవీలు జరిగి దేశం పురోగతికి వెళుతుంది అని ప్రపంచం విశ్వసిస్తున్న మాట.

ఈ ఆటలు మైదానాలలో బహిరంగంగా నిర్వహిస్తే మరింత ఉత్సాహకరంగా ఉంటుంది కాబట్టి ప్రేక్షకులు స్టేడియం నిండా నిండిపోయి, వాళ్లకు నచ్చిన ఆటగాళ్ల వైపు నిలబడి కేరింతలు కొడతారు. ఈ  cheerfully చప్పట్లు , కేరింతలు విని క్రీడాకారులు మరింత ఉత్సాహకరంగా ఆడుతారు.

        ఈ పోటీలలో విజయం సాధించిన తర్వాత కాలానుగుణంగా చెప్పుకోవాలంటే  ప్రచార సాధనాల వల్ల విపరీతమైన పేరు ప్రతిష్టలు దేశానికి వస్తాయి. బాగా ఆడిన క్రీడాకారులకు వ్యక్తిగత కీర్తి ప్రతిష్టలు కూడా వస్తాయి.

     ఇప్పుడు యువత మొత్తం కేంద్రీకరించి చూసే టీవీ షో ఏదైనా ఉందా అంటే అది  క్రికెట్ లైవ్ షో మాత్రమే అనడం అతిశయోక్తి కాదేమో! దేశదేశాన చూస్తున్నది క్రికెట్ ఆటనే ! ఇంగ్లాండ్,ఇండియా , పాకిస్తాన్ , ఆస్ట్రేలియా,  న్యూజిలాండ్ , సౌత్ ఆఫ్రికా , వెస్టిండీస్ , బంగ్లాదేశ్, శ్రీలంక  దేశాలు క్రికెట్ లో “ప్రపంచ కప్ క్రికెట్”  ఛాంపియన్షిప్ కోసం హోరాహోరీ పోరాటం చేస్తుంటారు. ఇప్పుడు కొత్తగా అమెరికా దేశం లోనూ క్రికెట్ బాగానే ఇష్టపడుతున్నారు, ఆడుతున్నారు. దాదాపు వంద దేశాల్లో క్రికెట్

ఆట ఆడుతున్నారు. ఫైవ్ డే మ్యాచ్ ల నుండి T 20 వన్ డే మ్యాచ్ ల వరకు ఎన్నో మ్యాచ్ లు  ఆడారు. లీగ్స్ కండక్ట్ చేయడం చూస్తున్నాం.

       ఈ World cup  పోటీలు అనగానే ఈ పోటీల్లో పాల్గొనని దేశాల్లోని ప్రజలు కూడా  టీవీలలో చూడడానికి ఎంతో ఆసక్తి కనబరుస్తారు. అందుకే రేటింగ్, బెట్టింగ్ వంటివి ఎన్నో మొదలయ్యాయి.

 16 వ శతాబ్దంలో ఇంగ్లాండ్ లో పుట్టిన ఈ క్రికెట్ ఆట ప్రపంచ వ్యాప్తంగా ఆడుతున్న వైనాన్ని చూస్తున్నాం. దాదాపు 19 వ శతాబ్దం రెండవ భాగం లో  మొట్టమొదటి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడినప్పటినుంచి ఎన్నెన్నో మార్పులు చేర్పులు మోసుకుంటూ ఇదిగో… ఇప్పటికి ఇలా తేలింది.  అయితే క్రికెట్ ఆట మొదలైనప్పటి నుంచి పురుషులు మాత్రమే ఆడేవాళ్లు. కానీ ,గత 40 ఏళ్లుగా  ఆడవాళ్లు కూడా ఆడుతున్నారు.  దాదాపు 20 ఏళ్ల నుంచి  ఈ ఉమెన్ క్రికెట్ కూడా వెలుగులోకి వచ్చింది. అంతకుముందు ఎక్కువ మంది ప్రేక్షకులు ఉండేవాళ్ళు కాదు. కానీ ఈమధ్య బాగా నే చూస్తున్నారు.. మరీ మొన్న 2025 నవంబర్ 2  వ తేదీన  నవీ ముంబై లో జరిగిన  13 వ వుమెన్ వరల్డ్ కప్  క్రికెట్ మ్యాచ్ చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు . అందరూ ఎంతో ఉత్సాహంగా చూసారు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ఊహించని విధంగా ఆడారు మన భారతీయ వుమెన్ క్రికెట్ ఆటగాళ్లు.

మన మహిళా క్రికెట్ ఆటగాళ్లకు దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్ ఆటగాళ్లకు మధ్య జరిగిన ఈ వరల్డ్ కప్ మ్యాచ్ లో 298/7  లో స్కోర్ ను 50 ఓవర్లలో సాధించారు భారతీయ ఆటగాళ్ళు. 45.3 ఓవర్లలో 246 రన్స్ తో  ఆల్ అవుటై సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్స్ అందరూ ఓడిపోయారు.

భారత మహిళా  క్రికెట్ జట్టు మన దేశ చరిత్రలోనే కాదు ప్రపంచ కప్ గెలిచే చరిత్రలో ప్రపంచంలోనే ఉత్తమ స్థానాన్ని అధిరోహించింది.

     పోటీ తత్వం తో క్రీడాకారులు నియమానుసార భోజనాన్ని తీసుకుంటూ వ్యాయామం చేస్తూ, ఆటలోని నైపుణ్యాలను గ్రహిస్తూ శారీరకధారుఢ్యాన్ని పెంపొందించుకుంటారు. ఆటలలో  ఏర్పరిచిన వ్యవస్థీకృత నియమాల ప్రకారం పోటీలలో ఆట ఆడిన క్రీడాకారులు వాళ్ళ వాళ్ళ బృందాలతో కలిసికట్టుగా ఆట ఆడి విజయాలను అందుకునే సందర్భాలు ఎంతో గొప్పగా ఉంటాయి. ప్రేక్షకులకు వినోదాలు ఎలా అందుతాయో వాళ్లకు ప్రమోదాలు అందుతాయి. విపరీత పరిస్థితులలో ప్రమాదాలను కూడా అనుభవిస్తారు. ఈ గెలుపు ఓటముల ప్రస్తావనలలో అన్నింటినీ తట్టుకొని నిలిచిన క్రీడాకారులు ఈరోజు మహిళా క్రికెట్ ఛాంపియన్స్ మన కళ్ళ ముందున్నారు.

  ఎన్ని రకాల ఆటలు ఉన్నాయి?  టెన్నిస్ , బ్యాడ్మింటన్, ఫుట్ బాల్,  వాలీబాల్, కబడ్డీ , హాకీ  ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ప్రముఖమైన ఆట క్రికెట్ వంటివి. ఇవే కాకుండా  స్విమ్మింగ్, రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్, సైక్లింగ్ వంటి అథ్లెటిక్స్ కూడా ఉంటాయి.  ఇటువంటి ఆటలలో కొన్ని ఒక్కరే వ్యక్తిగతంగా ఆడేవి, బృందాలుగా ఆడేవి ఉంటాయి. ఏ క్రీడలోనైనా పోటీ అనేది తప్పనిసరిగా ఉంటుంది . వీటిని మనం అవుట్డోర్ గేమ్స్, ఇండోర్ గేమ్స్ గా చెప్తాం.

వీటిల్లో కొన్ని సంప్రదాయ క్రీడలు అని చెప్పుకుంటాం. దేశీయ విధానంతో ఆడే ఆటలు అన్నమాట కోకో,  కబడ్డీ వంటివి. చదరంగం క్యారం బోర్డ్ వంటి ఇండోర్ గేమ్స్ కూడా ప్రసిద్ధి చెందినవి ఉన్నాయి. అయితే ఇన్ని ఆటలు ఉన్నా మన దేశంలో క్రికెట్ ఆట కు ఉన్న క్రేజ్ మరే ఆటపైనా లేదు అనేది నిర్వివాదాంశం. ఈ క్రమంలో ఉమెన్ క్రికెట్ కు కూడా ఈ మధ్యకాలంలో క్రేజ్ పెరిగింది. దీన్నిబట్టి తెలుస్తున్నది ఏంటంటే… ఆట ఆటే! ఆడవాళ్ళు ఆడినా, మగవాళ్ళు ఆడినా…. ఆటను శ్రద్ధగా, టీం స్పిరిట్ తో, కష్టాన్ని లెక్కచేయక, గెలవాలనే కాంక్షతో, పట్టుదలగా ఆడేవాళ్లను ఎవరైనా గౌరవిస్తారు అనడానికి నిదర్శనంగా మొన్న జరిగిన 20 25 వరల్డ్ కప్ విమెన్ క్రికెట్ టీం గెలుపు ఒక పెద్ద ఉదాహరణగా నిలుస్తుంది.

         ఆసియా క్రీడలు, ఒలంపిక్ క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు , వరల్డ్ కప్, ప్రపంచ ఫుట్బాల్, ఆసియా ఓపెన్ క్రీడలు వంటి వివిధ రకాల పోటీల ఆటలు  పోటీలు ఉన్నాయి. వీటిలో క్రికెట్ వరల్డ్ కప్ మన భారతదేశంలో చాలా ప్రఖ్యాతిగాంచింది.  ఒక్కో దేశానికి ఒక్కో రకమైన రంగుతో  ఆటగాళ్లకు క్రికెట్ డ్రెస్సులు ఉంటాయి. భారతీయ క్రికెట్ జట్టుకి నీలిరంగు డ్రెస్సు వేస్తారు.

బాల్, బ్యాట్ , వికెట్లు, గ్రౌండ్, పిచ్ , బౌండరీ, ఫోర్, సిక్స్ , ఇన్నింగ్స్, రన్స్, ఎంపైర్ , బాట్స్ మెన్, బౌలర్లు, ఫీల్డింగ్, రన్నౌట్ , ఔట్, నాటౌట్,  క్యాచ్, నో బాల్ , క్రీస్, క్యాచౌట్, ఎల్. బి. డబ్ల్యూ, ఫిఫ్టీ, సెంచరీ ఇవే క్రికెట్ ఆట కు ఉన్న పదాలు, బంధాలు. రెండు జట్లు పాల్గొనే క్రికెట్ జట్టులలో ఒక్కో జుట్టు లో తప్పకుండా ఆడాల్సిన ప్లేయర్స్ పదకొండు మంది . బ్యాటింగ్ బౌలింగ్ రెండు చేసేవాళ్ళను ఆల్ రౌండర్ అంటారు.

” Women in blue”  అనేది India women’s national cricket team గొప్ప పేరు లభించింది. 1926 లో Asia నుండి ICC status  లభించింది. BCCI అసోసియేషన్ తో జరిగిన ఈ క్రికెట్ పోటీకి ఉమెన్స్ కోచ్ గా అమోల్ మజుందార్ విధులు నిర్వర్తించారు. వీరు బ్యాటింగ్ కోచ్ గా పనిచేయగా బౌలింగ్ కోచ్ గా ఆవిష్కార్  సాల్వి, ఫీల్డింగ్ కోచ్ గా  మునిష్ బాలి  విధులు నిర్వర్తించారు. ఆనాటి క్రికెట్ క్రీడాకారులు శాంతా రంగస్వామి, డయానా   ఎడూల్ జి , మిథాలీ రాజ్ వంటి ప్లేయర్సే కాకుండా దక్షిణ భారతదేశ క్రికెట్ జట్టులో మంజులా నిర్మల్ కుమార్ వంటి వాళ్లు ప్రసిద్ధులు మనకు తెలుసు.

     భారతీయ మహిళల జాతీయ క్రికెట్ జట్టులో ప్రస్తుతం హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్ గా జట్టును సమర్ధవంతంగా నడిపించారు. స్మృతి మందాన వైస్ కెప్టెన్, ఇంకా బ్యాట్స్మెన్ గా తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించారు. సెమీఫైనల్స్ లో  సెంచరీ కొట్టిన  జమీమా రొడ్రిగస్ కూడా  బ్యాట్స్మెన్  గా ఖ్యాతిగాంచారు. ఉమా ఛత్రి, రాధా యాదవ్, దీప్తి శర్మ , శ్రీ చరణి, శఫాలివర్మ , శ్రేయాంక పాటిల్, రిచా ఘోష్, రేణుక సింగ్, ఆశా శోభన, హర్లీన్ డియల్ , యస్తికా భాటియా , ప్రతికా రావల్ ,  అమన్ జ్యోత్ కౌర్, అరుంధతి రెడ్డి ,  స్నేహ్ రాణా, క్రాంతి గౌడ్ టీం స్పిరిట్ తో ఆడి భారతదేశాన్ని గెలిపించారు. అటు బ్యాటింగ్ చేసిన ఇటు బౌలింగ్ వేసిన రెండింటిలో కూడా ఆటగాళ్లు అందరూ  నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఒక మ్యాచ్ కు మొత్తం 15  మంది ఆటగాళ్లు ఉంటారు టీం లోపల.  ఎంట్రీ టెస్ట్ ఆటల నుండి మొదలుకుంటే సెమీఫైనల్స్, ఫైనల్స్ వరకు జరిగిన ఈ క్రికెట్ పోటీలు అన్నింటిలోనూ జట్టు సభ్యులైన విమెన్ క్రికెటర్స్ చాలావరకు పెద్ద స్కోర్ నే చేశారు. ఎంత శ్రమ పడితే సాధించగలిగారు? ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం అవసరం. మెలకువలు ప్రదర్శించాలన్న తపనతో నిత్యం శిక్షణ తీసుకుంటారు.

 మ్యాచ్ వచ్చిందంటే చాలు ఓ పరీక్షా సమయమే. ఎటువంటి శారీరక రుగ్మతలు ఉన్న పక్కనపెట్టి భయపడకుండా , అధిగమిస్తూ ముందుకు పోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. శారీరకంగా నే కాదు మానసికంగా బలపడడం అవసరం. ఇలా ఆడటమే వాళ్ళ వృత్తి అయినపుడు ఆటనే జీవితం అయినప్పుడు మహిళ ల కైనా, పురుషులకైనా రూల్స్ అండ్ రెగ్యులర్స్ ఒకే తీరుగా ఉంటాయి నియమాలైనా, పద్ధతులైనా సరి సమానమే .‌

యావత్ ప్రపంచం భారతదేశం వైపే చూస్తున్నారంటే అతిశయోక్తికాదు. దీనికి కారణం ఈ వరల్డ్ కప్!! దేహం దేశం రెండూ ఒక్కటే!!

” ప్రజలు ఇకపై మహిళల క్రికెటును చిన్నచూపు చూడరు.” అనే మాటను నిజం చేస్తూ మహిళా క్రికెటర్లు పోటీ ప్రపంచంలో దూసుకుపోతారు.  అందుకే మహిళలు విశ్వ విజేత లు అనడం! Cricket champions అనడం!! అందరికీ అభినందనలు. All the best!!

 ____****____

      

Written by Dr. Kondapalli Neeharini

డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అధునాతన -సనాతన- సింగాణం

నవంబర్ తరుణి విషయ సూచిక