చైత్రమాసం వెళ్ళిపోయింది . ఎప్పటిలాగే మిగిలినవి అన్నీ యథావిధిగా ఉన్నాయి. అప్పుడప్పుడు కొండ పక్కన గ్రామం నుండి భావోద్రేకం రేపేట్టు డప్పుల మోత వినిపిస్తుంది. లయ లేని నృత్యం కోసం అన్నట్టు.
అడవి అంత ఎండి పోయి వాడిపోయింది. ఇప్పుడు డప్పుల మోత స్థానంలో డబ్బు డబ్బు మని గడ్డపారల శబ్దాలు రాతి వంటి గట్టిభూమిని తవ్వుతూ వినిపిస్తున్నాయి.
ఇది గోటీలు తిరిగి వారి యజమానుల వద్దకు వెళ్ళే సమయం. నిజంగా సెలవులు అయిపోయాయా ఇంత త్వరగా? అనిపించింది సోమ్లాకి. ఇంకా చేయవలసిన పనులు చాలా మిగిలి ఉన్నాయి. గుడిసెల గోడలను పాత అలుకులను గీకి , బురదతో మళ్ళీ అలకాలి. గుడిసెల కప్పులకు ఏర్పడ్డ ఛిద్రాలను సరి చేయాలి. వ్యవసాయ భూములు ఇంకా దున్ననే లేదు. వసంతోత్సవానికి సంబంధించిన ఉత్సాహం భూక్యాకు ఏమాత్రం లేదు. కాలక్రమంలో ఋతుచక్రం తిరుగుతూ వచ్చిన మార్పు మాత్రమే వసంతం. ప్రతిరోజు సూర్యోదయం జరగడం, నీడలు పెరగడం, ఆ తర్వాత అరటి చెట్ల కిందికి తరిగిపోవడం, రాత్రి కావడం చూస్తూనే ఉన్నాడు. అతని జీవితంలో కొత్త విషయం ఏదీ లేదు.
ఆ రోజు సాయంత్రం సోమ్లా తన పిల్లలతో కలిసి తన ఇంటి ముందు పరుపుబండపై కూర్చున్నాడు. ఇరుగుపొరుగు ఇళ్ళ నుండి వంట జరుగుతున్న వాసన వస్తున్నది. యువకుల డార్మెటరీ నుండి డుంగుడుంగా వాయిద్యం మోతలు వినిపిస్తున్నాయి. పిల్లలంతా అరుస్తూ ఆడుకుంటున్నారు. దగ్గరలోని గ్రామాల్లో నుండి కొండ జాతి వారి పిల్లనగ్రోవి వాయిద్యం వినపడుతున్నది. గ్రామమంతా సజీవంగా వెలిగిపోతోంది .
సోమ్లా అతని కుటుంబం చీకటిలో నిశ్శబ్దంగా కూర్చున్నారు. వారు తలలు వంచుకొని ఉన్నారు. అలసటతో కూడిన ప్రవాహం వారిపై నల్లటి ఆకాశం నుండి కురుస్తోంది. గబ్బిలాలు వారి చుట్టూ నీడల్లా నల్లగా తిరుగుతున్నాయి. అప్పుడప్పుడు వారిలో ఎవరో ఒకరు అస్పష్టంగా గొణుగుతున్నారు.
“హేమ్లా మూడు స్కోర్ల రూపాయలు కన్యాశుల్కంగా ఇవ్వాల్సి ఉందట కదా” అని కొద్దిసేపు ఆగి.
మళ్లీ “ఏమైనా కానీ, అంత డబ్బు మనం చెల్లించ లేము” అన్నాడు సోమ్లా.
ఆ తర్వాత అందరూ మౌనంగా ఉన్నారు.
భూక్యా, సాలీ తలలు కిందకు వంచుకొని కూర్చున్నారు. ఆ పెద్దమనిషి తర్వాత ఏమంటాడో అనే భయంతో.
“వారిద్దరూ చెడు ఆత్మలు, మళ్లీ జన్మించారు. వారు ఒకరి కోసం ఒకరు పుట్టిన వారు. మన కోసం కాదు. అయినా బాధపడకండి. భూక్యా కోసం మంచి వధువును, సాలీ కోసం మంచి వరుణ్ణి వెతుకుదాం. ఆ తర్వాత టీక్యా వంతు, చివరకు ఈ వేసవిలో మాలీ వివాహం” అన్నాడు తండ్రి.
మళ్ళీ అతడు తన లో తాను మాట్లాడుకున్నట్టు “ఇది ఒక అవమానమని, ఎవరు అనుకుంటున్నారు? వారు ఒకరికొకరు ఎంచుకున్నారు. అయినప్పటికీ నేను కచ్చితంగా చెప్పగలను. హేమ్లా కమ్లితో ఎక్కువ కాలం కలిసి ఉండడు. తప్పకుండా వాడు అస్సాం టీ తోటలకు పారిపోతాడు. అప్పుడు ఆమె మరొక భర్తకోసం చూసుకోవాల్సిందే. అప్పుడు మన సహాయం కోసం అడుగుతూ, మన దగ్గరికి వస్తారు. నేను మాత్రం వారికి సాయం చేయను” అన్నాడు.
అతని మాటలు తన పిల్లలకు సౌకర్యాన్ని ఊరటని కలిగించాయి. ఆ పెద్దమనిషి ఏమాత్రం నిరాశ చెందకుండా, ఇంకా స్థిరంగా ఉన్నాడు. తనపై ఆధారపడ్డ వారికి ధైర్యాన్ని ఇస్తున్నాడు.
సోమ్లా మళ్ళీ మాట్లాడుతూ “బిడ్డలారా బాధపడకండి , జీవితాన్ని ఆనందించండి. పరిస్థితులన్నీ పరిమితిలోనే ఉన్నాయి. తప్పకుండా వాటిని అభివృద్ధి చేసుకుందాం. ఏదో ఒక రకంగా కౌలు రైతును ఒకరిని మనభూమి దున్నేందుకు వెతుకుదాం. ఏమీ నష్టం జరగలేదు. సాలీ, మాలీలు రోజు కూలీలుగా పని చేస్తారు. లేదా మళ్ళీ వడ్డీ వ్యాపారి దగ్గర ఇంకా కొంత డబ్బును అప్పుగా తీసుకుందాము. దానితో టిక్యాను అక్కడి నుండి విడుదల చేద్దాం. అన్ని నామీద వదిలేయండి. ధైర్యంగా ఉండండి” అన్నాడు.
ఇంతలో చీకట్లో నుండి ఒక కంఠం “మాలీ” అని పిలిచింది. అది ఒక అభిమానిది “మంచి అన్నం ” అని వినపడింది. ఆమె లేచి చీకట్లోకి నడిచి వెళ్లింది. ఆడపిల్లల కాలి గజ్జెల శబ్దాలతో డాన్స్ లు వినిపిస్తున్నాయి . టిక్యా కూడా లేచి చీకట్లో కలిసిపోయాడు. ముసలి సోమ్లా ఒక్కడే ఒంటరిగా రాతి పై కూర్చుని చుట్ట తాగుతున్నాడు.
భూక్యా లేచి ఇంట్లోకి వెళ్లి తనకోసం ఒక మట్టికుండలో సారాయి తెచ్చుకొని గదిలో ఒక మూలగా కూచున్నాడు. ఆ తర్వాత దాదాపుగా ఖాళీ కుండను సాలీ చేతికిచ్చి “నువ్వు కూడా తాగు , ఇది కొంత బాధ తగ్గిస్తుంది . నీకు మంచి చేస్తుంది” అన్నాడు.
ఆ విధంగా ఆ రాత్రి గడిచింది . తెల్లవారి గోటిలందరూ తమ యజమాని ఇంటి దారి పట్టవలసి ఉన్నది.
** ** ** ** ** **
సోమ్లా అతని కొడుకులు కలిసి షావుకారు ఇంటికి బయలుదేరారు. సూర్యుడు అప్పుడే ఒక ముల్లు గర్ర పొడవున ఆకాశంలోకి నిలువుగా పాకుఉతున్నాడు. షావుకారు ఆలస్యమైనందుకు తప్పనిసరిగా తిడతాడు అనుకొన్న వారు, తొందర తొందరగా అంతం లేని కొండ దారుల వెంట చెప్పులు లేని కాళ్లతో కొండ రాళ్ళమీద నడుస్తున్నారు. ఎప్పుడు ఒకరి వెనుక ఒకరు ఒక వరుసగా నడవడం గిరిజనుల పద్ధతి. సోమ్లా ముందు నడుస్తున్నాడు. ఆ పంక్తిలో వెనక ఉన్నాడు టిక్యా. ఏప్రిల్ నెలలో ఎండ భరించరానంతగా వేడెక్కింది . వేడికి మెరుస్తు ముందు దారి అస్పష్టంగా ఉంది.
వారంతా విచారంగా నిశ్శబ్దంగా ఆలోచనలతో నడుస్తున్నారు. వారి ఆలోచనలు దారిని ముందుకు సాగనివ్వడం లేదు. ఒక్కొక్కసారి దారిలో దారితప్పిన ప్రయాణికులు కలుస్తుంటారు, వారి జోలెలను భుజం మీద ఉన్న కర్రకు వెళ్లాడతీసుకొని, లేదా పశువుల కాపరులు తమ మేకలు మేపుతూ కనిపిస్తారు. కొద్దిసేపు వారి ఒంటరితనం అదృశ్యమౌతుంది. కానీ వారు దూరం అయిన వెంటనే వీరి పాత స్థితి నిశ్శబ్దంగా మారి విచార పరుస్తుంది. కనీసం నడకలోని బాధను కూడా వారి శరీరాలు గుర్తించడం లేదు. కేవలం సూర్యుడు మాత్రమే వీపుపై ఎండను మండిస్తూ , మాటిమాటికీ వారి మొద్దుబారిన స్థితిని పోగొడుతున్నాడు.
వారంతా ఒక వెడల్పైన రాతి వద్దకు వచ్చారు. అది జోడి చెట్ల గుంపు నడుమ ఉన్నది. ఆ రాతి మీద చిన్న గుంట ఒక జింక గిట్టల గుర్తు లాగా ఉన్నది. ఆ స్థలాన్ని రాతి పై ఉన్న ఆ గుర్తును బట్టి “జింక రాజం కాలి గుర్తు” అని పిలుస్తారు. ఆ రాతిపై ఆ గుంట నుండి నీరు నిరంతరం ఆగకుండా ఊరుతూ ఉంటుంది ..అది కనుమల నడుమ ఉన్నతంగా నిలిచి ఉన్నది . చాలామంది ప్రయాణికులకు బస చేయడానికి ఇష్టమైన ప్రదేశం, బరువులు మోసే వారు కూడా కొద్దిసేపు అక్కడ ఆగి విశ్రాంతి తీసుకుంటారు. జోడి చెట్ల నడుమ అనేక మంది ప్రయాణికులు వంట చేసుకున్నట్టుగా గుర్తుగా బూడిదలు కనిపిస్తున్నాయి.
సోమ్లా, భూక్యా, టీక్యా ఆ చెట్ల కింద కూర్చున్నారు. వారితో పాటు సొరకాయ బుర్రలో తెచ్చుకున్న మాండ్యా గంజిని తాగారు. ఆ తరువాత నిశ్శబ్దంగా చుట్టలు వెలిగించారు. చాలా దూరం నడిచిన తర్వాత వారు అలిసి పోయి ఉన్నారు. కానీ వారు విశ్రాంతి తీసుకో లేరు. వారి కోసం షావుకారు ఎదురు చూస్తూ ఉంటాడు.
సోమ్లా తన కొడుకులతో “ఇంటిదగ్గర ఇంకా చాలా పని చేయవలసినది మిగిలి ఉన్నది. మనం ఇంకా కొన్ని రోజులు సెలవు ఇవ్వమని షావుకారును అడుగుదాము” అన్నాడు.
కొడుకులిద్దరూ సమాధానం చెప్పేందుకు ఆసక్తి చూపలేదు. భూక్యా తన ఆలోచనలలో తాను చుట్టుకొని “ఊ” అంటూ మూలుగుతూ ఉన్నాడు. అక్కడ వేరే ఇతర ప్రయాణికులు విశ్రాంతి కోసం ఆగిన వారు, తమ ప్రయాణాన్ని కొనసాగించడానికి కదిలారు. భూక్యా ఒక్కసారిగా లేచి నిలబడి ” పోదాం పదండి” అంటూ, తనకు సంబంధించిన కర్రను జోలె సంచులను సర్దుకొని ప్రయాణాన్ని కొనసాగించాడు.
కానాపరి గ్రామం దగ్గర వారు కెలర్ గ్రామానికి చెందిన ఒక క్రిస్టియన్ మత ప్రచారకుడిని చూశారు. లుల్ల గ్రామంలో మత ప్రచారం చేయడానికి వెళుతున్నాడు అతను. అతడు ధరించిన నల్ల కోటులో ఒక గంభీరత్వం కనపడింది , కానీ అతని భుజం మీద బ్రతికి ఉన్న కోడి వేలాడుతూ ఉంది.
ఆ దారి సుర్సుపదార్ నుండి లుల్లా వైపు వెళ్తుంది.
“మీరు షావుకారు వద్దకు తిరిగి వెళ్తున్నారా” అని అడిగాడు అతను.
“అవును” అంటూ అరిచి సమాధానం చెప్పారు వీళ్ళు.
“అయితే వసంతోత్సవం ముగిసింది, అన్నమాట” అన్నాడతను.
“అవును” అంటూ మళ్ళీ సమాధానం చెప్పారు.
కొద్ది దూరం వెళ్ళిన తరువాత సోమ్లా ఏదో ఆలోచించుకొని. గట్టిగా అరుస్తూ,
“ఓ మత ప్రచారకుడా ! నేను చెప్పేది విను, నా కూతురు సాలీని మనసు చిన్నబుచ్చుకోవద్దని, ధైర్యాన్ని కోల్పోవద్దనీ చెప్పండి. అతి త్వరలో వడ్డీ వ్యాపారి దగ్గర, మరికొంత డబ్బు తీసుకొని తిరిగి వస్తానని చెప్పండీ” అంటూ అరిచాడు.
బదులుగా మత ప్రచారకుడు కూడా గట్టిగా అరిచాడు. కానీ సరిగా వినపడలేదు.
భూక్యా తండ్రి నుద్దేశించి “ఆ వెధవ వడ్డీ వ్యాపారి నీకు ఇంకా అప్పు ఇస్తాడని అనుకుంటున్నావా” అన్నాడు.
సోమ్లా దానికి సమాధానం చెప్పలేదు.
వడ్డీ వ్యాపారి ఇల్లు దగ్గరికి వచ్చేసింది.
*** *** *** *** ***
రంగుపరజా బాగ్లా తండ్రి పేరు. రంగుపరజా తన కొడుకు హేమ్లా కోసం కొత్త ఇంటిని నిర్మిస్తున్నాడు. తన వధువుతో కలిసి అతిత్వరలో కొడుకు తిరిగి వస్తాడని. పరజజాతి లో వివాహమైన తర్వాత తల్లిదండ్రులతో కలిసి ఒకే ఇంటిలో ఉండరు. వీలైనంత త్వరగా ఇల్లు కట్టేందుకు చాలా మంది కూలీలను ఇంటి నిర్మాణం కోసం రెంగు పరజా ఏర్పాటు చేశాడు. అందులో యువతులు యువకులు కూడా ఉన్నారు. ఇంటి కోసం పునాదులు తీశారు వాటిపై వేగంగా మట్టితో గోడలు లేపారు. వెదురు బొంగులతో కర్రలతో ఒక చట్రాన్ని ఏర్పాటు చేశారు. వాటిని. సియాలి తీగలతో బిగించి కట్టారు. వెళ్లేదారిలో కొత్తగా ఇల్లు కడుతున్నారు పనివాళ్ళు అందరూ చేతులకు కాళ్లకు అంటిన మట్టిని అక్కడ కడుక్కుంటున్నారు. సరస్సు దగ్గర నుంచి నీటిని తెచ్చి మట్టిని తడిపి బురద గా చేస్తున్నారు దానితో నేలను గోడలను అలుకుతున్నారు. సాలీ స్నానం చేయడానికి అదే దారిలో సరస్సు వైపు వెళ్తుంది. కొత్త ఇంటి కోసం పనిచేస్తున్న యువతీ యువకులను చూసేందుకు ఒక్క నిమిషం ఆగింది. వారందరూ పాటలు పాడుతూ పని చేస్తున్నారు. వారి పాతకాలపు బల్లాడ్ పాట బృందంగా కొనసాగుతోంది…
“ఇప్పటికీ ఇది ఈరోజు
అది గడిచిపోతే రేపు అవుతుంది
డబ్బుతో కొనలేము దాన్ని”
అంటూ ప్రేమకు సంబంధించిన పాట కొనసాగుతోంది.
“ఎవ్వరూ కనుగొనలేరు దానిని
చాలామంది వెతుకుతూనే చనిపోయారు ఒక్కొక్కసారి దాన్ని నువ్వు చూడవచ్చు
దట్టంగా చుట్టుకుపోయిన అడవిలో
కానీ అది వెంటనే మాయమై పోతుంది
డబ్బుతో అన్నీ కొనవచ్చు కానీ
ప్రేమను మాత్రం కొనలేము”
మళ్ళీ బృందం అందుకని కోరస్ గా
“ఇప్పటికీ ఇది ఈ రోజు
గడిచిపోతే అది రేపు అవుతుంది
మరి డబ్బుతో కొనలేం దానిని”
సాలీ తన గుంపుతో కలిసి నీటి పాత్రతో నడుస్తోంది. పనిచేసే కార్మికుల నుండి ఒకడు “ఓ ప్రియమైన చిన్నదానా రా వచ్చి, ఈ కొత్త ఇంటి నిర్మాణాన్ని ఒకసారి చూడు” అన్నాడు .
“దేనికోసం చూడాలి” అని ప్రశ్నించింది .
“మంచిది వచ్చి చూడు. ఇది నీకు నచ్చితే ఆ తర్వాత ఇటువంటి ఇల్లు నీకు కూడా కట్టిస్తాను” అన్నాడు .
మిగిలిన కార్మికులంతా పాటపాడటం ఆపి గట్టిగా నవ్వడం మొదలు పెట్టారు.
సాలీ వెనుకకు తిరిగి తన దారిన నడిచింది. అవమానంతో కోపంతో ఆమె మండిపోతుంది. నెమ్మదిగా సరస్సు వద్దకు నడుస్తూ వంపుకు దిగిపోయింది. అక్కడ వేరొక అమ్మాయి స్నానం చేస్తూ ఉంది. ఆమె పేరు కాంత్లా. సాలీ కంటే చిన్నది. ఆమె కూడా సాలీ స్నేహితురాలే.
వాళ్ళిద్దరు నడుము లోతు నీళ్లలో కూర్చొని ఒకరి వీపు ఒకరు రుద్దుకుంటూ ముచ్చట్లు ఆడుకున్నారు.
“ఇది ఎలా జరిగింది , నిజంగా ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. కమ్లీ ఇట్లా, ఎట్లా చేయగలిగింది నీ విషయంలో” ఆమె సానుభూతిని చూపిస్తూ చొచ్చరించింది.
సాలీకి మంట పుడుతుంది. కాంత్లా తన వీపు రుద్దుతుంటే, తన వీపు చర్మాన్ని వొలుస్తున్నట్టు అనిపించింది. సాలీ ఏమీ మాట్లాడలేదు.
పనివాళ్ళు పాటలు పాడుతూనే ఉన్నారు. “ఇప్పటికీ ఇది ఈరోజు
కానీ ఇది గడిచిపోతే రేపు అవుతుంది
డబ్బుతో మనం కొనలేము దానిని”
పాట వినిపిస్తోంది . ఆమె నీటి నుండి బయటికి వచ్చి తనను తాను ఆరపెట్టుకుంటుంది.
సీత్లా సరస్సు దగ్గరికి వచ్చి తన కాళ్ళుచేతులు కడుకుంటున్నాడు.
“సాలీ నేనొకటి చెప్పనా ” అంటూ అరిచాడు.
“ఏం చెప్తావు” అంటూ ఆమె అడిగింది.
“నువ్వు వచ్చి నాతో కలిసి ఉండొచ్చు కదా. ఎట్లాగు హేమ్లా నిన్ను వదిలేశాడు” అన్నాడు.
ఆమె అతనిపై మండి పడింది. కానీ ఆ మాటలన్నీ నీటి సవ్వడిలో జారిపోయాయి. అతడు చేతులను వెడల్పుగా చాపీ ఊపుతూ ఆమె వెంట పడి వెక్కిరిస్తూ అరవడం మొదలు పెట్టాడు.
” రారా వచ్చేయ్ నాతో వచ్చెయ్, సాలీ నాతో రా” అంటూ అరవడం మొదలు పెట్టాడు.
ఆమె ఇంటికి చేరింది వణుకుతూ.
ఇంట్లో తినడానికి ఏమీ లేదు. కానీ మాలీ చింత గింజలను మరికొన్ని అడవి దుంపలను ఉడక పెట్టింది.
మాలీ తన కళ్ళ ముందే పరిణితి గా పెరిగింది, అనుకుంది సాలీ.
ఎర్రబడిన సాలీ మొఖం చూసి, “నిన్ను ఎవరైనా బాధ పెట్టారా సాలీ” అని అడిగింది మాలీ.
వెంటనే ఏడుస్తూ జరిగిన విషయం అంతా చెప్పింది సాలీ.
ఒకరినొకరు పట్టుకొని కొద్దిసేపు ఏడ్చారు. తర్వాత తమ ఇంటి బయటకు వచ్చి వరండా లో నిలబడి విసురుగా శాపనార్థాలు పెట్టడం మొదలు పెట్టారు. అవి ఎవరికైనా వినపడని వారికి సంబంధం లేదు. రాత్రంతా వారి కంఠాలు మోగుతూనే ఉన్నాయి.
“ఎంత ధైర్యం మమ్మల్ని అవమాన పరచడానికి, కేవలం మా నాన్న, అన్నలు దూర ఉన్నారనే కదా! మమ్మల్ని అవమానించిన వారందరికీ, రెండు కళ్ళు పోయి గుడ్డి వాళ్ళు కావాలి. వారికి శనిగ్రహం పట్టి వారి పిల్లలంతా పశువులతో సహా నాశనం అయిపోవాలి. వారికి వారు కాలి బూడిద కావాలి. మమ్మల్ని అవమానించిన వారి చెడు నాలుక రాలి కింద పడాలి. నిస్సహాయంగా ఉన్న ఆడవారిని అవమానించే వారందరూ దుంప నాశనం అయిపోవాలి” అంటూ తనివి తీరా తిట్టారు.
వారు అలా శాపనార్థాలతో తిట్లతో దీర్ఘాలు తీస్తూ కాసేపు గడిపిన తర్వాత, కొంత బాధ తగ్గి ఊరటం పొందగలిగారు.
వీధికి అవతల వైపు నుండి ప్రేమ పాట గాలిలో తేలుతూ వినపడుతూ ఉంది .
“ఇప్పటికిది ఈరోజు
గడిచిపోతే రేపు
డబ్బుతో కొనలేము దానిని”
*** **** *** *** ***