ఈ బుజ్జి కన్నమ్మ, కన్నయ్యల ముచ్చట్లు చెప్పుకుంటూ పోతే అన్నీ ఇన్నీ కావు. కొన్నేమో మనసును కదిలించి కళ్ళు నీళ్ళు తెప్పిస్తాయి. మరికొన్నేమో ఆనందపు డోలికల్లో ఊగించి చిరునవ్వుల జల్లుల్లో మునకలేయిస్తాయి.
ఆరోజు నాకు బాగా గుర్తు. పిల్లలంతా మధ్యాహ్న భోజనం చేస్తున్నారు.అప్పటికింకా మధ్యాహ్న భోజన పథకం రాలేదు. 80%హాజరు ఉన్న వారికి 3 కేజీల బియ్యం ఇవ్వడం ఉండేది.
ఇక విషయానికి వద్దాం. పిల్లలంతా చెట్ల కింద వరండాలో తాము తెచ్చుకున్న బాక్సులు విప్పుకొని ముచ్చట్లు చెప్పుకుంటూ తింటున్నారు. (ఒకోసారి వాళ్ళని చూస్తుంటే అనిపిస్తుంది.ఇన్ని ముచ్చట్లు ఆ వయసు పిల్లలకు ఏం ఉంటాయబ్బా? కొందరు పిల్లలను చూస్తూ వుంటా కదా! తరగతి గదిలో కూడా టీచర్ చూడకుండా పుస్తకాలు అడ్డుగా పెట్టుకుని గుసగుసగా తెగ ముచ్చట్లు పెడుతుంటారు.ఇంతగా ఏం ముచ్చట్లు వుంటాయిరా మీకని గట్టిగా గద్దిస్తుంటాను? ఆ తర్వాత మనసులో అనుకుంటుంటాను ” ఏం వాళ్ళకు ముచ్చట్లు ఉండకూడదని ఏముంది? వాళ్ళకో ప్రపంచం ఉంది కదా! అందులో ముచ్చట్లు లేకుండా ఎలా వుంటాయి? నేను కూడా చిన్నప్పుడు ఇలాగే ముచ్చట్లు చెప్పుకొని ఉంటాననడంం లో ఎలాంటి సందేహమూ లేదు)
అసలు విషయానికి వస్తాను.
నాకూ వాళ్ళ ప్రపంచాన్ని అలా గమనించడం చాలా ఇష్టం. వాళ్ళవి ఎలాంటి కలుషితం కాని స్వచ్ఛమైన మనసులు. వాళ్ళ ముచ్చట్లలో వాళ్ళు బాగా గమనించే అమ్మా నాన్న, కుటుంబం,బడిలో టీచర్లు ఉంటారు.ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. “ఈ రోజు టీచర్ కట్టుకున్న చీర మస్తు ఉంది కదూ!” ఒకరు.”ఎహే! దీనికంటే మొన్న గట్టుకున్న చీర ఇంకా బాగుంది తెలుసా? నువ్వు అప్పుడు బడికి రాలేదు.ఓ బుజ్జి కన్నమ్మ.

ఇలా నా మీదే వాళ్ళ ముచ్చట్లు సాగుతుంటే అంటే “వీళ్ళు నన్ను ప్రతి రోజూ నఖశిఖ పర్యంతం పరిశీలనగా చూస్తారన్నమాట” అనుకోగానే పెదాలపై నవ్వు విరిసింది. నేను కూడా భోజనం చేద్దామని బాక్స్ విప్పబోతూ మరొక సారి పిల్లలందరి వైపు చూశాను.అరవై మంది పిల్లలు హాయిగా, గుంపులుగా గుండ్రంగా, ఎదురు బొదురుగా నచ్చిన రీతిలో కూర్చుని మాటామంతీ తో తింటున్నారు.
ఓ బుజ్జి కన్నమ్మ వారందరికీ దూరంగా నిలబడి బేలగా చూస్తోంది.
అరెరే? ఏంటి అన్నం తినడం లేదు అనుకుంటూ ” ఇటు! రా నాగా! రా బంగారూ! అని పిలిచాను. బిక్కమొహం వేసుకొని నా వైపు అలాగే చూస్తోంది. ఏమైంది బంగారూ? ఇవ్వాళ అన్నం తెచ్చుకోలేదా? అడిగాను.అంతే ఇక వెక్కి వెక్కి ఏడుస్తూ “మా అమ్మ నాన్న ఇంటి తాళం చెవి ఇవ్వలేదు టీచర్! అంది.
“అయ్యో!అవునా! బంగారూ! మరి నాకు చెప్పొచ్చు కదరా! చెయ్యి కడుక్కుని రా! అని పిలిచి దగ్గరకు తీసుకొని నేను తెచ్చుకున్న బాక్సులోని అన్నం పెట్టాను. “అయ్యో! మాకు తెలియదు టీచర్! బడి వెనుకనే కదా ఇల్లు వెళ్తుందని అనుకున్నాం.లేకుంటే మేమే పెట్టేటోళ్ళం” అన్నారు.
“నాకు తెలుసు లేరా! మీరంతా బంగారు కొండలు. మీలో ఎవరైనా తెచ్చుకోకపోతే ఒకరికొకరు పెట్టుకోవడం నే చూశానులే.ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది” అంటూ పెడుతుంటే నాగా కళ్ళలో కొండంత కృతజ్ఞత.
ఇక అది మొదలు.అప్పటి నుండి ఆ బుజ్జి కన్నమ్మ నన్ను ఓ అమ్మలా చూసేది.నా వెంటే తిరుగుతూ ఉండేది.
అంతటితో ఆగకుండా వాళ్ళింట్లో ఏ కూరగాయలు కాసినా,ఏ పూలు పూసినా అందరికంటే ముందే వచ్చి నా బ్యాగ్ లో పెట్టడం.
“ఎందుకురా బంగారూ! అలా తేవడం నాకు నచ్చలేదు” అంటే “నీకోసరం తెచ్చుకున్న అన్నం నాకు పెట్టినవ్ గా టీచర్ మా అమ్మ లాగనే!” అందుకే నువ్వంటే ఇష్టం. నీకు తెస్తున్నంటే మా అమ్మోళ్ళు ఏమనరు తెలుసా! అంది.
అప్పుడనిపించింది మనం చూపే గోరంత ప్రేమకు వాళ్ళిలా కొండంత కృతజ్ఞతగా ఉంటారని…
****
బుజ్జి కన్నమ్మ డ్యాన్స్ ముచ్చట
****
బుజ్జి కన్నమ్మ కన్నయ్యల ముచ్చట్లు కొన్ని భలే గమ్మత్తుగా ఉంటాయి. ఈ బుజ్జి కన్నమ్మ ముచ్చట వింటే నవ్వకుండా ఉండలేరు.
పిల్లలందరినీ నా ముందు గుండ్రంగా కూర్చోబెట్టుకొని వాళ్ళతో ముచ్చట్లు పెట్టడం చాలా ఇష్టం.ఇందులో నా స్వార్థం కూడా ఉంది. ఇలా అయితే వాళ్ళలో భయం, బెరుకు పోయి స్వేచ్ఛగా మనసులోని భావాలు వ్యక్తం చేస్తారు కాబట్టి. అందుకే పిల్లలు ఆడుకోవడానికి వీలు పడనప్పుడు ఇలా చేస్తుంటాను.
అలా ఆ రోజు ఒక్కో బుజ్జి కన్నమ్మ కన్నయ్యను లేపి వాళ్ళకు ఎవరంటే ఇష్టం అని అడుగుతూ ఓ బుజ్జి కన్నమ్మను లేపి “ఎవరంటే ఇష్టం?” అడిగాను.
అంతే… నాకూ…నాకూ అనుకుంటూ మెలికలు తిరిగిపోతోంది.సస్పెన్స్ తట్టుకోలేక పిల్లలంతా ఆ బుజ్జి కన్నమ్మ వైపే చూస్తున్నారు. చెప్పడం మరిచాను.ఆ బుజ్జి కన్నమ్మ పేరు కూడా బుజ్జినే.
“అమ్మా నాన్న అయితే ఖచ్చితంగా కాదు.ఎందుకంటే వాళ్ళ గురించి చెప్పడానికి అంతగా మెలికలు తిరగనక్కర లేదు.మరి ఎవరై వుంటారు? ఏం చెబుతుందోనని ఆ బుజ్జి కన్నమ్మ వైపే ఆసక్తిగా చూస్తున్నా…
“టీచర్!టీచర్ నాకు”చిరంజీవి అంటే మస్తు ఇష్టం టీచర్ ” అంది. పిల్లలంతా గొల్లున నవ్వారు.తరగతంతా నవ్వుల కాంతులు విరిసాయి.ఏమాట కామాటే చెప్పుకోవాలి.నాకూ లోలోపల బాగా నవ్వు వచ్చింది. కానీ బుజ్జి కన్నమ్మ ఫీలవుతుందని నవ్వును ఆపుకుంటూ ” అంత ఇష్టమా రా బుజ్జీ నీకు?అన్నా.ఇంకేం చెబుతుందో వినాలని.
“అవును టీచర్! ఈ పేటకు నేనే మేస్తిరి” పాట మస్తు ఉంటది.మా వూరోళ్ళు ట్రాక్టర్ల పెట్టుకుంటుంటే విన్న” అంది. అంతటితో ఆగకుండా చిరంజీవిలా స్టెప్పులు ఏస్తూ కాళ్ళూ చేతులూ ఆడిస్తుంటే భలే నవ్వొచ్చింది. వెంటనే ఓ ఆలోచన కూడా వచ్చింది.
నా ఆలోచన చెప్పగానే వాళ్ళలో మస్తు ఆనందం.ఎగిరి గంతులు వేస్తూ మేమొస్తం మేమొస్తం అన్నారు. అలా బుజ్జితో సహా మొత్తానికి ఓ పద్దెనిమిది వస్తామని అన్నారు.
అనడమే కాదు మరుసటి రోజు వాళ్ళ అమ్మనో నాన్ననో తీసుకొని వచ్చి ఒప్పించుకున్నారు.
అలా మూడు ఆటోలు మాట్లాడుకుని ఖమ్మంలోని వినోదా థియేటర్కు వచ్చాం.వాళ్ళను సినిమా హాల్లో కూర్చోబెట్టి ఇంటికొచ్చి వాళ్ళ కోసం వంట తయారు చేద్దామంటే ఒప్పుకోలేదు.నన్ను కూడా వాళ్ళతో కలిసి సినిమా చూడమని బలవంతం చేశారు. సినిమా హాల్లో వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.ఖమ్మానికి వాళ్ళ ఊరు దగ్గరైనా ఖమ్మం చూడని పిల్లలు చాలా మందే ఉన్నారు. సినిమా మధ్యలో మావారు అరటి పండ్లు తెచ్చి ఇచ్చారు. హమ్మయ్య అనిపించింది.అప్పటి వరకు నాకో బాధ ఉండె. ఇంటికెళ్ళి వంట చేసేదాక వీళ్ళు ఆకలికి తట్టుకుంటారా? అని.ఆ సమస్య తీరినందుకు సంతోషంగా ఉంది.
ఇంటికి వచ్చి టమాటా పప్పు అన్నం వండాను. చిట్టి చిట్టి చేతులతో వాళ్ళు నా చుట్టూ తిరుగుతూ ఇది చెయ్యమా? అది చెయ్యమా? నువ్వు ఒక్కదానివే ఇంత పని చేస్తున్నావు అంటుంటే ..ఈ బుజ్జి కన్నమ్మ కన్నయ్యల్లో ఎంత నిశిత దృష్టి ” మన పిల్లలకైతే కూర్చున్న దగ్గరకు అన్నీ మనమే అందిస్తుంటాం కదా! అనిపించింది .
భోజనాలు అయ్యాక తిన్న విస్తళ్ళు చెత్త డబ్బాలో వేశారు.తాగిన గ్లాసులు వద్దన్నా వినకుండా కడిగి పెట్టారు.
ఆటో వాళ్ళు మా పిల్లల తాలుకు వాళ్ళే కాబట్టి వాళ్ళని కూడా భోజనం చేయమంటే మొహమాట పడ్డారు.మా వారి బలవంతంతో తిన్నట్లు చేశారు. వాళ్ళకు జాగ్రత్తలు చెప్పి పంపించాను.
ఇక తెల్లవారి బడికి వెళ్ళినప్పుడు చూడాలి పాఠాలను కూడా సరిగా వినకుండా వీలు దొరికినప్పుడల్లా రానివాళ్ళకు సినిమా ముచ్చట్లు ఊరిచ్చి ఊరిచ్చి చెబుతుంటే పాపం వాళ్ళ మొహాలు చూడాలి.
ఇక మన బుజ్జి కన్నమ్మ “ఈ పేటకు నేనే మేస్తిరి” పాటను,ఆ డ్యాన్స్ ను పూర్తిగా నేర్చేసుకుంది.
అది కదా పిల్లల అందమైన లోకం. ఇప్పుడా బుజ్జి ఎక్కడుందో ఎలా వుందో ముప్పై మూడేళ్ల నాటి ముచ్చట.