వంటా వార్పూ ముగించుకుని యూట్యూబ్ లో శివలీలలు చూస్తున్నాను. ఈరోజు తులసి వృత్తాంతం తెలుసుకుందామని ఏంతో ఆశక్తితో ఉన్నాను.అసురుడైన తులసి భర్తను సంహరించమని దేవతలు శ్రీ మహా విష్ణువును ప్రార్థించగా వారి కోరిక నెరవేరుస్తానని వాగ్దానం చేశాడు శ్రీ మహా విష్ణువు. కానీ ఇక్కడ ఒక పేచీ ఉంది. అదేంటంటే ఆ రాక్షసుడి భార్య తులసి మహాపతివ్రత కావడం వల్ల తులసి భర్తను సంహరించడం ఎవరి తరం కావడం లేదు. అందుకని ఆమె పాతివ్రత్యం భంగం అయితే కానీ ఆ రాక్షసుడ్ని సంహరించడానికి వీలు లేదు. అందుకే దేవతలు ఆ పనేదో చేసి మమ్మల్ని కాపాడమని శ్రీ మహా విష్ణువును వేడుకున్నారు. అలాగే చేస్తానని మాట ఇచ్చాడు విష్ణు మూర్తి. ఇచ్చిన మాట ప్రకారం తులసి యొక్క పాతివ్రత్యం భంగం కావించడంలో సఫలీకృతుడవుతాడు. తులసి ఆ విషయం తెలుసుకుంటుంది తన పాతివ్రత్య మహిమతో. ఆమె వెంటనే కృద్ధురాలై విష్ణు మూర్తిని పాషాణం కమ్మని శపిస్తుంది. వాటినే సాలగ్రామాలంటారు. కానీ శ్రీ మహా విష్ణువు, ఎప్పుడో పూర్వ జన్మలో నీవు నన్ను కోరుకున్నావు కాబట్టి ఈరోజు నీ కోరిక ఈ విధంగా తీర్చడమైనది అని తులసిని శాంతింప చేసి ఆమెకు కొన్ని వరాలను ప్రసాదిస్తాడు. భూలోకంలో స్త్రీలందరూ నిన్ను ఎంతో పవిత్రంగా చూసుకుంటారనీ , తమ తమ ఇళ్లల్లో ముందు వెనకాల ఉంచి పూజలు కావిస్తారనీ వరం ప్రసాదించాడు. అది చూస్తున్న నాలో ఏదో తెలియని సంచలనం, తెలియని వ్యతిరేకత…..ఆ విషయం గురించి నేను దీర్ఘాలోచనలో ఉండగా మా పనమ్మాయి పిలుపుకి ఈ లోకంలోకి వచ్చి పడ్డాను. ఏమిటి అన్నట్లు చూసాను.
“ ఏం లేదమ్మా మీరు మీ ప్యాడులో చూస్తూ అంతగా ఆలోచనలో పడ్డారు….ఏంటమ్మా ఆ కథ.? నాకు కూడా చెప్పరూ ?” అన్నది ఆశక్తిగా!
ఉన్నమాట చెప్పొద్దూ నేను ఆమెను ఒక పనిమనిషిగా కాకుండా స్నేహితురాలిగా చూస్తాను. అందుకే అది నాతో ఉన్న చనువు కొద్దీ అడిగింది. కాదనలేక దానికి కథ అంతా వివరించాను. అప్పుడది అంది కదా…” అమ్మా ఈ కథ వింటుంటే ఆ దేవుళ్ళ కాడి నుంచే షురూ అయినాయనుకుంటానమ్మా ఈ మానభంగాలూ అవీ…! అయినా దేవుళ్ళే చేసినారు కదా మనం చేస్తే తప్పేంటి అని మామూలు మనుషులు అనుకోరా అమ్మా….ఇదేదో ఇనటానికే బాగా లేదమ్మా నాకు”
“ ఛ తప్పే అలా అనకూడదు. చెంపలు వేసుకో “ అన్నాను కాస్త మందలింపు ధోరణిలో. కానీ అదేం పట్టించుకోకుండా నాకే చురక అంటించింది.
“ అదికాదమ్మా నాకు తెలవక అడుగుతున్నాను దేవుళ్ళైనవాళ్ళు ఏం కోరుకున్నా ఇచ్చేస్తారా అమ్మా..? ఆయన అదే ఆ ఇష్ణుమూర్తి ఆ తులసితోనువ్వు నన్ను ఎప్పుడో ఇంకో జలమలో కోరుకున్నావు కాబట్టి అది ఈ జలమలో ఈ విధంగా తీర్చాను అనడం ఏం బాగోలేదమ్మా. అంటే మనం ఏం కోరుకుంటే అది తీరుస్తాడన్నమాటేగా…! కానీ నాకు మాత్రం ఆ వ్యవహారం ఏం నచ్చలేదమ్మా! దేవుడనేవాడు భక్తులు ఒకవేళ కోరుకోకూడనివి కోరుకుంటే ‘ ఇది తప్పమ్మా నీ కోరిక ఏమీ బాగాలేదు, అది ధర్మం కాదని బుద్ధి చెప్పాలి కానీ, కోరుకున్నావు కదా అందుకని తీర్చాను అనడం ఏమీ బాగాలేదమ్మా “ అంటూ నాకు మరో చురక అంటించింది.
“ అయినా అమ్మా నాకు ఇంకోటి కూడా అనిపిస్తోందమ్మా…! అసలు దేవుడు మనుషులు కోరుకునే ఇలాంటి పిచ్చి కోరికలే తీరుస్తాడనీ, డబ్బు దస్కం అడిగితే ఇవ్వడనీ అనిపిస్తోందమ్మా!” అన్నది. ఆ మాటలు విని నాకు నవ్వాగలేదు. వెంటనే అపచారం అపచారం అంటూ మనసులోనే లెంపలు వేసుకున్నా. కానీ ఎక్కడో ఓ మూల అదన్నది నిజమే కదా అనిపించింది.
అది మళ్ళీ ఇలా అంది,” అమ్మా నాకింకోటి కూడా అనిపిస్తోందమ్మా..! అసలు దేవుడు, దయ్యం అని పెట్టింది కూడా మగవాళ్ళేనని నా అనుమానం.అందుకే అన్నీ వాళ్ళకి అనుకూలంగా రాసుకున్నారనుకుంటానమ్మా. లేకపోతే దేవుళ్లకి అంతమంది పెళ్ళాలెందుకమ్మా పనిలేక….! పెళ్ళాం మాత్రం పతివ్రతగా ఉండాలి, వీళ్ళు మాత్రం ఇష్టం వచ్చినట్టు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, మానభంగాలు చేయవచ్చని ఎందుకు పెట్టారమ్మా నాకు తెలవక అడుగుతాను? “ దాని లోని ఆవేశం చూసి నాకు ముచ్చటగా అనిపించినా, “ ఒసేయ్ చాల్లే ఇక ఆపు నీ ధోరణి, ఎవరైనా వింటే నువ్వు నాస్తికురాలివని అనుకుంటారు.”
“ అనుకుంటే అనుకోనివ్వండమ్మా..! నేను ఎవరికీ భయపడను. నేను భగవంతుణ్ణి నమ్ముతాను కానీ ఇలా కాదు. ఎవరేం చెప్తే అవన్నీ ఆలోచన లేకుండా గుడ్డిగా పాటించనమ్మా! అది సరేగానీ అమ్మా నాకు చాన్రోజులనుంచీ ఒక అనుమానం తొలుస్తోందమ్మా..! ఈ దేవతలకి మనలాగా నంబర్ టూ లు వన్లు, ఆకలి దప్పులు ఉండవంటకదమ్మా… మరి ఈ అయ్యప్పస్వామి పుట్టుకను ఎలా అనుకోవాలమ్మా… మోహినీ అవతారంలో ఉన్న ఇష్ణు మూర్తికీ, శివయ్యకీ పుట్టినాడని చెప్తారు కదా అదెలా సాధ్యం అమ్మా? మీకు తెలుస్తే చెప్పండమ్మా?” ఆ మాటకు నేను ఖంగు తిన్నానంటే నమ్మండి….. అయినా ఇదేమిటీ ఇది నా మీద ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తోంది..? కాసేపుంటే ఆ కుమార స్వామి ఎట్టా పుట్టాడని కూడా అడగవచ్చు…! హతోస్మి! నాకు తెలుస్తే కదా చెప్పడానికి..! ఆ కాళిదాసు మహానుభావుడు ( ఆయన రాసిన కుమార సంభవం) చచ్చి ఏ లోకంలో ఉన్నాడో కానీ ఇప్పుడు ఆయనని అర్జంటుగా క్రిందికి పిలవాల్సొస్తుంది ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి. కటకటా, ఆ కాళిదాసు కుమార సంభవంలో శివపార్వతుల సంగమమం ఎట్లా జరిగిందీ, పార్వతీ దేవిని నఖశిఖపర్యంతం ఎలా వర్ణించిందీ వాళ్ళకి కుమార స్వామి మామూలు మానవులకు పుట్టినట్లుగానే జన్మించాడనీ చెప్తే ఊరుకుంటుందా…..మరింకేమీ ప్రశ్నలు వేయకుండా…! సందేహమే…..! అందుకే ఇక కుమార స్వామి ఊసే ఎత్తకుండా జాగ్రత్త పడాలి అనుకుంటుండగానే ప్రక్కింటి సరోజగారు సమయానికి వచ్చి నన్ను రక్షించారు కాబట్టి బ్రతికి పోయాను కానీ లేకపోతే దీని చేతిలో ఈ రోజు ఆ ముత్యాల ముగ్గు లో చెప్పినట్టు ఖరుసై పోయేదాన్ని కదా…హా హతవిధీ!
* * *
ఆ రోజు రాత్రి శ్రీవారికి ఈ జరిగిన చర్చ గురించి పూసగుచ్చినట్లు చెప్పి ఆయన స్పందన కోసం తనవంక చూసాను.
ఆయన నా వంక ముసి ముసి నవ్వులతో చూసారు. అది కాదు మధూ మన పూర్వీకులు సామాన్య మానవులకు ఏ విషయమైనా సైంటిఫిక్ గా చెప్తే అర్థం కాదని ఏదో ఒక స్టోరీ రూపంలో చెప్పేవారు. స్టోరీస్ వినిపించడంలో ఆంతర్యం ఏంటంటే కథలైతే మనస్సుకి హత్తుకుంటాయి. అవి పదేపదే వినడం మూలంగా గుర్తుంటాయి. అవే కథలు తరతరాలకు అందించబడడం మూలాన లోకంలో బాగా ప్రాచుర్యం పొంది అన్ని తరాలు లబ్ధి పొందుతాయి. అసలు మన పూర్వీకులు అంటే మన రుషులూ, మహర్షులూ సమాజ కల్యాణం కోసమే తమ జీవితాన్ని వెచ్చించారు. ఈ తులసి కథ విషయమే తీసుకుంటే చిన్న సింపుల్ లక్ష్యం కోసం అలా కథ రూపంలో ఈ విధంగా చెప్పారు. అదేంటంటే ప్రాథమికంగా తులసి ఆరోగ్యానికి మంచిది. దాన్లో ఎన్నో ఔషధగుణాలు ఉన్నాయి. అవి సమస్త మానవాళికి అందించాలన్న ఒకే ఒక్క లక్ష్యం, తాపత్రయంతో ప్రతి ఇంటి ముందు గానీ వెనకాల కానీ పెంచుతే వాటి ఆకులు మనం వాడుకునేందుకు వీలుగా ఉంటుంది. రోజూ పూజలో ఉపయోగించడమే కాదు ఒకటి రెండు ఆకులు తినమని కూడా పెద్దలు చెప్పారు. ఎందుకంటే అవి ఆరోగ్యానికి మంచివి కాబట్టి. ఊరికే చెప్తే ఎవడూ పాటించడు అని ఒక పురాణ కథ కల్పించి, తులసి ఎంతో పవిత్రమైనదనీ దానికి పూజ చేయాలనీ చెప్తూ మనందరం దాన్ని పాటించేలా చేసారు.
అంతేకాదు ఇంకో విషయం ఏంటంటే ఎవరైనా చనిపోయేటట్లున్న సమయంలో గొంతులో తులసి తీర్థం పోయాలంటారు. ఆ నియమం పాటించటానికి కూడా మన పెరట్లో తులసి ఉండటం అవసరమే.
ఇదంతా జనాలకు బుర్రకెక్కడం కోసం ఓ ఇన్టరెస్టింగ్ కథ అల్లి చెప్పారు. అంతేకానీ శ్రీ మహా విష్ణువు దుర్మార్గుడూ కాదు, తులసిని మానభంగం చేయనూ లేదు. అసలు పరమాత్మ నిర్వికారుడు. ఒక సూపర్ పవర్ అంతే…! ఇవన్నీ మనం కల్పించుకున్నవి.” ఏమంటావ్ అన్నట్టు నా వంక చూసారు.
నాకు నిజం చెప్పొద్దూ, ఒక ట్రాన్స్ లోంచి బయటకు వచ్చినట్లైంది. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడెప్పుడు మా పనమ్మాయికి ఈ విషయం చెపుదామా అన్న ఉత్సుకతతో ఎప్పుడు నిద్ర లోకి జారుకున్నానో నాకే తెలీదు.
**
చనిపోతున్నవారికి గొంతులో తులసి తీర్థం పోయడంలోని ఆంతర్యం ఏంటంటే మృత్యువు దగ్గర పడుతున్నప్పుడు మనిషికి కఫం గొంతులో అడ్డు పడుతుందంటారు. ఆ సమయంలో తులసి తీర్థం ఆ కఫాన్ని తొలగించి భగవన్నామాన్ని ఉచ్చరించటానికి వీలుగా గొంతుని క్లియర్ చేస్తుందన్న కారణం చేత అలా మరణానికి దగ్గరలో ఉన్న వ్యక్తికి గొంతులో తులసి తీర్థం పోయమని చెప్తారని భావించవచ్చు.