*”తెలంగాణ వైభవం మహిళా చైతన్యం” వ్యాస సంకలనం పరిశోధకులకు కరదీపిక

– తరుణి పత్రిక సంపాదక వర్గం

సాహిత్యం సమాజాన్ని దర్పణం పడుతుంది. ప్రాంతీయ స్పృహ పెరిగిన ఈ సందర్భంలో మహిళల చైతన్యాన్ని ఎట్లా చూడాలి ? ఈ ఆలోచన తో వచ్చిన పుస్తకమే ఈ పుస్తకం.
కాలం ఎప్పుడూ ఒక్కలాగే ఉండదు కొత్త ఒరవడి తో సాగుతుందనే విషయం
తెలంగాణ చరిత్రలో వెలిగిన స్త్రీ లనూ, తెలంగాణ సంస్కృతినీ , తద్వారా నారీ శక్తిని ఆవిష్కరించిన 44 మంది మహిళా కలాల స్వరమే ఈ పుస్తకం.

తెలంగాణ నేల అస్తిత్వాన్ని, వైభవాన్ని, నారీ శక్తి చైతన్యాన్ని సమగ్రంగా ఆవిష్కరిస్తూ వెలువడిన గ్రంథం “తెలంగాణ వైభవం మహిళా చైతన్యం”. మొత్తం 44 మంది మహిళా రచయిత్రులు తమ భిన్న నేపథ్యాలు, అనుభవాలు, అభిరుచులు ఉన్నవాళ్లు అంతా ఒకే తాటిపైకి వచ్చి తెలంగాణ గొప్పదనాన్ని కీర్తిస్తూ రాసిన వ్యాస సంకలనం ఇది. కేవలం పుస్తకం కాదు, ఇది తెలంగాణ మహిళా మేధో శక్తికి అద్దం పట్టే చారిత్రక దర్పణం. భావి తరాలకు ఓ దిక్సూచి వంటిది.
ఈ విశిష్ట సంకలనానికి చంటి ప్రసన్న కేంద్ర ఫౌండర్ ప్రెసిడెంట్ మరియు ప్రధాన సంపాదకురాలు రాజీవ (లక్ష్మీ వాసన్) గారు విశేష కృషి చేశారు. సీనియర్ విద్యావేత్త, తెలంగాణ సాహితీ లోకానికి మకుటం లేని మాణిక్యం లాంటి డాక్టర్ సరోజన బండ ఈ సంకలనానికి కృతి స్వీకర్త తో పాటుగా సారథ్యం వహించడం పుస్తకం విలువను మరింత పెంచింది.
పుస్తకంలో ప్రధాన అంశాలు :-
ఈ సంకలనం ముఖ్యంగా ఐదు విస్తృతమైన అంశాలను కేంద్రంగా చేసుకుని సాగింది. ప్రతి విభాగంలోనూ రచయిత్రులు లోతైన విశ్లేషణ, చారిత్రక అవగాహనతో కూడిన వ్యాసాలను అందించారు.
1. తెలంగాణ చరిత్ర మైలురాళ్లు
ఈ విభాగంలో అశ్మకుల నుండి శాతవాహనుల వరకు స్త్రీ సాధికారత, కాకతీయుల పాలన, శాసనాలు –స్త్రీలు, కుతుబ్షాహీల కాలంలో స్త్రీల చారిత్రక విశ్లేషణ, బ్రిటిష్ కాలం నాటి స్త్రీ విద్య, తెలంగాణ స్త్రీల సంస్కరణ ఉద్యమం, తెలంగాణ ఉద్యమంలో మహిళల పాత్ర, తెలంగాణ సాహిత్యంలో మహిళ, స్వతంత్ర తెలంగాణ పోరాట నవలలు వంటి అంశాలపై విలువైన వ్యాసాలు ఉన్నాయి. ఈ వ్యాసాలు పాఠకులకు తెలంగాణ చరిత్రను ఒక కొత్త కోణం నుండి, ముఖ్యంగా స్త్రీల దృక్పథం నుండి పరిచయం చేస్తాయి.

     గ్రంథాల రచయిత బండ సరోజన

2. తెలంగాణ నారీ శక్తి:
అలుపెరగని పోరాటం
తెలంగాణ నేలపై చైతన్య జ్యోతులను వెలిగించిన వీరవనితల గాథలను ఈ విభాగం కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. రాణీ రుద్రమదేవి, సమ్మక్క సారలమ్మలు, చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, రాణి శంకరమ్మ, ఆరుట్ల కమలాదేవి, జట్టి ఈశ్వరీబాయి, సంగం లక్ష్మీబాయి, సదాలక్ష్మి, డాక్టర్ కొండా శకుంతలాదేవి, యశోదరెడ్డి , శ్యామలాదేవివంటి యోధులు, సంఘ సంస్కర్తలు, ఉద్యమ నాయకురాళ్ళ పోరాటాలను, జీవిత సాఫల్యాలను అద్భుతమైన వ్యాసాల రూపంలో పొందుపరిచారు.
3. తెలంగాణ సంస్కృతి, పండుగలు.
ఈ శీర్షిక కింద తెలంగాణ జానపద కళారూపాల వికాసంలో స్త్రీ చైతన్యం, ఆదివాసీ తండాల సంస్కృతి, గోసంగి మహిళా సాహిత్యము, సంస్కృతి, బతుకమ్మ మరియు బోనాలు, దుర్గమ్మ తల్లి వంటి రాష్ట్ర పండుగల విశిష్టతను, దుర్గమ్మ తల్లి చరిత్రను రచయిత్రులు చాలా అందంగా, ఆకర్షణీయంగా తెలియజేశారు.
4. తెలంగాణ కట్టడాలు, ప్రాచీన చరిత్ర & వనరులు.
చారిత్రక కట్టడాలైన చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, వెయ్యి స్తంభాల గుడి, విశ్వవిఖ్యాత రామప్ప దేవాలయం, మన్యంకొండ, బాసర, శ్రీ విద్యాపురం, జోగులాంబ శక్తి పీఠం, భద్రకాళి ఆలయం వంటి ప్రదేశాలతో పాటు 33 జిల్లాల ప్రత్యేకతలను వ్యాసరూపంలో పొందుపరిచారు.
తెలంగాణ ముఖ్య వనరులు.
భౌగోళికంగా, సాంస్కృతికంగా, చారిత్రకంగా తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక స్థానం ఉన్నదని తెలియజేస్తూ తెలంగాణ జనవనరులు, పర్యావరణము పచ్చదనము, తెలంగాణలో చేనేత పరిశ్రమ వంటి అంశాలపై విశ్లేషణలు కూడా అందించడం సమకాలీన అంశాలపై దృష్టిని తెలియజేస్తుంది.
ముగింపు:-
భిన్న రంగాలలో ఉన్న 44 మంది మహిళా రచయిత్రులు తమ కలాలను కదపడం ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత. ఈ గ్రంథం వెలుగులోకి రావడానికి రాజీవ గారు, శారదా హనుమాండ్ల గార్ల కృషి ఎంతో ఉంది . రచయిత్రులందరూ అద్భుతమైన వ్యాసాలు రచించి ఈ గ్రంథాన్ని తెలంగాణకు అందించారు.
తెలంగాణ వైభవాన్ని, మహిళా చైతన్యాన్ని గురించి తెలుసుకోవాలనే ప్రతి ఒక్కరికీ ఈ “తెలంగాణ వైభవం మహిళా చైతన్యం” పుస్తకం ఒక విలువైన ఆకరంగా నిలుస్తుంది. రాబోయే తరాలకు ఎంతో ఉపయుక్తం గా ఉంటుంది. ఇది మహత్తర ప్రయత్నం! తెలంగాణ సాహిత్య , సాంస్కృతిక చరిత్ర ను పరిశోధన చేసే వాళ్ళకు కరదీపిక ఈ గ్రంథం.

Written by tharuni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంప్రదాయాల నెలవు – బొమ్మల కొలువు

అమ్మగారింటికి దారేది?..