తర తరాల మన సంస్కృతి సంప్రదాయాలకి ప్రతీకలు,వాటిని భావి తరాలకు వారధులు మన పండుగలు.
ప్రతీ నెలలో, ఋతువులు మారినప్పుడో, ఆయా సందర్భాలలో ఏదో రూపంలో పండుగలు జరుపుకుంటూనే ఉంటాము. ముఖ్యంగా జరుపుకునే పండుగలలో సంక్రాంతి,దసరా, దీపావళి ఘనంగా జరుపుకుంటాం.అల్లుళ్ళు అత్తవారింటికి వస్తారు. కొత్త బట్టలు, పిండి వంటలతో ఆనందోత్సాహాలతో గడుపుతారు.
వాటితో పాటు పండుగలో ప్రాధాన్యత సంతరించుకునే ముఖ్య ఘట్టం బొమ్మల కొలువు.
బొమ్మల కొలువు అంటే బొమ్మల ప్రదర్శన అని అర్ధం.
తెలుగు ప్రాంతాలలో బొమ్మల కొలువు, తమిళ నాడులో బొమ్మాకొలు, కర్ణాటకలో గోంబే హబ్బా అని పిలుస్తారు.
ఏ పేరుతో పిలిచినా ఈ పండుగల ముఖ్యం ఉద్దేశ్యం భావి తరాలకు సనాతన భారతీయసంస్కృతి, సంప్రదాయాలను,తెలియ చేయడం, పురాణ ఇతిహాసాల పట్ల అవగాహన కల్పించడం.
ఈ బొమ్మల కొలువులు వారి ప్రాంతాన్ని బట్టి, వంశ ఆచారాన్ని బట్టి, దసరా, దీపావళి, సంక్రాంతి పండుగల సందర్భాలలో పెట్టుకుంటారు.
ముఖ్యంగా దీపావళి చెడుపై మంచి సాధించిన విజయానికి సూచనగా జరుపుకునే పండుగ. చీకటిని చీలుస్తూ వెలుగుజిలుగులు విరజిమ్మే పండుగ. ఈ పండుగలో ప్రధాన ఆకర్షణ బొమ్మల కొలువు. బొమ్మలకొలువు అంటే ఏవో నాలుగు బొమ్మలను పెట్టేయడం కాదు. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించేలా, పురాణ ఇతిహాసాలను చాటిచెప్పేలా ఉండాలి బొమ్మలఅమరిక.
అసలు ఈ బొమ్మలకొలువులు ఎందుకు పెడతారు అనే విషయానికి వస్తే దసరాల్లో అయితే మహిషాసురుడు అనే రాక్షసుడు, దీపావళికి అయితే నరకాసురుడు అనే రాక్షసుడు మద గర్వoతో స్త్రీలు అబలలు కనుక వారిని మినహాయించి ఎవరి వల్ల మరణం సంభవించకుండ బ్రహ్మ నుంచీ వరం పొందారని, ఆ వరగర్వంతో దేవతలను హింసించే వారని, ఆ దేవతలు బ్రహ్మను శరణుకోరగా, ఆయన పరాశక్తిని వేడుకొనమని చెప్పాడట. అంత ఆ దేవతలందరు ఆ పరాశక్తిని ప్రార్ధించగా, ఆ తల్లి దయతో వారికి అభయమిచ్చి, తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలలో దుష్ట రాక్షసులతో యుద్ధ చేసి, వారిని సంహరించినదని, విజయసూచకం గా ఆ రోజుని విజయదశమి పండుగ జరుపుకునే వారని ఒక కథనం.
నరకాసురుడు అనే అసురుడు విష్ణుమూర్తి రాక్షససంహారం చేస్తున్న సమయంలో, ఆయన చెమట బిందువు భూమిపై పడడం తో ఆవిర్భవించినవాడు అని, తల్లివల్ల తప్ప మరెవరితో మరణం రాకూడదని బ్రహ్మ నుంచీ వరం పొందాడని, భూదేవియే సత్య భామగా జన్మించిందని మరొక కథనం.
ఆ పరాశక్తి అసుర సంహారానికి బయలుదేరుతున్న సందర్భంలో దేవతలందరూ తమ తమ శక్తుల్ని ఆ పరాశక్తిలో విలీనం చేశారని, ఆ తల్లీ దుష్ట సంహారం చేసి వచ్చే వరకూ, ఆ దేవతలందరు చలన రహితులై బొమ్మల్లా నిలబడిపోయారని, అందుకు ప్రతీకగా బొమ్మలకొలువు సంప్రదాయం ఆచరణలోకి వచ్చిందని ఒక కథనం.
నరకుని సంహరించడానికి సత్యభామ కూడా ఆదిశక్తిని అర్చించి వరాలు పొందినదని అంటారు.
బొమ్మలకొలువు అంటే దుకాణాల్లో అమ్మే విధంగా పెట్టే బొమ్మల ప్రదర్శన కాదు. ఆధ్యాత్మిక, సాంస్కృతికవారసత్వం.
మొదట ఒకమెట్టుతో ఆరంభించి 3,5,7,9 అలా బేసి సంఖ్యలో పెంచుకుంటూ వెడతారు.ప్రధానంగా అమ్మవారిని పూజించడానికి బొమ్మల కొలువు సంప్రదాయం ప్రారంభం అయిందని తెలుస్తోంది.
ముందుగా మెట్లు ఏర్పరుచుకున్నాక, వాటిపై తెల్లని వస్త్రం పరిచి, కలశస్థాపన చేసి గౌరీ దేవిని పూజించి, దేవతా విగ్రహాలను పైవరుసలో అమరుస్తారు. తమ వీలును బట్టి
ఎన్ని మెట్లు పెట్టినా పైనున్న మెట్టు మీద మాత్రం లక్ష్మీదేవి, దుర్గాదేవి, సరస్వతిదేవి, గణపతిమొదలైన దేవతావిగ్రహాలు పెడతారు.
ఆ తరువాటి వరుసల్లో ఇతర దేవతా మూర్తులు విష్ణుమూర్తి లక్ష్మీదేవి, శివ పరివారం, సీతారామ కల్యాణఘట్టాలు, శ్రీ కృష్ణుడు గోవర్ధనగిరినెత్తడం, కాళీయ మర్దనం, గీతోపదేశం వంటి సన్నివేశాల్లో ఉన్న బొమ్మల్ని అలంకరిస్తారు.
ఆ క్రింది వరుసల్లో రమణ మహర్షి, రాఘవేంద్రస్వామి,షిరిడి సాయిబాబా, రామకృష్ణ పరమ హంస వంటిఆధ్యాత్మిక వేత్తల బొమ్మలు, ఆ తరువాతి వరుసలు రాజులు, దేశనాయకుల విగ్రహాలు పెడతారు.
ఆ క్రింది వరుసల్లో మానవులు, పక్షి, జంతువుల బొమ్మలు, జాన పదులబొమ్మలు అలంకరింపబడతాయి.
ఈ అమరిక సృష్టి క్రమాన్ని ప్రతిబింబించేలా ఉంటుంది.
పెళ్లితంతులు, ప్రయాణసాధనాలు, పెద్ద ముత్తయుదువ, తల్లి పిల్ల బొమ్మలు, బ్రాహ్మణ దంపతులు, ఆవు దూడ, మొదలైనవితప్పక ఉంటాయి. అవకాశం ఉంటే జలపాతాలు, కొoడలు, గుట్టలుగా రాళ్లను పేర్చి దేవాలయ దృశ్యాలు, ముందుగానే నేలపై మట్టిపరిచి, గింజలుచల్లి మొక్కలు వచ్చాక జంతువులు, పక్షులు పక్షిగూళ్ళు అమర్చి, అభయారణ్యము ను సృష్టిస్తారు. చిన్న కొలను, అందులో పిల్లలు ఈత కొట్టడడం కూడా కనువిందు చేసేదృశ్యాలే.ప్రతీ ఏటా ఒక్కటైనా కొత్త బొమ్మను చేర్చడం ఆచారం.ఇత్తడి,మట్టి బొమ్మలు, పింగాణి, కొయ్య బొమ్మలు, ఏటి కొప్పాక మొదలైన బొమ్మలు పెడతారు.
ప్లాస్టిక్, బార్బీ వంటి బొమ్మలు పెట్టకుండా ఉంటే మంచిది.
ఈ పండుగల,బొమ్మలకొలువుల పరమార్ధంప్రధానంగా పిల్లలకి మన సంస్కృతి, సంప్రదాయాల్ని గురించి వివరించడం, పురాణ కథలపైఆసక్తి పెంచడం. బొమ్మల అమరిక లో వారిని కూడా భాగ స్వాములను చేస్తే వారి ఆనందంగా వర్ణనాతీతం. ఆయా సన్నివేశాలకు తగిన కథలను చెప్పడం ద్వారా వారికి పురాణాలపై గౌరవం, మన సంస్కృతి గొప్పదనం, వాటి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి పెరుగుతాయి.వారిలో ఐకమత్య భావన పెరుగుతుంది ఇరుగు పొరుగులలతో సత్సంబంధాలుఏర్పడతాయి. చరవాణికి బందీలు అయిపోతున్న ప్రస్తుతకాలoలో అది చాలా అవసరం. వారిలో కళా త్మక దృష్టి పెరుగుతుంది.
నరకచతుర్ధశి నాడు మొదలయ్యే బొమ్మలకొలువు, దీపావళి, తరువాతి రోజుకూడావుంటుంది. లక్ష్మీ పూజ చెయ్యడం,నైవేద్యం పెట్టి హారతి ఇవ్వడం,బంధు మిత్రులను పేరoటానికి పిలిచి వారిని భాగస్వాములను చేయడం ఆనందోత్సాహాలతో జరిగే ఘట్టాలు.
పాటలు పడడం, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో మిన్నంటే సంబరాలు.వీటితో పిల్లలతో పాటు పెద్దలకి స్నేహ సంబంధాలు పెరుగుతాయి. ఐకమత్యభావన పెరుగుతుంది స్త్రీల సృజనాత్మకతకు తగిన గుర్తింపు, ఆదరణ లభిస్తాయి.
పూర్తిగా అధ్యాత్మిక వాతావరణంలో జరిగే ఇలాంటి కార్యక్రమాలు తరతరాల వారధులుగా భావితరాలనుతీర్చి దిద్దుతాయానడంలో అతిశయోక్తి లేదు.