ఆకాశానికి ఎగసిన పాతకెరటం

ప్రముఖ రచయిత్రి,కాలమిస్ట్, సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత మాలతీ చందూర్ గారు!

ఆ రోజుల్లో చాలామందికి మాలతీ చందూర్ అంటే ఒక చూడదగిన వింత.పైగా ఆవిడ ప్రమదావనం,వంటలూ-పిండివంటలు… ప్రశ్నలూ-జవాబులు వారం వారం కనిపించేవి గానీ,ఆవిడ ఫోటో ఎక్కడా కనిపించేది కాదు.చాలామంది అభిమాన పాఠకులకు ఉత్సుకత ఉండేది,ఆమెను చూడాలని.పేరును బట్టి ఉత్తరాది వాళ్లనుకునేవాళ్ళు. చందూర్ ఇంటి పేరనీ, మాలతి అసలు పేరనీ,పశ్చిమగోదావరి జిల్లా వాస్తవ్యులనీ తరువాత తెలిసాయి వివరాలు.

ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందంటారు.కానీ ఆమె విజయం వెనుక వెన్నుదన్నుగా ఉన్నవారు(ఎమ్మెస్ సుబ్బలక్ష్మి సరసన సదాశివంలా) నాగేశ్వరరావు చందూర్ గారు.

ఆవిడ కథల నేపథ్యం చెన్నపట్నమే.సమతూకమైన చక్కని సాహిత్యం అర్థ శతాబ్దికి పైగా తెలుగు పత్రికారంగాన్ని సుసంపన్నం చేసింది.

ముళ్ళపూడి,రా.వి.శాస్త్రి గార్లు సాహిత్య లోకాన్ని ఏలుతున్న రోజులవి.తెలుగు పత్రికలన్నీ మద్రాసు నుండే వెలువడేవి.

“దేశీ పబ్లికేషన్స్” వారు ఆవిడ వ్రాసిన “పాప” అనే కథాసంపుటిని అచ్చువేసారు.
“లజ్ కార్నర్” అనే కథ చాలా బాగుంటుంది.

సినిమాలు అర్థం చేసుకోవడానికి తమిళ భాషను నేర్చుకుని,రెండేళ్లకే అనువాద రచనలు చేసిన మేధావి మాలతీ చందూర్ గారు. ఆమె తెలుగులో అనువాదం చేసిన “జయకాంతన్” గారి తమిళ నవల “సిలనేరంగళ”, “కొన్ని సమయాలలో కొందరు మనుషులు” శీర్షికతో ధారావాహికగా వెలువడి సంచలనం సృష్టించింది.

ఆంధ్రప్రభలో నిరాఘాటంగా సుమారు అర్థ శతాబ్ది పాటు “జవాబులు” శీర్షికను నడిపిన విదుషీమణి ఆమె.ఎన్నో రకాల సమస్యలకు ఆత్మీయంగా జవాబులిస్తూ, ఓదారుస్తూ, ధైర్యం చెప్తూ…తెలుగు వారి ఆప్తవర్గంలో చేరారు.వాటిని కొంతమంది అభిమాన పాఠకులు బైండింగులు చేసి, అపురూపంగా దాచుకునేవారు.నేడు పత్రికలలో వస్తున్న “కౌన్సిలింగ్” వంటి శీర్షికలకు ఆవిడే శ్రీకారం చుట్టారు ఆనాడే.

ఆంగ్ల భాషలోని మంచి నవలలను పరిచయం చేసే “పాతకెరటాలు” అద్వితీయం.ఆమె ప్రతిభ అంతర్జాతీయంగా వ్యాపించి,ఆకాశానికి ఎగసింది ఈ రచనల ద్వారా.వాటిని ఆసక్తిగా చదివిన వారిలో నేనూ ఒకదాన్ని అవడం ఎంతో గర్వకారణం!

“శతాబ్ది సూరీడు”,”హృదయనేత్రి”,
“శిశిరవసంతం”,”సద్యోగం”,
“ఆలోచించు”,”రాగరక్తిమ”,”భూమిపుత్రి”,”ఏమిటీ జీవితాలు”,”ఏది గమనం-ఏది మార్గం”,”రెక్కల చుక్కలు”,”కాంచనమృగం”,”కలల వెలుగు”,”రేణుకాదేవి ఆత్మకథ” వంటి 16 నవలలు రచించారామె.

స్నేహసౌహార్ద్రాలకు పుట్టినిల్లు చందూర్ వారి ఇల్లు.ఎందరో తెలుగు ప్రముఖులు వారి గృహాన్ని సందర్శించేవారు.

మాలతీ చందూర్ గారి రచనల గురించి కొంతమంది ప్రముఖ రచయితలు,రచయిత్రులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ, ఇలా ప్రస్తుతించారు :-
**************
“ఆమె శైలి సూటిగా,సుఖంగా,డొంక తిరుగుళ్లు లేకుండా హాయిగా ఉంటుంది. అనవసర అలంకారాలు ఉండవు.హాస్యోక్తులుండవు.
కథ వడివడిగా నడుస్తుంది.వ్యక్తిగతజీవితం గానీ,సాహిత్య జీవితం గానీ సంస్కారవంతంగా గడిపి,పాఠకుల మదిలో గౌరవప్రదంగా నిలబడిపోయే అదృష్టం మాలతీ చందూర్ వంటి కొద్దిమందికే సాధ్యం”
———– శ్రీ రమణ

“నవలా నిర్మాణము సూటిగా,స్పష్టంగా ఉండి,వ్యక్తులను,పరిస్థితులను కళ్లముందుంచుతారు.మనమే పాత్రను ఇష్టపడతామనేది మన సంస్కారంపై ఆధారపడి ఉంటుంది.”
—————— ఓల్గా

“ఆమె రచనలు స్త్రీలను ఆకట్టుకున్నాయి.ఎందరో రచనలను చేయడానికి పురికొల్పాయి.అట్లా రచయిత్రులు,రచయితలు అయినవాళ్లున్నారు.ఉత్తమ పాఠకులైనవాళ్ళు, ఉత్తమ గృహిణులు, ఉత్తమ సంస్కారం గల మహిళలుగా రూపుదిద్దుకున్నవాళ్లున్నారు.
— ముదిగంటి సుజాతారెడ్డి

“స్త్రీల ఉద్యోగ రంగ, జీవితరంగ సంఘర్షణలను,సర్దుబాట్లను,స్వతంత్ర వ్యక్తిత్వ జీవన ఆకాంక్షలను,ఆత్మగౌరవ చైతన్యాన్ని ఇతివృత్తంలో భాగం చేసిన నవలలు రచించారు మాలతీ చందూర్ గారు.”
—- కాత్యాయనీ విద్మహే

“భావ గాంభీర్యం, సునిశిత పరిశీలన,
విస్తృత పఠనం,అధ్యయనం,
కాలానికంటే ముందుండే నైజం,చెప్పదలచుకొన్న విషయాన్ని సందర్భోచితంగా,వాదనా పటిమతో, సమయస్ఫూర్తితో రచించే శైలీ,నైపుణ్యం…ఇవన్నీ కలగలిపితే ఆమె.
———- డా.శిలాలోలిత
*************
మాలతీచందూర్ గారి కథల్లో మహిళా చైతన్యం

ప్రసిద్ధిగాంచిన “లజ్ కార్నర్” కథలో కౌమారపు ప్రాయంలో ఉన్న ఒక అమ్మాయి,రెండు సార్లు బి.ఏ.ఫెయిల్ అయిన వాడితో తనకు ఇష్టం లేని పెళ్లిని తప్పించుకోవడానికి,ఇంట్లో చెప్పకుండా రైల్లో లజ్ కార్నర్ ప్రాంతానికి చేరుకుని;తన స్నేహితురాలి ఇంట్లో కలిసి,ఆశలు కల్పించిన సినిమా డైరెక్టర్ ని కలుసుకోవాలని ఫోన్ చేయగా,అది నెంబర్ లో కొద్ది తేడాగా ఉన్న శేఖరానికి కలుస్తుంది.ఇక్కడ ఒక సన్నివేశంలో ఒంటరి ఆడపిల్ల భయాలను తెలిపేలా, తన భార్యకు ఫోన్ చేయటానికి వచ్చిన వ్యక్తిపై అనుమానంతో గట్టిగా కేకలు వేయడం-పోలీస్ కానిస్టేబుల్ రావడం-సహజంగా వుంటుంది. ఆడపిల్ల ఆత్మరక్షణకు గట్టిగా అరవడం కూడా పనిచేస్తుందని దృశ్యమానం చేసారు రచయిత్రి. తాను ఒంటరిగా ఉన్నానని,రాత్రి పూట భయంగా ఉందని,త్వరగా వచ్చి,డైరెక్టర్ కు ఫోన్ చేయడానికి తన వద్ద నోట్లు తప్ప చిల్లర(రెండు అణాలు) లేనందువల్ల తనను తీసుకెళ్ల మంటుంది.
ముందు విసుక్కున్నా,ఒంటరి ఆడపిల్లపై జాలితో తన ఇంటికి తీసుకువస్తాడు శేఖరం. తనను ఎంతో ప్రేమించే వాళ్ళ అమ్మ, ఆ అమ్మాయిని ఆదరించి,ఆశ్రయమిస్తుంది.ఇంకా పెళ్లికాని శేఖరం ఆ అమ్మాయితో వేళాకోళం,వెటకారం ఆడడాన్ని అడ్డుకుంటుంది.తెల్లవారి చదువుకున్న దానివి,నీకెందుకు ఈ సినిమాలు?షూటింగ్ చూడు,నీకే అర్థమవుతుంది అంటూ రెండు రోజులు రాత్రంతా షూటింగ్ కార్యక్రమం చూడడానికి అనుమతిస్తాడు డైరెక్టర్. శేఖరంతో పాటుగా తెల్లవార్లూ షూటింగ్ చూస్తుంది.చెప్పిన సంభాషణే మళ్లీ,మళ్లీ చెప్పటం వంటి షూటింగ్ కార్యక్రమం చూసి,తలనొప్పితో శేఖరం ఇంటికి చేరుకుంటుంది.శేఖరం అమ్మ,ఆ అమ్మాయి(శ్యామల)ని ఆప్యాయతతో అడుగుతూ,వివరాలు రాబట్టి,వాళ్ళ నాన్నను ఫోన్ చేసి,పిలిపిస్తుంది.కొసమెరుపేమిటంటే-నెల తిరిగేలోగా, శేఖరానికి,శ్యామలకు పెళ్ళై,ఆ తర్వాత ఓ పాపకు తల్లవుతుంది.పాపం మీ అమ్మ సినిమా తార అవ్వాలనుకుంది.నువ్వన్నా తన కోరిక తీర్చు అంటూ వేళాకోళమాడే శేఖరం మాటలకు ఇంకా ఉడుక్కుంటూనే వుంటుంది శ్యామల అంటూ కథను ముగిస్తారు.
ఆ రోజుల్లో(1951) కనుక, శ్యామల శేఖరాన్ని కలిసి ఆపదను తప్పించుకుంది.డైరెక్టర్ కి కూడా చదువుకున్న ఆడపిల్లలంటే గౌరవం వుంది కనుక,కథ సుఖాంతమైంది.
చక్కని కథను చదివిన అనుభూతిని కలిగిస్తుంది,మాలతీచందూర్ గారి ఈ కథ.
గోముఖ వ్యాఘ్రాల, రుద్రాక్షలు ధరించిన తోడేళ్ల మోసాలు,
మాయలు నిండిన ఈ రోజుల్లో
అలా జరగడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి.

“డాబా ఇల్లు” కథలో ఒక్కో ఇటుక పేర్చి స్వయంగా కట్టుకున్న ఇంటికై షావుకారు దగ్గర అప్పు చేసిన పేద దంపతులు..అతనికి కాలుకు దెబ్బ తగిలి, కట్టలేకపోయిన మూడు నెలల వాయిదా వల్ల ఇంటి తాకట్టు వాకట్టు అయి,షావుకారు జప్తు చేసుకుంటే, కూలిపోయిన అతని కలల మేడ,ఆ మేడ గోడపై మేకులు కొట్టవద్దంటూ అతను చూపిన మమకారం ఎంతో హృద్యంగా,ఆర్ద్రంగా చిత్రించారు మాలతీచందూర్ గారు.ఇటువంటి ఎంతోమంది పేదల కష్టాలను, ఇటీవల హైడ్రా వారు కూల్చేస్తున్న పేదవారి కట్టడాలను కళ్ళకు కడుతుంది ఈ కథ.

“షణ్ముగం” కథలో తమిళం యాస కలిసిన భాషలో ఆమె అమాయకత్వాన్ని, సహజత్వాన్ని..మాధవి వంటి ఆధునిక మహిళల చిన్నచూపు ఆలోచనలను,కథానాయకుని పేదపిల్లకు సహాయం ముసుగులోని అతని ద్వంద్వ ప్రవృత్తిని మనకు తేటతెల్లం చేస్తారు.

“వారి సఖి” కథలో కథానాయకుడు ఒకప్పటి తాను ప్రేమించిన సఖి సుగుణను తన అర్థాంగి వద్ద పదే, పదే పొగుడుతూ ఉన్నప్పుడు ఆమె పడే మానసిక వేదనను తెలియజేస్తూ,అటువంటి ఎంతోమంది మహిళల వ్యధను మనకు గుర్తు చేస్తారు.అంతేకాక,వారి ఇంటికి భర్త ఆజ్ఞపై వెళ్ళినప్పుడు,ఆ మహిళ భర్త తన కొంగు పుచ్చుకున్న విషయాన్ని భర్తకు చెప్పి,మళ్లీ ఆ సుగుణ మాటెత్తకుండా నోరు మూయించడం.. చక్కని గుణపాఠం తన భర్తకు నేర్పడం చాలా బాగుంటుంది. మగవారి చేతిలో బాధలు పడే మహిళలు నేర్చుకోవాల్సిన విషయమిది.

“లగ్నబలిమి” కథలో ఇరువురు కథానాయకులలో నాయిక ఎవరివైపు మొగ్గుచూపుతుందోనని
ఉత్కంఠను రేపుతూ..పురుషుడు ప్రతి స్త్రీ వద్దా తన ఆంతరంగిక ప్రేమలు చెప్తాడా ఏమిటి?ప్రకృతి నేర్పుతుంది. పద్ధేనిమిది పైబడ్డ మగవాడికి ప్రేమించడమనేది ప్రకృతి నేర్పుతుంది. ప్రేమ లేకుండా ఉండడం అసంభవం.నిన్ను చూసేదాకా ప్రవరాఖ్యుడిలా మడికట్టుకు కూర్చున్నవాడు,నీ దగ్గరకొచ్చినా నువ్వు అతన్ని ప్రేమించలేవు అన్న ఒక్క సంభాషణతో తనను మొదటిసారి ప్రేమించే మగవాడి కోసం ఎదురుచూస్తున్న ఊగిసలాట కు తెరదించుతూ, ఆడవారి,మగవారి మనస్తత్వాలను మనకు తెలియజేస్తారు.

“కాంతమ్మ రెండో కూతురు” కథలో..అక్క చదువు ధ్యాసలో పడి, భర్తను పట్టించుకోకపోతే,చెల్లి బావకు దగ్గరై, గర్భవతి అవుతుంది.తన ఇద్దరి కూతుళ్ళ భవిష్యత్తు గురించి తపన పడే తల్లి మనోవ్యధను ఎంతో బాగా ఈ కథనంలో తెలిపారు మాలతీచందూర్ గారు.

“ఏనాటి జగన్నాథ్” కథలో తన కొడుకు చిట్టి తనను వదిలి హాస్టల్ కి వెళుతూ, తనను పట్టించుకోకుండా ఇంజన్ ను పసిచాపల్యంతో చూస్తున్నప్పుడు,తాను అదే వయసులో ఉన్నప్పుడు అక్క ఇంటిలో పరిచయమైన జగన్నాథ్ తనపై పెంచుకున్న ప్రేమను,తన జడలో గుచ్చుతున్న బంగారపు నారు పోసిన స్ప్రింగ్ చేమంతి పువ్వును పట్టించుకోకుండా,అతను తెచ్చే యాపిల్స్, బిస్కెట్ లు,జాంకాయలనే చూసి సంతోషిస్తూ,తనను విడిచి వెళ్ళేటప్పుడు ఏడుస్తున్న అతనిని అక్కకు చూపించడం వంటి బాల్యచేష్టలను గుర్తుకు తెచ్చుకుంటుంది.మనం కూడా అంతే కదా.. చిన్నతనంలో జరిగిన విషయాలను గుర్తు చేసుకుంటూ…అప్పుడలా ఎందుకు ప్రవర్తించానో అనుకుంటూ ఉంటాం. అప్పుటి వయసు,జీవితానుభవం లేని పసితనం అలాంటివని ఈ కథ ద్వారా తెలియజేసారు.

“నాన్న” కథలో విశ్వపిత గా వర్ణిస్తూ,తాను ప్రేమించిన జానకిని పెళ్ళైనా ప్రేమిస్తూ,విధవరాలైన ఆమె కొడుకుని లోకం మాటలకు జడవకుండా పెంచిన తండ్రి ఔన్నత్యాన్ని చాటారు.పెళ్లికాకముందు జానకి హేళన చేసినందువల్ల తన ఎడమచేతి ఆరో వేలుని కోసుకుని,సెప్టిక్ అయితే,మణికట్టు దాకా తొలగించిన విషయాన్ని అతని స్నేహితుడు చెప్పేదాకా తెలియనివ్వకుండా ఉంచడం..ప్రేమ వ్యవహారంలో పడి ఐ. ఎ. ఎస్. పరీక్షకు వెళ్లనని మొండికేస్తున్న కొడుకుకి చెప్పడం..కథనం ఎంతో బాగుంటుంది.తన కొడుకు కాకపోయినా,తాను ప్రాణప్రదంగా ప్రేమించిన జానకి కొడుకు కోసం అతని తాపత్రయం హృదయాన్ని ద్రవింపజేస్తుంది.యాసిడ్ దాడులు చేసే ఈ కాలపు యువత తప్పక చదవాల్సిన కథ ఇది.

“రక్షించా” కథలో నిష్ఠాగరిష్టుడైన తండ్రి,తల్లి రోగచికిత్స కోసం పట్నం వెళ్లి,వ్యసనాలతో నైతికంగా పతనమవుతుంటే చూస్తూ బాధపడే కొడుకు ఆవేదనను కళ్ళకు కడుతూ,ఆ ప్రభావం కొడుకుపై చెడుదారిలో వెళ్లేలా ఎలా ప్రోత్సహించిందో కథనంలో చూపుతారు.చివరకు తండ్రి పెళ్లి చేసుకున్న జానకి,తన సమవయస్కురాలు,అయిన ఆమెతో మోహంలో పడి, గర్భవతి అయిందని తెలిసి,మందు మింగించి,ఆమె మరణానికి కారణభూతుడవుతాడు. మూడేళ్ళ జైలుశిక్షకు పాత్రుడౌతాడు.తీపిలో వగరుంటుంది.నీలాంటి యువకుడు పిరికితనంతో పారిపోకూడదు అంటూ బోధించిన లాయర్ స్నేహితుడు రామంని తాను రక్షించానని చెపుతాడు.
స్త్రీ పురుషునిలా గాలిలో స్వేచ్ఛగా ఎగురలేదు.ఎగిరినా ప్రకృతి స్త్రీని కఠినంగా శిక్షిస్తుంది అంటూ జానకి మాటల్లో జీవితసత్యాలను చాటి చెపుతారు.

“అక్క” కథలో తాను ప్రేమించిన క్లాస్మేట్ జోగరావును కాక, తండ్రి చూసిన ఫారెస్ట్ ఆఫీసర్ ని పెళ్లి చేసుకున్న విధికి తలవంచిన బుద్ధిమంతురాలు అని నిర్వచిస్తారు.ఫారెస్ట్ ఆఫీసర్ తనను పెళ్లి చేసుకోలేదన్న అసూయతో,అత్త కూతురు సుశీ జగ్గరావుకు పెళ్లి అయిందని అబద్ధం చెబుతుంది.తన ఇంటికి జగ్గరావును,అక్కను పిలిచి,అవమానిస్తుంది. కానీ అక్క సుశీ వాళ్ళమ్మకి(అత్త) సంయమనంతో సమాధానమిస్తుంది.జరిగిన సంఘటన గురించి బాధపడుతున్న అక్కను ఓదారుస్తూ,ఆమె చెల్లి అవమానాలు భరించాలి.మనం ఆడవాళ్ళం.భూదేవి లాంటివాళ్ళం అంటుంది.ఆడవారి జీవితాల గురించి,ప్రేమించిన హృదయాల త్యాగం గురించి ఈ ఒక్క వాక్యంలో తేల్చి చెబుతారు మాలతీచందూర్.

“అచ్యుతం” కథలో ప్రస్తుతం డాక్టర్ భార్య అయిన రాధ, తనను ప్రేమించిన అన్నయ్య స్నేహితుడు, చివరి దశలో తన వద్దకు వచ్చి,తన చేతిలోనే కన్ను మూయడం విషాదాంత కథనం.స్త్రీకి వివాహంతో బాల్యం అంతర్థానమవుతుంది. ఈ మొగాళ్ళు ఇంద్రజాలికులు*ఇన్నాళ్ళలో నిన్ను చూడటానికి రానివాడు, ఇప్పుడు తన స్వార్థం కోసం ఈ దశలో వచ్చి,నిన్ను మాయ చేస్తున్నాడు అంటూ తన స్నేహితురాలు ఎంతగా చెప్పినా,రాధ అతనిని ఆదరించి,తన నిర్మల ప్రేమను చాటుకుంటుంది.కొంతవరకూదేవదాసు కథను గుర్తుకు తెస్తుంది ఈ కథ.

“జీవితపు విలువ నెలకు డెబ్భయి రూపాయలు” అంటూ గారాబంగా పెరిగిన డిప్యూటీ కలెక్టర్ కూతురు,ఐదు వందల రూపాయల జీతగాడికి భార్య అయిన జయ మతకలహాల్లో భర్త,పాముకాటుకు తండ్రి చనిపోతే..
జయ బ్రతుకుతుంది.చావదు.తనకోసం తను బ్రతుకుతుంది.నెమ్మది నెమ్మదిగా బి.ఈ.డి. కూడా అవుతుంది అని కథను ముగిస్తూ స్త్రీ సాధికారతను ఆ కాలంలోనే చాటారు మాలతీచందూర్ గారు.

ఇలా..ఆ కాలంలోని ఆడవారి,మగవారి మనస్తత్వాలను,ప్రేమను,త్యాగాలను,ధైర్యాన్ని, విధికి తలవంచే పరిస్థితులను తన కథలలో చిత్రించారు మాలతీచందూర్ గారు.అంతేకాక,ఆడవారి సాధికారతను,లేడీస్ క్లబ్బుల్లో ధనవంతులైన ఆడవారి ప్రవర్తనను,తోటి స్త్రీలపై ఆడవారు చూపే ఈర్ష్యాసూయలను కూడా సందర్భానుసారంగా తమ కథలలో చేర్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

గుండె పొరల్లో

చిట్టి కథ గొప్ప సందేశం