ఒడిపిళ్ళు- 31వ భాగం

ధారావాహిక నవల

షావుకారి ఇంటిముందు రోడ్డు మీద ఉన్న వారి దగ్గరికి “సరసుపదార్” నుండి వస్తున్న ముసలి భారిక్ ఆగాడు. ముడులతో ఉన్న తన పాత చేతి కర్ర పై వాలి నిలుచున్నాడు.

“సోమ్లా అనేవాడు మీ ఊరిలో ఉంటున్నాడా” అని, అక్కడ ఆడుకుంటున్న పిల్లలను అడిగాడు.

“మాకు తెలియదు” అంటూ పిల్లలు సమాధానం చెప్పారు.

ఆ వృద్ధుడు ఇంకా చాలా మందిని సోమ్లా గురించి అడిగాడు. చివరికి తండా వాసుల వద్ద కు వచ్చాడు. అది మధ్యాహ్న సమయం సోమ్లా తన కొడుకులతో కలిసి పగటి భోజనం చేయడం మొదలు పెట్టాడు.

అక్కడికి వచ్చిన బారిక్ ఇలా అన్నాడు “గ్రామ పెద్ద నన్ను పంపాడు” అని.

కానీ వారెవరూ సమాధానం చెప్పలేదు. ఎందుకంటే వారి నోటి నిండా మాండియా గంజి నిండి ఉన్నది.

“నా మాట వింటున్నారా” అంటూ బారిక్ మళ్లీ అరిచాడు. “మీరు రెండు సంవత్సరాల నుండి, భూమి పన్ను చెల్లించలేదు” అన్నాడు గట్టిగా.

“అవును నాకు తెలుసు” అన్నాడు సోమ్లా.

“పన్ను వసూలు చేసే అధికారి మన ఊరికి రాబోతున్నాడు” అంటూ కోపంగా తన చేతి కర్ర నేలపై కొట్టుకుంటూ,

“గ్రామ పెద్ద చెప్పమన్నాడు. మొత్తం బాకీలన్నీ పౌర్ణమి వచ్చేలోపు చెల్లించాలని. గుర్తుంచుకోండి. నేను మళ్ళీ ఇంత దూరం మీకోసం రాలేను. నేను చాలా ముసలి వాడిని. మీరు డబ్బు చెల్లించకపోతే భూమి వదులుకోవాల్సి వస్తుంది” అన్నాడు.

భూక్యా కోపంగా “మేము పన్ను చెల్లించకపోతే, గ్రామ పెద్ద మా పొలాలను వేరే ఎవరికో ఇస్తాడా” అని అడిగాడు.

“నిస్సందేహంగా ! అదే జరుగుతుంది” సమాధానం ఇచ్చాడు

“పన్ను వసూలు చేసే అధికారి ఏం చేయగలడు మరి. మీరేమనుకుంటున్నారు, మీరు ఋణబానిసత్వం ముగించుకొని, విముక్తులై వచ్చేవరకు ఆగుతారా, ఎవరైనా? అయినా, మీకోసం ఎవరైనా ఆదరం ఎందుకు చూపుతారు. రాజు మనుషులు గ్రామాలకు పర్యటనకు వచ్చినప్పుడు, మీ వంతుగా మీరు వెట్టిచాకిరీ వారికోసం ఏమీ చెయ్యలేదు. సరే పౌర్ణమి లోపు పన్ను కట్టకపోతే మీ భూములు తీసుకుంటారు. అందుకే వచ్చాను” అంటూ వారి సమాధానం కోసం, తన మాటల యొక్క ప్రభావం ఎలా ఉన్నది చూడకుండా, వెనుకకు తిరిగి మండుతున్న ఎండలో బలవంతంగా నడుస్తూ దూరంగా వెళ్ళిపోయాడు.

సోమ్లా అతని కుమారులు మౌనంగా కూర్చున్నారు. “నాకు తెలుసు, ఇటువంటిదే ఏదో జరుగుతుందని, ఆ భూమి వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. దానిని సేద్యం లేకుండా సంవత్సరమంతా ఊరికే వదిలేశారు. ఆ భూమిని తనకా పెట్టడానికి కూడా అంగీకరించలేదు. ఇప్పుడు చూడు ఆ భూమి కూడా మనం పోగొట్టుకుంటున్నాము. ఏది ఏమైనా ఇదంతా నీ వల్లనే…” అని తండ్రితో అంటూ కోపంగా లేచి వెళ్ళిపోయాడు భూక్యా. టిక్యా అతనిని అనుసరించాడు.

ముసలి సోమ్లా ఒక్కడే నలిగి పగిలిన మనసుతో శూన్యంలోకి చూస్తూ ఉన్నాడు. ఎండలో పొలాలు మండుతున్నాయి గాలి దుమ్ము లేపుతూ అక్కడ ఇక్కడ తిరుగుతోంది . అతని కళ్ళు చూస్తున్నాయి కానీ ప్రస్తుతానికి చీకటి కమ్ముకొని ఏదీ చూడలేక కూర్చొని ఉన్నాడు అక్కడ.

*** *** ***

ఇక్కడ తమ ఇంటి ముందు చీకట్లో కూర్చుని ఉన్నారు సాలీ, మాలీ చిన్నిగుడ్లలోని చిన్ని పురుగుల్లాగా తమపై తామే సానుభూతితో ముడుచుకొని ఉన్నారు. పెరిగిపోతున్న వారి కష్టం ఎవరికీ పంచుకోను వీలులేక మరీ బాధిస్తున్నది. తినడానికి ఇంట్లో ఏమీ లేకుండా అయింది. తినే తిండి లేనట్టే వారి బట్టలు కూడా పీలికలుగా విడిపోతున్నాయి. చినిగిన బట్టలను మళ్లీ మళ్లీ అతుకులు వేసి కుట్టుకుని ధరిస్తున్నారు. వారు వేసుకునే బట్టల నిండా అక్కడ అక్కడ మాసికలు మచ్చలు మచ్చలుగా వారు ఎన్నిసార్లు రిపేర్ చేశారో చూపుతూ, వారి ఆత్మాభిమానాన్ని తెలియజేస్తుంది. కానీ వస్త్రాలు సూదితో కుట్టడానికి వీలులేకుండా చిరిగిపోయాయి. దుస్తులనేవి తమ శరీరాన్ని కప్పుకోవడానికి. కానీ చిరిగిపోయి పీలికలుగా రాలిపోతున్న ఆ వస్త్రాల ముక్కలు ముక్కలుగా దారి వెంట జారి పడుతున్నాయి. వారి ఆత్మాభిమానం క్షీణించి కాలి కింద వేసి నలిపేసినట్టు బాగు చేయడానికి వీలు కాకుండా తయారయింది.

గ్రామ వీధుల్లో గుంపులు గుంపులుగా చేరారు ఊరివాళ్ళు. గుత్తేదారు మనిషి సంచి నిండా నాణాలతో యువతీ యువకులను కార్మికులుగా నియమించడానికి వచ్చాడు. ప్రతి గుడిసె ముందు కుటుంబ సభ్యులంతా కూర్చొని ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గుత్తేదారు ఇవ్వబోయే డబ్బు ఆశ పెడుతున్నప్పటికీ, తండ్రులు తమ కొడుకులతో “నువ్వు వెళ్ళడానికి వీలు లేదు. నేను దానికి అంగీకరించను” అంటున్నారు. కూతుళ్లను పంపడానికి తండ్రులు అంగీకరించినప్పుడు తల్లులు వారిని పంపేందుకు నిరసన తెలుపుతున్నారు.

ఒక ఇంటి ముందు కేవలం ఇద్దరు అమ్మాయిలు మాత్రం వారి నిర్ణయాన్ని తెలిపేందుకు కూర్చున్నారు.

కానీ మరొకరు సూక్ష్మరూపంలో అక్కడ హాజరై ఉన్నాడు. ఏ సంబంధం లేని ఆ వ్యక్తి ఎవరికీ కనిపించడు. ప్రతి చోటా అతను ఒక భాగమై మనుషుల యొక్క జీవన గమనంలో ఉంటాడు. వదిలి వేయబడిన ఇళ్ళలో, ఖాళీ వంటపాత్రల్లో, అతుకులు వేయబడిన దుస్తుల్లో, సాయంత్రం పూట ముసిరే చీకట్లలో పొంచి ఉంటాడు. మనుషుల మనసులను కలలతో నింపుతాడు. కష్ట సమయంలో అనుసరించడానికి కొత్త మార్గాలను చూపిస్తూ ఉంటాడు. ప్రమాదకరమైన అగ్ని పక్కన ముడుచుకొని నిద్రస్తూన్న వారికి ఎప్పుడూ జాగరూకతతో కాపలా కాస్తూ ఉంటాడు. తలుపుల అవతల ఉన్న వారిని లోపలికి తోస్తూ, మురికివాడలలో ఉన్నవారికి తలుపులు తెరుస్తూ, జైళ్లలో ఉన్న ఉరిస్తంభాల దగ్గర ఉన్న వాళ్లకి సలహాలు ఇస్తూ ఉంటాడు. ఆకలిగొన్న స్త్రీలను తమను తాము సంతల్లో అమ్ముకోవడానికి ప్రేరేపిస్తూ ఉంటాడు. అతనిలో అన్ని కోరికలు ఆకలి దాహం మూర్తీభవించి ఉంటాయి.

సాలీ, మాలీలు గుత్తేదారు గుమస్తా మాటలను వింటూ కూర్చున్నారు. కొందరి వేళ్ళు అదృశ్యంగా నాణాలతో నింపబడిన బస్తాల వైపు చూపబడుతున్నాయి.

సాలీ తనను తాను ఎప్పుడో సిద్ధం చేసుకుని ఉన్నది.

“మనం కూడా వెళ్లడానికి ఒప్పుకుంటే ఏమవుతుంది? చాలామంది అమ్మాయిలు వెళ్తూనే ఉన్నారు. మనకు మాత్రం డబ్బు అవసరం లేదా ?”అని తన చెల్లిని అడిగింది.

మాలీ ఏమీ మాట్లాడలేదు. కానీ ఆమె కళ్ళల్లో కొన్ని సందేహాలు కనిపించాయి.

“మనము మన నాన్నకు చెప్పలేదని, ఎదురుచూస్తూ ఉండనవసరం లేదు” అన్నది అక్క. తన చెల్లెలు కళ్ళలోని భావాలను చదువుతూ,

“మన ఇంటి పక్క వారు మన నాన్నకు, అన్నలకు సమాచారం ఇస్తారు. అయినా చాలా రోజుల నుండి మన ఇంట్లో తినడానికి ఏమీ మిగలలేదు. అందుకని ఇక్కడ ఉండి ఎదురు చూస్తూ ఉండలేము” అన్నది

ఆరాత్రి చీకటి వారిద్దరినీ కమ్మేసింది. అపరిచితమైన తెగువ ప్రేరణ సాలీలో కనపడింది. ఆమెకు ముందుకు సాగేందుకు మార్గం సులువయింది. చీకటిలో పడి ఉన్న బండల సంగతి ఇప్పుడు తెలియదు కదా.

“సరే మంచిది, మనం కూడా పోదాం” అన్నది మాలీ.

“రేపు పొద్దున బయల్దేరుదాం, ఇప్పుడు పడుకుందాము పదా ” అన్నది సాలీ.

తెల్లవారి ఉదయం కుటుంబ సభ్యులంతా గుత్తేదారు పనికి వెళ్లిన, చాలా ఇళ్ళు తలుపులు వేసి తాళ్లతో కట్టిఉన్నాయి. అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ వేకువనే లేచి సెలఏటికి వెళ్లి స్నానాలు ముగించుకొని, మంచు వలె తాజాగా తిరిగి వచ్చారు. వంట పాత్రలను, చాలా చౌకబారు రాతెండి గిన్నెలు ఇంకా కొన్ని అవసరమైన వాటిని, మూటలుగా కట్టుకొని తలపై మోస్తూ, గుత్తేదారు గుమస్తా వెనుక సాలీ, మాలీలు నడుస్తున్నారు. వారి వెనుక యువకులు కొందరు తమ సామానులను వెదురు బొంగుకు కావడి కట్టుకొని భుజాలపై మోస్తూ నడుస్తున్నారు. సగానికిపైగా గ్రామాలు ఖాళీ అయినాయి. అక్కడి నవ్వులన్నీ ఎండి కొట్టుకు పోయాయి.

కొండలు, పొలాలు తాజాగా తమ ఉనికిని నిలుపుకునే సాహసంతో కనిపిస్తున్నాయి. తర్వాత ఏం జరగబోతుందో ఎవరికీ తెలియదు. పాత అలవాట్లను వదిలి కొత్త వాటి వైపు కదలడం వారికి ఆనందాన్నిచ్చింది.

జాతీయ రహదారి చాలా దూరం వరకు వేయబడుతుంది. కచ్చితంగా ఎంత దూరం ఉన్నది ఎవరికీ తెలియదు ఏ ఒక్కరు అడిగే సాహసం చేయలేదు.

*** *** *** *** ***

సోమ్లా షావుకారు పొలాన్ని దున్నుతూన్నప్పుడు వార్త అతనికి చేరింది. భూక్యా ఎడ్లబండి తోలుకొని దూరం వెళ్ళి పోయాడు. టిక్యా పశువులను కాసేందుకు అడవికి పోయాడు. సోమ్లా స్పష్టంగా విన్నాడు ఆ వార్తను. కోపంతో దున్నడం మొదలు పెట్టాడు. నాగలి కర్రును భూమిలోపలికి లోతుగా నొక్కుతూ, తన శరీర బరువునంతా వేసి, శరీరమంతా నడుము మెడ నొప్పి పుట్టే వరకు కసిగా నొక్కుతూ ఉన్నాడు. ఎద్దులను దయ లేకుండా కొడుతున్నాడు. అతని కోపాన్ని బయటకి కక్కే మార్గం అదొక్కటే. తాను నిలబడి ఉన్న భూమిని కసిగా దున్నడము మాత్రమ అతను చేయగలడు.

సాయంకాలం భూక్యాతో జరిగిన విషయాన్ని చెప్పాడు. అది విన్న భూక్యా చాలా ఆనందించాడు.

“మంచిపని చేశారు అమ్మాయిలు” అని ప్రశంసించాడు.

తండ్రి కోపంతో మండిపడుతూ తిట్ల వర్షం కురిపించాడు.

“కొడుకు ఎందుకు నీకు కోపం వస్తోంది నాన్నా! గత సంవత్సరం నుండీ వారికోసం నువ్వు ఏమి చేయగలిగావు. మనం ఇల్లు వదిలిన దగ్గర నుండి, వారి సమస్యలను వారే పరిష్కరించుకుంటున్నారు. అవునా కాదా” అన్నాడు.

“అవును కానీ, వాళ్లు నన్ను ఎందుకు అడగలేదు” అని సోమ్లా గుర్రు మన్నాడు.

“వారు మంచి పని చేశారు. వారికి కావలసినవి వారు ఎందుకు సంపాదించుకోకూడదు. ఈ సమయంలో వారి కోసం మనం ఏమి చేయగలము. మన భూమిని షావుకారుకు తనఖా పెట్టి, మనం విముక్తి పొంది ఇప్పుడు ఏమి చేస్తాము. ఆ భూమితో ఏమి ఉపయోగం ఉన్నది. సాలీ, మాలీ ఇల్లు వదిలి వెళ్ళిపోయారు” అన్నాడు భూక్యా.

తరువాత టిక్యా “వాళ్ళు ఎంత అదృష్టవంతులు, నేను కూడా ఆ రోడ్డు పనికి వెళ్తే బాగుండు అనుకుంటున్నాను” అన్నాడు.

సోమ్లా రాత్రంతా తను పడుకున్న గడ్డి పై, కదులుతూనే ఉన్నాడు. ఎడతెరిపి లేకుండా చుట్ట కాలుస్తూనే ఉన్నాడు.

ఒక పరజ తన పొరుగు వారి పొలంలో సందర్భోచితంగా పనిచేసి, బహుమతులు తీసుకుంటాడు. కానీ, తన శ్రమను కూలీ కింద అమ్మడానికి సిద్ధపడడు. తన బిడ్డలు ఇంటి గుట్టు రట్టు చేశారని తన ఆలోచనలను తారుమారు చేశారని, అతను బాధ పడ్డాడు. అతని అనుభవాలన్నీ భూమికి సంబంధించినవి. పంట పండించడానికి పొలం ఎలా దున్నాలి, కాలువకు డ్యామ్ ఎలా కట్టాలి, అడవిలో చెట్లు ఎట్లా నరకాలి వంటివి అతనికి బాగా తెలుసు. కానీ ఈ రోజు జరిగిందానికి అతడు సంసిద్ధుడిగా లేడు.

రాత్రంతా విచారంగా విసుగ్గా గడిచిపోయింది. దోమల అతనిని పీడిస్తున్నాయి. తన ఆలోచనలు ముందుకు సాగడానికి అవి ఆటంకం కలిగిస్తున్నాయి. అతనికి తెలియ కుండానే వేకువజామున అతడు నిద్రపోగలిగాడు.

మరుసటి రోజు ఉదయం అతను లేచేసరికి, అతని మనసు స్పష్టంగా ఉన్నది. తన భూమిని వడ్డీవ్యాపారి కి తనకా పెట్టాలని నిర్ణయించుకున్నాడు. సాలీ, మాలీ తన భావాలను ముక్కలు చేసి, భూమికోసం కట్టుబడిన అతని మనసును మార్చేశారు. తన బిడ్డల కంటే భూమి విలువైనది కాదని తెలుసుకున్నాడు.

“భూక్యా మనం షావుకారు దగ్గరికి వెళ్లాలి” అన్నాడు కొడుకుతో.

“నిజంగా నీ ఉద్దేశం అదేనా నాన్నా?” అని అడిగాడు కొడుకు.

“మరి నేనేం చేయగలను ఇప్పుడు” తండ్రి అన్నాడు.

ఒక బాధాకరమైన పోటు పడింది భూక్యాకు. తేలు కాటు కంటే ఎక్కువ నొప్పి కలిగించింది అది. తండ్రి మంచి మాటకారి అయినా భూక్యా సందేహిస్తున్నాడు. ఇప్పుడు ఒక్కసారిగా భయం కలుగుతోంది.

తిరిగి ఆ భూమి వెనక్కి వస్తుందా. షావుకారు నమ్మదగిన వాడు కాదు.

“ముందు మనం బాగా ఆలోచించుకుంటే మంచిది. తొందరలో ఏపని చేయకూడదు” అని నెమ్మదిగా అన్నాడు తండ్రి తో.

“ఓ మంచిది. నేను ఇంతకుముందు తొందరలో కొన్ని పనులు చేశానన్న మాట, ఇదేనా నీ మొదటి అభిప్రాయం” అన్నాడు తండ్రి.

“అవును, అది నిజం. కానీ ఇప్పుడు షావుకారు మన భూమిని కాజేయవచ్చు కదా” అన్నాడు భూక్యా.

“నువ్వు పిచ్చి వాడివా! అతనికే వేలకొద్ది ఎకరాల సొంత భూమి ఉన్నది. మన భూమి ఎందుకు అతనికి. అతడు మన భూమిని తనకా పెట్టుకోవడానికి కూడా అంగీకరిస్తాడని నమ్మకం కూడా లేదు” అన్నాడు సోమ్లా.

భూక్యాకు తెలుసు తండ్రి ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత, అతడి మనసును మార్చడం అంత తొందరగా కుదరదు.

“సరే నాన్న మనం షావుకారిని అడుగుదాం” అన్నాడు నెమ్మదిగా.

ఆరోజు మధ్యాహ్నం సోమ్లా షావుకారు దగ్గరికి వెళ్లి, పొలం గురించి మాట్లాడాడు.

“నీ భూమితో ఏమి ఉపయోగం ఉన్నది నాకు. నీ గ్రామం చాలా దూరం. దానిపై డబ్బు పెట్టడం అంటే డబ్బులు పారేసుకోవడం అని అర్థం” అన్నాడు షావుకారు.

సోమ్లా చాలా దీనంగా అభ్యర్థించాడు “మేము అందరమూ నీ వద్దే పని చేస్తున్నాము. మాకు సహాయం నీవు తప్ప ఎవరు చేయగలరు. దయచేసి ఆ భూమిని తనకాగా తీసుకొని కొంత డబ్బు ఇవ్వండి” అన్నాడు.

“నీపొలాన్ని నాకెందుకు అమ్మకూడదు” అన్నాడు షావుకారు.

“నేను అమ్మాలనుకోవడం లేదు” సమాధానం చెప్పాడు సోమ్లా.

“ఒకవేళ నేను తనకాకు అంగీకరించకపోతే, ఏమి చేస్తావు” అంటూ కుట్రతో అడిగాడు షావుకారు.

“అటువంటప్పుడు నేనేమీ మాట్లాడలేను”అన్నాడు సోమ్లా.

“సరే మంచిది పో, పోయి పని చూసుకో, దాని గురించి తర్వాత మాట్లాడుదాం” అన్నాడు షావుకారు.

సోమ్లా దాన్ని అవమానంగా భావించాడు. ఎంతో ఖరీదైన తన సంపదను షావుకారుకు తనకా పెట్టడానికి అభ్యర్థించాడు. అయినప్పటికీ దానిని షావుకారు తిరస్కరించాడు.

అతడికేమి తెలుసు భూమి గురించి. కేవలం అతనొక వడ్డీ వ్యాపారి కొడుకు. ఒక రైతు భావాలు అతడికి ఎలా అర్థం అవుతాయి. అని షావుకారును నిందించాడు.

జరిగిన సంగతంతా కొడుకులకు వివరించాడు సోమ్లా.

“అతడొక పిసినారి, దుర్మార్గుడు. అతడిని మనమేమి చేయగలం” అన్నాడు భూక్యా.

“మొత్తం జిల్లాలోనే, అటువంటి నేల మరొకచోట లేదు. అంత మంచి భూమి షావుకారుకు ఎక్కడ దొరుకుతుంది” అని అన్నాడు టిక్యా.

కొడుకుల మనసుల్లో ఏమున్నదో తండ్రి అర్థం చేసుకున్నాడు.

“సరే మంచిది, నేను మళ్ళీ అతని దగ్గరికి వెళ్లి, ఇంకొకసారి అడుగుతాను” అన్నాడు.

కానీ భూక్యా చాలా నెమ్మదిగా “ఏది మంచిది అనిపిస్తే అదే చెయ్యి నాన్నా” అన్నాడు. అన్నదమ్ములిద్దరూ పనిలోకి వెళ్లారు. వారిని చూస్తూన్న తండ్రికి కళ్ళు చెమ్మగిల్లాయి.

ఎన్నో రకాలుగా భూక్యాకు తండ్రి పోలికలు ఉన్నాయి. ఎక్కువ మాట్లాడడు కానీ తండ్రి మనసును, ఆలోచనలనూ అర్థం చేసుకుంటాడు.

ఆ కొడుకుని చూసి తండ్రి చాలా గర్వ పడుతుంటాడు. అతడెప్పుడూ తన స్వాభిమానాన్ని మరిచిపోలేదు. పేద రైతు ఎప్పుడూ తన సొంత పొలంలోనే పని చేస్తాడు. పరిస్థితులు అతనిని కిందికి వంచినప్పటికీ, ఇంకా స్థిరంగానే ఉన్నాడు.  ఏప్రిల్ వెళ్లకముందే భూక్యా కోసం వధువును తెస్తానని, మాట ఇచ్చిన సంగతి గుర్తున్నది సోమ్లాకు.

కొన్ని సాయంత్రాల తర్వాత షావుకారు వద్దకు వెళ్లి మళ్లీ అడిగాడు సోమ్లా.

“ఏమి నిర్ణయించారు షావుకారూ” అని.

“దేని గురించి ”

“భూమి గురించి”

“ఏ భూమి”

“నేను మీకు తనకా పెడతానన్న, నా పంట పొలం గురించి. మీకు గుర్తుకు లేదా?”

“ఓ ఆ భూమి గురించా” ఆశ్చర్యపోయాడు షావుకారు.

“నీ మనసులో ఏముందో కచ్చితంగా చెప్పు” అన్నాడుషావుకారు.

“నా భూమిని నీవు తనకాగా తీసుకొని, భూకూకు విముక్తి కలిగించు. నేను టిక్యా నీ వద్ద పని చేస్తాము. భూక్యా పొలంలో పండించినదంతా నీకే ఇస్తాడు. ఆ విధంగా కొంత అప్పు డబ్బు నీకు చెల్లించగలుగుతాము” అన్నాడు సోమ్లా.

షావుకారు ఒక్కసారిగా కోపంతో గట్టిగా అరవడం మొదలు పెట్టాడు. “అయితే మీరు నా దగ్గర పని చేసి అలసి పోతున్నారన్న మాట” అని ఎటకారంగా “ఒక సంవత్సరంగా మీరు పని మొదలు పెట్టినప్పటి నుండి మీకు తిండి పెడుతున్నాను. అయినప్పటికీ మీరు నా నుండి పోవాలని దారులు వెతుకుతున్నారు. బుద్ధిలేనివాడా!! నీవు నీ కొడుకులు నీ మనుమలు నీ మునిమనమలు అందరూ పని చేసినా నీ అప్పు తీరదు. నీవేమో ఒక విలువ లేని భూమి నాకు ఇస్తాను అంటున్నావు. నాకు రాసి ఇచ్చిన అప్పు మొత్తం ఎంతో ? నీకు అర్థం అవుతుందా? నేను నీ కొడుకును ఎలా వదిలి పెడతాను? అంత మూర్ఖుడిగా కనిపిస్తున్నానా. నువ్వు ఎవరినైనా వెతుక్కో భూమి తనకా కోసం” అంటూ కోపంగా షావుకారు ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు.

ఆ చీకట్లో శుక్రుజానీ ఒక్కడే మిగిలిపోయాడు.

*** *** *** *** ***

ఇల్లు ఖాళీగా పడి ఉన్నది వెదురు బద్దలతో చేసిన ముందు తలుపులు పట్టీలుగా అలాగే ఉన్నాయి. కానీ అతుకుల నుండి వంకరగా వేలాడుతున్నాయి. ఇంటికి ఉన్న కట్టె మొద్దులకు చెదలు పట్టి ధ్వంసం చేశాయి. చెదలు పెట్టిన మట్టి గీతలు ఆ ఇంటి పరిస్థితిని కథలుగా చెబుతున్నాయి. ఇంటికప్పు నుండి సాలెగూళ్ళు వేలాడుతున్నాయి. వాటిల్లో చిక్కుకున్న పురుగులన్నీ చచ్చిపోయి ఖాళీగా స్మారకాలుగా కనిపిస్తున్నాయి. మట్టితో కట్టిన వరండా పగుళ్ళతో చలికాలంలో మనుషుల పెదవులు పగిలినట్టున్నది. ఇంటి కప్పు గడ్డి జరిగి ఖాళీలు ఏర్పడడం మొదలుపెట్టింది. వెదురు బద్దలతో చేసిన చట్రం అస్తిపంజరంలా మెరుస్తోంది.

మే నెల దాదాపు గడిచిపోయింది. పెద్దపెద్ద మేఘాల సమూహం గాలికి ఆకాశంలో జారుతున్నాయి. ఇంటికప్పు లో ఏర్పడిన సంధులు ఆకాశం నుండి పడే మొదటి చుక్క కూడా తామే పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తున్నాయి. పచ్చగా ఉండే తోటలో నుండి గాలికి ఎగిరిన ఎండిపోయిన ఆకులు కొమ్మలు చెల్లాచెదురుగా చుట్టూ పడి ఉన్నాయి. రెండు పాత బుట్టలు అడుగులు ఊడిపోయి చూరు నుండి వేలాడుతున్నాయి. కామ (కర్ర) విరిగిపోయిన గొడ్డలి దారిలో పడి ఉంది. ఇంటి ముందు వాకిట్లో చల్లారిన పొయ్యి బూడిదతో కప్పబడి, సగం కాలిన పొయ్యిల కట్టెలతో మిగిలి ఉంది.

ఇంటి వెనక పొలాల్లో రాగులు, వరి పంటలు ఒకప్పుడు ఘనంగా పండేవి. ఇప్పుడు ఆ పొలంలో ‘అడవి ఈటెగడ్డి’ మొలకెత్తి పెరిగి ఎండిపోయి ఉన్నది. కలుపు మొక్కలు కొన్ని ఎండిపోయి, ఆకులు రాలిపోయి, కాడలు మాత్రం నిలబడి, కాల చక్రం యొక్క గమనాన్ని గంటలు రోజులుగా వాటి నీడల ద్వారా కొలుస్తున్నాయి. అప్పుడప్పుడు గోరింక పిట్టలు ఆ గడ్డిపై ఎగురుతూ పురుగుల కోసం కిచకిచలాడుతూ భయంకరమైన నిశ్శబ్దాన్ని భంగపరుస్తున్నాయి. పక్షులు ఎగిరిపోయిన తర్వాత బతికి ఉన్న ఇలకోడి పురుగులు, పిట్టలు తిన్న పురుగుల కోసం స్మశాన మంత్రాలను. చదువుతూ విషాధగీతాలు పాడుతున్నాయి. పక్క పొలాల్లో నాగలి దున్నుతున్న చప్పుడుతో పాటు నాగలి కర్రు భూమిని చీలుస్తూ ఉన్న శబ్దము కూడా వినిపిస్తుంది .

కానీ సోమ్లా ఇల్లు అతని పొలము నిర్జనంగా పడి ఉన్నాయి.

***. *** ***. ***. ***

జాతీయ రహదారి మరమ్మత్తు కొనసాగుతుంది. నిజానికి అది ఒక మురికి దారి. ఎర్రమట్టి బురదతో నిండిపోయి ఇరువైపులా వరి పొలాలతో, జోడి, కానుగ చెట్లతో నిండి ఉన్నది. దట్టమైన గాలి కార్మికుల తవ్వకాలతో ఎర్రటి దుబ్బను లేపుతున్నది.

సుదూర గ్రామాలనుండి అనేకమంది ప్రజలు అక్కడికి పని చేయడానికి వచ్చారు. పరజ, గడబ జాతి స్త్రీలు ఎక్కువ మంది ఉన్నారు. పురుషులు మాత్రం అనేక గిరిజన తెగల నుండి వచ్చారు. ముఖ్యంగా కొండ జాతి పురుషులు ఎక్కువ మంది ఉన్నారు. వారి తరువాత తాపీ పనిలో ఎక్కువ నైపుణ్యం ఉన్న డోంబు జాతి వారు ఉన్నారు. వారంతా కలిసి విశ్రాంతి లేకుండా ‘విచిత్ర దర్శిని ‘ (కెలిడా స్కోప్= రంగు బొమ్మలు చూపే గాజు గొట్టం) నమూనా వలె కనిపిస్తున్నారు. పరజ స్త్రీలు రంగు రంగు పూసల నెక్లెస్లతో, గడబ స్త్రీలు చెవి నుండి భుజాల వరకు వేలాడే ఇత్తడి తీగల రింగులతో ఉంటే, ప్రకాశవంతమైన రంగు బట్టలు ధరించిన డోంబ్ స్త్రీలు మోటుగా ఉన్నా అందరిలో కలిసిపోయారు. బిరుసుగా అట్టలు కట్టిన జుట్టుతో కొండ స్త్రీలు ఉంటే, పెద్ద తలపాగ ధరించిన కాంట్రాక్టర్, నీలిరంగు పొగలు వదులుతూ పొగాకు చుట్టలు వెలుగిస్తున్నాడు. ఎర్రమట్టితో మేఘాలు ఏర్పడుతున్నాయి. మోకాలి వరకు మేజోళ్ళు వేసుకొని అందులో పెన్సిల్ ను గుచ్చి దర్జాగా నడస్తూన్నాడు. జరుగుతున్న పని కొలతలు వేసే టేపు అతని ఎద జేబు నుండి వేలాడుతున్నది.

పెద్దపెద్ద చదరపు గుంటలు తవ్వి, వాటి నుండి వచ్చిన ఎర్రమట్టిని కుప్పలు కుప్పలుగా పోశారు. ఒక చోట కంకరను దంచిన ఇసుక పొడిని దిబ్బ వలె పోస్తున్నారు కొందరు. మరికొందరు కార్మికులు పెద్ద పెద్ద రాళ్ళను చిన్న ముక్కలుగా పగలగొడుతున్నారు. ఇంకొందరు ఇసుకను, మట్టిని తట్టలలోకి ఎత్తి తమ తలలపై మోస్తున్నారు. నవ్వులు పాటలు కలిసి సాగుతున్న ఆ పని, చాలా సహజంగా చేతులు కాళ్లు లయబద్దంగా కదులుతున్నాయి. పురుషులు అవసరం లేకున్నా ఉన్నదానికంటే ఎక్కువ పని చేస్తున్నట్టు గట్టి గట్టిగా అరుస్తున్నారు.

సాయంకాలం పని ఆగిపోయింది. దగ్గర గ్రామాల్లో ఉన్నవారు తిరిగి ఇంటికి వెళ్ళిపోగా, మిగిలిన వారు రోడ్డు పక్కన కాలనీలో వెలసిన గుడిసెలోకి చేరారు. వారు కాలువ వద్ద మట్టిని కడుక్కున్నారు. స్త్రీలు చౌకబారు అద్దాలలో తమ ముఖాలను చూసుకుంటున్నారు. తలకు నూనె పట్టించి, అడవి పూలు అలంకరించుకున్నారు.

రాత్రి వంట కోసం పొయ్యిలను వెలిగించారు. యువకులు తమ డుంగుడుంగా వాయిద్యాలను మోగించడం మొదలుపెట్టారు. కానీ తొందరగానే అవి ఆగిపోయాయి. వెలిగించిన పొయ్యిలు చల్లారాయి. కార్మికులంతా తమ చిన్న చిన్న గుడిసెలలోకి పాక్కుంటూ పోయి తలుపులను బిగించారు.

ఇప్పుడా క్యాంపు చీకట్లో కలిసిపోయింది. ఎటువంటి గుర్తులు లేకుండా.

రోజు గడిచి పోగానే స్త్రీ పురుషులంతా తమకు తాము ధనవంతులుగా భావిస్తున్నారు. చాలా రాగి నాణాలను వారు సంపాదించారు.

మొదటి కొన్ని రోజులు చాలా త్వరగా గడిచి పోయాయి ఆసక్తి నడుమ కొత్త పరిసరాలలో, విచారించడానికి కానీ ఆనందించడానికి గాని సమయమే లేకుండా. కానీ క్రమంగా కొత్త పరిచయాలు స్నేహ బంధాలుగా మారాయి చుట్టుపక్కల పరిసరాలు సుపరిచితం అయిన తరువాత, చివరకు ఒకరికొకరు ఆప్తులుగా మారారు. కార్మికుల గుడిసెలు స్నేహాన్ని ఉత్సాహాన్ని వారి శరీరాల్లో కూడా నింపాయి. ఎర్రటి రోడ్డు క్రమం లేని గుట్టలు వారికి ప్రతి ఉదయం స్వాగతం పలుకుతున్నాయి. ప్రతిరోజు కార్మికులంతా తమ పని జరిగే చోటికి నడుస్తూ వెళ్తారు, కానుగ చెట్లు దారిలో పూలను రాల్చి ఉంచుతాయి. ఆ పువ్వులు వారి కళ్ళకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ప్రతి రోజు చిన్న చిన్న సంఘటనలతో జీవితం మొదలవుతుంది. ఒక పద్ధతిలో కొన్ని అంచనాలతో ఒక క్రమమైన పద్ధతికి అలవాటు పడ్డారు స్వల్ప విరామంతో. వారికి ఇప్పుడు అర్థమవుతోంది ప్రతి రైతు తన సొంత భూమిలో పని చేసుకుంటూ మధ్యలో చెట్టు కింద విశ్రాంతి తీసుకునే వాడు. తనకు నచ్చిన రాగాన్ని తన ఫ్లూట్ లో వాయించేవాడు.

సంధ్యా సమయంలో రెండు గద్దలు ఎగురుతూ గుడిసెల వద్ద ఉన్న వేప చెట్టు పైకి వచ్చేవి. అవి గుండ్రంగా తిరుగుతూ గిరికీలు కొట్టేవి, గాలిలో పిల్లిమొగ్గలు వేసేవి, ఒకదానిపై ఒకటి అరుసుకునేవి. అంతలోనే ఎగిరిపోయి మళ్లీ కలిసి వచ్చేవి. అవి ప్రతిరోజు ఒకే సమయంలో వచ్చి ఒక గంట మాత్రమే ఉండేవి. ఒకవేళ కార్మికులు వాటిని చూడలేకపోతే అసంతృప్తి పడేవారు. లోతైన అగాధంలా తెరుచుకుని పక్కు కట్టిన కాలి పగుళ్ళు లోపల దాగిన వారి గాయాలను చూపడం మొదలు పెట్టాయి.

వారి రోజులు అపరిచిత మైన అనుకూలాలతో సంఘటనలతో సాగుతున్నాయి. గడియారంలోని రెండు ముళ్లలాగా.

కానీ ఆ వేడుకలు సంఘటనలు ఏ మాత్రం ప్రాధాన్యత ఉన్నట్టు అనిపించడంలేదు. ఇంకా జీవితానికి ఒక లయ అంతర్గతంగా ప్రతిధ్వనిస్తోంది. వారి శ్రమను రోజులుగా లెక్కిస్తున్నారు. చెమటతో కాలానికి అంటుకున్న ఎర్రటి జిగట శరీరాలతో. వారు పని చేస్తున్నప్పుడు పాటలు పాడుతూ ఉంటారు. కానీ అది ప్రారంభంలో మాత్రమే.. రాత్రిపూట రేపు చేయవలసిన పని గురించి ఆలోచిస్తారు. రోజులు ఒకదాని వెనుక ఒకటి ఒక ఊరేగింపులా సాగుతున్నాయి.

*** *** *** *** *** *** ***

Written by Jwalitha

కవి, రచయిత, అనువాదకురాలు, ఫ్యామిలీ కౌన్సిలర్, సామాజిక కార్యకర్త, ప్రచురణకర్త, ప్రకృతి ప్రేమికురాలు, తెలంగాణ ఉద్యమ కారిణి అయిన జ్వలిత అసలు పేరు విజయకుమారి దెంచనాల.
‘బహళ’ అంతర్జాతీయ అంతర్జాల త్రైమాసిక మహిళా పత్రికను 2021నుండి నడుపుతున్నారు.
వీరి రచనలు-
కాలాన్ని జయిస్తూ నేను, సుదీర్ఘ హత్య, అగ్ని లిపి, సంగడి ముంత అనే నాలుగు కవితా సంపుటులు; ఆత్మాన్వేషణ, రూపాంతరం అనే రెండు కథల సంపుటులు; జ్వలితార్ణవాలు అనే సాహిత్య సామాజిక వ్యాసాల పుస్తకం; ఎర్రరంగు బురద, ఆత్మార్ణవం, జగన్నాటకం, ఒడిపిళ్ళు అనే నాలుగు నవలలు మొత్తం 11 పుస్తకాలు రచించారు. ముజహర్ నగర్ లో దీపావళి, ‘పరజ’ వంటి అనువాదాలతోపాటు, బహుజన కథయిత్రుల పరిచయం, మెరిసే అనువాదాలు, అనువాద నవలలు పేరుతో శీర్షికలను నిర్వహించారు.
స్వీయ సంపాదకత్వంలో ఖమ్మం కథలు, మల్లెసాల చేతివృత్తికథలు, కొత్తచూపు స్త్రీల కథలు, పరివ్యాప్త, సంఘటిత, రుంజ, కరోనా డైరీ, లేఖావలోకనం, గల్పికా తరువు, ఓరు వంటి పదో సంకలనాలను ప్రచురించారు. గాయాలే గేయాలై, పూలసింగిడి వంటి అనేక పుస్తకాలకు సహసంపాదకత్వం వహించారు.
మర్డర్ ప్రొలాంగేర్, వుండెడ్ లైవ్స్ పేరుతో వీరి కవిత్వం ఆంగ్లానువాద పుస్తకాలు వెలువడ్డాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

హరిచందన -13 వ భాగం

భాషాసుందరి