ఎవరీ సౌందర్య సీమను
దగ్ధ మరుభూమిగా కాల్చుతున్నది?
సుతిమెత్తని వెన్నెల కిరణాలను లాగి
పదునెక్కిన విచ్చుకత్తుల్లా మారుస్తున్నది?
హరివిల్లుకు రంగులద్దే ఊహలను చిదిమి
విద్వేషాల రాత్రి దుఃఖంలో ముంచి
నువ్వూ నేననే విషాన్ని మనం అనుకున్న
మన మొహాలకు చిమ్మ చీకటి మసిగా
పులుముతున్నది?
ఈ యుద్ధాలు ఈరోజున ఆకాశం దిగివచ్చిన
అద్భుతాలు కావు
నువ్వూ నేనూ పుట్టకముందే
వెయ్యిన్నొక్కసార్లు కళ్ళునెత్తినపెట్టుకు నడిచి
కాలు జారి బొక్కబోర్లాపడి
తలలు బొప్పికట్టి
తలదించుకు వెనక్కు తిరిగినవే
రధాలెక్కి ఊరేగే రాజులకు పహరాగా
చుట్టూ పదహారు మంది రక్షకులైనదీ
అందలాలెక్కే కాళ్ళకు నిచ్చెనలైనది
అదిగో యుగాలుగా నువ్వూ నేనే కదా
అడుగడుగునా రక్తతర్పణాలు
ప్రవహించి ప్రవహించి ఇంకిపోయిన నేల
మరుభూమిగా మారి
మళ్ళీ ఎడారి మొక్కలుగా మొలిచినదీ
నువ్వూ నేనేగా.
ప్రశ్నలూ జవాబుల కాలం అంతరించిపోయింది
కాపలా కాస్తున్న వెయ్యికళ్ళకు
ఎక్కడో ఒక చోట ఓ చిన్న మెలిక
ఓ చిన్నలొసుగు చాలు
అధికారాలు విసిరి, మచ్చిక చేసుకున్న
కుక్కలను వెంటేసుకు
రాజసాలు ఒలకబోసేందుకు
తలదాచుకుందుకు వెతుక్కున్న దిగంతాలు
వెచ్చని సూరీడునూ, వెన్నెల మడుగులో
జలకాలాడే పున్నమి బాలుడినీ
వెలుగుల చుక్కలనూ
ఎప్పటికప్పుడు గుటుక్కున మింగే
కొండచిలువలవి
కొత్తబిచ్చగాళ్ళు పొద్దెరుగరు
రాత్రింబవళ్ళు జోలెపట్టుకు తిరగడమే పని
అధికారాల కోసం, అందలాల కోసం
ఊరుకోసం, పేరు కోసం
నకిలీ అర్హతలు పులితోళ్ళలాకప్పుకు
మాటల మత్తుబిళ్ళలు నోటినిండా నింపుకు
రాచరికం వెళ్ళబోస్తూ చేతులు చాపుతూనే ఉంటారు
పాపం
వెన్నుముక లేకుండా పుట్టిన అమీబాలు
ఇప్పుడు అర్హతలంటే బలాబలాలు తేల్చుకోడమే
బరిలోకి దిగేది మేధస్సూ కాదు
వాక్సంపదా కాదు
తరంగాలు తరంగాలుగా ఎగసి
వాదనలై , అశ్లీలాలై సునామీగా విరుచుకుపడే
సృజనాత్మకత రూపం
ఈ నాటి అద్దంలో రాజకీయప్రతిబింబమే
రవిగాంచని చో కవిగాంచుననే వారు
కవి ఎవరో మరి కాసుల గలగలకే తెలుసు
గద్దెలెక్కిన ఘనులకే తెలుసు
భావ సముద్రాలు ఈదే భావుకులకు కాదు
రాత్రీ పగలూ నిచ్చెనలు లేని అంబరాన్నెక్కి
సూరీడినీ, చుక్కలనూ , నెలవంకనూ బుజ్జగించి
వెంట తెచ్చుకునే అమాయక స్వాప్నికులకూ కాదు
సిఫారసుల ఎముకలు ఎరవేసి చేపట్టే పదవులూ
పన్నేరాలూ ఎందుకులే
ఎదురుచూస్తున్న పదపల్లవాలను పలకరించాలి
ప్రతి ఉదయమూ పూల తివాసీ పరచే
కవితలు అల్లుకోవాలి
ప్రతి సాయంత్రం పరిమళాలు రువ్వే
సుగంధ బావాలు
మల్లెపొదల తలిరాకుల నోమారు
మనసారా పరామర్శించాలి.
వేట నా ఆట కాదు