సమాజానికి ఉపయోగపడే రచనలకు గుర్తింపు ఉండాలిొ – కామేశ్వరి

ముఖాముఖి

ప్రఖ్యాత రచయిత్రి డి. కామేశ్వర్ గారి ని నెల్లుట్ల రమాదేవి తీసుకున్న ఇంటర్వ్యూ తరుణి పాఠకుల కోసం …2026 జులై 25 నాడు డి కామేశ్వరి గారికి సన్మానం జరిగే సందర్భంలో ఈ ఇంటర్వ్యూ ప్రాముఖ్యతను సంతరించుకున్నది .డి .కామేశ్వరి గారి కథలపై సమగ్ర విశ్లేషణ చేసి “డి కామేశ్వరి కథలలోని స్త్రీల సంవేదన” అనే పేరుతో ప్రచురించిన పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సందర్భంలో డి.కామేశ్వరి గారికి సన్మానం. అలాగే తరుణి పత్రిక ఎడిటర్ డాక్టర్ కొండపల్లి నీహారిణి రచించిన ముదిగంటి సుజాత రెడ్డి గారి కథల సమగ్ర విశ్లేషణ చేస్తూ రచించిన “కథా సుజాతం” పుస్తకాన్ని కూడా ఇదే వేదిక ఆవిష్కరిస్తున్న సందర్భంలో డాక్టర్ ముదిగంటి సుజాత రెడ్డి గారికి సన్మానం చేస్తున్నారు. ఈ సందర్భం రచయిత్రులకు కవయిత్రులకు ప్రేరణత్మకంగా ఉంటుంది.

ఆ కాలంలో అవకాశాలు ఎక్కువ లేకున్నా రచయితలుగా వీరిద్దరూ నిలబడిన ప్రస్థానాన్ని ఈ ముఖాముఖి ద్వారా తెలుసుకోవచ్చు.                                                                   – సం.

నెల్లుట్ల రమాదేవి : నమస్కారం మేడం!

కామేశ్వరి : నమస్కారం

మీ బాల్యంలో సాహిత్యానికి దోహదపడిన అంశాలేవైనా ఉన్నాయా ? మీ పూర్వీకులలో రచనలు చేసిన వారున్నారా

జ: ఆ రోజుల్లోనే నేను పెరిగిన రామచంద్రపురంలో మంచి లైబ్రరీ ఉండేది. నాకు పన్నెండు పదమూడేళ్లకే పుస్తకాలు చదవడం అబ్బింది. మా అక్క లైబ్రరీ నించి శరత్, చలం పుస్తకాలతోబాటు కొమ్మూరి సాంబశివరావు డిటెక్టివ్ సాహిత్యం తెచ్చి ఇంట్లో పెద్దవాళ్లకి తెలియకుండా దాచి చదివేది.అక్క నుంచి నేను చదివేదాన్ని. నాకు శరత్ సాహిత్యం బాగుందనిపించేది. ఆ రోజుల్లో ఆంధ్రపత్రిక కొత్తగా రావడం ఆరంభించింది. పావలా పెట్టి అది కొనిపెట్టమని అక్క, నేను ఎంత బతిమిలాడేమో ఇప్పుడు తల్చుకుంటే నవ్వు వస్తుంది. ఆ రోజుల్లో భారతి మాసపత్రిక, ఫిల్మ్ ఇండియా అని హిందీ సినిమా పత్రిక నాన్న క్లబ్ నించి తెచ్చేవారు. భారతిలో ఎంతో మంచికథలు వచ్చేవి. పురాణం సుబ్రహ్మణ్యశర్మ, భమిడిపాటి రామగోపాలం, వాకాటి పాండురంగారావు లాటి ప్రసిద్ధుల కథలకి ఆ రోజుల్లోనే అభిమానినైపోయాను. అలా సాహిత్యం పట్ల ఆసక్తి పెరిగింది. మా అమ్మ వాళ్ల నాన్నగారు కామేశ్వర్ రావుగారు కాకినాడలో మంచి లాయరుగానే గాక,నలభైల్లోనే రెండు లా పుస్తకాలు రాసి ప్రఖ్యాతి గాంచారు. బ్రిటిష్ ఇండియా టైంలోనే కాక ఆ పుస్తకాలు ఇప్పటికీ న్యాయశాస్త్ర ప్రామాణిక గ్రంథాలుగా నిలిచాయి. బహుశా ఆయన జీన్స్ నాకొచ్చాయేమో! ఇక మా ఫ్యామిలీలో మామయ్య ఒకరు, మా పిన్ని కొడుకు, మా అన్నయ్య కొడుకు ఇంగ్లీషులో పుస్తకాలు రాస్తారు.అయితే వాళ్ళు రాసేది ఫిక్షన్ కాదు, నాకర్థం కూడా కాదు.తెలుగులో రాసేది నేను ఒకర్తినే.

*మీరు పుట్టిన కుటుంబం గురించి చెప్పండి.

జ: నేను పుట్టింది 1935,కాకినాడలో, పెరిగింది చాలావరకు రామచంద్రపురంలో. నాన్న ఆ రోజుల్లోనే మద్రాస్ గిండిలో ఇంజనీరింగ్ చదివి రోడ్స్ అండ్ బిల్డింగ్స్ శాఖలో ఇంజనీరుగా ఉద్యోగం చేసేవారు. మా నాన్నగారికి తరుచూ ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉండడంతో అమ్మని, పిల్లలని రామచంద్రపురంలో పెట్టారు చదువులకోసం. మాది ముందునించి మధ్యతరగతి కుటుంబం. పల్లెలు,పాడిపంటలు, వ్యవసాయం, పెద్దగా కష్టాలు ఏమీ తెలియకుండానే పెరిగాం. అలాని వేలు, లక్షలు ఉండేవి అనికాదు. ఉన్నంతలో హాయిగా తింటూ చదువులమీదే ఆధారపడిన బతుకులు మావి. మాతామహులు కాకినాడలో లాయరు. పితామహులు మా నాన్న చిన్నప్పుడే కలరా వ్యాధితో పోతే, అప్పటికే భర్త పోయిన అక్క పన్నెండేళ్ళ తమ్ముడిని…అంటే మా నాన్నని పెంచి పెద్దచేసింది. ఆ రోజుల్లో అక్క, తమ్ముడు కలిసి రెండకరాల పొలం మీది ఆదాయం, ఇంట్లో సగం భాగం అద్దెకిచ్చి ఆడబ్బులతోనే మా నాన్నని ఇంజినీరింగ్ చదివించారంటే నిజంగా మెచ్చుకోవాలి. సౌత్ ఇండియాలో నాలుగు రాష్ట్రాలకు కలిపి మద్రాస్ ప్రెసిడెన్సీలో 25 సీట్లు మాత్రమే ఉన్న ఒకే ఒక మద్రాస్ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ సంపాదించడం అంటే మాటలు కాదు. అమ్మ ఎనిమిదో తరగతి వరకు చదువుకుంది. అప్పటికి అదే గొప్ప. పదమూడేళ్లకే పెళ్లయింది. మేము ఏడుగురు పిల్లలం, ఆడపిల్లలు నలుగురు మగపిల్లలు ముగ్గురు. ఒక తమ్ముడు చిన్న వయసులోనే ఎయిర్ఫోర్స్ లో ఇంగ్లాండ్ లో మిసైల్ ట్రైయినింగ్ చేస్తూ చనిపోయాడు.మా నలుగురు అక్క చెల్లెళ్ల భర్తలు ఇంజనీర్లే. అన్నయ్య కూడా ఇంజనీరే, భారత్ ఎలక్ట్రానిక్స్ ఛైర్మన్ గా రిటైర్ అయ్యాడు. ఒకతమ్ముడు డాక్టర్.

మీ తొలి రచన ఎప్పుడు చేశారు ? అది ప్రచురింపబడిందా ? వెలుగు లోకి వచ్చినపుడు మీరు ఎలా అనుభూతి చెందారు ?

జ: 1962 ప్రాంతాల్లో మా వారి ఉద్యోగరీత్యా ఒరిస్సాలోని రాయగడ అనే వూరిలో ఉండేవారం. తెలుగు వారు చాలా మంది వుండడంతో అక్కడ తెలుగు పత్రికలు బాగానే దొరికేవి . ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ పోస్టులో తెప్పించుకునేదాన్ని. పత్రికల్లో ఆరోజుల్లో ఒకపేజీ ఆడవారికి సంబంధించిన వ్యాసాలు ఆడవారు రాసినవి వేస్తుండేవారు .ఒకరోజు ఎందుకో ఆ పేజీ చూసి నాకు ఏదన్నా రాసి పంపాలనిపించింది .అప్పటికపుడు పిల్లల పాత నోట్ బుక్ లో ఓ పేజీ చింపి ‘వనితలు -వస్త్రాలు’అని ఒకవ్యాసం రాసాను. ‘ఎలాటి ఆడవారికి ఎలాటి వస్త్రాలు బాగుంటాయి, ఏ సమయాల్లో ఎలాటి దుస్తులు నప్పుతాయి, మన వస్త్రధారణ మన టేస్ట్ కి సరిపోవడం కాదు, చూసేవారికి గౌరవం కలిగేట్టు వుండాలి’ అంటూ ఓ పేజీ రాసి పంపాను. చిత్రంగా పంపిన రెండు వారాల్లో ప్రచురించి ఎనిమిది రూపాయలు మనియార్డర్ తో బాటు పుస్తకం కూడా రావడంతో నా సంతోషం ఏమని చెప్పను? నా మొదటి సంపాదన ఆరోజుల్లో ఎనిమిది రూపాయలంటే ఇప్పుడు ఎంతకి సమానమో తెలియదు. ఆ ఉత్సాహంలో ఈ సారి కథ రాసి పంపాలనిపించింది. ఏం కధ రాయాలి అని ఆలోచించి కొన్ని తెల్ల కాయితాలు కొని హ్యూమరస్ కథ అయితే వెంటనే వేస్తారేమో అని ఆలోచించాను. ఓ రోజు కూర కోసం ఆకాకరకాయలు తరుగుతుంటే వాటి మీదే రాద్దాం అనిపించింది. ఆకాకరకాయలు అపురూపంగా ఎప్పుడో కానీ దొరకవు. ఆకాకరకాయ వేపుడు ఎంతో ఇష్టం ఉన్న ఆనందరావు, దానికోసం అతను పడ్డ ఆరాటం, కష్టాలు, ఆ కూర వండడం చేతకాని పెళ్ళాం ఆ కూరని ఎలా తగలేసిందో….ఓ ఆరు పేజీల కథ రాసి పంపితే ఆ నెక్స్ట్ వీక్ అచ్చయి పోయింది. చదువుతుంటే నేనే రాసానా అనిపించి, పత్రిక వారు పంపిన పాతిక రూపాయలు మనియార్డర్ చూసి నేను ఒకరచయిత్రిని అయిపోయానని సంబరపడిపోయాను.

*మీరు రచనలు చేయడం ప్రారంభించిన రోజుల్లో ప్రముఖ రచయిత్రుల రచనలు అన్ని పత్రికలలో ముమ్మురంగా వస్తూ ఉండేవి. వారిని ఎదుర్కొని రచయిత్రిగా నిలదొక్కుకోవడం మీకు కష్టమయిందా?
జ. నేను కథలు రాసేటప్పటికే యద్దనపూడి సులోచనారాణి, కోడూరి కౌసల్యాదేవి వంటి రచయిత్రుల సీరియల్స్ పత్రికల్లో వస్తూ వుండేవి. ఇంకా చాలామంది రచయిత్రులు రచనలు చేస్తూండేవారు. నాకు వారిని ఎదుర్కోవడం లేదా తట్టుకుని నిలదొక్కుకోవడం అనే ఆలోచనే రాలేదు. నాకున్న అవగాహనతో నేను రాసుకుంటూ పోయేదాన్ని. నేను రాసిన ప్రతి కథ అచ్చయ్యింది. మూడో సారి ఆరోనెల గర్భిణీగా ఉండికూడా కథలు రాసి పంపుతూ వుండేదాన్ని .ఆరేడేళ్లలో వివిధ పత్రికల్లో కథలు వచ్చి రచయిత్రిగా స్థిరపడ్డాను. ఒకవేళ నా రచనలు ప్రచురింపబడకపోతే ఆ ఆలోచన వచ్చేదేమో తెలీదు. *మీరు ఒకే ఒక్క కవితా సంపుటి తీసుకొచ్చారు. ఎందుకు?! కవిత్వం పట్ల… ముఖ్యంగా ఇప్పుడొస్తున్న కవిత్వం పట్ల మీ అభిప్రాయం ఏమిటి?! జ: పెద్ద పెద్ద కావ్యాలు రాస్తేనే కవులు అనే భావం నాకుండేది. కఠినమైన భాష, వ్యాకరణం, ఛందస్సు లాంటివన్నీ బాగా తెలిసి, వాటి ప్రయోగం చేయగలిగితేనే కవిత్వం రాయాలనుకునేదాన్ని. నేనంత పెద్దగా చదువుకోలేదు, అలా రాయనూ లేను. అయితే పత్రికల్లో వస్తూన్న కొందరి కవిత్వం చదివాక, పర్వాలేదు…చిన్న చిన్న పదాలతో, తేలికైన మాటలతో కూడా కవిత్వం రాయొచ్చుననిపించింది. భావం ఎలా పలుకుతుందనేది ముఖ్యం. అలా నాకు తోచినప్పుడల్లా అప్పుడప్పుడూ రాసుకున్న కవితల్లో కొన్ని ఆంధ్రజ్యోతి వంటి పత్రికల్లో వచ్చాయి. వాటిని ‘ప్రేమ పక్షి’ పేరుతో పుస్తకంగా తీసుకొచ్చాను. ఆ తరువాత పెద్దగా కవితలు రాయకపోవడానికి వేరే కారణం ఏమీ లేదు. నాకు కథలంటేనే ఎక్కువ ఇష్టం అన్నది తప్పితే ! ఇప్పటి కవిత్వం గురించి చెప్పేంత అవగాహన నాకు లేదు. కానీ, ఎక్కువమంది పొడిపొడిగా, అసలు కవిత్వమేనా అనిపించేలా రాస్తున్నారు. మనసును తాకేలా కవిత్వం ఉండడం లేదు.

*రచయిత్రులందరూ పుంఖానుపుంఖాలుగా నవలలు రాసే కాలంలో మీరు కథలు ఎక్కువగా రాయడానికి ఏదైనా కారణం ఉందా ? నవలకూ, కథకూ ప్రధానమైన తేడా ఏమిటి ?

జ: నేను సాహిత్య రచనలోకి అడుగుపెట్టేటప్పటికే చాలా మంది సీనియర్ రచయిత్రులు పత్రికలకు సీరియల్స్, డైరెక్టు నవలలూ రాసి మంచి పేరు సంపాదించుకున్నారు. నేను మొదట్లో మంచి రచయితల కథలు చాలా ఎక్కువగా చదవడం వల్లనో ఏమో…నాకు కథ రాయడమే ఇష్టంగా వుండేది. ఏదైనా క్రిస్ప్ గా రాయడమే బాగుండేది నాకు. దాన్ని ఎలాగైనా సాగదీసి నవలగా చేద్దామని వుండేది కాదు. అయితే అప్పట్లో నవలలకే ఎక్కువ క్రేజ్ ఉండేది. పబ్లిషర్లు కూడా నవల వేయడానికి ముందుకు వచ్చేవారు.ఇప్పట్లా ఎవరి డబ్బులు పెట్టి వారే పుస్తకాలు వేసుకునే పరిస్థితి కాదుగా! నన్ను చాలా మంది పబ్లిషర్స్ ‘ఒక నవల ఇవ్వండి. అలా అయితేనే మీ కథల పుస్తకం వేస్తాం’ అనేవారు. ఓసారి హైదరాబాదుకు వచ్చినపుడు పోతుకూచి సాంబశివరావుగారు ఏర్పాటు చేసిన రచయిత్రుల సమావేశంలో పాల్గొన్నాను. అక్కడ కె రామలక్ష్మి నన్ను ఎమెస్కో రావుగారికి పరిచయం చేసింది. ఆయన అడిగాక మొదటగా’కొత్త నీరు’ నవల రాసాను. అలా అప్పుడప్పుడూ రాసిన నవలలు మొత్తం 21. నా నవలలు కూడా నాకు మంచిపేరు తెచ్చాయి. కానీ, నాకున్న పరిశీలన, అవగాహన మేరకు కొంచెం కల్పన జోడించి కథ రాయడం నాకు సులువుగా, ఆసక్తిగా వుండేది. కథతో పోలిస్తే నవలకున్న కాన్వాస్ పెద్దది. ఇంకొన్ని సంఘటనలు, మరిన్ని పాత్రలు, విస్తృత జీవన చిత్రణ నవలకు అవసరం. కొన్ని కథాంశాలు నవలలోనే ఇముడుతాయి. ఒక కాలపు చారిత్రక, సామాజిక జీవన చిత్రణ కథ కన్నా నవలలో ఎక్కువగా చూపించవచ్చు. అయితే సుదీర్ఘంగా రాసినపుడు బిగి సడలకుండా, ఆసక్తిగా చదివింపజేసేలా నవల వుండాలి. ఒకటి రెండు సంఘటనలు, కొన్ని పాత్రలు కథకు సరిపోతాయి. అయితే తక్కువ పదాల్లోనే ఎంతో చెప్పడం కథకున్న టాస్క్. అది కూడా ఒక్కోసారి కష్టమే! అయినా, నాకెందుకో ఒక ఐడియా రాగానే కథ రాసేదాన్ని.

*రచనకు సామాజిక ప్రయోజనం తప్పని సరిగా ఉండాలా ? మీ రచనలకు అది నెరవేరిందా?

జ. తప్పకుండా ఉండాలి. రచనలకి సామాజిక ప్రయోజనం ఉండాలన్న ధ్యేయంతోనే నేనయితే ముందు నుంచీ రచనలు చేస్తున్నాను. ఈ తరంలోని సమస్యలు,వర్తమాన సమాజం ఎలా ఉందో ముందు తరాల వారు తెలుసుకోవడానికి దోహదపడేది సాహిత్యం ఒకటే అని నా నమ్మకం. ఆ కారణంగా ఈనాటి సాంఘిక, రాజకీయ,ఆర్థిక,సామాజిక స్థితిగతులు ఎలా ఉన్నాయో ఈనాటి రచనలు ముందు తరాల వారు చదివితే తామెంత పురోగమించారో లేక తిరోగమించారో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నది నా భావన. సాహిత్యం అంటేనే మంచి హితవు చెప్పేదిగా ఉండాలని నా ఉద్దేశ్యం. ఆ సిద్ధాంతానికి కట్టుబడి ఆనాటి నుంచి ఈనాటి వరకు రచనలు చేస్తున్నాను. ఒక రచన ఒక్కరి ఆలోచననైనా మంచివైపుకు మార్చగలిగితే ఆ రచనకు ప్రయోజనం చేకూరినట్లే. కొన్ని సార్లు నా రచనలు చదివిన పాఠకులు తమ భావాలను నాతో పంచుకున్న విధానాన్ని బట్టి నా రచనల ప్రయోజనం నెరవేరిందనే అనుకుంటున్నాను. అలా పాఠకుల, విమర్శకుల దృష్టిలో ఓ మంచి రచయిత్రిగా స్థానం సంపాదించుకోవడం నా అదృష్టం అని భావిస్తాను.

*మీరు ఉన్నత విద్య చదివే అవకాశం, ఉద్యోగం చేయాల్సిన అవసరం రాలేదు. అయినా ‘ వేట’ లాంటి సాంకేతిక కథలు రాశారు. ఇందుకు పరిశీలనే కారణమా లేకపోతే ప్రత్యేక అధ్యయనం చేశారా ?!

జ: నేను కథలు రాసేనాటికి ప్రత్యేక అధ్యయనం చేయటం అనేది ఇంకా రాలేదు. కాకపోతే నాకెప్పుడూ ఏదైనా కొత్త విషయం పాఠకులకు చెప్పాలని ఉండేది, లేదా ఎప్పుడూ చెప్పే విధానంలో కాకుండా కొత్త పద్ధతిలో చెప్పాలని అనిపించేది. మేము ఒరిస్సాలో ఉన్నప్పుడు మా ఆడపడుచు భర్త ఫారెస్టు డిపార్ట్మెంట్లో డిఎఫ్ ఓగా పనిచేసేవారు. ఆయన చాలా నిజాయితీ గల ఆఫీసరు. అప్పట్లో నాకు ఈ ఫారెస్ట్ అధికారులు వేటకి వెళ్లడం ఇదంతా తెలుసును గానీ, వేటకు ఎలా వెళ్తారు, ఏం చేస్తారు అనే దానికి సంబంధించి మరికొంత లోతుగా తెలుసుకోవాలని ఉద్దేశంతో కొన్ని సాంకేతిక విషయాలు ఆయన్ని ఓసారి అడిగి తెలుసుకున్నాను. ఇక చివరన కాంట్రాక్టర్లు ఫారెస్ట్ అధికారులకు లంచాలు ఇచ్చి వాళ్లకు కావాల్సిన విధంగా పనులు చేయించుకోవడం వంటివి అక్కడక్కడా నేను వింటూ ఉండేదాన్ని. కాకపోతే ఆ చివరన ఒక కాంట్రాక్టర్ ఒక అమ్మాయిని ఎరగా వేసి తనకు కావలసిన పని చేయించుకోవడం అనేది మాత్రం కల్పితం. అది నేను కథాసంవిధానం కోసం జత చేశాను. అయితే అలాంటి సంఘటనలు అక్కడక్కడా జరిగేవట కూడా. కాకపోతే ఆ కథ చాలామందిని ఆకట్టుకుంది. ఇంకొకటి ఏంటంటే అందులో ఒక తప్పు కూడా జరిగింది. వేటకు వెళ్ళిన వాళ్ళు సిగరెట్ కాల్చినట్టు నేను రాశాను.నిజానికి వేటకు వెళ్ళినప్పుడు సిగరెట్లు కాల్చరు. జంతువులకు ఆ వాసన పడదు. సిగరెట్ కాలిస్తే కనుక జంతువులు అసలు ఆ వైపుగా రావు అనే విషయాన్ని నేను తర్వాత తెలుసుకున్నాను.ఎవరు కూడా ఈ విషయం గమనించి నాకు చెప్పలేదు, తర్వాత నాకే తెలిసింది.

*మీ సాహితీ జీవితంలో బాగా థ్రిల్ అయిన సందర్భం ఏదైనా వుందా?!

జ: నేను రచనలు చేయడం మొదలుపెట్టి అప్పుడప్పుడే నా కథలు పత్రికల్లో బాగా ప్రచురింపబడడం మొదలయ్యాక ఆరేడేళ్లకి, బహుశా 1969 – 70 ప్రాంతాల్లో అనుకుంటా…మా వారి ఉద్యోగరీత్యా మేము అప్పుడు హీరాకుడ్ డామ్ దగ్గర బుర్లా అనే చోట ఉండేవాళ్ళం. ఒకరోజు మా ఇంటికి ఒక రిజిస్టర్ పార్సెల్ వచ్చింది. నాకు ఎక్కడి నుంచి పార్సల్ వస్తుందా అని నేను ఆశ్చర్యపోయాను. సంతకం పెట్టి పార్సెల్ తీసుకున్నాక చూస్తే కేసరి కుటీరం నుంచి అని ఉంది. నాకు ఏమీ అర్థం కాలేదు. లోపల విప్పి చూస్తే ఒక మొఖమల్ బాక్సులో ఒక తులం బంగారంతో చేసిన స్వర్ణ కంకణం ఉంది. దానితో పాటే ఉన్న ఉత్తరంలో ‘మీ రచనలకు గుర్తింపుగా కేసరి కుటీరం వారి పురస్కారం’ అని ఉంది. అది చూసి నేను చాలా థ్రిల్లయ్యాను. ఎందుకంటే గొప్ప రచయిత్రులకు మాత్రమే కేసరి కుటీరం వారి స్వర్ణకంకణం లభిస్తుందని పేరు. అదీ నేను రచనలు చేయడం మొదలుపెట్టిన ఆరేడేళ్లకే రావడంతో ఆరోజు ఇంక నా కాళ్లు నేలమీద ఆనలేదంటే నమ్మండి. ఎంతో సంతోషాన్ని, ఆశ్చర్యాన్ని, మరెంతో గొప్ప అనుభూతిని పొందాను. ఆ తర్వాత ఒకసారి హైదరాబాదులో నాకు మాదిరెడ్డి సులోచన స్మారక అవార్డు ఇస్తున్నామని పిలిచారు. సన్మానం అయిన తరువాత పెద్ద పూలదండ, శాలువా, మెమెంటోతో ఇంటికి వెళ్ళగానే మా నాన్నగారు చాలా సంతోషపడ్డారు.ఎందుకంటే మా అక్క చెల్లెళ్లలో నేను బాగా చదువుకోలేదు. చదువులో డల్ స్టూడెంట్ ని. ముప్ఫై మార్కులు వస్తే గొప్ప. లెక్కలు అసలు బుర్రకెక్కేవి కావు. ‘ఇంజనీరుగారి అమ్మాయి లెక్కల్లో ఫెయిల్ అయినా మిగతా సబ్జెక్టుల్లో పాస్ అయింది కదా, ఎంత చదివినా మెట్రిక్ దాకానే కదా చదివించేది’ అంటూ కూడబలుక్కుని ప్రతిక్లాస్ లో పైకి నెట్టేవారు మాస్టర్లు. అలా నాకు చదువు అబ్బలేదని నాన్నగారికి చాలా విచారం ఉండేది. ఆయనకి ఎవరో జ్యోతిష్యుడు చెప్పాడట ‘ఈ అమ్మాయి పెద్దగా చదువుకోకపోయినా బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటుందని. ఆ రోజు అంతమందిలో ఒక గొప్ప సత్కారాన్ని పొందడం ఆయనకు బాగా సంతోషాన్ని కలిగించింది నాకంటే ఎక్కువగా మా నాన్నగారు సంతోషపడడం చూసి నేను చాలా ఆనందపడ్డాను.

*మీరు చాలా సంవత్సరాలు తెలుగు వాతావరణానికి దూరంగా ఉన్నారు. ఆ ప్రభావం మీ రచనల పైన ఉందా?! అది మీకు అనుకూలంగా పనిచేసిందా, వ్యతిరేకంగానా ?!

జ: మావారు బెనారస్ లో ఇంజనీరింగ్ చదివి మొదట కటక్ లో ఉద్యోగం చేసారు. మా పెళ్లి 1952 లో నా పదిహేడేళ్లకు అయింది. పెళ్లి, సంసారం, ట్రాన్స్ఫర్ల అవస్థలు, ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లాడితో సంసారం….ఇలా పదేళ్లు గడిచిపోయాయి. తెలుగు పత్రికలు, తెలుగు పుస్తకాలు, తెలుగు వాతావరణం లేక ఒక విధంగా ఇబ్బంది పడ్డాను. సభలు, సమావేశాలకు వెళ్లే వీలు గానీ, ఇతర రచయితలను కలిసే అవకాశం గానీ, భావాలు పంచుకోవడంగానీ వుండేది కాదు. మన చుట్టూ ఉన్న వాళ్లు మన పుస్తకాలు చదవరు. ఎప్పుడైనా పిల్లల సెలవులప్పుడే తెలుగు ప్రాంతానికి రావడం, ఆ సమయంలో వీలయితేనే ఏదైనా సమావేశానికి వెళ్లడం జరిగేది. అలా మిగతా వారితో పోలిస్తే కొంత తెలుగు పరిసరాలకు దూరంగా వున్నాను. అయితే, కొత్త ప్రాంతాలకు వెళితే మన అవుట్ లుక్ కాస్త మారుతుంది. కొత్త సంస్కృతిని, భాషను, మనుషుల అలవాట్లను అధ్యయనం చేసే అవకాశం నాకు ఒరిస్సాలో వుండడం వల్ల లభించింది. ఆయన ఉద్యోగరీత్యా నలుగురిని కలవడం, మనస్తత్వాలను గమనించి తెలుసుకోవడం జరిగింది. అందువల్ల కొన్ని కొత్త కథాంశాలతో రచనలు చేయగలిగాను. ‘వాన చినుకులు, వేట’ వంటి కథలు రాయగలిగానంటే ఒరిస్సాలో వుండడం వల్లే అనుకుంటాను.

*మీ శ్రీవారు గానీ, మీ పిల్లలు గానీ, మీ సాహిత్యాన్ని గానీ … ఇతరుల రచనలు గానీ చదివేవారా/ చదువుతారా? ఏవైనా సూచనలు , సలహాలు , విమర్శలు చేస్తారా? మీ పిల్లలకు మీ వారసత్వం వచ్చిందా?
జ: మా వారు అప్పుడప్పుడూ నా రచనలు చదివేవారు. పెద్దగా సలహాలు గానీ, విమర్శలు గానీ చేసేవారు కారు. ఉబుసుపోక ఏదో రాసుకుంటోంది అనుకునేవారేమో! ఇక పిల్లలు ఒరిస్సాలో పెరిగారు గనుక వాళ్లకు ఇంట్లో మాట్లాడే తెలుగు వచ్చు, అంతే! ఇంగ్లీష్ మీడియంలోనే చదువంతా. సెకండ్ లాంగ్వేజ్ గా ఒరియా వుండేది. ఇంగ్లీషు పుస్తకాలు చదివేవారు. హైదరాబాదు వచ్చాక తెలుగు కాస్త చదవడం వచ్చింది. మా అమ్మాయి ఆ మధ్య నా ‘మహిమ’ నవల చదివి ‘ నీకీ విషయాలన్నీ ఎలా తెలుసమ్మా!’ అని అడిగింది. ఎన్ని రాసినా వాళ్ల దృష్టిలో నేను మొదట అమ్మను, తర్వాత గృహిణిని అనుకుంటారేమో! మా పిల్లలకు రచనలు చేసే అలవాటు రాలేదు.

*మీకు ఇతర భాషా సాహిత్యంతో పరిచయం ఉందా? మీ రచనలపై ఏ ఆంగ్ల రచయిత ప్రభావమైనా ఉందా? జ: మా వారి ఉద్యోగం వల్ల ఒరిస్సాలో చాలా ప్రాంతాలు తిరిగాం. కొన్ని పదాలు తెలిసేవిగానీ, ఒరియా భాష రాదు. రేడియో ఒకటే ఆధారం. అది కూడా ఒక టైం లిమిట్లోనే ప్రోగ్రాములు, పాటలు వచ్చేవి. తెలుగు పత్రికలు,పుస్తకాలు ఏమీ లేక ఎటూ తోచక పిచ్చెత్తినట్టు వుందని మావారి దగ్గర విసుక్కుంటూ వుంటే ‘ఇంట్లో ఇన్ని ఇంగ్లీష్ బుక్స్ వున్నాయి, చదువుకోవచ్చుగా’ అన్నారు. ‘తెలుగు మీడియం దాన్ని, ఏదో ఇంగ్లీష్ చదవడం, రాయడం వచ్చు గానీ ఇవి నాకర్థం కావు’ అని గునిస్తే ‘ఇది చదివి చూడు’ అని పెర్రీ మాసన్ డిటెక్టివ్ నవల ఇచ్చారు. డిటెక్టివ్ కథ కనక ఇంటరెస్టింగ్ గా చదివేను. అలా ఇంగ్లీష్ బుక్స్ చదవడానికి అక్షరాభ్యాసం అయింది. ఏ ముహూర్తాన మొదలు పెట్టానోగానీ, చాలా ఈజీగా అర్థమై చిన్నపుస్తకాలయితే రెండుగంటల్లో, పెద్దవి ఓ రోజులో చదివేసేదాన్ని. అది మొదలు మావారి ధర్మమా అని ఎన్నెన్ని ఇంగ్లీష్ బుక్స్ చదివానో! ఈ రోజు నాకేమైనా తెలుసు అనుకుంటే పుస్తకాల విజ్ఞానమే ఎక్కువ. అయితే నా పైన ఏ ఇంగ్లీషు రచయితల ప్రభావం ఉందని నేను అనుకోవడం లేదు.

*అవార్డులు, పురస్కారాలు వంటి వాటి విషయంగా మీ అభిప్రాయం ఏమిటి?! మీ లాంటి మహిళా రచయితలకు ఈ విషయంలో అన్యాయం జరిగిందని మీకు అనిపించిందా?!

జ: అవార్డులనేవి రచయితలకు కొత్త ఉత్సాహాన్నిస్తాయి. సమాజానికి ఉపయోగపడే మంచి రచనలకు తప్పకుండా గుర్తింపు వుండాలి. అర్హులైనవారికి కొన్ని అవార్డులు వచ్చాయి కూడా. అయితే కొందరికి అవార్డులు ఎందుకు వస్తాయో అస్సలు అర్థం కాదు. అంతకన్నా బావున్న రచనలకు రావు.ముఖ్యంగా కేంద్ర సాహిత్య అకాడమీ లాంటి ప్రసిద్ధ పురస్కారాలు ఇన్నేళ్లలో ఎంత మంది రచయిత్రులకు వచ్చాయి చెప్పండి? అరవై డెబ్బైల దశకంలో ఒక విధంగా పత్రికలను, పబ్లిషర్స్ ని నిలబెట్టింది, పాఠకులను తయారు చేసుకున్నది, వారి సంఖ్యను పెంచింది రచయిత్రులే కదా! వారివి కుటుంబ కథలు అని తక్కువగా చూడడం ఎందుకు? కుటుంబం సమాజంలో అంతర్భాగం కాదా? యువతీ యువకుల, స్త్రీ పురుషుల సంబంధాల మీద నేను అనేక కథలు రాసాను. వాళ్ళు సమాజంలో వ్యక్తులు కారా? మనకు తెలియని జీవితాల గురించి కంటే తెలిసిన మధ్య తరగతి జీవితాల గురించి రాస్తే అవి రచనలు కావా? పైగా ఒక పుస్తకానికి మాత్రమే అంత పెద్ద అవార్డు ఇవ్వడం నాకు సరిగ్గా అనిపించదు. మనం బాగా రాసిన రచన వచ్చిన సంవత్సరమే మరొకరు ఇంకా బాగా రాసిన రచన వచ్చి వుండొచ్చు. అలా కాకుండా ఒకరికి అవార్డు ఇవ్వాలంటే వారి మొత్తం సాహితీ ప్రయాణాన్ని పరిశీలిస్తే బాగుంటుంది. మహిళలు రాస్తూ పోతుంటారు గానీ, అవార్డుల కోసం ఎలా ప్రయత్నించాలో వారికి తెలియదు. పైగా ఎందుకో గానీ కథలు, నవలల కన్నా కవిత్వానికి ఎక్కువ అవార్డులు ఇస్తారేమోననిపిస్తుంది నాకు. ఏదేమైనా రచయిత్రులకు అవార్డుల విషయంగా మొండి చెయ్యి చూపిస్తుంటారనేది నిజం.

*అరవై ఏళ్ల సాహితీ ప్రస్థానం మీది. అప్పటికీ, ఇప్పటికీ రచయితల విషయంగా గానీ, పాఠకుల విషయంగా గానీ, భాష విషయంగా గానీ మీరు గమనించిన మార్పులేమిటి?!

జ: చదివేవాళ్ళు బాగా తగ్గిపోయారు. పత్రికలూ తగ్గిపోయాయి, దాదాపుగా లేవనే అనొచ్చు. అలాంటప్పుడు రచయితలకు కూడా రాయాలని ఏం ఆసక్తి వుంటుంది? ఒకప్పుడు రచయితలంటే ఉన్న క్రేజ్ ఇప్పుడు లేదు. రచనను వృత్తిగా స్వీకరించే పరిస్థితి కూడా లేదు. ఒకనాడు సంపాదకులు, పబ్లిషర్లు రాయమని రచయితల వెంటబడేవాళ్ళు. ఒక్కో రచయితకీ ప్రత్యేకమైన పాఠకులు, వీరాభిమానులూ ఉండేవాళ్లు. రచనలకు మంచి పారితోషికం వుండేది. ఇప్పుడు ఎక్కువగా సంకలనాల కోసమే రాస్తున్నారు. లేకపోతే సొంత సంపుటాలు వేసుకుని పంచుకోవడమే! వాటిని ఆ మాత్రం చదివేవాళ్ళు కూడా ఎక్కువగా యాభై, అరవై ఏళ్ళు దాటినవాళ్ళే. సోషల్ మీడియా వచ్చాక సాహిత్యం చదవడం తగ్గిపోయింది. అయితే కొందరు రచయితలు సోషల్ మీడియాలోకి ప్రవేశించి తమ రచనలను పాఠకులకు చేరుస్తున్నారు. కొందరు ఆడియో కథలు వినిపిస్తున్నారు. ఇప్పుడు తెలుగు మీడియంలో చదివేవాళ్లే కరువయ్యారు. ఇక తెలుగు భాష…అందులోనూ సాహిత్యం ఎవరు చదువుతున్నారు? ఏ కొద్ది మందో చదివినా ఇంగ్లీషు పుస్తకాలు, అందులో వ్యక్తిత్వ వికాస పుస్తకాలు కొంచెం చదువుతున్నారు. ఇంకొన్నాళ్లు పోతే తెలుగు కేవలం మాట్లాడే భాషగా మిగిలిపోతుందేమోననిపిస్తోంది.

*ఇన్ని రచనలు చేసిన మీరు రచయిత్రిగా తృప్తి పొందారా?! మీ సాహిత్యానికి ప్రయోజనం చేకూరిందని భావిస్తున్నారా?

జ: రచయిత్రిగా నాకు ఎప్పుడూ తృప్తి ఉంది. నా రచనలు చాలా మంది పాఠకులకు చేరాయి, వారిని ఆలోచింపజేసాయి. చాలా కొద్దిగా హాస్య కథలు రాసాను. అవి కూడా పాఠకులను అలరించాయి. ఉబుసుపోక సాహిత్యం సృష్టించలేదు గనుక నా రచనల ప్రయోజనం నెరవేరిందనే అనుకుంటున్నాను.

*ధన్యవాదాలండీ….

Written by Nellutla Ramadevi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వేట నా ఆట కాదు