కథలు కల్పితాలు. బతుకు విలువలు బహిర్గత పరచడానికి కల్పనలను తీసుకుంటాయి . గాథలు మనుషుల జీవితాల బింబ ప్రతిబింబాలు. ఏదో కావాల్సింది, ఏదో చెప్పాల్సింది, ఎవరి కోసమో చేయాల్సిందే కథల్లో దొరుకుతాయి. జీవితం సంభ్రమాశ్చర్యాలు , ఆనందోత్సాహాల పెన్నిధి కాదు. సంఘర్షణా సన్నివేశాల సన్నిధి. అక్షరాస్యులు మాత్రమే చదవగలిగే కథలు కూడా నిరక్షరాస్యులకూ ఏదో విధంగా చేరుతాయి. ఎందుకంటే మనుషుల మధ్య సంబంధాలు ఒకరితో ఒకరు గా ఉండడం లోనే కథాంశాలు గా వస్తుంటాయి . అవే రచయితల కలాలకు అందుతుంటాయి. అవి మళ్లీ తిరిగి అక్షర రూపంగా బయటికి వస్తుంటాయి. కాబట్టి, మనుషుల బ్రతుకులు ఉన్నంతవరకు కథలు పుడుతూనే ఉంటాయి. కథలకు మనుషులకు ఏనాటిదో అనుబంధం. మరి ఏ కథలు బాగుంటాయి? ఎలాంటి కథలు వచ్చాయి? ఏమేమి కథలు వస్తున్నాయి ? ఏ విధమైన కథలు రావాలి.. అని ఒక చిన్న చర్చను ఎవరి మనసులో వాళ్లు చర్చ చేసుకోవాలి. ముఖ్యంగా రచయితలు . రచయితలు ఎప్పుడూ పాఠకుల పక్షాన నిలబడాలి. పాఠకులు అంటే సమాజం . సమాజం అంటే బ్రతుకు. ఈ నిరంతర చక్రంలో చట్టాలు చుట్టాలు చట్రాలలో చుట్టుకుని ఉంటాయి.
కథ ఆధునిక సాహిత్య ప్రక్రియ. కావ్యాల్లో పురాణాల్లో కథలు అంతర్లీనంగా చెప్పిందే కాని ఈ పద్య రచనా విధానం కథా రచన విధానం గా వచన రచనలోకి వచ్చిన తర్వాత అనూహ్యమైన మార్పు వచ్చింది. పామరజనులకు అందిన మరుక్షణమే కథ తన రూపును మార్చుకున్నది . చిన్న కథ , మినీ కథ, చిట్టి కథ , పొట్టి కథ, పెద్ద కథ అంటూ కథలుగా మన ముందుకు నిలిచింది. అంతెందుకు ఒక్క కార్టూన్ కొన్ని కథలుగా హృదయాల్లో తచ్చాడుతుంది. వ్యంగ్యమైన బొమ్మ కు అంతటి శక్తి ఉంది. ఇటువంటి పలు విధాల ఇతివృత్తాలతో కథాగమనం సాహిత్యం గా నిలిచింది.
ఎన్నో ఉపకథలను తనలో ఇముడుచుకున్న కథాసరిత్సాగరము ఎప్పుడో 11వ శతాబ్దం లో వచ్చిన కథా సంకలనం గుణాడ్యుడు పైశాచి భాషలో రాసిన బృహత్కథ ఆధారంగా వచ్చింది. ఈ పేరు చూస్తే కూడా ఎంత ఆశ్చర్యంగా ఉందో చూడండి ఇది కథల నదుల సముద్రముగా ఊహించి ఆలోచించి పెట్టిన పేరు . మానవ జీవితాలను ముఖ్యంగా కౌటింబిక జీవితాలను సముద్రంతో పోలుస్తూ ఉంటారు . రామాయణ భారత భాగవతాల్లో కథలు ఉన్నాయి . ఇది మనకు అందరికీ తెలుసు. ఈ ఏ కథలను తీసుకున్న సత్యంతో సాగినవే. వర్ణనాత్మకంగా కల్పనాత్మకంగా వ్యక్తీకరించే గద్య రచన కథ. ఇటువంటి శక్తి ఉన్న రచన ప్రక్రియ కథ ను ఇప్పుడున్న ఈ సాంకేతిక సామాజిక పరిస్థితుల లో ఎలా చూడాలి?
కథలలో ఇప్పుడు రావాల్సింది సమకాలీన జీవన నేపథ్యాలు, మారుతున్న జీవన వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలు వాటి ప్రభావాలు ఇవి కథలుగా రావాలి .
సత్యాసత్యాలు అవిభాజ్యం కాదు. ఎందుకు ఒక మనిషిని ఇంకో మనిషిని ఓర్వలేక పోతున్నారు ? భరించలేకపోతున్నారు ? దీన్ని పసిగట్టాలి. కథంతా చదివాక కథలో ఏం చదివాము అనే ఆలోచన ఒక ప్రేరణ ఇచ్చేలా ఉండాలి. కేవలం రచయితల కోసం కాదు ఈ ఆలోచన సమాజంలో ప్రతి ఒక్కళ్ళు కథలను చదివితే తప్పకుండా మంచి వైపు అడుగులు వేస్తారు . కథలను గురించి ఇంట్లో కుటుంబ సభ్యులతో చర్చిస్తే మరెన్నో ఉపయోగాలుంటాయి . సమయాన్నంతా టీవీ చూస్తూనో మొబైల్ చూస్తూనో గడిపి వృధా చేసుకునే బదులు ఈ విధంగా సాహిత్య అంశమైన కథారచనలను చదివి జీవితాలకు ఉపయోగించుకుంటే బాగుంటుంది . కథలలో ఉన్నది మనం. మనలో ఉన్నవి కథలు .
ఇంతటి పురాతన కళ అయిన కథలు మానవ వేదలను చూపిస్తున్నాయి . కానీ ఈ వేద భరిత జీవితాల వెనుక ఉన్న కారణాలేమిటి? సంక్షోభాలేమిటి? సంవేదనలేమిటి? ఎందుకు వచ్చాయి అని తెలుసుకోవడం ఎంత ముఖ్యమో వీటి నుండి విముక్తి కావడానికి మంచి మార్గంలో పయనించడానికి సొల్యూషన్ పరిష్కారం ఇచ్చేలా పాజిటివ్ ఎనర్జీని ఇచ్చేలా ఒక దృక్పథంతో రచనలు రావాలి.
యవతీయువకులు ఎందుకంత అగ్రెసివ్ గా ఉంటున్నారు? పెద్దవాళ్లు వీళ్లను ఇబ్బందులకు గురిచేస్తున్నారా? చేస్తే ఏ విధంగా? ఎందుకు? ఇవన్నీ పసిగట్టిన కథ తప్పకుండా పదిమందికి చేరి ప్రయోజనాన్ని సాధిస్తుంది. రచయితల పరిశీలన దీనికి ప్రధానమైనది.
కథ భాషా సంపద తో అలరారితే పాఠకులకు నచ్చుతుంది. ఆ పాత్రలలో పాత్ర ఐపోతారు. కథలో తమను తాము చూసుకుంటారు. ఆత్మ పరిశీలన చేసుకుంటారు దిద్దుకుంటారు ఆత్మ సంతృప్తి చెందుతారు. వాటిని అనుసరిస్తారు . ఇంతకన్నా సాహిత్య ప్రయోజనం ఏముంటుంది?