ఏమీ తెలియని తరువులే
పలురకాల పండ్లూ, పూలు ఇస్తున్నప్పుడు
స్వచ్ఛమైన ప్రాణవాయువునిచ్చి
మనకు ఊపిరి పోస్తున్నప్పుడు
నేను కూడా మానవత్వానికి ఆయువునిస్తాను
చెట్టంత మనిషినై
కొందరికైనా జీవం పోస్తాను
నా దేహపు కొమ్మలకు పూసిన
అవయవ ఫలపుష్పములన్నీ
మరొకరికి జీవితాన్ని ఇస్తుంటే
అంతకన్నా పరమార్థమేముంది
మోడువారిన మరో నలుగురి జీవితాలను
నా ప్రాణధారతో చిగురింప చేస్తాను
పరుల కోసం ఈ శరీరమే దానం చేసి
త్యాగపు వృక్షమై నిలిచిపోతాను
ముగియబోయె నా జీవనమజిలీలో
తనువుకు నిష్క్రమణ తప్పనపుడు
కాయాన్ని బూడిద కానివ్వకుండా
ఇతరుల కోసం సంజీవినిగా నిలిపి
కాలం మీద చెరిగిపోని
ప్రాణప్రతిష్ట సంతకాన్ని
సంతోషంగా, సగర్వంగా చేస్తాను!