నేను ఇక్కడే ఉన్నాను కదా నాన్నా…
“ఎప్పుడూ నన్ను పడుకో అంటావు కదా అమ్మా…
ఇప్పుడు పడుకుంటే ఏడుస్తూ ఎందుకు లేపుతున్నావు?”
అమ్మ నా మాట వినలేదు.ఏడుస్తూనే ఉంది.నాకు ఏమీ అర్థం కాలేదు. ఇంట్లోకి చూశాను.చుట్టాలు అందరూ వచ్చినట్టున్నారు. ఇంతమంది మన ఇంటికి రావడం ఇదే మొదటిసారి. ఏదైనా పండగ ఉందా నాన్నా?
కానీ ఇంట్లో పండగ వాతావరణం మాత్రం లేదు.ఒక్కరి ముఖంలో కూడా నవ్వు కనిపించలేదు. అందరూ మౌనంగా ఉన్నారు. ఎవరి కళ్లలో చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి.
“నాన్నా… అందరూ ఎందుకు ఏడుస్తున్నారు?”
నాన్న నా వైపు చూశాడు. ఏదో చెప్పాలనుకున్నాడు. కానీ మాట రాలేదు.
“అమ్మా… ఇంతమంది వచ్చారు కదా. ఎవ్వరూ తిని రాలేదని తెలిసినా, వంట ఎందుకు చేయడం లేదు?”
అమ్మ కదలలేదు.
“వంట చేయమ్మా…”
ఆమె నా మాట విననట్టే ఉంది. కొద్దిసేపటి తర్వాత మాత్రం నాకు మాత్రమే వంట చేసింది.
“అందరికీ చేయకుండా నాకు మాత్రమే ఎందుకు వండుతున్నావు అమ్మా? మీకు ఆకలిగా లేదా?”
అమ్మ చేతులు వణికాయి.
నేను ఏమీ అర్థం చేసుకోలేక ఆమె ముఖం వైపు చూస్తూ ఉండిపోయాను. అప్పుడే నా చూపు పక్కకు వెళ్లింది.
అక్కడ ఒక కొత్త పరుపు ఉంది.
“అమ్మా… కొత్త పరుపు తీసుకున్నావా?”.పరుపంతా తెల్లగా ఉంది.
“కానీ ఒక్క పువ్వు కూడా పెట్టలేదు ఎందుకు? పండగ కాదా?”
అమ్మ మళ్లీ మౌనంగానే ఉంది.
బయట నుంచి ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించింది. తమ్ముడు, అన్న, మామ బాణాలు కాలుస్తున్నారు.
“నాన్నా… ఈరోజు ఏమైనా దీపావళా?”. ఎవరూ నవ్వలేదు. ఎవరూ సమాధానం చెప్పలేదు.
అమ్మ నా కోసం కొత్త బట్టలు తీసుకొచ్చింది.
“నాకు మాత్రమే కొత్త బట్టలు కొన్నావా అమ్మా? అక్కకు తీసుకోలేదా?”… అక్క పక్కనే కూర్చొని ఏడుస్తోంది.
“అక్క ఎందుకు ఏడుస్తుంది? కొనడం మర్చిపోయావని చెప్పమ్మా…”
అమ్మ నా మాటకు స్పందించలేదు.
అత్తమ్మ నా దగ్గరకు వచ్చి ఏదో తీసుకుని నా మీద చల్లింది.
“అత్తమ్మా… నేను నీకు ఏమీ అనలేదు కదా నాన్నా. మరి నా మీద ఇవన్నీ ఎందుకు చల్లుతుంది?”
ఎవరూ సమాధానం చెప్పలేదు. అందరూ ఏదో చేస్తున్నారు.
కానీ ఏం జరుగుతుందో మాత్రం నాకు చెప్పడం లేదు.
కొద్దిసేపటి తర్వాత నన్ను బయటకు తీసుకెళ్లడం మొదలుపెట్టారు.
“అమ్మా… నేను ఎప్పుడూ పొలానికి వస్తానంటే ‘వద్దు’ అంటావు కదా. ఈరోజు నేనడగకపోయినా ఎందుకు
తీసుకెళ్తున్నావు?”…ఎవరూ మాట్లాడలేదు.
దారంతా ఒక విచిత్రమైన నిశ్శబ్దం…నేను నడుస్తున్నానో…లేక నన్ను ఎవరో తీసుకెళ్తున్నారో…
నాకే అర్థం కాలేదు. దూరంగా కట్టెలు కనిపించాయి.
వాటి దగ్గరకు వెళ్లగానే పెద్ద మంట కనిపించింది.
“అమ్మా…”
నా చూపు ఆ మంట మీదే నిలిచిపోయింది.
“వంటింట్లో వేలికి కొంచెం కాలితే గంటసేపు ఏడ్చానని చెప్పేదానివి కదా నాన్నా…”
నా గొంతు వణికింది.
“మరి ఇప్పుడు…”మాట ఆగిపోయింది.
“ఇప్పుడు ఇంత పెద్ద కట్టెల మంటలో నేను మొత్తం కాలిపోతుంటే… నాకు ఎందుకు ఏడుపు రావడం లేదు నాన్నా?”
అమ్మ మాత్రం గుండెలు పగిలేలా ఏడుస్తోంది.
నేను ఆమె దగ్గరకు వెళ్లాను.
“అమ్మా… ఎందుకు అంతలా ఏడుస్తున్నావు?” .. ఆమెకు నా మాట వినిపించలేదు.
అప్పుడే చుట్టూ ఉన్నవాళ్ల మాటలు నా చెవుల్లో పడ్డాయి.
“పాపం…”
“ఇంత చిన్న వయసులోనే…” “చివరికి ఇలా అయిపోయింది…”
నా గురించి మాట్లాడుతున్నారు.
కానీ…
నేను వాళ్ల మధ్యలోనే ఉన్నాను కదా!
అప్పుడే నా చూపు ఒక ముఖం మీద ఆగిపోయింది….లిల్లి.
నాతో పల్లెత్తు మాట మాట్లాడటానికి కూడా ఇష్టపడని లిల్లి…
ఈరోజు కళ్ల నిండా నీళ్లతో నా దగ్గరకు వచ్చింది. కొన్ని రోజుల క్రితం నేను ఆమెతో మాట్లాడటానికి వెళ్లాను.
ఆమె నాతో మాట్లాడలేదు. ఆమెకు అడ్డొచ్చింది అహంకారం. ఆమె అలా ఉండటం చూసి నాకూ కోపం వచ్చింది.
అంతే…
ఆ రోజు నుంచి మా మధ్య మౌనం మొదలైంది.
“తర్వాత మాట్లాడదాం…”అనుకున్నాను.
కానీ ఆ తర్వాత ఎప్పుడొస్తుందో మాత్రం ఆలోచించలేదు.
ఈరోజు లిల్లి నా దగ్గరకు వచ్చింది.నన్ను చూస్తోంది.
ఏదో చెప్పాలని చూస్తోంది.కానీ మాట రావడం లేదు.
కళ్ల నిండా నీళ్లు మాత్రం ఉన్నాయి.
“లిల్లీ…”
నేను మెల్లగా పిలిచాను. ఆమెకు వినిపించలేదు.
“ఇన్ని రోజులు మాట్లాడలేదు కదా…”ఆమె ఏడుస్తూనే ఉంది.
“ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు?” సమాధానం లేదు.
ఆమె నా దగ్గరకు వచ్చి కూడా నాతో మాట్లాడలేకపోయింది. అప్పుడు నాకు మొదటిసారి అనిపించింది…
కొన్ని మాటలు మనం వాయిదా వేస్తే…
ఒకరోజు వాటిని చెప్పడానికి మనిషి ఉండకపోవచ్చు.
చుట్టూ ఉన్నవాళ్లంతా నా గురించే మాట్లాడుతున్నారు.
అప్పుడు నాన్న వైపు చూశాను.
“నాన్నా…”
అతను తలెత్తలేదు.
“వాళ్లు నా గురించి ఎందుకు అలా మాట్లాడుతున్నారు?” నిశ్శబ్దం.
“వాళ్లు అంటున్నది నిజమేనా?”
నా గొంతు చాలా మెల్లగా మారింది.
“నాన్నా…”
“నేను…”
ఒక్క క్షణం ఆగాను.
“నేను చనిపోయానా?”
ఆ ప్రశ్నతోనే నాకు అన్నీ అర్థమయ్యాయి. అయ్యో…
మీరు నా అమ్మా నాన్నలు కదా. అందుకే నాకు చెప్పలేకపోయారు.
ఓహ్…
నేను చనిపోయాను కదా.మర్చిపోయాను.చనిపోయానని నేనే తెలుసుకోలేకపోయాను.
అమ్మ ఇంకా ఏడుస్తూనే ఉంది.నాన్న మౌనంగా ఉన్నాడు.అక్క కన్నీళ్లు తుడుచుకుంటోంది.లిల్లి మాత్రం ఇంకా నా వైపే చూస్తోంది.నేను అందరి దగ్గరకు వెళ్లాను.పిలిచాను.ఎవరూ వినలేదు.
అప్పుడు నాకు అర్థమైంది.నేను ఇక్కడే ఉన్నాను.
కానీ…వాళ్ల జీవితాల్లో నేను ఇక లేను.అమ్మ నాకు ఇష్టమైన వంటలన్నీ చేసింది.
కానీ నాకు తినడానికి లేదు.నాన్న నా దగ్గరే ఉన్నాడు.
కానీ నా మాట వినడానికి లేదు.లిల్లి నాతో మాట్లాడాలని వచ్చింది.
కానీ మా మధ్య మిగిలిన మౌనాన్ని చెరిపేయడానికి సమయం లేదు.
నేను ఎన్నిసార్లు “తర్వాత మాట్లాడదాం” అనుకున్నానో…
ఆ “తర్వాత” నాకు రాలేదు.ఇప్పుడు నేను వెళ్లిపోతాను.
అమ్మా… నాన్నా… జాగ్రత్తగా ఉండండి.
లిల్లీ…నీతో చెప్పాల్సిన మాట ఒక్కటే.
మనసులో కోపం ఉన్నంతకాలం మనిషి మనతోనే ఉంటాడనుకుంటాం.
కానీ మనిషి వెళ్లిపోయిన తర్వాత ఆ కోపాన్ని పట్టుకుని ఉండటానికి కూడా మనసు ఒప్పుకోదు.
అందుకే…
ఉన్నప్పుడే మాట్లాడండి.
ఉన్నప్పుడే ప్రేమించండి.
ఉన్నప్పుడే క్షమించండి.
ఎందుకంటే…
వస్తువులు మన జీవితంలోకి వచ్చినప్పుడు వాటి విలువ తెలుస్తుంది.
మనుషుల విలువ మాత్రం వాళ్లు మన జీవితంలో నుంచి వెళ్లిపోయిన తర్వాత తెలుస్తుంది. కానీ అప్పటికి…
వాళ్లను తిరిగి తీసుకురావడానికి మన దగ్గర ఏమీ ఉండదు. మిగిలేది జ్ఞాపకం మాత్రమే. అందుకే…
“తర్వాత మాట్లాడదాం” అని అనుకోకండి.
ఎందుకంటే…ఆ తర్వాత…మన కోసం ఎదురుచూస్తుందనే హామీ జీవితానికి లేదు.