ఓ ప్రేమ కథ (మోహన రాగం) 11 వ భాగం

ధారావాహిక నవల

జరిగిన కథ

మోహన్ అక్క పెళ్లి కుదురుతుంది. పెళ్లికి తప్పకుండా రావాలని మోహన్ చెప్తాడు. కానీ అనురాగ్ వద్దంటాడు. వాళ్ళింట్లో అందరికీ తెలిసింది వెళ్తే నేను ఏదైనా అంటారు అని. అది అర్థం చేసుకొని వెళ్లకుండా ఆగిపోతుంది రాగమాల

కథలోకి వెళ్దాం!

అటు తిరిగి చూసిన అనురాగ్ కు ఒక అమ్మాయి కనిపించింది. ఆమె ఎవరో అన్నట్లుగా చూశాడు.

“మీరు రాగమాల వాళ్ళ అన్నయ్యనే కదా!”అని అడిగింది.

అవును అన్నట్లుగా తల ఊపాడు.

“నేను తన స్నేహితురాలిని. వాళ్ళ ఇంటి పక్కనే ఉండేదాన్ని. నా పేరు శర్మద”అని చెప్పింది.

“అవునా”అని అనురాగ్ అన్నాడు.

“రాగమాల పెళ్లికి రాలేదా? వస్తుందనుకున్నాను”అన్నది.

“ఆ! రావాలని అనుకుంది. కానీ ఏదో చిన్న సమస్య వల్ల రాలేదు. శుభశ్రీ ని తర్వాత కలుస్తానని చెప్పింది”అన్నాడు.

ఆ తర్వాత అక్కడి నుండి భోజనాల స్థలానికి వెళ్ళాడు. తండ్రితో పాటు కలిసి భోజనం చేసి బయలు దేరుదాము అనుకునేంతలో..

“భోజనం చేశారా?”అంటూ మోహన్ అడిగాడు.

“చేసాము. ఇక బయలు దేరుతాము”అన్నాడు అనురాగ్ .

“రాగ రాలేదా? పెళ్లికి వస్తానని చెప్పింది. ఎందుకు రాలేదు?”అన్నాడు.

“వస్తానని తయారయ్యింది. కానీ చివరి నిమిషంలో చిన్న ప్రాబ్లం వచ్చింది. అందుకే రాలేదు”అన్నాడు.

మోహన్ ముఖంలో నిరాశ కల్పించింది.

“రాగను తీసుకు రావాల్సిందేమో! నేనే వద్దన్నాను”అని మనసులో అనుకున్నాడు అనురాగ్.

ఇంటికి బయలుదేరి వచ్చేసారు దక్షిణామూర్తి గారు అనురాగ్.

రాగమాల పెళ్లికి వెళ్లలేదన్న మాటే కానీ మనసంతా అక్కడే ఉంది.

‘మోహన్ ఎంత బాధ పడుతున్నాడో? వెళ్లాల్సింది. ఏమనుకుంటాడో ఏంటో’ అని బాధ పడ సాగింది.

అనురాగ్ వచ్చిన వెంటనే వెళ్లి అడిగింది.

“పెళ్లి బాగా జరిగిందా? ఎవరైనా నా గురించి అడిగారా?” అని.

“మీ ఫ్రెండ్ ఒక అమ్మాయి అడిగింది. ఆ అమ్మాయి పేరు శర్మద నట. మోహన్ కూడా అడిగాడు”అని చెప్పాడు.

“నేను రావాల్సింది “అన్నది.

“ఎందుకు నువ్వు రావడం. నా వెనకాల గుసగుసలు మాట్లాడుకున్నారు. నువ్వు వస్తే ఇబ్బంది పడే దానివి”అన్నాడు.

కొంచెం అన్యమనస్కంగానే లోపలికి వెళ్ళింది.

ఒక రెండు రోజుల తర్వాత ఎంఎస్సీ ఎంట్రన్స్ నోటిఫికేషన్ పడింది. డేట్ కూడా అనౌన్స్ చేశారు. ఒక వారం ముందుగానే అనురాగ్ తో హైదరాబాద్ కు వెళ్ళింది.

మోహన్ వాళ్ళ ఇల్లు అనురాగ్ ఇంటికి చాలా దగ్గరే. అనుకోకుండా వెళ్లడం వల్ల ఈ విషయం అతనికి తెలియదు.

అనురాగ్ గదిలో మరొక అబ్బాయి ఉండే వాడు. వాళ్ళ కుటుంబం ఊళ్లో వీళ్ళింటి పక్కనే ఉండే వాళ్ళు. అతను అనురాగ్ కి వంట చేసి పెట్టే వాడు. దక్షిణ మూర్తి గారిని, వసుంధర ను అమ్మ, నాన్న అని పిలిచే వాడు.

వేసవి కాలం కావడం వల్ల వాళ్ళిద్దరూ ఆరు బయట పడుకునే వాళ్ళు. రాగ మాల గదిలో చదువుకుంటూ కూర్చునేది.

ఒక రోజు మోహన్ ఇంటికి వెళుతూ వచ్చాడు. రాగమాలను చూసి ఆశ్చర్య పోయాడు.

” నువ్వెప్పుడు వచ్చావ్? నాకు చెప్పలేదు ఎందుకు?” అని అలిగాడు.

“నేను వచ్చాక లెటర్ రాశాను” అని చెప్పింది.

అయినా అతను నమ్మలేదు. ఇంతలో ఇంట్లో ఉండే అబ్బాయి రాము వచ్చాడు.

వాళ్ళిద్దరికీ ముందే పరిచయం ఉండటం వలన వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ కూర్చున్నారు.

మాటల సందర్భంలో చెప్పాడు. ఏదో స్కూల్ లో టీచర్ గా చేస్తున్నానని.

ఆమె అతన్ని ప్రశ్నార్థకంగా చూసింది. చెప్పలేదు అన్నట్లుగా.

అనురాగ్ వచ్చాక మోహన్ వెళ్ళిపోయాడు.

ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అన్ని కొన్ని రోజుల గ్యాప్ లో ఉండటం వల్ల ఆమె ఇక్కడే ఉండి అన్ని రాశాక ఊరికి వెళ్లాలి అనుకున్నది.

మోహన్ ఒక పక్క స్కూల్ డ్యూటీ ,చదువు కోవడంలో బిజీ అయ్యాడు. ఎప్పుడో ఒకసారి వచ్చి కలిసే వాడు. అనురాగ్ ఉన్న ఇంటి పక్కన ఒక స్కూల్ ఉంది. అతను ఒకరోజు మధ్యాహ్నం వచ్చాడు.

“ఆకలేస్తుంది రాగా” అన్నాడు.

అన్నం ఒక ప్లేట్లో పెట్టీ ఇచ్చింది.తిన్న తర్వాత చెప్పాడు.

“నువ్వు ఇక్కడ కొన్ని రోజులు ఉంటావు కదా” అన్నాడు.

“అవును ఉంటాను.ఎందుకు?” అన్నది.

“ఏమీ లేదు.మీ ఇంటి పక్క స్కూల్ లో ఈరోజు టీచర్ గా జాయిన్ అయ్యాను” అన్నాడు.

“అదేంటి? ఆ స్కూల్ లో ఎందుకు మానేశావ్?” అన్నాడు.

“నీ కోసమే! రోజు లంచ్ టైమ్ లో నిన్ను కలుసు కోవచ్చు” అన్నాడు.

“పిచ్చా నీకు? నేను ఇక్కడ పర్మనెంట్ గా ఉండను కదా” అన్నది.

“అయినా సరే” అన్నాడు.

“అట్లా ఎందుకు మానేశావ్? అసలు నాకైతే ఏమీ అర్థం కావడం లేదు”అంటూ రాగమాల కోప్పడింది.

“అది కాదు. నేను ఇక్కడ ఎందుకు చేరాను అంటే, సాయంత్రం రావాలంటే మీ అన్నయ్యకి నేను రావడం ఇష్టం లేదు. వేరే టైం లో మీ ఇంట్లో రాము ఉంటున్నాడు కదా! ఇబ్బందిగా ఉంటుంది. కనీసం ఒక పది నిమిషాలు అయినా కలిసి మాట్లాడి వెళ్ళవచ్చని ఇక్కడ చేరాను”అన్నాడు.

“మరి శాలరీ బాగానే ఇస్తున్నారా?”అన్నది.

“అక్కడ ఇచ్చినంతే ఇస్తున్నారు. సరే కానీ ఆకలేస్తుంది వంట చేసావా?”అన్నాడు.

“ఆ! వచ్చినప్పటినుండి నేనే చేస్తున్నాను. అన్నయ్య కి నా వంట ఇష్టమే”అన్నది.

“అయితే కొంచెం కలిపేసి ఇయ్యవా. ఇంతకీ ఏం వండావు”? అన్నాడు.

“కూరలు పెద్దగా ఏం చేయను. రోజు పప్పు చేస్తాను .టమాటా పప్పు, పాలకూర పప్పు అలా ఏదో ఒక పప్పు, చారు అంతే. మళ్ళీ నేను కూడా చదువుకోవాలి కదా! అన్నం కలిపి ఇవ్వాలా? అలా తింటావా నువ్వు? చాలా మంది వేరే వాళ్ళు ముట్టుకుంటే తినరు కదా”? ఆశ్చర్యంగా అన్నది.

“నేను కూడా ఎవరు ముట్టుకున్నా తినను. కానీ నువ్వే కదా! కలిపేసి ఇవ్వు”అన్నాడు.

ఒక చిన్న గిన్నెలో అన్నం, పప్పు కలిపి స్పూన్ వేసి ఇచ్చింది. ఒక ముద్ద తినేసి, చాలా బాగుంది. కానీ మా ఇంట్లో కారం ఎక్కువగా తింటాము. నువ్వు చప్పగా చేసినా కూడా రుచిగా ఉంది” అంటూ ఒక నాలుగు ముద్దలు తిన్నాడు.

ఇంతలో బయట గేట్ చప్పుడు అయింది. “ఈ టైం లో ఎవరు వచ్చారు” అని చూస్తే రాము లోపలికి వస్తున్నాడు.

“మోహన్! రాము వస్తున్నాడు”అన్నది.

వెంటనే తను తినే గిన్నె తీసి ఆమెకు ఇచ్చేశాడు. ఆ గిన్నెను ఆమె షెల్ఫ్ లో దాచి పెట్టేసింది.

రాము లోపలికి వచ్చి అతన్ని చూసి ఆశ్చర్యంగా..

“ఏంటి ఇలా వచ్చావు?”అని అడిగాడు.

ఆమెకు ఒళ్ళు మండిపోయింది.

“ఏదో ఇంటి మనిషి లాగా ఆ ప్రశ్న ఏంటి?”అని మనసులో అనుకుంది.

“నేను ఇక్కడ పక్కన స్కూల్లో ఈ రోజే జాయిన్ అయ్యాను. కొంచెం ఫ్రీ టైం ఉంటే మీరు ఉంటారు కదా అని వచ్చాను. అయినా తను కూడా నాకు పరిచయమే కదా”అన్నాడు.

రాము కాళ్లు ,చేతులు కడుక్కొని వచ్చి ప్లేట్ తీసుకొని అన్నం పెట్టుకొని తిన్నాడు. అప్పటికి ఇంకా రాగమాల భోజనం చేయలేదు.

“నువ్వు తిన్నావా?” అని అడిగాడు.

“తిన్నాను” అన్నట్లుగా తల ఊపింది. మోహన్ సగం కడుపుకే తిన్నాడు అనే బాధ ఆమెకు ఎక్కువగా కలిగింది. అందుకనే తనకి తినాలనిపించలేదు. అప్పటికి మోహన్ పరవాలేదు అన్నట్లుగా చెప్తూనే ఉన్నాడు. అయినా కూడా చాలా బాధ కలిగింది. కాసేపయ్యాక వాళ్ళిద్దరూ కలిసి బయటకు వెళ్లిపోయారు.

అతను వదిలి పెట్టిన అన్నం ఎంతో ఇష్టంగా తినేసింది.

ఎంట్రన్స్ తెల్లవారి ఉందనగా..

“రాము! చెల్లెకు ఎంఎస్సీ ఎంట్రెన్స్ ఉస్మానియా యూనివర్సిటీలో పడింది. నువ్వు తీసుకెళ్తావా?” అని అడిగాడు.

“సరే అన్నా! తీసుకెళ్తాను”అన్నాడు.

తెల్లవారి అతనితో కలిసి బస్ లో యూనివర్సిటీకి వెళ్ళింది. మోహన్ కి కూడా అక్కడే సెంటర్ పడింది.

ఎగ్జామ్ రాసాక బయటకు వచ్చాక మోహన్ కనిపించాడు. అతనితో మాట్లాడుతూ బయటకు వచ్చింది. ఇంతలో అక్కడ రాము కనిపించాడు.

అతని చూడగానే చిరాకేసింది.

“నక్షత్రకుడి లాగా వెంటనే వచ్చాడు. కాసేపు ఆగి వస్తే ఏం పోయింది. అయినా ఇదంతా అన్నే చేశాడు”అని మనసులో అనుకుంది.

వీళ్ళ దగ్గరికి వచ్చి “ఏంటి సెంటర్ నీకు కూడా ఇక్కడే పడిందా?”అన్నాడు.

“అవును అందరికీ ఎక్కువగా ఇక్కడే పడతాయి”అన్నాడు.

“సరే! అయితే బస్సులో వెళ్ళిపోదాము”అన్నాడు రాము.

బస్ కోసం వెయిట్ చేస్తూ నిలబడ్డారు. ఇంతలో..

“ఇలా వెయిట్ చేయడం ఎందుకు? మెల్లగా నడుచుకుంటూ వెళ్దాము.ఎక్కడైనా స్టాప్ లో ఎక్కేయవచ్చు. అందులో బస్సులన్నీ చాలా రష్ గా ఉన్నాయి”అన్నాడు మోహన్.

ఇలా అయితే కాసేపైనా ఆమెతో కలిసి ఉండవచ్చని అతని భావన.

అతన్ని చూసి నవ్వింది రాగమాల.

అలా నడుస్తూ నడుస్తూ రెండు కిలోమీటర్ల వరకు వెళ్లారు. రాముకు అతని వాలకం ఏదో తేడాగా అనిపించింది.
“ఎందుకు ఇలా ఎండలో నడిపిస్తున్నాడు?” అనుకున్నాడు.

” చాలా దూరం వచ్చాము. ఆటోలో వెళ్దాము “అని రాము ఒక ఆటో ఆపాడు.

ముందుగా ఆటో ఆమె ఎక్కింది. వెంటనే రాము ఎక్కి ఆమె పక్కనే కూర్చున్నాడు. మోహన్ కైతే విపరీతమైన కోపం వచ్చింది.

“అసలు నేను కదా తన పక్కన కూర్చోవాల్సింది” అనుకున్నాడు. కానీ ఆ విషయం రాముకు తెలియదు కదా.

అలా ఆటో ఎక్కి వెళ్ళిపోయారు. ఇక ఆ రోజంతా రెస్ట్ తీసుకొని వేరే ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవడం మొదలుపెట్టారు ఇద్దరు.

యధా ప్రకారం మోహన్ స్కూలుకు వచ్చినప్పుడు లంచ్ టైం లో కాసేపు కనబడి వెళ్లిపోతున్నాడు. స్కూల్ తో పాటుగా వేరే ఎంట్రన్స్ లు కూడా చాలానే రాస్తున్నాడు. బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతున్నాడు.

ఇంకా కొన్ని ఎగ్జామ్స్ డేట్స్ ఎక్కువ రోజులకు ఉండటం వల్ల అనురాగ్ ఊరికి వెళ్ళిపోదామని అన్నాడు.ఆమెకు కూడా వెళ్లాలని అనిపించింది. ఇన్ని రోజులు ఇల్లు వదిలి ఉండలేదు. ఊరికి బయలుదేరారు.

ఊరికి వచ్చిన తర్వాత దక్షిణామూర్తి గారు రాగమాలతో ముభావంగా ఉండటం మొదలుపెట్టారు. తండ్రి అలా ఎందుకు ఉన్నారో అసలు అర్థం కావడం లేదు. చాలా బాధనిపించి సాగింది.

అలా ఒక పదిహేను రోజులు గడిచిన తర్వాత మోహన్ ఎప్పటిలాగే కరుణ ఇంటికి వచ్చి కూర్చున్నాడు. ఒక పది నిమిషాలలో ఆమె అక్కడికి వచ్చేసింది.

కాసేపు ముగ్గురు మాట్లాడుకున్న తర్వాత..

“నాకు శాలరీ వచ్చింది. ఈ నాలుగు నెలల శాలరీలో కొంత అమౌంట్ ఇంట్లో ఇచ్చాను. ఒక ఎనిమిది వందలు నీకు ఇస్తున్నాను. నీకు ఇష్టం ఉన్నది ఏదైనా కొనుక్కో”అని చెప్పాడు.

“ఏంటి నీ డబ్బు నాకు ఇస్తావా?వద్దు నాకేం వద్దు”అన్నది కంగారుగా.

“అదేంటి నీ కోసం నేను దాచి పెట్టి తీసుకొచ్చాను. నువ్వు ఏదైనా కొలుకోవాల్సిందే”అన్నాడు.

“ఏంటే మోహన్ అంత ప్రేమగా ఇస్తుంటే అలా మొహం మీదే వద్దు అంటావు తీసుకో”అని కరుణ అన్నది.

“అమ్మో! అంత డబ్బు తీసుకోవాలా? అలా బాగుండదు.నాకు ఇష్టం లేదు. నేను తీసుకోను”అన్నది.

వెంటనే అతనికి కోపం వచ్చింది.

“నేనిస్తే తీసుకోవా? నేను వెళ్తాను అయితే” అని లేచాడు.

అతని ఆయుధం అలకనే కదా!

“సరే ఇవ్వు”అంటూ మొహమాటంగా చేయి జాపింది.

“ఏం కొనాలి నాకేం తెలియడం లేదు”అన్నది.

“మా ఇంటి పక్కనే గోల్డ్స్మిత్ ఉన్నాడు. ఒక రింగ్ చేయించుకో బాగుంటుంది. గుర్తుగా కూడా ఉంటుంది” అని కరుణ అన్నది.

“అవునా ఈ డబ్బుతో రింగ్ అవుతుందా”? అన్నాడు.

“నేను అడుగుతాను “అంటూ వాళ్ళ పక్క పోర్షన్లో రెంటుకుంటున్న కంసాలినీ తీసుకొని వచ్చింది.

అతను రాగమాలకు కూడా చాలా పరిచయం. వాళ్ల అమ్మాయి ఎంతో ముద్దుగా ఉండేది. ఆ పాపకు తానే
“అపరంజి” అనే పేరు పెట్టింది.

అతనికి డబ్బు ఇచ్చి, ఆమె వేలి కొలత చూపించి ఉంగరం చేయించమని చెప్పారు. ఏదైనా ఎక్కువ, తక్కువ ఉంటే తర్వాత చెప్తానని అతను చెప్పి వెళ్ళిపోయాడు.

డబ్బు అలా తీసుకున్నందుకు రాగమాలకు కొంచెం ఇబ్బందిగా అనిపించినా, చాలా సంతోషంగా కూడా అనిపించింది.

“ఇంత మంచి గిఫ్ట్ ఇస్తాడని నేను ఊహించుకోలేదు”అని అనుకుంది.

అతను వెళ్ళిపోయాక ఇంటికి వచ్చేసింది. తండ్రి మాత్రం ముభావంగానే ఉంటున్నాడు. ఎందుకలా ఉంటున్నాడో అసలు అర్థం కావడం లేదు. వసుంధరని అడిగితే నాకేం తెలియదు అని చెప్పింది.

కొన్ని రోజులు గడిచిన తర్వాత, కరుణ ఇంటికి వెళ్లిన రాగమాలకి ఉంగరం తెచ్చి ఇచ్చాడు గోల్డ్ స్మిత్.

బాక్స్ మూత తీసి చూసిన ఆమె ఎంతో ఆశ్చర్యపోయింది. ఆకుపచ్చ రాయితో ఉంగరము ఎంతో ముద్దుగా ఉంది. ముఖమంతా సంతోషంతో వెలిగిపోయింది.

ఉంగరం తీసుకుని వెళ్లి ఇంట్లో పెట్టింది.

ఒక వారం తర్వాత మోహన్ డైరెక్ట్ గా వీళ్ళింటికే వచ్చాడు. అప్పుడు ఇంట్లో దక్షిణామూర్తి గారు, అనురాగ్ లేరు. వసుంధర మాత్రం వీళ్లు మాట్లాడుకుంటే పెద్దగా అభ్యంతరం పెట్టేది కాదు.

ఎవరూ చూడకుండా ఉంగరం తెచ్చి చూపించింది.

“ఇక్కడ మా నాన్న ఇల్లు తీసుకున్నారు కదా! అరగంట సేపు నేను అక్కడ ఉంటాను. ఈ ఉంగరం తీసుకొని అక్కడికి వస్తావా?” అని అడిగాడు.

“వద్దు నేను రాను. ఇది చాలా చిన్న ఊరు. ఎవరైనా చూసినా కూడా అసలు బాగుండదు. అందులో నువ్వు ఒక్కడివే ఉంటావు కదా?” అన్నది.

” ప్లీజ్,ఇలా వచ్చి అలా వెళ్ళిపో”అన్నాడు.

భయం భయంగానే మోహన్ ఇంటికి వెళ్ళింది.

అంతా తెలిసిన వాళ్లు. చిన్నప్పుడు ఒక టీచర్ ఆ ఇంట్లో ఉండేది. అక్కడే ఓనమాలు నేర్చుకుంది. వాళ్ళ అక్క, అన్నా కూడా అక్కడే నేర్చుకున్నారు.

అవన్నీ గుర్తు చేసుకుంటూ ముందు గదిలో కుర్చీలో కూర్చుంది.

“ఏది, ఆ ఉంగరం ఇలా ఇవ్వు” అని అడిగాడు.

ఉంగరం అతని చేతిలో పెట్టింది.

“ఇంకా ఎంత ఖర్చయింది” అని అడిగాడు

“మరొక మూడు వందలు అయింది. నేను అమ్మను అడిగి ఇచ్చేసాను” అని చెప్పింది.

ఆ ఉంగరం చూసి “నిజంగా చాలా బాగుంది కదా” అని వెంటనే చేతి వేలికి పెట్టాడు.

“అయ్యో అదేంటి? ఉంగరం పెడితే పెళ్లి అయిపోయినట్టే కదా” అన్నది.

“అయ్యిందనుకో! టెన్షన్ ఎందుకు?”అన్నాడు.

ఆమెకు భయం ఏమీ అనిపించలేదు. ఎలాగూ పెళ్లి చేసుకుంటాం కదా” అని అనుకుంది.

ఇంటికి వచ్చిన రాగమాలకి తండ్రి హాల్లో సీరియస్ గా కూర్చుని కనిపించాడు.

మెల్లిగా వంటింట్లోకి వెళ్ళింది.

కాసేపు అయిన తర్వాత వసుంధర వచ్చి “నాన్న పిలుస్తున్నారు వెళ్ళు” అని చెప్పింది.

భయం భయంగా హాల్లోకి వచ్చింది.

మనసాలలో ఆరామ్ కుర్చీలో కూర్చున్న తండ్రిని చూసి మెల్లిగా వచ్చి పక్కన నిలబడింది.

ఏమైనా అడుగు దామంటే ఆయన ముఖం చాలా గంభీరంగా ఉంది. దక్షిణామూర్తి కూతురును దగ్గరికి పిలిచాడు.

“నువ్వు అతనితో స్నేహం మానుకో! నేను చెప్పాను కదా! వాళ్ళ నాన్న అభ్యంతరం ఏదైనా చెప్తాడని! ఈ విషయం తెలిసిందో ఏమో? నన్ను ఆఫీసులో ఏదో ఒక రకంగా మాటలు అంటున్నారు. ఇక పెళ్లి విషయం మాట్లాడితే అసలు వాళ్లు ఒప్పు కుంటారని నమ్మకం లేదు. నువ్వు రాసిన ఉత్తరాలు ఏవైనా ఉంటే అడిగి తీసుకో. అతను రాసినవి అతనికి ఇచ్చేసెయ్యి .ఒక నిర్ణయం తీసుకొని ఈ విషయం ఇంతటితో ఆపేద్దాము”అని చెప్పాడు.

ఆమెకు చాలా దుఃఖం వచ్చింది. ఏమి జవాబు చెప్ప లేకపోయింది. కళ్ళ వెంట నీళ్లు కారుతుంటే అలాగే నిలబడింది.

“నువ్వు విషయం అర్థం చేసుకో తల్లి. నిన్ను బాధ పెట్టాలని నా ఉద్దేశం కాదు. వచ్చేవారం నువ్వు, అమ్మ, అన్న కలిసి యాత్రకు వెళుతున్నారు. అన్నయ్యకు మొదటి సారిగా యాల్టీసీ వచ్చిందట. అందుకని అందరం వెళ్దాం అన్నాడు. కానీ నాకు ఆఫీసులో పని ఉంది. అక్క అత్తవారింట్లో ఉంది కాబట్టి కుదరదు. మీరు ముగ్గురు వెళ్ళండి. ఇంకా వేరే క్షేత్రాలు కూడా ప్లాన్ చేసి నట్టున్నాడు. సంతోషంగా వెళ్లి అన్నీ మర్చిపోయి ఇంటికి రా”అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు.

ఆరోజంతా రాగమాల ఏడుస్తూనే ఉంది. రాత్రిపూట కూర్చొని మోహన్ కి ఉత్తరం రాసింది.

“నువ్వు ఎలాగైనా ఇంట్లో చెప్పి ఒప్పించు. మీ అక్క పెళ్లి కూడా అయింది కదా! నాన్న నన్ను పిలిచి ఇలా చెప్పారు. నేనైతే తట్టు కోలేకపోతున్నాను”అని రాసింది. వాళ్ళు
తిరుపతి వెళ్ళేది కూడా చెప్పింది.

ముందుగా అవసరమైన బట్టలు, సామాను సర్దుకొని హైదరాబాదుకు బయలుదేరారు. రెండు రోజులు అక్కడే ఉన్నారు. తిరుపతి వెళ్లాల్సిన డేట్ తెలుసు కాబట్టి, అతను రాగమాలను కలుసుకోవడానికి వచ్చాడు.

అంతకుముందే దక్షిణామూర్తి అనురాగ్ కి గట్టిగా చెప్పాడు.

“ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అబ్బాయిని ఇంటికి రానివ్వకు. వచ్చినా కూడా చెల్లెలు కలవ నీయకు”అని చెప్పడం వల్ల అనురాగ్ అతను ఎక్కడ వస్తాడో అని కాపలాగానే ఉంటున్నాడు.

ఆరోజు సాయంత్రం ఆరు గంటలకు వీళ్ళు వెళ్లాల్సిన బస్సు. ఉదయం మోహన్ వచ్చాడు. అది చూసిన అనురాగ్ గేటు బయటకు వెళ్లి..

“మీ నాన్నగారు ఒప్పుకునే లాగా కనిపించడం లేదని, మా నాన్న చెప్పారు. కాబట్టి చెల్లెలు నువ్వు ఇప్పుడు కలవకూడదు. ఒకవేళ నువ్వు మీ ఇంట్లో ఒప్పించుకో గలిగితే మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు. ఆడపిల్ల విషయంలో ఈ మాత్రం మేము జాగ్రత్త పడుకుంటే, రేపు దాని జీవితం ఏమవుతుంది? అర్థం చేసుకో”అని చెప్పాడు.

“నేను ఎక్కువసేపు ఉండను. ఒక్కసారి కలిసి వెళ్తాను”అని చెప్పాడు.

వీల్లేదని చెప్పి పంపించాడు. ఆమె లోపల నుండి మోహన్ ని చూసింది. చాలా దుఃఖం వచ్చింది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి.

అనురాగ్ లోపలికి రాగానే గట్టిగా ఏడ్చేసింది.

“ఏం చేయాలి చెప్పు? నాన్న అతని కలువ నీయకు అని చెప్పాడు. నాకు కూడా బాధగానే ఉంది”అన్నా డు.

అక్కడే ఉన్న వసుంధర..

“ఆ అబ్బాయి మంచి వాడేరా. వీళ్ళ పెళ్లి జరగకుంటే చెల్లి కన్నా అతనే ఎక్కువ బాధ పడతాడేమో?”అన్నది బాధగా.

సాయంత్రం బస్టాండ్ కి వెళ్లారు. అసలే ఆమెకు బస్సు ప్రయాణం పడదు. అందుకని అనురాగ్ వీళ్ళని బస్సులో కూర్చోబెట్టి, టాబ్లెట్స్ కోసం కిందికి వెళ్ళాడు. అప్పుడే మోహన్ మరొక అబ్బాయితో కలిసి అన్ని బస్సులను వెతుకుతున్నాడు.

అతన్ని కిటికీలో నుండి చూసింది.అతను కూడా చూసి కళ్ళతోనే పలకరించాడు. పక్కనే ఉన్న అబ్బాయి తన కజిన్ అని చెప్పాడు. వసుంధర అతన్ని చూసింది. కానీ మాట్లాడుతుంటే అభ్యంతర పెట్టలేదు.

ఒక పాపిన్స్ రోల్ తీసి ఆమెకు ఇచ్చాడు.

“నీకు బస్సు పడదు కదా! ఇవి దగ్గర పెట్టుకో”అన్నాడు.

ఇంతలో అనురాగ్ వచ్చాడు. అతన్ని చూడగానే చాలా కోపం వచ్చింది. వాళ్లు వెళ్లిపోయాక చెల్లితో అన్నా డు.

“నువ్వు ధైర్యంగా ఇంట్లో ఒప్పించు కున్నావు. మరి ప్రేమిస్తే అతను కూడా వాళ్ళింట్లో ఒప్పించు కోవాలి కదా! వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడుతుంటే, ఇతను నేను కూడా ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాలి కదా! ఆ ధైర్యం లేనప్పుడు ఎందుకు ప్రేమించాలి?”అని గట్టిగా అన్నాడు.

ఆమెకు కూడా అదే బాధగా ఉంది. “ఎన్ని రోజులు ఇలా ఇంట్లో చెప్పకుండా ఉంటాడు. నా వైపు నుంచే ప్రయత్నం చేస్తున్నాను కానీ అతని వైపు నుంచి అంగుళం కూడా కదలడం లేదు” అని అనుకుంది. కానీ వాళ్ళ ఇంట్లో పరిస్థితి వేరు అని తనకి తెలియదు.

అలా బస్సు బయలుదేరింది. ఉదయం ఆరు గంటలకి తిరుపతి చేరుకుంది. అప్పటివరకు దూర ప్రయాణం చేయని రాగమాలకి ఈ ప్రయాణం సంతోషాన్ని కలిగించింది. కానీ మనసులో తన ప్రేమ పెళ్ళి వరకు వస్తుందో లేదో అని ఆందోళనగా ఉంది.

తిరుమల కొండపైకి బస్సులో ప్రయాణం చేశారు. ఆ కొండలు పరిసరాలు ఆహ్లాదకరంగా ఉన్నా కూడా, బస్సు ప్రయాణం తనకు అనుకూలంగా లేదు. కాబట్టి ఇబ్బంది పడుతూనే ఉంది.

కొండపైకి చేరుకున్నాక తొలిసారిగా కొండమీద పాదం మోపి వెంకటేశ్వర స్వామిని మనసారా తలచుకుని, ఆ పరిసరాలను చూసి చిన్న పిల్లలా మారిపోయింది.

అక్కడ మోహన్ కి కూడా చాలా బాధగా ఉంది. చివరికి కలుసుకోవడం కూడా ఇబ్బందికరంగా ఉండటం అతనికి బాధనిపించింది.

అతనితో వచ్చిన కజిన్..

“ఏంట్రా నువ్వు ఇంత కష్టపడి బస్టాండ్కు వస్తే, కనీసం నీతో సరిగా మాట్లాడలేదు ఆ అమ్మాయి”అన్నాడు.

“వాళ్ళింట్లో మాట్లాడవద్దని చెప్పారు. లేకుంటే తను అలా చేయదు”అన్నాడు.

తెల్లవారి ఊరికి వెళ్ళిపోయాడు. ఇంట్లో వీళ్ళ ప్రేమ గురించి తెలియడం వల్ల రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.

చివరికి ఒకరోజు తల్లి గట్టిగా అడిగింది.

“నీకు అప్పుడే పెళ్లికి తొందరగా వచ్చిందా? మొన్ననే అక్క పెళ్లి చేశాము .ఆ ఖర్చులన్నీ ఉన్నాయి. అయినా నీకు ఉద్యోగం రావాలి కదా”అని అరిచింది.

“ఇప్పుడు కూడా ఉద్యోగం చేస్తున్నాను కదా! నేను డిగ్రీ చేస్తున్నప్పటి నుండే ఎంతో కొంత సంపాదిస్తున్నాను. ఆ మాత్రం నమ్మకం వాళ్లకు ఉంది”అన్నాడు.

“ఈ ప్రేమలు దోమలు నాకేమీ అర్థం కావడం లేదు. అయినా వాళ్ళ ఇంట్లో ఏమి అభ్యంతరం పెట్టడం లేదా? అట్లా ఎట్లా ఊరుకుంటున్నారు?”అన్నది.

“మన కుటుంబాలు పూర్వం నుండి పరిచయం కాబట్టి వాళ్ళు అభ్యంతర పెట్టలేదు. అంతేకానీ వేరే అబ్బాయితో అయితే ఇలా మాట్లాడనిచ్చే వాళ్ళు కాదు” అన్నాడు.

ఇంట్లో అంతగా ఎవరు సపోర్ట్ ఇచ్చినట్లు అనిపించలేదు.

తిరుమలలో కాటేజ్ తీసుకున్నారు. ఒక చిన్న కుర్రాడు “మీ లగేజ్ నేను తెస్తాను సార్” అన్నాడు.

ఆ అబ్బాయిని చూస్తే అనురాగ్ కి ఎంతో నచ్చింది.
“నీ పేరేంటి?” అన్నాడు

“శీను సార్” అన్నాడు.

“సరే మేము ఇక్కడ మూడు రోజులు ఉంటాము. నువ్వు మాతో పాటు ఉండు” అని చెప్పాడు.

ఆ అబ్బాయి సంతోషంగా “ఉంటాను సార్” అన్నాడు.రాయలసీమ యాసలో అతను మాట్లాడుతుంటే ఎంతో బాగా అనిపించేది. ఆ అబ్బాయి ఎన్నో కబుర్లు చెప్పేవాడు. అతని మాటలు వింటుంటే ఎంతో నవ్వు వచ్చేది. అందరికీ ఆ అబ్బాయి చాలా దగ్గర అయ్యాడు.

అప్పట్లో ఎక్కువగా ఇండిపెండెంట్ కాటేజ్ లు ఉండేవి. వాతావరణం చాలా చల్లగా ఉండేది. గోగు పూల చెట్లు ఎర్రటి పూలు పూసి అందంగా కనిపించేవి. రాలిపోయిన ఆ పువ్వులతో ప్రాంగణం అంతా ఎర్రగా కనిపించేది. చక్కని చెట్లు అందులో నుండి తొంగి చూసి సూర్యుడు, అప్పుడప్పుడు కురిసే చిరుజల్లు ఎంతో ఆహ్లాదంగా అనిపించింది. పరిసరాలన్నీ పవిత్రంగా అనిపించాయి.

శీను వేడి నీళ్ళు బకెట్లలో తెచ్చి ఇచ్చేవాడు. స్నానం చేసుకుని తేనీరు సేవించి,ముగ్గురు దర్శనానికి బయలుదేరారు.

ధర్మ దర్శనం క్యూలో నిలబడ్డారు. అక్కడ ఇచ్చిన ప్రసాదాన్ని తీసుకొని కూర్చున్నారు. నాలుగు గంటల సమయంలో దర్శనం పూర్తయింది.

మొదటిసారిగా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని పులకించిపోయారు.

ఓం నమో వెంకటేశాయ అనే నామం చెవిలో మారు మ్రోగింది.

కలియుగ దైవ మయిన ఆ స్వామి విగ్రహం అలంకరణతో దేదీప్యమానంగా వెలిగి పోతుంటే, ఆ స్వామి దర్శన భాగ్యం చాలు అనిపిస్తుంది కదా! ఎన్నో కోరికలు కోరాలి అనుకుని బయలుదేరిన మనకి, అక్కడికి వెళ్ళగానే ఏ కోరిక మనసులోకి రాదు. స్వామి రూపాన్ని కళ్ళారా దర్శనం చేసుకుని చేతులెత్తి ‘గోవిందా !గోవిందా!’ అంటూ నామ సంకీర్తన చేస్తూ, విమాన వేంకటేశ్వర స్వామిని దర్శించి, కొంతసేపు ఆలౌకిక స్థితిలో ఉంటాము.

సంవత్సరం నుండి అనురాగ్, రాగమాలకు ఆశ పెడుతూనే ఉన్నాడు..

“అక్కడ ప్రసాదం చాలా బాగుంటుంది. దోసిలి నిండా పెడతారు. దాని నిండా కాజు ఉంటుంది. ఎంత తిన్నా తరగదు” అని చెప్తూనే ఉన్నాడు. కానీ వీరికి ఆ ప్రసాదం దొరకక పొంగలి మాత్రం ఇచ్చారు. రోజులు మారాయి . కొన్ని కొన్ని విధానాలు కూడా మారిపోతుంటాయి కదా. అది చూసి ఎంతో డిసప్పాయింట్ అయ్యింది.

“నువ్వు ప్రసాదం పెడతారు అన్నావు? ప్రసాదం పెట్టలేదు”అన్నది నిరాశగా.

“కొనుక్కుందాము. అక్కడ ప్రసాదాలు అమ్ముతారు. నేను వెళ్లి తీసుకొని వస్తాను”అని చెప్పి అనురాగ్ అక్కడ వేసే పుల్ల దోసెలు మరియు పులిహోర తీసుకొని వచ్చాడు. లడ్డు కౌంటర్ వేరే ఉంది. కాబట్టి అవి తర్వాత కొనుక్కొని వస్తానని చెప్పాడు.

బయటకు వెళ్లి ఒక ఖాళీగా ఉన్న ప్లేస్ లో కూర్చొని ముగ్గురు ప్రసాదం ఆరగించారు.

ఆ పరిసరాలు చూస్తుంటే తనివి తీరడం లేదు. మేఘాలు తాకుతూ వెళ్తుంటాయి. చల్లని గాలి వీస్తుంది. ఆ కొండల్లో తెరలు తెరలుగా వినిపిస్తున్న అద్భుతమైన శోభా రాజు గారి కీర్తనలు. ఇవన్నీ కలిసి ఆనంద పరుస్తున్నాయి.

ముగ్గురు కాటేజ్ కు వెళ్తుంటే , శీను కలిశాడు. వాడిని కూడా తీసుకొని వెళ్లారు. పులిహోరతోనే కడుపు నిండటం వల్ల ,ఇంకా బయట భోజనం ఏమి చేయలేదు. అప్పట్లో ఇంకా ఈ అన్న సత్రాలు అవి రాలేదు.

కాటేజ్ వెళ్లి పడుకున్నారు.

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

విధి నెదిరించిన వీ రవనితలు

 కథలు  –  మనం