లింగ భేదాల మధ్య బలహీనతలో
అరిటాకు నలిగిపోతూనే ఉంటుంది
కాలం రాసిన చరిత్ర ఇది
ఎప్పుడూ ఒకటే తీరు
వల పన్నడం వేటగానికి సరదా
చిక్కడం చేపకు రివాజే!
అవినీతిని గంపకింద దాచే
అధికారపు తోలుకు మందమెక్కువ
ఓట్లేసి ఎన్నుకున్ననాడే
దోచుకునే అధికారం కూడా
చేతిలో పెట్టినట్టేమో!
కాపాడాల్సిన పాలకులే
అన్యాయాలకు కాపుకాస్తారు
హోరెత్తే న్యాయస్థానాలిప్పుడు
బిక్కమొకాలు వేస్తాయి
పాలనా ప్రతినిధుల
కుతంత్రయుక్తుల నడుమ
ధర్మ సంకటపు త్రాసులో
తాను చూడలేని నిజాన్ని
న్యాయదేవత మౌనంతో కప్పుకుంటుంది
చట్టాన్ని శాసించి
చేతులు మారిన నోట్లకట్టలు
శీలాన్ని బజారున నిలుపుతాయి
నిన్నకు, నేటికీ
జరిగిన పోరాటంలో ఓడి
చిరిగిన జీవితానికి
పచ్చి నెత్తురు గాయం
శాపమై వెంటాడుతుంది
బలం, బలగంతో
అంతే అహంకారాన్ని కప్పుకొని
బోయవాడు తిరిగొస్తాడు
వేటకు చిక్కిన ప్రాణికి
రేపన్నది శూన్యంలో కరిగిపోతుంది