కింద పడి తలకు గాయమైన భర్తను ఆ దగ్గర లోని హాస్పిటల్ కు తీసుకొని వెళ్ళి గాయానికి కుట్లుకట్టించి బ్యాండేజీ వేసి ఇంటి కి తీసుకుని వెళ్ళండి అంటే ఆటో అతని సహాయంతో జాగ్రత్తగా మెట్లు దింపి ఆటోలో కూర్చుండ పెట్టి ఇంటికి తీసుకు వెళ్తున్నాను .
కింద పడటం వల్ల గాభరా పడటమో, కొద్దిగా రక్తం పోవడంవల్లో కానీ అలసటతో నా భుజం మీద తలవాల్చుకుని పడుకున్నాడు తను. ఒక పెద్ద నిట్టూర్పు వచ్చింది నాకు… అంతటి మేధావి ఇలా తయారయ్యాడేమని బాధ పడుతూ. తన పరిస్థితి హృదయం మెలిపెడుతుంటే.. ఏమీ చేయలేని నిస్సహాయతతో కింద పడకుండా చంటి పిల్లవాడి వలె పొదవి పట్టుకున్నాను .
“ప్రభాత కూమారీ… ఎందుకలా ఉన్నావు” అన్నాడు తాను … ఈ కొత్త పిలుమేమిటా? అనుకుని.. సరే ఏదో చెప్పాలనుకుంటున్నాడేమో? చెప్పనీ..అని నా పేరు అది కాకున్నా “ఊ…” అన్నాను.
ఎన్నోసార్లు నీకు అసలు విషయం చెప్పాలనుకున్నాను… కానీ నా పట్ల నీకున్న ఆరాధన చూసి, నోరు విప్పలేక పోయేవాడిని… నీకు అన్యాయం చేసానా? ప్రభాతకూమారీ? ….అన్నాడు , సమాధానం రాకపోవడం తో ఏమిటీ? మాట్లాడవు? అన్నాడు. తనను తాను సంభాళించుకొని, “మీరేదో చెప్తున్నారు కదా ? మధ్యలో అడ్డుతగలడమెందుకని మాట్లాడలేదు” అన్నాను…..
ఔను! నువ్వేమీ మాట్లాడకు! నేనే చెప్తాను… నా విషయమంతా వివరంగా చెప్పాలని ఎన్నో సార్లు అనుకున్నా ను. ఇప్పటికీ ఙ్ఞాపకం ఉంది ప్రభాతకూమారీ. ఆ రోజు కూడా… “ఆనాటి సాయంకాలం నీకోసం యూనివర్శిటీ లైబ్రరీలో ఎదురుచూసాను…” ఎందుకంటే ఇక ఆరోజు చెప్పకుంటే వేసవి సెలవులకని నీవు ఊరు వెడతావని నాకు తెలుసు కదా? అందుకే… కానీ నీవెక్కడా కనపడలేదు…ఒళ్ళంతా కళ్ళుచేసుకుని మరీ వెతికాను..
ఉస్మానియా యూనివర్శిటీ ప్రాంగణమంతా విద్యార్థులతో కోలాహలం ఉంది. ఫేర్ వెల్ పార్టీ జరుపుకోవడం- పాత విద్యార్థులకు వీడ్కోలు, కొత్త వారికి ఆహ్వానం… పట్టా పుచ్చుకున్న వారంతా ఉద్యోగవేటకై ఎవరి దారిన వారు పోతాం కాదని వేడుకోలు, సంబరాలు చేసుకుంటున్నారు ..ఏవో నాటకాలు, డ్యాన్సులూ వేస్తున్నారు. మా తరగతి లీడరు, మనమూ ఒక నాటిక వేద్దామని, దిగువ మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబ నేపథ్యమున్న కథాంశం ఎన్నుకున్నారు.అందులో బ్రాహ్మణుని భార్యగా వేయడానికి ఒక అమ్మాయి కావాలి… అసలే యూనివర్శిటీలో ఆడపిల్లల సంఖ్యే తక్కువ…ఇక ఒకరో ఇద్దరో ఉన్నా నాటకంలో కథానాయిక పాత్రనువేయమంటే వేస్తార లేదో? అని నన్ను ఆ ఆడపాత్ర వేయమని అడిగారు. నేను కాదన్నాను. నేను కాస్త సుకుమారంగానూ, అందంగానూ ఉండడంతో నేను ఆ కథానాయిక పాత్ర వేయాలని బలవంత పెట్టారు.ఇక తప్పేది లేక సరే అన్నాను .
ఐతే కట్టేందుకు చీరా, బ్లౌజు, గాజులు, సొమ్ములు మొదలైనవెలా? అని ఆలోచిస్తుంటే… ఈ లోపు నాగేష్ వెళ్ళి నిన్ను అడగడం నువ్వు ఇస్తాననడంతో అలా సమస్య తీరాక, తీరా ఆరోజు వచ్చాక కానీ తెలియలేదు… కావలసిన వస్తువులన్నీ ఉన్నా వాటితో అలంకరించడం ఎవరికీ రావడంలేదు…ఎలా అనుకుంటుండగా నాగేష్ నిన్ను సహాయపడమని అడగడం, నువ్వు అంగీకరించి నన్ను చక్కగా అచ్చు బ్రాహ్మణ ముత్తైదువ వలెతయారు చేసావు. మంచి చీర కట్టి, తలలో పూలు పెట్టి, చేతినిండా గాజులువేసి, అలంకరణ బాగుందా? లేదా..? అని చేతుల కొన వేళ్ళు పట్టుకుని అటూఇటూ తిప్పుతూ నా వంక చూసి, వేషం బాగానే కుదిరిందనే సంతృప్తితో.. “భలేఉన్నావు!” …అన్నావు.
నేను సిగ్గుపడిపోయాను..
ఎందుకంటే అంతకుముందే నగేష్ నాతో అన్నాడు ” నిన్ను ప్రభాత్ కుమారి ప్రేమిస్తున్నదని”….”నీవంటే చచ్చేంత ఇష్టమనీ”… కానీ నగేష్ కు తెలుసు… నాకు ముందే పెళ్ళైందని. నగేష్ కూడా నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు. నాకు పెళ్లైన విషయం ఎప్పటికైనా నీకు తెలుస్తుందనే ధీమాతోనే నిన్ను నగేష్ ఆరాధిస్తున్నాడు.. ఎలా ఐనా నిన్ను ఒప్పించి, ఆ వేసవిలో పెళ్ళి చేసుకోవాలని అతని మనసులో ఉంది. అందుకే ఎప్పుడు నువ్వు కనపడినా ఏదో విధంగా నా పెళ్ళి విషయం నీకు చెప్పాలని తెగ ఆరాటపడుతూ, మీ ఇద్దరి మధ్యా అడ్డుగోడగా ఉన్న నన్ను తొలగించుకోవాలని తెగ ఆరాటపడిపోయేవాడు..
సరిగ్గా ఆ విషయం నీకు చెప్పాలని మొదలు పెట్టే సమయానికి ఏదో ఒక ఆటంకం రావడం, టాపిక్ మారి ఇంకేదో విషయం, కవిత్వం- సంగీతం లాంటి అంశాలమీద తీవ్రంగా చర్చలు జరగడం, అలా నీకు చెప్పే అవకాశం రాకపోవడంతో భలే నొచ్చుకునేవాడు.. అంతే కాదు! నీకు మనసులో ఎక్కడో ఆమె మీద ప్రేమ వున్నదనీ , ఆనందించాలనీ, అందుకే నువ్వు చెప్పడంలేదని నా మీద అభాండం వేసాడు. అయ్యో రామా! నాకలాంటిదేమీలేదనీ, నాకై నేను ఆ టాపిక్ ఎలా తీసుకొని రావాలా….? అని, ఒక వేళ ఆమెకు ఆ ఉద్దేశం లేకపోతే అనవసరంగా బద్ నామ్ కావాల్సి వస్తుందని, అలా ఉండిపోయాను.
“ఐతేతరువాత ఏమైంది“ అన్నాను.
ముగ్గురికీ చెప్పే అవకాశం లేక ఆ తెల్లవారి సెలవులు రావడంతో ఆ రాత్రి ట్రైన్ కు నువ్వు ఊరెళ్ళిపోయావు ప్రభాత్ కుమారి …”
ఓ! నా భర్తకూ ఓ ప్రేమ కథ ఉందా? అనే ఉత్కంఠతో “మళ్ళీ ఎందుకు కలవలేదు” అనడిగాను.
ఆ అవకాశం రాలేదు ప్రభాత్ కుమారి.ఈ లోపు నేను మా స్వంత,ఊరు వెళ్ళాను.మా దాయాదుల ఆస్తుల పంపకపు కొట్లాటలు, పొలాలు పంచి నా వాటా వేరే ఊరిలో ఇచ్చి నన్ను ఇంటినుండి వెళ్ళి పొమ్మనడం, నాది అసలే చిన్నతనం, అంత చిన్న వయసులోనే పెళ్ళైపోవడం, మా జీవితాలు ఎలా గడవాలి? చదువు ఎలా కొన సాగాలనే దిగులుతోనే కాదనే వీలు లేక, పెద్దలు ఇచ్చిన పనికిరాని పొలాలను సాగుచేయాలి, ఉండడానికో ఇల్లుకావాలి, ఇల్లు గడిచేందుకు ఆదాయం కావాలి. అందుకోసం మా నాన్నగారి వారసత్వపు పట్వారీ గిరిని నా భుజాలపై వేసుకున్నాను. అలా ఊరిలోనే ఉండిపోయాను. పరీక్షల సమయంలో మాత్రమే యూనివర్శిటీకి వచ్చి రాసి పాసయ్యాను.
బీ. ఏ. డిస్టింక్షన్ లో పాస్ అవుతూనే అందరూ M.A లో జాయిన్ కమ్మన్నారు. ఫిజులెవరూ కట్టేవారు లేక ఆ ఇష్టాన్ని చంపుకొని, తక్కువ ఫీస్ తో లా కాలేజీలో జాయిన్ అయ్యాను. అటు వ్యవసాయం; ఇటు పట్వారీ పని, దాంతో పాటు లా చదువు కోవడం, ఇలా నాకు శ్వాస తీసుకునే వ్యవధి కూడా దొరకలేదు” .
“తరువాతేమైంది?”….అన్నాను…
నన్ను నీవు నేరుగా పెళ్ళి చేసుకొమ్మని అడగకపోయినా.. నాకూ ఆ భావన లేకపోయినా ..ఎందుకంటే పెళ్ళైన వాడిని కదా, అలా ఎలా ఆలోచిస్తాను? .. కానీ ..అదో రకమైన ఆరాధన ఉండేది…నువ్వు పాట పాడితే పరవశించి పోయేవాడిని, గలగలా నవ్వుతూ పుస్తక చర్చలు చేస్తుంటే ఆహా! ఎంత మంచి విశ్లేషణ అనిపించేది. నీ రూపం ఎంతందంగా ఉందో? దానికి తగిన దుస్తులు వేసుకునేదానివి. కాలేజీ ఆవరణలోకి వస్తే అందరి కళ్ళూ నీ మీదనే ఉండేవి.
“ …మరి మీకు???….” అని కొంటెగా అడిగాను. ( ఇక ఇప్పుడు అతనికి 80 సంవత్సరాలని ధీమా కాబోలు! లేదా ఇప్పుడెక్కడికి పోతాడులే అని నిశ్చింతైనా కావచ్చు!) ఎలా అయితేనేం …ఇంతకాలానికైనా తన ప్రేమ గాథ పైకి చెప్తున్నాడనే ఆసక్తియైనా కావచ్చు.. గభాలున అడిగేసాను..
LLB పరీక్ష రాయడానికి యూనివర్సిటీ వెళ్లిన నాకు నీ పెళ్ళి సంగతి, మన క్లాస్ మేట్స్ ద్వారా తెలిసింది. మన స్నేహితులంతా టిప్ టాప్ గా ఉండేందుకు కావలసిన హంగులు సమకూర్చుకుంటూ హడావుడిగా నీ పెళ్లికి బయల్దేరి నన్ను రమ్మని బలవంత పెడితే అందరం కలసి వొచ్చాం.
నిన్ను ప్రేమించిన లేదా ఆరాధించిన వారందరికీ పెళ్ళికొడుకెలా ఉంటాడో? ఎంత శ్రీమంతుడో చూడాలనే ఉత్సుకతే ఎక్కువ.. అందుకే వెళ్ళాము.
మాకు ఆడ పెళ్ళివారంతా ఎంతో మర్యాదలు చేసారు.. కోన సిమ అందాలు, కొబ్బరితోటల పచ్చదనాలు, గోదావరి ఇసుక తిన్నెల మీద పందిళ్ళు, అంతా పచ్చివాసన, గోదావరి మీదనుండి చల్లటి పిల్ల గాలులు, పెళ్ళికోసం అలంకరించుకున్న పడుచు పిల్లల వయ్యారాలు పెళ్ళిపెద్దల పనుల పురమాయింపులు అంతా సందడి సందడిగా ఉంది. కానీ అవేవీ మాకు ముఖ్యంకాదు.. త్వరగా పెళ్ళి కొడుకుని చూడాలని… తొందరగా ఉంది.
విడిదింటికి వెళ్ళి, పెళ్ళికుమారుడిని పరిచయం చేసుకుందామని లోపలికి కబురు పంపాము.
పెళ్ళి కొడుకు అనే ఒక పొడగాటి, బక్కపలచని శాల్తి వంగిపోయి, నుదుట పెళ్ళి బొట్టు, మెడలో బంగారు గొలుసూ, పట్టుబట్టలు కట్టుకొని, చొక్కాలేని ఛాతీ పట్టు కండువా కప్పుకుని వచ్చి, మా అందరికీ నమస్కరించి నిలుచున్నాడు. పెళ్ళి కొడుకు అలంకరణలోనూ ఏమంత ఆకర్షణీయంగా లేడు… నీకు అసలే తగినట్టు లేడని ఎంతో బాధ కలిగింది.
అతన్నిచూడగానే అందరం ఒకరికి తెలియకుండా ఒకరం ఒకేసారి నిట్టూర్పులు విడిచాము.. లేని నవ్వు ముఖాలపై పులుముకొని, పలకరించి, శుభాకాంక్షలందించి మా బసకు చేరుకున్నాము.
ఎలాగోలా పెళ్లి తంతు అయ్యేంతవరకూ ఉండి తిరుగు ప్రయాణమై వొచ్చేసాము..
నగేష్ మాత్రం ఒక్క రోజుకే జ్వరానపడి లేచినవాడిలా నీరసపడి, దిగాలు పడిపోయాడు…ఎవరు మాత్రం ఏంచేస్తారు?
మళ్ళీ మనం ఎప్పుడు కలువలేదు. నేను నా ఉద్యోగం, పిల్లలు, సంసార జంజాటంలో పడి ఏ విషయమూ ఆలోచించే టైమే లేకుండా పోయింది. ఐనా నీవు నన్ను ప్రేమించావని నగేష్ చెప్పాడు కానీ , పెళ్ళైన వాడిగా నేను ప్రేమించలేదు. కానీ అన్ని కళలలోనూ ఆరితేరిన నీ నైపుణ్యాలకు అభిమానం, మంచితనానికి, మర్యాదకూ నీ మీద ఉన్నత భావంఉండేది అన్నాడు.
ఆ మాట విన్నాక నేను హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాను. అలా అని ఏ నాడూ తను కపట ప్రేమ చూపలేదు అది కచ్చితంగా చెప్పగలను. ఇప్పుడు డిమెన్షియా జబ్బుతో స్పృహలో లేకపోయినా నిజమే చెప్తున్నాడని మురిసిపోయాను.
“అపుడు లేదు సరే! ఇప్పుడు ఏమైనా ఉందా?”..అనడిగాను….
ఒక్కసారిగా అతని కళ్ళు మెరిసాయి..ఇప్పుడా…….అన్నాడు. తాను ఇంకా ఏమీ మాట్లాడలేదు, నేను ఏమీ అడగలేదు..తనకి డిమెన్షియా జబ్బు వచ్చిన నాటినుండి నేను తన భార్యను అన్న సంగతి తాను ఎప్పుడో మరిచిపోయాడు.
ఆ సాయంత్రం కేర్ టేకర్ కు భర్తను చూసుకొమ్మని చెప్పి, బీరువా తెరిచి చూసాను. గ్రేకలర్ సఫారీ సూట్, మరొక జత బట్టలు, తన బట్టలు సర్దుతూనే… వీరేశమ్మా! రెండుజతల బట్టలు బ్యాగ్ లో సర్దుకో! మనం వైజాగ్ పోతున్నామని చెప్పాను.
ఎందుకమ్మా? సార్ కు కానుబొమ్మ మీద దెబ్బ తగిలి మస్త్ నెత్తురకారిపోయింది, నాలుగు కుట్లు పడ్డాయి.. రేపటికి ముఖం వాచి నొప్పైతే ప్రయాణం కష్టం కదా! వద్దమ్మా! అని అంటూంటే… నొప్పిలేకుండా ఇచ్చిన టాబ్లెట్ వేయి! అని వీరేశమ్మ సమాధానం కోసం చూడకుండా… పై పోర్షన్ లో రెంట్ కున్న పిల్లవాడిని పిలిచి, వైజాగ్ కు మూడు టిక్కట్లు ఆన్ లైన్ లో బుక్ చేయమని చెప్పి, చేయించాను…
నగేష్ గారి దగ్గర ప్రభాత్ కుమారి కాంటాక్ట్ నంబర్ తీసుకొని, ఫోన్ చేసి, మీ దగ్గరకురావాలని ఉందనీ, మీకు మాట్లాడే సమయముందా? రావాలా ? అనడిగితే సరే రమ్మని అన్నది.
నా భర్త కు నేనే స్వయంగా క్లీన్ షేవ్ చేసాను, కేర్ టేకర్ సహాయంతో స్నానం చేయించాను. చక్కగా డ్రస్ వేసి, ఒకసారి పైనుండి కిందకు చూస్తే ఎంతందంగా వున్నారో, కాపురం చేసినన్ని రోజులు పిల్లల బాధ్యతతో , ఇంటి పనులలో పడి, ఒక్కసారికూడా ఆయనతో ఎంతందంగా ఉన్నారని చెప్పనే లేదు! పుణ్యకాలం గడిచాక దాని విలువ తెలుస్తుందేమో? నిజంగానే చాలా అందంగా ఉన్నారు. తల్లి పోలికేమో? మంచి దబ్బపండు ఛాయ, కోటేరు వంటి ముక్కు, చురకత్తులవంటి అదో రకమైన ఆకారంలో ఉన్న కండ్లు, గాంభీర్యాన్ని తెలిపే విశాలమైన నుదురు, మందపాటి క్రాఫ్ తో ఏమంత పొడుగు లేకపోయినా ఏదో ఆకర్షణ, హుందాతనం, పంచెకట్టులోనైతే అచ్చు నాగేశ్వర రావు వలె ఉండేవాడు. ఎడమభుజంమీది కండువా తో బయటకు రాగానే అల్లరిగా నా చేతి వేళ్ళతో చక్కగా దువ్విన క్రాఫ్ ను చెడగొట్టేదాన్ని, కండువా లాగేసేదాన్ని… నా అల్లరి భరించడం ఆయనకు నలభైఐదేండ్లుగా అలవాటే కదా! చిరుకోపంతో ఎంత వయసొచ్చినా ఈ అల్లరి మానవా, అని మళ్ళీ దువ్వుకొని, దువ్వెనతో నా బుగ్గమీద ఒక చిన్న దెబ్బవేసి, కండువా సర్దుకుని, సాహిత్య సమావేశాలకు వెడితే, ఆ స్ఫురద్రూపానికీ, అతని ఉపన్యాసానికీ పడిచచ్చేవాళ్ళు శ్రోతలు.
ఇంతలో అద్దెగది పిల్లవాడు సురేంద్ర ఆంటీ! ట్రైన్ టైమ్ అవుతున్నది మీరు తొందరగా బయలుదేరాలని పిలువడంతో ఈ లోకంలోకి వచ్చి, తానూ, నేను, వీరేశమ్మా గబగబా తయారై, స్టేషన్ కు వెళ్లిరైలు ఎక్కాము.
వైజాగ్ స్టేషన్ కు మాకోసం కారు పంపింది ప్రభాత్ కుమారి. ఇంటిముందు చేరే లోపల నా భర్త రైలుఎక్కినప్పటి నుండి ఎక్కడికి వెడుతున్నామని అడిగిందే అడుగుతూనే ఉన్నాడు. అప్పుడు చెప్పినా లాభంలేదు. మరచిపోతాడని, సమయానికి చెప్పాలనుకున్నా ఇప్పుడు ఎలా చెప్పాలనీ? ఏంచెప్పాలనీ గుండెదడదడలాడింది..
భగవంతుని మీద భారం వేసి, ఎలాగోలా కూడదీసుకుని మీ క్లాస్ మేట్ ప్రభాత్ కుమారి గారు వైజాగ్ లో ఉన్నారని చెప్పారు కదా? ఆమెను కలిసి, రేపు సింహాచలం నరసింహ స్వామి దర్శనానికి వెడదాము అన్నాను. చెప్పగానే ఎంత సంతోషమో ముఖంలో… సింహాచలం మరోసారి వెడదాము ! ప్రభాత్ కుమారితో మాట్లాడవలసిన ఎన్నో విషయాలున్నాయి సమయం సరిపోదని మారాము చేయడం మొదలు పెట్టాడు. సరేసరేనని బుజ్జగించి బయలుదేరాము.
ఆమె ఇల్లు చేరగానే ఆమెనే స్వయంగా మమ్మల్ని లోపలికి ఆహ్వానించారు. నేను మావారి చెవిలో చెప్పాను.. చూడండి మీ క్లాస్ మేట్ ప్రభాత్ కుమారి వీరే… ఈయనే రత్నాకర్… అని ఒకరొకరికీ పరిచయం చేయగానే… బాగున్నారా? అని ఆమె అడిగారు… దాదాపు తాకే దూరంలో నిలబడిన ఈయనను చూసి- ఆమె భర్త కాస్త మొహమాటపడ్డారు…
నువ్వేనా…..? రత్నాకర్….? ఎలా ఉండేవాడివి? ఎలా ఐపోయా వేమిటీ? అంటూంటే ఆమె గొంతు జీరబోయింది.సంజీవ్ కుమార్ లా ఉండేవాడివి…. భాగవత పద్యాలు *అంధేందూయముల్ బధిర శంఖారావముల్* అంటూ ఎంత చక్కగా.. మధుర కంఠంతో పఠించేవాడివి….
దేవులపల్లి కృష్ణ శాస్త్రి కవితలూ, దాశరథి మూర్తనలూ… *దొంతరలైన మబ్బులు* నీవు పలికినట్టు భావయుక్తంగా ఆ భావం నీలో ఇముడ్చుకుని ఆ మబ్బుల్లో విహరించేవాడివి..అవన్నీ ఎక్కడ వదిలేసావు? నీ కుచ్చిళ్ళు పోసిన ధోవతి కట్టు-ఏదీ…? భుజాన వేలాడే ఆ కండువా ఏది…? ఆ నొక్కు జుట్టు మాయమై ఈ బట్టతల ఏమిటీ? ఐనా నీలాంటి మేధావి ఆలోచనలకు తలపై వెండ్రుక నిలుస్తుందా? ఆలోచన ఆవేగపు వేడిలో పేలిపోయి రాలిపడదూ…? తెల్లటి నీ పాదాలకు ఆ లెదర్ సాండిల్స్ వేసిన ముద్రలలాగే ఉన్నాయి కదా? ఏం? అవి వేసుకోవడం మానేసావా? ఐనా ఈ గ్రేకలర్ సఫారీలోనూ, ఆఫ్ షూస్ లోనూ ఎంతో బాగున్నావు… వారసత్వ సంపదగా సంజీవ్ కుమార్ ఆ నల్ల కళ్ళద్దాలు ఇచ్చాడా? అని ఆటపట్టించేవాళ్ళం గుర్తుందా? యూనివర్శిటీలో రోజూ ఆడపిల్లలం ఇద్దరు ముగ్గురం పందెం కాసేవాళ్ళం.. ఈరోజు రత్నాకర్ ఆఫ్ వైట్ వేస్ట్ కోట్ వేసుకొని వస్తాడనీ కొందరం… కాదుకాదు మెరూన్ స్వెట్ షర్ట్ వేస్తాడని…మరికొందరూ నీ డ్రెస్ ల గురించే మాట్లాడుకునే వాళ్ళం..
ఏమిటీ? ఈ వదులైన స్వెట్టర్ చేతిమీద వేసుకుని వచ్చావ్? అని ఏదో మరోలోకంలో ఉన్న మనిషి వలె భర్త పక్కన ఉన్న సంగతి మరిచి పోయి గడగడా మాట్లాడుతూనే ఉంది ప్రభాత్ కుమారి…
నేను నివ్వెర పోయిన మాట వాస్తవమే ఐనా ఒకింత గర్వంగా ఫీలైయ్యాను…. ఓ కాలేజీ రోజుల్లో ఈయన హీరోలాగ ఉండేవాడన్నమాట! అనుకుంటూ ..
తుపాకీ నుండి గుండు బయటకు వేగంగా వచ్చినట్టు… మా వారు కూడా ” నువ్వూ కూడా ఇలా తయారయ్యావేమిటీ? ఏదీ ఆ బారుజడ? చెవిపక్కన అందంగా అమర్చుకునే గులాబీ ఏదీ? పవనుడు నీ కశ్మీర్ సిల్క్ చీర పమిటను జెండా వలె ఎగురవేసేవాడు… ఎందరి యువకుల గుండెలు ఆ జెండా కింద దోబూచులాడాలని ఉవ్విళ్ళూరారో? నీలాంటి ఆడపిల్ల దొరికితే బాగుండని కలలు కననియూనివర్శిటీ విద్యార్థులున్నారా? పొడగాటి దోసపలుకు తిలకం నీ ఫాలభాగాన భారత దేశ చిహ్నంవలె వెలుగూతూ వింత వెలుగునిచ్చేది… నీ చెవి లోలాకుల ధగధగలు చెంపలపై తళుక్కుమన్న ఆ చిత్రం ఎందరి కళ్ళ కెమరాలు క్లిక్ మనిపించేవో? పలుచని చెప్పు పట్టీలు నీ తెల్లని పాదాల అందాన్ని రెండింతలు చేసేవంటే కొందరి కళ్ళు ఆవైపే కదలక నిలిచేవి… నాజూకైన నీచేతి రిస్ట్ వాచ్ చూసుకుంటూ గబగబా క్లాస్ వైపు నడిచే నీ అడుగులో అడుగు వేస్తూ నడిచే నీఆరాధకులెందరో? ఐనా ఒక్కరంటే ఒక్కరు నీతో మనసులో ఆరాధిస్తున్నామని చెప్పనివ్వని నీ గంభీరతకు ఎందరు పిచ్చివారయ్యారో? నీకేమైనా తెలుసునా? లేదే? ఎవరికి వారే నీకు నేను తగను అనే న్యూనతా భావంలోనే పడిపోయి, ఆ భావుకతతో కూడిన ఉత్తరాలెన్నో రాసి, భావుకత సరిపోలేదని చింపేసి , మళ్ళీ రాసి పారిశుధ్య కార్మికుడి పని పెంచినవారెందరో? తెలుసా? అని గడగడా మాట్లాడుతూ రత్నాకర్ భార్య పక్కన ఉన్నదన్నవిషయమే మరచిపోయి హృదయం విచ్చుకొన్న నవ్వొకటి పెదవులదాటి, చెవుల దాకా సాగి ,చెవులు పైకి లేచి, కంటిలో ఎఱుపు జీరల వెలుగు ముఖమంతా పాకి నొసటి మడతలు ఇస్త్రీ చేసినట్టు అతనీ లోకంలోనే లేనట్టు ఒక ఆరాధనా భావపు చూపు విసిరాడు….
ఔనూ! రత్నాకర్! కావ్యాత్మా అని పిలిచే నీ మిత్రుడెక్కడున్నాడు? అనడిగింది… ఆ సెకనులో ముఖంలో ఆ నవ్వు మాయమై…*దివిజ వరుల గుండెయల్ దిగ్గుమనగా…అమర పురికి అరిగినాడు*… అంటూ మోచేయి మడచి , తన షర్ట్ తోముఖం తుడుచుకున్నాడు.
ప్రేక్షక పాత్రలో నేను గడ్డకట్టుకుపోయాను…ఆ కాలపు కట్టుబాట్లు ఇంత మంచి భావకులను ఒకటి కానివ్వకుండా చేతులు వెనక్కి విరిచి కట్టేసిన విధి క్రూరతకు మనసు భగ్గుమని మండింది. హృదయాన్ని ఎవరో ఱంపంతో కోసినట్టైంది. ఆ క్షణంలో అతను నా భర్త,అన్న సంగతి మరచి, ఒక హృదయపూర్వకంగా ప్రేమించే ప్రేమికుడి వలెనే చూసాను.
కొంత సేపటికి తేరుకుని,ప్రభాత్ కుమారి అలా యూనివర్శిటీ దాకా వెళ్ళి వద్దామా? అన్నది. ఆ మాటతో రత్నాకర్ ముఖం మరోసారి వెలిగింది…
ఆ వైజాగ్ యూనివర్శిటీ కూడా దాదాపు ఉస్మానియా వలెనే ఉంది కాకపోతే కట్టడపు శైలి ఉస్మానియా ముసల్మానుల భవంతులవలె గోపురాల వలె ఉంటుంది. కానీ పచ్చని లాన్ లు, సువాసలు వెదజల్లే పూల మొక్కలతో, ఎఱ్ఱని తివాచీ పరచినట్టున్న సిమెంటు నడకదారి వందలాది క్రోటన్ మొక్కలతో చాలా అందంగానూ ఆహ్లాదంగానూ ఉంది. అక్కడో బెంచీ మీద కూర్చున్నారు.
మా వారి మనసు మళ్ళీ ఆ పాత జ్ఞాపకాలలోకి పయనించిందేమో? ఆమెతో మాట్లాడడం మొదలుపెట్టాడు… ముఖ్యంగా ఆనాటి తెలుగు అధ్యాపకులైన చెలమ చెర్ల రంగాచార్యుల పాఠాలమీదకు మళ్ళింది. విష్ణుపురాణం వింటే వారి ముఖతః వినాలి అనేటట్టుండేది… శ్రావ్యంగా పద్యపఠన చేయడమే కాదు విద్యార్థులను కావ్యపఠనం, గ్రంథాల పఠనంలో ఆసక్తికలిగించేలా ఏదో ఒక అంశాన్నిచ్చి, బ్లాక్ బోర్డ్ మీద అందమైన అక్షరాలతో ఆనాటి అంశం- వివరించే విద్యార్థుల పేర్లు రాసి, తాను పక్కకు తప్పుకుని, ఆ విద్యార్ధి ని పిలిచి, మిగతా విద్యార్థులకు పాఠం చెప్పమనేవారు… ముందుగా కాస్త స్టేజ్ మీద మాట్లాడడానికి భయపడినా…గురువుగారి ప్రోత్సాహంతో తాను కాండిఖ్య-కేశిధ్వజుల న్యాయ వాదన చెప్పితే…. అందరిముందూ గట్టిగా ఆలింగనం చేసుకుని, ” నాయనా! ఇంతకు మునుపు ఎవ్వరూ ఇంత విడమర్చి చెప్పలేదు… ఎక్కడ నేర్చుకున్నావు? అని అడిగారు.
మా మామగారు నాకు గురు తుల్యులు… వారు కవి పండితులు… వారిదగ్గర విష్ణుపురాణం పాఠ్యాంశంగా ఉందని చెబితే… ఈ అంశాన్ని బోధించారు…
అని చెప్పి తన సీట్ లో కూర్చున్న నా పక్కన ఉన్న నగేష్ ముఖం వెలిగిపోవడమూ….అదే సమయంలో ప్రభాత్ కుమారీ! నీ ముఖం వెలవెల పోయి మాడిపోవడం ఒకేసారయ్యాయి… గుర్తుందా? అన్నారు.
ఏమైందబ్బా? అని నేను ఉత్కంఠతో చూసాను. ఆయన మళ్ళీ ఇలా అన్నారు.
నా పాఠ్యాంశ వివరణ నీకు సంతోషాన్నిస్తుందనుకుని, నన్ను ఎంతగానో అభినందిస్తావనుకున్నాను… ఇదేమిటీ అలా అయిందని నాకు ఏమీ అర్ధంకాలేదు… తరగతి గదిలోని విద్యార్థుల కరతాళ ధ్వనులతో బాహ్య ప్రపంచంలోకి వచ్చిన నేను నగేష్ వైపు ప్రశ్నార్ధకంగా చూసాను…
నగేష్ తన క్రాప్ చెడిపోకున్నా పదేపదే దువ్వుకుని, ఇన్ షర్ట్, టై సరిచేసుకుని, చేతిరుమాలుతో ముఖం పదేపదే తుడుచుకొని, ఏదో ఆనందంలో మునిగి, చూసీ చూడనట్టు ఆమె వైపు చూస్తున్నాడు.. వడలిపోయిన తోటకూర కాడలా ఉన్న ప్రభాత్ కుమారీ నిన్ను చూసి ఒక్క సారిగా మ్రాన్పడి పోయాను…కొన్ని నిమిషాల కింద పేరుకు తగినట్టు ప్రభాత సూర్యుడి వెలుగు వలె ఉన్న ముఖం సూర్యాస్తమయ సమయంలో సముద్రంలో మునిగి, నీటి ఆవిరులతో మసకేసినట్టున్న ఆ ముఖం చూసి, ఇన్నిరోజులూ నేను చెప్పాలనుకున్న పెళ్లయిన విషయం ఆమెకు చెప్పే అవకాశం దొరకక ఉడికిపోతున్న మనసుకు చల్లని పిల్లగాలి తాకినట్టూరట చెందిందట నగేష్ మనసు. ఆ తర్వాతెప్పుడో చెప్పాడు. ఎలా అంటే నేను మా మామగారన్నాను కదా? మేనమామను మామ అంటారు కానీ గారు అనరు కదా? అని నువ్వు అడిగావట! అప్పుడు నాకు పెళ్ళైన విషయం నగేష్ నీతో చెప్పాడట.
అది తెలిసిన నేను తనను నమ్ముకున్న భార్యను వమ్ముచేయకుండా, తను ప్రేమస్తూ పెళ్ళిచేసుకునే అవకాశం వచ్చినా, అబద్ధాలతో పనిలేకుండా యదార్థ విషయం ఆమెకు తెలిసినందుకు నిశ్చింత ఏర్పడినా… నా లోలోపల కవి, భావకుడు మాత్రం సన్నగా మూలిగాడు… అన్నారు మావారు.
ఆ బల్లలను తాకుతూ ఇక్కడ స్నేహితురాలితో ఆమె కూర్చునేది… ఈమె హృదయంలో చోటు చేసుకున్న పుస్తకాలకు చోటిచ్చిన ఆ మేజా బల్లను ఒకసారి తన చేతితో తడిమే వాడిననీ. భుజానికున్న హ్యాండ్ బ్యాగ్ తగిలించే కుర్చీ చెక్కడపు నగిషినీ చూసి చెమ్మగిల్లిన కన్ను చెమర్చుకున్నాననీ … చెప్తూనే ఉన్నారు. అంతా గమనిస్తూనే ఉన్నాను.
ఆమె భర్త మాత్రం ఇన్నిరోజులుగా తన భార్య ముభావంగా ఉండే తను ఇంత సంతోషంగా ఉండడం చూసి జీర్ణించుకోలేకపోతున్నాడు…
ఒకసారి లైబ్రరీ కీ వెడదామా? అన్నమాటతో ఉలిక్కిపడింది. నగేశ్ నీకు ఎన్నోసార్లు నువ్వు ఆరాధించే రత్నాకర్ పెళ్ళయిందని రాసిన స్లిప్ లూ, తనెంతగా ఆమెను ఆరాధిస్తున్న సంగతులన్నీ కవితాత్మకంగా ఉత్తరాలు, కవితలూ రాసి ఆమె ఏ పుస్తకాలు చదువుతుందో గ్రహించి ఆ రాక్ లలో పుస్తకాలలో పెట్టేవాడు… ఆరోజు నువ్వు వేరొక పుస్తకం తీసుకుని వెళ్ళేదానివి దాంతో నాకు పెళ్ళైనవిషయం తెలియకపోయేది.. ఎలాగైనా నాకు పెళ్ళైన విషయం చెప్పి, లైన్ క్లియర్ చేసుకొని నీతో తన మనసులో ఉన్న ఆరాధనా భావంచెప్పి, నీతో పెళ్ళి జరగాలని నగేష్ చేయని ప్రయత్నం లేకపోయేది. ఆ కాలంలో ఆడపిల్లల తో మాట్లాడడమంటే మాటలా? అసలు తేరిపార కూడా చూసే వాళ్లంకాదు…
దాంతో నగేష్ ఉస్సూరని ఆ చీటీలు మరలా తెచ్చి చించేసేవాడు… ఇలా మన ముగ్గురి మధ్యా జరుగుతున్న విషయం ఎవరికి వారే చెప్పడానికి జంకి, నేను మరొక అమ్మాయిని, నీవు మరో అబ్బాయినీ, నగేష్ అసలు పెళ్ళే చేసుకోకుండా నిన్నారాధిస్తూ… నీ జ్ఞాపకాలలోనే జీవిస్తూ భగ్నప్రేమికుడై కవితలల్లుతూ.. భుజాన ఓ సంచీ, దాన్నిండా నోట్ బూక్కులు, సభలలో సమావేశాలలో కవితాగానం చేస్తూ.. సిగెరెట్లు కాలుస్తూ… తన అందమైన రూపాన్ని పొగచూరు పట్టించుకుని, ఊపిరితిత్తులు పాడై… ఈ మధ్యనే ప్రాణాలొదిలాడు.వాడి జేబులో అందమైన నీ ఫోటో ఉండం అతని ప్రేమ విషయం కొందరికి తెలిసిందని ముగించాడు.
ప్రభాత కుమారి భర్త మీ ముగ్గురూ ఒకరిపై మరొకరు చివరివరకూ మనసు నిండా ప్రేమ నింపుకొని బతికారు. మాకు వివాహమైందనే కానీ ఏ ఒక్క రోజూ మనస్పూర్తిగా మాట్లాడుకోనే లేదు. ఆమె యాంత్రికంగా ఉద్యోగం కోసం యూనివర్శిటీ వెళ్లడం- రావడం …ఏదో ఆకలికింత ఉడకేసుకుని తినడం తప్ప ఏ భావమూ లేని నిర్లిప్తతత లోనే గడిచిపోయిందని దిగులుగా చెప్పి ఇటుతిరిగి రత్నాకర్ … రత్నాకర్ అంటూ గట్టిగా పిలుస్తుంటే నేను గభాలున ఆవైపు చూసి, ఆయన కింద పడబోతుంటే పడకుండా పట్టుకున్నాను. కానీ సిమెంట్ బెంచ్ చివర మొన్నతాకిన దెబ్బ మీద తాకడంతో ధారాపాతంగా రక్తం కారుతోంది.. అచ్చంగా మలినాలను తొలగించిన మంచినీటిలా… వీరేశమ్మ ఆదుర్దాగా వచ్చి, మరో బ్యాండ్ ఎయిడ్ వేసిందికానీ నాకు మాత్రం కారనీ ఆ హృదయ భారం తీరేవరకు రక్తం కారి మనసు ప్రక్షాళన కానీ అనుకొని, నిస్సత్తువుగా కూలబడిపోయాను…
ప్రభాత్ కుమారి అచేతనంగా చూస్తూ ఉండిపోయింది. ఆమె భర్త మాత్రం మరో సిగిరెట్ తీసి వెలిగించి గుప్పుగుప్పున పొగ వదులుతున్నాడు.. తన మనసులోని ఆవేదన వలెనే…
కాలం మాయాజాలం!!
ప్రకృతికే రంగులు మార్చే నేర్పరితనం ఉన్న కాలం… పచ్చటి ఆకులే ప్రకృతిని భ్రమ! పడే వారిని చూసి ఫక్కున నవ్వుతుంది. అంతలోనే ఎండుటాకులుగా మార్చి,జీవిత సత్యమేదోచెప్తుంది! కాలం…
మమకారాలన్నీ కారాలైపోతాయ్!
బంధాలన్నీ పటాపంచలై, బాధల గాథలే మిగులుతాయ్!
నిన్నటి వస్తువులన్నీ రేపటి కనవసరమై చెల్లని నోట్లవలె మిగులుతాయ్!
చేయూతనిస్తే సంతోషించే ముసలివాడిలా కనపడుతున్న రత్నాకర్ తిరిగీ తనదైన మరుపు ప్రపంచంలో ఏవో సంతోషాలను వెతుకుతూ కాందిశీకుడిలా… తన బట్టతల నిమురుకుంటూ…. అమ్మా( నన్ను పిలుస్తూ…డిమెన్షియా వచ్చినప్పటినుండి ఆలిని అమ్మగా మారాను.) ఆకలైతున్నది… రెండురోజులనుండి అన్నంపెట్టలేదు ( ఈ మాట తిన్న కాసేపటికే.. ఒకోసారి మూతి కడగకముందే అంటారు ) ముద్దపప్పు కావాలీ! నెయ్యి కావాలీ! అని ఎప్పటి వలె పేచీ పెట్టడం చూసి, హమ్మయ్య! మామూలు స్థితికి చేరాడని, ఇప్పుడు ఈ బిస్కట్! తినండి ఇంతలో అన్నం కలిపి తెస్తాననిచెప్పి, ప్రభాత్ కుమారి జంట దగ్గర సెలవు తీసుకుని, భారం దిగిన మనసుతో రైల్వే స్టేషన్ కు టాక్సీ మాట్లాడుకుంది.
అచేతనంగా నిలబడి చూడడం తప్ప కర్తవ్యమేమిటో తెలియని ఓడిపోయిన సైనికుడు శతృసైనికులకు చిక్కినట్టు, భర్తతోపాటు కారు ఎక్కి నిరాసక్తంగా రోడ్డువైపు చూస్తున్నది. వచ్చినప్పుడు కనపడిన అందాలేవీ ఆమె కండ్లకు కనపడడంలేదు…