మన భారతీయ సంస్కృతీ సంప్రదాయంలో ప్రతి పండుగ ఒక సందర్భం, ఒక ప్రత్యేకత,ఒక శాస్త్రీయ ధృక్పథం, ఒక చారిత్రక(పౌరాణిక)నేపథ్యంతో ముడివడివుంటుంది! మానవ సంబంధాలను పటిష్టపరిచేవిధంగా వివిధ వినూతన సనాతన విధానాలతో జరుపుకొనబడే పండుగల్లో ‘దీపావళి’ అనేది కులమత ప్రాంతాలకతీతంగా ఒక్క భారతదేశంలోనేకాదు పలుదేశాలలోనూ జరుపుకునే పవిత్ర పర్వం!
ఎంతో ప్రత్యేకతను కలిగి, ఎన్నెన్నో విశిష్టతలను సంతరించుకున్న ముచ్చటైన మూడుదినాల పండుగ ఆశ్వయుజ మాసం లోని ఈ దీపావళి పండుగ!
‘దీపావళి’ అనగా దీపముల వరుస అని అర్థం!
“దీపంజ్యోతి పరబ్రహ్మం.. దీపం సర్వ తమోహరం.. దీపేన సాధ్యతే సర్వం.. సంధ్యాదీపం నమోస్తుతే!”
‘దీపం పరమాత్మ స్వరూపం.. చీకటినంతా తొలగించేది దీపం! దీపారాధనతో సకలం సానుకులమవుతుంది! ఉభయ సంధ్యలందు వెలిగించే దీపానికి వందనం!’ అని ఆ శ్లోకార్థం!
ఆరోగ్యకరమైన ఆవునెయ్యితోగాని నువ్వుల నూనెతోగానీ మూడువత్తులతో వెలిగించే, మూడురంగులతో వెలిగే దీపంలోని ఎరుపురంగు బ్రహ్మదేవునికి, నీలం రంగు విష్ణుదేవునికి, తెలుపురంగు శివదేవునికి ప్రతీకగా భావిస్తారు! బాహ్య చీకటినేగాక ఆంతరంగిక అజ్ఞానాన్ని తొలగించి వెలుగునిచ్చే దీపం త్రిమూర్తిస్వరూపమైన పరబ్రహ్మజ్ఞానరూపమై తరతరాలుగా ఆరాధన చేయబడుతుంది!
నరక చతుర్దశికి ముందురోజు, ఐశ్వర్యాధిపతియైన కుబేరుని జన్మదినం ‘ధనత్రయోదశి’ పేరుమీదుగా ఆరోజు వెండి బంగారం కొనుగోలు చేస్తే, ఏడాది పొడుగునా ఏలోటూ కలగదన్న నమ్మకంతో కొన్న ఆభరణాలను అర్చించి దైవానికర్పించి అలంకరించుకుంటారు మన తరుణీమణులు!
చెడుపైన మంచిసాధించిన విజయానికి చిహ్నంగా ఈ దీపావళిపర్వం అనేది నరక చతుర్దశితో ఆరంభమవుతుంది! లోక కంటకుడైన నరకాసురుడి సంహారానికి సంతోషించిన ప్రజలు ఆనందోత్సాహాలతో ఆనాటి అర్ధరాత్రినుండి మర్నాటి అమావాస్యనాడు ఈ దీపావళి దీపోత్సవాన్ని జరుపుకుని, చీకటిలో వెన్నెల వెలుగులను ప్రకాశింపజేశారని పౌరాణిక కథనం..
పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుడు భూగోళాన్ని సముద్రంలో ముంచేయగా, శ్రీమహావిష్ణువు వరాహరూపంలో అవతరించి భూదేవిని కాపాడగా, విష్ణువు స్పర్శతో పులకించిన భూదేవి ఎంతో తపించి విష్ణువును పతిగా పొందిన ఆ దేవి, హరి వారించినా వినక అసురసంధ్యవేళ సంగమించిన కారణంగా.. భూమాత నరకాసురుడనే అసురుడికి జన్మనిచ్చింది!అసురీనైజంగల నరకుణ్ణి, అసురవైరి అయిన విష్ణువు సంహరించకుండా.. అవసరమైతే పుత్రుని మరణం అనివార్యమైతే, అతని మృత్యువు తల్లియైన తన చేతిలోనే వుండేలా వరాన్ని పొందింది భూదేవి! కాలక్రమేణా ద్వాపరయుగంలో దుష్టసాంగత్యంతో దుష్టుడిగా మారిన నరకుడు ఎన్ని దురాగతాలొనరిస్తున్నా, తల్లిగా తనయుని సంహరించలేని మాతృప్రేమ అనేది మహాకవచంగా మరింతగా విజృంభించిన నరకుడు దేవతలనోడించడం, దేవమాత కర్ణకుండలాలనపహరించడం, మునులను మానవులను హింసించడం, యజ్ఞయాగాదులను భంగపర్చడం, అతివలనవమానించడం వంటి దుష్కార్యాలొనరించడం ఆరంభించాడు!
అదే ద్వాపరయుగంలో, దుష్టశిక్షణ శిష్టరక్షణకై శ్రీమహావిష్ణువు శ్రీకృష్ణునిగా అవతరించినపుడు, భూదేవి కూడా సత్యభామాదేవిగా అవతరించి శ్రీకృష్ణుని అర్ధాంగి అయింది! జన్మ విస్మృతితో తాను నరకుని తల్లినన్న సంగతి మరిచిపోయింది!లోకకంటకుడైన నరకుని పైకి యుధ్దానికి బయల్దేరిన భర్తననుసరించింది యుధ్ధవిద్యలెరిగిన సత్యభామ! ఆ భీకర సమర సమయంలో శ్రీకృష్ణుడు స్పృహకోల్పోయిన స్థితిలో, రోషావేశాలతో అరివీరభయంకరి అయిన సత్యభామ నరకాసురుని సంహరించిన సన్నివేషం నారీవిజయానికి మరో చిహ్నంగా చరిత్రలో కీర్తింపబడింది! ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాడు జరిగిన నరకాసురుని అంతానికి శుభ సూచకంగా, ఇళ్లల్లో,వీధుల్లో, ఊళ్లల్లో, నగరాల్లో అమవాస్యచీకట్లనంతరింపజేసేలా వేనవేల దీపాలను వెలిగించి ఉత్సవాలను నిర్వహించుకున్నారని.. అదే పర్వం నేటికీ మన సనాతన సంప్రదాయ నిలయంగా.. కొంత ఆధునికతను సంతరించుకొని, సంతసాల నెలవుగా నిలిచిపోయింది దీపావళి!
అలనాడు పాలసముద్ర మదనం వేళ మహాలక్ష్మి ఆవిర్భవించిన సందర్భంగా ఆశ్వయుజ అమావాస్యనాడు ఘనంగా లక్ష్మీపుజలు నిర్వహిస్తారు! పూర్వం రక్తబీజుడనే రాక్షసుని పార్వతీదేవి వధించిన కారణంగా గౌరీనోములతో దీపావళిని జరుపుకుంటారు! రావణ సంహారానంతరం శ్రీరాముడు సీతాదేవితో అయోధ్యకు తిరిగివచ్చిన శుభ సన్నివేశాన్ని, మరియు పాండవులు వనవాసం తరువాత హస్తినకు తిరిగివచ్చిన సందర్భాన్ని, సంబరాల దీపావళిగా జనులు జరుపుకున్నారని పలు పౌరాణిక కథలు మనకు వెల్లడిస్తాయి!
దీపావళినాడు.. సంప్రదాయాల నలుగుపిండి స్నానాలు, నగలూ నూతన వస్త్రధారణలు, రంగురంగుల రంగవల్లులు, రకరకాల దీపాలంకరణలు, తీపివంటకాల పంపకాలతో కుటుంబీకులు బంధుమిత్రులను కలవడం, దేవాలయాలకు వెళ్లి భగవంతుణ్ణి కొలవడం మొదలైన కార్యక్రమాలు నిర్వహిస్తారు! ఇంకనూ వాతావరణ కాలుష్యాన్ని హరించే బాణసంచాను వెలిగించడంవంటి సామూహిక జనసందడిలో సామాజికానంద చైతన్యం వెల్లి విరుస్తుంది!
ఈ దీపావళి పండుగ సందర్భం అనేది పేద ధనిక అనే భేదంలేని ఎన్నెన్నో అమ్మకాలు కొనుగోలు అనే వ్యాపార విధానాలతో జన జీవన స్రవంతిలో పరస్పర సహకార సరళి స్ఫురించి స్పూర్తినిస్తుంది! అందరూ కలిసి వెలిగించే దీపావళినాటి దీపమాల.. మనిషితో మనిషి కలిసే ఆనంద కరమాలగా మారగా ఆ మా’నవ’హార మణి దివ్వెలను.. కుటుంబంనుండి సమాజందాకా, సమాజంనుండి దేశందాకా, దేశంనుండి ప్రపంచందాకా పరివ్యాప్తం కాగల సమతాకాంతులుగా.. భవ్యశోభావళి యైన దివ్యదీపావళిలో మనం సందర్శించగలం!