బర్డ్ ఫ్లూ

బర్డ్ ఫ్లూ… పక్షులకు వచ్చే ఫ్లూ. పక్షులకు ఫ్లూ వస్తే వైద్య ఆరోగ్యశాఖ ఎందుకు భయపడుతుంది? బర్డ్ ఫ్లూకు, మనుషులకు సంబంధమేమిటి? తెలుసుకుందాం ఈ వ్యాసంలో.
ఊపిరితిత్తులకు వచ్చే “ఇన్ఫ్లుయెంజా” అనే వ్యాధిని సింపుల్ గా “ఫ్లూ” అంటాం. ఇది ఇన్ఫ్లుయెంజె అనే RNA వైరస్ వలన, నోటి తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ లో నాలుగు రకాలు… పక్షులకు వచ్చే బర్డ్ ఫ్లూ టైప్ ఏ, కేవలం మనుషులకు మాత్రమే వ్యాపించే టైప్ బి, మనుషులకు, పందులకు కూడా వచ్చే టైప్ సి (స్వైన్ ఫ్లూ), ఇతర జంతువుల్లో వుండే టైప్ డి.
ఇన్ఫ్లుయెంజె వైరస్ ప్రత్యేకత ఏమిటీ అంటే, చాలా వైరస్ లలో జన్యువులు వృత్తాకారంలో వుంటే, ఈ వైరస్ లో జన్యువు ముక్కలుగా ఉండి, బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ జన్యువులు, మానవ ఫ్లూ వైరస్ జన్యువుల సంకరము (మిశ్రమం) జరిగి కొత్త రకాలు పుట్టుకు రావడం ఒక కారణమైతే, వైరస్ మీద ఉండే హీమెగ్లుటినిన్ (Haemagglutinin) అనే రిసెప్టార్ తరచుగా వైవిధ్యాలకులోనై , కొత్త రకమైన వైరస్ గా రూపాంతరం చెందడమనేది ఇంకొక కారణం. ఈ రకమైన కొత్త వైరస్ మనుషులకు సంక్రమించి మహమ్మారిలా వ్యాపించే లక్షణాన్ని కలిగి ఉండడం వలన వైద్య ఆరోగ్యశాఖ అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. అలాగే ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రతి దేశంలో పర్యవేక్షణ, నిఘా కేంద్రాలను పెట్టి, మనుషులకే కాదు… పక్షులలోనూ, పందులలోను, ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే తగు చర్యలు చేపడుతుంది.
ఈ మధ్యకాలంలో మన ఆంధ్రప్రదేశ్ లో, కోళ్లల్లో వచ్చే బర్డ్ ఫ్లూ గురించి తెలుసుకుందాం. ఇది నీటిలో చరించే పక్షుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ బర్డ్ ఫ్లూ కోళ్లకు, టర్కీలకు ఎక్కువ ప్రమాదకరమైనది. బాతుల్లో ఈ వ్యాధి లక్షణాలు తక్కువగా ఉంటాయి. కాని వ్యాధిని వ్యాప్తి చెయ్యడంలో వీటి పాత్ర కీలకంగా ఉంటుంది. ఈ వ్యాధి నీటిద్వారా పక్షుల్లో వ్యాపిస్తుంది. ప్రేగుల ద్వారా శరీరంలోకి ప్రవేశించి, మలం (రెట్ట) మరియు స్రావాల ద్వారా, అవి నివసించే జలాలను కలుషితం చెయ్యడం ద్వారా, ఇతర పక్షులకు వ్యాపిస్తుంది.
వైరస్ సోకిన పక్షులను సాకడం ద్వారా గాని, వ్యాధి నుండి చనిపోయిన పక్షులను హ్యాండిల్ చెయ్యడం ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. ఈ బర్డ్ ఫ్లూ మనిషి నుండి మనిషికి వ్యాప్తి చెందదు. ఒకవేళ జన్యు వైవిధ్యం లేదా సంకరం జరిగితే, వచ్చే కొత్త వైరస్ వలన మనిషి నుండి మనిషికి నోటి తుంపర్ల ద్వారా వ్యాపించే అవకాశముండి, మహమ్మారిలా ప్రపంచాన్ని చుట్టేస్తుంది.
కాని, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేమిటంటే, వండిన కోడి మాంసాన్ని గాని, గుడ్లను గాని తినడం ద్వారా ఈ వ్యాధి వ్యాపించదు. వ్యాధి సోకిన కోళ్లను, జాగ్రత్తగా హ్యాండిల్ చెయ్యకపోవడం వలన మాత్రమే మనుషులకొచ్చే అవకాశముంది. అందుకనే వ్యాధి సోకిన వాటిని హ్యాండిల్ చేసేటప్పుడు పిపిఈ కిట్లు వేసుకుని చెయ్యాలి. మరణించిన కోళ్లను భూమిలో పాతి పెట్టాలి. కోళ్ల విసర్జకాలను నీటిలో కలుపరాదు. అలా చేయడం వలన మిగిలిన పక్షులకు వ్యాపించే అవకాశమెక్కువగా ఉంటుంది.
కోళ్లఫారంలో ఒక్క కోడిలో ఆ వ్యాధి లక్షణాలను గుర్తించి, వ్యాధిని నిర్ధారించినా, నివారణ చర్యలో భాగంగా ఫారంలో మిగిలిన కోళ్లనన్నింటినీ చంపి వేయడమే కాకుండా, కిలోమీటరు పరిధిలో ఉన్న మాంస విక్రయశాలలన్నిటినీ మూసివెయ్యడం, ఆ ప్రాంతంలో ఉన్న మిగిలిన కోళ్లను, గుడ్లను ధ్వంసం చెయ్యడం, పది కిలోమీటర్ల పరిధిలో ఉన్న మాంస విక్రయశాలలను మూసి వేయడం, కోళ్లు, వాటి ఉత్పత్తుల ఎగుమతులను నిషేధించడమే కాకుండా, కోళ్ల ఫారాలలో పనిచేసే వ్యక్తుల నమూనాలను ఫ్లూ వైరస్ కోసం పరీక్ష చేస్తారు.
ఒకప్పుడు వ్యాధి వచ్చిన దేశాల పేర్లతో, ఏషియన్, హాంగ్ కాంగ్, రష్యన్, స్పానిష్ ఫ్లూ అని పిలవబడితే, ఇప్పుడు రిసెప్టార్ల పేరుతో H3N8, H1N1, H3N2, H5N1 ఫ్లూ అని పిలవబడుతుంది.
ఈ శతాబ్దంలో 2009లో, H1N1 ఫ్లూ పేండమిక్ వచ్చింది. ప్రస్తుతం ఇండియాలో H3N2 స్ట్రెయిన్ సర్కులేటవుతున్నా, గత పది రోజులుగా H5N1 స్ట్రెయిన్ కోళ్లల్లో వ్యాధి కారకంగా నిలుస్తుంది. భోపాల్ లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ ఏనిమల్ డిసీజెస్ సెంటరులో బర్డ్ ఫ్లూ కేసులను నిర్ధారించిన వెంటనే ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రాజెక్ట్ (IDSP) రాపిడ్ రెస్పాన్స్ టీమును ఆయా ప్రాంతాలకు పంపించి నివారణ చర్యలు తీసుకుంటున్నారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితిని గమనిస్తే, … తూర్పు, పశ్చిమగోదావరి, కర్నూలు, ఎన్టీఆర్ జిల్లాలలో ఈ H5N1 బర్డ్ ఫ్లూ వ్యాపించి ఎన్నో కోళ్ల మరణాలకు కారణమయింది. కొన్ని కోళ్లు వ్యాధి సోకి మరణిస్తే (సుమారుగా ఐదు లక్షలు), వ్యాధి నివారణా చర్యల్లో భాగంగా 1.5 లక్షల కోళ్లు చంపబడ్డాయి. 10 కిలోమీటర్ల రేడియస్ లో ఉన్న పౌల్ట్రీ ఫారాలనన్నిటిని మూసివేశారు.
కోళ్లల్లో ఈ వ్యాధి లక్షణాలెలా ఉంటాయి? నీరసంగా ఉండడం, ముక్కు నుండి అధిక స్రావాలు కారడం, ఆహారాన్ని తీసుకోకపోవడం, చురుకుగా లేకపోవడం, పక్షుల రెట్ట లూజుగా ఉండడం, హఠాత్తుగా మరణించడం. కారణమేమీ లేకుండా హఠాత్తుగా కోళ్లల్లో మరణాలు సంభవిస్తే, ఫ్లూ వ్యాధిగా అనుమానించవలసి ఉంటుంది. ఫారాలలో కోళ్ళు దగ్గర దగ్గరగా ఉంటాయి కాబట్టి, వ్యాధి తొందరగా వ్యాపిస్తుంది. ఎక్కువ మరణాలకు దారితీస్తుంది
ప్రస్తుతానికి ఈ వ్యాధి కోళ్ళ నుండి మనుషులకు వ్యాపించిందనడానికి ఆధారాలు లేవు. మనుషులకు వస్తే వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి, మనుషులకు వ్యాపించకుండా, వైద్య ఆరోగ్యశాఖ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నది.
ఈ వ్యాధిని నివారించడానికి వ్యాక్సిన్స్ వున్నా, జన్యు వైరుధ్యాల వలన పాత వ్యాక్సిన్లు తర్వాత సీజన్లో వచ్చిన వైరస్ మీద పనిచెయ్యకపోవచ్చు. అందుకని ఈ వ్యాక్సిన్ ని ఎక్కువగా తయారు చేసి నిల్వ ఉంచరు. ఆ సీజన్ లో వచ్చే కొత్త వైరస్ ప్లస్ పాత వైరస్లతో కలిపి వ్యాక్సిన్ తయారుచేస్తారు. ఇంతవరకు H5N1 స్ట్రెయిన్ కు వ్యాక్సిన్ లేదు. వ్యాక్సిన్ తయారు చేసే పనిలో ఐసిఎంఆర్ నిమగ్నమై ఉంది.
WHO “Global Influenza Surveillance and Response System” (GISRS) ద్వారా, అన్ని దేశాలలో వచ్చే కేసుల గురించి సమాచారాన్ని తెప్పించుకుంటూ, వాటి నివారణా చర్యలు, చికిత్సా విధానాల గురించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూ, నిఘా పరిధిని విస్తృతం చేస్తూ, మనుషులకు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నది.
మనుషుల్లో, జంతువుల్లో, పక్షుల్లో… ఎవరిలో ఈ వ్యాధిని గుర్తించినా, ప్రజారోగ్య శాఖకు వెంటనే తెలియపరచాలి. ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రాజెక్ట్ (IDSP) ద్వారా వెంటనే రాపిడ్ యాక్షన్ టీమ్స్ ఆ ప్రాంతానికి చేరుకుని నివారణా చర్యలు చేపడతాయి. ఆ విధంగా పేండమిక్ కు దారి తీయకుండా జాగ్రత్తపడతాయి. తొందరలోనే, ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన బర్డ్ ఫ్లూ ఎపిడెమిక్ ను అరికట్టగలమని, H5N1 స్ట్రెయిన్ కు వ్యాక్సిన్ తయారు చెయ్యగలమని ఆశిస్తూ
డా. మజ్జి భారతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

శివరాత్రి !!

భక్తి పాట