మావయ్య బంగారం!-1

ధారావాహిక నవల

ఐ సి యూ లోని పేషంట్ గుండె ని మానిటర్ ద్వారా డాక్టర్లు ఎప్పటికప్పుడు గమనిస్తుంటారు.కానీ ఒక వ్యక్తి జీవితమెలా మానిటర్ చేయబడుతుంది. అదోపెద్ద ప్రశ్న. గుండె సాఫీగా పనిచేస్తున్నదంటే ఆ మానిటర్ మెలికల గీతలు కదులుతూ కనిపిస్తాయి. కానీ ఆ మెలికల నడక మారితే ? ఆ గీత సరళ గీత లాగా మారితే ఆ పేషంట్ స్థితి స్థిరంగాలేదని, ప్రాణం కూడా లేదన్న నిర్ధారణ కోస్తారు.

కానీ, అదే జీవిత మయితే ఎన్ని ఉడుదుడుకులు ఉన్నా మధ్య మధ్య లో సుఖ సంతోషాలు, సంతృప్తి లాంటి సరళ సందర్భాలు ఉంటె ఆ వ్యక్తి జీవితం బాగుంద ని అనుకుంటాం. అవేమి లేకుండా ఎక్కడ ఎలా ప్రారంభమయిందో అలాగే చివరిదాకా సరళ గీత లాగ సాగితే? అది ఎలాటి జీవితం. అన్ని కష్టాలే అనుకోవాలా? అన్ని సుఖాలే అనుకోవాలా? లేక ఏరకమయిన అనుభూతులకు, అనుభవాలకు, అనుబంధాలకు నోచుకోని జీవితమా? కలలుఎలా ఉంటాయో కూడా తెలియనంత అమాయకంగా. కోరికలు లేని సన్యాసినిలా కూడా కొన్ని జీవితాలు చివరిదశకు చేరుకుంటాయి అన్నది అక్షర

సత్యం.జీవించి ఉన్న కూడా ఏహృదయ స్పందన లేని ఆమె హృదయం లోకనిపించే ఆ సరళ గీత … ఒక అమాయకపు అమ్మాయి జన్మరాతకధే“మావయ్య బంగారం. ”

పాఠకులకు ఒక విజ్ఞప్తి. ఇది కేవలం నవలకోసం ఎంచుకున్న కథకాదు. కొంతమంది ఆర్తులయిన సజీవస్త్రీలగాథ. మనకుటుంబాలలో ఇంకా కనిపిస్తూనే ఉన్న స్త్రీమూర్తుల కథ. ఎదో విధమయిన అన్యాయానికి గురయి, తాము అన్యాయానికి గురిచేయబడుతున్నామని అర్ధంకూడా కానీ స్త్రీల కథ నా ఈ“మావయ్య బంగారం!” నవల. మీరందిస్తున్న ప్రోత్సహం,ఆదరణ తోటి నేను ఈ సారి కూడా మీ ముందుకొస్తున్నాను. నా “ కళావతి ” ని ఆదరిస్తారని ఆశిస్తూ!

 రచయిత్రి, నీలంరాజు పద్మావతి

పల్లెపచ్చ దనం-1

గట్టిగా బిగదీసి అల్లిన జడకు రెండు ఆకుపచ్చని రిబ్బనులు కట్టి ఒక పీచును గట్టిగా లాగే తురిమిన చేయమంతి పూల చెండు, పొడవుగా ఉండేపూల పూల గౌన్ వేసుకుని కాళ్లు తడవకుండా కుచ్చీలు కుచ్చీలుగా చేసి పైకెత్తి పట్టుకుని కాళ్లమధ్యలో గౌనుని పట్టుకొని గుడ్లేరు వాగులో దిగి

అమ్మమ్మతో బట్టలు ఉతుకుతుంది పచ్చగా మన పదహారణాల పల్లె పిల్ల కళ.అమ్మమ్మతో పాటు గుడ్లేరు వాగులో స్నానం చేస్తుంది. అమ్మమ్మ సుభద్రచీర మార్చుకుంటుంటే పక్కనే మరో ఉతికిన తాత పంచెను దరిలాగా పట్టుకొని నిల్చుంటుంది.

“ఏటి కళ అలా నుంచున్నావు,” అని చాకలి రత్తాలు అడిగితే “అవునత్తా! అమ్మమ్మ మడి చీర కట్టుకుంటున్నది, దగ్గరికి రాకు,” అనేది.

“ఓస్ అంతేకదా! అమ్మొమ్మమీద నీళ్లు పడకూడదు కానీ నీమీద చల్లొచ్చు కదా!” అంటూ దోశల్లోనీళ్లు తీసుకొని కళ మీదకు విసిరేసింది.

“అత్త ఇలా చేసావ్ ఏంటి, చూడుతడిసిపోయాను,” అంటూ బుంగమూతి పెట్టింది.

సుభద్రమ్మ, “ఒసేయ్ రత్తాలు ఇకాపు ఆ నీళ్లు నామీద కూడా పడుతున్నాయి,” అంటూ గదిమింది.

“మీరు ఉండండి అమ్మ! కళమ్మతో అలా పరాచకాలు నేను కాకపోతే ఎవరు ఆడతారు చెప్పండి? మన ఊరి మొత్తంలో ఒక చాకలి దాన్ని అత్తా అని నోరారాపిలిచేది నీ మనవరాలు ఒక్కతే,” అంటూ మురిపంగా చూసింది కళని రత్తాలు.

“చాల్లే సంబడం! అలాగే మధ్యాన్న వచ్చి చాలా సద్దేనం

ఉంది పట్టుకుపో.పిల్లలు తింటారు,” అని చెప్పి కళచేయి పట్టుకొని ఒడ్డునె క్కి ఊళ్లోకి వెళ్ళింది.అమ్మమ్మ వెళ్లే ముందు చెలంలో నుంచి బిందెల్లోకిపోసిన నీళ్ల బిందెను భుజాన పెట్టుకుంది.చకచకా ఆ తడి చీరను కాశీ బోసి కట్టి నడుస్తుంటే అమ్మమ్మతో అంతే వేగంతో నడవలేక ఆయాస పడుతూ,” అమ్మమ్మ కాస్త నెమ్మదిగా నడవొచ్చు,” కదా అంది, ఆమె నవ్వి నడక వేగం తగ్గించింది.

గుడ్లేరు వాగు వడ్డునతీసిన చలం లోఅలా పైకి ఊరిన నీళ్లను కంచు బిందెలో వాసేన కట్టి వడపోసుకొని తెచ్చుకుంటారు గ్రామవాసులు.రోజు వాగు కొచ్చి అమ్మమ్మకు బట్టలు ఉతకడంలోనూ, బిందెల్లో నీళ్లు నింపడం కోసం చలం తీయడంలో సాయం చేస్తుంటుంది ఏడేళ్ల కూడా నిండని కళ.చలం తీయడం అంటే చాలా ఇష్టం. ఏ ప్రశ్న తలెత్తినఅమ్మమే తనకిసమాధానం చెప్పాలి. ఎప్పుడూ గలగల అమ్మమ్మతో మాట్లాడుతూనే ఉంటుంది.నిజం చెప్పాలంటే సుభద్రమ్మకి కళ నిద్రపోయేటప్పుడు ఇంట్లో కూర్చోవడం అసలు నచ్చదు.ఎందుకంటే ఆ పిల్ల మౌనంగా ఉండేది అప్పుడే కాబట్టి.

ఒడ్డెక్కి ఊళ్లోకి వచ్చేముందు, “సుభద్రమ్మగారు, ఇవాళ మీ

చెలంనుండి నీళ్లు తెచ్చుకుంటాను, సరేనా!” అడిగింది ఆచారి గారి భార్య.

“అదెంత భాగ్యం, అడగాలా సోమి దేవి.”

అమ్మమ్మ కొంగు లాగి చిన్నగా “ అమ్మమ్మ మన చెలంలో నీళ్ళు అయిపోవు రేపటికీ.ఇలా ఇవాళ ఆచారి అమ్మమ్మగారుతెచ్చుకుంటే,”“ అయిన వాగులో నీరు తెచ్చుకోవచ్చు కదా!”అందికాస్త పెద్దగా.

“మీ మనవరాలేదో అంటున్నట్లున్నది, సుభద్రమ్మ గారు,”దానికి ఆమె “ దాని మొహం దానికేంతెలుసు.మీరు వెళ్లి తెచ్చుకోండి”అంటుముందుకు సాగిపోయింది.అమ్మమ్మ వెనకాతలే కళ.

అయినా అమ్మమ్మని అడగాల్సిందే అనుకొని సద్దన్నం తిన్న తర్వాత అమ్మమ్మ చిక్కుడుకాయలు పలుచుకుంటుంటే పక్కనే చేరి, “అమ్మమ్మ చలం తీయడం ఎందుకు? వాగులోని నీళ్ళేతెచ్చుకోవచ్చు కదా,” సందేహం వెళ్ళబుచ్చింది.

శాంతంగా “వాగులో నీళ్లంతా స్వచ్ఛంగా ఉండవే కళ.వాగు ఒడ్డన కొద్ది దూరంలో తీసే చలంలో నీళ్లు స్వచ్ఛంగా ఉంటాయి. ఇసుకలో తేరుకున్న నీరు మామూలు నీటి కన్నా స్వచ్ఛంగా ఉంటుంది,”అని చెప్పింది.

అందుకే కామోలు పెద్దరెడ్డి గారిచలం, కోమటి సుబ్బయ్య గారిచలం అంటూ ఆ ఊరిలోని పెద్దవాళ్ళందరూ వాళ్ళ చలం తవ్విపెట్టుకుంటారు.రోజు తెల్లవారేసరికి ఊటతో నిండిపోయి కనిపిస్తుంది. పైపై నీరంతా వస్త్ర కాయతంలా బిందెలకు వాసిన గట్టి నీళ్లను వడపోసుకుంటారు ఆ చలాల్లో నీళ్ళని మరొకరు ముట్టుకోకూడదు.

అలా అయిదేళ్ళు దాటేవరకు కళ స్వేచ్ఛగా అమ్మమ్మ వెనకాలే గుడ్లేరులో తిరిగేది.పొలాలకు వెళ్లి తాతతో మంచే మీద కూర్చునిపాల మొక్కజొన్న కంకులు తినడం, సజ్జలను వలచి తీసుకురావడం చేసేది.అప్పుడప్పుడు పక్క పొలాల్లో ఉన్న చింత చెట్టు కింద ఉయ్యాల ఊగటం , ఒకసారి చెప్పి, ఒకసారి చెప్పకుండా చింతకాయలు, దోసకాయలు తెంపుకు రావడం చేస్తుండేది. కరణందుర్గయ్యగారి మనవరాలు కదా అందుకే ఎవరు ఆమెని ఏమీ అనేవారు కాదు.అందరికీ ముద్దే కళఅంటే .

కానీ కళకి సురేష్ బాబు మావయ్య అంటే ఇష్టం.ఆమె కంటే పదేళ్లు పెద్దాయన మావయ్య.అప్పటికే దగ్గరలో ఉన్న మద్దిరాల జడ్పీ స్కూల్లో చదువుకుంటూ ఉండేవాడు.సాయంత్రం 4:00 కల్లా బట్టీల దగ్గర కాపు కాసేది.ఎందుకంటే మామయ్య సైకిల్ తొక్కుకుంటూ

అటువైపుగా ఇంటికి వస్తాడు.మావయ్యనిచూస్తూనే డొంకకు అడ్డంగా పరిగెట్టి ‘మామయ్య’ అని పిలిచి ఆపేది.ఆయనకి కళఅంటే చాలా అభిమానం.“రావే!”అంటూసైకిల్ ముందు రాడ్డుకి తన సంచిలో ఉన్న టవలు చుట్టి కూర్చోబెట్టుకొని ఇంటికి చేరుకునే వాడు సురేష్ బాబు.ఇది కళ రోజు దినచర్య.ఆరేళ్లు నిండిన కళని బడికి పంపాలనుకున్నాడు దుర్గయ్యగారు.బార్నెల దగ్గర ఉన్న జడ్పీ స్కూల్లో చేర్పించాడు.అక్కడ ఐదో తరగతి వరకు, ఒక్క టీచర్ మాత్రమే.అలాగే పిల్లలు కూడా తక్కువే.ఆ చుట్టు పక్కనే ఉన్న మూడు పల్లెల కి ఇదొక్కటే చిన్న ప్రైమరీ స్కూలు.చాలామంది వాళ్ళ మొగపిల్లల్ని ఐదో క్లాస్ దాకా ఇక్కడే చదివించి, ఆ తర్వాత తమతో పాటు వ్యవసాయ పనులకు వెంటబెట్టుకొని వెళ్లడం చేస్తుంటారు.ఆడపిల్లల్ని అయితే బడికి పంపించాలన్న ఆలోచన ఉండేది కాదు.కాస్త చదవడం రాయడం వస్తే చాలు అని అనుకునేవారు.ఇంకొందరు తమ మగ పిల్లల్ని మద్ధిరాల జడ్పీ స్కూల్లో చదివించేవారు.ఆ తర్వాత పియుసి, ఆ తరువాత డిగ్రీ చేసి ఏదో చిన్నపాటి ఉద్యోగం వెతుక్కునేవారు.లేకపోతే ఊళ్లోనే వ్యవసాయం చేసుకునేవారు.అలా గుడ్లేరులో కూడా పదిమంది మగ

పిల్లలు సురేష్ బాబు ఈడు వాళ్లే.సురేష్ మావయ్యతో కలిసి జడ్పీ స్కూల్ కి మద్దిరాలవెళుతుండేవారు.స్కూలు లేని రోజుల్లో వీళ్ళందరూ కబడ్డీ ఆడుకునేవారు.గుడ్లేరు వాగువడ్డున సాయంత్రాలుగుడిమండపం దగ్గర చేరేవారు.వాళ్ళల్లో కోమటి సత్యం, కోటి రెడ్డి, కుమార్ నాయుడు, కొండా రెడ్డిమావయ్యకి మంచి దోస్తులు.

************************************

గుడ్లేరు కున్నవి మూడు బజారులే;కరణం గారి బజారు, శివాలయం వీధి, కోమటి బజారు కొంత దూరంలో గుడ్లేరుఒడ్డుకి ఎత్తుగా ఉన్న కొండ దిబ్బ మీద పోలేరమ్మ తల్లి గుడి.ఆ గుడి వెనకాతల చాకలి, మంగలి, కుమ్మరి మరియు కొందరు చిన్న కులాలవాళ్ళ గుడిసెలు ఉండేవి.వాళ్ళకి దక్షిణం వైపుగా ఉన్న జపాన్ ముళ్ల చెట్లు అడవిలాగా దట్టంగా పెరిగి, అంతా ఒక చిన్న అడవి లాగ ఉంటుంది. ఊరికి చల్లటి గాలి ఆ చెట్లనుండే అని అనుకుంటారు. చాలామంది కాలకృత్యాలకుఅటువైపుగా వెళుతూ ఉంటారు.పోలేరమ్మ తల్లి గుడి ఎత్తుగా ఉండి అడవి ని చూస్తున్నట్లుగా ఉంటుంది.అడవిలో కాకులు చాలా ఎక్కువ.వాటితో పాటే కొంగలు కూడా ఎక్కువే.సున్నపు బట్టీల వైపు,పొగాకు బార్నీలవైపు రోడ్లంతా

చిన్న చెట్లతో నిండి ఉంటాయి. పట్నం నుండి వచ్చే వాళ్ళకి గుడ్లేరు చేరాలంటే ఆ బట్టీల దగ్గర కానీ బార్నెల దగ్గర గాని బస్సు దిగాలి. ఆ పైన ఐదు ఆరు కిలోమీటర్లులోపలికి నడిచి వెళ్ళాలి ఆ డొంక రోడ్డంతా రెండు వైపులా పొలాలతో చూడటానికి పచ్చగా అందంగా కనిపిస్తుంది. చాలామంది రైతులు తమ ఆడబిడ్డలకి పట్నం సంబంధాలు తెచ్చి చేశారు.అందుకే ప్రతి దసరా, సంకురాత్రి పండగ రోజుల్లో ఆ డొంకలో ఎద్దుల బండిలుతిరుగుతూ ఉంటాయి. అప్పట్లో అవేవారికిసెడాన్ కార్ లాగా.పెద్ద రెడ్డి గారికి, కరణం దుర్గయ్య గారికి ఎద్దుల బండిలు ఉండేవి. ఊర్లో ఎవరికి ఏ అవసరం వచ్చినా వీళ్ళ ఎద్దుల బండిలే తీసుకునేవారు.వాటిని నడపడానికి ఒక జీతగాడు కరణందుర్గయ్యగారి దగ్గర, మరొకడుపెద్దరెడ్డిగారి దగ్గర ఉంటారు. పెళ్లయిన పబ్బమైనా ఈ బండిలే అందరికీ.కళ నిమాత్రం రోజు తాతయ్య ఎద్దుల బండిలో స్కూల్ కి పంపించేవాడు.“

“ఏమండీ కరణం గారు మీ మనవరాలని చదివించి కలెక్టర్ చేస్తారా ఏంటి?” అని అడిగితే,“కలెక్టర్ కావడానికేనా చదువుకునేది? ఏదో కాస్త అక్షరజ్ఞానం ఉంటుందిలే అని బడికి పంపుతున్నాను లేకపోతే దాన్ని ఎవరు పెళ్లి

చేసుకుంటారు”అనేవాడు ఆయన.

“దాందేముందండి కళమీ మనవరాలే, మీ కూతురి బిడ్డ, సంబంధం కలుపుకోవచ్చు కదా?” అనేవాడు పెద్ద రెడ్డి అప్పుడు.

“చూద్దాంలే పెద్ద రెడ్డి,” అంటూ తాతయ్య కచేరి లోంచి లేచి బయట రామాలయానికి వెళ్లి మధ్యాహ్నం నైవేద్యం అయిందో లేదో ఆచారి గారిని అడిగి తెలుసుకుని, కాస్తంత తులసి తీర్థం తీసుకొని ఇంటికి వెళ్లేవాడు.అప్పటికి సుభద్రమ్మ వాగు దగ్గర పని ముగించేసి ఇంట్లో వంట పని మొదలుపెట్టేది. సురేష్ మామయ్య బడికి వెళ్తుంటే మాత్రం ఆయన సంచిని తానే స్వయంగా మోసుకెళ్లి ఎద్దులబండిలోపెట్టేది. తాతయ్య మావయ్యనిబడి కాడ దింపేసి వచ్చేవాడు. సురేష్ బాబుపెద్దవాడు అయిన తర్వాత ఒక హీరో సైకిల్ కూడా కొనిచ్చి దగ్గరలో ఉన్న మద్దిరాల హైస్కూల్లోచదువుకు పంపించాడు.15 ఏళ్ల మామయ్య అప్పుడప్పుడు ప్రేమగా కళావతిని సైకిల్ ముందు కూర్చోబెట్టుకొని పల్లెలో ఉన్న రామాలయం, శివాలయం, గుడ్లేరు ఒడ్డునతిప్పుతుండేవాడు.వాటికే కళఎంతో సంబరపడిపోయేది. అలా తిరిగిన రోజున కళకనిపించేది ‘మావయ్య బంగారం’ అని.ఆయన్నిఅలా

చూస్తూ తాను పెద్దదైంది.

“కళను బడికి పంపడం ఎందుకు? నా దగ్గిర ఇంటి పనులన్నీ నేర్చుకుంటుంది, అది చాలదా?” అంటూ సుభద్రమ్మదుర్గయ్య గారి దగ్గర నసిగేది. “చూద్దాంలేవే! ఏడాదే కదా అయింది పంపడం మొదలెట్టి ,” అన్నాడాయన తాపీగా భోజనం చేస్తూ.

అలా బడికి వెళ్లడం మొదలై రెండేళ్లయింది. కళతొమ్మిదేళ్ల పిల్ల అయింది కాస్త చురుకుగా అన్ని అర్థం చేసుకోవడం, చదవడం, రాయడం, కూడికలు, తీసివేతలు చేయడం లాంటివి కొన్ని నేర్చుకుంది అప్పుడప్పుడు తాతయ్య తెచ్చేతెలుగు పత్రికలను కూడా పలుక్కుంటూచదవటానికి ప్రయత్నించేది.

అలా సాగుతున్న సమయంలో ఒకరోజు అమ్మమ్మ “ ఒసేయ్ కళఇవాళ బడి నుండి వచ్చేటప్పుడు చాకలి రత్తాలు మామయ్య బట్టలు తీసుకువెళ్లి చాలా రోజులైంది కానీ వెళ్ళి కనుక్కురా,”అన్నది.

“అలాగే అమ్మమ్మ ఇవాళ పన్నెండుదాకే స్కూలు.సుగుణక్క తోటి వచ్చేస్తాలే.వస్తూ వస్తూ అటువెళ్ళిఅడిగేసి వస్తాలే,” అని చెప్పి బడికి పోయింది.

12 గంటలకల్లా బడి వదిలిపెట్టేశారు.సగం దాకా పొలాలు

గట్టుమీద పెద్ద రెడ్డి కూతురు సుగుణ, కళ నడిచారు.ఊరు దాకా వచ్చాక, “సుగుణక్క! నేను చాకలి రత్తాలు దగ్గరికి పోయి మామయ్య బట్టలు అయ్యాయో లేదో అడిగి రావాలి. ఇక్కడ అడ్డదోవ గుండా వాగు వైపుకివెళ్లి అక్కడి నుండి రత్తాలుగుడిసకి వెళ్తాను,”అనిచెప్పింది కళ.

“ఇప్పుడు అటువైపు వెళ్లడం అవసరమా? ఇది మిట్ట మధ్యాహ్నం.ఈ వేళ్లప్పుడు ఎవరూ అటువైపు వెళ్ళరు. సాయంత్రం వెళ్ళు,” అన్నది.

“కాదక్కా ఇప్పుడే వెళ్లాలి.ఇంటి నుండి రత్తాలు వాళ్ళ గుడిసెలు దూరం.అక్కడిదాకా వెళ్లటానికి సాయంత్రం పొద్దు తక్కువ అని అమ్మమ్మ ఒప్పుకోదు.ఎంతసేపు, అరగంటలో ఇంటికి వెళ్ళిపోతాను.నాకు ఈ దారంతా తెలుసుగా,” అంటూ చకచకా డొంక దారిలోకి వెళ్ళింది కళా ఒంటరిగా.

ఆ దారెంట జపాన్త్ తుమ్మ ముళ్లచెట్లు ఉన్నాయి.కొంత దూరం నడిచాక ఒక ముల్లుకళ వేసుకున్న రబ్బర్ చెప్పుల్లోకి దిగబడి అరికాల్లోగుచ్చుకుంది.బటబట రక్తం కారింది.కాలిలోని ముల్లుని తీసేసి చెప్పులోఇరుక్కుని విరిగిపోయిన ముల్లును కూడా లాగి పడేసి కుంటుకుంటూ దగ్గరగా ఉన్న వేపచెట్టు మొదట్లోకి వెళ్ళింది.అక్కడ అంతా పసుపు కుంకుమ చల్లినట్లు పడున్నాయి. అమాయకంగా

పసుపుతో కలిసిన మట్టిని తీసి అరికాలికి అద్ధి,‘అమ్మయ్య రక్తం ఆగిపోయింది,’ అనుకుంటూ నొప్పిగా ఉన్నా కూడా కుంటుకుంటూ ఏటి ఒడ్డుకు చేరుకుంది. కొద్ది దూరంలో కొందరు గుమ్మిగూడి ఉన్నారు. ‘ఏమైందబ్బా!’ అనుకుంటూ అటువైపుగా వెళ్ళింది. దగ్గరికి పోకుండానే వెనకాతల నుండి ఎవరో పిలిచారు,“కరణం గారి మనవరాలు వస్తున్నది దగ్గరకు రానీయకండి,” అని అప్పటికే ఆలస్యం అయిపోయింది.ఆ గుంపుని చేరుకుందికళ.గణాచారి నిలబడి ఉన్నాడు మధ్యలో. ఆయన ఒక చేతిలో వేపమండలు ఉన్నాయి. కుడి చేతిలో పెద్ద చింత బెత్తం ఉంది.

అక్కడే నేల మీదజుట్టంతా చెదిరిపోయిమొహం కప్పేసి ఉంది ఒక అమ్మాయికి. గణాచారి వైపుగాఉన్నదా పిల్లెవరో కూర్చొని, ఊగిపోతున్నది. ఆమెని చింత బెత్తంతోను వేపమండ లతోను కొడుతున్నాడు గణాచారి. ఏదేదో అంటున్నాడు కళకి ముందు అర్థం కాల, కళ్ళు పెద్దవి చేసి చూసింది.

భయమేసిందిగణాచారిని చూడగానే.కళ్ళ చుట్టూ కాటుక,నుదుటి మీద తెల్లటి విభూతి మద్దెలో అర్ధ రూపాయి కంటే పెద్దగా ఉండే ఎర్రటి కుంకుమ బొట్టు,

దట్టంగా నల్లగా ఉన్న కనుబొమ్మలు, చింపిరి జుట్టు, పెద్దపెద్ద మీసాలు బానపొట్ట తో భయం కొలుపుతూ,మనిషి కాస్త పొడవుగా లావుగా ఉండి శివాలయం మండపం మీద ఉన్న వీరభద్రుడి బొమ్మలాగా ఉన్నాడు భీకరంగా.పెద్ద పెద్దగా ఊపిరి వదులుతూ ఆయాస పడుతున్నాడు.అయినా కూడా అలా కింద పడి ఉన్న పిల్లని కొట్టడం మాత్రం ఆపలేదు,మధ్య మధ్య లోవీరంగం వేస్తున్నాడు.

ఆ వెనకాతల అరిచిన మనిషి గబగబా గుంపు దగ్గరకు వచ్చి కళ ని జబ్బ పుచ్చుకొని గుంపులోంచి లాగేసాడు.“ఏటి తల్లి, ఈ ఏలప్పుడు ఇటుగాల వచ్చినావు. ఏటి పని నీకు?” అంట కోపంగా కళ ను బరబరా అక్కడ నుండి లాక్కుపోతున్నాడు.

వాడివేగానికి తట్టుకోలేక కిందపడిపోయింది, వాడు ఆగి కళను ఎత్తుకొని పరుగులాంటి నడకతో గుడ్లేరు వాగుఓడ్డెక్కేసాడు. నేరుగా కరణం గారి ఇంటి దగ్గరే వాడి పరుగు ఆగింది. ఇంటికి చేరగానే ఆదుర్దాగా “కరణం అమ్మగారు” అంటూ పిలిచాడు.

“ఏరా ఈరిగ!ఈ ఏలప్పుడు వచ్చావు. బండి తీసుకొని పంచాయతీ ఆఫీస్ కి పోలేదా,” అంటూ బయట వసారాలకు వచ్చింది అమ్మమ్మ.

“దండాలమ్మ ముందు మన కళ్ళమ్మ ను లోపలికి తీసుకెళ్లి స్నానం చేపించండి, అమ్మగారు!ఇసయంతర్వాత చెప్తాను,” అన్నాడుకాస్త ఆదుర్దాగా.వాడి వాలకం చూస్తే అమ్మమ్మ క్కూడా ఏదో భయం కలిగింది.

వెంటనే కళనితడికలతో కట్టిన స్థానం గదిలోకి బరబరా లాక్కెళ్ళి తొట్టిలో ఉన్న నీళ్లను నాలుగు చెమ్ములు కుమ్మరించి, ఆమె పాత చీర ఒకటి చుట్టి కళని లోపలికి పంపించింది.

“బట్టలు మార్చుకో, లంగా జాకెట్ వేసుకొని రా. ఏమిటి ఆ గాయం అరికాల్లో?” అంటూ అడిగింది. ఏం జరుగుతుందో అర్థం కాక, ఈరిగాడుఎందుకు అలా అరిచాడో ? తనని ఏమీమాట్లాడనీకుండా ఇలాఎత్తుకొని లగెత్తుకొచ్చేసాడు. ఎందుకో? ఏమో? ఏమీ పాలు పోక అయోమయంగా, “అదా అమ్మమ్మ డొంక నుండి వస్తుంటే తుమ్మము ముల్లుగుచ్చుకుంది,” అన్నది.

“చెప్పులు లేవా?అయినా నడిచేటప్పుడు నీ ధ్యాసంతా ఆ చింతకాయల మీదనే మరి, కింద చూసుకుని నడవద్దు. ఎంత గాయం అయిందో. బట్టలు వేసుకొని రా, కాలికి పసుపు పొడి వేసి కట్టు కడతాను,” అన్నది. నేను ఆ పని ముందే చేశాను అమ్మమ్మ అన్నది. కానీ అమ్మమ్మ అప్పటికే

బయటకు వెళ్లిపోవడంతో ఆమె మాట వినలేదు.

“ఏమైందిరా ఈరిగా?” అంతేఆదుర్తాగాఅడిగింది.

“మరే అమ్మగారు, ఈరోజు మన మంగలి పెంటయ్య కూతురికి గణాచారిచేత బడిత పూజ చేయిస్తున్నారు. ఆ పిల్లకేదో గాలి సోకిందని , వారింట నూకలు ముట్టనని సోది సెప్పి సోదెమ్మ నూకలు కూడా తీసుకోకుండా వెళ్ళిపోయింది.దానికి ఇరుగుడు బడితేపూజెనంట.అందుకే ఇయాల పెంటయ్య డొంక దారిలో ఉన్న వేప చెట్టు దగ్గరికి గణాచారినిపిలిపించి ఆ పిల్ల చేత పూజ చేయించాడు.ఆ పిల్లను తాళ్లు పెట్టి ఆ వేప చెట్టుకే కట్టేశారు. గణాచారి ఏవో మంత్రాలు వల్లించాడు అమ్మగారు. అప్పుడు ఆ పిల్ల పిచ్చిపిచ్చిగా బొంగురు గొంతు తో అరవటం, గురకలు పెట్టడం చేసింది. వెర్రి చూపులు చూస్తూ కట్టిన తాళ్ళని పీక్కోవటం మొదలు పెట్టింది. ఎవరు ఆ పిల్లని పట్టుకోలేకపోయారు. తాళ్లు తెంపుకొని పరిగెత్తింది.అతి కట్టం మీద ఆ పిల్లను నలుగురు ఆడవాళ్లు పట్టుకున్నారు. మగాళ్ళేమో ముందు వెనకాతల నుంచుని ఆ పిల్లని లాక్కుంటూ ఏటి ఒడ్డుకు తీసుకొచ్చారు. అక్కడ గణాచారిబడితేపూజ చేయడం మొదలుపెట్టాడు.నాకావిషయం తెలిసి అటువైపుగా

వస్తుంటే,కళమ్మవాగుఒడ్డు వైపు గా వెళ్లతా కనబడింది. నేను వెనకాతలే పోయిన. అక్కడగణాచారిని ,ఆ పిల్లవాలకం చూస్తేఇంత పెద్దొడినైనా నాకే భయమేసింది. మనకళమ్మ పసిపిల్ల భయపడినాదో ఏమో!తెలవదు? కానీ బరబరాకళ్ళమ్మని ఎత్తుకొని లగేత్తిన ఆడ నుంచి,”అంటూ చెప్పాడుఈరి గాడు.

అదంతా విన్నాక అమ్మమ్మకి కాస్త ఆందోళనగా అనిపించింది.“సరేలేరా సద్దన్నంఉన్నది తిని పో. తెస్తాను ఉండు,” అంటూ ఇత్తడి తప్పా లాలో ఉన్న అన్నం సత్తుపల్ళ్లెంలో పెట్టి కాస్తంత పండుమిరపకాయల పచ్చడి వేసి తెచ్చి వాడి ముందు ఉంచింది. వాడుఆబగా తింటుంటే, అక్కడికి వచ్చి,”చూడమ్మొమ్మ! ఈరిగా నన్నేమీ మాట్లాడనీయలేదు. చెప్పనీయలేదు. నన్ను ఎత్తుకుని ఒకటే పరుగు. నేను రత్తాలు గుడిసికి కూడా పోలా. మావయ్య బట్టలు అడగటానికి,” అంటూవాడివైపు నిష్టూరంగా చూస్తూ మాట్లాడింది. “ఏం పర్లేదు లేవే వీడెళ్ళితె స్తాడులే.నువ్వు లోపలికి పదా నీకు అన్నం పెడతాను,” అంటూ కళ ని తీసుకొని ఆమె లోపలికి వెళ్ళిపోయింది.అమ్మమ్మకి మనసంతా కలి చినట్లు అయింది.

(ముందేం జరుగుతుంది?)

Written by Padma NeelamRaju

రచయిత గురించి:

పద్మావతి నీలంరాజు చండీఘర్ లో ఇంగ్లీష్ అధ్యాపకురాలిగా 35 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న రిటైర్డ్ ఉపాధ్యాయురాలు. ఆమె నాగార్జున విశ్వవిద్యాలయం ఆంధ్ర ప్రదేశ్ నుండి M A (Litt),
POST GRADUATE DIPLOMA IN TEACHING ENGLISH ,CIEFL, హైదరాబాద్‌ లో తన ఉన్నత విద్యను పూర్తి చేసింది. స్త్రీ వాద సాహిత్యంపై దృష్టి సారించి Indian writing in English లో Panjabi University, patiala , Panjab, నుండి M phil డిగ్రీ పొందింది. తెలుగు సాహిత్యం పైన మక్కువ ఇంగ్లీషు సాహిత్యంపై ఆసక్తితో ఆమె తన అనుభవాలను తన బ్లాగ్ లోను
( http://aladyatherdesk.blogspot.com/2016/02/deep-down.html?m=1,)
కొన్ని సాహితీ పత్రికల ద్వారా పంచుకుంటున్నారు. ఆమె రచనలు తరచుగా జీవితం మరియు సమాజం పట్ల ఆమెకున్న అనుభవపూర్వక దృక్పథాన్ని ప్రతిబింబిస్తాయి. ఆమె అధ్యాపకురాలిగా గ్రామీణ భారత్ పాఠశాలల్లో E-vidyalok- e-taragati (NGO) లో స్వచ్ఛంద సేవలందిస్తున్నారు. రచన వ్యాసంగం పైన మక్కువ. పుస్తకాలు చదవడం, విశ్లేషించడం (Analysis / Review) ఆంగ్లం నుండి తెలుగు లోకి అనువాదం(Translation) చేయడం అభిరుచులు . PARI సంస్థ (NGO) లో కూడా ఆమె గ్రామీణ భారత జీవన శైలిని ప్రతిబింబించే వ్యాసాలను కొన్నిటిని తెలుగులోకి అనువదించారు (padmavathi neelamraju PARI). HINDUSTAN TIMES, తరుణీ ,మయూఖ, నెచ్చెలి వంటి పత్రికలలో కొన్ని కధలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి. “Poetry is the sponteneous overflow of power feelings; recollected in tranquility” అన్న ఆంగ్ల కవి వర్డ్స్ వర్త్ తనకు ప్రేరణ అని చెబుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Did Women Have a Renaissance?