వొంటిల్లు – వొడవని ముచ్చట (కిచెన్ కాలమ్)

వంటింటి కర కరలు

కర్ కర్… ఏమాచప్పుడు? ఎక్కడినుండి వచ్చుచున్నది?

కరకరలాడు పదార్థములు తినునప్పుడు చప్పుడు లేకుండా ఎవరైనా తినగలరా?

ఒక పాత కథ విషయం చెప్తా వినండి!

అప్పటి కాలంలో ఆడపిల్లలను ఒకలాగా కోడల్ని ఒకలాగా చూసేవాళ్ళు. ఇది అందరికీ తెలిసిన విషయమే సుమండి!

అందుకనే ఇంట్లో ఆడపిల్లకు అటుకుల రుచి తెలుస్తుందట. కోడలికి నువ్వుల రుచి తెలుస్తుంది. ఎలాగో చెప్పనా!

అటుకులు తింటుంటే కర కరమని చప్పుడు అందరికీ వినిపిస్తుంది. ఆడపిల్ల కాబట్టి ఎవరికీ భయపడకుండా తింటుంది.

కోడలు తింటే అందరూ ఆక్షేపిస్తారు కదా! అందుకని మెల్లిగా సామాన్ల గదిలోకి వెళ్ళినప్పుడు లేదా పెరట్లోకి వెళ్ళినప్పుడు ఒక చెంచాడు నువ్వులు నోట్లో వేసుకొని మెల్లగా నవి లేదట. అందుకని నువ్వుల రుచి కోడలికి తెలుసు. అలాగన్న మాట. సరే విషయానికి వస్తాను.

ఈరోజు నేను కరకరలాడిస్తాను.

ఆలు కరకరలు
కరకరలాడించినవారు లక్ష్మీ మదన్
_____

కావలసిన పదార్థాలు పెద్దగా ఏమీ లేవు. మీరు ఎన్ని తినాలనుకుంటే అన్ని ఆలుగడ్డలు తీసుకోండి. చక్కగా తోలు వలవండి. అప్పుడప్పుడు కోపం వస్తే “తోలు తీస్తా” అని తిడతాం కదా! ఎవరి తోలో ఎందుకు తీస్తారు! ఆలుగడ్డల తోలు వలవండి.కనీసం పనికి వస్తుంది.

తర్వాత వీటిని చక్కగా తురమండి. మనమంతా తురుములము తోపులమే కదా!

ఇప్పుడు ఈ తురిమిన వాటిని కడిగేసి నీళ్లు పిండేసి, ఒక బట్ట మీద ఆరేసేయండి. కరెంట్ బిల్ పర్వాలేదు అనుకుంటే ఫ్యాన్ వేయండి.

ఒక్క అరగంట చాలు. ఈ లోపల మీకు సీరియల్ చూసే అలవాటు ఉంటే చూసేసి రండి.

       

చూశారా? సీరియల్ కన్నీళ్ళతో కలత పెట్టించి, అత్త కోడళ్ల గొడవతో మంట పెట్టించి, కొబ్బరి నూనె మెట్ల మీద పోసి అత్తల కాళ్ళు కోడళ్ల కాళ్ళు విరగ గొట్టించి ఆ తర్వాత కెమెరాను జూమ్ జూమ్ అని తిప్పి, టెన్షన్ లో ఆపేశారా సీరియల్! నాకైతే అలవాటు లేదండి.

సరే, ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టి, నూనె పోసి నూనె వేడెక్కిన తర్వాత ఈ తురిమిన ఆలును వేసి చక్కగా వేయించుకోండి. ఎండాకాలంలో ఆకులు రాలి కింద గల గల చప్పుడు వస్తాయి కదా! అలా రావాలి చప్పుడు.

ఇంకేముంది వాటిని తీసి ఒక పెద్ద గిన్నెలో వేసి, ఉప్పు ,కారం మీకు తగినంత చల్లేసి మీరు తిని, మీ పిల్లలకు పెట్టి, వచ్చిన వాళ్లకు పెడుతూ ఎలా చేశారో వర్ణించి చెప్తూ ఓ కితాబు కొట్టేయండి.

అటుకుల చూడవాలో కూడా కలుపుకోవచ్చు. పిల్లలకి బాక్స్లో స్నాక్స్ లాగా పెట్టవచ్చు.

ఏడుపుగొట్టు సీరియల్స్ వస్తున్నప్పుడు ప్లేట్లో పెట్టుకుని, దుఃఖం వచ్చినప్పుడు కొన్ని నోట్లో కొట్టుకోవచ్చు..

మీ ఇష్టం మీకు ఎలా నచ్చితే అలా చేసేయండి..

ఇంతకీ ఇవి ఎలా ఉన్నాయో కరకరమన్నాయో లేదో ఓ కామెంట్ ఇచ్చుకోండి. ఇంత కష్టపడి చేశాను కదా! కామెంట్స్ లేవా?

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రమక్కతో ముచ్చట్లు -30

బాలల హక్కుల అవగాహన