“శుభ ముహూర్తం”-13వ భాగం

ధారావాహిక నవల

జరిగిన కథ: యుద్ధాన్ని గెలిచి, రాజ్యానికొచ్చిన మహారాజుకు రాజమందిరంలో ఆహ్వానం పలుకుతుంది, అంతవరకు మహారాజును దూరం పెట్టిన ప్రమీలాదేవి. మహారాణితో గడపడం కోసం, కొన్నాళ్లు రాజ్య వ్యవహారాలను కూడా పక్కన పెడతాడు విక్రమసింహ. తర్వాత జరిపిన విజయోత్సవాల్లో, సన్మానం చెయ్యబోయే వీరులను చూసి ఆశ్చర్యపోతాడు అనంతుడు. వారు మరెవరో కాదు, మారువేషాల్లో యుద్ధరంగానికి వచ్చిన ప్రమీలాదేవి, ఆమె ఇష్టసఖి. రాజమందిరంలో మహారాణిని చూసి, చిత్రపటంలో ఉన్న యువతిగా గుర్తించి, తనకు తెలియకుండా మహారాజు ఆమెనెప్పుడు, ఎక్కడ, ఎలా కలుసుకున్నారో వివరాలను అడిగి, మహారాణి విదర్భకు వెళ్ళినప్పుడు మహారాజు ఎందుకంత వ్యాకులత చెందారో, యుద్ధరంగంలో ఆమెనెలా గుర్తించారో, తన ప్రాణదాత ఎవరో వివరాలు చెప్పమని కోరుతాడు అనంతుడు. ఆ వివరాలేమిటో మనం కూడా తెలుసుకుందాం పదండి…

అలా ఎంతసేపున్నారో ఇద్దరూ? ఇంతలో, దూరం నుండి అరుపులు. అవి కాస్తా దగ్గరై “రాకుమారీ! మమ్మల్ని వదిలి, అడవి లోపలకు చొచ్చుకు రావడం క్షేమమా! మేమందరం ఎంత భయపడ్డామో తెలుసా! మీ శౌర్యం తెలిసిందే! అయినా, ఇంత పెద్ద ఎలుగును ఎలా కొట్టారు రాకుమారీ! మీకేమీ కాలేదు కదా”, అని కాకులిత నిండిన స్వరాలతో, శిరస్త్రాణాలు ధరించిన చెలికత్తెలు వచ్చినంతవరకూ ఆమె తన చేతులలో శిల్పమే అయిపోయింది. ఆ మాటల సవ్వడికి చలనమొచ్చిన బొమ్మలా, తనను మరొక్కసారి కళ్ళనిండా నింపుకొని, ఎలా వచ్చిందో అలానే మాయమైందామె. ప్రాణమున్న బొమ్మే అయిపోయాడు తాను. అలా ఎంతసేపున్నాడో! ఎరుకలేదు. చీకట్లు ముసురుకుంటుంటే, వేట కెళ్ళిన అడవి జంతువులు స్థావరాలను చేరుకునే శబ్దాలతో, ఈ లోకంలోకి వచ్చి అక్కడ నుండి కదిలాడు తాను.
రాకుమారీ! అన్న వారి సంబోధన, ఆమె శౌర్యం గురించి వారాడిన మాటలు, ఆమె రూప లావణ్యాలు… చెప్పకనే చెప్తున్నాయి, ఆమె రాకుమారి ప్రమీలాదేవే అన్న నిజాన్ని. ఎవరిని చూడడానికి, మారువేషంలో ఈ దేశానికి వచ్చామో… ఆ స్త్రీ మూర్తే, తన చేతులలో ఒక శిల్పంలా… నమ్మశక్యం కావడం లేదు. బసకు వచ్చినా ఆమె విశాల నయనాలే వెంటాడుతున్నాయి. తన మనసు లోతుల్లోకి అవి తొంగి చూస్తున్నట్లు అనిపిస్తోంది. కళ్ళు మూసినా, తెరిచినా ఆమె రూపమే! అలా ఎంతసేపున్నాడో?
*
ఆ విషయం గుర్తుకు వచ్చి మనసంతా ప్రఫుల్లమవ్వగా, “విదర్భలో నీవు అంతఃపుర ప్రవేశానికి మార్గాన్ని వెదకడానికి వెళ్ళినప్పుడు, నీకు తెలియకుండా మేము పల్లెవాని వేషంలో వెళ్లి మహారాణిని అప్పుడే కలిసాం. మా చూపులు కలుసుకున్న శుభముహూర్తంలోనే మేము ఒకరికొకరమన్న సత్యాన్ని గ్రహించుకున్నాం” అని చెప్పాడు.
“ప్రభూ ఇంకొక సందేహం. మహారాణి వారు విదర్భదేశానికి వెళ్ళాక, మీరెందుకంత వ్యాకులత చెందారు?” చేతులు జోడించి అడిగాడు అనంతుడు.
“ఓ! అదా!” అంటూ ఏమి గుర్తుకొచ్చిందో, తనలో తానే చిరునవ్వు నవ్వుకుని, చెప్పసాగాడు.
“మేము మొదటిసారి కలుసుకున్న ఆ క్షణమే ఒకరికొకరం అనుకున్నా, రాకుమారి కలుసుకున్నది నన్నే అని ఆమెకు తెలియదు. అందుకే, పల్లెవాని వేషంలో ఉన్న యువకుడిని, మహారాణి వారు తమ మనసులో నిలుపుకున్నందున, పల్లెవాని వేషంలో ఉన్నది మేమే అని తెలియక, వివాహ సమయంలో కూడా వారు మమ్మల్ని వీక్షించలేదు.
వివాహానంతరం కూడా, వారెప్పుడూ, మా మోమును వీక్షించనందున, మేమే వారి మనసులో ఉన్న వారమని తెలుసుకోలేక పోయారు. జైత్రయాత్రకు ముందు, మన గురువర్యులను కలుసుకునే తొందరలో, మేము శిరస్త్రాణం తీసినప్పుడు, మహారాణి తొలిసారి మా మోముని వీక్షించి నిజమును తెలుసుకున్నారు. మమ్ము కలుసుకునే వీలులేక, చిత్రపటం ద్వారా వారి మనసులో ఉన్నది మేమేనని, మాకు సూచించారు.
అందుకనే చిత్రపటాన్ని చూసిన మేము, మహారాణి మనసులో ఉన్న మహాభాగులం మేమే అని తెలియక, ఇన్నినాళ్ళు మమ్ములను దూరముగా ఉంచి, తెలుసుకున్నాక మమ్మల్ని కలుసుకోలేక పోయినందుకు, ఆమె ఎంత బాధపడి ఉంటారోనని మేమంతగా వ్యాకులత చెందాం. అందుకే మహారాణి వారిని కలుసుకోవాలని ఆత్రుత పడ్డాం. కాని, మీ స్వాంతన వచనాలతో మమ్ములను మేము నిగ్రహించుకున్నాం” చిరునవ్వుతో చెప్పాడు విక్రమసింహ.
“ప్రభూ! మీరేమీ అనుకోనంటే ఇంకొక సందేహం” మరల చేతులు జోడించాడు అనంతుడు.
“ఏమిటి అనంతా! ఈరోజు సందేహాల పుట్టవై పోయావు. అలాగే కానీ!” చిరునవ్వుతో అభయాన్నిచ్చాడు మహారాజు.
యుద్ధభూమిలో ఎంత ప్రయత్నించినా ఆ వీరులెవరో తాను తెలుసుకోలేకపోయాడు. ఎప్పుడు చూసినా వాళ్లు సంపూర్ణ కవచధారులయ్యే ఉన్నారు. మరి మహారాజు వారినెలా గుర్తించారు? సందేహం వదలలేదు అనంతునికి.
“జైత్రయాత్రలో ఆ వీరులే మహారాణి వారని… మీరెలా…?” ప్రశ్నను మధ్యలోనే వదిలేశాడు.
ఆ వీరుడే మహారాణి అని తనకెలా తెలిసిందా? యుద్ధరంగంలో జరిగిన సంగతి గుర్తుకొచ్చింది. కదనరంగంలో, తాత్కాలికంగా కట్టిన ఆ మట్టికోట మీద తాను పచార్లు చేస్తూ ఉంటే, “మేము మహారాజులను చూడాలి… మహారాజులకు మా విన్నపాన్ని తెలపాలి” అంటూ గాలిలో తేలుతూ మాటలు. తన భృకుటి ముడిపడింది. యుద్ధ సమయంలో తనను కలవాలన్న ధైర్యమెవరికి ఉంటుంది? వారిని తానే విచారించాలన్న ఉద్దేశంతో తక్షణం లోపలికి ప్రవేశపెట్టండని ఆజ్ఞ ఇచ్చాడు.
లోపలికి వచ్చిన ఆ యువకుల్లో ఒకరు చూపించిన దాన్ని చూసి తాను ఆశ్చర్యానికి, ఒకింత ఆందోళనకు లోనయ్యాడు. అది మహారాణి వారికి పాణిగ్రహణం సమయంలో, ఆమె ఎడమ ఉంగరం వేలికి తాను తొడిగిన అంగుళీయకం.
ఇది వీరి చేతికెలా వచ్చింది. మహారాణి వారు ఎక్కడున్నారు? ఆమెకేమైంది? అంతే తాను కరవాలాన్ని తీసి ఆ యువకుని మెడమీద పెట్టాడు, “మహారాణి వారు ఎక్కడంటూ?”.
ఆ యువకుడే మాత్రం చలించకుండా, “ప్రభూ! మమ్ము క్షమించండి. మీ అనుమతి తీసుకోకుండా ఇక్కడికి వచ్చినందుకు, మాకే శిక్ష విధించినా మేము స్వీకరిస్తాం” అని తన పాదాలనంటి ప్రాధేయపడ్డాడు. ఏ వేషంలో ఉన్నా ఆమె స్వరాన్ని తాను పోల్చుకోలేడా?
ఆమె మహారాణి, తన ప్రేమ సామ్రాజ్ఞి, కలలపంట, ఆశాదీపం… ప్రత్యక్షంగా తన ముందు. తన ఆనందానికి అవధులు లేవు. ఎప్పుడెప్పుడు ఆమెను కలుసుకుంటానా అని ప్రతి నిముషం ఎదురు చూస్తుంటే, ఆమే తనెదురుగా వచ్చి నిల్చుంటే, ఆమెకే శిక్ష వెయ్యాలి? అందరినీ బయటకు పంపించి, తన కౌగిలిలో బందీని చేశాడు. కదనరంగం ప్రమాదకరం. వెళ్ళమన్నా వినలేదు. తనకూడా ఉంటానంది. అనుజ్ఞ ఇవ్వక తప్పలేదు.
అవన్నీ చెప్పకుండా, “నీకూ వివాహమయ్యాక, నీ అర్థభాగాన్ని ఎలా గుర్తించాలో అనుభవ పూర్వకంగా తెలుస్తుందిలే” అని హాస్యమాడాడు.
“కానీ ఒకటి నిజం. మమ్ములను విడిచి ఉండలేక మహారాణి వారు, మారువేషంలో యుద్ధభూమికొస్తే, వారిని చూసిన ఆ క్షణం, స్వర్గం దిగి వచ్చినట్టు అనిపించింది. మేము యుద్ధభూమిలో ఉన్నామనే విషయాన్ని మరిచిపోయాం. కొన్ని నెలల తర్వాత ఒకరినొకరం చూసుకోవడంతో, ఒకరినొకరం విడిచి ఉండలేకపోయాం. నీకు నిజం చెప్పకుండా నిన్ను ఆందోళనకు గురి చేసాం. ఆపైన జరిగిందంతా నీకు తెలుసు” చిక్కుముడి విప్పాడు మహారాజు.
“ఇంకొక చిన్న అనుమానం. ఇక్కడ లేని ఆ మిగిలిన వీరులెవరు?”
“వారా! ఒకరు రాకుమారికి స్వయానా మేనమామ కొమరిత, మంగళా దేవి. మరొకరు వారి ఇష్ట సఖి. మిగిలిన వారు, ఆమె చెలికత్తెలు.
“యుద్ధరంగానికి రావడానికి మహారాణి వారికి, అనుమతి…” ఎవరిచ్చారనే ప్రశ్న వెయ్యకుండా, అసంపూర్తిగా వదిలేశాడు అనంతుడు.
“ఎవరి అనుమతీ తీసుకోలేదు. ఇంట్లో తెలియకుండా, వనవిహారం పేరుతో వారి రాజ్యం నుండి బయలుదేరి, చెలికత్తెలను, రక్షణ భటులను, యుద్ధ రంగానికి దూరంగా ఉన్న గ్రామాలలో విడిది చేయించి, ప్రియంవదను మాత్రమే వెంట తీసుకువచ్చారు. నీ శిష్యురాలి పాటవశక్తి నీకు తెలిసినదే! దానికి తోడు, ఎప్పుడు యుద్ధం ముగుస్తుందా! ఆమెను కలుస్తానా! అని ఎదురుచూస్తున్న నా మనసు, ఆమెను చూడగానే ఆనంద డోలికలలో తేలిపోయింది. ఆ రోజే, విజయలక్ష్మి మా ముంగిటకు వచ్చిందనిపించింది.”
“మరి మంగళాదేవి?”
“ప్రశ్నల మీద ఈ ప్రశ్నలేమిటి అనంతా?” అని నవ్వేసి, “వారు కూడా యుద్ధంలో పాల్గొనాలనే ప్రీతితో, ప్రమీలా దేవిని కలుసుకోవడానికి వెళ్తున్నామనే నెపంతో ఇంటి నుండి బయలుదేరారు. వారు కదనరంగంలో ఉన్నారనే విషయం తల్లిదండ్రులకు తెలియకుండా ఉండడానికి, యుద్ధం పూర్తికాకముందే వారు వారి దేశం మరలిపోయారు. రాకుమార్తెతో పాటు వారు కూడా, చిన్నప్పుడు యుద్ధవిద్యల శిక్షణ తీసుకున్నారు. వారు కూడా కుతూహలంతో కదనరంగానికి వచ్చి మనకు విజయం రావడంలో భాగమయ్యారు.
తల్లిదండ్రులకు చెప్పకుండా వచ్చినందున, రాకుమారికూడా యుద్ధం పూర్తి కాకుండానే విదర్భకు పయనమై, అక్కడ నుండి మగధ చేరుకున్నారు. అదీ జరిగిన విషయం. ఇంకా అనుమానాలేమైనా ఉన్నాయా?” అనడిగిన మహారాజుకు,
“ఆ పది మంది వీరుల్లో నా ప్రాణదాత ఎవరు? వారికి కృతజ్ఞతాభివందనములు తెలుపుకొనే అవకాశాన్ని నాకు కల్పించగలరా మహారాజా?” వేడుకోలుతో అడిగాడు అనంతుడు.
“ఆమె మంగళాదేవి. నీ గురించి, నీ ధనుర్విద్యా నైపుణ్యం గురించి, చాలా విని ఉన్నారట. కదనరంగంలో నీ పక్కనే, ఉండి యుద్ధం చెయ్యడం వారి పూర్వజన్మ సుకృతమని, మహారాణి వారితో అన్నారట. నిన్ను కలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉన్నారట” చిరునవ్వుతో చెప్పాడు విక్రమసింహ.
ఆ మాటలు వినగానే, “ప్రభూ మీరు క్షేమమేనా?” ఎంతో అక్కరతో అడిగిన ఆ యువకుడు… నూనూగు మీసాలు కూడా రాని యువకుడనుకున్నాడు, గాని ఆమె యువతి అని తనకేమి తెలుసు. తనని కలుసుకోవడానికి ఆమెకు కుతూహలమెందుకో! ఏదేమైనా, ఆమెకు కృతజ్ఞతలు తెలుపుకోవడం తన బాధ్యత. ఆలోచనల్లో మునిగిపోయిన అనంతుని చూసి “జరిగిన విషయాలేవీ నీతో చెప్పనందుకు, ఒక స్నేహితునిగా నీవు నన్ను మనస్ఫూర్తిగా మన్నించాలి” వేడుకున్నాడు మహారాజు.
బదులుగా తన అంగవస్త్రంలో నుండి ఒక వస్తువును తీసి మహారాజు ముందుంచాడు అనంతుడు.
అది చూసి, “ఇది నీకు ఎక్కడ దొరికిందంటూ?” అపరిమితమైన ఆనందంతో పాటు, విస్మయాన్ని పొందాడు మహారాజు.
“క్షమించాలి. ఇది మా మహారాజుల వారి అంతరంగిక విషయం. దానిని మేము బయట పెట్టలేము” వినయంగా బదులిచ్చాడు అనంతుడు.
తమ తొలిరాత్రి గుర్తుకొచ్చింది. ఎన్నో ఆశలతో, రాకుమారి దరిని చేరుకున్న తమకు, ఆమె మనసులో తాము లేమన్న విషయం భంగపాటుకు గురి చేస్తే, మనసు డోలాయమానంలో పడింది. రాజ్యాన్ని జయించినట్టు, అన్యాక్రాంతమైన ఆమె మనసును తాము జయించగలమా! ఆమె మనసును తాము జయిస్తే, ఆమె ప్రేమ అబద్ధమౌతుంది. రాక్షస వివాహం చేసుకోవచ్చేమో కాని, రాక్షస సంసారం కూడదు కదా! అలా చేస్తే, తన మనసుకు తాను సమాధానం చెప్పుకోగలడా?
ఇటువంటి ఆలోచనలతో సతమతమౌతూ, ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఉండడమే ప్రస్తుతం శ్రేయస్కరమని తలచి, తన మందిరానికి వెళ్లిపోతూ ఉంటే, చంద్రకాంతిలో మెరిసిపోతున్న అంగుళీయకాన్ని చూసి, దీనిని వేలికి పెట్టుకునే అదృష్టాన్ని కోల్పోయాడు తాను. ఆమె మనసులో మేము లేము. యిక ఈ అంగుళీయకంతో మాకు పనిలేదని తాను, అంగుళీయకాన్ని వనంలో విసిరి వేసిన విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్నాడు. అది అనంతుని దగ్గర ఉందంటే దాని అర్థం, అనంతుడికి ఈ విషయం, మొదటిరోజు నుండీ తెలుసన్నమాట. అందుకేనా! ఒక్కొక్కసారి రాకుమారి విషయంలో, కాస్త కఠినంగా ఉండేవాడు. రాకుమారికి యుద్ధ విద్యలు నేర్పించాలన్నప్పుడు, అంతగా ఆందోళన చెందాడు. తనను నిలవరించాలని ప్రయత్నించాడు.
పాపం అనంతుడు! స్నేహితుడిని దగ్గరికి రానీయని స్త్రీకి, గౌరవ మర్యాదలిస్తూ గురువుగా విద్యలను నేర్పించడం, నిజంగా సంకటమే! తనకోసం, తన స్నేహం కోసం అవన్నీ భరించాడు. కాని, ఒక్కరోజు కూడా బయటపడలేదు. తనకు అనుమానం కూడా రాకుండా ఎంత జాగ్రత్తగా నడుచుకున్నాడో! అటువంటి అనంతుని నుండి తాను నిజాలను దాయటం, తన తప్పిదమే! ఒక్కోసారి తన మనసులోని వేదనను అనంతునితో పంచుకోవాలనిపించేది. కాని, తాము అన్యోన్యంగా ఉన్నామనుకుంటున్న స్నేహితుడికి, నిజం చెప్పి బాధ పెట్టడం ఎందుకనిపించేది. ఆ నిజం, అనంతుడికి మొదటి రోజే తెలిసిందనే విషయం తాను ఊహించలేకపోయాడు. తనకెక్కడా అనుమానం రాకుండా, తన మనసును నొప్పించకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాడో!
అనంతుడిచ్చిన అంగుళీయకాన్ని వేలికి ధరిస్తూ, “అనంతా! ఏ శుభముహూర్తాన మనిద్దరం కలుసుకున్నామో కాని, ప్రతి నిమిషం నా క్షేమం గురించే ఆలోచిస్తూ నాకు అండగా నిలబడ్డావు. నీ వంటి స్నేహితుడు దొరకడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం. మన స్నేహం ఇలాగే పదికాలాలపాటు నిలవాలి” అంటూ అనంతుని అక్కున చేర్చుకున్నాడు మహారాజు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కార్మికుల రక్తంతో రాసిన చరిత్ర – మే డే

ఉమా చిత్రాలు