శుభ ముహూర్తం -8వ భాగం

ధారావాహిక నవల

జరిగిన కథ:

పాణిగ్రహణం చేసుకున్న విదర్భ రాకుమారి, మనసులో తాము లేమని తెలిశాక, మగధ రాజాధినేత విక్రమసింహ, మారువేషంలో వినయవర్మగా రాకుమారికి శిక్షణనిస్తూ, గురువుగారు వచ్చారన్న వార్త వినగానే, శిరస్త్రాణము తీసి గురువుగారికి ఎదురెళ్ళాడు. వినయవర్మ మోమును మొదటిసారి గాంచిన రాకుమారి, మూర్చ పోవడంతో ఏమైందని అడిగిన ఇష్టసఖికి వారే నా మనసును చూరగొన్న మహాభాగులను తెలిపి, విక్రమసింహను కలుసుకోవడానికి, మహారాజ మందిరానికి ఎన్నిసార్లు వెళ్లినా, అనుమతి లేకపోవడంతో, చిత్రపటాన్ని శయ్యాగృహంలో పెట్టి, పుట్టింటికి బయలుదేరింది ప్రమీలదేవి. ఆ విషయం తెలిసి, అనుమానంతో సైన్యాధిపతి అనంతుడు, విక్రమసింహకు తెలుపగా, ఆ చిత్రపటాన్ని గాంచి, వ్యాకులత చెందాడు విక్రమసింహ. తర్వాతేమి జరిగిందో వీక్షిద్దాం రండి…

మహారాణి బహకరించారన్న చిత్రపటాన్ని చూసి, విక్రమసింహ మ్రాన్పడిపోయాడు. “అయ్యో!” అన్న మాట అతని నోటి నుండి వచ్చింది. రెండు చేతులతో శిరసును పట్టుకొని శయ్యపై కూలిపోయాడు. మహారాజునా స్థితిలో చూసి తమ అనుమానాలే నిజమయ్యాయి అనిపించింది దేవసేనకు.
దేవసేన ఆలోచనలను పట్టించుకోని విక్రమసింహ, కాస్సేపటికి తేరుకొని, “మహారాణీవారు ఎక్కడ? మేమిప్పుడే వారిని కలవాలి” అని పెద్ద, పెద్ద అంగలు వేసుకుంటూ బయలుదేరాడు.
ఆశ్చర్యపోయిన దేవసేన “మహారాజా! మహారాణి వారు విదర్భదేశం ప్రయాణమయ్యారు ” అంటూ, నిలువరించింది.
“వెంటనే విదర్భదేశ ప్రయాణానికి ఏర్పాట్లు చేయమని, అనంతుడికి కబురుపెట్టు” దేవసేనను ఆజ్ఞాపించాడు.
“ఉన్నవారు ఉన్నట్టుగా రావాలి. మహారాజుగారు ఏదేదో మాట్లాడుతున్నారు. విదర్భ దేశానికి ప్రయాణమంటున్నారు. నాకేమిటో అయోమయంగా ఉంది” దేవసేన నుండి వార్త రాగానే, అనంతునికి తన అనుమానాలు నిజమయ్యాయని అనిపించింది.
ఆ చిత్రపటంలోని యువకునికి, మహారాజు తండ్రిగారికి ఏదో సంబంధం ఉందనిపించింది. లేకుంటే జైత్రయాత్ర సమయంలో మహారాజు విదర్భదేశానికి ప్రయాణమవడం ఏమిటి? ఈ ఆలోచన రాగానే హుటాహుటిన మందిరానికి చేరుకున్నాడు అనంతుడు.
“అనంతా! నేను ఇప్పుడే మహారాణి వారిని చూడాలి. వారు విదర్భకు చేరకముందే, వారిని నేను కలుసుకోవాలి. వారు ఎంత బాధపడుతూ విదర్భకు ప్రయాణమయ్యారో! ఒక్కక్షణం కూడా వారి ఎడబాటును నేను సహించలేను. ప్రయాణానికి ఏర్పాట్లు చేయించు. లేకుంటే… మన పంచ కళ్యాణి నన్ను మహారాణివారి దగ్గరికి తొందరగా చేర్చగలదేమో!” ప్రభువు మాటలు విని ఆశ్చర్యపోయాడు అనంతుడు.
ప్రభువును అలా చూసిన అనంతునికి తన అనుమానాలు నిజం కాదేమోనన్న సందేహం వచ్చింది.
కాని చిత్రపటంలోని పల్లె యువకునిలో మహారాజుల వారి పోలికలు కనిపిస్తున్నాయి. గాని మహారాజుల వివాహానికి పూర్వం మహారాజు, తాను ఒక్కరోజన్నా విడిచి ఉండేవారు కాదు. అందుకని చిత్రంలో ఉన్న యువకుడు మహారాజుల వారు అయే అవకాశమే లేదు. ఆ స్త్రీమూర్తి ఎవరో, తానెప్పుడూ చూడలేదు. చిత్రపటంలోని వ్యక్తులకు, మహారాజుల వారికి ఏమిటి సంబంధం? ఈ చిత్రపటాన్ని మహారాజుకి ఎందుకు బహూకరించినట్లు? అందులో అంతరార్థమేమిటి? ఎంత ఆలోచించినా అర్ధం కాలేదు అనంతుడికి.
ఒకవేళ మహారాజుల వారి పోలికలున్న ఆ వ్యక్తి మహారాజుల వారి తండ్రిగారి సంతానమై ఉండవచ్చా? కాని, తమ మహారాజులాగే, వారి తండ్రిగారు కూడా ఏకపత్నీవ్రతులే. మరి ఆ పల్లె యువకునికి, మహారాజు పోలికలెలా వచ్చాయి? ఏ రకంగా సాధ్యమవుతుందది? తనకు తెలియని నిఘూడ రహస్యాలేమైనా ఉన్నాయా?
గంట క్రితం తన ఆలోచనలకు, మహారాజు ఆందోళనను చూశాక ఇప్పటి తన ఆలోచనలకు ఎంత వ్యత్యాసం? ఆ చిత్రపటాన్ని చూసిన వెంటనే మహారాణివారి మీద ఎన్ని అనుమానాలు తనకు? ఆ చిత్రపటంలోని యువకుని రహస్యాలను తెలుసుకున్న రాకుమారి మహారాజులను బెదిరిస్తున్నారా? ఇంతకాలంగా ఎవరికీ తెలియని ఈ విషయం, రాకుమారికి ఎలా తెలిసింది? దీని వెనక ఏయే శత్రురాజులున్నారు? జైత్రయాత్రకు ముందు మహారాజులకీ విషయం తెలిపి, వారిని దుర్బలత్వానికి గురి చేయడానికి రాకుమారి వ్యూహం పన్నారా? ఇన్ని రకాలుగా రాకుమారి మీద అనుమానాలు వెల్లువెత్తాయి తనలో. ఇప్పుడు మహారాజులు వారిని చూస్తే తన అనుమానాలేవీ నిజం కాదనే విషయం అర్థం అవుతుంది.
మరి ఆ చిత్రపటంలో ఉన్న వ్యక్తులెవరు? వారికి మహారాజుకు ఏమి సంబంధం? మహారాణి వారు ఏ విషయంలో బాధపడి ఉంటారు? ఆమె బాధపడి ఉంటారన్న విషయం మహారాజులకు ఎందుకనిపించింది? ఈ చిత్రపటంలో ఉన్న రహస్యమేమిటి? చిత్రపటం ద్వారా మహారాణి వారు, మహారాజుకు అందించిన సందేశమేమిటి? ఎంత ఆలోచించినా అనంతునికి సమాధానం అంతు చిక్కలేదు.
మహారాజును ఎప్పుడూ యిటువంటి స్థితిలో చూసి ఎరగడు. జీవన్మరణ సమస్యలలో కూడా ప్రభువు ఎప్పుడూ తొణికేవారు కాదు. అటువంటిది మహారాణి విషయంలో… అప్పుడు కూడా విదర్భ మీద యుద్ధాన్ని ప్రకటించటం… మహారాణికి కత్తిసాము నేర్పించడం…. ఇప్పుడు ఇలా..
మరో రెండు రోజులలో జైత్రయాత్రకు ముహూర్తం పెట్టుకొని ఒక స్త్రీ కోసం ఇంత తొణికిసలాడడం… ఇంత బలహీనత ప్రభువులలో ఎప్పుడూ చూడలేదు. స్త్రీల విషయంలో పురుషులు ఇంత బలహీనులా? ఈ ఆలోచనే అనంతునికి సుతరామూ నచ్చలేదు. కాని, ఇప్పుడు తన తక్షణ కర్తవ్యం పరిస్థితిని చక్కదిద్దడం, ప్రభువును మామూలుగా చేయడం.
“ప్రభూ!” అనునయంగా పిలిచాడు. “మహారాణి వారు ఎక్కడికి వెళ్లారు? వారి పుట్టింటికే కదా! మహారాణివారు ఈ చిత్రపటాన్ని మీకు బహూకరించడంలో, ఏదో అంతరార్ధం ఉండి ఉంటుంది కదా! వారు కూడా మీరు జైత్రయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకొని తిరిగి వస్తారని ఎదురు చూస్తూ ఉంటారు కదా! ఇటువంటి సమయంలో మీరు ఇంత బేలగా… క్షమించాలి. ఎప్పుడూ లేని విధంగా మిమ్మల్ని చూడలేను.
మరో రెండు రోజులలో జైత్రయాత్రను పెట్టుకొని ఇప్పుడు మీరు విదర్భకు ప్రయాణమవడం అంత క్షేమకరం కాదు. మీరే ఆలోచించండి? పైగా గురువులవారు కూడా ఇక్కడే బసచేసి ఉన్నారు. వారికీ విషయం తెలిస్తే, ఏమనుకుంటారు వారు? మీరింత బేల హృదయులనుకోరా? మహారాణివారు ఒక సదుద్దేశంతో మీకీ చిత్రపటాన్ని ఇచ్చి ఉంటారు. ఆ ఉద్దేశం గ్రహించి, మీరు నిర్ణయాలను తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం” నెమ్మదిగానే, అయినా స్పష్టంగా చెప్పాడు.
“అవును. ఆమె ఉద్దేశం… ఆమె మనసులో ఉన్నది మేమే అని తెలియచెప్పడం. అది అర్థం చేసుకున్నాము. జైత్రయాత్ర ముందు ఎంతటి శుభకరమైన వార్త! ఈ చిత్రపటం ద్వారా, మాలో అమృతత్వాన్ని నింపారు. మా మనసులో ఉన్నది వారేనని గ్రహించారు. వారి మనసును మాకు బహుకరించారు. ఇది చాలు… మా శౌర్యపరాక్రమాలను మరింత ఇనుమడింప చేయటానికి. జైత్రయాత్రను దిగ్విజయంగా పూర్తిచేసుకుని తిరిగి వస్తాము. మేము లేకుండా వారిక్కడ ఉండడం కన్నా, అంతవరకు ఆమె పుట్టింటిలో ఉండడమే శ్రేయస్కరం. ఇన్నాళ్లూ వారి మనసులో ఉన్న మహాభాగులు ఎవరో అనుకున్నాం. అది మేమేనని, ఆలస్యంగానైనా తెలియడం… అదీ! జైత్రయాత్ర ముందే తెలియడం… ఆ దేవదేవుడు, మా విన్నపాలను మన్నించి, ఈ శుభ సూచన ద్వారా, విజయలక్ష్మిని చేకుంటామని, ముందే మమ్మలను ఆశీర్వదించాడా! అంతా ఆ పరమేశ్వరుని దయ” ఇలా ఆలోచించుకుంటూ తమ ఇష్ట దైవాన్ని స్మరించుకొని, మహారాణిని పొదివి పట్టుకున్నంత అపురూపంగా, ఆ చిత్రపటాన్ని పట్టుకున్నాడు విక్రమసింహ. అందులోని మహారాణి రూపాన్ని తనివితీరా చూసుకున్నాడు.
“పాపం! ఇన్ని నెలల తర్వాత ఆ పల్లెవాడు మహారాజే అని తెలియగానే, మహారాణి ఎంత బాధ పడిందో? ఇన్ని రోజులుగా ఆమె మనసులో ఉన్న మహాభాగుడు తానే అని తెలియక, తనని దూరంగా ఉంచినందుకు ఎంత కుమిలిపోయిందో? ఇప్పుడు కూడా నన్ను కలుసుకోలేక పోయినందుకు, ఎంత క్షోభననుభవిస్తూ, పుట్టింటికి ప్రయాణమయ్యిందో?” ఇలా ఆలోచించుకుంటూ “ఆఘమేఘాల మీద, ఈ హారం మహారాణి వారికి చేరాలి. ఇది వారికి నా బహుకరణ అని చెప్పండి” తన మెడలో ఉన్న హారాన్ని తీసి దేవసేనకు ఇచ్చి చెప్పాడు.
మహారాణి వారికి తన మెడలోని హారాన్ని బహుకరిస్తున్నారంటే, ఈ చిత్రపటం ద్వారా మహారాణి వారు, మహారాజులకు శుభ సందేశాన్నే అందించారన్న విషయం అర్థమైనా, ఆ చిత్రపటంలో ఉన్న వ్యక్తులకు, మహారాజుకు వున్న సంబంధం ప్రశ్నగానే మిగిలిపోయింది అనంతునికి.
“ఆ చిత్రపటంలో ఉన్న వ్యక్తులెవరు ప్రభూ” తెలుసుకోవాలన్న కుతూహలం చాలా ఉన్నా, ఇప్పుడే మానసికంగా కుదుటపడుతున్న మహారాజులనా ప్రశ్న అడిగితే, వారి మనసును మరల ఆరాటంలోకి నెట్టడమే అవుతుందని, అప్పటికి ఊరుకున్నాడు.
*
నారాయణాచార్యుల వారి సారథ్యంలో జైత్రయాత్ర మొదలైంది. జైత్రయాత్ర అంటే మాటలు కాదు. ఇంకొక దేశం మీదకి దండెత్తి వెళ్ళినప్పుడు, ముందు ఆ దేశ సైనిక సంపత్తి, ఆయుధ సంపత్తి, అశ్వబలం, గజబలం, వేగులవారి చాకచక్యం అన్నీ తెలిసి ఉండాలి. రాజధానికి వెళ్లే మార్గాలు యెన్ని? మార్గంలో ఉండే అవరోధాలేమిటి? కందకాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఏ మార్గంలో చొరబాటుకు అవకాశమెక్కువ వుంటుంది? ప్రత్యర్థి కోటకు దారులెన్ని, ఆ దారుల దగ్గర వారి పహారా బలగాల సంఖ్యెంత, ఏ సమయాలలో బలగాలు మారుతాయి, ఇటువంటి విషయాలన్నీ క్షుణ్ణంగా తెలిసి ఉండాలి.
దానికి తోడు దండెత్తి వెళ్లే వాళ్లకక్కడ స్థాన బలముండదు. కాబట్టి, దండెత్తబోయే రాజ్యానికి దగ్గరలో పటిష్టమైన గుడారాలను, యుద్ధం ఎక్కువ రోజులు సాగుతుందనుకుంటే, తాత్కాలికంగా మట్టి కోటలను కూడా కట్టవలసి ఉంటుంది. ఆ కోటలకు శత్రురాజుల నుండి ఎదురు దాడి జరగకుండా రక్షణా ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. వెంట వచ్చిన సైన్యానికి తగిన వసతి, భోజన సదుపాయాలు, గాయాలైన సైనికుల వైద్యానికి అవసరమైన ఏర్పాట్లు, చేసుకోవాలి. మధ్య కొంతమంది సైనికులకు విశ్రాంతినిస్తూ ఉండాలి. సైనికులు అలసిపోకుండా వారి ఉల్లాసానికి ఏర్పాట్లు చెయ్యాలి.
మహారాజుకు, మంత్రులకు, మంత్రాంగవేత్తలకు, సైనికాధికారులకు… వారి హోదాలను బట్టి వసతి ఏర్పాట్లు ఉండాలి. ఈ పనులన్నీ చక్కబెట్టడానికి తగిన పరిచారిక బృందం వెంట ఉండాలి. కొన్ని నెలలకు సరిపడా ఆహార పదార్థాలను, మంచినీటిని సమకూర్చుకోవాలి. కోట వెలుపల ఉంటారు కాబట్టి, విష ప్రయోగాలు జరిగే అవకాశాలెక్కువగా ఉంటాయి. అందుకని గుడారాల బయట, లోపల కూడా ఏమి జరుగుతుందో వేగుల వారు, అనునిత్యం వేయి కన్నులతో చూస్తూ ఉండాలి.
మహారాజు గారు రాజ్యంలో లేరంటే ఆ రాజ్యం మీద కూడా ఎవరైనా దండెత్తే అవకాశముంటుంది. అది దృష్టిలో పెట్టుకుని, మహారాజుగారు లేని లోటు కనిపించకుండా, రాజ్యానికి అవసరమైన రక్షణా ఏర్పాట్లను చేస్తూ, వాటిని పర్యవేక్షించడానికి, అత్యవసర వేళల అవసరమైన నిర్ణయాలు తీసుకోవడానికి, నమ్మకస్తులైన పరిపాలనా దక్షులకు రాజ్యాన్ని అప్పగించాలి. అవసరమైన వేళల్లో రాజ్యం నుండి సైన్యాన్ని, ఆహార పదార్థాలను, అవసరమయ్యే ధనాన్ని పంపించే ఏర్పాట్లూ చెయ్యాలి. అనునిత్యం అప్రమత్తతతో ఉండాలి.
బాగా గాయపడిన సైనికులను రాజ్యానికి తరలించి, వారి స్థానంలో కొత్తవారిని తెచ్చుకునే ఏర్పాట్లు, ఆహార ధాన్యాల సరఫరా, అవి ప్రత్యర్థుల చేతికి చిక్కకుండా కాపలా, ఎవరు మిత్రులో ఎవరు శత్రువులో, ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ముందుకు సాగాల్సి ఉంటుంది. ఇన్ని భారీ ఏర్పాట్లు చేసుకుంటూ జైత్రయాత్రకు బయలుదేరాడు మగధ దేశాధినేత విక్రమసింహ.
*
అతని రాజ్యపాలనా దక్షత బాగా ఎరిగిన చిన్నచిన్న దేశాలు యుద్ధం చేయకుండానే, మగధ రాజ్యాధికారానికి లోబడి ఉండడానికి, వారి సన్నద్ధతను ప్రకటించాయి. కొంతమంది సైనికులను, అశ్వాలను, గజాలను కప్పంగా మగధ రాజుకు అందించాయి.
మగధ రాజ్యం మీదకు దండయాత్ర చేయడానికి సన్నద్ధమైన కుంతల దేశం మాత్రం గట్టి పోటీని ఇచ్చింది. దానికి సన్నద్ధమై వెళ్లారు కాబట్టి, వ్యూహాలు ప్రతివ్యూహాలతో ముందుకెళుతున్నారు.
యుద్ధనీతి ప్రకారం సూర్యాస్తమయం అయ్యాక, ఇరు సైన్యాలు యుద్ధానికి విరామం ప్రకటించి విశ్రాంతి తీసుకుంటున్నాయి. ముఖ్య అధికారులు మాత్రం మరుసటి రోజు యుద్ధానికి అవసరమయ్యే వ్యూహలను రచించుకుంటూ శత్రువును దెబ్బతీయటానికి ప్రయత్నిస్తున్నాయి ఇరువర్గాలూ.
ఒకరోజు యుద్ధం చాలా భయంకరంగా జరిగింది. ఇరువైపులా చాలామంది నిహితులయ్యారు. శిబిరాలకు చేరుకున్న మహారాజు, అనంతుడు, నారాయణాచార్యులు రేపటి యుద్ధానికి ఏరకంగా వ్యూహాలననుసరించాలో చర్చించారు. చర్చలయ్యాక ఎవరి శిబిరాలకు వారు చేరుకున్నారు.
శిబిరానికి చేరుకున్న అనంతుడు వేగుల వారి నుండి వచ్చే సమాచారాన్ని క్రోడీకరించి, ఏ విధమైన మార్పులు, చేర్పులు చేయాలి అని ఆలోచిస్తుండగా నరసింహుడు, వచ్చి నిలబడ్డాడు. నరసింహుడు వేగులలో చాలా చురుకైన వాడు, ఎంత క్లిష్టమైన సమాచారాన్ని అయినా తెలుసుకోగలడు. ఈ నిమిషంలో యిక్కడుంటాడు. మరు నిమిషంలో ఎక్కడుంటాడో ఎవరికీ జాడ తెలియదు.
వేషాలు వేయడంలో దిట్ట. నేనేనని చెప్పినా నమ్మలేనట్టుగా ఉంటుంది అతని వేషం. ఆఖరికి మహారాజైనా కూడా అతనిని కనిపెట్టలేడు. అనంతుడికొక్కడికే సాధ్యమది. నరసింహుడొక్కడే వంద మంది వేగులకు సమానం. అతని సారధ్యంలో, మరో పదిమంది వేగులుంటారు. వారందరు కూడా నరసింహుడు వేగాన్ని ఒడిసిపట్టిన వారే. నరసింహుడి మాటే వారికి శిరోధార్యం. ఇలా మరో పది వేగుల బృందాలున్నాయి.
వీరందరూ పూర్తిగా అనంతుని ఆధీనంలోనే ఉంటారు. అనంతుని మాటే వారికి శిలా శాసనం. ఆ విషయంలో అనంతుల తర్వాతే మహారాజులైనా! వీరెవరూ యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనరు. కాని, యుద్ధతంత్రంలో ముఖ్య భూమికను పోషిస్తారు. వారు తెచ్చే సమాచారాన్ని బట్టే, ప్రణాళికలు మారుతాయి. వారి ప్రతి నిమిషం అత్యంత విలువైనది.
అతని ముఖం చూసి అతి ముఖ్యమైన విషయమని గ్రహించుకొని, శిబిరంలో ఉన్న మిగిలిన వారికి సెలవిచ్చి, నరసింహుని లోపలకు పిలిపించుకున్నాడు అనంతుడు.
“ప్రభూ! ముఖ్యమైన విషయం. మన శిబిరాల వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వీరులను పట్టుకుని, మీ శిబిరానికి తీసుకువస్తుండగా, వారివురూ మహారాజ శిబిరం వద్దకు రాగానే మహారాజులను చూడాలి, మేము మహారాజులను చూడాలి, వారి దగ్గరకు తీసుకు వెళ్ళండి అని గొడవ చేసి మహారాజులవారి ద్వారపాలకుల దృష్టిని, వారి ద్వారా మహారాజుల వారి దృష్టిని ఆకట్టుకున్నారు. వారిరువురినీ ఎప్పుడూ చూసి ఉండలేదు. మహారాజు వారిద్దరినీ తమ దగ్గరకు పిలిపించుకున్న కాస్సేపటికి, మహారాజు పరిచారకులకు సెలవిప్పించి బయటకు పంపించారు.
ప్రస్తుతం మహారాజ శిబిరంలో మహారాజు, వారిద్దరూ తప్ప వేరే ఎవరూ లేరు. నా మనసెందుకో కీడును శంకిస్తున్నది. అందుకే ఆ విషయం మీకు విన్నవించాలని క్షణాల మీద వచ్చాను” అని వగర్చుకుంటూ చెప్పాడు నరసింహుడు.
అనంతునికి మతిపోయినంత పనైంది. తమ సైన్యంలోనే కాదు, పరిచారిక బృందంలో కూడా నరసింహునికి తెలియని వారెవ్వరూ లేరు. అటువంటి వాడే, అనుమానాస్పద వ్యక్తులన్నాడంటే, అది తేలికగా తీసుకునే విషయం కాదు. అటువంటి వారిని శిబిరంలో పెట్టుకొని, అదీ యుద్ధ సమయంలో… తనతో ఆలోచన చేయకుండా మహారాజు ఎవ్వరిని నమ్మరు. అటువంటిది తెలియని వారెవరితోనో ఏకాంతంగా… ఉపేక్షించాల్సిన విషయం కాదు. ముప్పు జరగడానికి క్షణం చాలు. వడివడిగా ప్రభువుల శిబిరానికి నడిచాడు. ఎన్నడూ లేనిది, ఎడమ కన్ను అదురుతుంది. ప్రభువులకు ఏమైనా జరిగి ఉంటుందా? మనసెందుకో కీడును శంకిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఒడిపిళ్ళు- 26 వ భాగం

తర్జన భర్జన