సంకల్పం

ధారావాహికం

పృథ్వీ అనూష లు ఇద్దరూ నేటి యువతరానికి ప్రతీకలు. నేను మాత్రమే కాదు,నా చుట్టూ ఉండే వారు కూడా బాగుండాలి. దానికి మన చేతనైన మంచిని సమాజానికి చేయాలి అని ఆలోచించే వీరిద్దరి మార్గాలు మాత్రం భిన్నమైనవి. వీరిద్దరి స్నేహం వారి లక్ష్యసాధనకు తోడ్పడుతుందా, ప్రతిబంధకం ఔతుందా అనేది చూద్దాం.

3వ భాగం (అక్షర యజ్ఞం)

                            విద్యుల్లత

పృథ్వీ వెళ్లేటప్పటికీ ఆ బస్తీ (ఒక మురికివాడ) లో పోలీసులతో వాదిస్తున్న రాజేష్ కనిపించాడు. గబగబా అక్కడికి వెళ్ళాడు పృథ్వి.

“హలో సర్ ! ఏంటి ఇలా వచ్చారు? ఏం జరిగింది?” తెలిసిన ఎస్ఐ విజయ్ కుమార్ కనిపించేసరికి పలకరించాడు.

“నిన్న రాత్రి పక్క వీధిలో చెయిన్ స్నాచింగ్  జరిగింది సార్. ఆ వార్డ్ మెంబర్ గారి శ్రీమతి మెడలోంచి పది తులాల హారం లాగేసారట. అది ఇదిగో ఈ బస్తీలో కుర్రాళ్ళే చేసి ఉంటారని ఎంక్వైరీ కి వచ్చాను,” చెప్పాడు ఎస్సై.

“లేదు సార్ ,రాత్రి నేను ఇక్కడే ఉన్నాను. వీళ్ళకి ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి కదా. అందుకని చాలా సేపు చదువుకుంటూ ఉండిపోయారు ఈ పిల్లలంతా. చాలా రాత్రి అవ్వడంతో నేను కూడా వాళ్లతో పాటు హాల్లోనే పడుకున్నాను.

కుర్రాళ్లంతా ఇక్కడే ఉన్నారు. దానికి నేనే సాక్ష్యం. కానీ ఎస్ఐ గారు మన కుర్రాళ్ళని నేరం ఒప్పుకోమంటూ ఒత్తిడి చేస్తున్నారు. నేను చెప్తుంటే వినడం లేదు. అందుకే మిమ్మల్ని అర్జెంటుగా రమ్మని చెప్పాను,” ఆందోళన వ్యక్తం చేశాడు రాజేష్.

“సరే రాజేష్, నేను మాట్లాడతాను. నువ్వు కంగారు పడకు. మన హాల్లో సీసీ కెమెరా ఉంది కదా. రాత్రి ఆ ఫుటేజ్ మన ఎస్సై గారికి చూపించు. మన  కురాళ్లంతా అక్కడే ఉన్నారు అనేందుకు ఆ సాక్షం సరిపోతుంది కదా!” కూల్ గా చెప్పాడు పృథ్వీ.

“నిజమే సార్, నాకు ఆ ఆలోచన రాలేదు. పోలీసుల హడావుడి చూసేసరికి భయమేసి మిమ్మల్ని పిలిచాను. ఇప్పుడే చూపిస్తాను రండి ఎస్సై గారూ,” పిలిచాడు రాజేష్.

అందరూ వెళ్లి అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ చూశారు. ఆ బస్తీలోని పిల్లలంతా సాయంత్రం 6:00 నుంచి అక్కడే ఉన్నారు. వాళ్ళ లేడీ టీచర్ పూజ ,ఆడపిల్లలు రాత్రి 9 గంటలకు వెళ్ళిపోయారు‌.  అబ్బాయిలంతా 11 గంటల వరకు చదువుకుంటూ ఉండి, అప్పుడు అక్కడే పడుకున్నారు.

ఆ ఫుటేజ్ చూశాక ఇక మాట్లాడేందుకు ఏమీ లేక, “సారీ పృథ్వీ, నిజానికి ఇక్కడ నువ్వు ఈ అక్షర యజ్ఞం మొదలుపెట్టి వీళ్ళల్లో ఈ మార్పు తీసుకురాకపోయినట్లయితే ఖచ్చితంగా వీళ్ళు ఇటువంటి పనులల్లోనే ఉండేవారు. సంవత్సరం క్రితం వరకు ఈ ఏరియాలో జరిగే క్రైమ్ కంతా   ఈ కుర్రాళ్లే కారణంగా ఉండేవారు.

నువ్వు మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ఇంత సత్ఫలితాలను ఇచ్చి,వీళ్ళలో ఇంత మార్పు వస్తుందని మేమెవరం నమ్మలేదు. హ్యాట్సాఫ్ టు యూ పృథ్వీ! మరొక్కసారి మీకందరికీ సారీ చెప్తున్నాను,” అక్కడ ఉన్న ఆ బస్తీ వాసులందరికీ చెప్పి తన బలగంతో బయలుదేరాడు విజయ్ కుమార్.

“సర్,మీకు ఒక విన్నపం. మా కుర్రాళ్ళు అందరూ మారిపోయారని మీరు నమ్ముతున్నారు కదా.క్రైమ్ గురించి వాళ్లని పదేపదే మీరు ఒత్తిడి చేస్తే వాళ్ళు తిరిగి ఆ మార్గాన్ని అవలంబించే అవకాశం ఉంది. దయచేసి మీరు దీన్ని గుర్తించండి. మారిన ఈ కుర్రాళ్ళని మళ్ళీ క్రైమ్ వైపు తొంగి చూసేలా మీరే చేయకండి ప్లీజ్,” వినమ్రంగా చెప్పాడు పృథ్వి.

“అయ్యా నీ కాళ్లు మొక్కుతం, నీ బాంచను.మమ్మల్ని ,మా పిల్లల్ని కాపాడటానికి దేవుడే మీ రూపంలో వచ్చిండయ్యా.సత్తె పెమాణంగా ఆ పోలీసులను చూసినప్పుడు మాకు కూడా గుబులయింది. పాత అలవాట్లు మానుకోలేక మా పోరలు మళ్ళీ ఆ గలీజ్ పని చేసింరేమో అని అనుకున్నాం. నువ్వు వాళ్ళని నమ్మినవ్. బాగు చేసినవ్. దండాలయ్యా,” పేటలోని పెద్దలంతా ఒక్క కంఠంతో చెప్పారు పృథ్వికి.

“ఇందులో నేను చేసింది ఏమీ లేదు. వాళ్ళందరూ నిజానికి మంచి పిల్లలే. చదువుకునేందుకు అవకాశం లేక, సరైన దారి, మంచి చెడు విచక్షణ చెప్పే వాళ్ళు లేక అలా చెడు తిరుగుళ్ళు తిరిగేవారు. ఇప్పుడు వాళ్ళకి, వాళ్ళు ఏం సాధించగలరో తెలుసు. అందుకే ఇక చెడు వైపు వెళ్లరని నేను 100% నమ్ముతున్నాను,” చెప్పాడు పృథ్వి.

“రాజేష్, ఇప్పుడు నాకు ఈ మన అక్షర ఫౌండేషన్ కార్యకలాపాలను నగరంలోని ప్రతి బస్తీకి విస్తరించి, విజయవంతం చేయగలమని దృఢవిశ్వాసం ఉంది‌ దీనికి నువ్వే ఇన్చార్జిగా పూర్తి బాధ్యతలు తీసుకోవాలి‌ నీలాంటి ఎంతోమంది కార్యకర్తలను ప్రతి స్లమ్ లోనూ ఏర్పాటు చేయాలి. అబ్బో, మనకు చాలా పని ఉంది,” ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్తున్న పృథ్వి వంక చూస్తూ గతం లోకి వెళ్ళిపోయాడు రాజేష్.

ఆ ఎస్ ఐ విజయ్ కుమార్ చెప్పినట్టు రెండు సంవత్సరాల క్రితం వరకు, అంటే పృథ్వి అడాప్ట్ చేసుకోక ముందు వరకు ఈ స్లమ్ లోని పెద్దలంతా పొద్దున్నే నగరంలోని చిన్నాచితకా పనుల్లోకి వెళ్లేవారు. పిల్లలకు ఆలనా పాలన లేదు. చిల్లరగా తిరిగేవారు.

చిన్న చిన్న క్రైమ్స్ వాళ్లకి చాలా సులువుగా అలవాటయ్యాయి‌.చిన్న దొంగతనాలు, చైన్  స్నాచింగ్ ,దొమ్మీలు చాలా మామూలు అన్నట్లుండేవారు.

ఈ ప్రాంతం నుంచి చాలా కొద్దిమంది, తన పేరెంట్స్ లాంటి వాళ్లు, చదువు విలువ తెలిసి తనని ,చెల్లి దీప్తి నీ హాస్టల్ లో పెట్టి చదివించారు.

తను డిగ్రీ పూర్తి చేసి క్యాంపస్ ప్లేస్ మెంట్ ద్వారా  పృథ్వి సర్ పనిచేస్తున్న కంపెనీలో ,ఆ సార్ టీంలో అసిస్టెంట్ గా చేరడం వల్ల నెమ్మదిగా సార్ తో పరిచయం అవడం అనేవి చాలా గొప్ప  విషయాలు తన జీవితంలో.

పృథ్వీ ఎప్పుడూ ఈ హైదరాబాద్ మహానగరంలోని మురికివాడల్లో ఉన్న ఎంతోమంది యువత చదువుకునే అవకాశం లేక, ధనం సంపాదించే మార్గం లేక, నేరస్తులుగా మారుతున్నారనీ,వాళ్ళందరి జీవితాలలో ఏదో విధంగా మంచి మార్పు తీసుకురాగలిగితే  బావుంటుందని భావించేవాడు.

ముందుగా ఒకటి లేదా రెండు ఇటువంటి బస్తీలలో తన అక్షర ఫౌండేషన్ అనే ఆలోచనని కార్యరూపంలో పెట్టి,విజయం సాధించగలిగితే, ఆ తర్వాత నగరం అంతా, అటు పైన రాష్ట్రమంతా తన ఫౌండేషన్ యొక్క సేవలను విస్తరింప చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు.

ఆ ఆలోచన తనకు నచ్చి అందులో తానూ భాగం పంచుకుంటానని చెప్పాడు సార్ తో .

దాని ఫలితమే ఈరోజు ఇక్కడ తాము చేస్తున్న పని-అక్షర యజ్ఞం.

చదువు లేకపోవడం వల్లనే యువత చెడు మార్గం వైపు వెళ్తారని గట్టిగా నమ్ముతాడు పృథ్వి. అందుకే నగరంలోని అతిపెద్ద బస్తీలో మొట్టమొదట తన అక్షరా ఫౌండేషన్ ద్వారా అక్షర యజ్ఞాన్ని మొదలుపెట్టాడు మూడు సంవత్సరాల క్రితం.

ఇక్కడ ప్రజలతో మాట్లాడి, అసలు వీళ్ళని అందర్నీ చదువు వైపు మళ్ళించడానికి ఒక సంవత్సరం పట్టింది. ముఖ్యంగా ఆ సమయంలో తాము గమనించింది ఏంటంటే వీళ్ళు బయటి నుంచి వచ్చే వాళ్ళని త్వరగా నమ్మరు.

అలా నమ్మడం వల్ల ఇదివరలో చాలా సార్లు తాము మోసపోయామని తర్వాత చెప్పారు వాళ్లు. మంచిగా నటిస్తూ, ఇక్కడికి చేరి తర్వాత ఇక్కడ కొంతమంది కుర్రాలని మచ్చిక చేసుకొని పెద్ద పెద్ద నేరాల కోసం తీసుకెళ్లిన ఉదంతాలు వాళ్ళని అలా కొత్తవారిని నమ్మకుండా ఉండేందుకు ప్రేరేపించింది. కానీ తాము నిజంగానే అక్కడ పిల్లలకు చదువు చెబుతూ వారికి కావలసిన కనీస అవసరాలు తీర్చుకునేందుకు మార్గం చూపిస్తూ వాళ్ళ నమ్మకాన్ని  పొందగలిగాము. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా వాళ్లంతా తాము చెప్పింది వినడం మొదలుపెట్టారు.

అక్కడ పెద్దవారిలో (ఆడ, మగ) అవకాశం ఉన్నవారందరికీ తన తండ్రి అతని స్నేహితులు నడుపుతున్న రకరకాల వ్యాపార కంపెనీలలో అనువైన ఉద్యోగాలు కల్పించాడు.

దీనికి మొదట్లో తన తండ్రి సహకరించకపోతే అతడిని బ్రతిమాలి, బెదిరించి మరీ ఒప్పించాడు పృథ్వి.

దానివల్ల ముందుగా వారికి ఉదయమే పనుల వేట కోసం చేసే పరుగు తగ్గింది. అప్పుడు వారి ఇళ్లల్లో ఉన్న చిన్నపిల్లలకు దగ్గరలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశం కల్పించాడు.

అప్పటికే కాస్త పెద్దవారు అయిపోయి కనీస విద్య పొందని వారికోసం అక్కడే ఒక కమ్యూనిటీ హాల్ లాంటిది కట్టించి, అందులో వాలంటీర్లను పెట్టి చదువు చెప్పించి ప్రైవేట్ గా పరీక్షలు రాయించే వీలు కల్పించాడు.

విద్య అంటే కేవలం పుస్తకాలు చదువుకోవడమే కాకుండా వారి వారి ఇష్టాన్ని బట్టి రకరకాల వృత్తి విద్యలను కూడా నేర్పించే ఏర్పాటు చేశాడు. అలా వాళ్ళు నేర్చుకుంటూ స్వయంగా కొందరు కొన్ని వస్తువులను తయారు చేస్తుంటే, మరికొందరికి వాటికి మార్కెటింగ్ చేయడం నేర్పాడు.

రెండవ సంవత్సరం పూర్తయ్యేసరికి వీళ్ళ ప్రయత్నాలను, దాని ఫలితాలను చూస్తున్న మిగిలిన కొద్ది మంది కూడా వీరితో చేతులు కలపడంతో ఇప్పుడు ఈ బస్తీలో ప్రతి ఒక్కరూ మంచి మార్గం వైపు ప్రయాణం చేస్తూ, చెడు అలవాట్లకు, పనులకు దూరంగా జరిగారు.

వాళ్లందరి కోసం ఒక చక్కటి లైబ్రరీ ప్రారంభించి చిన్న నుంచి పెద్ద వరకు అందరూ పుస్తక పఠనం చేసేలా ప్రోత్సహించాడు.

ముఖ్యంగా యువతను ఫోన్లు, మహిళలను టీవీ అనే వ్యసనాల నుంచి దూరం చేయగలిగాడు. ఇది మామూలు విజయం కాదు.

ఇప్పుడు ఇక్కడ యువత ఇంటర్నెట్ ని కేవలం మంచి విషయాలు నేర్చుకోవడానికి తప్ప కాలక్షేపానికి వాడటం మానేశారు.

ఈరోజు ఒక పోలీస్ అధికారి ప్రశంసించి వెళ్లారంటే అది నిజంగా చాలా అభినందనీయం.

“ఏమిటి రాజేష్?ఏ లోకంలోకి వెళ్ళిపోయావు? నేను చెప్పిన దాని గురించే ఆలోచిస్తున్నావా?” అన్న పృథ్వి మాటలతో ఈ లోకంలోకి వచ్చాడు రాజేష్.

ఇప్పుడు పృథ్వి సార్ ఈ బస్తీలో సాధించిన విజయంతో నిజంగానే తాము నగరంలోని అన్ని బస్తీలను ఇలా ప్రక్షాళన చేయగలమా? ఆ కుర్రాళ్ళు అందరినీ మంచివైపు మళ్లించి క్రైమ్ నుంచి దూరం చేయగలమా?

అదంత సులువుగా జరిగే పనేనా? దీనికి సరిపడా వనరులు తమ దగ్గర ఉన్నాయా? పృథ్వీ సర్ యొక్క సంకల్పం చాలా గొప్పది. కానీ అది నెరవేరే క్రమంలో తాము ఎదుర్కోబోయే సమస్యలు ఏంటి? ఈ ఆలోచనలతో ఆ రాత్రి నిద్రకి దూరమయ్యాడు రాజేష్.

Written by Vidyullata

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

బతుకమ్మ విశిష్టత

దరిద్రం వదిలింది!