వీలైతే నాలుగు మాటలు

కవిత

వేదనాగ్నిలో వేసరిల్లేవారి మాటలను హృదయమొగ్గి వినాలి

ఓదార్పు జల్లులను కురిపించాలి పెదవులపై చిరునవ్వులు పూయించే

పసి మనసున్న వారి వదనంలో మరి కాస్త పరిమళాలు వెదజల్లాలి

కాలోపహతులై కళ్ళల్లో అమావాస్యలు మోసే

వాళ్లకు

చిన్ని వెలుగు దివ్వెల దారి చూపాలి

ఎన్ని పరీక్షలకు తల వొగ్గితే జీవితం

ప్రతి పరీక్షా శిశిరాలను జయించే

స్థైర్యంవారికి ఇవ్వాలి

వసంతాల బాటలు వేయాలి అన్నివేళలా మూటలే కాదు

కొన్నిసార్లు మాటలే బ్రతుకులకు ఆయువు పోయవచ్చు

గొప్ప ఔషధంగా పనిచేయవచ్చు

శ్లోకార్ధంలో వ్యాసమహర్షి చెప్పిందే

కొత్తగా నేనేం చెప్పడం లేదు ..

వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్పు కాఫీ సినిమా డైలాగే కావచ్చు ..

ప్రేమ నో, చదువో, ఉద్యోగమో

ఎక్కడో ఏదో కోల్పోయి

ఏ నిరాశ నిస్పృహలోనో వేగిపోయి

డిప్రెషన్ కోరల్లో చిక్కుకున్న మనిషిని

ఓ లేలేత మనసును

ర్యాంకుల వేటల్లో ఓడిపోయిన వాళ్ళను

ఒంటరితనమనే పెనుభూతం చేతుల్లో

విలపిస్తున్న ఒక విరిగిన హృదయాన్ని

జాగృతం చేయవచ్చు

మనసును మంచి దారిలోకి మరలించవచ్చు

కొత్త ఆశల హరివిల్లు వాళ్ళ బతుకుల్లో చిత్రించవచ్చు

మాటలే మన వృత్తి

మాట్లాడుతూ మాట్లాడుతూ మార్చేద్దాం ఈ లోకాన్ని

కన్నీళ్లే తెలియని కొత్త ప్రపంచాన్ని నిర్మించేద్దాం

కన్నీళ్లే తెలియని కొత్త ప్రపంచాన్ని నిర్మించేద్దాం

రండీ వీలైతే నాలుగు మాటలు

రసాత్మకంగా, సారాత్మకంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

శుభ ముహూర్తం- మూడవ భాగం

చివరకు మిగిలేది