వచ్చే అన్ని కొత్త సంవత్సరాలకు
మారుతానని మాట ఇవ్వడమే తప్ప
మార్పు లేదు నీలో
ఇలా అయితే విజయపు సింహాసనాన్ని
ఎప్పుడు అధిష్టిస్తావు ?
సాలుకో కొత్త నినాదం ఇచ్చి
బద్ధకపు పంజరంలో బందీఅయితే
గెలుపు ద్వారాలు ఎప్పుడు తెరుస్తావు ?
మత్తు మైకంలో అర్ధరాత్రి ఇచ్చిన ఆ మాటలన్నీ
సూర్యుని రాకతో మాయమవుతున్నాయా?
ప్రతి ఏటా
పునాదిలేని నీ మాటల కోటలు చాలులే ఇక
గెలుపు పథకాలు, ప్రశంసలు పొందాలంటే
కష్టం నీ ఆయుధం అయితేనే
శ్రమ నీ సాధన అయితేనే
విజ్ఞానపు జ్యోతులు నీ దగ్గర ఉంటేనే
ఈ సమాజపు చీకట్లో చీల్చుకొని నడవగలవు
ఇప్పటికైనా ఆపు
నీ బద్దకపు అన్వేషణలు
ఈ సంవత్సరంనుండైనా వెతుకు
నీ బతుకు దారులను
సాలు మారగానే
కొత్త క్యాలెండర్ కొని తెచ్చుకోవడం కాదు
నీ జీవితంలో ఏదో ఓ కొత్తదనాన్ని తెచ్చుకో
గతాన్ని తలుచుకొని దుఃఖించడం కన్నా
వచ్చే కొత్త సంవత్సరాన్ని మరో సవాలుగా మలుచుకో
గెలుపొందుటకు
ఈ కొత్త సంవత్సరం నీకు మరో అవకాశం