చప్పట్ల వెనుక నిశ్శబ్దం

వర్షపు జల్లుల్లో తడిసిన మట్టి నుంచి వచ్చిన పరిమళం మనసుకు హాయిగా తాకుతోంది.

చెట్ల ఆకులపై నిలిచిన నీటి బిందువులు ఒక్కొక్కటిగా జారి పడుతూ చుట్టూ ప్రకృతిని మరింత అందంగా అలంకరిస్తున్నాయి.

గుంపులు గుంపులుగా విద్యార్థులు క్లాస్‌ రూముల నుంచి కళాశాల ప్రాంగణం లోకి వస్తున్నారు. ఆ మెట్లపై తొలిసారిగా రమ్య ఆకాశ్‌ను చూసింది. చేతిలోపుస్తకాలతో హుందాగా నడుచు కుంటూ వస్తున్నాడు.రమ్య ముఖంలో ఎలాంటి ఆర్భాటం లేదు; కళ్లల్లో ఆత్మవిశ్వాసం మెండుగా ఉంది.

“సెమినార్ హాల్ ఎక్కడ ” అని తన స్నేహితులను అడిగింది రమ్య.

ఆకాశ్ చిరునవ్వు తో, “స్ట్రైట్‌గా వెళ్లి కుడివైపు తిరగండి… అక్కడ “సెమినార్ హాల్” బోర్డు కనిపిస్తుంది,” అని అడగక పోయినా దారి చెప్పాడు.

“థ్యాంక్యూ,” అంటూ రమ్య ముందుకు నడిచింది.

ఆ చిన్న సంఘట వారి ఇద్దరి మధ్య తొలి పరిచయానికి నాంది పలికింది.

రోజులు గడిచాయి. తరగతులు, ప్రాజెక్టులు, అసైన్‌మెంట్లు… మధ్య మధ్యలో ఇద్దరూ ఎదురు పడేవారు. రమ్యకు శాస్త్రీయ సంగీతంలో మంచి పట్టు. తన గాత్రం ఎంతో మధురంగా ఉంటుంది.

ఒక రోజు సెమినార్‌లో రమ్య అన్నమయ్య కీర్తన హృద్యంగా ఆలపించింది. సభ అంతా చప్పట్లతో మారు మోగింది.

“ఆమె కేవలం పాటను పాడలేదు” … ప్రతి పదాన్ని తన హృదయంతో పలికింది

అన్నారు స్వర జ్ఞానం ఉన్నవారు.

ఆ గాత్ర మాధుర్యం తెలియకుండానే ఆకాశ్ హృదయాన్ని తాకింది.

ఇద్దరు తరుచు మాట్లాడు కోవడం ఒకరి కొకరు సహాయం చేసుకోవడం, ఒకరి విజయానికి మరొకరు ఆనందిచడం.

కాల క్రమేణా వారి స్నేహాన్ని ప్రేమగా మార్చాయి.

ఆ ప్రేమలో తొందర లేదు. ఆకర్షణ కంటే అవగాహన , ఆత్మీయతలు గాఢంగా ఉన్నాయి.

ఒక రోజు ఆకాశ్ తన మనసులోని మాట రమ్యతో చెప్పాడు .

“మన జీవిత ప్రయాణంలో… ఒకరికొకరం తోడుగా ఉంటే బావుంటుందని పిస్తుంది రమ్య అన్నాడు.

ఆమె కూడా అదే భావనతో చిరునవ్వు నవ్వింది. అయితే, తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఒక్క అడుగు కూడా వేయాలని ఇద్దరూ అనుకోలేదు.

———————

పెద్దల ఆశీస్సులతో వారి వివాహం జరిగింది.

త్వరలో ఇద్దరికి మంచి ఉద్యోగాలు వచ్చాయి.

పిల్లలు పుట్టారు.

రమ్య తన సంగీత సాధనను ఎన్నడూ ఆపలేదు. రోజురోజుకి తన ప్రతిభను మెరుగు పరుచుకుంటూ, సంగీత ప్రయాణంలో ముందుకు సాగు తుంది.

రమ్య ఇప్పుడు గొప్ప గాయనిగా పేరు తెచ్చుకుంది. మంచి సంపాదన, బాగా గుర్తింపు… ఎక్కడికి వెళ్లినా అభిమానుల ఆదరణ.

కానీ –ఆకాశ్‌ కు మాత్రం

ఏదో తెలియని చిన్న

లోటు కనిపించేది.

అదేమిటో తెలియదు.

ఎప్పటి లాగే రమ్య

ఆ రోజు కూడా అద్భుతంగా పాట పాడింది.

సభ అంతా కరతాళ ధ్వనులు, ప్రశంసలు, సన్మానం, మెమెంటో… అన్నీ అందుకుని రమ్య ఆనందంగా ఆకాశ్ వైపు నడిచివస్తోంది.

అంతలో ఓ అభిమాని  వచ్చి…

“మేడమ్… చాలా అద్భుతంగా పాడారు. నమస్కారం సార్ .

వీరు మీ వారు కదా?”

అని అడిగాడు.

ఆకాశ్ చిరునవ్వుతో…

“అవును… రమ్య

నా వైఫ్”అన్నాడు.

ఆ మాట వినగానే రమ్యకు ఆశ్చర్యం కలిగింది.

ఆమె మెల్లగా…

రెండు ఒకటే కదా…”అంది.

కానీ ఆ మాట ఆకాశ్ చెవులకు చేరలేదు.

ఇద్దరూ ముందుకు నడిచారు.

“నీకు అభిమానులు

చాలా మందే…”

అన్నాడు ఆకాశ్.

ఆ మాటలో అభినందన కంటే, వ్యంగ్య మే ఎక్కువగా ఉంది.

“ఏమైంది?” అని అడిగింది రమ్య.

“ఏమీ లేదు…”

అన్నాడు ఆకాశ్.

కానీ ఆ “ఏమీ లేదు” అనే రెండు మాటల్లో ఎన్నో చెప్పని భావాలు దాగి ఉన్నాయి.

రోజులు గడుస్తున్నకొద్దీ రమ్యను ఎవరు ప్రశంసించినా, ఆకాశ్ ముఖంలోని చిరునవ్వు కొద్దికొద్దిగా మాయ మవుతోంది.

ఆమె విజయం అతనికి ఆనందంగా కాకుండా… తనను తాను పోల్చుకునే అద్దంలా కనిపించడం  మొదలైంది.

ఒకప్పుడు ఆమె కోసం చప్పట్లు కొట్టిన అదే చేతులు ఇప్పుడు నిశ్శబ్దంగా ముడుచు కున్నాయి.

రమ్యకు  అర్థమవుతుంది.

పిల్లల ముందు మాత్రం ఇద్దరూ ఎప్పటిలాగే ఉంటున్నారు .

కానీ వారి మధ్య మాటలకు అందని దూరం మాత్రం నెమ్మదిగా పెరుగు తుందని తల్లి గమనించింది.

ఆకాశ్ !

పిలిచింది తల్లి.

ఏమిటమ్మా–

“అదోలా ఉంటున్నావ్ ఏంది” అంది.

ఆకాశ్  సమాధానం చెప్ప లేదు.

ఆకాశ్ నీకు ఒక మాట చెప్పనా —–

“ప్రేమలో గెలుపు-ఓటములు ఉండవు. ఒకరి విజయం మరొకరి గర్వంగా మారినప్పుడే దాంపత్యం పరిపూర్ణ మవుతుంది. పోలికలు మొదలైన చోట ప్రేమ నిలబడదు.

“ఈ కాలంలో ఆడపిల్లలు ప్రేమ కన్నా గౌరవాన్ని కోరు కుంటున్నారు” అది తెలుసుకొని నడుచు కున్నప్పుడే బంధాలు బలపడతాయి.

“ఈరోజు మహిళా దినోత్సవంరమ్యకు రవీంద్ర భారతిలో సన్మానం ఉంది.తెలుసు కదా! నేను పిల్లలు కూడా వస్తున్నాం” అంది.

———————–

“అంతర్జాతీయ మహిళా దినోత్సవం” సందర్భంగా వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన మహిళలను ఓ సాహితీ సంస్థ ఘనంగా సత్కరిస్తోంది.

ఆ కార్యక్రమానికి రమ్యతో పాటు ఆకాశ్, అతని తల్లి కూడా వచ్చారు. ఎటు చూసినా కవులు, గాయకులు సందడిగా ఉంది ప్రాంగణమంతా .

రమ్య పేరు పిలవ గానే హర్షధ్వానాల మధ్య ఆమె వేదిక పైకి వెళ్లింది.

వ్యాఖ్యాత చిరునవ్వుతో,

“రమ్యగారి విజయ ప్రయాణంలో వెన్నంటే నిలిచిన ఆకాశ్ గారు కూడా వేదికపైకి రావాలి అన్నారు.

తల్లి ఆనందంగా —

“వెళ్లు ఆకాశ్…ఇక్కడి నుంచి చూస్తే తను చాలా ఎత్తులో ఉన్నట్లు కనిపిస్తుంది.  వెళ్లి పక్కన నిలబడితే

నీకు  తెలుస్తుంది.

ఆ మాటలు ఆకాశ్ హృదయంలో ఎన్నో భావాలను మేల్కొన్నాయి. అతను నిశ్శబ్దంగా వెళ్లి రమ్య పక్కన నిలబడ్డాడు.

ఇద్దరికి కలిపి సన్మానించారు.

తర్వాత ఒక ప్రముఖ పత్రికా ప్రతినిధి రమ్యను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు.

“మీరు కుటుంబాన్ని చూసుకుంటూనే ఉద్యోగం, సంగీతం… ఈ రెండింటినీ ఎలా సమతుల్యం చేస్తున్నారు?”

రమ్య చిరునవ్వుతో,

“మా వారు… మా అత్తయ్య ఇచ్చిన సహకారమే నాకు పెద్ద బలం,” అంది.

“ఆకాశ్ గారి మద్దతు మీకు బాగా ఉందన్నమాట-

“అవునండి. తన ప్రోత్సాహం లేకపోతే, నేను ఈ స్థాయికి చేరుకోవడం కష్టం అంది రమ్య.

ఆ మాటలు విన్న ఆకాశ్ మనసు కాస్త కదిలింది. రమ్య నన్ను ఇంత గొప్పగా చూస్తుందా అనుకున్నాడు.

వెంటనే విలేకరి ఆకాశ్ వైపు తిరిగాడు.

“ఎన్నో బాధ్యతలు నిర్వర్తిస్తున్న నేటి మహిళలకు భర్త నుంచి ఎలాంటి తోడ్పాటు అవసరమని మీరు భావిస్తున్నారు?” అన్నాడు.

ఆకాశ్ కాసేపు ఆలోచించి

“భార్య అంటే ఇంటి బాధ్యతలు చూసుకునే వ్యక్తి మాత్రమే కాదు… జీవిత ప్రయాణంలో సమాన భాగస్వామి.”అన్నాడు.

సభలో చప్పట్లు మార్మోగాయి.

మరో ప్రశ్న ఎదురైంది.

“ఆధునిక కాలంలో ఆదర్శ భర్త ఎలా ఉండాలి?”

ఆకాశ్ చిరునవ్వుతో

“భార్య ఆకాంక్షలను మాత్రమే కాదు… ఆమె మనసును కూడా అర్థం చేసుకున్న వాడే నిజమైన తోడు.

ఆ మాటలకు సభ అంతా మరోసారి చప్పట్లతో మారు మోగిపోయింది.

చివరగా ఒక విలేకరి అడిగాడు.

“చాలామంది భార్య విజయం– అంటే భర్త ఓటమిగా ఎందుకు భావిస్తారు?” రమ్య గారు అన్నాడు.

ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పవచ్చాఅన్నాడు ఆకాశ్.

ఆ–చెప్పండి

“అది పెద్ద అపోహ. భార్య విజయం అంటే అది కుటుంబ విజయం ఒకరి ఎదుగుదల ఇద్దరినీ మరింత ఉన్నతంగా నిల బెడుతుంది.”

“అయితే కుటుంబాల్లో మనస్పర్ధలకు ప్రధాన కారణం ఏమిటని మీరు అను కుంటు న్నారు?” అని చివరి ప్రశ్న వచ్చింది.

ఆకాశ్ క్షణం నిశ్శబ్దంగా ఉండి ఇలా అన్నాడు.

“ప్రేమ తగ్గడం వల్ల కుటుంబాలు దెబ్బ తినవు… గౌరవం తగ్గడం వల్లే కుటుంబాల్లో అలజడి

మొదలవుతుంది.

ఆ మాట సభలో ఉన్న ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసింది.

“ఆకాశ్!నాకు చాలా ఆనందంగా ఉందిఇప్పుడు. ప్రేమలో ఇద్దరూ గెలిచారు.

ఒక హృదయంలోని బాధ, మరొక మనసులోని అహం ఓడి పోయాయి”.

అంది ఆకాశ్ తల్లి.

అందరూ ఇంటి దారి పట్టారు. ఈసారి ఆకాశ్, రమ్య కంటే ముందు గబగబా నడచి వెళ్ళలేదు . ఆమెకు వచ్చిన పూల దండలు తన చేతుల్లోకి తీసుకొని ఆమెతో సమంగా అడుగులు వేస్తూ నిశ్శబ్దంగా నడిచాడు. ఆ మౌనం మాత్రం ఎన్నో మాటలు మాట్లాడుతోంది. కొన్నిసార్లు క్షమాపణలు పెదవులపై పలకవు; చేతల్లో  కనిపిస్తాయి. ప్రేమకు మాటలే అవసరం లేదు. మనసు నిశ్శబ్దంగా తోడుగా నడుస్తుంది.

“చప్పట్లు క్షణికమైనవే…

కానీ అర్థం చేసుకున్న మనసుకు  జీవితాంతం మార్మోగే నిజమైన అభినందనలు

Written by Dasoju Padmavathi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

చెదిరిన గూడు

రోమశా – స్త్రీ స్వీయవ్యక్తీకరణకు మరో ప్రాచీన స్వరం